top of page

త్రిశూల


'Thrisula' written by BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

"పలుకు ఉండదు. ఉలుకు ఉండదు. ఛ ఛ." అని, "చెప్పేది నీకే పిల్లా! పెళ్ళై సంవత్సరం తిరగలే, ప్రగతి నెల తప్పింది. అదీ ముచ్చటంటే! నీవు.. నీకు.. ఛ ఛ" అంది సరళమ్మ రుసరుసగా. త్రిశూల లోలోనే గింజుకుంటుంది ఎప్పటిలానే. సరళమ్మ కోడలు త్రిశూల, కూతురు ప్రగతి.

"నా నోరే వినిపిస్తుంది. నా ఘోష తెలుసుకోరు. ఛ. పెళ్లై రెండేళ్లు దాటింది. నా కొడుక్కి బిడ్డ లేదు. అంతా నీ మూలంగానే. ఛ" అంటూ తెగ విసుక్కుంటుంది సరళమ్మ.

త్రిశూలకి ఇది మామూలే. అత్త దెప్పిపొడుపులు తనకి కొత్త కాదు.

రేపు ఉదయం తన తల్లిదండ్రులు తన వద్దకి వస్తున్నారని త్రిశూల చెప్పిందో లేదో మరో వాకబు లేకుండా, "ఆఁ. ఎందుకు రారు? రానీ! ఈ మారు తేల్చేసి తీరుతాను" అంటూ తన సొదని చేపట్టేసింది సరళమ్మ. త్రిశూల కాస్తా బిత్తరపోయింది. తర్వాత అత్త చోద్యాన్ని చూస్తుంది, వింటుంది. అప్పుడే అక్కడకి కృష్ణారావు వచ్చాడు. కృష్ణారావు సరళమ్మ కొడుకు, త్రిశూల భర్త.

"వచ్చావా నాయనా." అంది సరళమ్మ కొడుకుని చూస్తూనే.

"మళ్లీ ఏమైందే అమ్మా?" అడిగాడు కృష్ణారావు తల్లి తీరుని గమనించి.

"మీ అత్తామామలు రేపు దిగబడతారట!" చెప్పింది సరళమ్మ వ్యంగ్యంగా.

"ఎందుకేమిటి?" అడిగాడు కృష్ణారావు భార్యని చిత్రంగా.

"పిచ్చి నాయానా! కూతురుకి ఏవో తాయత్తులు తెచ్చి కట్టడానికో లేదా దానికి ఏవో పూజల ప్రసాదం తినిపించడానికో" అంది సరళమ్మ వెటకారంగా, కొడుకుని తన వైపుకు తిప్పుకొని.

"ఇంకా ఎన్నని" అన్నాడు కృష్ణారావు విస్మయంగా.

"మరే. తన బిడ్డ సంతానంకై వాళ్లు ఇంకా ఎన్నెన్ని పిచ్చి పనులు చేస్తుంటారో. ఛ." అని, "మంత్రాలకి చింతకాయలు రాలేదెక్కడ? చెప్తే వినరాయే. మనని పట్టించుకోరాయే! ఛ.." అంది సరళమ్మ విసుగ్గా.

"ఆపండి. మీ చాంతాడు చాదస్తాల్ని." అన్నాడు కృష్ణారావు విసురుగా భార్యని చూస్తూ.

త్రిశూల ఏదో చెప్పబోయింది.

"చాల్లే, ఊరుకో! ప్రతి దానికి సమర్థింపు" అనేశాడు కృష్ణారావు గబుక్కున భార్యకి అడ్డై.

"మరే! ఈవిడలో లోపాన్ని మరుగుపర్చడానికి ఇంకా వీళ్లు ఎన్నెన్ని నాటకాలాడతారో. ఛ!" అంది సరళమ్మ ఆ వెంటనే.

"నాలో లోపం ఏమిటి?" అని, "నాలో ఏ లోపం లేదు" అని అంది త్రిశూల గబుక్కున.

"అవునా! ఐతే ఏదీ సంతానం?" అంది సరళమ్మ కోపంగా.

"దానికి నాది తప్పా?" అంది త్రిశూల విస్మయంగా.

"కాదా పిల్లా." అని, "మరి నా కొడుక్కు పిల్లలెందుకు పుట్టడం లేదు?" అంది సరళమ్మ గబగబా.

"అది ఆయనలో లోపం కాకూడదా" అనేసింది త్రిశూల.

"ఏటే? నోరు విప్పుతున్నావు! నన్నే తప్పు పడుతున్నావా.." అడిగాడు కృష్ణారావు రోషంగా.

"చూశావా నాయనా! ఇది గొంతు ఎలా విప్పుతుందో." అంది సరళమ్మ కొడుకుని చూస్తూ.

"ఆఁ ఆఁ. విప్పుతుంది, విప్పుతుంది. దాన్ని పిసికేస్తా. ఆఁ" అన్నాడు కృష్ణారావు చటుక్కున.

"అరె, నేనేమన్నానని..." అనంటూన్న త్రిశూలకి అడ్డై - "అదే అదే. తగ్గు తగ్గు." అన్నాడు కృష్ణారావు.

"నా మాట ఆలకించరేం." అడిగింది త్రిశూల జోరుగా.

"ఏం పిల్లా, నోరెత్తుతున్నావు/" అంది సరళమ్మ విసురుగా.

"మీరే యాగీకి దిగుతున్నారు. నేను చెప్పేది వినరేమిటి?" అంది త్రిశూల అస్తవ్యస్తమై.

"ఆఁ. ఏం చెప్పుతావ్?" అడిగాడు కృష్ణారావు చురుగ్గా.

"మా వాళ్ల యత్నాలు మీకు పిచ్చిగా తోచవచ్చు. వాటిని వదలండి" అని, "మనకి సంతానం కలగకపోడానికి కారణం నేనే అంటున్నారు. అదెలా? నేను డాక్టర్ చే పరీక్షలు చేయించుకున్నాను. నాలో ఏ లోపం లేదన్నారు. మరి నేనెలా కారణమవుతాను? మీలో లోపం ఉందో లేదో తేల్చుకోరేం?" అనేసింది త్రిశూల.

"ఏం పిల్లా, అలా నీలుగుతున్నావు? నా కొడుకునే నిలతీస్తున్నావు? మా పెద్ద కొడుక్కు పిల్లలు ఉన్నారు. నా కూతురు నెల తప్పింది. వీడే.. వీడికే! పెళ్ళై ఇన్నాళ్ళైనా సంతానం లేదు. అంటే లోపం మా వైపు అస్సలు లేదు, ఉండదు. ఆఁ. లోపం నీలోనే. అంతే! ఆఁ." అంది సరళమ్మ జరజరా.

"అదెలా అండీ, డాక్టర్ నాలో ఏ లోపం లేదంటే?" అంది త్రిశూల.

"ఎవరు.. ఆ డాక్టర్ ఎవరు? మీ ఊళ్లోది. మీరే అలా చెప్పించారేమో!" అనేసింది సరళమ్మ.

"అంతే అంతే.." అంటూ తల్లికి వంతు పాడేడు కృష్ణారావు.

"భలే. సరే. ఇక ఎందుకు.. మీరు చెప్పిన డాక్టర్ వద్దకే వెళ్దాం. పదండి. మీరే దగ్గరుండి నాకు పరీక్షలు చేయించండి. అలాగే మీ అబ్బాయికీ చేయించండి" అని అనేసింది త్రిశూల చకచకా.

"ఏం.. మా అమ్మనే ఎదిరిస్తున్నావు?" అన్నాడు భార్యతో కృష్ణారావు గట్టిగానే.

"ఇది ఎదిరించడం కాదండీ. అడుగుతున్నాను లేదా అర్థిస్తున్నాను" అని అనేసింది త్రిశూల.

తల్లీ కొడుకులు ఒకే మారు మొహాలు చూసుకున్నారు.

అప్పుడే, "ఇంత వరకు వచ్చిన తర్వాత నేను మాట్లాడకపోవడం సరికాదనుకుంటున్నాను. అంతే!" అని కూడా అంది త్రిశూల.

అంతలోనే బయట నుండి వచ్చిన ముకుందరావుని పక్కకి తీసుకుపోయి జరిగిందంతా చెప్పేరు సరళమ్మ, కృష్ణారావులు. ముకుందరావు భార్య సరళమ్మ, కొడుకు కృష్ణారావు. లంచ్ తర్వాత ఆ నలుగురు హాస్పిటల్ కి వెళ్లారు.

***

ఆ సాయంకాలం - తండ్రికి మెడికల్ రిపోర్టులు ఇచ్చేసి ఇంటికి తర్వాత వస్తానంటూ కృష్ణారావు హాస్పిటల్ నుండి తను పని చేస్తున్న షాపు వైపు వెళ్లి పోయాడు. ముకుందరావు తీసుకు వచ్చిన మెడికల్ రిపోర్టులని అడిగి తీసుకొని, వాటిని చూసిన వెంటనే, "ఇప్పుడు అనండి, ఏమంటారో." అనంది త్రిశూల తన అత్తని.

"ఏమయ్యిందండీ. డాక్టర్ ఏం చెప్పారు" అడిగింది సరళమ్మ తల వాల్చేసున్న భర్తని.

ముకుందరావు తలెత్తకనే సరళమ్మతో, "ఇద్దరిలోనూ లోపం లేదన్నారు." అని చెప్పాడు.

సరళమ్మ గతుక్కుమంది.

"ఇన్నాళ్లూ పడిన దాన్ని, ఇప్పుడు నోరు ఎత్తడానికి కారణం, తప్పంతా నాదే అని మీరు నిలతీయడమే." అని, "మా వాళ్ల యత్నాలు సంయమనం కొరకే తప్ప, దేన్నీ మరుగుపర్చడానికి కాదు. దేన్నీ మభ్యపెట్టడానికి కాదు. నేను కూడా ఎప్పటికీ, దేనికీ బరి తెగించను. ఎదిరించను. అట్టి నైజం నాది కాదు. నమ్మండత్తయ్యా" అని చెప్పింది త్రిశూల.

సరళమ్మ తల దించుకుంది.

ముకుందరావు కాస్త తలెత్తి, "డాక్టర్లు చెప్పారు. శారీరక తత్వం బట్టి సంతానం ఆలస్యమవుతుంది తప్ప, పిల్లలిద్దరికి సంతానం తప్పక కలుగుతుందట!" అని చెప్పాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
209 views0 comments

Comments


bottom of page