top of page

టైం టేబుల్


'Time Table' written by Gorthi VaniSrinivas

రచన : గొర్తి వాణిశ్రీనివాస్

తెల్లవారి ఆరున్నరకి చాలా ఉత్సాహంగా నిద్ర లేచాను.

వంట గదిలోకి వెళ్లి నిలబడ్డాను.

వంట గిన్నెలు, కుక్కర్

'పొద్దున్నే మన ప్రాణం తీయటానికి వచ్చేసిందిరోయ్'

అన్నట్టుగా అనిపించి నవ్వొచ్చింది నాకు.


మీకేకాదర్రా నాకూ ప్రాణం విసిగిపోయింది. మామూలు పరిస్థితుల్లో అయితే నాలుగున్నరకే నిద్రలేచి ఒక్కక్కళ్ళకీ ఒక్కో ఐటెం చేయాల్సొచ్చేది. పిల్లలు కొంత తిని, కొంత చేత ధరించి, అంటే బాక్స్ లో పెట్టుకుని వెళ్లేవారు. నేను కొంత నావాహనానికి ఒసంగి అంటే పనమ్మాయికి పెట్టి ఇల్లంతా సర్దుకుని, తిని కాస్త నడుం వాల్చేసరికి అందరూ వచ్చేసేవారు.

మళ్లీ వండటం పెట్టటం మొదలు.


'ఏ దేవుడు కరుణించాడో గానీ ఈ కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల పన్నెండేళ్ళ చెర కి ఈనాడు విముక్తి కలిగింది. నచ్చినప్పుడు వంట వండొచ్చు. పనమ్మాయి లేదు కాబట్టి ఒబ్బిడిగా వండుకుని ఎప్పటివప్పుడు కడిగేసుకుంటాను. ఇక పెద్ద పనేముంటుంది' అనుకుంటూ జుట్టు ముడేసుకుని నచ్చిన పాట హమ్ చేసుకుంటూ పెరట్లోకెళ్లాను.


మొక్కలు వాడిపోయి తలలు వేలాడేశాయి. పనమ్మాయి ఉంటే రోజూ నీళ్లు పోసేది. దాన్ని మాన్పించాక నేనే కాస్త బద్ధకించాను. నాలుగు చెంబుల నీళ్లు పోస్తే చాలు మొక్కలు కిలకిల్లాడిపోతూ నవ్వవూ! అని బాత్ రూమ్ లోంచి నాలుగు సార్లు తిరిగి నాలుగు మగ్గుల నీళ్లు పోశాను.

నేలమీద నేను పోసిన నీళ్ళకి కాలు జర్రున జారింది.

హమ్మా..కాలి చిటికిన వేలు మెలిపడింది.

చిటికినవేలేగా చిటికెలో మానిపోదూ..అనుకున్నాను.


"సుమా డియర్! ఇందాక నువ్విచ్చిన టీ చల్లారిపోయిందోయ్. వేడిగా మరోకప్పు ఇవ్వవూ."అన్నారు శ్రీవారు (లెక్చరర్) లాప్టాప్ ముందు కూర్చుని


పాపం మామూలుగా అయితే ఈ పాటికి కాలేజీకి ఆపసోపాలు పడుతూ ట్రాఫిక్ లో పడి వెళ్లేవారు.

ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని ఇన్నాళ్లకు హ్యాపీగా ఇంట్లోవుండే సమయం చిక్కింది.

అనుకుంటూ చితికిన చిటికెనవేలుకి తడిబట్ట చుట్టుకుని వంటగదిలోకి వెళ్ళాను.


గిన్నెల మీద ఈగలు గీజురుమంటూ సంగీతాలు పాడుతున్నాయి.

‘ఆయనకి టీ ఇచ్చేసి పది నిమిషాల్లో ఇవన్నీ తోమేసి పక్కన పడెయ్యనూ..’

కార్యరంగంలోకి దిగాను. గంట ఎట్లా గడిచిపోయిందో తెలీదు.


‘అమ్మా టిఫిన్ త్వరగా పెట్టు. పదింటికి ఆన్లైన్ పరీక్ష ఉంది’ అన్నాడు సుపుత్రుడు.


“ఎప్పుడూ కాలేజీకి బాక్స్ లో చప్పగా చల్లారిపోయి తినడమేగా. పోనీలే రోజంతా క్లాసులు విని విని అలిసిపోతున్నాడు.వేడి వేడిగా చేసి పెడదాం. నాకు హెల్ప్ చెయ్యవే” అని నా కూతురు ధరణితో అన్నాను.


“వాడికొక్కడికేనా క్లాసులు. ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ పరీక్ష ఇవాళ. లాప్టాప్ సిద్ధం చేసుకుని పదిన్నరకి రడీగా ఉండాలి. నువ్వే కాస్త నాకు హెల్ప్ చెయ్యాలమ్మా.. పరీక్షకు కావలసిన పెన్నూ స్కేల్ ,లాప్టాప్ అన్నీ సిద్ధం చేసి పెట్టావా. స్నానం చేసి చిటికెలో వచ్చేస్తా" అంది నా కూతురు

నేనూ ఇంజనీరింగ్ విద్యార్థినిలా ఫీలవుతూ అన్నీ సమకూర్చిపెట్టాను దానికి.


"వంట ఏం చేస్తున్నావోయ్? పొద్దున నువ్విచ్చిన ఓట్స్ అరిగిపోయాయి. మంచి ఆకలేస్తోంది .

కూర్చుని పని చేయటమే కాబట్టి నూనె తక్కువగా ఉండే పదార్ధాలు చెయ్యి” అన్నారు ఆయన.


పొట్ల, బీర, సొరకాయకి నూనె పెద్దగా పొయ్యక్కర్లేదని మూడిటితో పొట్ల పెరుగు పచ్చడి, బీర పచ్చిమిర్చి వేసి పచ్చడి, సొరకాయ పులుసు చేసేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయింది


“అమ్మా! తినడానికి ఏం చేశావ్? నాకు రెండుకి మళ్లీ క్లాసులు మొదలవుతాయి. అన్నం పెట్టు” అన్నాడు కొడుకు.

నేను చేసిన మెనూ చెప్పాను.

"చిన్నప్పటినుంచీ ఈ చప్పటి కూరలు తిననని నీకు తెలుసుగా. నాకు పొటాటో ఫ్రై చెయ్యి చాలు." అన్నాడు నా కొడుకు(మా అబ్బాయి)

ఉస్సురంటూ మళ్లీ రెండు దుంపలు తరిగి వేయించాను

ముగ్గురూ ఫోన్లలో ,లాప్టాప్ లో బిజీ గా వున్నారు.

నిజంగా క్లాసుల్లో ఉన్నారా కాలక్షేపానికి ఫోన్లలో చూస్తున్నారో అర్ధం కావట్లేదు నాకు. కుంటుకుంటూ వంటపూర్తిచేసి అన్నిటినీ డైనింగ్ టెబుల్ మీదకి చేర్చి వాళ్ళని భోజనానికి రమ్మని పిలిచి పిలిచి అలిసిపోయాను. ఒక క్రమానికి వచ్చి కూర్చున్నారు.

టైం రెండయ్యింది.


"రాత్రికి టిఫిన్ ఏం చేస్తావోయ్. మినప్పప్పు నానబోసి ఇడ్లీ వెయ్యి. వేరుశెనగ చట్నీ చెయ్యి." తినేసి అనేసి లేచి వెళ్లిపోయారు ఆయన.


డైనింగ్ టెబుల్ మీద గిన్నెలన్నీ నన్ను చూసి విరగబడి నవ్వుతున్నట్టు అనిపించింది

ఒక్కొక్కటీ వంటింట్లోకి చేరేసుకుని , తోముకుని ఇల్లు సర్దుకునేసరికి నాలుగయ్యింది.


“అమ్మా! మిర్చి బజ్జీ చేసిపెట్టవా?” అని కొడుకు

“అమ్మా! పొట్ట ఖాళీ” అని కూతురు

"ఏవోయ్ టీ స్నాక్స్" అని భర్త సారు

రోజూ ఇదే వరస! ఎప్పుడు కాలేజీలు తెరుస్తారురా నాయనా.. నాకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? ‘ఇదేనా నేను కోరుకున్న సంతోషం?’ అనిపించింది.


తెల్లవారి లేవటానికి నా మనసు, శరీరం మూలుగుతూ ఎదురు తిరుగుతుంటే ‘వాళ్ళెవరు? నా వాళ్లేగా..నా వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు’ అని నాకు నేనే చెప్పుకుని సమాధానపడుతూ బండిని లాగాను.


ఈ ఆన్లైన్ చదువులు కాదుగానీ ఇల్లంతా గందరగోళంగా తయారయ్యింది.

దీనికి తోడు అత్తగారు వచ్చారు


"అమ్మాయ్.అసలు ఇది ఇల్లేనంటావా? కాలేజీ ఇదే, ఇల్లూ ఇదే. ఈ టూ ఇన్ వన్

వ్యవహారంతో తల వాచిపోతోంది. ఈ కరోనా వచ్చి అందరూ ఇంట్లో ఉండేలా మంచి చేసిందనుకున్నాం మొదట్లో. కానీ ఇంట్లో నీ తిప్పలు చూస్తుంటే కరోనా కాటేసింది ఇల్లాళ్లనే అనిపిస్తోంది. నా సీరియల్స్ కి మాత్రం అంతరాయం కలిగిస్తూ గట్టిగా అరవద్దని చెప్పు నీ మొగుడ్ని" అన్నారావిడ.


‘భగవంతుడా! ఆన్లైన్ చదువుల వల్ల హాయిగా ఉంటుందని,అందరూ ఇంటిపట్టునే ఉంటే బాగుంటుందని అనుకున్నాను కానీ మూడు కాలేజీలు నట్టింట్లోకి వచ్చేశాక ఇల్లు ఇల్లులా ఉంటుందా? ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా?’

నా చిటికెన వేలి దెబ్బ తగ్గింది కానీ కుంటటం వల్ల నాతుంటె పట్టేసింది.

ఇక ఇలా లాభం లేదనుకుని ఒక చార్ట్ తయారు చేసి వంటింటి తలుపుకు అంటించాను.

ఏ వారం ఎవరు ఏ పని చెయ్యాలో టైం టేబుల్ వేశాను.

కూరలు తరిగిపెట్టటం, గిన్నెలు తోమడం, బట్టలు వాషింగ్ మెషీన్ లో వేయడం, తీసి ఆరేయడం, ఎండాక మడతలు పెట్టి సర్దటం కిచెన్ క్లీన్ చేయడం ,చెత్త పారేయడం

ఇలాంటివి. వంట బాధ్యత మాత్రం నాదే.


రోజూ వాళ్ళ టైం టేబుల్లో ఉన్న పనులు చూసుకుని చేసేసాకే వాళ్ళ సొంత పనుల్లోకి వెళతామని వాళ్ళందరిచేతా సంతకాలు చేయించాను. ఇల్లాలా మాజాకానా!.


"అమ్మో ! రోజూ నువ్వు ఒక్కదానివే ఇన్ని పనులు చేస్తున్నావా?" అని నోరెళ్ళబెట్టారు వాళ్ళు.

ఇంటి సభ్యులకు ఇల్లాలి కష్టాన్ని తెలియకుండా చేయడం కూడా ఓ అసమర్థతే

అని తెలుసుకున్నాక ఇక నేనెందుకూరుకుంటాను..

పనుల పట్టిక తప్పితే పనిష్మెంట్ తప్పదు మరి! ఇప్పుడు నేను మంచి ఇల్లాలిని కదా!!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

విశాఖపట్నం.

భర్త : గొర్తి శ్రీనివాస్ గారు

ఇద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు

గత కొంతకాలంగా సామాజిక సమస్యలను అధ్యయనం చేస్తూ

కథలు , కవితలు రాస్తున్నాను. సమాజంలోకి, వ్యక్తులలోకి, మనసులలోకి

తొంగి చూస్తాయి నా రచనలు.

హాస్య రస ప్రధాన రచనా ప్రక్రియ మీద మక్కువ ఎక్కువ.

కథలు, కవితల పోటీలలో బహుమతులతో పాటు వివిధ పత్రికలలో ప్రచురణ.

సామాజిక ప్రయోజనం కలిగిన కొత్త ఆలోచనకు బీజం వేయగలిగే రచన చేసినపుడు కలిగే తృప్తి నా రచనలకు మూలధనం.


79 views0 comments

Comentários


bottom of page