top of page
Pratapa Venkata Subbarayudu

ట్రెండింగ్ వీడియో

Trending Video Written By Pratapa Venkata Subbarayudu

రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు


తెల్లవారుతూనే మోగిన అలారం మత్తిల్లిన శరీరాన్ని, మరో లోకంలో ఆహ్లాద ప్రయాణం చేస్తున్న మనసును ఒకేసారి ఈ లోకంలోకి పట్టుకొచ్చాయి. 'నిత్య జీవితంలో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడే మనిషికి నిద్ర అయాచిత వరం. నిద్రలో అన్నీ మర్చిపోయి కాసేపయినా సేదతీరుతాడు. లేకుంటే..?' కాస్త సందు దొరికతే చాలు ప్రవహించాలనుకునే ఆలోచనలను కట్టిపెట్టి, అరవై ఐదేళ్ళ శరీరంలో శక్తిని కూడదీసుకుని లేచి చీపురు తీసుకుని బయట ఊడ్చి, ముగ్గేయడానికి ఉపక్రమించింది శారద. తలుపు తీయంగానే ధనుర్మాసపు చలి పులి ఒక్కసారిగా దాడిచేసింది. చీపురు అక్కడ పడేసి వెంటనే తలుపేసొచ్చి, నాలుగేళ్ళ క్రితం కోడలు కొనిచ్చిన స్వెట్టర్ వేసుకొని, చెవులను, తలను కవర్ చేసేలా మందంగా ఉన్న గుడ్డను చుట్టుకుని, తలుపుతీసి పడేసున్న చీపురు తీసుకుని వాకిలిని శుభ్రంగా ఊడ్చి ముగ్గుతో ముస్తాబుచేసింది. చిన్నప్పుడు తను ముగ్గేస్తానంటే, 'చిన్నపిల్లవు నీకు రాదమ్మా' అని అమ్మ వారిస్తే, ముగ్గు చిప్ప లాక్కుని చుక్కలు పెట్టి, తనకు తోచిన గీతలు గీయడం గుర్తొచ్చి నిట్టూర్చింది.

మోటరేసి ట్యూబ్ తో కుండీల్లోని పూల మొక్కలకు నీళ్ళు పడుతుంటే పేపరతను, పాలతను ఒకేసారొచ్చి రెండూ చేతిలో పెట్టారు. మోటరాపి లోపలికొచ్చి కవరు చింపి పాలు గిన్నెలో పోసి గ్యాస్ స్టవ్వు వెలిగించి సిమ్ లో ఉంచి పాలగిన్నె దానిమీద పెట్టి, అప్పుడు కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కుని వచ్చింది. కొద్ది సేపటికి కాగిన పాలతో రెండు గ్లాసుల్లో కాఫీ, మరో గ్లాసులో బూస్ట్ కలిపి, ఆ మూడింటినీ ట్రేలో పెట్టుకుని కొడుకు, కోడలు, మనవడు పడుకునే గది తలుపు సన్నగా రెండుసార్లు కొట్టి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళను నిద్రలేపింది.

'హాప్పీ బర్త్ డే అత్తయ్యా' అంటూ నవ్వుతూ విష్ చేసింది కోడలు సుమనస్విని. 'అవునా, ఇవాళ తన పుట్టిన్రోజా?' మనసులో అనుకుంటూండగానే లేచిన కొడుకు అనిరుధ్ 'హాప్పీ బర్త్ డే అమ్మా' అన్నాడు. వాళ్ళిద్దరికీ థాంక్స్ చెప్పి, కాఫీగ్లాసులు అందించి, మనవడిని లేపి బూస్ట్ తాగించి స్కూలుకు ప్రిపేర్ చేయడానికి తీసుకెళ్ళబోతుంటే, 'ఇవాళ ఇహ నువ్వేం పని చెయ్యొద్దు అత్తయ్యా. వాణ్ని ప్రిపేర్ చేసి స్కూలుకు పంపించు అంతే. మిగతా పనులు నేను చేస్తాను. మనందరం స్నానాలు పూర్తి చేసేలోపు నేను టిఫిన్స్ బయట నుంచి ఆర్డర్ పెడతాను. టిఫిన్లు తినేశాక మనందరం గుడికెళదాం. తర్వాత మేము నిన్ను ఇంట్లో దింపి ఆఫీసుకెళతాం. మేమిద్దరం నాలుగ్గంటలకు ఇంటికొస్తాం. వచ్చాక నిన్నో చోటికి తీసుకెళతాం. అది సస్పెన్స్. నీకు సర్ప్రయిజ్. అప్పటిదాక హాయిగా నీకు తోచింది చేసుకుని, రెస్ట్ తీసుకో' అంది. శారద అలాగే అన్నట్టుగా తలూపింది.

***

తమ కాలనీకి కొద్ది దూరంలో గుట్ట మీద పాలరాతితో కట్టిన శ్రీ వేంకటేశ్వరుడి ఆలయానికి వచ్చారు. ఒకామెని గుండెల్లో పొదువుకుని, మరోకామెను పక్కన పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్వామి విగ్రహాన్ని కళ్ళారా చూస్తుండగా దగ్గరకొచ్చిన పూజారికి కొబ్బరికాయ, పూలు ఉన్న ప్లాస్టిక్ కవరును అందించి 'ఇవాళ మా అత్త పుట్టిన్రోజు, దేవుడు దీవించేలా గట్టిగా పూజచేయండి పంతులుగారూ' అంది. పూజ పూర్తయ్యాక అత్తగారిచేత పూజారికి రెండొందలు ఇప్పించింది. ఇదంతా ఎప్పటికప్పుడు అనిరుధ్ సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. శారదని ఇంట్లో దింపి సాయంత్రం నాలుగు గంటలకు రెడీ అయి సిద్ధంగా ఉండమని చెప్పి, కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళిపోయారు. అదేవిటో సృష్టిలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. భూమిలో కలిసిపోతుందనుకున్న మోడు చిగురేస్తుంది. నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న జీవితాల్లో పున్నమి వెన్నెలలు వెల్లువెత్తుతాయి. నిన్నటిదాకా యాంత్రికమైన తన జీవితంలో ఏవిటో ఈ మధురమైన మలుపులు?

***

సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికొచ్చిన కొడుకు, కోడలు ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని, అప్పటికే సిద్ధంగా ఉన్న శారదను కారులో కమలాబాయ్ ఓల్డేజ్ హోంకు తీసుకెళ్ళారు. ముందే చెప్పారనుకుంటా, హోం వాళ్ళూ సిద్ధంగానే ఉన్నారు. నిర్వాహకుడు శారదను 'హాపీ బర్త్ డే మేడం' అని నవ్వుతూ విష్ చేశాడు. ఇద్దరు కుర్రాళ్ళు కారు దగ్గరకు వచ్చారు. అనిరుధ్ కారు డిక్కీ తీశాడు. కొన్ని రగ్గులు, బట్టలు, పళ్ళూ ఉన్నాయి. ఆ కుర్రాళ్ళు వాటిని లోపలికి తీసుకెళ్ళారు. హోం లోపల ఒక టేబుల్, దానిమీద వైట్ క్లాత్ పరచి ఉంది. ఇటువైపు నిర్వాహకుడు, శారద, అనిరుధ్, సుమనస్విని నుంచున్నారు. అటువైపు మనసులో గూడుకట్టుకున్న బాధ బయటకి కన్పించకుండా, ముఖాన కృత్రిమ నవ్వులు పులుముకున్న ఇరవై ఐదు మంది వృద్ధులున్నారు.

'ఇవాళ ఈ శారదమ్మ పుట్టిన్రోజు. మనమీద అభిమానంతో మనమధ్య జరుపుకోడానికి వచ్చారు. వీళ్ళు ఈవిడ కొడుకు, కోడలు. అందరు విష్ చేసి చప్పట్లు కొట్టండి' అన్నాడు. తమ వయసు ఉన్నామె, అనాధలైన తమ మధ్య పుట్టిన్రోజు జరుపుకుంటూ, తమకు సహాయం చేసేలా సహకరిస్తున్న ఆవిడ కొడుకు, కోడలి మంచి మనసుకు ధన్యవాదాలర్పిస్తూ, శారదకు పుట్టిన్రోజు శుభాభినందనలు తెలియజేశారు వయసుడిగిన పెద్దలు. తర్వాత శారద చేతుల మీదుగా అందరికీ రగ్గులు, బట్టలు, పళ్ళూ అందజేసింది సుమనస్విని. ఇదంతా ఓపిగ్గా, ఎక్కడా ఏదీ మిస్సవ్వకుండా సెల్లో రికార్డ్ చేశాడు అనిరుధ్.

***

'చూశావా అనిరుధ్, నేనేం చేసినా సూపర్ సక్సెసే. మీ అమ్మ పుట్టిన్రోజు వీడియోను యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశానా, ఎన్ని లైకులు, కామెంట్లో. ట్రెండింగ్ వీడియో అయింది. నాలాంటి కోడలుండాలని కొంతమంది, కూతురుంటే బావుణ్నని మరికొంతమంది నన్ను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసేశారు. ముఖ్యంగా మన చుట్టాలు, కలీగ్స్, ఫ్రెండ్స్ పెట్టిన కామెంట్లలో మనసారా వాళ్ళు కుళ్ళిపోవడం కనిపిస్తోంది' మురిసిపోతోంది సుమనస్విని.

'నువ్వేది చేసినా అంతే డియర్' అన్నాడు అనిరుధ్.

ఇదేమీ తెలియని శారద తడిగుడ్డతో ఇల్లంతా తుడుస్తోంది. పాపం ఆ హోంలోని వాళ్ళకు, ఆవిడకు తేడాలేదు. అది బయటి ప్రపంచానికి తెలియదు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.




85 views4 comments

4 Comments


Eyes filled with tears. Nice story.

Like

Siva Mogili
Siva Mogili
Jan 04, 2021

Maa Amma garu gruthru ki vacharu Sir. All the best Sir

Like

😊👌

Like

తాము తీసిన ట్రెండింగ్ వీడియో తో ప్రపంచానికి తియ్యగా పరిచయం చేసిన చేదు నిజం లాంటి కథను వ్రాసిన ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారికి అభినందనలు

Like
bottom of page