top of page

ఉగాది మధురానుభూతి


'Ugadi Madhuranubhuti' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

" ఏమండీ ! సాయంత్రం పొలం నుంచి త్వరగా రండి . ఉగాది పండుగ ఇంకా రెండు రోజులే ఉంది. అమ్మాయి, అల్లుడు వస్తున్నారు కదా! క్రొత్త బట్టలు పెట్టాలి. పట్నం వెళ్లి షాపింగ్ చేసొద్దాం" అంది సరోజ భర్త రంగయ్యతో.

" సరే ! అలాగే ! సాయంత్రం బస్సుకు వెళ్ళొద్దాం." అని తలపాగా ధరించి, ముల్లు కర్ర చేతపుచ్చుకుని, కిర్రు చెప్పులేసుకుని పొలానికి బయలుదేరాడు రంగయ్య. రంగయ్య రామాపురంలో పేరు మోసిన రైతు. తన ఏకైక కూతురు సుధను పట్నంలో చక్కగా చదివించి సాఫ్ట్ వేరు ఇంజనీర్ అయిన వేణుతో ఇటీవలే ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి పంపాడు. వేణు, సుధలు కొత్త కాపురం మొదలుపెట్టి అన్యోన్యంగా ఉంటున్నారు. సరోజ ఇంటిపని, వంటపని ముగించి భర్తకు మధ్యాహ్న భోజనం పాలేరు చేత పంపించింది. ఇల్లంతా చక్కగా సర్ది కూతురి గదిని అందంగా అలంకరించింది. నిలవ ఉండేట్టుగా చక్కిలాలు, అరిసెలు, చెక్కలు వంటి పిండి వంటలను చేసింది. అవంటే సుధకు చాలా ఇష్టం. సాయంత్రం భర్త రాగానే ఇద్దరూ కలిసి బస్సులో పట్నం బయలుదేరి వెళ్ళారు.

సుధకు ఇష్టమైన గులాబి రంగు పట్టుచీరె , దానికి మాచింగ్ జాకెట్టు, గాజులు వగైరా , వేణుకు పట్టు ధోవతి, ఉత్తరీయం తీసుకుని ఆఖరి బస్సులో ఇంటికి వచ్చేశారు. ఆ మరురోజు ఉదయాన్నేసరోజ, ఇంటిని ఆవు పేడతో అలికి అందమైన రంగవల్లులు తీర్చిదిద్దింది. గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టి, పూల మాలలతో అందంగా ద్వారాలను అలంకరించింది. సరోజ, రంగయ్య ఇద్దరూ సుధా వేణు ల రాక కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలావుండగా సుధ తన భర్త వేణుతో కలిసి తన ఊరికి బస్సులో బయలుదేరింది. తను పుట్టి పెరిగిన ఆ ఇల్లన్నా‌ , ఆడుతూ పాడుతూ పెరిగిన ఆ ఊరన్నా , అక్కడ ఉన్న తన చిన్ననాటి స్నేహితులన్నా సుధకు చాలా ఇష్టం. బస్సులో నుంచి తన ఊరి అందాన్ని చూస్తూ మధ్యమధ్యలో భర్తకు తన చిన్ననాటి చిలిపి చేష్టలను వివరిస్తూ ఆనందిస్తోంది.

'ఎప్పుడెప్పుడు అమ్మా- నాన్నలను చూస్తానా' అన్న ఆరాటం ఆమె ముఖంలో స్పష్టంగా కనపడుతోంది. మరో రెండు గంటలకు బస్సు రామాపురం చేరింది. బస్సు దిగగానే ఎదురుగా ఎడ్లబండిలో రంగయ్య. సంతోషంగా పలకరింపులు అయ్యాక బండి ఎక్కారు వేణు, సుధలు. గణ గణమనే ఎద్దుల గంటల ధ్వని సుధ మనస్సును ఏవో లోకాలకు తీసుకు పోయింది.

" సుధా ! బండి దిగు. ఇల్లొచ్చేసింది " అన్న వేణు పిలుపుతో తృళ్ళి పడింది సుధ. వేణు చేయి అందివ్వగా చంగున బండి దిగింది సుధ. ఎదురుగా నవ్వుతూ అమ్మ! కూతురికి, అల్లుడికి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి కాళ్ళు కడిగి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చింది సరోజ."

అల్లుడుగారూ !బాగున్నారా!" అన్న అత్తామామల పలకరింపుకు నవ్వుతూ సంతోషంగా బదులిచ్చాడు వేణు.

" ఏమ్మా! సుధా! ఎలా ఉన్నావు?" అని కూతురిని పలకరించి దగ్గరకు తీసుకున్నారు తల్లి తండ్రులు. కాఫీ, ఫలహారాల మర్యాదలు అయ్యాక వాళ్ళని తమ పొలానికి తీసుకెళ్ళాడు రంగయ్య. సరోజ వంట పనిలో నిమగ్నమైంది. సుధ తమ ఊరిని వేణుకు చూపిస్తూ అక్కడ ఉన్నకాలువ, మామిడి తోటలు ,తన స్నేహితురాళ్లతో ఆడుకున్న ఆటపాటలు, గిల్లి కజ్జాలను గురించి సంతోషంగా చెబుతుంటే వేయి ఓల్టుల బల్బులా వెలిగిపోతున్న తన భార్య ముఖారవిందాన్ని చూసి మరింత ముచ్చట పడిపోతున్నాడు వేణు. అసలే అందమైన సుధ ఇప్పుడు మరింత అందంగా మెరిసిపోతోంది. రమణీయమైన అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి మరింత ముగ్థుడయ్యాడు వేణు.

కమ్మని కబుర్లు చెప్పుకుంటూ పొలం అంతా తిరిగి వస్తూ దారిలో చెరుకు తోటలో కొన్ని చెరుకు గడలను విరుచుకుని రంగయ్యతో ఇంటికి తిరుగు ముఖం పట్టారు సుధ, వేణులు .

అందమైన ఆ జంటను చూసి ముచ్చట పడుతున్నారు ఆ ఊరి వాళ్ళు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలకరించే సుధ అంటే వాళ్లందరికీ చాలా ఇష్టం. పల్లెటూరంటేనే ఆప్యాయత - ఆదరాభిమానాలకు నెలవు. పట్నంలో లాగా అక్కడ యాంత్రిక జీవనం ఉండదు. సుధ ఆ ఊరిలో పుట్టి పెరిగిన బిడ్డ కదా మరి ! అందుకే సుధ అంటే వాళ్ళందరికీ ప్రీతి.

***

ఆకలితో ఇంటికి వచ్చిన సుధావాళ్ళకు వేడివేడిగా భోజనాలు వడ్డించింది సరోజ. కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయారు వేణు, సుధలు .సుధ వచ్చిందని తెలిసి ఆ సాయంత్రం చిన్ననాటి స్నేహితురాళ్ళు వచ్చి పలకరించారు. చిన్నప్పటి ఆ రోజులను గుర్తు చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో చేగోడీలు తింటూ టీ తాగి కాసేపు కబుర్లతో అందరూ హాయిగా గడిపారు. 'మధురమైన ఆ బాల్యం మరలా రాదు కదా!' అని అనుకున్నారు. స్నేహితురాళ్ళను పంపి సుధ అమ్మానాన్నలతో, వేణుతో రాత్రి విందారగించింది. అందరూ హాయిగా నిద్ర పోయారు. తెల్లవారితే ఉగాది పండుగ.

***

వేకువనే తొలి కోడి కూత తో మెలకువ వచ్చిన సుధ కళ్ళు నులుముకుంటూ బద్దకంగా కళ్ళు తెరిచి ఇంటి ముందు ఉన్న తోటలోకి వచ్చింది. చల్లని గాలి మేనును సోకగా చెట్లు అన్నీ నవ్వుతూ స్వాగతం చెబుతున్నాయా అన్నట్టు తలలూపుతున్నాయి. విరిసిన పూతోటలో ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. అప్పుడే తన వెలుగు కిరణాలతో చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ఉషోదయ భానుడు వస్తున్నాడు.

'ఉదయ భానుడు ఎంత బాగున్నాడో !' అనుకుంది సుధ. వసంతకాలమాయె. తన చిన్నప్పుడు బడిలో నేర్చుకుని చాలా పోటీలలో పాడి బహుమతులను గెలుచుకున్న " ఓహో! ఓహో ! వసంతమా ! నవ మోహన జీవన వికాసమా ! " అనే దేవులపల్లి వారి లలిత గీతం గుర్తొచ్చి పాడింది. మామిడి చెట్టు మీద నుంచి కోయిల

కుహూకుహూలు బహు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. సుమనోహరమైన ఆ గానానికి ముగ్ధురాలై తను కూడా శ్రుతి కలిపి దానిని అనుకరిస్తే అది రెట్టించిన ఉత్సాహంతో మరింత శ్రావ్యంగా కూసింది. కాసేపు తను కూడా గొంతు కలిపి " సరిలేరు! సరి రారు నీకెవ్వరు! నీకు నీవే సాటి కోయిలమ్మా! " అని మెచ్చుకుని తోటంతా తిరుగుతూ కాసేపు గడిపి ఇంట్లోకి వచ్చింది.

తల్లి అప్పటికే వాకిలి ముందు ఆవు పేడతో కళ్లాపి చల్లగా తను రంగవల్లులు తీర్చిదిద్దింది.

కాలకృత్యాలు తీర్చుకుని వేణును లేపింది.

"అబ్బ! అప్పుడే తెల్లారిందా ! " అంటూ సుధను మరింత దగ్గరకు తీసుకున్నాడు వేణు. కాసేపటికి వేణు లేచి కాలకృత్యాలు తీర్చుకుని అత్తగారి చేతి కాఫీ తాగాడు. తర్వాత సరోజ వాళ్ళిద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి నుదుటిన బొట్టు పెట్టి నూనెతో తలంటి, హారతివ్వగా సరోజ, రంగయ్యలు అక్షింతలు వేసి ఆ దంపతులను దీవించారు. తలంటి స్నానాలయ్యాక ఆ క్రొత్త దంపతులకు పట్టుచీరె‌ , ధోవతి, ఉత్తరీయం పెట్టగా అవి కట్టుకొని వచ్చి పెద్ద వాళ్ళ ఆశీర్వాదం పొందారు వేణు, సుధలు. సరోజ అందరికీ ఉగాది పచ్చడి పెట్టింది. అన్ని రకాల రుచులతో ఉన్న ఆ పచ్చడిని మళ్ళీ అడిగి మరీ తిన్నారు సుధావాళ్ళు.

వేణు, సుధలు కాసేపు ఆ తోటలో ఆనందంగా విహరిస్తూ కబుర్లతో గడిపారు. ఈలోగా సరోజ పిండివంటలతో సహా వంట పూర్తి చేయగా అందరూ కలిసి దేవునికి పూజ చేసి హారతులిచ్చారు. రంగయ్య పంచాంగం చదవగా అందరూ విన్నారు. ఎవరి రాశిఫలాలను వాళ్లు మరలా పరిశీలించి ఆదాయ వ్యయాలను, రాజభోగాలను, అవమానాలను చూసుకున్నారు. అందరూ పిండివంటలతో భోజనాలను ముగించారు. అత్తగారి కొసరి కొసరి వడ్డనలతో వేణు చాలా సంతృప్తిగా భుజించాడు. అందరూ భుక్తాయాసంతో కాసేపు హాయిగా విశ్రమించారు. వేణు, సుధలు ఆ సాయంత్రం ఆ ఊరి శివాలయానికి వెళ్లి అర్చన చేసి ఆ స్వామి ఆశీస్సులను పొందారు.

"సుధమ్మా ! ముందీ రోజులకు పండంటి మగబిడ్డను కనాలమ్మా! " అన్న పూజారి దీవెన విన్న సుధ సిగ్గుల మొగ్గ అయింది. ఆ తర్వాత కాసేపు అక్కడి కోనేరు వద్ద గడిపి అందులో ఎర్రటి కలువ పూవులను కోసుకుని ఇంటికి వచ్చారు సుధా వాళ్ళు.

ఆ రాత్రి అందరూ విందారగించి కాసేపు కబుర్లతో గడిపి నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం స్నాన పానాదులయ్యాక ఫలహారాలను చేసి అత్తామామలకు నమస్కరించి మధురమైన జ్ఞాపకాలను మనసునిండా పదిలపర్చుకుని సంతోషంగా వేణు, సుధలు తమ ఊరికి పయనమయ్యారు. తను చేసిన చక్కిలాలు, అరిసెలు, చెక్కలు మొ.. పిండి వంటలను, కొన్ని చెరుకు గడల ముక్కలను, అరటి పండ్లను, తోటలోని కూరగాయలను అన్నింటినీ చక్కగా సర్ది వాళ్లకు అందించింది సరోజ. తమ వివాహమైనాక తొలి పండుగ అయిన ఈ ఉగాది ఇంత మధురానుభూతిని మిగిల్చిందని సంతోషిస్తూ తమ ఊరి బస్సు ఎక్కారు వేణు, సుధలు.

కూతురి, అల్లుడి అన్యోన్యతను చూసి సంతోషిస్తూ వాళ్ళు ఇంకా నాలుగు రోజులు తమ వద్ద ఉంటే బాగుండేదని పదే పదే అనుకుంటూ, అల్లుడి ఉద్యోగరీత్యా అది కుదరదు కదా! అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నారు సరోజ దంపతులు. సుధా వాళ్ళ రాకతో ఇంటికి వచ్చిన పండగ సందడి వాళ్లు వెళ్లిపోవడంతో సందడంతా సుధ తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు.

తమకు ఇంతటి ఆనందాన్ని , సంతోషాన్ని ఇచ్చిన ఈ ఉగాది పండుగను గుర్తుచేసుకుంటూ

" అప్పుడే అయిపోయిందా ఉగాది. వచ్చే సంవత్సరం ఉగాది పండుగకు పండంటి మనవడిని ఎత్తుకోవాలి, వాడి ముద్దు ముచ్చటలను వేడుకగా జరపాలి " ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్ధించారు సరోజ దంపతులు. వేణు,సుధలు క్షేమంగా వాళ్ళింటికి చేరి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.

ఆ దేవదేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించినట్లుగా ఆ తర్వాత కొన్నిరోజులకు సుధ నెల తప్పింది. సరోజ దంపతుల ఆనందానికి అవధులు లేవు. రెక్కలు కట్టుకున్నట్టుగా వెంటనే కూతురి వద్దకు వెళ్లి తనకు కావలసినవన్నీ చేసి పెట్టి రెండు నెలలు అక్కడే గడిపి ఇంటికి వచ్చింది సరోజ. ఆ తర్వాత కూతురిని ఏడో నెలలో ఇంటికి తీసుకుని వచ్చి వియ్యాలవారినీ‌, బంధువులను, ఊరిలో అందరినీ పిలిచి వేడుకగా సీమంతం చేసింది సరోజ.

ప్రక్క ఊరినుంచి డాక్టర్ ను ఇంటికి పిలిపించి సుధ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తున్నారు రంగయ్యా వాళ్ళు. తరచూ వేణు వచ్చి చూసి పోతున్నాడు. నెలలు నిండాక ఒక శుభముహూర్తమున పండంటి కొడుకును కన్నది సుధ. వేణు‌,సుధా వాళ్ళు చాలా సంతోషించి వేడుకగా బారసాల చేసుకుని బాబుకు 'వసంత్' అని పేరు పెట్టుకున్నారు. సంతోషంగా భార్యా బిడ్డలను తీసుకుని వాళ్ళ ఊరికెళ్ళిపోయాడు వేణు .

అల్లారుముద్దుగా పెరుగుతూ ముద్దులు మూటకట్టే మనవడంటే సరోజ దంపతులకు చాలా ప్రేమ. 'అసలు కంటే వడ్డీ ముద్దు' అని ఊరికే అనలేదు పెద్దలు. మరుసటి సంవత్సరం తాము కలలు కంటున్న అందమైన ఉగాది రానే వచ్చింది. సుధ భర్త తో , కొడుకుతో తమ ఊరికి

వచ్చింది. క్రితం సంవత్సరం లాగానే వేడుకగా ఉగాది పండుగను తల్లిదండ్రులతో , భర్తతో, కొడుకుతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంది సుధ. అమ్మమ్మ చేసిన ఉగాది పచ్చడిని‌ నోటికి నాకించగా బోసినవ్వులు నవ్వాడు ఊయలలోని వసంత్. తమకు ఇంతటి సంతోషాన్ని , ఆనందాన్ని ఇచ్చిన ఉగాది పండుగను తలచుకుంటూ ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు రంగయ్య దంపతులు.

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు .మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ... ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కథలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కథలు, కవితలు వ్రాస్తున్నాను .నాకథలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి.గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ....నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం...అయినది. నాకు నా మాత్రృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



134 views0 comments
bottom of page