కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'vacchenu Kanave Amani' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
పెళ్ళై ఏడేళ్లయినా ఆమనికి పిల్లలు లేరు.
మానసికంగా బాగా క్రుంగి పోయింది.
తన బంధువైన హరిప్రియ ఆమెకు ధైర్యాన్ని చెప్పింది.
ఆమని జీవితంలోకి ఆమని వచ్చిందా లేదా యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.
అప్పుడే పూజ ముగించుకుని ముందు గదిలోకి వచ్చిన భ్రమరాంబగారు అపరంజి బొమ్మలాంటి తన కూతురు ' ఆమని' పుట్టింటికి వచ్చినప్పటినుండి అలా దిగులుగా కూర్చుని ఏదో పోగుట్టుకున్నదానిలా మాటామంతీ లేకుండా ఉండడం చూసి " అలా ఎంత సేపు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తావే ఆమనీ? ఏదైనా పరిష్కారం దొరికిందా మరి” అంటూ కూతురిని కోప్పడింది..
" ఆ...ఆ దొరికింది, నేనసలు మా అత్తగారింటికి ఇంక వెళ్లనే వెళ్లను. శైలేష్ మరో పెళ్లి చేసుకుని గంపెడు సంతానం కంటాడులే” అంటూ రోషంగా ముఖం పక్కకు తిప్పుకుంటూ మాట్లాడుతుంటుంటే భరించలేకపోయింది ఆవిడ..
" అలా అనకే ఆమూ, నీకు ఏమి వయస్సు మీరిపోయిందని? రెండునెలల క్రితమేగా ముఫై దాటింది.. అప్పుడే ఇంక పిల్లలు పుట్టరని ఎలా నిర్ధారణకు వచ్చావే ?”
తల్లి మాటలకు ఆమని ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది..
కూతురి బాధ తనకు అర్ధమవక కాదు.తను కూడా బేలగా అయిపోతే కూతురికి ధైర్యం చెప్పేదెవరు ? పెళ్లి అయి ఏడు సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని దాని అత్తగారు ఒకటే సణుగుడు, సాదింపులట..
అల్లుడు శైలేష్ చాలా మంచివాడు. తల్లితో చెప్పాడుట, పిల్లలు పుట్టకపోతే ఏమైందీ, ఎవరినైనా తెచ్చుకుని పెంచుకుంటామనగానే "ఎవరో కని వదిలేసిన దరిద్రాన్ని మన ఇంటికి తెచ్చుకోవడం నా ప్రాణం ఉండగా జరగని పని. నీ రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలే ఈ ఇంట్లో కదలాడాలి” అని గట్టిగా చెప్పిందావిడ. అంతేకాదు, “టెస్ట్ ట్యూబ్ బేబీలంటూ ఆధునిక పోకడలతో కన్న పిల్లలు వద్దే వద్ద”ని ఖరాఖండిగా చెప్పేసింది..
అక్కడే ఉన్న ఆమని ఆ మాటలన్నీ వింటూ "అంటే కొడుక్కి మరోవివాహం చేస్తానన్న సంకేతమా" అనుకుంటూ క్షణంసేపు అచేతనావస్తకు లోనైంది.
ఏమిటో మనస్సంతా ఒకలాంటి చిరాకు ఆవహించగా, 'అమ్మా వాళ్లింటికి వెళ్లి కొన్నిరోజులుండి వస్తా'నని పుట్టింటికి వచ్చింది. వచ్చినప్పటినుండీ కూతురు అలా దిగులుగా ఉండడంతో ఆవిడ తల్లడిల్లిపోతోంది.
ఒక రోజు అదే ఊరిలో ఉంటున్న భ్రమరాంబగారి అక్క రాజేశ్వరి ఫోన్ చేసి, ఆమని వచ్చిందని చెప్పావుకదే భ్రమరా, మా హరిప్రియ రెండురోజుల్లో సఖినేటిపల్లి వెళ్లిపోతుంది.. ఆమనిని తీసుకుని రాత్రికి అందరూ డిన్నర్ కు వచ్చేయమని చెప్పడంతో ఆమని రానంటున్నా బ్రతిమాలి అందరూ కలసి రాజేశ్వరి ఇంటికి వెళ్లారు.
ఆమనిని చూడగానే హరిప్రియ గబ గబా వచ్చేసి ఆప్యాయంగా కౌగలించుకుంటూ, " ఎలా ఉన్నావు ఆమనీ, ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి, మీ శైలేష్ రాలేదా” అంటూ అడిగింది.
“లేదు అక్కా” అనగానే,” ఓ.. అవునా! రండం”టూ లోపలకు సాదరంగా తీసుకెళ్లింది. హరిప్రియ, ఆమె భర్త ఇద్దరూ అమలాపురం దగ్గర సఖినేటిపల్లె లో సొంతంగా హాస్పటల్ కట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు.హరిప్రియ గైనికాలజిస్ట్ గా, ఆమె భర్త జనరల్ పీడియాట్రీషియన్ గా పల్లె ప్రజలకు, పేదవారికి వైద్యం చేస్తున్నారు. హరిప్రియ ఎన్ని జోకులేసినా డల్ గా ఉన్న ఆమనినే చూస్తూ “రావే ఆమనీ నా గదిలోకిపోయి మాట్లాడుకుందాం” అంటూ తీసుకుపోయింది.
చాలాసేపు కబుర్లు చెప్పుకుని, భోజనాలు చేసి అందరూ వీడ్కోలు తీసుకుని వచ్చేస్తుంటే హరిప్రియ అంది ఆమనితో "మళ్లీ తొందరలోనే చూస్తాను నిన్ను పండంటి బిడ్డతో"నంటూ ఆప్యాయంగా కౌగలించుకుని మరీ సాగనంపింది..
ఒక పదిరోజుల తరువాత ఆమని అత్తవారింటికి వెళ్లిపోయింది.. వెళ్లేముందు ఆమని ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం, ఆనందం కనపడేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు భ్రమరాంబగారు..
ఆరునెలలకాలం వేగంగా కదలిపోయింది.. ఆ రోజు శనివారం.. ఆమని నుండి ఫోన్ ఉదయాన్నే.. " ఏమిటే ఆమూ పొద్దునే ఫోన్, ఎలా ఉన్నావ"నేసరికి " బాగున్నానండీ భ్రమరాంబగారూ, మీకో శుభవార్త.. మరో ఏడునెలలలో మీకు అమ్మమ్మగా ప్రమోషన్ రాబోతోం"దంటూ ఉత్సాహంగా చిలిపిగా మాట్లాడుతున్న కూతురి మాటలను కట్ చేస్తూ "నిజమేనా ఆమూ, నామీద ఒట్టేసి చెప్పంటూ ఈవిడ ఆనందంతో పొంగిపోతోంది.
"నిజమమ్మా! నిన్న రాత్రి హరిప్రియ అక్క నేను పంపిన రిపోర్ట్స్ అన్నీ చూసి మూడోనెలంటూ నిర్ధారణ చేసింది. ఇంకా మరో అద్భుతం జరగబోతోంది.. కవల పిల్లలు పుడ్తారని చెప్పింది.. ఇదంతా హరక్క పుణ్యమేనమ్మా” అని చెప్పేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది..
ఆరోజు హరక్క 'ఏమిటే ఆమనీ, అంత డల్ గా ఉన్నా'వంటే అక్కను పట్టుకుని ఏడ్చేస్తూ తన పరిస్తితిని చెప్పింది.. తన ఫోన్ లో సేవ్ చేసుకుని పెట్టుకున్న మెడికల్ రిపోర్ట్స్, తీసుకుంటున్న ట్రీట్ మెంట్, మెడికేషన్ అంతా చూపించింది.. హరిప్రియ ఆశ్చర్యపోయింది,
“ఇన్ని రిపోర్టులా ఆమనీ” అంటూ.. “మీరు ఎవరో చెప్పారని ఆ డాక్టరూ, ఈ డాక్టరంటూ అరడజను మందిని కలసి వాళ్లు చెప్పిన టెస్టులూ, స్కేనింగులంటూ తిరిగారు. చదువుకున్న మీరు కూడా ఏమీ తెలియని అమాయకుల్లా ! ఆ.... మీ అత్తగారు నిన్ను స్వామీజీల దగ్గరకు, బాబాల దగ్గరకు కూడా తీసుకుని వెళ్లి ఉండాలే” అని అనేసరికి ఆమని ఫక్కుమంటూ నవ్వేసింది..
హమ్మయ్య ఆమని నవ్విందంటూ " ఎప్పుడూ ఈ హరక్క గుర్తుకు రాలేదా ఆమనీ ? నీ సమస్యను నాతో చెప్పాలని అనిపించలేదు కదూ? పోనీలే. బెటర్ లేట్ దేన్ నెవ్వర్” అంటూ ఆమనిని అక్కడే ఒక సారి పరీక్షచేసి చూసింది.
“ఇంత హెల్దీ యూట్రస్ ఉన్న ఆమనికి ప్రెగ్నన్సీ రాకపోవడానికి కారణం, విపరీతంగా వాడుతున్న ఫెర్టిలిటీ మందులూ, అడుగడుక్కీ స్కానింగ్ లూ, టెస్టల ప్రభావమేనని అర్ధం చేసుకుంటూ, ‘నీకు ప్రెగ్నన్సీ రావడం ష్యూర్ ఆమనీ! ఏలోపంలేదు. నామీద నమ్మకం ఉంటే ప్రస్తుతం నీవు వాడుతున్న మందులన్నీ ఆపేయి.. మరి ఏ డాక్టరునీ సంప్రదించకండి.. రెండు రకాల టేబ్లట్స్ మాత్రం వ్రాసి ఇస్తాను.. ప్రతీరోజూ క్రమం తప్పకుండా నిద్రపోయే ముందు వేసుకో. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఉల్లాసంగా ఉండు.. మీ అత్తగారు ఏమన్నా మనస్సులో పెట్టుకోకు. స్ట్రెస్, టెన్షన్ కూడా ప్రధాన కారణాలు. పిల్లలు తప్పకుండా పుడ్తారన్న పాజిటివ్ మైండ్ లో ఉండు. నేను నిన్ను ప్రతీవారం కాంటాక్ట్ చేస్తూ ఉంటాను, ఆరునెలల్లో నీవు కన్సీవ్ కాకపోతే నేను నా డాక్టర్ వృత్తినే వదిలేసుకుంటాను’ అని ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందమ్మా” అంటూ తల్లికి చెప్పింది..
“చాలా సంతోషం తల్లీ.. ఆలస్యం అయినా మంచి శుభవార్తను చెప్పావు. మీ అత్తగారికి ఒకేసారి మనవడిని, మనవరాలిని ఇస్తున్నందుకు ఆవిడ చాలా సంబరపడుతున్నారేమో. నేను ఫోన్ చేసి మాట్లాడతాను ఆమనీ”
.
“సరేనమ్మా, విషయం తెలిసినప్పటినుండి మా అత్తగారి ముఖం దీపావళి మతాబులా వెలిగిపోతోంది.. నన్ను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు” అని చెప్పగానే, అంతవరకూ తన కూతురి పట్ల హృదయంలో గూడు కట్టుకున్న ఆవేదన దూదిపింజలా ఎగిరిపోవడమే కాకుండా ఆవిడ మనస్సు ఆనందంతో నిండిపోయింది..
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Comments