'Valu Kurchi' written by Dr. Kanupuru Srinivasulu Reddy
రచన : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
కోదండరామయ్య వాలుకుర్చీలో కూర్చుని అప్పుడే వచ్చి, కారులో దిగిన మనవడ్ని చూసాడు. రాత్రి పదకొండు గంటలయి ఉంటుంది. 'పరవాలేదు, త్వరగానే వచ్చాడు' అనుకుని అసంతృప్తితో నిట్టూర్పు వదిలాడు.
“ఓయ్! కాపలాకుక్క.” మనవడి చతురతకు నవ్వాడు. కోపం రాలేదు. తన వైపు చూడకనే లోపలికి వెళ్ళిపోయాడు. మరి తను ఎందుకు నవ్వాడు.? గుండెల్లో ఉన్న మమకారం. తన వంశాన్ని నిలబెట్టే మూడో తరం. తన కొడుకు రాంగోపాల్ కి ఒకే ఒక్క బిడ్డ.
ఈ గుండెల మీద ఉంచుకుని తను, గుండెల్లో దాచుకుని తన భార్య కాపాడారు. చిన్న వయస్సులోనే పోకిరి. మాట వినేవాడు కాదు. అయినా మెల్లగా చెప్తే వినేవాడు. తానంటే ఎంతో ప్రేమ , అతుక్కుని ఉండే వాడు. ఎంత తెలివో! మూడు సంవత్సరాలకు అక్షరాలు అన్నీ నేర్చుకునేసాడు. నాన్నమ్మ వేకువనే పూజించే దేవుళ్ళ దగ్గరకు వచ్చి, ఆమె వడిలో పడుకుని నిద్ర పోయేవాడు. ఆ వయస్సులో సుప్రభాతం , విష్ణు సహస్రనామం ముద్దు ముద్దుగా వాళ్ళ నానమ్మతో కలిసి పాడుతుంటే ఆనందంతో తలమునకలయ్యే వాడు కోదండరామయ్య.
ఇదేవిటీ వెధవ పెంపకం, ఈ కాలంలో అవేవిటి దరిద్రం అని కోడలు సద్గుణ, వేరే దాదీని పెట్టి, వీళ్ళ దగ్గరకు రానివ్వకుండా చేసింది. కాస్త గొడవ కూడా అయ్యింది. కొడుకు భార్య వైపు మొగ్గాడు. మనసు ఉండబట్టక ఎప్పుడైనా వాళ్ళు లేనప్పుడు ఆడిపించుకుంటే ఆ సూర్యకాంత దాదీ, కోడలు వచ్చీ రాగానే లేనిపోని తప్పులు చెప్పేది. అవి విని తన బిడ్డను తనకు కాకుండా చేస్తున్నారని కొడుకు దగ్గర పంచాయతి పెట్టించి, ఇక బిడ్డ దగ్గరకు చేరకూడదని దూరంగా ఉండి చూడొచ్చని తీర్పు ఇచ్చారు. గుండెలు పగిలిపోతుంటే ఒప్పుకోక తప్పిందికాదు.
మనవడ్ని పెంచుతున్న పద్ధతి ఇద్దరికీ పూర్తిగా నచ్చలేదు. ఆ బిడ్డకేవిటి సెల్ఫోన్లో పాటలు ఆటలు? టీవీలో కోతి డాన్సులు! ఇప్పుడు దగ్గరకు రమ్మన్నా పరుగెత్తి పారిపోతున్నాడు మనవడు. చూడలేక, కాదనలేక. బయటకొచ్చి తను వాలు కుర్చీలో కూర్చుంటే, భార్య కాళ్ళ దగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటే, ఓదార్పుగా తల నిమురుతూ తన కన్నీళ్లు తుడుచుకోవడం, దూరంగా ఉండటానికి ప్రయత్నించడం, విధిలేనట్లుగా అలవాటు అయిపోయింది కోదండరామయ్యకు.
పదిమంది పెద్ద వాళ్ళు వస్తుంటారని కోడలు, కొడుకు దయతో కార్లు పెట్టే చోట కాపాలాదారుని గదుల్లో ఉండొచ్చని బిక్ష పెట్టారు. తల్లిదండ్రుల కంటే పెద్ద వాళ్ళు ఉంటారా? ఆ పెద్ద వాళ్ళను పరిచయం చేసింది ఎవరంట? ఒకప్పుడు తానే. ఎవ్వరైనా మనుషులేకదా అని మరీ దగ్గరుండి అన్నివసతులు ఉండేటట్లు రెండు గదులు కట్టించాడు. ఇప్పుడు ఒక గది తమ నివాసమైంది. మనసు చచ్చిపోయింది. తగువేసుకుంటే ఏం వస్తుంది? ఇంకా దూరం పెరుగుతుంది. ఇక్కడుంటే కనీసం చూస్తూనన్నా ఉండొచ్చు. ఏమో కొడుకు మనసు మార్చుకోవచ్చు? అని మనసు స్థిమిత పరుచుకున్నారు.
కొడుకు పుట్టినప్పుడు,” ఏవండీ! నా బిడ్డను రాజాలాగా పెంచాలి, మనం పడిన కష్టాలు నా బిడ్డ పడకూడదు.” అంది భార్య సులోచనమ్మ. పూటకు గడవడమే కష్టంగా ఉన్నరోజులు అవి. ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మి, టౌన్లో ఒక చిన్న ఇంటిలో జీవితం మొదలు పెట్టాడు. ఊరి దగ్గర ప్రతి సంవత్సరం కరువే! ఒకప్పుడు జమిందారి కుటుంబం. కాలచక్రం తలకిందులు చేసింది. దాంతో మనుషులు మారారు. ఒకరి దగ్గరికి పోయి చేయి చాపడం కన్నా ఇదే మేలు అనుకున్నాడు కోదండరామయ్య.
ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిలో చేరి, అతని చేత పడరాని మాటలు పడుతూ, మందు పోస్తూ, ముండగావాలంటే తను నిలిచిపోతానని గట్టిగా అడ్డు తిరిగి, తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకుండా భరించి, సహించి, బినామీగా తన మీదనే కాంట్రాక్టులు తీసుకునే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ఎంత పొద్దుపోయినా, వచ్చినప్పుడు నిద్రపోతున్న కొడుకును ముద్దుపెట్టుకుని, తృప్తిగా కలలుకంటూ భోజనం చేసేవాడు. కొడుకుని మంచి చదువు చదివించాలని భార్యాభర్తలకిద్దరికీ కోరిక.
కొంత కాలానికి తన మంచితనం వలన ఇంజినీర్లు, చిన్న చిన్న పనులు తననే చేయమని ఇచ్చే వారు. ఒదుగు, పొదుపు, ఎదుగు ఒకే దగ్గర ఉంటాయని అప్పుడే గ్రహించాడు. కొడుకు రామగోపాల్ పెరుగుదల, భార్య కనుసన్నలలో దివ్యంగా జరిగిపోతున్నా, అతి ముదిగారంతో నడవడికలో తరుగుదల కనిపించింది. పెంకి వాడుగా తయారవుతాడేమోనని, చాలా ఆందోళన పడేవాడు కోదండరామయ్య. తనకి పద్ధతి అంటే చాలా ఇష్టం. అందుకే కొడుకుతో చాలా కఠినంగా ఉండేవాడు. తల్లి వెనకేసుకొచ్చేది. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చేది.
"ముదిగారం కాదు, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. లేకపోతే నెత్తినెక్కి కూర్చుంటాడు" అని ఎంత చెప్పినా వినేది కాదు. మన స్తోమతను బట్టి పెంచాలి. క్రమశిక్షణ ముఖ్యం. ముదిగారం కాదు అని సకల విధాల చెప్పేవాడు.
పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి మగతనం చూపించాడు కొడుకు కాలేజీలో. పక్కింటిలో, ఎదురింటిలో రిపోర్టులు రావడం మొదలు పెట్టాయి. భయంకరమైన తొలి యవ్వనపు విషపు కోరికలు అడ్డు ఆపు లేకుండా ఆకర్షిస్తూనే ఉంటాయి. సాహసాలు, లైంగిక కోరికలు విజృంభిస్తాయి. వాటిని చూసీ చూడనట్లు ఉన్నా, మన్నించినా, నయాన, భయానా, మంచిగా సరిదిద్దకపోయినా ప్రతి తల్లిదండ్రులు చివరి రోజుల్లో నరకం అనుభవించాల్సిందే! అటో ఇటో తేల్చే అతి ముఖ్యమైన సమయం అది. అజాగ్రత్తగా ఉంటే ఎందుకు కాకుండా పోతాడని చాలా కట్టుదిట్టం చేసాడు. సివిల్ ఇంజినీరింగు చదివించాలని కోదండరామయ్య చిరకాల కోరిక.
ఎలాగో కొడుకును ఇంజినీరింగులో చేర్పించాడు. కాంట్రాక్టుల్లో కాస్త పెరుగుదల వచ్చింది. ఇప్పుడున్న ఇంటి స్థలం, అక్కడక్కడ మరికొన్ని, ఊరికి కాస్త దగ్గరలో ఎందుకు పనికిరాని పొలం మరో ఐదు ఎకరాలు ఉంటుందిలే అని కొన్నాడు. కొడుకు హాస్టల్ లో బాగాలేదని సిటీలో స్నేహితులతో కలిసి ఉంటానంటే ఒప్పుకోలేదు కోదండరామయ్య. దానికి ఇంటికి వచ్చి నానా గొడవ చేసి తల్లి చేత ఒప్పించాడు.
అప్పటి నుంచి ఐదువేలు, పదివేలు కావాలని పదిహేను రోజులకు ఒకసారి ఒత్తిడి. ఎందుకో అర్ధం అయ్యేది కాదు. వాళ్ళమ్మతో పస్తులున్నట్లు ఫోనులు. గుండె కరిగిపోయి తనకు తెలియనివ్వకుండా భార్య పంపించేసేది. పూర్తిగా అప్పులు పాలయ్యే పరిస్థితుల్లోకి వచ్చాడు.
ఒకసారి అర్జంటుగా డబ్బుకావాలంటే, పెళ్ళాం పోరుపడలేక, రాత్రి బయలుదేరి వెళ్ళాడు. బెంగుళూరు చేరేసరికి పూర్తిగా తెల్లవారలేదు. నేరుగా ఆటోలో కొడుకు ఉండే రూము దగ్గరకు వెళితే ఎవ్వరూ లేచినట్లులేరు. పెద్దమేడలో ఒక భాగం. ఇంత యిల్లా అనుకున్నాడు. తలుపు నెట్టి రాయిలాగా అయిపోయాడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి.
సగం తిని వదిలేసిన ప్లేట్లలో తిండి , ఎముకలు, తోళ్ళు. ఎక్కడ చూసినా బీరు బాటిల్స్. వాటి మధ్యలో కొడుకు ఇద్దరు నగ్న సుందరులను కౌగలించుకుని వొళ్ళు తెలియకుండా నిదుర పోతున్నాడు. కూలిపోతున్న నమ్మకాన్ని కుదుట పరుచుకోవాలని కన్నీరు ప్రయత్నిస్తుంటే, ఎదురు తిరిగిన సంస్కారం వెలుపలికి నెట్టింది. ఎలాగొచ్చాడో గేటు దగ్గరకు వచ్చి కూలబడిపోయాడు. 'ఇదా కొడుకు చేస్తున్నపని' అని పదే పదే గుండెల్లో గునపాలు గుచ్చుతుంటే, ప్రాణం పోతుందేమోనని ఊపిరిని కాళ్ళు పట్టుకున్నాడు కోదండరామయ్య.
ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వెళ్లి పోవాలని లేచాడు. కానీ లేవ లేక పోయాడు. ఇంతలో వాకిలి చిమ్మడానికి వచ్చిన అమ్మాయి, ఎవరు ఏమిటి అని పదిసార్లు అడిగిన తరువాత చెప్పాడు. కళ్ళు మతాబులై, సిగ్గుపడిపోతూ లోపలి పరుగెత్తింది. ఆ ఎరుపు మెరుపు ఎందుకో కోదండరామయ్యకు తెలుసు. చివరకు ఇలాంటి వాళ్ళను కూడా....?
లోపల్నుంచి తిట్లు శాపనార్ధాలు. కొంత సేపటికి నిలిచిపోయి, సగం గుడ్డలతో బయటకొచ్చి చూసి, బిత్తరపోయిన కొడుకు చూపుతో, అసహ్యంగా చూపు కలిపాడు.
“ఇంటికి రా!” అని నేరుగా బస్టాండుకు వచ్చేసాడు. భార్యను తిట్టి ప్రయోజనం లేదని, కొడుకు చేసే వీరోచిత కార్యాలు చెప్పి, డబ్బులు పంపించడం మానేసాడు. నెల రోజులు పున్నామ నరకం అంటే ఏవిటో తెలిసొచ్చింది. తన ఆశలన్నీ తగలబడి పోయినట్లు కుమిలిపోయాడు. విషయం తెలిసి భార్య పడుతున్న వేదనతో పోలిస్తే తనదెంత అని సరి పెట్టుకున్నాడు.
అంత బాధపడుతున్నా , వయస్సు, పరిచయాలు, మనం గాకపోతే మరెవ్వరు మన్నిస్తారని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది భార్య. కానీ కోదండరామయ్య ససేమిరా అక్కడొద్దు, చదవడానికి లేదు. ఇప్పటికే తను కూడబెట్టింది పూర్తిగా ఆవిరిగా వచ్చిందని, అప్పులు చెయ్యలేనని గట్టిగా చెప్పేసాడు. రేపు ఎప్పుడైనా దారిన పోయే వాళ్ళని తీసుకు వచ్చి నీ కోడలు, మనవళ్ళు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకరొస్తారో లేక..? భయం పట్టుకుంది కోదండరామయ్యకు.
నెల రోజుల తరువాత దిగిన కొడుక్కి, భార్య పంచభక్ష్య పరమాన్నాలు చేసి పెడుతుంటే చూస్తూ ఉండి పోయాడు. అడిగి అడిగి మరీ తింటున్న కొడుకుని చూసి కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగి ఇక అలా చెయ్యను అని చెప్పినా నమ్మలేదు కోదండరామయ్య. 'నువ్వు వచ్చెయ్యి! చదివింది చాలు' అనే కూర్చున్నాడు.
భార్య, 'ఈ ఒక్కసారికి..' అని మరీ కాళ్ళా వేళ్ళా పడింది. మధ్యలో నిలిపేస్తే రాళ్ళు మోయడానికి కూడా పనికి రాడని , హాస్టల్లో చేరి కుదురుగా చదువుకుంటే పంపుతానని చెప్పి ప్రమాణాలు ఇద్దరూ చేయించుకుని పంపించారు. కుదురుగా ఉన్నట్లు అనిపించింది. తన ఆర్ధిక పరిస్థితి కాస్త మెరుగయ్యింది. తను కొన్న పనికిరాని పొలానికి విపరీతమైన విలువొచ్చింది. కొడుకు చదువుకోసం చేసిన అప్పులు, అమ్మిన స్థలాలు తిరిగి కొనగలిగాడు. ఎలాగో ఇంజినీరింగ్ అరకొర మార్కులతో పాసయ్యాడు.
ఏం చెయ్యాలి? తనతో తీసుకెళ్ళి పెద్ద బిల్డర్స్ కి పరిచయం చేసాడు. ఇతని డిగ్రీకన్నా, చొరవ, బిజినెస్ మైండు చూసి దగ్గరకు తీసారు. కొంతవరకు తృప్తి పడ్డాడు. కానీ డబ్బు కోసం గొంతులు కోసే రక రకాల వ్యసనాల సముద్రమైన ఈ దరిద్రపు ఫీల్డులో, చెడిపోతాడేమోనని ఒక పక్క భయమే! కానీ కొన్ని తప్పవు. త్వరలోనే తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగాడు. పెండ్లికి గొప్ప సంబంధాలు రాసాగాయి.
కోదండరామయ్యకు కొంచెం మధ్యతరగతి సాంప్రదాయం లో పద్దతిగా పెరిగిన బిడ్డను చేసుకుంటే బాగుంటుందని ఆలోచన. కానీ...? పెండ్లి రామ్ గోపాల్ కు కలిసి వచ్చిందేమోగాని. కోదండరామయ్యకు దరిద్రం తగులుకుంది. వాళ్ళు ఎదిగేకొద్దీ వీళ్ళను అంటరాని వాళ్లుగా చూడసాగింది కోడలు. అందుకే బయటకు నెట్టింది. మనవడ్ని దూరం చేసారనే దిగులుతో భార్య సులోచనమ్మ త్వరగానే దాటుకుంది. తన గుండెలు ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకున్నాయి. ఏమని ఏడవాలో, ఎవరితో చెప్పుకుని ఏడవాలో తెలియక తల్లడిల్లిపోయి, ఆమె పోవడమే మంచిది మరీ నరకం అనుభవించకుండా అని స్థిమితం తెచ్చుకున్నాడు.
మౌనంగా ఉండటమే ధ్యానం. పరిస్థితుల్ని భరించడమే జీవిత పరమార్ధం అని నమ్మి, దినాలు లెక్కపెట్టుకుంటున్నాడు కోదండరామయ్య. ఉన్నట్టుండి కూర్చున్న వాలుకుర్చీలో దిగబడి పోయినట్లు అనిపించింది. ఆలోచనలనుంచి బయటపడి లేచి చూసాడు. కుర్చీ మధ్యలో గుంట పెద్దధైపోయింది. ఇంతకు ముందు ఉన్నదే! చాలా సార్లు చెప్పాడు కొడుకుతో. పాతది దానికెందుకు సొగసు! తీసి పారెయ్యక అని గదమాయించాడు . తనకు తెలుసు దాని విలువ. రోజ్ వుడ్ తో చేసింది. తర తరాలుగా తమ పెద్ద వాళ్ళందరూ దానిలో పడుకొనే తీర్పులు ఇచ్చే వాళ్ళు . దాన్ని ప్రత్యేకంగా తుడిచేందుకు మనిషి ఉండేవాడు.
తను వచ్చేసరికి రాజసం పోయింది, అది మాత్రమే మిగిలింది. అందులో కూర్చుంటే తన తాత ముత్తాతల స్పర్శ సజీవంగా ఉన్నట్లు, తెలియని తృప్తి, గర్వంగా కూడా అనిపించేది. చిరిగిపోయినా, దాన్నే తాళ్ళతో అల్లి అందులోనే కూర్చునేవాడు కోదండరామయ్య. . ఇంతలో కారు వచ్చిన శబ్డం అయ్యింది. తన కొడుకు దిగి తన వైపు చూసి,”యింకా నిదరపోలేదా!’ అంటూ లోపలి వెళ్ళాడు. ఆ పలకరింపుకే పులకరించి పోయాడు.
మెల్లగా లేచి తను దాచి పెట్టుకున్న పెట్టెను తీసుకున్నాడు. లోపలనుంచి వంట మనిషి వచ్చి, “అయ్యగారు. నన్ను అరుస్తున్నారు. యింకా ఎందుకు కూడు పెట్టలేదని. రండి. లేకపోతే మరీ కోప్పడుతారు.” అంటూ నిష్టూరం ఆడింది. తనెందుకు భోంచెయ్యలేదో తనకు తెలుసు. లోపలి వెళ్ళాడు. కొడుకు లేడు. అలాగే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంతలో,” ఎందుకు అలా కూర్చుంటావు. తిని పడుకో.” అంటూ కొడుకు వచ్చాడు . తన చేతిలో ఉన్నది ముందుకు చాచాడు.
“ఏవిటది?” అంటూ తీసుకొని తెరిచి చూసాడు.” లడ్లు. ఎందుకు ఈ వయస్సులో ఇవన్నీ తినడం. బాగలేకుండా వస్తే ఎవరు చూసుకుంటారు?” అన్నాడు విసుగ్గా.
“ఈ రోజు నీ పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం..!”
ఆశ్చర్యంగా తండ్రిని చూస్తూ,” నా పుట్టిన రోజా? సద్గుణ కూడా అనలేదే, కనీసం ధనుంజయ కూడా మరిచిపోయాడేవిటి? వాడెప్పుడూ ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీ, నాలుగు బీర్లు లేనిదే కదలడు. ఓహ్! అద్భుతంగా ఉంటుంది.” అంటూ మురిసిపోతూ అన్నాడు.
అంతలోనే కఠినంగా మారిపోతూ,” ఎవరు తెచ్చిచ్చారు?’ తండ్రి కళ్ళల్లోకి చూసాడు.
వంట మనిషి భయపడుతూ, “ అయ్యగారే ఎల్లారయ్యా రిక్షా ఎక్కి.” అంది.
“రిక్షాలో ఎవరు పొమ్మన్నారు. పది మంది చూస్తే ఏవనుకుంటారు? యాక్సిడెంట్లు జరిగితే మమ్మల్ని చంపుకు తినడానికా!” అని విసుక్కుంటూ అవి టేబుల్ మీద పెట్టి మేడ మీదకు వెళ్లి పోయాడు.
మరి తనను బయట పెట్టాడే, దాన్ని ఏమీ అనుకోరా? బీర్లు నేను తెచ్చి ఇవ్వలేను కదా అని అనుకుంటూ, ఆ రోజుల్లో వాళ్ళ అమ్మ ఎంత హంగామా చేసేది. లడ్డు అంటే చాలా ఇష్టం కొడుక్కి అని ఊరంతా పంచేది. మరిచిపోయాడు!!.
“అన్నం తినండయ్యా.” అని వంట మనిషి చెప్పేంత వరకు తనలో ప్రాణం ఉన్న సంగతి గుర్తు రాలేదు కోదండరామయ్యకు. వచ్చి పడుకున్నాడే గాని నిదుర పట్టలేదు. మనవడికి పద్నాలుగు సంవత్సరాలకే అలవాట్లు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు పదహారు. ఇంజినీరింగ్ బోలెడు డబ్బుకట్టి చేర్చారు. ఇంటికి ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడో రోజూ చూస్తూ దిగులు పడిపోతున్నాడు. కొడుకుతో చెప్పాలనుకొని, భయపడి గమ్మన ఉండిపోతున్నాడు. మా నాన్న పెంపకం వలనే ఇప్పుడు ఇలా ఉన్నాను అని, కొడుకు అందరికి చెప్పుకుంటూ ఉంటే విని పొంగిపోయేవాడు కోదండరామయ్య.
మీరు చెప్పినట్టే నాన్నగారు, మీ ఇష్టం నాన్నగారు అని ఒదిగి ఒదిగి అనే కొడుకు, పెండ్లికాగానే మార్పు, మనవడు పుట్టగానే ఇంకా మార్పు. డబ్బుకూడే కొలది బంధం, అనుబంధం, ఆత్మీయత అనురాగాలు, నామరూపాలు లేకుండా పోతాయా? నేడు అది సహజమే కదా అని అసంతృప్తితోనే సరిపెట్టుకునే వాడు. భార్య ఉండగానే కొన్ని కోట్ల కాంట్రాక్టు చెయ్యాలని ఆస్తి అంతా తన పేరు మీద రాయమని బ్రతిమాలింపుతో మొదలయ్యి, బెదిరింపు వరకు వెళ్లి, ఇవ్వనంటే చావుకు సిద్దపడ్డాడు కొడుకు. తన భార్య నిద్రాహారాలు మానేసింది.
'అలా చెయ్యకూడదు. మనం బ్రతికున్నంత వరకు మన మీదనే ఆస్తి ఉండాలి' అని ఎంత చెప్పినా భార్యను సముదాయించలేక పోయాడు. విధిలేక, పోనీ ఖర్చు చెయ్యడు, ఎదగాడానికే కదా అని రాసిచ్చాడు కోదండరామయ్య.
అది చేయరాని తప్పు అని ఇంట్లో నుంచి బయట పెట్టే వరకు తన భార్యకు తెలియలేదు. అప్పుడేడిచి ఏం ప్రయోజనం. అనుభవించాల్సిందే తప్పదు ! కోడలి పేరు సద్గుణే కానీ ఎంత వెతికినా సద్గుణం ఒక్కటి కూడా కనిపించదు. ఎక్కడలేని అహంకారం,అహంభావం. జరుగుతున్నదంతా కూడా ఆమె పనే అని తెలుసు. కానీ ఎదురించలేరు. అడగలేరు. ఆ దిగులుతోనే భార్య దాటుకుంది. మనవడు అడ్డంగా ఎదుగుతున్నాడు. చిన్నప్పుడు చిలిపి పనులు చూసి మురిసిపోతాం .పెద్దయ్యాక కరువైపోయిన సంతోషం కోసం దేవులాడుతాం.
తనకెందుకని బాధ్యతారహితంగా చూస్తూ ఉండకూడదు. గాడి తప్పితే గడ్డి కూడా మిగల్చడు. మిమ్మల్ని తగలపెడతాడు, అని చెప్పాలని చాలా రోజులనుంచి మనసులో ఉంది. తనకు తెలిసి, తాగి విలువైన కార్లు ప్రమాదాలలో పాడు చేసాడు. చెప్తే , "బీమా కడుతున్నాముగా ! డబ్బు పారేస్తే పోతుంది. ఈ వయసులో కాకపోతే మరే వయస్సులో చేస్తారు. పొరపాట్లు జరుగుతుంటాయి. నీలా సైకిల్ కొనిమ్మంటే పడితే దెబ్బలు తగులుతాయని నానా మాటలు మాట్లాడి కొట్టబోయావు. నన్నూ చెయ్యమంటావా?” అని కొడుకు కసురుకున్నాడు. నోరుమూసుకున్నాడు కోదండరామయ్య.
బయట తగువులు. ఎంత మంది ఆడ పిల్లల్ని ఇంటికి తీసుకు వచ్చాడో! అమ్మ, అబ్బా ఒక్క మాట అనేవారుకాదు. కోదండరామయ్య అశాంతితో, అవమానంతో కృంగి పోయేవాడు.
అడిగితే,” నువ్వు నన్ను చిన్నప్పుడు పొరపాటుగా ఏదో చేస్తే ఎలా కొట్టావు. మా అమ్మను ఎన్ని మాటలన్నావు. కనీసం వాడ్నయినా తన కోరికలను తీర్చుకోనీ. నీకెందుకు కడుపుమంట.”అని కొడుకు అసహ్యంగా మాట్లాడుతూ కోదండరామయ్య ను చీదరించుకుంటూ చూసే వాడు. ఇంత కక్ష, ద్వేషం, అసహ్యం పెట్టుకోనున్నాడా ఇన్ని సంవత్సరాలు, అని ఆశ్చర్యపోయి, నోటమాట వచ్చేది కాదు కోదండరామయ్యకు. ఎన్నో సార్లు ఇంట్లోంచి వెళ్లి పోవాలనుకున్నాడు. అలా చేస్తే కొడుక్కు అవమానంకదా అని వెనకాడే వాడు కోదండరామయ్య.
ఎప్పుడు నిదురపోయాడో ఏమో, అరుపులకు మెలుకువ వచ్చింది. వింటే, లోపల తండ్రి , కొడుకు, అమ్మ గట్టిగా వాదించుకుంటున్నారు. అది మామూలే అనుకున్నా పడుకోలేక పోయాడు. లోపల అరుపులు తగ్గలేదు. వెళ్లి సర్దుదామంటే భయం. ఎక్కువ అవుతూనే ఉన్నాయి. వింటూ ఉండలేక పోయాడు. తలుపు దగ్గరగా వచ్చేసరికి మనవడు విసురుగా తలుపులు తోసుకుని, అడ్డున్న కోదండరామయ్య వైపు ఒక్క ఉరుము ఉరిమి, తిట్టుకుంటూ ఒక్క తోపు తోసాడు.
అతని వెంటనే కొడుకు వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నా, కారెక్కి వెళ్ళిపోయాడు. కారు వెళ్ళిన వైపే కాసేపు చూసి గాఢనిట్టూర్పు వదిలి ,” దున్నపోతులాగా పెరిగాడు.” అంటూ తండ్రి వైపు చూసి లోపలికి వెళ్ళాడు రాంగోపాల్. 'పెంచింది ఎవరంట?' అనుకొని లోపలికి వెళ్లి అసలు విషయం ఏవిటో తెలుసుకుందామని వెనకాడుతూ నిలుచున్నాడు. లోపల భార్యా భర్తలు మళ్ళీ గొడవ పడుతున్నట్లు అనిపించి, విధిలేక వెనుతిరిగాడు.
రెండు మూడు రోజులు రాత్రి పూట ఇదే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వింటూ నలిగి పోయాడు కోదండరామయ్య. మరుసటి రోజు తెగించి వెళ్ళాడు. భార్యా భర్తలు ఇద్దరూ కూర్చుని ముఖాలు మాడ్చుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ కాఫీ ముందు పెట్టుకుని ఉన్నారు. వెళ్లి దూరంగా కూర్చున్నాడే గాని పలకరించడానికి ధైర్యం చాల్లేదు.
కన్న కొడుకు దగ్గర కూడా ఇంత భయపడాలా ? చిన్నప్పుడు పిల్లిని ,పుల్లను చూసి అదిరిపోతూ పరుగెత్తుకు వచ్చి అతుక్కుపోయేవాడు. మరి వాడి దగ్గర భయపడటం ..? కోడలు అసలు చూడలేదు.
కొడుకు ముభావంగా తిరిగి చూసి,” ఎందుకొచ్చావు? వెళ్లి పడుకో.” అని కసిరాడు. ధైర్యం చేసి, ” ఎదిగిన బిడ్డ ! చూసీ చూడనట్లు.. మరీ దురుసుగా, ఈ కాలంలో...!” మధ్యలోనే నిలిపేసాడు.
”నోరు మూస్తారా! మీ కొడుక్కి చెప్పండి. ఎదిగిన కొడుకుతో ఎలా ప్రవర్తించాలో! అంత పెద్ద బిడ్డను కొట్టబోవటం ఏవిటి. నోటికి ఎంత వస్తే అంత బండ బూతులు తిట్టడం ఏవిటి?” ఈసడించుకుంది సద్గుణ.
తన కొడుక్కి తను నేర్పలేదే! ఎప్పుడు నేర్చుకున్నాడు అని ఆశ్చర్యంగా రామగోపాల్ని చూసాడు కోదండరామయ్య.
“అంతా నీ మూలంగానే ! నువ్వు ఆ రోజు డబ్బులు అడిగితే నన్ను కొట్టావు. అబద్దాలు చెప్తే తిండి పెట్టకుండా చంపావు. సినిమాకు పోయి వస్తే ఇంట్లోకి రానివ్వక రాత్రంతా చలిలోనే పడి చచ్చేటట్లు చేసావు. వయసులో అనుభవించాలంటే, నాకూ మా అమ్మకు నరకం చూపించావు. నేను బ్రతికింది ఒక బ్రతుకా! బానిసకంటే హీనంగా చూసావు. ఇప్పుడు వాడు చేస్తుంటే చూసి నా అసంతృప్తిని పూడ్చుకోవాలనుకున్నాను. కానీ... ఈ విధంగా...? ఇదిగో ఉందిగా ఈ బ్రహ్మరాక్షసి, కొడుకు మీద మాట పడనివ్వదు.”
“వాడేం జల్సాకు అడిగాడా! అది ఎంత, పదికోట్లు. కంప్యూటర్ల వ్యాపారం చెయ్యాలి. డబ్బు తన పేరు మీద మార్చమన్నాడు. సంపాదించేది ఎవరికోసం?”
“ తగల పెడతాడు. వీధుల్లో పెడతాడు.” కోదండరామయ్య వైపు తిరిగి,” పద్ధతి, క్రమశిక్షణ అంటూ నన్ను కట్టి పడేసావు. చిన్న కోరికలు కూడా తీర్చుకో నివ్వలేదు. దాని వలన నేను ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నానో.? వాడ్నయినా స్వతంత్రంగా వదిలేద్దాం అనుకుంటే మొదటికే మోసం! అంతా నీ మూలంగానే” కోదండరామయ్యను ఒక్క అరుపు అరిచాడు.
తనను ఎందుకు తిట్టాడో అర్ధంకాలేదు కోదండరామయ్యకు. క్రమశిక్షణతో పెంచబట్టేకదా ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగాడు. పదిమందిలో గౌరవంగా బ్రతుకుతున్నాడు. విస్తుపోయి చూస్తున్న కోదండరామయ్యను చూసి, జుట్టు పీక్కుంటూ,” ఇదిగో ఈ తెలివి తక్కువ దాని సపోర్టు చూసుకుని మరీ నెత్తి మీద కూర్చుంటున్నాడు. ” అన్నాడు భార్యను అసహ్యంగా చూస్తూ రాంగోపాల్.
“నోరు మూసుకోండి. నిన్ను పెంచిన నీ అబ్బను అనండి. నన్ను నా కొడుకుని అంటే చంపుతాను. వాడేమీ తప్పులు చెయ్యడం లేదు. అవన్నీ రాజసం, ప్రతిష్ట. అడుక్కుతినే వంశంలో పుట్టినోళ్ళు కదా ఏం తెలుస్తుంది. పెంచినాడు మహా! ” కోదండరామయ్య వైపు తిరిగి ఉమ్మి ఊసింది కోడలయిన సద్గుణ.
ప్రతిసారి తననెందుకు ఇందులోకి తీసుకువస్తున్నారో అర్థం కాలేదు కోదండరామయ్యకు. కొడుకు లేచి ఆమె మీదకు కొట్టడానికి వెళ్ళాడు. కోదండ రామయ్యకు ఏం చేయాలో తోచలేదు. గబుక్కున లేచి కోడలికి అడ్డు నిలుచున్నాడు. చూడలేని భరించలేని సంఘటన! వెనకాముందు చూడక, స్త్రీ అని కూడా మరిచిపోయి వినరాని మాటలు అంటూ జుట్టుపట్టుకుని లాగి కొట్టాడు.
ధీటుగా మొగుడు దెబ్బలకు పది గుద్దులు ఎక్కువ గుద్దుతూనే ఉంది. ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా? ఇలాగేనా వాళ్ళు సంసారం చేస్తున్నది.?
విస్తుపోయి చూస్తున్న కోదండరామయ్యను ఆ పెనుగులాటలో దూరంగా తోసారు . ఈ లోగా మనవడు ధనుంజయ లోపలికి రావడం, తండ్రి మీద ఎగిరి దూకటం ఒకేసారి జరిగాయి. ఇదేవిటిది ఆగర్భశత్రువుల్లాగా! మాటలు పోయి చేతల దాకా వచ్చింది. ఇక లాభం లేదని, లేచి వాళ్ళిద్దరి మధ్య నిలుచుని, లేని శక్తి తెచ్చుకుని సర్దడానికి ప్రయత్నించ సాగాడు కోదండరామయ్య . ప్రక్కకు తోసి చేతికి యేది దొరికితే దాంతో
కొట్టుకోసాగారు.
రాంగోపాల్ క్రింద పడిపోయాడు. మనవడు పైన ఎక్కి కొట్టడం చూడలేక కోదండరామయ్య వెళ్లి మనవడ్ని దూరంగా లాగి అడ్డు పడుకున్నాడు. ధనుంజయ ఇద్దరినీ కొట్టసాగాడు. తండ్రిని దూరంగా తోసి రాంగోపాల్ పైకి లేచి కొడుకు గొంతు పట్టుకున్నాడు. ధనుంజయ మరీ రెచ్చి పోయి చేతిలో ఉన్నదానితో బలంగా తల మీద మోదాడు. అంతే రాంగోపాల్ నేల మీద ఒరిగి పోయాడు. అదేం మృగత్వపు కసో అప్పటికీ ఆగలేదు. కొడుతూనే ఉన్నాడు. పనోళ్ళు వచ్చి పట్టుకుని దూరంగా తీసారు. వాళ్ళను తిడుతూ విసురుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ధనుంజయ. అది చూసి పాక్కుంటూ వెళ్లి కోదండరామయ్య కొడుకును లేపడానికి ప్రయత్నించాడు అయినా కదలలేదు నెత్తికోట్టుకుంటూ ఏడుస్తూ కొడుకుని కౌగలించుకుని పడిపోయాడు.
అందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్ళే లోగా మనవడితో పోలీసులొచ్చారు. కోడలు, మనవడు ఏం చెప్పారో ఏమో కోదండరామయ్యను అరెస్టు చేసి తీసుకు పోయారు. అర్ధమే కాలేదు! గుండెలు పగిలేలా ఏడుస్తూ కొడుకు ఏమయినాడో తెలియక, తనెందుకు పోలీసు స్టేషన్లో ఉన్నాడో తెలియక, పిచ్చి పట్టిపోయింది. నాలుగు రోజులు నిద్రాహారాలు గుర్తే రాలేదు. అక్కడున్న పోలీసులను అడిగితే కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడని దానికి కారణం తానే అని చెప్పేసరికి కూలబడిపోయాడు.
కోర్టులో హాజరు పరిచారు. కోడలు, మనవడు, సాక్షాలు చెప్పారు. రాంగోపాల్ కోమాలో ఉన్నందువలన తీర్పు వాయిదా వేస్తూ మళ్ళీ రిమాండులో ఉంచమని తీర్పు ఇచ్చాడు.
కోదండరామయ్య జడ్జిని ఎంతో బ్రతిమలాడుకున్నాడు, ఒకసారి కొడుకుని చూడ్డానికి అవకాశం కల్పించమని. అతని గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు.
మనవడు వృద్దిలోకి రావాల్సిన వాడు. తప్పు అతని మీద చెప్పితే భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ కాస్తోకూస్తో భయపెట్టకపోతే అదుపు తప్పిపోతాడు. బయటకొస్తే కొడుకును ఏం చేస్తాడో ? మార్పు వస్తుందా? వాళ్ళిద్దరూ మళ్ళీ సంతోషంగా ఉంటారా?
కొడుకుని చూడలేకపోతున్నాను అనే బాధకన్నా, ఈ ఆలోచనలు గుండెల్ని పిండేయసాగాయి. ఎవరితో మాట్లాడటం లేదు. పూర్తిగా తిండి మానేసాడు. కొడుకు వస్తాడు. తనను తీసుకెళతాడు ఇదే కలవరం అయిపోయింది. కాస్త బాగున్నాడు అని విని భోంచేసాడు కోదండరామయ్య.
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. కోర్టు నిండా జనం. కొడుకు కోసం ప్రతి అణువు గాలిస్తున్నాయి కోదండరామయ్య కళ్ళు. చూడాలని తపించి పోతుంది మనసు.
కొడుకు వచ్చాడు. బాగున్నాడు అని సంతోషంతో కన్నీళ్లు కారిపోయాయి. కొడుకు ఏం చెపుతున్నాడో వినలేదు. మైమరచి చూస్తూ ఉండిపోయాడు. కోర్టు పని అయిపోయింది. సాక్ష్యం విని నిర్ఘాంతపోయారు జనం.
రాంగోపాల్ ఇంటికొచ్చి కారు దిగుతూ ప్రక్కకు చూసాడు. వాచ్మాన్ అతని భార్య వాలు కుర్చీ దగ్గర కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తునట్లు కనిపించింది. బోసిగా ఉన్న వాలు కుర్చీని చూసి కన్నీళ్లు పొంగుకోచ్చాయి. దుఃఖం పెల్లుబికింది. 'తను చేసింది, చేయరాని నేరం. మన్నింపు లేదు. ప్రాయశ్చితం చేసుకోవాలి, శిక్ష అనుభవించి తీరాలి' అని కుమిలిపోతూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు.
ఆ రోజునుంచి దారిన పోయే వాళ్ళు నిలిచి మరీ ఆ ఇంటి వైపు చూసి పోతున్నారు. మరుసటి రోజు రాంగోపాల్ కనిపించడం లేదని భార్యా, కొడుకు చాలా ఆత్రుతగా హడావిడిగా ఉండటం కనిపించింది. అప్పుడు మాత్రమే చూసారు, కార్లు తీసుకెళుతున్న భీమా వాళ్ళతో, పోలీసులతో వాదిస్తూ రాంగోపాల్ భార్యను కొడుకుని! తరువాత వాళ్ళను ఎవ్వరూ చూడలేదు. ఎక్కడకు వెళ్ళారో తెలియనే తెలియదు. కొంత కాలానికి ఆ ఇంటి ముందు కోదండరామయ్య వృద్దాశ్రమం బోర్డు కనిపించింది. ఆస్తి, డబ్బు అంతా అనాధ శరణాలయాలకు, ఆశ్రమాలకు రాంగోపాల్ రాసి ఇచ్చేసాడని చెప్పుకుంటున్నారు జనం .
*** శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.. నమస్తే ! నా కధ ప్రచురణకు నోచుకున్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. నా గురించి గొప్పగా ఏమీ లేదు. సాహిత్యం అంటే మక్కువ. ప్రయోగాలు చెయ్యాలని అభిలాష. చాలా సంవత్సరాల ముందు కధలు రాసేవాడిని. అన్నీ కూడా ఆంధ్రప్రభ, ఆంద్ర జ్యోతిలలో ప్రచురితమైనవి. కొన్ని కారణాల వలన సాహిత్యానికి దూరం అయినాను. 2010 నుండి నవలలు, భావకవితలు రాయడం మొదలుపెట్టాను. మరో హృదయం-మరో ఉదయం{నవల} ,గీతాంజలి అనువాదం, నీకోసం అనే భావకవిత్యం, చీకటిలో మలివెలుగు {నవల} ప్రచురించడం జరిగింది.
コメント