వంద కోట్లు

'Vanda Kotlu' written by P. Chandra Sekhar Azad
రచన : P. చంద్ర శేఖర ఆజాద్
“రాఘవ వందకోట్లు సంపాదించాడు తెలుసా?” అన్నాడు మూర్తి.
అతను ఎంతో కొంత సంపాదించి ఉంటాడని నాకు తెలుసు. వంద కోట్ల రూపాయలంటే చిన్న విషయం కాదు. మనుషులు ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు. ఇందులో ఎగ్జాగరేషన్ ఉందనుకున్నాను. “మంచిదేగా!” అన్నాను.
“ఎవరికి?!” అని మూర్తి వెళ్లిపోయాడు.
ఇలా అన్నాడేంటి... ఎవరికి మంచిదంటే రాఘవకి వాడి కుటుంబానికి అనుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు సంపాదించినా అంతేకదా!
ఇది అయిదు దశాబ్దాల క్రితం మొదలయిన కథ.
రాఘవ జీవితం మలుపు తిరిగినప్పుడు మేం ఆశ్చర్యపోయాం. దిగులుగా అనిపించింది. ఎనిమిదో తరగతి మధ్యలో చదువు ఆపేశాడు. వాళ్ల అన్నయ్య వాడిని ఓ చెప్పుల షాపులో చేర్పించాడు. అప్పటిదాకా వాడు జల్సాగా బతికాడు. నా చిన్ననాటి మిత్రుడు.
తీరిక దొరికినప్పుడు వాడు మా తాటాకుల ఇంటి దగ్గరే ఉండేవాడు. మా మైదానం విశాలమైంది. అక్కడ వేప, చింత చెట్లు ఉండేవి. నా కంటే ఓ సంవత్సరం పెద్దవాడు. నన్ను సినిమాలకు తీసుకు వెళ్లేవాడు. పూసమిఠాయి కొనిపెట్టేవాడు. నాకు చెట్లు ఎక్కటం, వాళ్ల రైస్ మిల్లు నుండి సైకిల్ తీసుకొచ్చి నేర్పింది వాడే. అది కిందపడి వంకర్లు పోతే సరిచేసింది వాడే. గాలి పటాల నుండి, గోళీల నుండి, దీపావళి, వినాయకచవితి పండుగలకి ఊరంతా తిప్పింది వాడే.
రాఘవకి రాని విద్య లేదు.చదువులో కాస్త వెనక ఉండేవాడు.వాళ్ల నాన్న చనిపోవటంతో రాఘవ జీవితం తిరగబడింది. పెద్ద స్థలంలో ఇంటిని కట్టించాడు వాళ్ల నాన్న. నేను చాలా సార్లు అక్కడికి వెళ్లాను. తర్వాత తెలిసింది. వాళ్ళ నాన్న అప్పులు చాలా చేశాడంట. మిల్లు అమ్మేశారు.
ఇల్లు మాత్రం ఉంది. వాళ్ల అన్నయ్య చదువు వద్దని ఈ పని చేసాడు. అందుకు రాఘవ ఎంత దుఖపడి ఉంటాడో! మా పరిస్థితి మరింత దారుణం. ముందుగా చనిపోయింది మా నాన్న.
నేను అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాను. నిజానికి నేను చదువు మానేసి పనిలో చేరాలి. మహా అయితే ఇంకో రెండు సంవత్సరాలు నేను బడికి రాగలనేమో అనిపించేది. అప్పటి నుండి రాఘవని కలుసుకోవటం అరుదయింది - ఒకే ఊర్లోవున్నా.
నాకయితే రాఘవ అన్నయ్య మీద కోపం వచ్చింది. ఇంటి దగ్గర తిని బడికి వెళ్లటం. ఫీజులు లేవు. పుస్తకాలు కూడా సెకండ్ హ్యాండ్ వి తీసుకోవచ్చు. వాడి భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు అనుకున్నాను.
ఆ తర్వాత రాఘవ చెప్పుల షాపుని రెండు సంవత్సరాల్లో తనే తీసుకున్నాడు. ఓనర్ ఇంకో వ్యాపారానికి వెళ్లాడు. దీపావళి రోజుల్లో మందు గుండు సామాను అమ్మేవాడు. మిత్రుల్లో కొందర్ని ఆ వారం రోజులూ రమ్మని వారి సాయం తీసుకునేవాడు.క్రమంగా రాఘవలో బాల్యం ఎగిరిపోయింది. అక్కడ వ్యాపారాలన్నీ వైశ్యులవి. వారికి పుట్టుకతోనే వ్యాపారం అలవడుతుంది. అలాంటి వారికి క్లాసులు తీసుకుంటున్నాడని చెప్పుకునేవారు.
నేను పదో తరగతితో చదువు మానేసాను.రకరకాల ఉద్యోగాలు, చివరికి ఓ కిళ్ళీ కొట్టులో చేరాను. అది మా ఓనర్ నాకు ఓ సంవత్సరం తర్వాత యిచ్చి నడుపుకోమన్నాడు.
అవి మా యవ్వనపు రోజులు. రాఘవకి సినిమాలంటే పిచ్చి. వాడు నాకు పదో తరగతి పరీక్షలు
మొదలవుతుండగా వచ్చి విజయవాడ బలవంతంగా తీసుకెళ్లి, అప్పుడే మొదలయిన న్యూవేవ్ ‘A’ సినిమాకు తీసుకు వెళ్లటం నేను మరిచిపోలేను.
నా నేపథ్యం వేరు. మా నాన్న కమ్యూనిస్టు. అందుకని మా ఊర్లో జరిగే మీటింగులకి హాజరు అవటం, కొన్నిసార్లు ఇతర ఊర్లు వెళ్లి పాటలు పాడటం, చిన్న చిన్న ఉపన్యాసాలు ఇవ్వటం చేస్తూ షాపుని పట్టించుకోవటం మానేసాను. అప్పులపాలయ్యాను. అప్పుడు మా అమ్మ తన దగ్గర మిగిలిన బంగారు గాజులు తాకట్టు పెట్టమని అంది. అప్పుడే రాఘవ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. నేను అవి తీసుకుని అప్పు ఇవ్వమన్నాను. నాకు రెండు వేలు కావాలంటే ముందు వెయ్యి యిచ్చాడు.
రెండు రూపాయల వడ్డీకి. అవి ఏ మాత్రం చాలవు. మళ్లీ మళ్లీ వెంటబడితే "చూస్తున్నావుగా ఎంత టైట్ గా వుందో... ఇంకో అర్థరూపాయి వడ్డీ పెంచు'' అన్నాడు.
అప్పుడు షాకయ్యాను.
“ఇది ముందుగా చెబితే బాగుండేదిరా"'' అన్నాను బాధగా. వాడు నిన్నటి రాఘవ కాదని అప్పుడే నాకు అర్థం అయింది. నాకు అదే సమయంలో జ్ఞానోదయం అయింది.
దేశాన్ని మార్చటం కంటే బతకటం ముఖ్యం. ముందు మా బతుకులు మారాలి అని ఆ గాజులమ్మేసి, ఆ ఊరి నుండి పొట్ట చేత్తో పట్టుకుని వలస వెళ్లిపోయాను.
తర్వాత తెలిసింది రాఘవ కూడా మా ఊరు వదిలి భాగ్యనగరం చేరుకున్నాడని! అదీ వాళ్ల అన్నయ్య ఇంకో సారి తీసుకున్న నిర్ణయం.
కనీస జీవితం కోసం చేస్తున్న నా ప్రయాణంలో ఎన్నెన్నో మలుపులు, సంఘటనలు. అవన్నీ నేను ఆత్మకథగా రాసుకోవాలి. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే అది నేను రచయితగా మారటం. నేను కూడా హైదరాబాద్ నగరానికి చేరుకున్నాను-అనేక ఊర్లు తిరిగాక అప్పుడు రాఘవ ప్రస్థానం గురించి తెలిసింది.
ఇక్కడకి వచ్చాక ముందు కిరాణా కొట్టుతో మొదలయ్యాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు మిత్రులతో కలిసి ఊరు చివర చవకగా భూమి కొన్నాడు. రెండు సంవత్సరాలు తిరిగే సరికల్లా అక్కడ డిమాండ్ పెరిగింది. ముగ్గురూ కలిసి ఆ స్థలంలో అపార్ట్ మెంట్స్ కట్టటం మొదలు పెట్టారు. అది ఊహించిన దానికంటే బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత వాడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇద్దరు మిత్రులు నలుగురు అయ్యారు. పది మంది అయ్యారు. వీరందరిది ఒకే సంస్ధ కాదు. నాలుగు సంస్థలు. అన్నింటిలోనూ కామన్ గా ఉండేది రాఘవ ఒక్కడే. మంచి మంచి సెంటర్లుగా ఎదుగుతాయి అన్నప్పుడు స్వయంగా స్థలాలు కొన్నాడు.
అతను తాము కట్టిన ప్రతి అపార్ట్ మెంట్లలో తన వాటాను అమ్మేవాడు కాదు. వాటిని తనే ఉంచుకుని రెంట్ కి యిస్తాడు. అలా నాకు తెలిసేటప్పటికి ముఫై ప్లాట్స్ ఉన్నాయి. బట్టల నుండి బంగారం షాపుల వారికి భవనాలు రోడ్డు పక్కన, అందులోనూ హైవేలో కట్టిస్తున్నాడు. వాటి అద్దెలు కొన్ని లక్షల్లో వస్తుంటాయి. అదలా ఉంటే, రాఘవని నేను చూసేటప్పటికి గోధుమ వర్ణం ఫ్యాంట్ షర్టు తొడుక్కుని ఉన్నాడు. అది వాడి డ్రెస్ కోడ్. మామూలు కారే ఉంది. నిరాడంబరంగా ఉండాలి అన్నాడు. చిన్నప్పుడు బాల భీముడిలా ఉండేవాడు. ఆ తిండి కూడా అంతే. ఇప్పుడు పిట్ట తిండి. నాకు ఆశ్చర్యం కలిగింది.
“సంపాదన పెరిగాక తిండి తగ్గించావా?" అన్నాను.
''అదేం కాదురా. ఇప్పుడు మనకి షుగరూ, బీపీ వచ్చాయి. ఇది వరకటిలా తింటానికి లేదు" అన్నాడు.
“మనకి అనకురా. నీ అంత డబ్బూ, జబ్బూ కూడా నాకు రాలేదు'' అన్నాను. 'అదృష్టవంతుడివి'
అంటాడనుకున్నాను. అలాంటిదేం లేదు. కొంత మందికి కొన్ని గమ్యాలు ఉంటాయి. టైమ్స్ మేగజైన్ లో తన ముఖ చిత్రం రావాలని, ప్రపంచ కుబేరుల పది స్థానాల్లో తన పేరు ఉండాలని. రాఘవకి కూడా అంత స్థాయిలో కాకపోయినా రాష్ట్రస్థాయిలో కోటీశ్వరుల లిస్ట్ లో ఉండాలని, తన సక్సెస్ స్టోరీ గురించి పత్రికల్లో రాయించుకోవటం, టీ.వీ.ల్లో కనిపించటం లాంటి సరదా ఉందనుకున్నాను.
“నాకు అలాంటిది లేదు" అని వాడు స్పష్టంగా చెప్పాడు. మన గురించి బయటకు తెలియకూడదు. అందరి కళ్లూ, నోళ్లూ మంచివి కాదు అన్నాడు. నన్ను అయిదు నిముషాలు కాస్త ప్రేమగా చూసాడు. అప్పుడు పాత రాఘవ వాడిని ఆవహిస్తున్నాడు అనుకున్నాను.
“నువ్వు కథలు రాస్తున్నావంటగా"' అన్నాడు.
“ఏదోలేరా ... చిన్న చిన్న కథలు" అన్నాను.
“నీలాంటి వారికి అసలు చెప్పకూడదు" అన్నాడు.
ఇద్దరం నవ్వుకున్నాం. ఇప్పటికీ వడ్డీలకు డబ్బులు ఇస్తున్నావా అని నేను అడగలేదు. కానీ అది మానడని నాకు తెలుసు.
మా మిత్ర బృందంలో కొంత మంది హైదరాబాద్ చేరిపోయారు. అందరి సమాచారాలు తెలుస్తున్నాయి. అందులో కిషోర్ అనే ఓ మిత్రుడు సమావేశం ఏర్పాటు చేస్తే, పదిహేను మంది చేరుకున్నాం. అందులో డాక్టర్లు, రెవిన్యూ ఉద్యోగులు, నేను (అనగా ఓ చిన్న రచయితని), కాంట్రాక్టర్లు, ఇలా కలుసుకుని, ఆనాటి రోజుల గురించి, మిత్రుల గురించి మాట్లాడుకున్నాం. రాఘవ వస్తానన్నాడు గాని రెండు చోట్ల శ్లాబులున్నాయి ఇంకో సారి కలుద్దాం అని ఫోన్ చేశాడు.
"మన చంద్రంగాడు పదో తరగతితో ఆపేశాడు. అయినా కథలు రాస్తున్నాడు. మా ఇంట్లో వాడికి
అభిమానులున్నారు. ఇంక రాఘవ ఎనిమిదో తరగతితో మానేసి పెద్ద బిల్డర్ అయ్యాడు. దీని అర్థం ఏమిటంటే పేరు తెచ్చుకోవాలన్నా-డబ్బులు సంపాదించాలన్నా చదువు మధ్యలో ఆపేయాలి'' అని మూర్తి జోకు.
నేను కూడా మనసారా నవ్వుకున్నాను.
రాత్రి రాఘవ ఫోన్ చేసి అడిగాడు “నిన్న ఏం మాట్లాడుకున్నార్రా?".
''అందరూ నీ గురించి మాట్లాడుకున్నారు. చదువుకోకపోయినా నువ్వు బాగా సంపాదించావని'".
“చదువు ఎందుకురా. చదువుకున్న వారు మన దగ్గర పని చేస్తున్నారు" అన్నాడు గర్వంగా.
“నన్ను కూడా, నువ్వు పెద్ద చదువు చదవకపోయినా పేరు తెచ్చుకుంటున్నావు కథలు రాసి అన్నారు" అన్నాను.
''మనం హీరోలం రా" అన్నాడు.
అప్పటి నుండి వాడికి తీరిక దొరికినప్పుడల్లా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి పండగలని, మా పనులని గుర్తు చేసేవాడు. వాడికి ఒకటే కూతురు, ఓ మనవరాలు. వాళ్లు రెండు మూడు సంవత్సరాలకు అమెరికానో, లండనో వెళ్లేవారు. అల్లుడు ఐ.టి ప్రొఫెషనల్, వాళ్ల అమ్మాయి రాఘవలానే ఎక్కడికి వెళ్తే అక్కడ బిజినెస్ చేసేది.
ఇక్కడ చిన్న మతలబు ఉందని మూర్తిగాడు చెప్పాడు. 'రాఘవగాడు ఎంత సంపాదించినా పిల్లలకు ఇవ్వడు. మేనేజ్ మెంట్ వాడి దగ్గర ఉండాల్సిందే. వాళ్ల అల్లుడికి మహా అయితే నెలకు రెండు లక్షల రూపాయల శాలరీ వస్తుంది. వీడు అతన్ని పక్కనుంచుకుంటే, ఇంకో వెంచర్ చేస్తే దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అయినా ఆ పని చేయడు’ అన్నాడు.
ఇంకో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవ నెల రోజులు మంచం మీద పడ్డాడు అని తెలిసి చూడటానికి వెళ్లాను. 'సయాటికా' వచ్చిందంట. ఇంకా ఆరు నెలలు కదలటానికి కుదరదు అన్నారంట. అప్పుడు వాడి ముఖంలో బాధ చూడాలి.
''ఇంకా ఎందుకురా! నువ్వు ఈ పని మానేసి ఓ చోట కదలకుండా కూర్చునే వ్యాపారం చూసుకో'' అని సలహా ఇచ్చాను. ఇంకో రెండు వెంచర్స్ వున్నాయి. అవి అయ్యాక మానేస్తాను అన్నాడు. నెల తిరిగేటప్పటికి కుంటుకుంటూనే అయిదారు అంతస్థుల మెట్లు ఎక్కుతున్నాడు.
“నీకు ఇంత డబ్బు దాహం ఉందని నాకు తెలియదు" అన్నాను.
''అది దాహం కాదురా అలవాటు. అంబానీకి తక్కువ వుందా? రామోజీరావుకి తక్కువ వుందా? వాళ్లు ఇంట్లో కూర్చున్నారా? అక్కడి దాకా ఎందుకు - నిన్ను కథలు రాయవద్దు అంటే మానేస్తావా" అన్నాడు.
ఏం మాట్లాడగలం.
మాకు శ్యామ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఉమ్మడిగా.
“రాఘవా! నీ జీవితం పదిమందికి తెలియాలి. అందుకని మన చంద్రం గాడితో నీ జీవిత చరిత్ర రాయించు. నువ్వు చరిత్రలో వుంటావు. నీ మనవడు, మనవరాలు చదువుకుంటారు" అన్నాడు.
“దానికి సమయం వుందిరా" అన్నాడు.
"కనీసం వాడి పుస్తకాలు రెండు వేయించరా. నీకు అంకితం ఇస్తాడు. అలా అయినా నీ గురించి తెలుసుకుంటారు".
“సమయం వుందిరా"' అన్నాడు రాఘవ.
''ఇంతకూ నువ్వు వంద కోట్లు సంపాదించావా. నేను ఇన్ కమ్ టాక్స్ వారికి చెప్పను" అన్నాడు.
చిన్నగా నవ్వి అన్నాడు “ఇప్పుడు ఎంత సంపాదించినా నలభై శాతం గవర్నమెంటుకి కట్టాల్సి వస్తుందిరా" అని.
దీని మీద మా మూర్తి కామెంట్ - "నేను చెప్పిందాంట్లో అతిశయోక్తి లేదు కదా. వాడు ఇంకో వంద కోట్లు సంపాదించినా జీవిత చరిత్ర రాయించడు. నీ పుస్తకాలు ప్రచురించడు"'.
“నాకు వద్దురా... అది బలవంతంగా చేసినా రాఘవ ఆత్మ క్షోభిస్తుంది" అన్నాను.
రాఘవ జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని నేను అనుకోలేదు.
వాడికి కరోనా వచ్చింది. హాస్పటల్లో నాలుగు రోజులున్నాక చనిపోయాడు. అప్పటికి కూతురు, అల్లుడు ఇండియాకి వచ్చి ఉన్నారు. ఎవరినీ హాస్పటల్ కి రానీయలేదు. చివరికి దహన సంస్కారాలు వాళ్లే చేశారు. అదో విషాదం. ఇంకో డజను మందితో కలిసి ఏ గోతిలోనో పారేశారు. డెత్ సర్టిఫికెట్ మాత్రం చేతిలో పెట్టారు.
అసలు లాక్ డౌన్ లో ఇంటి నుంచి కదలటం లేదని, మధ్యలో ఫోన్ చేసినప్పుడు చెప్పాడు.
అది ఎత్తేయగానే తిరిగి వెంచర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ కరోనా వచ్చిందో, అద్దె డబ్బులు వసూలయి వచ్చినప్పుడు, డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే వచ్చిందో తెలియదు అని మిత్రుల కథనం.
ఓ రోజు నాతో అన్నాడు "ఇంత సంపాదించాను. అయినా ఇంట్లో ఎవరూ నాకు విలువ ఇవ్వటం లేదురా"అని.
మూర్తి అన్నట్లు... వంద కోట్లయినా వెయ్యి కోట్లయినా ఆ సంపాదన ఎవరికి మంచిది!
ఆత్మలున్నాయో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం రాఘవ ఆత్మ కరోనా చుట్టూ తిరుగుతుంటుంది.
- సమాప్తం -
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

రచయిత పరిచయం :
600 పైగా కథలు, 80 పైగా నవలలు, ఫీచర్స్, బాల సాహిత్యం, కవిత్వం, ఎ.ఐ.ఆర్., టి.వి. (సుమారు 5000 ఎపిసోడ్లు, సరదాగా అప్పడప్పుడు నటన. నాటికలు, నాటకాలు మరియు సినిమా మొదలైనవి.