top of page

వారసుడు


'Varasudu' written by Susmitha Ramana Murthy

రచన : సుస్మితా రమణ మూర్తి

ఆ కాలనీలో అందరి నోట-- ‘ పంతులు డాక్టర్ గారు ఆసుపత్రిలో తెల్లారే పోయారట! పాపం మంచి మనిషి! భూమ్మీద నూకలు చెల్లిపోయాయి! ‘

అందరూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ, వారి మంచితనం గుర్తు చేసుకుంటున్నారు.

వారి అసలు పేరు దివాకర్. పిల్లలకు పాఠాలు చెబుతుండటం వల్ల పంతులు గారు అయ్యారు.

తనకు తెలిసిన హోమియో వైద్యం చేస్తుండటం వల్ల డాక్టర్ అయ్యారు. ఉచితంగా చదువు చెబుతూ, మందులు కూడా ఉచితంగా ఇవ్వటంతో , ఆ కాలనీలో అందరికీ గౌరవనీయులు అయ్యారు.

ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసిన ఘనత వారి సొంతం.

సంతోషంగా ఎవరేమి ఇచ్చినా, ‘ డొనేషన్ బాక్స్ ‘ లో వేసి, ఆ డబ్బు

మందులు కొనడానికే వినియోగించిన మానవతా మూర్తి తను.

అలాంటి మహనీయుని చివరి సారి చూడడానికి, కాలనీ వాసులు, బంధువులు, స్నేహితులు వారి ఇంటి ముందు గుమికూడారు.

ఊర్లోనే ఉంటున్న కూతురు, అల్లుడు,వారి పిల్లలు హుటాహుటిన వచ్చారు.

కొడుకు, కోడలు, వారి పిల్లలు అమెరికాలో ఉన్నారు.

“జరగండి! …జరగండి!...” అంటూ ఎవరో పంతులు గారి పార్థివ శరీరాన్ని తీసుకు వచ్చి పడుకో బెట్టారు.

ఒక్కొక్కరు వచ్చి పూలు, పూల దండలు వేస్తూ, వారికి నమస్కారం చేస్తున్నారు.

కొందరు --షామియానా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వారు కూర్చోడానికి కుర్చీలు వేస్తున్నారు.

వెదురు బొంగులతో పాడె తయారుచేసి, దానిపై చాప పరిచి పూలు వేస్తున్నారు.

డప్పులు వాయించే వారు, ఓ ప్రక్క కూర్చున్నారు…..

ఏర్పాట్లన్నీ పద్ధతి ప్రకారం జరిగి పో తున్నాయి.

ఎవరు చేయిస్తున్నారో, ఎవరికీ తెలియటం లేదు.

పుట్టెడు దుఃఖంతో భార్య, కూతురు పంతులు గారి తల ప్రక్కన నిల్చున్నారు.

బంధు వర్గం ఏర్పాట్ల గురించి మాట్లాడు కుంటున్నారు.

“ కొడుకు వస్తాడంటారా?...తనే పరిస్థితిలో ఉన్నాడో ?”

“ వస్తే తను , రాకుంటే?...బంధువుల్లో ఎవరో ఒకరు తల కొరివి పెడతారు. “

“ అవునవును. కార్యక్రమం ఆపలేం కదా?...”

కొందరు దిన కార్యక్రమాల గురించి మాట్లాడు తున్నారు.

“ అబ్బాయి అమెరికా నుంచి రావడానికి వీలు పడదట!...కార్యక్రమం

వీడియో తీయించి పంపమన్నాడట!...”

ఓ ఆసామి తనకు తెలిసిన విషయం అందరికీ చెబుతున్నాడు.

“ పనులు వేగంగా కానీయండి. మధ్యాహ్నంలోగా తీసెయ్యాలి.”

పని చేస్తున్న వారిపై కేకలు వేస్తున్నారొకరు.

“మూడో రోజు చిన్న దినం, పదకుండో రోజు పెద్ద దినం చేయాలి.

మహానుభావులు మంచి రోజునే కాలం చేసారు. “

ఒకరు పంతులు గారి భార్యకు చెబుతున్నారు.

“ ఈ కార్యక్రమం అంతా పూర్తి అవడానికి ఎంత అవుతుందో?...”

“ చిన్న దినం,పెద్ద దినం నాటి భోజనాలకు, దానాలకు,

ఎంత తక్కువలో చూసుకున్నా రెండు లక్షలకు పైమాటే!...”

అనుభవజ్ఞులు చెబుతున్నారు.

“ అవునవును. కరువు రోజులు. ధరలన్నీ బాగా పెరిగి పోయాయి.

ఆ మాత్రంలో అయితే గొప్ప విషయమే! “

మరొకరి అభిప్రాయం అది.

“ అమ్మ గారూ! స్వర్గ వాహనం అక్కడ ఉంచాం ”

“ అమ్మ గారూ! వీడియో కార్యక్రమం ప్రారంభించాం.”

పనులన్నీ చకచకా చేస్తున్నారు.

బంధువులకు, అభిమానులకు అర్థం కాని విషయం ఒక్కటే!

ఈ తతంగం అంతా చాకచక్యంగా నడిపిస్తున్న వారు, ఎవరని!?...

‘ఎవరో ఒకరు నెత్తికి ఎత్తుకున్నారులే!...మనకు శ్రమ తప్పింది.’

బంధువులు లోలోపల సంతోష పడ్డారు.

ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు—పంతులు గారి భార్య.

కూతురు, అల్లుడు కూడా అందరిలాగే విషయం అర్ధం కాక ఆశ్చర్యపోతున్నారు.

“ అల్లుడు, కూతురు వచ్చారు కదా?...వాళ్ళే కార్యక్రమం నడిపిస్తున్నారు. “

“ నేనూ అలాగే అనుకున్నాను. “

“ అవునవును!..వారికి కాక మరెవరికి కావాలి ?.”

ఓ పెద్దాయన అలా అనేసరికి , అందరి సందేహం తీరింది.

ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చిన పంతులు గారి డైరీ

వారి మిత్రుడు ఆనంద్, పంతులు గారి అమ్మాయికి ఇచ్చాడు.

ఆత్రంగా డైరీ పేజీలు తిప్పి చూడ సాగింది. ఆఖరి పేజీలలో,

తండ్రి రాసింది చూసింది తను.

ఆనంద్! నా పరిస్థితి నాకు అర్థం అవుతోంది. నాకు వైద్యం చేస్తున్న డాక్టరు ధైర్యం చెబుతున్నా, నాకు బతుకుతానన్న నమ్మకం లేదు.

నాకున్న వైద్య పరిజ్ఞానం ప్రకారం రోజులు, గంటల్లోనే…..పైవాడి కబురు

కోసం ఎదురుచూస్తున్నాను.

బతికితే సంతోషమే!.. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మొదటి సారి గుండె పోటు వచ్చినప్పుడే వాడు రాలేదు. ఈసారైనా వస్తాడన్న నమ్మకం లేదు.

పది రోజుల క్రితమే నా ఆరోగ్యం క్షీణించింది.అంతిమ యాత్రకు అప్పుడే ,మా ఇంటి ప్రక్కనున్న

ఫోటో స్టూడియో బాబూరావు నమ్మకస్తుడు. మిత్రుడు కూడా. తనద్వారా ముందుచూపుతో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను.అందరికీ వారు చేయబోయే పనులకు పూర్తిగా డబ్బు ఇప్పించేసాను.

రశీదులన్నీ డైరీలోనే ఉన్నాయి.

నేను లేకపోయినా, ఆవిడ జీవనోపాధికి ఏ లోటూ ఉండదు.

ఇరవై వేలు పెన్షన్ వస్తుంది. ఉండటానికి ఇల్లుంది. మరో ఇంటి మీద అద్దె వస్తుంది.

కుటుంబ మిత్రునిగా నా అంతిమ ప్రయాణం జయప్రదం అయేలా చూస్తావన్న నమ్మకం నాకుంది.

ఉదయమే ఆసుపత్రికి వచ్చి నా పరిస్థితి చూడమని నీకు మెసేజ్ పెట్టాను.బతుకుతానన్ననమ్మకం లేదు.

నా డెత్ సర్టిఫికెట్ కాపీలు మన ఆఫీసుకి పంపించు.

నీ మిత్రుడు దివాకర్.

కళ్ళను తుడుచు కుంటూ , ప్రక్క పేజీ చూసింది ఆమె.

ఆనంద్! మరొక విషయం!

నా మనస్తత్వం, ఆలోచనా విధానం నీకు పూర్తిగా తెలుసు.

మనిషి పోతే బంధువులు, పరిచయస్తులు తెగ హడావిడి చేస్తారు.

ఉచిత సలహాలు ఇస్తారు. దాన ధర్మాలు అంటారు. తతంగం పద్ధతి ప్రకారం జరగాలంటారు.

లక్షలు ఖర్చు పెట్టిస్తారు. దిన కార్యక్రమాల పేరిట బలిసిన వారిని మేపేకంటే ,

రెండు పూటలు పేదవారి కడుపులు నింపడంలోనే, నాకు సంతోషం.

ఆత్మ సంతృప్తి కూడా.

నాకు అసిస్టెంట్ గా, ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటూ, మందులు వాడే

విధానం బాగా తెలుసు కున్న వాడివి .నా తర్వాత ఉచిత వైద్యం నీవే

కొనసాగించాలి.మందుల గురించి, పూర్తి వివరాలు ఉన్న పుస్తకాలు

బీరువాలో ఉన్నాయి. ఆ పుస్తకాలే నిన్ను ముందుకి నడిపిస్తాయి.

నీ మిత్రుడు దివాకర్.

డైరీ మూసేస్థుంటే ,అందులోంచి ఓ కవరు జారి పడింది. కవరు తీసి

అందులో ఉన్న ఉత్తరం బయటకు తీసింది ఆమె.

అమ్మాతులసీ!

నా ఆరోగ్యం గురించి గాభరా పడతారని నీకు, అమ్మకు వివరంగా చెప్పలేదు.

నాకున్న వైద్య పరిజ్ఞానం ప్రకారం రోజుల్లోంచి గంటల్లోకి వచ్చేసింది నా ఆరోగ్యం.

ముందుచూపుతో నా అంతిమ యాత్రకు అన్ని ఏర్పాట్లు నేనే చేసుకున్నాను రేపటి సూర్యోదయం చూడగలిగితే సంతోషమే!.....

అమ్మ పూర్తి బాధ్యత ఇక నీదే తల్లీ!

అల్లుడు నీవు, పిల్లలు అద్దె కొంపల్లో ఎన్నాళ్ళని అవస్థ పడతారు?...

మనింటికి వచ్చేయండి.అమ్మకు తోడుగా ఉండండి. పిల్లలు మన ఇంట్లో సందడిగా తిరుగుతుంటే, అమ్మ ఆరోగ్యం బాగుంటుంది.

అవసరానికి నా టేబుల్ సొరుగులో యాభై వేలు ఉంచాను. అందరూ జాగ్రత్తగా ఉండండి.

అమ్మను, పిల్లలను జాగ్రత్తగా చూసుకో.

నా చివరి కోరిక నీవే తీర్చాలమ్మా!...నీకు, అమ్మకు చాలా సార్లు చెప్పాను .

సమయానికి అన్నయ్య వస్తాడన్న నమ్మకం లేదు నాకు.

ఎవరో ఒకరు నాకు తల కొరివి పెట్టికంటే, నీవే ఆ పని ఎందుకు చేయ కూడదు?... నీవు చేస్తేనే నా ఆత్మకు శాంతి కలుగుతుంది.

మరొక విషయం. అమ్మ ఎప్పుడూ పసుపు కుంకుమలతో నేను,ఉన్నప్పటి లాగే కళ కళ లాడుతూ ఉండాలి. అమ్మను నీవే ఒప్పించాలి. ...

డాడీ….దివాకర్..

ఆ ఉత్తరం డైరీలో పెట్టి ఆనంద్ కి ఇచ్చి,దృఢ నిశ్చయంతో తల్లి ప్రక్కన నిల్చుంది తను.

అందరూ జరగబోయే కార్యక్రమాల గురించి మాట్లాడు కుంటున్నారు.

“ఈ రోజు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ఇక చిన్న దినం,పెద్ద దినం భోజనాలకు, మంచి వంట బ్రాహ్మణులను ఇప్పుడే మాట్లాడుకుని అడ్వాన్స్ ఇవ్వాలి. పనిలో పనిగా దానాల గురించి కూడా ఓ మాట అనుకుంటే మంచిది. “

అప్పటి దాకా మౌనంగా, అందరి మాటలు విన్న పంతులు గారి కూతురు వారి మాటలకు నోరు విప్పింది.

“బంధువులకు,స్నేహితులకు అందరికీ నాదొక విన్నపం. నాన్న గారు, నిన్న రాత్రి డైరీలో రాసుకున్న చివరి మాటల గురించి, ఆనంద్ బాబాయ్ చెబుతారు.వినండి.

నాన్న గారు చెప్పిన విధంగా మనం చేస్తేనే, వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. “

ఆమె మాటలకు, అందరూ ఆనంద్ వేపు చూసారు.

తల కొరివి గురించి, దిన కార్యక్రమాల నిర్వహణ గురించి,

దాన ధర్మాల విషయంలో వారి ఆలోచనా విధానం గురించి ,

డైరీలో పేజీలు తిప్పుతూ క్లుప్తంగా వివరించాడు ఆనంద్.

“పంతులు గారివి మతి లేని మాటలు. మనం ఎలా పట్టించు కుంటాం !?... శాస్త్ర ప్రకారం అన్నీ జరగాల్సిందే!...” బంధువులంతా ఏక కంఠంతో అలా అనేసరికి, కూతురు అసహనంగా అందరి వేపు చూస్తూ చెప్పింది---

“నాన్న గారు డైరీలో రాసిన విధంగానే, అన్నీ జరుగుతాయి. అమ్మ మాట కూడా ఇదే!... వారి ఆత్మకు శాంతి కలగాలంటే వారు చెప్పినట్లు చేయడం మా కర్తవ్యం. అలాగే చేస్తాం.”

ఆమె అలా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసరికి, అందరికీ లోపలకుత కుత లాడుతున్నా, చేసేదేమీ లేక మౌనం వహించారు.

“నాన్న గారిపై ఉన్న అభిమానంతో వచ్చిన స్నేహితులు, సన్నిహతులు, బంధువులు. కాలనీ వాసులు, అందరికీ నాన్న గారి మనసులోని మాటొకటి చెబుతాను జాగ్రత్తగా వినండి. ”

అందరూ ఆశ్చర్యంగా ఆమె వేపు చూడసాగారు.

“ఇది కేవలం మా కుటుంబానికి సంబంధించిన విషయమే అయినా, మీ అందరికీ తెలియ చేయాల్సిన బాధ్యత మాకుంది. ఎవరు ఏమనుకున్నా, ఆక్షేపించినా నాన్న గారి అభీష్టం మేరకు అమ్మ ఎప్పటిలా, ఇక మీదట కూడా పసుపు, కుంకుమలతోనే

ఉంటుంది. “

అందరూ నోట మాట లేక,శిలా ప్రతిమల్లా ఉండి పోయారు.

ఆరోజు కార్యక్రమం ,చిన్న దినం, పెద్ద దినం పంతులు గారి

కోరిన విధంగా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగాయి.

పంతులు గారి భార్య, కూతురు అశ్రు నయనాలతో,ఆనంద్ కి కృతజ్ఞతలు తెలిపారు.

****

నెల రోజుల తర్వాత, పంతులు గారి కొడుకు, కోడలు , మనవలు వచ్చిన సంగతి తెలుసుకొని ఆనంద్,లాయర్ విశ్వనాధం గారితో కలిసి పంతులు గారి ఇంటికి వెళ్ళాడు.

“అన్నయ్యా! ఈ ఆనంద్ బాబాయే , నాన్న గారి కార్యక్రమాలు అన్నీ దగ్గరుండి జరిపించారు. వీరు లాయర్ విశ్వనాధం గారు. “ అంటూ పరిచయం చేసింది తను.

అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

ఎవరూ మాట్లాడక పోయేసరికి, పంతులు గారి కొడుకు నోరు విప్పాడు.

“అతి కష్టం మీద పది రోజులు సెలవు దొరికింది. ఈలోగా ఇక్కడి పనులు పూర్తి చేయాలి…… “

“అన్ని పనులు అయిపోయాయి.మీరు నిశ్చింతగా ఉండండి. “

“ఆ పనుల గురించి కాదు .ఇంటి వ్యవహారం గురించి …”

“ఆ పనులు కూడా, నాన్న గారు పూర్తి చేసేసారు.” ఆనంద్ చెప్పాడు.

తన మాటలు అర్ధం కాక, “అందరూ నేను చెప్పేది వినండి. ఉన్న రెండు ఇళ్ళు అమ్మేస్తాను.ఎంతో కొంత చెల్లెలుకి ఇస్తాను. అమ్మ నా దగ్గర ఉంటుంది. “ అంటూ తన మనసులో మాట చెప్పాడు కొడుకు.

“అయ్యా! నాన్న గారు మూడు నెలలకు కాలం చేస్తారనగా,

ఆస్తుల గురించి వీలునామా రాయించి, రిజిస్టర్ చేయించారు. వారు రాసిన విధంగానే పంపకం జరుగుతుంది. “ లాయర్ చెప్పారు

“లాయర్ గారూ! నేనేగా వారసుణ్ణి ?...నా ఇష్ట ప్రకారమే జరగాలి .”

“అవును సార్!...మీరే వారసులు. నాన్న గారు వీలునామాలో రాసిన విధంగానే జరుగుతుంది. “

“ స్సరే!...చదివి వినిపించండి.”

“అలాగే!...వీలునామా కాపీ ఇది. మీ.దగ్గర ఉంచుకోండి. “

ఆ కాపీ తీసుకొని తను ఆత్రంగా పేజీలు తిరగేస్త్తుంటే, లాయర్ గారు –” నిదానంగా తర్వాత చూసుకోండి. టూకీగా వివరాలు చెబుతాను వినండి “ అన్నారు.

“బజారు లోని ఇంటికి వస్తున్న అద్దె అమ్మ గారికి చెందుతుంది. ఆమె తదనంతరం మాత్రమే, ఆ ఇల్లు మీ పరం అవుతుంది. ఈ నాలుగు గదుల ఇల్లు మీ అమ్మ గారి తదనంతరం, మీ చెల్లెలుకి చెందుతుంది. ఇక బేంక్ డిపాజిట్ లు ,అమ్మ గారి,నాన్న గారి ఉమ్మడి అకౌంట్లోని అయిదు లక్షల కేష్ మీ అమ్మ గారికే!”

లాయర్ గారి మాటలకు పంతులు గారి కొడుకు కోపంగా---

“ఇది అన్యాయం. అంతా నాకే చెందాలి. . కోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాను. “

“మీరు ఏ కోర్టుకి వెళ్ళినా,మీ వాదన నెగ్గదు.చదువు కున్న వారు, మీకు తెలియని విషయం కాదు. ఈ ఆస్తి అంతా నాన్న గారి స్వార్జితం.ఎవరైనా వారి అభిమతం గౌరవించి

తీరాల్సిందే!” అంటూ లాయర్ ఒరిజినల్ వీలునామా పంతులు గారి భార్యకు ఇచ్చి వెళ్ళి పోయారు.

***శుభం***


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

మీ సుస్మితా రమణ మూర్తి



232 views0 comments
bottom of page