top of page

వసుధైక కుటుంబం


'Vasudaika Kutumbam' written by Dr. Tangirala Sreelatha

రచన : డా. తంగిరాల శ్రీలత "శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజమ్ ....." ఒక్కసారిగా నిద్రాదేవి ఒడిలో నుండి లేచిన అంబిక గడియారం వైపు చూసింది. తెల్లవారుఝామున 4:30 అవుతోంది. ప్రక్కనే ఉన్న గుడిలో నుండి విష్ణు సహస్ర నామ స్తోత్రం వినిపిస్తోంది. ఆరు గంటలకి తాను హాస్పిటల్ లో డ్యూటీకి వెళ్ళాలి. మంచం మీద కూర్చుని అరచేతులు చూసుకుంటూ "కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం .." అని స్మరించుకుని, కాళ్ళు కింద పెట్టకుండా భూమాతని కుడి చేతితో తాకి కళ్ళకద్దుకుంది. చిన్నతనం లో నాన్న నేర్పిన పద్ధతులని వదలకుండా పాటిస్తుంది. పద్ధతైన వైదీకి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందువల్ల అన్ని సాంప్రదాయ పద్ధతులని పసి ప్రాయం నుంచే పాటించటం ఆమె అలవాటు. తల్లిదండ్రులు కష్టపడి చదివించిన వైద్య విద్య లో ఆరి తేరి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా సాంప్రదాయమంటే చాలా గౌరవ మర్యాదలు చూపిస్తుంది. నెమ్మదిగా హడావిడి పడకుండా నిత్యకృతాలు ముగించి స్నానం చేసి శుచిగా పొయ్యి వెలిగించి పాలు, టిఫిన్, భోజన ఏర్పాట్లు చేస్తూనే పూజా కార్యక్రమాలు కూడా చేసేసింది. నోటికొచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ తన డ్రెస్సింగ్ పూర్తి చేసి వండినవన్నీబాక్స్ లో సద్దుకుంది. లేత గులాబీ రంగు కాటన్ చీరలో సాధారణ జ్యువలరీ తో చక్కని రూపంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తన కళ్ళజోడు, స్టెతస్కోప్, మల్లె పూవు లా ఉన్న తెల్లని కోటు చేతిలో పట్టుకుని మాస్క్ పెట్టుకుని హాస్పిటల్ కి బయలుదేరింది. కారులో వెళ్తున్నంత సేపు కాశీలో ఉన్న నాన్నని తలుచుకుంటూ ఆ రోజు ఎలాగైనా వీలు చూసుకుని ఫోన్ చెయ్యాలి అనుకుంది. రోజు విడిచి రోజు అయనతో మాట్లాడకపోతే తనకి చాలా అసంపూర్ణంగానూ ఆందోళనగానూ ఉంటుంది. కరోనా వైరస్ వల్ల పని వత్తిడి ఎక్కువై రెండు రోజులు నుండి మాట్లాడే తీరిక లేకపోయింది. ఆ వైరస్ బారి నుంచి అందరిని కాపాడమని మళ్ళీ ఒకసారి దేవుడికి విన్నవించుకుని హాస్పిటల్ లోనికి వెళ్ళింది. లోపలికి వెళ్తూనే అక్కడి బాధ్యతలతో తీరిక లేకుండా రాత్రి 8 గంటలవరకు గడిపింది. తరువాత బయటకు వచ్చి పూర్తిగా శానిటైజ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అక్కడ హడావిడి చూసి ఏమైందా అనుకుంటూ అటువైపుగా వెళ్ళింది. పక్క ఇంటి సుధ వాళ్ళ అమ్మ ముంబై లో తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఆవిడ కరోనా వైరస్ బారిన పడి మరణించిందని తెలిసి సుధ కన్నీరు మున్నీరవుతోంది. చుట్టుపక్కల వాళ్ళు కొందరు దూరంగా నుంచుని ఆమెని ఓదారుస్తున్నారు. అంబిక ఒక డాక్టరుగా ఆమెకు మనస్థైర్యం కల్పిస్తూ ఓదారుస్తోంది. కానీ సుధ పరిస్థితి చాలా దారుణం గా ఉంది. ఎప్పుడూ తనతో ఉండే తల్లి కొన్ని నెలల ముందే అక్కడికి వెళ్ళింది. అనుకోని పరిస్థితులలో లాక్డౌన్ ప్రకటించటంవల్ల అక్కడే ఉండిపోయింది. పుట్టినప్పటినుండి ఎప్పుడూ ఆమెని వదిలి ఉండలేదు. ఆఖరికి తన పెళ్లి సమయంలో కూడా భర్త సుధాకర్ తో మాట్లాడి అమ్మ తనతోనే ఉండాలని చెప్పి అతని కుటుంబం ఆ ప్రస్తావనకు ఒప్పుకున్నాకే తన బంధాన్ని ముడివేసుకుంది. కానీ రెండు నెలల ముందు సుధ తమ్ముడు అమెరికన్ ప్రాజెక్ట్ కోసమై అక్కడికి వెళ్తూ తల్లిని కొన్నాళ్ళు తన వద్ద ఉండటానికి రమ్మన్నాడు. ఆలా వెళ్లిన ఆవిడ ఇప్పుడు ఇలా శాశ్వతంగా దూరమైంది. సుధను ఎన్నోరకాల ఓదార్చి కాసేపైన తరువాత అంబిక తన ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గరనుంచి ఎన్నో ఆలోచనలు తనని చుట్టుముట్టాయి. హాస్పిటల్ లో తాను వైద్యం చేసిన ఎంతో మంది రోగులని, వాళ్ళు కోల్పోయిన వారి సొంత మనుషులని తలుచుకొని మనసు కకావికలమైంది. చాలామంది వారి కుటుంబసభ్యులను పోగొట్టుకొని చెప్పలేని క్షోభని అనుభవిచటం కళ్ళ ముందే మెదులుతోంది. తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలు, పిల్లలని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, అందరిని పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిన దురదృష్టవంతులు, ఆసరాలేక నిస్సహాయులైన వృద్ధులు, ఇలా ఎందరో. మనసంతా కలచివేసినట్లైంది. సరిగ్గా భోజనం కూడా చెయ్యలేక ఆలోచనల అలలు మనస్సాగరాన్ని ఢీ కొడుతుంటే అలానే పక్కపై వాలి నిద్రలోకి జారుకుంది. ఆ తరువాత రెండు రోజులు చాలా అశాంతితో కలత చెందిన మనసుతో అన్యమనస్కంగా గడిపింది. ఇంటలిజెన్స్ బ్యూరో లో స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న అంబిక భర్త ఆ రోజు ఇంటికి వచ్చేసరికి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన అంబిక సోఫా లో నిస్త్రారణగా కూర్చుని ఉండటం చూసి కొంచెం ఆలోచనలో పడ్డాడు. నిదానంగా మాట్లాడచ్చులే అని స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. తన భుజం మీద చెయ్యి వేసి " ఏమైంది అంబిక ఆలా ఉన్నావు ?" అని అడిగాడు. ఒకసారి సాలోచనగా అతని కళ్ళలోకి చూసి నెమ్మదిగా తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంది. ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ చాలా కాలం తరువాత నెమ్మదిగా భోజనం చేసారు. కానీ అంబిక ఇంకా మూడీగా ఉండటం చుసిన అరుణ్ ఆమెను ఒక కంట కనిపెడుతూ తన పని తాను చేసుకుంటూ ఊరుకున్నాడు. తెల్లవారి మళ్ళీ ఎవరి పనిలో వారు ఉన్నా అరుణ్ అంబికని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె ఇంకా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు గమనించాడు. "అంబిక ఈ రోజు అల్పాహారం ఏమిటి?" అంటూ ఆమెను ఈ లోకంలోకి తీసుకురావడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. "ఓ! ఇవాళ ఏమిటో శ్రీవారు మంచి తెలుగు లోకి దిగారు!?" అంది అంబిక. "ఏమిలేదు ప్రియసఖీ.. నువ్వేమో ముభావంగా ఉన్నావు, నాకు ఆఫీస్లో అందరితో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడి బాగా బోరు గాను యాంత్రికంగాను ఉంది. చక్కటి తెలుగులో ఈ రెండు రోజులు సేద తీరుదామని ఇలా మొదలుపెట్టాను." "అంటే మీకు ఈ వారం ఆఫా? మళ్ళీ ఎప్పుడు డ్యూటీ కి వెళ్ళేది?" "ఈసారి నాకు సెకండ్ హాఫ్ అఫ్ ది వీక్ డ్యూటీ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కాస్త వెసలుబాటు, విశ్రాంతి దొరికింది. మరి నీ సంగతి?" "నేను కూడా ఈ వారం మధ్యాహ్నం షిఫ్ట్ కి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు కాస్త తీరికగా ఉంది." "ఓహ్! మంచి విషయం చెప్పావు. రాత్రి అలసట వల్ల వెంటనే నిద్ర పట్టింది. అయితే ఇప్పుడు ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు," అన్నాడు. "అవును. నేను కూడా మీతో కాసేపు ఒక విషయం గురించి చర్చించాలి అనుకున్నాను. మనకి చక్కటి సమయం దొరికింది. ఈ ప్రపంచం అంతా ఈ వైరస్ వల్ల చాలా కష్టకాలం ఎదుర్కొంటున్నా దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం మన ప్రాంతం లో చాలా నియంత్రణ లో నే ఉంది, కదా!" అంది అంబిక. "అవును కానీ, మీ హాస్పిటల్ లో కరోనా పేషెంట్స్ రికవరీ రేట్ ఎలా ఉంది? ఇబ్బందికర పరిస్థితి కాదుగా!" "ఇబ్బందేమీ లేదు; కానీ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. భయపడే కాలం దాటేశాము. ఇంకా జాగ్రత్తలైతే తీసుకోవాలి. తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని హృదయ విదారక పరిస్థితులు నా మనోఫలకం నుండి చెరిగి పొవట్లేదు" అంటూ నిట్టూర్చింది. "ఏమిటి అంబికా, ఏముంది నీ మనసు లో? నాకు చెప్పు, వీలైన సలహా ఏమైనా ఇస్తాను; చేతనైన సహాయం చేస్తాను." "ఏమీలేదండి, నేను చుసిన పరిస్థితుల నుండి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అది..." సంశయం గా అతని వైపు చూసింది. "ఉమ్... చెప్పు అంబికా; నా దగ్గర నీకు సంశయం ఎందుకు? చెప్పు." ఒక్క నిముషం కళ్ళు మూసుకుని అలోచించి, దీర్ఘ శ్వాస తీసుకుని చెప్పటం మొదలు పెట్టింది అంబిక. "నాకు తెలిసి ఈ వైరస్ ఎటాక్ వల్ల కొన్ని కుటుంబాలు ఛిద్రమైపోయాయి. మరీ దారుణం ఏమిటంటే కొంత మంది - పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు - ఒంటరి వాళ్ళుగా మిగిలిపోయారు. వయసు మీద పడ్డ పెద్ద వాళ్ళైతే మనుషుల అండదండలు లేక అవస్థలు పడుతున్నారు. కొందరు పిల్లలు అనాధలుగా మిగిలారు. వాళ్ళకోసం వచ్చి బాధ్యత తీసుకునే బంధువులు కరువయ్యారు. కొన్ని కేసుల్లో అయితే బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి, ఆమె భర్తకు వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ బిడ్డ అనాధగా మిగిలింది. అంతెందుకు, మన పక్క ఫ్లాట్ లో సుధ తన తల్లి ని కోల్పోయి చాలా క్రుంగి పోయింది. వీళ్ళకోసం ఏమైనా చేయాలని నాకు ఆలోచన గా ఉంది." "మనమేమి చేయగలము? ఏమి చేయాలని నీ ఆలోచన? చెప్పు, కొద్దిగా అవకాశం ఉన్నదనిపించినా నేను నీతో కలిసి పని చేస్తాను. చెప్పు," అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ లో ఆమెకి చాలా అండ ఉన్నదనిపించింది. ఎంతో బలం వచ్చినట్లు అనిపించింది. "మనం ఒంటరిగానూ, నిస్సహాయంగానూ ఉన్న వారిని ఒప్పించి, తత్సంబంధ అధికారుల అనుమతి తీసుకొని వారిని వేరొక కుటుంబంతో కలుపుదాము. ఏమంటారు? ఎలా ఉంది నా ఆలోచన?" అరుణ్ కొంచెం అయోమయంగా ఏమి అర్ధంకానట్లుగా ఆమె వైపు చూసాడు. ఒక నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. అతని ముఖ కవళికలు చూసి ఆమె మళ్ళీ ఇలా చెప్పింది. "ఇప్పుడు, ఉదాహరణకి మన పక్క ఫ్లాట్లో ఉన్న సుధకి అమ్మ కావాలి. ఆవిడ తన ప్రాణం. కానీ ఆవిడని ఇప్పుడు ఎవరూ తనకి తెచ్చి ఇవ్వలేరు. మొన్న మా హాస్పిటల్ కి వచ్చిన ఒక ఫ్యామిలి లో అందరూ వైరస్ వల్ల ప్రాణాలు వదిలారు; ఒక్క వృద్దురాలు తప్ప. ఇప్పుడు మనం ఆవిడతో మాట్లాడి, సుధను ఒప్పించి ఆవిడని సుధ రక్షణ లో ఉంచితే - సుధ కి అమ్మ లాంటి అమ్మ దొరుకుతుంది; ఆవిడకి తన పిల్లల లాంటి కూతురు దొరుకుతుంది." అని చెప్పి ఎలా ఉంది ఈ ఆలోచన అన్నట్లు అరుణ్ వైపు చూస్తూ కళ్ళు ఎగరేసింది అంబిక. "ఇంకొక చోట పిల్లలు అనాధలుగా మిగిలిన వాళ్ళను తెచ్చి వైరస్ వల్ల పిల్లల్ని కోల్పోయిన వాళ్ళకి ఇప్పిద్దాము. ఆలా పిల్లలకి అమ్మానాన్నలు దొరుకుతారు.వారి భవిష్యత్తు భద్రంగా కూడా ఉంటుంది. వారిని దత్తతు తీసుకున్న కుటుంబ ఆర్ధిక పరిస్థితిని బట్టి ఆ పిల్లలకు విద్యాబుద్ధులు కూడా దొరుకుతాయి. ఒంటరిగా మిగిలిన వృద్ధ తండ్రులను వారి అవసరమున్న కుటుంబానికి చేర్చుదాము. ఇలా చేస్తే ఒకరికి ఒకరుగా ఉంటారు; దూరమైనవారి కొరకు బాధ పడుతూ జీవితం గడపకుండా, చక్కటి బంధాలు ఏర్పడతాయి. ఇది కూడా ఒక రకమైన సేవ అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు అరుణ్?" ఉన్నతమైన ఆమె ఆలోచన కి అరుణ్ ఫిదా అయిపోయాడు. "అద్భుతం, అపూర్వం, అమోఘం" అంటూ అంబికని స్లాఘించాడు. "నేను తత్సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అనుమతులు తీసుకుంటాను. ఈ లోగా నువ్వు సుధ తో కూడా మాట్లాడి నీ ఆలోచన చెప్పి చూడు. తాను ఒప్పుకుంటే మనతో తనని కూడా కలుపుకుని ఈ మహత్కార్యం చేద్దాము." అని చెప్పి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఈ లోపు అంబిక సుధని కలిసి తన మనసు లోని ఆలోచనని చెప్పింది. "అత్యద్భుతమైన ఆలోచన అంబిక గారు. చాలా గొప్పగా ఆలోచించారు. కానీ ఇది జరుగుతుందా.. ఒఫిషల్ అనుమతి దొరుకుతుందంటారా?" అంటూ ఆలోచనలో పడింది. "మా వారు అన్ని వివరాలు, అనుమతులు తీసుకుని వస్తారు. ఈలోగా మీ అభిప్రాయం తెలుసుకుందామని నేను ఇటు వచ్చాను. మీరు కూడా సిద్ధం గా ఉన్నారు కాబట్టి నాకు వివరాలు తెలిసిన వెంటనే మీకు చెప్తాను," అంది అంబిక. రెండు రోజుల వ్యవధి లో కావలసిన సమాచారాన్ని, విధి విధానాలని అరుణ్ కనుక్కుని అంబిక, సుధలకు తెలియచేసాడు. ఇటు అంబిక తనకి పరిచయమున్న ఇతర వైద్యులని కూడా సంప్రదించి తాను అనుకున్న పరిస్థితులలో ఉన్న వాళ్ళ జాబితాను సిద్ధం చేసింది. ఈ ముగ్గురితో సుధకి తెలిసిన ఒక న్యాయవాది, ఇంకా కొంతమంది వైద్యులు, అరుణ్ స్నేహితులు కలిసి ఒక మంచి బృందంగా ఏర్పడి వారు తయారు చేసున్న జాబితా లోని వారిని కలవటం ప్రారంభించారు. మొదట కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా పట్టువిడువని వారి కృషికి మంచి ఫలితం లభించింది. ఈ మహత్తర దత్తత కార్యక్రమాలకు కావలసిన చట్టపరమైన జాగ్రత్తలు అనుమతులు పూర్తి చేస్తూ ఎన్నో కుటుంబాలకు వీరు సంపూర్ణతను కల్పించారు. తల్లిదండ్రులకు పిల్లలు దొరికారు, వృద్ధులకు చక్కటి అండదండలు కల్పించే ఎదిగిన పిల్లలు దొరికారు, పసి అనాధలకు ప్రేమమూర్తులైన అమ్మానాన్నలు దొరికారు, సుధకు కూడా అమ్మ దొరికింది. అరుణ్ కూడా తన చిన్న వయసులోనే అమ్మానాన్నలను పోగొట్టుకున్నందున ఇప్పుడు ఒక పెద్దావిడను దత్తతు తీసుకున్నాడు. కాశీలో ఉన్న తన నాన్నకి ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు అంబికను తన అల్లుడిని అయన మనసారా మెచ్చుకుని ఆశీర్వదించి, "మిమ్మల్ని చూసి నేను గర్విస్తున్నానమ్మా. మీ చిన్నతనం లో నేను చెప్పిన ఎన్నో పురాణేతిహాసాలు నువ్వు చక్కగా ఒంటపట్టించుకుని ఎంతో ఉన్నతమైన, భగవంతుడు మెచ్చే పని చేసావు. కుటుంబం మంచిదైతే సంస్కారవంతమైన మనుషులు సంఘంలోకి వస్తారు. మనిషిలో సంస్కారం ఉంటే సంఘం బాగుంటుంది. సంఘం బాగుంటేనే దేశం బాగుంటుంది. మనుషులందరూ నా వారు అనుకుంటే ఈ జగమే ఒక కుటుంబం. అదే వసుధైకకుటుంబం. నీకు, అరుణ్ కి, మీ మిత్ర బృందానికి నా మనఃపూర్వక ఆశీర్వచనాలు. ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆ కాశీ విశ్వేశ్వర, విశాలాక్షి అన్నపూర్ణ దేవిల శుభాశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి." అని ప్రశంసల వర్షం కురిపించారు. తన పెంపకాన్ని, భగవంతుని ఆశీస్సులను తలచుకుని మురిసి ఆనందపరవశులయ్యారు. సమాజంలో ఎప్పుడూ ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్న పౌరులుండాలంటే పెద్దలు సరైన మార్గం లో నడుస్తూ పురాణ ఇతిహాసాలను తాము చదివి వారిచే చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అందరూ గ్రహించి ఆచరించేలా సమస్త జనులను దీవించమని ఆ దేవదేవుని ప్రార్ధించారు. తాము కలిపిన కొత్త కుటుంబాలలోని ఆనంద పరవస్యాలు చూసి అంబిక, అరుణ్, సుధ మరియు వారి మిత్ర బృందం సంతృప్తి చెందారు. అప్పుడు కలిగిన ఆ అలౌకిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ సమాజానికి ఉపయోగపడే మరి కొన్ని పనులు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

Dr. Tangirala SreeLatha, Associate Professor of English is an educator for 26 years. As Training Head, she is instrumental in placing nearly 4000 students in various companies. She is a bilingual poet, short story writer and translator. Many of her poems are anthologized in National and International collections and other e-journals. She is a regular contributor to Innerchildpress, Muse India, The Criterion, Cape Comorin Publishers, Guntur International Poetry Fest and Amaravati Poetic Prism conducted by CCVA, Vijayawada. She published an anthology “VOICED THOUGHTS” and approximately 57 research papers. Her interest in modern fiction is inclined especially to Indian women writers.

263 views0 comments
bottom of page