top of page

వయసుతో పనిలేని చదువు


Vayasutho Panileni Chaduvu By Anu Kumar

రచన : అను కుమార్ (విశ)

"ఏమే రమణమ్మా, ఉదయం త్వరగా వచ్చి నీ పనులు చేసుకునే దానివి. మరి ఈరోజు ఏమైంది! పొద్దేక్కేదాకా రాలేదు? వంట్లో నలతగా ఉందా" అని అడిగింది శారద తన ఇంటికి వచ్చిన పనిమనిషి రమణమ్మని.

"వంట్లో బాగానే ఉందమ్మాా" అని సమాధానం ఇచ్చి, ముభావంగా తన పని చేసుకుంటోంది రమణమ్మ. కాని తన మొహంలో ఉన్న బాధను పసిగట్టిన శారద, వెంటనే వేడి వేడి టీ కాచి, రమణమ్మ చేతికి ఇచ్చి, తాగమని చెప్పింది. రమణమ్మకి టీ కొంచెం తాగేసరికి తలభారం కొంచెం దిగినట్టనిపించి, తన బాధను చెప్పాలని "అమ్మగారూ" అని శారదను పిలిపించిది.

"ఏంటి రమణమ్మాా" అని శారద అంది.

"మా చంటోడికి మీ రైస్ మిల్లులో ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని అయ్యగారికి చెప్పండమ్మాా" అని కొంచెం మోహమాటంగా అడిగింది.

దానికి శారద కోపం ప్రదర్శించి, "అదేమిటే... నిండా పదిహేనేళ్లు కూడా నిండని కొడుకుని చక్కగా చదువుకోనివ్వడం మానేసి, పనిలో పెడతావా, ఇదేమైనా బాగుందా" అంది.

దానికి రమణమ్మ మాట్లాడుతూ, "నేనూ అదే చెప్పానమ్మాా, కాని వాడు మా మాట వినడంలేదు. మాకున్న అప్పులు , మా కష్టం చూసి, వాడు చదువు మానేసి, మాకు సహాయపడతానని ఏదేదో మాట్లాడుతున్నాడమ్మాా. ఎదుగుతున్న కొడుకు మా కష్టాలను అర్థంచేసుకున్నాడని సంతోషించాలో, లేక వాడి భవిష్యత్తుని మాకోసం త్యాగం చెయ్యాలనుకుంటున్నాడని బాధపడాలో నాకు అర్థంకావడంలేదమ్మా" అని తన బాధనంతా శారదకి చెప్పుకుంది రమణమ్మ. ఇదంతా, అప్పుడే శారద కోసం వంటగదిలోకి వచ్చిన చంద్రయ్యగారు విని, "శారదా!" అని గట్టిగా పిలిచారు. ఆయన పిలిచినా, గర్జించినట్టుగా అనిపించి, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు శారద, పక్కనే ఉన్న రమణమ్మ.

వెంటనే శారద తడబడుతూ "ఏం కావాలండీ" అని అడిగారు.

"రమణమ్మ వాళ్ళ కొడుకుని నేను పిలుస్తున్నానని వెంటనే కబురుపంపు" అని కొంచెం గంభీరంగా చెప్పి వెళ్ళిపోయారు చంద్రయ్యగారు.

"మీ అయ్యగారు మీ అబ్బాయిని పిలుస్తున్నారు, వెళ్ళి పరుగున వాడిని తీసుకునిరా" అని రమణమ్మని ఇంటికి పంపి, కాఫీ పెట్టి ఆరుబయట గుమ్మం దగ్గర నవారు కుర్చీ వేసుకుని కూర్చున్న చంద్రయ్య దగ్గరకు వెళ్ళి, కాఫీ ఇచ్చింది శారద... ఆవిడ మొహంలో, తనని ఏదో అడగాలని వచ్చి అడగలేకపోతుందని గ్రహించిన చంద్రయ్యగారు, "ఏమోయ్! నాతో ఏమైనా మాట్లాడాలా" అని చంద్రయ్య గారు అడిగారు.

అది విని తల దించుకుని , "చింటుగాడు చిన్నపిల్లవాడు మీరు వాడిని మరీ భయపెట్టకండి" అని కొంచెం నసుగుతూ చెప్పిన ఆవిడని చూసి నవ్వువచ్చి, "నాకు తెలుసు శారదా, నేను చూసుకుంటా" అని సమాధానం ఇచ్చారు చంద్రయ్య.

వీళ్ళు మాట్లాడుకుంటుండగానే, చింటూని వెంటపెట్టుకుని రమణమ్మ వచ్చింది. చంద్రయ్యగారు శారదతో , "నేను చింటూతో ఒంటరిగా మాట్లాడాలి" అని చెప్పగానే శారద , రమణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తనవైపే భయంభయంగా చూస్తున్న చింటూని చూసి, దగ్గరకు రమ్మని చెప్పి, చింటు భుజం చుట్టూ చేతులువేసి, తన లైబ్రరీకి తీసుకుని వెళ్ళారు. అంత పెద్ద ఇంట్లో లైబ్రరీ కూడా ఉండడం చూసిన చింటూ బొమ్మలా నిలబడిపోయాడు.

చంద్రయ్యగారు కుర్చీలో కూర్చుని, చింటూని కూడా ఒక స్టూల్ చూపించి, కూర్చోమని సైగ చెయ్యడంతో, చింటూ కూర్చునే మళ్ళీ చుట్టూ చూసాడు.

"ఇవన్నీ ఏంటో తెలుసా" అని అడిగిన చంద్రయ్యగారి మాటలకి, "పుస్తకాలు కదండీ" అని సమాధానం ఇచ్చాడు చింటూ.

"ఇవన్నీ ఎంతోమంది మహానుభావులు రాసిన పుస్తకాలు" అని చెప్తుండగా, చింటూకి ఒక అనుమానం వచ్చినా, అది అడగడం సబబుకాదని అలాగే ఉండిపోతాడు. కాని చింటు మనసులో కలిగిన సందేహం తనకు అర్థమైనట్టు చంద్రయ్యగారు మాట్లాడుతూ,

"నేను నా చిన్నతనంలో పెద్దగా చదువుకున్నది లేదు. కారణం బాధ్యతలు. కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. కాని ఏం చేస్తాం? నేను కూడా నీలాగే ఇంటి బాధ్యతలు తీసుకుని, అన్నీ సక్రమంగా చూశాను. నాకు దక్కనిది, నా పిల్లలకన్నా దక్కాలి అని, వాళ్ళని చక్కగా చదివించి, ప్రయోజకుల్ని చేశాను. ఇంత చేసినా కూడా నా మనసులో ఇంకా చదువుకోవాలని ఉండేది. కానీ అందుకు నేను ధైర్యం చేయలేకపోయాను. రెండు సంవత్సరాల క్రితం నా మనవడు ఏం చెప్పాడో తెలుసా,'చదువుకి వయసుతో సంబంధం లేదు తాతయ్యా! మీరు చదవండి' అని.వాడే నాచేత అక్షరాలు దిద్దించాడు. అప్పుడు కొనసాగించిన చదువు ఇంకా చదువుతూనే ఉన్నాను". అని చంద్రయ్య గారు చెప్పినప్పుడు చింటూ చాలా శ్రద్దగా విన్నాడు.

"చదువు అనేది మన విజ్ఞానాన్ని పెంచుతుంది. దానికి వయసుతో సంబంధం లేదు. ఈ ఊరికి నేను ఎంత పెద్ద మనిషి అయినా, చదువుకోలేదు అన్న చిన్న లోపం నాలో ఉండి, అందరూ నేను చదవలేననే అనుకున్నారు. ఇందాక నీ సందేహం కూడా అదే కదా", అనగానే చింటూ కొంచెం భయంగా చూసాడు.

"ఏం పర్వాలేదు చింటూ. నేను ఎంత సంపాదించినా, ఎన్ని చూసుకున్నా, నేను చదువుకోలేదు అని నన్ను మోసం చేయాలని చూసే వారు. కానీ నేను వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా చదువుకున్నాను. తర్వాత ఎన్నో పుస్తకాలను చదివాను. ఎంతోమంది జీవిత అనుభవాలను చదివాను. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ బాధ్యత ను దృష్టిలో పెట్టుకొని, నువ్వు చదువుని మానేయాలి అనుకుంటున్నావ్. అది నీకు ఇప్పుడు సబబుగానే అనిపిస్తుంది. కానీ నీ బాధ్యతలు తీరాక, అప్పుడు చదువుని ఎందుకు పూర్తి చేయలేదా అని నువ్వు బాధ పడకూడదు. నీకు కావాలంటే చదువుకుంటూ, నీ బాధ్యతలు నిర్వహించు. బాగా చదువుకో నీ చదువు తగ్గట్టు ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. లేదా! మన రైస్ మిల్లులోనే మంచి ఉద్యోగం చేసుకుందువు" అని చంద్రయ్యగారు అన్నారు.

"చివరిగా ఒకటి చెప్తాను ఒక వ్యాపారస్తుడు మరో వ్యాపారస్తుడుని తయారు చేయలేక పోవచ్చు... కానీ ఒక్క చదువుకున్న వాడు 100 మందిని చదివించగలడు. అది చదువుకి ఉన్న గొప్పతనం" అని చంద్రయ్యగారు అనగానే,

"క్షమించండి తాతగారు, మీరు చెప్పింది నిజం. నాకు కూడా చదువంటే చాలా ఇష్టం. కానీ అమ్మావాళ్ళకోసం చదువుని పక్కనపెట్టాలనుకున్నాను. కానీ ఇప్పటినుంచి చదువుని వదిలిపెట్టను. ఇటు చదువుకుంటూనే అమ్మావాళ్ళకి సహాయం చేస్తాను" అని సంతోషంగా చెప్పిన చింటూ మాటలు విని, సంతోషంగా వాడిని దగ్గర తీసుకున్నారు చంద్రయ్య గారు. దూరం నుంచి ఇదంతా చూసిన శారద ఉప్పొంగిపోగా, రమణమ్మ మాత్రం తన బాబుని సరైన మార్గంలోకి నడిపించాలని ప్రయత్నించిన చంద్రయ్యగారికి, కన్నీళ్ళతో రెండు చేతులు జోడించి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంది.

తర్వాత చింటు ఇంట్లో పనులు చుసుకుంటూ , చక్కగా చదువుని కంప్లీట్ చేసి, ప్రయోజకుడు అవుతాడు.

సమాప్తం.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు: అనుకుమార్

కలం పేరు: విశ

ఊరు: రాజమండ్రి వృత్తి: గృహిణి నాకు కథలు రాయడం, చదవడం అంటే చాలా ఇష్టం.. నేను ప్రతిలిపి అని ఒక ఆప్ లో రైటర్ ని... చాలా కథలను అందులో ప్రచురించాను... మొదటిసారి ఈ మనతెలుగుకథలకు కూడా ఒక కథను రాసాను...




56 views0 comments
bottom of page