top of page

వీలునామా


Velunama Written By Tarimela Amaranath Reddy

రచన : తరిమెల అమరనాథ్ రెడ్డి


అయ్యా “నువ్వుంటావో, ఉండవో అనుకుంటూ వచ్చినాను, ఎట్లనో వుండావయ్యా” అంటూ వచ్చినాడు మా ఊరి మల్లన్న.

అతని చూపులు, మాటతీరు చూస్తుంటే ఏదో ఆందోళనగా వున్నట్లు అనిపించి “ఏం మల్లన్నా ఎవరికన్నా రక్తం కావల్లనా? ఏం రక్తం? ఏమైంది? ఎక్కడ చేర్పిచ్చినారు?" అని అడిగాను . నేను రక్తదాన కార్యక్రమములో వుండడంవల్ల నా ప్రెస్ కి కష్టమర్‌ వచ్చినా, ఎవరు వచ్చినా రక్తం కోసమే నేమోనని యిట్ల అడగడం నాకు అలవాటైంది.

“రక్తం కోసం కాదయ్యా, మా పాప లక్ష్మి రెండు దినాలనుంచి కనపడలేదయ్యా. యాటికి పొయ్యిందో ఏమో, అసలు వుందో లేదో... అనే దిగులుతో ముద్ద మింగుడు పడడం లేదు. కంటికి కునుకు లేదయ్యా, మా వాళ్ళు దిక్కలకొకడు పొయ్యినారు ఎతికేకి” అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ.


మీ పాప అంటే నెలకిందట యాక్సిడెంట్‌లో చనిపోయిన రంగని పెళ్ళామా?”


“ఊనయ్యా. మా అల్లుడు చచ్చిపోయిన బాధనుంచి యింగా మేము కోలుకోకనే మల్లా మా బిడ్డ

యిట్ల కనపడక పొయ్యేప్పటికి కంపం పట్టిందయ్యా. పోలీసోల్లకన్న చెప్తావేమోనని వచ్చినానయ్యా”


“ఎక్కడికి పోయింటుందబ్బా. ఏమన్న చదువుకుందా?”


“అదేందో ఇంటరో ఏందో చదివిందయ్యా, అందుకే అనుమానంగా వుందయ్యా. కాలేజీలో

చదువుకునేప్పుడు ఎవనితోనన్న సంబంధముందేమో, వానితో లేచి పోయిందేమోనని మా సందులో చుట్టుపక్కల యిండ్లోల్లంతా అనుకుంటాంటే బాధయితాందయ్యా”

మల్లన్న చెప్తానే మొదట నేను కూడా వాళ్ల మాదిరే అనుకున్నా ఎందుకంటే టౌన్‌ పాప, ఇంటర్‌ చదువుకుంది. ఏదైనా లవ్‌ అఫైర్‌ వుందేమో, పెళ్ళి అయిన ఆరునెలలకే మొగుడు చనిపోయినాడు. పదహారేళ్ళ వయసు పాప కదా. తన లవర్‌తో వెళ్ళిపోయింటుందేమోననే అనుకున్నా మనసులో.

కానీ అదేమి చెప్పకుండా “అట్లెందుకు అనుమానిస్తారు. పదిమందీ పది మాటలు అంటుంటారులే, అవన్నీ మనం పట్టిచ్చుకోకూడదు మల్లన్నా. అయినా చిన్న వయసు కదా. మొగుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్‌లో చనిపోవడం ఘోరం కదా. యింక ఆ పాప జీవితం నరకమే కదా. యిదే మొగోదైతే ఎన్నో యేండ్లు కాపురం చేసిన తన పెండ్లాం చస్తే

ఏ మాత్రం బాధపడక ఈ నెల దాటితే మల్లా ఆరునెల్లవరకు మంచి మూర్తాలు లేవంటని వెంటనే అదే నెలలో పెండ్లి చేసుకుంటాడు. కానీ ఆడోళ్ళయితే బతికినన్నాళ్ళు వొంటరిగా బతుకుతూ అనుమానాలతో, అవమానాలతో నరకం అనుభవించాల్సిందే కదా మన సమాజంలో. అయినా యా మధ్య చాలామంది విడాకులు తీసుకున్నోళ్లకు, భర్త చనిపోయినోల్లకు మల్లా పెళ్ళి చేస్తాండారు కదా."

"ఔనూ ! మీ కులంలో అదేందో చీర కట్టిచ్చే ఆచారం రెండో పెళ్ళి చేసేది వుందనుకుంట కదా మల్లన్నా” అన్నాను.


“ఉందయ్యా. మేము కూడా అట్లనే ఎవరికన్న చీర కట్టీల్లనే అనుకుండామయ్యా. యింతలోనే యీ పాప యిట్ల యిడిచిపెట్టి పొయ్యిందయ్యా. యాడన్న ఉందో, ఉరే యేసుకుందో లేకపోతే అందరూ అనుకుంటాన్నట్ల ఎవనితోనన్న లేచిపోయిందో. వాడెవడో, ఎట్లాంటోడో, యా కులమోడో, మా కులమోడు కాకపోతే మేం ఉరేసుకోల్సిందేయ్యా” అన్నాడు ఆవేదనగా.


“అట్లెందుకు పోయింటుందిలే. వేరే ఎవరితోనన్న సంబంధముంటే మీరు యింతకు ముందు చూసిన పిల్లోనితో పెళ్ళి చేసుకోండదు కదా. అయినా నువ్వన్నట్ల యిప్పుడు టీ.వీ.ల్లో నిత్యం గంటలు గంటలు ఎవరో ఒకరు ఉరి ఏసుకోనో, పురుగుల మందు తాగో ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు చూసి చూసి యిట్లా పరిస్థితుల్లో యీ కాలం పిల్లలకు కూడా యిట్లా పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తాండాయి కదా. అయినా మీ పాప ఎక్కడో ఒక చోట మీ బంధువుల యిల్లల్లో వుంటుందేమోలే మల్లన్నా యేడ్పొద్దు” అని ఓదార్చినా.


“మా బంధువులందరికీ ఫోన్లుచేసినామయ్యా. యాడా లేదయ్యా” అని అంటుండంగనే ఫోన్‌ మోగింది.

“హలో ఎవరు?” అన్నా


“అయ్యా నేను కిట్టన్నయ్యా, మా మల్లన్న మామ నీ దగ్గరుండాడా అయ్యా”

“ఉన్నాడు. ఏం పాప దొరికిందా?”


“దొరికిందయ్యా. ఐదునిమిషాల్లో నీ దగ్గరకు వత్తాను. మా మామను నీ దగ్గరే వుండమనయ్యా” అని

ఫోన్‌ పెట్టేసినాడు.


“దొరికిందంటలే మల్లన్నా సంతోషం. అనవసరంగా ఏమోమో అనుకొని మనసు పాడు చేసుకున్నావు.

మీ కిట్టన్న పిల్చుకొని వస్తాండాడులే యిప్పుడే” అంటుండంగనే కిట్టన్న వచ్చినాడు.


"ఏం కిట్టన్నా! ఒకడే వస్తివే. మీ పాప దొరికిందంటివే. పిల్చక రాలేదా?”


“పాప దొరకలేదయ్యా. పాప శవం దొరికిందయ్యా. కల్లూరు దగ్గర ఎగవకాలవలో తేలిందయ్యా.

పోలీసోల్లు ఆస్పత్రికి ఆటోలో ఏసకొత్తాండరయ్యా. యిదేందో కాగితం ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి ఆపాప పైట కొంగుకు కట్టుకోండేది దొరికిందయ్యా. పోలీసోల్లకు తెలీకుండా నేను తీసుకొచ్చినానయ్యా. దీంట్లో ఏమి రాసిందో చదవయ్యా” అని నా చేతికి యిచ్చినాడు.


ఆ మాట వింటానే షాక్‌ అయినాను.'ఛ! అనవసరంగా ఆ పాపను అనుమానించినానే' అని గిల్టీగా ఫీల్‌ అయినాను. నా మీద నాకే కోపం వచ్చింది. 'ఛీ! నీ మగబుద్ధి పోనిచ్చుకోలేదు కదరా, నేనేమో తెలీకనే ఎవనితోనో లేచిపోయింటుందని అనుమానిస్తావేమిరా' అని తిడుతూ ఆ పాప నా చెంపలు చెళ్ళుమనేట్ల కొట్టినట్లయింది. కొంచెంసేవు మాట రాలేదు. ఆ కాగితం తీసుకున్నా యిదేదో సూయిసైడ్‌ నోట్‌ అయింటుందనుకొని మడిచిన కాగితం విప్పి “చదువుతాను వినండి అంటూ వాళ్ళవైపు చూస్తూ చదవడం మొదలు పెట్టినాను.

“అమ్మా నేను చదువుకునేప్పుడు కాలేజి నుంచి సాయంత్రం ఒక గంట లేటుగా వస్తానే, ఏమైందో,

యేమో యింకా రాలేదేనని టెన్నన్‌గా ఎదురుచూసే మీరు యిప్పుడు ఒక దినమంతా కనపడక పోతే ఎంత భయపడదతాంటారో నాకు తెలుసు. మొగుడు చచ్చి ముండ మోసింది, వొగిసిపిల్ల ఎవనితో లేచిపోయిందో ఏమోనని మీరు అనుకోకపోయినా మన చుట్టాలు, చుట్టు పక్కల యిండ్లోల్లు నానా రకాలుగా అనుకుంటాంటే మీరు బాధపడతాంటారు కదా. వాళ్ళు అనుకున్నట్ల నేను అట్ల అల్లరిదాన్ని కాదు, ఎవనితోనో లేచిపోయి మీకు చెడ్డపేరు తెచ్చేదాన్ని కాదు.

నేను ముండమోసేప్పుడు ఒక పక్క నా నెత్తిన ముత్తెదువులందరు పసుపు, కుంకుమ గుమ్మరిస్తాండేది, తాళి తెంచుతాండేది, మెట్టెలు తీసేస్తాండేది, గాజులు పగలగొట్టుతాండేది చూడలేక నేను బాధపడతాంటే, పక్కనే వున్న ఆడోల్లందరూ ఏమయిందిలే, చిన్న వయసు, ఆరునెలలకే యిట్లయింది. పిల్లలు కూడా కాలేదు కదా. ఎవరికో ఒకరికి చీరకట్టిచ్చి సాగనంపుదాములే అని అంటాండే మాటలు వింటాంటే నాకు భయమయింది. నేను వద్దన్నా మీరు బలవంతంగా నైనా నాకు చీరకట్టిచ్చేట్లుండారు. నేను యింకొకకరితో కాపురం చెయ్యలేను. అట్లని బతికినన్నాళ్ళు మొగుడు చచ్చినదానిగా ఒంటరిగా బతకడం నరకమనిపిస్తాంది.

ఏదైనా పనిపడి తప్పని సరై నేనెవరైనా మొగోనితో మాట్లాడినా, నవ్వినా,చూసినా అనుమానిస్తారు. అదీకాక అల్లరినాయళ్ళ చూపులన్నీ నాపైనే వుంటాయి. యివన్నీ అనుకుంటే నాకు భయమేస్తాంది. ఇదంతా నేను భరించలేను. అయ్యో చిన్న వయసుకదా అని యింకొకరితో చీరకట్టిస్తే వానితో కాపురం చేసేకి నా మనసు వొప్పుకోవడం లేదు. అందుకే నేను యీ బతుకువద్దనుకున్నాా కాలవలోపడి చచ్చిపోతాండా. నా శవం దొరికితే తాపము చేసేకి మీ దగ్గర డబ్బులు వుండవు కదా. నా మొగుని శవానికైతే ఇన్సూరెన్స్‌ డబ్బులు వచ్చినాయి. కాబట్టి యిబ్బంది పడకుండా చేసినారు. నాకు రావుకదా. అందుకే యింట్లో టీ.వీ. దగ్గర గూట్లో డబ్బీలో నా రెండు కమ్మలు పెట్టినాను. అవి అమ్ము. నన్నుతాపం చేసేకి, దినాలు చేసేకి వాడుకోండి. నేను చేసేది తప్పు అయితే క్షమించండి” అని చదువుతుంటే నా

కళ్ళు చెమ్మగిల్లాయి.


యిదంతా వింటున్న మల్లన్న, కిట్టన్న “ఎంత పనిచేసిందయ్యా. మా అవివేకం ముండలు ఆ పాప మొగుడు చచ్చిపోయినాడనే బాధలో వుండంగనే మల్లా చీర కట్టిత్తాములే అనే కూతలు కూయకుండా, ఆ పాప ఆ బాధ మర్చిపోయినంక ఐదారు నెలలకన్న చెప్పిన్నా వొగిసి పాప కదా, ఎట్లో ఒగట్ల వొప్పిత్తాంటిమి. ఆ పాప బతికేదయ్యా” అన్నారు కన్నీళ్ళు తుడుచుకుంటూ.

“అంతే కదా మీ వాళ్ళ అవివేకం, మీ పాప క్షణికావేశంవల్ల శవమైంది. ఘోరం జరిగిపోయింది.

పెళ్ళి అయి ఆరునెలలే అయినా వివాహబంధం ఎంత బలమైందో కదా!” అన్నాను.

'ఆ పాపరాసిన ఉత్తరం చూస్తే అది సూయిసైడ్‌ నోట్‌లా లేదు, తనకున్న ఆస్తి అంతా ఆ రెండు

కమ్మలే కదా. అవి అమ్మి తన శవం తాపానికి, దినాలకు ఖర్చు పెట్టమని రాసిన వీలునామా వున్నట్లుంది' అనుకున్నా.


(అది జరిగిన కథే.... పేర్లు కల్పితం)





గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


22 views0 comments
bottom of page