top of page

వీణ కోరిక


Veena Korika Written By Challa Sarojini Devi

రచన : చల్లా సరోజినీ దేవి


"వీణా, ఆ అబ్బాయికి కూడా వడ్డించు"అంటూ సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్న భర్త వేణు వైపు ఒక్కసారి చూసి, అతనితో పాటు వచ్చిన పద్నాలుగేళ్ల అబ్బాయికి కూడా భోజనం వడ్డించింది వీణ.

ఏమీ మాట్లాడకుండానే వారిద్దరి భోజనాలు ముగిశాయి."వీణా, ఆ అబ్బాయి డాబా పైన పడుకొంటాడు"అన్నాడు వేణు.అర్థం చేసుకొన్న వీణ డాబా పైకి చాపా, చెద్దర్లు,దిండు చేర్చింది.

"రామూ,నువ్వు భయ పడకుండా, ఏమీ ఆలోచించకుండా,ప్రశాంతంగా పడుకో. రేపు ఉదయం లేచి, ఊరు వెల్దువు గానీ లే"అని ఆ అబ్బాయి భుజం తట్టాడు వేణు స్నేహంగా చూస్తూ.

"అలాగే సార్, గుడ్ నైట్"అని వీణ అందించిన నీళ్ళ సీసా తీసుకొని డాబా పైకి వెళ్ళాడు రామూ. ఇతరుల ముందు ఎంతొ గంభీరంగా వుండే వేణు ,ఒంటరిగా వుంటే వీణ ముందు పసి వాడి కన్నా ఎక్కువ అల్లరి చేస్తాడు.

"వీణా డియర్, ఏంటా మూగ నోము? పిల్లలు పడుకొన్నా రా?"అని నవ్వుతూ భార్య చుబుకం పట్టుకొని అడిగాడు.

వీణ చిరు కోపం చూపుతూ "ఇప్పుడు టైమ్ ఎంతైందనుకొంటున్నారు?వారంలో నాలుగు సార్లు అయినా ఇలా లేట్ గా రావడం మీకు అలవాటే గా?12 గావచ్చింది. ఇప్పటివరకూ,పిల్లలు మెలకువతో వుంటారా? వాళ్ళకీ మీ కోసం ఎదురు చూసి చూసి పడుకోవడం అలవాటు అయింది లెండి"అన్నది.

"పనుల ఒత్తిడి ఆలావుంటుంది మరి,పొరుగూరు నుండి రావడం కదా? అయినా వీక్ ఎండ్స్ మనవేగా?పిల్లలు ఏది అడిగితే అదివ్వడం, ఎక్కడికి అంటే అక్కడికి.తీసుకెళ్లడం లేదూ?"పిర్యాదు లాగా అన్నాడు వేణు.

"సరే లెండి గొప్ప. చిన్నవాడి గురించి మాట్లాడేందుకు వాడి క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నాం. అలాగే పాప అడ్మిషన్ గురించీ అడగాలి.'తమ్ముడికి మాథ్స్ లో మార్కులు తగ్గినవి అనీ, మీ మమ్మీ డాడీ లు ఎప్పుడు వస్తారు?అని ఈ రోజు కూడా మా మేడం అడిగారు' అని పెద్దవాడు ఒకటే గొడవ. రేపైనా ఒక పూట సెలవు పెడితే,మనం పిల్లలతో కలిసి వాళ్ళ స్కూల్ కు వెళ్ళ వచ్చు."అన్నది వీణ.

"చిత్తం, దేవీ గారి ఆజ్ఞ"అని తమాషాగా తల వంచాడు వేణు.

వీణ నవ్వు దాచు కొంటూ "ఈ వేషాలకేం తక్కువ లేదు. సరే గానీ, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరూ? ఏమిటి కథా, కమామీషు?"అని అడిగింది.

మంచం పైన ఒరుగుతూ,"ఇంకా అడగలేదేంటి?అనుకొంటున్నాను.నీకు చెప్పకుండా ఎలా వుంటాను? చెప్పనా మరి?"అన్నాడు వేణు.

"చెప్పమనేగా? మీ ఆర్త త్రాణ పరాయణత్వం నాకు ఎందుకు తెలియదూ? మొన్నటికి మొన్న రిక్షా వాడు చిరిగిన బట్టలతో, వణికి పోతున్నాడు అని పుట్టిన రోజుకోసం కనుక్కొన్న బట్టలు దానం చేసి, బిల్లు మాత్రం నా చేతికి ఇచ్చారు. మరి ఈ బుడతడి సంగతేమిటి?"చిరునవ్వుతోనే అడిగింది వీణ.

"ఇందాక నేను ట్రైన్ లో వస్తుంటే కలిసాడు ఆ అబ్బాయి. వాడు వాళ్ళ అన్నయ్యను కలిసేందుకు ఇల్లందు వెళ్ళాలట. ఇప్పుడు బస్ లేమీ వుండవని, నేనే వాడిని ఇంటికి తీసుకొని వచ్చాను. నా బంగారు కొండ ఏమీ అనదని నాకు తెలుసు కదా?" అని భార్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొన్నాడు వేణు.

"అలాగా,ఇంతకీ వా ళ్ళన్నయ్య ఇల్లందులో ఏం చేస్తాడట?" భర్తచేతుల్లో ఒదిగి పోతూనే అడిగింది వీణ.

"ది మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కామ్రేడ్ శంకర్ అలియాస్ శంకరన్నే వాళ్ళ అన్నయ్యట" తాపీగా చెప్పాడు వేణు.

అదిరి పడింది వీణ. చటుక్కున లేచి కూర్చుని"ఏంటీ?"అన్నది భయంగా.

"అవును వీణా, ఇల్లందు అడవుల్లో అతను ఉండవచ్చనే నమ్మకం తో వచ్చాడు ఆ కుర్రాడు. వాళ్ల అమ్మ జబ్బుతో మంచం పట్టిందిట. చాలీ చాలని జీతం తో దరిద్రం అనుభవిస్తూ, ఆమె వైద్యం కోసం తండ్రి తల్లడిల్లుతూ వున్నాడని చెప్పి, అన్నను వెంట తీసుకెళ్లేందుకు వచ్చాడు వాడు. అమాయకంగా,కన్నీళ్ళతో తన కథ వినిపించాడు. జాలి అనిపించిందిరా. చిన్న పిల్లాడు అయినా ఎంత ఆత్మాభిమానమో! ఎంతో బలవంతం చేస్తే గానీ రాలేదు.ఒక ఐదు వందలు మాత్రం

ఇచ్చాను. పాపం, ఎలా వెళ్తాడో ?"చాలా నింపాదిగా వివరిస్తున్న భర్త వైపు వింతగా చూసింది వీణ.

"ఏమిటలా తెల్లబోతున్నావు? నేను చేసింది తప్పా?" అని అడిగాడు వేణు. అయినా జవాబు చెప్పకుండా చూస్తున్న భార్యను కదిలిస్తూ, "ఏమిటి వీణా,నేను తప్పు చేసానా?"అని మళ్ళీ రెట్టించాడు వేణు.

"తప్పు కాదు. కానీ చాలా సాహసం చేశారు. ఆ శంకరన్నకు ఎన్నో కేసులతో సంబంధం వుందనీ, అతడిని పట్టుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూ, పట్టుకొన్న వారికి లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించింది అనీ మీకు తెలియదా? అలాంటి వాడి తమ్ముడికి మనం ఆశ్రయం ఇచ్చామని ఎవరికైనా తెలిస్తే,ఇంకేమన్నా వుందా? ఎంత ప్రమాదం?"భయం తీరని వీణ వణికే గొంతు తో అన్నది.

"నీవి అన్నీ అర్థం లేని భయాలు. అయినా స్వచ్ఛందంగా లొంగిపోయి,నేరాలు.అంగీకరిస్తే, వారిని క్షమించి, జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం తో పాటు ఉపాధి కూడా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కదా? తల్లి తండ్రుల కోసం,తోడబుట్టిన తమ్ముడి కోసం ఆ శంకరన్న కూడా లొంగి పోవాలని అనుకుంటున్నట్లుగా విన్నాను.నువ్వు లేనిపోని అనుమానాలతో మనసు పాడు చేసుకోకు"అని ధైర్యం చెప్పాడు వేణు.

"ఏమో బాబూ,నాకైతే చాలా భయంగా వుంది. ఏ మాత్రం ఆచూకీ తెలిసినా,పోలీసులు మనల్ని వదిలి పెట్టరు"అన్నది వీణ.

"తెలిస్తే కదా? నీ వల్లే తెలుస్తుంది అనిపిస్తోంది." అని విసుక్కున్నాడు వేణు. చిన్న బుచ్చుకొంది వీణ. అది గమనించిన వేణు మళ్ళీ భార్యను కౌగిట బందిస్తూ "అలా అలుగకు రా. ఏమీ కాదు.నువ్వు అనవసరంగా భయపడకు."అని లాలించాడు. వీణ మౌనంగానే అతని సందిట ఒదిగిపోయి కళ్లు మూసుకుంది.

@@@. @@@. @@@. @@@

తెలతెల వారుతుండగనే నిద్ర నుండి మేల్కొన్న వీణ కంగారుగా మేడ పైకి పరిగెత్తింది. అక్కడ రామూ లేడు. పక్క బట్టలు నీట్ గా మడుత బెట్టబడీ, చాప చుట్టబడి వున్నాయి. వాటర్ బాటిల్ క్రింద మడత పెట్టిన తెల్ల కాగితం చూసిన వీణ ఆత్రంగా అది విప్పి చూసింది.

"సార్/మేడం, నేనెవరో తెలిసి కూడా నాకు అన్నంపెట్టి, ఆదరించారు, ఆశ్రయము ఇచ్చారు. చాలా థాంక్స్. నా వల్ల ఎవరికీ, ఏ ఇబ్బందీ రాకూడదని ఎవరికీ కనబడకుండానే వెళ్ళి పోతున్నాను. క్షమించండి. రామూ."అని వుంది అందులో.

అది చదవగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వీణ కు. ఎప్పుడు వచ్చాడో వేణు కూడా వెనుకనుండి ఆ ఉత్తరం చదివి, వీణతో "చూసావా ఆ పిల్లాడి స్వాభిమానం?"అన్నాడు.

"పాపం, ఎలా వెళ్తాడా అబ్బాయి?"సానుభూతిగా అన్నది వీణ.

"ఎక్కడో పల్లెటూరి నుండి ఇక్కడి దాకా వచ్చిన వాడు ఎలాగైనా వెళ్ళగలడులే. కానీ వాడి విజ్ఞత చూసావా,ఎవ్వరికీ ఇబ్బంది కలుగ కూడదని ఎలా ఉత్తరం రాశాడో ?" అన్నాడు వేణు.

"నిజమే. చిన్న వాడే, అయినా చాలా తెలివైన వాడిలా వున్నాడు. ఎలాగైనా వాళ్ళ అన్నయ్యను కలిసి, ఒప్పించి తనతో తీసుకెళ్లాలి అనీ, వాళ్ళ కుటుంబం అంతా సుఖంగా వుండాలి అనీ ఆశిస్తున్నాను"అన్నది వీణ మనస్ఫూర్తిగా.

"మంచి మనసుతో నీవు కోరే కోరిక తప్పక నెరవేరుతుంది. దేవుడు వింటాడు లే."అన్నాడు వేణు.

"అందరూ బాగుండాలి. అదే మనకు కావల్సింది"అని పక్క బట్టలతో క్రిందికి వెళ్ళింది వీణ.

"అవును, వీణా, నువ్వు చెప్పింది నిజం"అంటూ భార్యను అనుసరించాడు వేణు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత్రి పరిచయం :చల్లా సరోజినీ దేవి

నేనొక రిటైర్డ్ హిందీ పండిట్ ను.నేను రాసిన కథలు విపుల,స్వాతి ,ఆంధ్రభూమి వంటి పత్రికల్లో ఎప్పుడో ఏళ్ళ క్రితం అచ్చయినవి. నా కథలు కొన్ని సంకలనంగా కూర్చి నా పిల్లలు"భావ సుధ లు"అను పేరుతో బుక్ ప్రింట్ చేయించారు.ప్రస్తుతం ప్రతిలిపి లో తరచుగా కథలు,కవితలు పోస్ట్ చేస్తుంటాను. జ్వలిత గారి కథయిత్రుల సమూహం లోనూ,అయినంపుడి శ్రీలక్ష్మి గారి అక్షారయాన్ లోనూ సభ్యురాలిగా వున్నాను.


128 views1 comment

1 Comment


Wonderful story..... <3

Like
bottom of page