Veluturu Venuka Written By Kandregula Srinivasarao
రచన : కాండ్రేగుల శ్రీనివాసరావు
ఆ వృద్ధాశ్రమం ముందర ఆటో ఆగింది.
అందులో నుండి క్రిందకు దిగిన అనన్య బెరుకు బెరుకుగా గేటు తీసుకుని అదిరే గుండెతో లోపలకు అడుగుపెట్టింది.
గేటు చప్పుడికి “ఎవరదీ?” అంటూ ఒక ఆయన ఎదురుగా వచ్చాడు. బహుశా వాచ్ మెన్ కాబోలు...
“ నేనండీ... నేను.... ” అంటూ మాటల కోసం తడుముకో సాగింది ఆమె.
“ నేనంటే??? ఇంతకీ ఎవరు కావాలి అమ్మాయి నీకు? ” అడిగాడు అతను కాస్త అసహనంగా.
“ ద... దక్షిణామూర్తి గారు...” చెప్పింది సంకోచిస్తూ...
“ పిలుస్తాను... మీరు ఎవరని చెప్పాలి? ” అడిగాడు వెళ్తున్న వాడల్లా ఆగి.
ఏమని చెప్పాలో తెలియలేదు ఆమెకు. “ అనన్య వచ్చిందని చెప్పండి ” అంది వణికే స్వరంతో.
“ ఇక్కడ కూర్చోండి, పిలుచుకు వస్తాను” అతడు లోపలకు వెళ్లాడు.
ఆ ఆశ్రమ పరిసరాలని పరికిస్తూ కూర్చుంది ఆమె.
గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆయన వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అన్న భయం అంతర్లీనంగా ఆమెలో కలుగుతూనే ఉంది.
కాసేపటికి అడుగుల చప్పుడు వినిపించింది. దాంతో అటు తిరిగింది, దక్షిణామూర్తి గారిని చూడగానే అప్రయత్నంగా లేచి నిల్చుని రెండు చేతులు జోడించింది.
“ ఎవరూ??? ” అంటూ కళ్ళద్దాలు సవరించుకుంటూ వచ్చిన దక్షిణామూర్తిగారి భృకుటి ముడిపడింది. కోపం ఉవ్వెత్తున లేచింది.
“ ఎందుకొచ్చావ్ ఇక్కడకు? ఇంకా ఏం మిగిలి ఉందని? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండా నివ్వ దలుచుకోలేదా... నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది ” వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆయత్తమవసాగారు.
అనన్య అతనికి ఎదురుగా వచ్చి కాళ్ళ మీద పడిపోయింది..
“ తండ్రి లాంటి వారు... మీరు నన్ను క్షమిస్తారని కొండంత ఆశతో వచ్చాను. దయ చేసి కాదని వెళ్ళిపోకండి... నిజమే! మీకు నేను క్షమించరాని ద్రోహం చేశాను. అందుకు అనుభవిస్తున్నాను. శరణు కోరి వచ్చాను. నా జీవితం అతలాకుతలం అయిపోయింది మీరే నాకు దిక్కు...” ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఆమె కన్నీరుని చూడగానే దక్షిణామూర్తి గారిలో కోపం కరిగిపోయింది. కాస్త మెత్తబడి ఆమె తల మీద లాలనగా చేయివేశారు
అతని ఆప్యాయమైన చేతి స్పర్శతో కన్నీటి పర్యంతమైంది ఆమె.
ఈ చేతి పైనేనా తను నిష్టూరాలు ఆడింది...?
ఈ చేతి పైనేనా తను కుట్ర పన్నింది...?
అటువంటి ఈ ఆత్మీయ చేయి, అన్నీ మరిచిపోయి తనని వాత్సల్యంగా ఓదారుస్తూ స్పర్శిస్తోంది... తను ఇప్పుడు కోరుకుంటున్నది కూడా రవ్వంత ఆప్యాయతే కదా...
అనన్యకి దుఃఖం ముంచుకొచ్చింది.
“నువ్వు నా ఇంటికి దీపం పెట్టే కోడలివి...తప్పక కలుపుతానమ్మా మీ ఇద్దర్నీ...కానీ అనన్యా...ఒక్క మాట అడుగుతున్నాను ...మా తండ్రీకొడుకుల ఇన్నేళ్ల అనుబంధాన్ని ఒక్క తూటా లాంటి మాటతో విడదీసేశావు కదమ్మా... నా కొడుకుని నాకు కాకుండా చేసేశావు. తలచుకుంటున్న కొలదీ నా గుండె తరుక్కుపోతూంది. మంచిదారిలో నడవమని చెప్పటమే నేను నీకు చేసిన ద్రోహమా తల్లీ... చరమాంకంలో నువ్వు పెట్టిన చిచ్చు... నాకెంతటి మనోవ్యధని కలిగిస్తోందో తెలుసా...? ” దక్షిణామూర్తిగారు కన్నీటి పర్యంతమౌతూ ఒక్కో మాట అడుగుతూ ఉంటే, పశ్చాత్తాపంతో విలవిలలాడింది ఆమె.
“ అవునంకుల్...నేను మీకు చేయరాని ద్రోహం చేశాను… 'నన్ను క్షమించండి' అని అడగటానికి కూడా అర్హత లేనిదానిని ...ఇంత జరిగేక కూడా నన్ను మీ ఇంటికి దీపం పెట్టే ఇల్లాలిగా ఆదరించటం నన్ను కలచి వేస్తూంది...నేనలా చేసి ఉండకూడదు... నేనలా ప్రవర్తించి ఉండకూడదు...పాపిష్టిదానను... నా పాపానికి నిష్కృతిలేదు...” అంటూ తల బాదుకుంటూ రోదించసాగింది అనన్య. చాలా సేపు అలా వెక్కుతూనే ఉంది.
అతని ఆప్యాయమైన చేతి స్పర్శ తన జీవితానికి ఒక పెద్ద భరోసా అనిపించింది. ఇంకెప్పుడూ జీవితాన్ని గతి తప్పనివ్వకూడదు అని స్ధిరంగా నిశ్చయించుకున్నది అనన్య.
***** ***** *****
దక్షిణ మూర్తి గారి భార్య గతించి అయిదేళ్ళు కావొస్తోంది. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేశారు. కోడలు అనన్య చాలా అందమైన అమ్మాయి. కుందనపు బొమ్మలా ఉంటుంది.
ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే! టీమ్ లీడ్ గా పనిచేస్తోంది భార్యాభర్తలిద్దరూ వేరు వేరు కంపెనీలలో పని చేస్తున్నారు. బెంగళూరులో కొడుకు కోడలు దగ్గరే ఉంటున్నారు ఆయన. అతని కి పెన్షన్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు.
ఓ రోజున...
“అమ్మాయ్ అనన్యా !... బయటికి వెళ్తున్నాను, సరుకులు ఏమైనా తెమ్మంటావా తల్లీ...” అడుగుతూ అద్దం ముందరకు వెళ్లి తల దువ్వుకోవటానికని ఆయత్తమవసాగారు ఆయన. పరాకుగా దువ్వెనను తలమీద ఉంచుకునే సరికి, దానికి ఉన్న పొడవాటి వెంట్రుకలన్నీ తలమీద, ముఖం మీద, చొక్కా మీద, వ్రేళాడుతూ చిరాకు రప్పించాయి అతనికి.
“ అనన్యా... దువ్వుకున్నాక, వెంట్రుకలని తీసి దువ్వెనను శుభ్రపరచాలి కదమ్మా... చూడు... నా మొహం మీద చొక్కా మీద ఎలా పడి ఉన్నాయో... మనం కాబట్టి సరిపోయింది...బయటవారు ఎవరైనా అయితే ఎంత చంఢాలంగా ఉంటుంది.” కాస్త అసహనాన్ని వెళ్ళగక్కారు ఆయన.
“ నేనే దువ్వుకున్నాను అంకుల్... ఈ విషయం గురించి మీ అబ్బాయి నేను అనేక సార్లు పోట్లాడు కుంటూనే ఉంటాము.” చెప్పింది అనన్య అదేదో ఘనకార్యంలా.
“ అన్నిసార్లు పోట్లాడుకున్నా పద్ధతి మార్చుకోలేదా అమ్మా...” అడిగారాయన విస్తుపోతూ.
“ అదేం పెద్ద తప్పా ఏమిటండీ మార్చుకోవడానికి... నేను తీయకపోతే, తర్వాత ఎవరికి అవసరమో వారే తీసుకుంటారు, ఈ పాటి దానికి, మీ అబ్బాయి ఏదో అంతర్జాతీయ సమస్యలా చూస్తూ అరుస్తూ ఉంటే నాకు మండి పోయేది....”
దక్షిణామూర్తి గారు చకితులయ్యారు.
“ నువ్వు దువ్వుకున్న దువ్వెనని, నీ తల వెంట్రుకల్ని వేరే వాళ్లు శుభ్రపరచుకోవటం... బాగుందమ్మా చాలా బాగుంది...” అన్నారాయన కాస్త వ్యంగ్యంగా.
“ అయినా ఒకరి దువ్వెనని మరొకరు ఉపయోగించడం ఏమిటి? ”.
“ అవును... నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ క్షణం నుండి నాకంటూ ఓ ప్రత్యేకమైన దువ్వెనని ఏర్పాటుచేసుకోవాలని.” అంటూ చెప్పుల్లో కాళ్ళు దూర్చి బయటకు నడిచారు ఆయన.
కోడలు సమాధానానికి ఆయన మనసు చివుక్కుమంది. ఆ అమ్మాయి భావిస్తున్నట్లు విషయం చిన్నదే.,. కానీ ఆమె శుభ్రపరచ వలసిన దాన్ని వేరే ఎవరో అవసరం ఉన్నవారు శుభ్రపరచుకుంటారులే అన్న ధోరణిలోనే నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. తన తప్పు తాను గ్రహించక పోయి, చెప్పినా నిర్లక్ష్యం వహించడం... తిరిగి ఇదేం పెద్ద తప్పా అని ప్రశ్నించటం... ఆయనని కాస్త బాధ పెట్టింది.
చాలా ఇళ్లల్లో ఇలాంటి చిన్నచిన్న విషయాలు స్పర్ధలను తెస్తుంటాయి. మాట మాట పెరిగి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి.
బైక్ మీద వచ్చి వీధి మధ్యలో, ఇంటి ముందర గేటు దగ్గర, పార్క్ చేసి హడావిడిగా ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంటారు చాలామంది యువకులు. “ ఇదేమిటి ఇలా? గేటు ఎదురుగా బండి పెట్టావ్ వచ్చి పోయే వాళ్లకి ఇబ్బంది కదా?” అని అడిగితే వాళ్ల ఇగో హర్ట్అవుతుంది. “ తీసేస్తాం లెండి” అనో “ ఇక్కడ ఏమీ ఉండబోములెండి...” అనో “ రోడ్డు ఏదో మీ సొంతంలా చెప్పారండి...” ఇలాంటి విసురైన మాటలు చెప్పడం పరిపాటి. అంతేగాని తన బైక్ ని ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలా పార్క్ చేశాననే ఆలోచనే రాదు. తమకు తాముగా తెలుసుకోకపోవడం, చెప్పినా వినిపించుకోకపోవడం...
పిన్న వయసులోనే పెద్ద పెద్ద చదువులు,ఉద్యోగాలు, సంపాదనలలో మునిగి ఉన్న యువతే ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మొండితనంతో అనాలోచితంగా ప్రవర్తిస్తూండటం విడ్డూరం అనిపించకమానదు. ఇదంతా కాల ప్రభావం కాబోలు...అనుకున్నారు దక్షిణామూర్తి గారు.
ప్రోజెక్టులు లేని కారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడింటికే ఇంటికి వచ్చేస్తుంది అనన్య. ఇల్లు చేరిన దగ్గరనుంచి సెల్ ఫోనే ఆమె ప్రపంచం... అందులో మునిగి లీనమైపోయి ముసిముసిగా నవ్వుకోవడం... ఎవరెవరితో మాట్లాడుతూ ఒకసారి, చాటింగ్ చేస్తూ ఒకసారి, బిజీగా ఉంటోంది ఆమె. ఏదైనా అవసరం పడి వెళ్లి అడిగితే, పరధ్యానంగా పొంతన లేని సమాధానాలు చెప్పడం... దానికి తోడు నిరంతరం... ఆ గోడ దగ్గర, ఈ కిటికీ కర్టెన్ దగ్గర, ఎక్కడెక్కడో సెల్ఫీలు తీసుకోవడం... వాటిని చూస్తూ మురిసిపోవటం... స్నేహితులతో షేర్ చేసుకోవడం... ఇదీ ఆమె దిన చర్య... ఇంట్లో ఉన్నంత సేపు ఆమె ప్రవర్తన ఇలాగే సాగుతూఉంటుంది. ఒక్కొక్కసారి ఏమౌతుందో ఏమో రోజంతా ముభావంగానే ముఖం మాడ్చుకుని ఉంటుంది.
ఆమె ఫోన్ కి కేటాయించిన సమయంలో పావు వంతైనా భర్తతో గడపకపోవడం దక్షిణామూర్తిగారిని అమితంగా బాధించసాగింది. ఏ తండ్రి అయినా కొడుకు కోడలు అన్యోన్యతను ఆశించడం సహజమే కదా!
ఓ రోజున హడావుడి పడుతూ సెల్ ఫోన్ మర్చిపోయి ఆఫీస్ కి వెళ్లి పోయింది అనన్య.
లాక్ ఓపెన్ చేసి కోడలు ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్, లాంటివి ఓపెన్ చేసి క్యూరియాసిటీ గా చూడసాగారాయన.
ఒకరి పర్సనల్ విషయాలు ఇలా చూడటం తప్పనిపించినా, కుటుంబపెద్దగా చూసే చనువు, ఆపాటి అధికారం తనకుందిలే అని తనకు తాను సర్దిచెప్పుకున్నారు.
కోడలు అభిరుచి ,అంతరంగం, బయటపడడంతో ఆయన ముఖం పాలిపోయింది. పరాయి పురుషులకి సెల్ఫీలు పంపిస్తూ లైకులు, కామెంట్లు, కోరటం... అపరిచితులతో అసభ్యకరమైన సంభాషణలతో చాటింగ్ చేయటం... ఇదీ ఆమె చేస్తున్నపని... అవన్నీ చదివి ఆయన మనస్తాపం చెందసాగారు.
ఏదో ఒక కళనో, క్రీడనో ఆశ్రయించి అలవర్చుకుని దానిని అంతర్జాలంలో ప్రదర్శిస్తూ పలువురి అభిప్రాయాలు కోరడంలో తప్పులేదు. ఈ విధానం తనని తాను తీర్చిదిద్దుకోవడానికి దోహదపడుతుంది.
కానీ ఇదేమిటి?
అందంగా ఉండటం, శారీరక అందాల్ని నలుగురుకీ చూపించాలనుకోవటం, సాధన చేసేటటువంటి కళ కాదు కదా! సెల్ఫీ లతో లైకులు కామెంట్లు కోరటం...ఇదేమి అభిరుచి..., పది మంది మగాళ్ల దగ్గర. ఎవడో ఒకడు ఒక అడుగు ముందుకు వేసి, వల విసరకుండా, వల్గర్ కామెంట్స్ చేయకుండా ఊరుకుంటాడా? అటువంటి గూడార్థపు కామెంట్లునే ఈతరం వారు ఆశిస్తున్నారా? ఒకవేళ అలాగే ఆశిస్తే దీనిని ఏమనుకోవాలి? ఇటువంటి అభిరుచులు ,హాబీల ఎంజాయ్ మాట ఎలా ఉన్నా, జీవితాన్ని ఎక్కడకు తీసుకువెళ్తాయి? లేనిపోని సమస్యలు సృష్టించుకుని సంసారంలో కలతలు తెచ్చుకోవటం తప్ప...
తన కోడలు అనన్య కూడా ఇలాంటి కామెంట్లు మత్తులోనే మునిగి తేలుతూందా?
దక్షిణామూర్తి గారి ఆలోచనలు పరిపరివిధాలుగా పరిభ్రమిస్తున్నాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.
ఈ విషయాన్ని కోడలు దగ్గర ప్రస్తావిస్తూ ఆమెను మందలించడం మంచిదా? కాదా? అని కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయారు ఆయన. కానీ ఆమె తప్పుని ఆమె తెలుసుకుంటూందో లేదో అన్నది కూడా సంశయమే!
అలా అని ఈ విషయం కొడుకుతో ఏమని మాట్లాడగలడు? వారిద్దరి మధ్య కలతల్ని తనే సృష్టించిన వాడు అవుతాడు. సమయం సందర్భం వచ్చినంత వరకు మౌనంగా వేచి చూడటమే మంచిది అనిపించింది ఆయనకు. ఇలాంటి వి ఎవరితోనని పంచుకోగలడు?
ఒక నాడు... అనుకోని సంఘటన ఎదురైంది. అనన్య కోసం ఫేస్ బుక్ ఫ్రెండ్ ఒకడు డైరెక్ట్ గా ఇంటికే వచ్చేశాడు. ఆ సమయాన తను ఇంట్లోనే ఉన్నాడు. అనన్య అతడి రాకని చూసి తొట్రుపాటు పడింది. అవతల వ్యక్తి, కనీసం తను ఉన్నాడు అనే ధ్యాసయినా లేకుండా తన ఎదురుగానే అనన్య అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ఎలాగో మేనేజ్ చేసి వాడిని త్వరగా పంపించివేసి “ హమ్మయ్య ” అని కోడలు స్ధిమిత పడుతూ వూపిరి తీసుకోవటాన్ని చూసి చూడనట్లుగానే గమనించారాయన.
ఆ తర్వాత “ వచ్చింది ఎవరమ్మా ” అంటూ అనన్యని ప్రశ్నించారు.
“మా బంధువుల అబ్బాయే అంకుల్...” అని గాబరా పడింది ఆమె.
“ మీ పెళ్లిలో గానీ , మీ చుట్టాల్లో గానీ అతన్ని చూసినట్టు లేదే? ” అన్నారాయన సందేహాన్ని వ్యక్తపరుస్తూ...
“ అప్పుడు స్టేట్స్ లో ఉన్నారు అంకుల్... అందుకే మీరు చూసి ఉండరు... ” అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పేసింది.
నెలలోనే మళ్లీ ఇలాంటి మరో సంఘటన పునరావృతమైంది. తన కొడుకు లేని సమయంలో మరో అపరిచితుడు ఇంటికొచ్చాడు. ఇక ఆగ లేక పోయారు దక్షిణామూర్తి గారు. కోడల్ని నిలదీశారు. మొదట మంచిగా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె ఈగో హర్టయింది. తప్పుని అంగీకరించటానికి కూడా పెద్ద మనసు ఉండాలి కదా! మాటా మాటా పెరిగింది. “నన్నుఅనుమానించడానికి మీరెవరు? ” అని కోడలు రోషంగా మామగారిని అడిగే స్థాయికి వివాదం పెరిగింది. తగాదా ఎందుకులే అని ఆయన కాస్త తగ్గారు. ఆ సాయంత్రం కొడుకు ఇంటికి రానేవచ్చాడు. పగలంతా ఆఫీసు వర్క్ తో అలసిఉన్న కొడుకుకి వచ్చీరాగానే ఇలాంటి విషయాలన్నీ చెప్పి బాధపెట్టడమెందుకని మౌనంగా ఉండిపోయారాయన. అదే అతను చేసిన తప్పిదమైంది.
ఆ రాత్రి అనన్య భర్తతో ఏం చెప్పిందోగానీ, తెల్లవారేక దక్షిణామూర్తి గారు ఎదురుపడినప్పుడల్లా మండిపడుతూండేవాడు కొడుకు.
“ ఏళ్లు రాగానే సరికాదు... పెద్దరికంతో మసలుకోవటం నేర్చుకోవాలి...కోడలుకి తండ్రి అంతటివాడు మామ...అలాంటి వ్యక్తే అనుచితంగా ప్రవర్తించటం కలికాలం కాకపోతే మరేమిటి? పిల్లలు, ముసలాళ్లని వృద్దాశ్రమాలల్లో పెడుతున్నారూ అంటే పెట్టరా మరి! వయసుకు తగ్గ ప్రవర్తన లేకపోతే పెట్టక ఏం చేస్తారు...”
మొదట్లో ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించి అంటున్నాడో తెలిసేది కాదు. రాన్రానూ అవి తనని ఉద్దేశించినవే అని గ్రహించారాయన. అంతేకాదు ఆనాటి నుండి ఇంట్లో అతని బ్రతుకు దుర్బరమైంది. ఛీత్కారాలు, చీదరింపులు, అవమానాలు, అవహేళనలతో ఓ పురుగును చూసినట్లు చూసేవారు. అవ్వన్నీ నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చారు దక్షిణామూర్తిగారు. వారి మధ్య తన జీవనం కష్టమనిపించసాగింది. ఆత్మీయత, అభిమానం సంగతి అటుంచి , కనీసం తన వయసుకైనా గౌరవ మర్యాదలు లేని చోట ఆయన ఎన్నాళ్లని ఉండగలరు?
నెలా నెలా నగదుచెల్లించేలాంటి, మంచి వసతి సౌకర్యాలు కలిగినటు వంటి వృద్దాశ్రమంలో చోటు సంపాదించుకుని వెళ్లిపోవటానికి తన సామాన్లుతో ఆయుత్తమవసాగారు. “ఎందుకండీ... మీరలా వెళ్లిపోతే మేమేదో చూడలేదని నలుగురూ అనుకోరూ...మాతోనే ఉండండి...” అని కొడుకు కోడలు అంటారేమోనని ఏ మూలనో చిన్న ఆశ కదలాడేది ఆయనలో.
కానీ... అటువంటిదేదీ వాళ్ల నుంచి రాకపోవటంతో అతని ఆశ నిరాశే అయింది. మనసు ద్రవించింది. తన కొడుకుని ఉన్నతుడు గా తీర్చిదిద్దటానికని తను ఎంతో శ్రమించాడు. ఎన్నెన్నో త్యాగాలు చేశాడు. భార్య ఉండి ఉంటే తన కష్టం గురించి వాళ్లతో ఏకరవు పెట్టి ఉండేది. ఇప్పుడు ఆమె కూడా లేదు. తను వంటరి అయ్యాడు. ఇంతేనా జీవితం??? అని అనిపించసాగింది. భారమైన మనసుతో, కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లుతో గడప దాటారాయన.
బాధపడుతూ వెళ్లినప్పటికీ కూడా ఆ వృద్దాశ్రమంలో అడుగుపెట్టేసరికి ఆ వాతావరణం అతన్ని ఆనందపరిచింది. ఉదయాన్నే లేవటం, ఇష్టమైతే యోగా చేయటం, గార్డెన్ లో పచార్లు చేయటం, టిఫిన్, భోజనం, తనలాంటి వారితో మాటామంతీతో కాలక్షేపం చేయటం, పుస్తకాలు చదువుకోవటం, వారానికి రెండు సార్లు వైద్య పరీక్షలు, చక్కనైన వాతావరణం, రుచికరమైన తిండి, విశ్రాంతి, ఇంత కన్నా ఈ వయసులో అతనికి ఇంకేం కావాలి...ఇంటి దగ్గర కన్నా అక్కడే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నారాయన.
తన ఇంటికి దగ్గరలో ఉన్న స్నేహితుడొకరు వారానికి ఒకసారి ఆశ్రమానికి వచ్చి తనని పలుకరించి క్షేమసమాచారాలు అడుగుతూ వెళ్తుంటాడు. కొడుకు కోడలు సంగతులు అతని ద్వారానే తెలుస్తుంటాయి. తను ఆ ఇంటినుండి వచ్చేసిన నెలరోజులకే వాళ్ల మధ్య తగాదాలు మొదలయ్యాయి అట! అనన్య ఎన్ని రోజులని దాయగలదు. ఏదో ఒక రోజున బయటపడక మానదు కదా! ఆమె సెల్ ఫోన్ ని తను చూసినట్లే తన కొడుకు కూడా ఏదో ఒకరోజు చూడక పోతాడా? మనసులో అనుకున్నారు దక్షిణామూర్తి గారు.
దంపతుల వివాదం చిలికి చిలికి గాలివాన అయిందట, “ మీ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు.” అని తన కొడుకు ఆమెను తీసుకువెళ్లి వాళ్ళ అమ్మ గారి ఇంటి దగ్గరకు సాగనంపేశాడట! అంతేకాదు రెండు వారాలు తిరగక ముందే “ నీతో కాపురం నాకు సరిపడదు విడాకులు కావాలి ” అంటూ లాయర్ నోటీస్ పంపాడట, ఈ సంఘటనతో అనన్య బాగా డిస్టర్బ్ అయిందట, డిప్రెషన్, ఇరిటేషన్లతో జాబ్ కూడా సరిగ్గా చేయలేక పోతే, రెండు మూడు మెమోలు ఇచ్చి ఆ తర్వాత వాళ్లు కూడా ఉద్యోగం నుండి తొలిగించేశారట! ఒకపక్క జాబు పోవటం, మరోపక్క భర్తతో ఎడబాటు, ఈ రెండింటికీ తోడు “బంగారం లాంటి కాపురాన్ని చేజేతులా ఎలా పాడు చేసుకున్నావో కదా ”అని ఇంట్లో వాళ్ల సూటి పోటు మాటలు, తోడు అయ్యాయట! దాంతో నల్లేరు మీద నడక లాంటి తన జీవితం ఎలా తయారయిందో అని చింతిస్తున్న తరుణంలో “ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో కదా... నీ కాపురాన్ని చక్కదిద్దాలి అంటే ఒక్క మీ మామయ్య గారి వల్లే అవుతూంది.ఆయనను ఆశ్రయించి ప్రయత్నించి చూడకూడదూ...”అని ఈయనే సలహా ఇచ్చాడట! ఇవ్వన్నీ ఆయన చెప్పిన సంగతులు... అందువలనే కాబోలు అనన్య తన దగ్గరకు వచ్చింది అనుకున్నారు దక్షిణామూర్తి గారు.
***** ***** *****
“ రమ్మనమని ఫోన్ చేశారు. ఎందుకు డాడీ ? ” ఎదురుగా కూర్చుంటూ అడిగాడు కొడుకు.
రెండు క్షణాలు మౌనం వహించేక “అనన్య వచ్చింది...” స్తబ్దతను ఛేదిస్తూ అన్నారు దక్షిణామూర్తి గారు.
ఆ మాట వినగానే కొరకొరా చూసాడు కొడుకు.
“ ఆ నీచురాలిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు. గేటు బయటకు తోసేయలేక పోయారా?” కోపంగా అన్నాడు.
“ లేదురా అంత పని చేయటానికి ఆ అమ్మాయి ఏం చేసింది కనుక? మనిషి బాగా చిక్కిపోయిందిరా. ముఖంలో ఇదివరకటి కళ కూడా లేదు... ఏది ఏమైనా నిన్ను వదులుకున్నందుకు బాగా చింతన పడుతున్నట్లు ఉందిరా ”
“ఇంకా ఇంకా పడాలి డాడీ... చింతతో కృశించి కృశించి చావాలి ఆమె. అప్పుడే నా మనసుకు శాంతి. ఏ ఆడదానికైనా అంతటి తెంపరితనం పనికిరాదు... ” రోషంగా అన్నాడు అతడు.
“తెంపరితనం కాదురా... తెలియని తనం... అమాయక తనం... టెక్నాలజీ మత్తులో భవిష్యత్ ని గ్రహించకపోవడం... చేతులు కాలేక ఆకులకై వెతకులాడటం...”
“ మీరు ఎన్ని చెప్పినా... ఆమె నేను కలవడం అసాధ్యం డాడీ...”
“ అటువంటి పెద్దపెద్ద మాట్లాడకు రా. జీవితం ఏ క్షణానికి ఏ మలుపు కి దారితీస్తుందో తెలియదు కదా! ఈ రోజు వద్దని అనుకున్న వారే రేపు అవసరం పడవచ్చు... ఈరోజు కావాలనుకున్నవారు రేపు దూరం అయిపోనూవచ్చు... నీకో సంగతి తెలుసా? తప్పు ఆమెది కాదురా! కాలానిది. అవును ముమ్మాటికీ కాలానిదే తప్పు... నీకో చెల్లెలో అక్కో ఉండి ఉన్నారే అనుకో... వాళ్లు కూడా ఈ కాలానికి తగ్గట్టు ఇలాగే ఉండి ఉందురేమోనని ఎందుకు అనుకోవు”
“మీ పెంపకం... మన వాతావరణంలో అలా ఎప్పటికీ ఉంచదు డాడీ... ఆండ్రాయిడ్ ఫోన్లు ఎవరి చేతిలో చూసినా నాకెందుకో ఇరిటేషన్ వచ్చేస్తుంది...తీసుకుని నేలకేసి కొట్టాలనిపిస్తూంది ”
“ అదే తప్పు... నీ ఆలోచన సరైనది కాదు. సెల్ ఫోన్ లో ఏవో గేమ్స్ ఆడుతూ, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదే సెల్ ఫోన్... రీసెర్చ్ స్కాలర్స్ రిఫెరెన్స్ కి దోహదపడుతూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది కూడా. దానిని ఉపయోగించుకునే విచక్షణ మనలో ఉండాలి... అంతేగానీ ఆ సాధనం ఏం చేస్తుంది? దానిని మనం సక్రమంగా వినియోగించుకునే విచక్షణ మనలో ఉండాలి గానీ...”
“ మీ కోడలు మీ మీద ఎన్నెన్ని చెప్పిందో తెలుసునా? స్నానం చేసి వస్తూంటే బెడ్రూమ్ లోనికి వెళ్లి ఆమె బుగ్గ గిల్లారట! ”
“ అవునా??? ” చిన్నగా నవ్వారు ఆయన.
“ ఆమెని మందలించాననే కోపంతో అలా ఏదేదో చెప్పిఉంటూంది. నా మనసాక్షిగా చెబుతున్నాను. నేనెప్పుడూ ఆమెని పుత్రికా వాత్సల్యంతోనే చూసేవాడిని. ఆ సంగతి నీకు తెలియదా ఏమిటి...నీ విచక్షణ ఏమైంది? పాతికేళ్లుగా నా తండ్రి నాకు తెలుసు...ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అలా ప్రవర్తించడు...అని నువ్వు ఖచ్చితంగా ఆమెతో చెప్పగలిగావా? లేదే...అంటే నా మీద నీకు కూడా సంపూర్ణ మైన నమ్మకం లేనట్లేగా... నా మీద ఏదో చెప్పి ఆమె తప్పుచేసిందన్నప్పుడు, విని, దానిని నమ్మిన నువ్వు కూడా అంతే తప్పు చేసినట్లే కదా... పాతికేళ్ల నమ్మకం రెండేళ్లుగా ఉన్న నీ భార్య మాట దగ్గర వమ్మయి పోయింది. ఆ తరువాత నాపట్ల మీ ఇద్దరూ ప్రవర్తించిన తీరే నన్ను ఎక్కువగా బాధించసాగింది. ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు...” కాసేపు ఆగేరు దక్షిణామూర్తిగారు. తండ్రి వైపు చూస్తూ మౌనంగా వింటున్నాడు కొడుకు.
“ అనన్య మంచిది కాదనే అనుకుందాం... ఆమెని వదిలేద్దాం...సరే...తరువాత నువ్వు ఎవర్నో ఒకర్ని చేసుకుంటావు కదా...ఆమె కూడా ఇలా ఉండదు అని చెప్పలేం కదా! ఎలా ఉంటూందో తెలియదు కదా! ఇంత కన్నా ఎక్కువ సమస్యలే రావొచ్చుకదా! జీవితం రంగురంగుల వలయం...ఆకర్షణలు సహజమే... ఆకర్షణలకు లోను కాకుండా నువ్వు కూడా పెద్దాడివి కాలేదుగా...అలాగే ఆ దారి తప్పుఅని తెలియక అటువైపు వెళ్లింది. కాలిలో ముల్లు ఉందని కాలు కోసుకోలేం కదా...తన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపపడుతోంది...అంతెందుకు ఆమె జ్ఞాపకాలు లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావా? ఉండలేవని నాకు తెలుసు... జీవితంలో చిన్న చిన్న అపశృతులు తారసపడటం మామూలే...వాటిని సరిచేసు కుంటూ ముందుకు సాగిపోవాలి. అనన్య మంచి అమ్మాయి... తన తప్పుని తెలుసుకుంది. క్షమించమని వేడుకుంటోంది. నువ్వు వెళ్లి తీసుకొస్తే పద్దతిగా ఉంటుందని నా ఉద్దేశం... ఇక ఏమీ మాట్లాడ కుండా నేను చెప్పినట్లు చేయి...” ఆజ్ఞాపించినట్లుగా అన్నారాయన.
“ నేనిప్పుడు ఏమీ చెప్పలేను డాడీ...నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి...”
వెళ్లిపోయాడు కొడుకు.
***** ***** *****
ఫోన్ మ్రోగుతోంది.
డిస్ ప్లే వైపు విస్మయంగా... విప్పారిన నేత్రాలతో...
అలా చూస్తూ ఉండిపోయింది అనన్య.
ఈమధ్య కాలంలో తను ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోని నెంబర్ నుంచి తనకి ఫోన్...
ఆ నెంబర్ తన భర్తది.
ఘనీభవించిన అతని హృదయం కరిగింది. తనని కరుణించింది.
అలవికాని ఆనందమేదో ఆమెని తాకినట్లయింది.
మలయమారుత పవనం ఆమెను స్పృశించినట్లయింది.
లోపలనుండి తన్నుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ వణికే పెదవులతో
“ హలో ” అంది.
“అనన్యా...నేనూ...రేపు వస్తున్నాను...నిన్ను తీసుకెళ్లటానికి. అన్నట్టు చెప్పటం మరిచాను. నీకు మెయిల్ పెట్టాను. అందులో ఉన్న మెయిల్ ఐడీకి నీ రెస్యూమ్ ఫార్వార్డ్ చేయ్...మా కంపెనీలో ఓ పోష్టు ఉంది...మా సి.ఇ.ఓగారితో మాట్లాడాను. ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చి తీరుతూంది. రేపు వచ్చిన తరువాత అన్నీ వివరంగా మాట్లాడుతాను. బై...”
౼ అలాగే అని చెప్పటం కూడా మర్చిపోయింది అనన్య.
ఆమె కళ్ల వెంబడ కన్నీటి ధారలు...
ఆనందబాష్పాలు...
చీకట్లు తొలిగిపోయాయి. ఇకమీదట అంతా వెలుగే...
భర్తలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు వెనుక ఓ పెద్దమనసు ఆశీర్వాదం ఉంది. ఆయనే కనుక లేకుంటే తన జీవితం ఏమై ఉండేదో...
ఆ చల్లని చూపు తన మాంగల్యాన్ని నిలబెట్టింది.
పతనం వైపు సాగిపోతున్న తన జీవితాన్ని పదిలపరిచింది...
ఆ మంచి మనసు తనకు మంచి జీవితాన్ని ప్రసాదించింది.
ఆమె మనస్సంతా మామగారి పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.
ఇంకెప్పుడూ జీవితాన్ని గతి తప్పనివ్వకూడదని మనసులో గట్టిగా తీర్మానించుకుంది అనన్య.
***** ***** *****
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
రచయిత పరిచయం :
కథ అంటే అమితంగా ఇష్టపడే కాండ్రేగుల శ్రీనివాసరావు గారు, 1986 నుండి కథలు వ్రాస్తున్నారు. ఇంచుమించుగా అన్ని తెలుగు దిన, వార, మాస ,పక్ష ,పత్రికలలోనే కాకుండా, ప్రత్యేక సంచికలకు కూడా, రమారమి నాలుగు వందలకు పైబడి కథలు వ్రాశారు. కొన్ని పత్రికలలో శీర్షికలు నిర్వహించారు.ఈయన కథలు హిందీ ,కన్నడ బాషలలో అనువదించ బడ్డాయి.అనేక కథలు బహుమతులు అందుకున్నాయి.పత్రికలకే కాకుండా ఆన్లైన్ మ్యాగ్జైన్లలో కూడా విరివిగా రాస్తూ బహుమతులు అందుకుంటూనే ఉన్నారు. భార్య రాజ్యలక్ష్మి , కొడుకు శరత్ చంద్ర , కూతురు చాందిని, అల్లుడు శివచెల్లారామ్ , మనవడు అవ్యాన్ ,ఇదీ వీరి కుటుంబం.
నివాసం విశాఖపట్నం.
శ్రీచరణ్ మిత్ర ,నందాత్రినాధ్ ,శ్రీనివాసశ్రీ ,ఈయనకు బాల్యమిత్రులు.
"Veluthuru Venuka" katha tho Kandregula vaaru neti tharaniki entho amulyamaina sahajathvamtho kudina sandesaanni icharu. Dhanyavadhaalu sir.🙏🙏
" VELUTHURU VENAKA " Ktha chaala baagundi. Kandregula Srèenivasa Rao garki thanks.
" సామాజిక మాధ్యమాలు " సద్వినియోగం చేసుకుంటే చాలా చాలా రకాలుగా వినియోగపడతాయి. అదే దుర్వినియోగం చేస్తే చాలా జీవితాలు నాశనం అవుతాయి. కాండ్రేగుల వారు నిజమైన, సహజమయిన కథ కళ్ళకు కట్టినట్లు గా చూపించారు. చాలా బాగుంది.
Super katha
సామాజిక మాధ్యమాలు మనిషి జీవితంతో ఏ విదంగా ఆడుకుంటున్నాయో కళ్ళకు కట్టినట్లుగా కథ లో చూపించారు. కోడలి వల్ల వృద్ధాశ్రమానికి వెళ్ళినా కూడా కోడలి లో కూతుర్ని చూసి ఆమె బాధను అర్థం చేసుకున్న మామగారి పెద్దరికం అభినందనీయం ఆద్యంతం కథ అద్భుతంగా నడిపించారు. ఇంత చక్కని కథ అందించిన మీకు నా అభినందనలు