top of page

విచిత్ర ప్రేమ కథ

#లక్ష్మీనాగేశ్వరరావువేల్పూరి, #LakshminageswaraRaoVelpuri, #విచిత్రప్రేమకథ, #VichitraPremaKatha, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

ree

Vichitra Prema Katha- New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

Published In manatelugukathalu.com On 07/07/2025

విచిత్ర ప్రేమ కథ - తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి



శిరీష చాలా గాభారాగా ఆఫీసుకు బయలు దేరింది, ఆఫీసుకు టైం అయిపోతుంది అన్న కంగారులో. 


తన ఎనిమిదేళ్ల కొడుకు వంశీని స్కూలుకు దిగబెట్టి ఆ తర్వాత సరిగ్గా 10:00గంటల కల్లా ఆఫీసులో ఉండాలి! 


‘అసలే మేనేజర్ చాలా కర్కోటకుడు, ఏమాత్రం లేటైనా తిట్టిపోస్తాడు’, అనుకుంటూ బస్టాండ్ లో బస్సు కోసం వేచి చూస్తోంది. అసలే ఎండాకాలం.. రద్దీ ఎక్కువగా ఉంటుంది. అరగంట నిలబడి ప్రయాణం చేయాలి. ఎలాగురా దేవుడా?.. అనుకుంటూ పోనీలే ఆటోలో వెళ్దాం అన్నా అంత ఖర్చు పెట్టలేదు. అసలే బోటాబటి జీతం. అందుకే బస్సు పాసు తీసుకుని రోజు అవస్థలు పడుతూ, 28సంవత్సరాల వయసులో భారంగా జీవితం సాగిస్తోంది. 


ప్రొద్దున్న లేవగానే కొడుకు వంశీని లేపి హోంవర్క్ చేయించి, తయారు చేస్తూ, వాడికి పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ కి బాక్సులు తయారు చేసి, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూలుకు దిగబెట్టి,మళ్లీ వచ్చి తాను తయారై, లంచ్ బాక్స్ కట్టుకొని ఆఘ మేఘాల మీద బస్టాండ్కు వచ్చి, ఆఫీసుకు రావడం..  రోజూ ప్రత్యక్ష నరకం చూస్తుంది శిరీష. 


ఆరోజు కూడా నిండు గర్భిణిగా ఉన్న బస్సు ఎక్కి, ఎక్కడా నిలబడడానికి కూడా జాగా లేక అవస్థ పడుతూ, ఆఫీస్ కి 10 నిమిషములు లేట్ అయింది. 

అయ్య బాబోయ్ చచ్చాను రా నాయనా! ఇవాళ కూడా తిట్లు తినాలి అనుకుంటూ, బాస్ రూమ్ లోకి వెళ్లి 'గుడ్ మార్నింగ్ సార్!’ అని అనగానే మేనేజర్ గారు చిరాగ్గా ‘ఏంటిది శిరీష? ఎప్పుడు లేటేనా.. ఎన్నిసార్లు చెప్పాలి టైం కు రావాలని.. అందులోనూ రిసెప్షన్లో ఉంటావు, కొంచెం టైం సెన్స్ ఉండాలి’, అంటూ గట్టిగా అరిచాడు 


'సారీ సార్. బస్సు లేట్ అయింది క్షమించండి’! అంటూ ప్రాధేయపడిన తర్వాత బాసు దగ్గర ఉన్న 'అటెండెన్స్ రిజిస్టర్లు' సంతకం చేసి నమస్తే పెడుతూ తన 'రిసెప్షన్ టేబుల్ ' దగ్గరికి వచ్చి చీర కొంగుతో ముఖం మీద పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఉండగా, అక్కడున్న స్టాప్ ఆమెను కొంచెం ఎగతాళిగా నవ్వడం చూస్తుంటే శిరీషకు తల కొట్టేసినట్లయ్యింది. 


ఆ తర్వాత లంచ్ టైం వరకు వచ్చిన వారందరికీ బలవంతపు చిరునవ్వుతో పలకరిస్తూ, వారికి ఆఫీసులో ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుందో, ఎంతో మర్యాదగా చెప్తూ తన బాధను మరిచిపోయింది సగటుజీవి శిరీష. 


కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా గతం గురించి ఆలోచిస్తుంది శిరీష.

శ్రీధర్, శిరీష ఒకే కాలేజీలో డిగ్రీ వరకు చదివి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని, తల్లిదండ్రుల అనుమతి లేకపోవడంతో వేచి చూడ సాగారు.


ఒకరోజు శ్రీధర్ మాట్లాడుతూ “శిరీష.. మన పెళ్లి కొన్నాళ్లు వాయిదా పడుతుంది.. ఇటుపక్క మీ తల్లిదండ్రులు, అటుపక్క మా తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు కనుక. కొన్నాళ్లు పాటు నేను తీవ్రంగా శ్రమించి, ఉద్యోగం సంపాదిస్తాను” అంటూ ప్రేమగా చెప్పేసరికి శిరీష కు ఎక్కడలేని కోపం వచ్చింది. 


“అదేంటి శ్రీధర్! నీకు ధైర్యం లేదా, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను నీతో వచ్చేస్తాను, మనిద్దరం వేరే ఊరెళ్ళి స్థిర పడదాం!” అని చెప్పేసరికి శ్రీధర్ ఆలోచిస్తూ “నిజమే, కానీ మన కన్న వాళ్ళని బాధ పెట్టి ఏం సుఖపడతాం! ఒక్క సంవత్సరం ఆగు, నాకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుందాం.” అని అనగానే, 


“శ్రీధర్.. ఇంత ఆలోచన ఉన్నవాడివి, నన్నెందుకు ప్రేమించావు? అంతటితో ఆగక ఎన్నో ఆశలు చూపి మనం పెళ్లి కాకముందే ఒకటైపోయాం, దాని పర్యవసానం ఏమిటంటే నేను ఇప్పుడు మూడు నెలల గర్భిణీ ని, ఇలాంటి సమయంలో అమ్మా నాన్నల దగ్గర ఎలా ఉండగలను, ఏం జవాబు చెప్పగలను, ఆలోచించు” అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న శిరీషను ఆశ్చర్యపోతూ శ్రీధర్, 


“నువ్వు కంగారు పడకు నీకు అన్యాయం చేయను, రేపు బొంబాయిలో ఒక పెద్ద కంపెనీలో ఆడిటర్ గా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది అది అవ్వగానే, నేను వచ్చి మన పెద్ద వాళ్ళందరికీ సర్ది చెప్పి, అందరి ముందు వివాహం చేసుకుందాం!” అంటూ దగ్గరకు తీసుకుని అనునయించేసరికి శ్రీధర్ ప్రేమలో కరిగిపోయింది శిరీష. 


శ్రీధర్ మర్నాడు ముంబాయి వెళ్లిపోయాడు, అలా నెల రోజులైనా అతని నుంచి ఒక ఉత్తరం కానీ, ఫోన్ కానీ రాకపోవడం తో శిరీష బెంగ పడసాగింది, ఇటు చిన్న గా తన శరీరంలోని మార్పు లు మొదలయ్యేసరికి ఇటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఎంత ప్రయత్నించినా పొంగుతున్న కడుపును ఎలా దాచుకోవాలో తెలియక, ఆ రోజు తన వైజాగ్ లో ఉంటున్న స్నేహితురాలు 'మాధవి' కి ఫోన్ చేసి తన బాధనంతా వెళ్ళగక్కు కుంది. 


అన్ని విషయాలు విన్న మాధవి కూడా “ఒసేయ్ శిరీష!, నీ అజాగ్రత్త వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నావు, అందుకే ఆడపిల్లలని తల్లి తoడ్రులు, కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు, సరే అయితే అయింది. శ్రీధర్ దగ్గర నుంచి పది రోజుల్లో ఏ జవాబు రాకపోతే, నువ్వు వెంటనే నీ తల్లిదండ్రులకు 'వైజాగ్ ' లో ఉద్యోగం వచ్చింది అని చెప్పి, నీ సామానుతో పాటు వచ్చేయ్. 


ఆ తర్వాత నీ డెలివరీ అయ్యే వరకు నాతో పాటే ఉందుగాని. ఈ లోపల నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాను. ఈ సహాయం మాత్రం నా తలకు మించినదైనా నీకోసం చేస్తాను!” అంటూ ధైర్యం చెప్పింది. 


శిరీష వారం రోజులు పోయిన తర్వాత “నాన్నగారు! నేను వైజాగ్ వెళ్తున్నాను. నాకు ఫైనల్ ఇంటర్వ్యూ ఉన్నది, ఒకవేళ సెలెక్ట్ అయితే సంవత్సరం పాటు ‘ప్రోబాషన్ పీరియడ్' ఉంటుంది. అమ్మ, నువ్వు జాగ్రత్తగా నీ పెన్షన్ డబ్బులతో రెండు నెలలు సర్దుకోండి. ఆ తర్వాత నుంచి నేనే పంపుతాను. ఎన్నాళ్ళని ఈ ఊర్లో ఉద్యోగం ట్రై చేసిన రాలేదు. కనుక నా స్నేహితురాలు మాధవి ఇంటికి వెళ్లి అక్కడ ఉండి ఉద్యోగం చేస్తాను. మీరు బెంగ పడవద్దు” అని చెప్పింది. 


తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో బాధపడుతూ 

“పోనీలే అమ్మా! నీ పెళ్లి అయ్యేవరకు మాతోనే ఉండు, కలోగంజో తాగి బతుకుదాం!” అంటూ వారు ఎంత చెప్పినా వినకుండా, “అమ్మా! నా స్వశక్తితో ఉద్యోగం సంపాదించి గాని పెళ్లి చేసుకోను, నేను స్థిరపడిన తర్వాతే అది కూడా మీకు అన్ని బాగోగులు చూసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నాకు అడ్డు రాకండి” అంటూ అసలు విషయం దాచి తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేసి “వెళ్లి వస్తాను!” అంటూ కళ్ళ నీళ్లు తిరుగుతుండగా వైజాగ్ బయలుదేరి పోయింది శిరీష. 

 

'అరే నాకెంత బుద్ధి లేకుండా పోయింది, ప్రేమ పేరుతో శ్రీధర్ నన్ను అన్ని విధాల మోసం చేశాడు, నన్ను గర్భవతిని చేసి, నా తల్లితండ్రులకు దూరం చేసి, తాను మాత్రం ఏదో ఉద్యోగం అని తప్పించుకుపోయాడు’ అని మనసులోనే శ్రీధర్ ని తిట్టుకుంది. తన స్నేహితురాలి సాయంతో ఒక ఆరు నెలల పాటు చిన్న ఉద్యోగాలు చేసి, ఇక 'డెలివరీ టైం' దగ్గర పడుతున్న సమయంలో మాధవి సహాయ సహకారాలతో ఆసుపత్రిలో జాయిన్ అయి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది శిరీష. 

 

కాలం గిర్రున తిరిగింది, శిరీష పెరిగిపెద్ద వుతున్న కొడుకు 'వంశీ' ని దగ్గర్లో ఉన్న స్కూలులో జాయిన్ చేసి, వాడి ఆలనా పాలనా చూస్తూ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రిసెప్షనిష్టగా జాయిన్ అయ్యి, గతాన్ని మరిచిపోయి బ్రతుకు బాటలో సాగిపోతూ, అప్పుడప్పుడు తల్లిదండ్రులకు వెళ్లి, వారి బాగోగులు చూసుకుంటూ తన కొడుకును మాధవి కొడుకుగా చెప్పుకుంటూ జీవనం గడపసాగింది. 


అలా గతాన్ని తలుచుకుంటూ నిరాశ నిస్పృహలకు

తావియ్యకుండా, కొడుకును బాగా పెంచాలని అన్న ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తుంది శిరీష. 


ఆ మరుసటి రోజు ఆఫీస్ స్టాఫ్ అందరికీ నోటీసు వచ్చింది. రేపు శుక్రవారం నుంచి చీఫ్ ఆడిటర్ వస్తున్నారని, ప్రతి ఒక్కరు ఆఫీస్ టైం ఒక పది నిమిషాలు ముందే ఉండాలని ఆర్డర్ రావడంతో శిరీష ఆ మర్నాడు కొంచెం తొందరగానే తయారై వంశీ నీ స్కూలుకి దిగబెట్టి తాను కూడా మంచి చీర కట్టుకొని తయారై పావుగంట ముందే ఆఫీసుకు వచ్చి రిసెప్షన్ లో కూర్చుని తన పని తాను చేసుకుంటున్నది. 


సరిగ్గా 11 గంటలకు ఆఫీస్ ఆడిటర్లు కారులో వచ్చి తిన్నగా మేనేజర్ రూమ్ లోకి వెళ్ళిపోయి కాఫీలు అవి తాగుతూ అకౌంట్స్ బుక్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని లెడ్జెర్ లు తెప్పించుకొని మేనేజర్ గారి సహాయంతో లెక్కలు సరి చూస్తున్నారు. 


మేనేజర్ గారి రూము చాలా హడావిడి గా ఉంది, అందులోకి చీఫ్ ఆడిటర్ గారు ఒక్క మారు తల ఎత్తి గ్లాస్ డోర్ నుంచి ఒక వ్యక్తి పట్ల నిశితంగా పరిశీలించ సాగారు. శిరీష కూడా తన పనిలో నిమగ్నమై వచ్చిన వారు ఎవరా అని కూడా చూడకుండా ఎంతో క్రమశిక్షణతో పనిలో మునిగిపోయింది. 


సాయంత్రం 6 గంటలకు ఆడిటర్ టీమ్ అన్ని ముగించుకుని మేనేజర్ గారు తో కలిసి వచ్చి స్టాఫ్ అందరికీ విష్ చేస్తూ హడావిడిగా వెళ్లిపోయారు. 


కాని చీఫ్ ఆడిటర్ మాత్రం మరొక్కసారి తలవంచుకొని పనిచేస్తున్న రిసెప్షనిస్ట్ శిరీష తన కళ్లద్దాలు సరి చేసుకుంటూ మరొక మారు చూసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేనేజర్ గారు కూడా అందరికీ గంట ముందే పర్మిషన్ ఇచ్చి వెళ్లిపోమన్నారు. 


ఒక వారం రోజుల తర్వాత చీఫ్ ఆడిటర్ సెలవు మీద వచ్చి మేనేజర్ గారి రూమ్ లోకి వెళ్లి పలకరించారు. ఆయన్ని చూడగానే మేనేజర్ గారు స్వయంగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి సార్ సడన్ సర్ప్రైజ్ అంటూ నవ్వుతూ పలకరించి కాఫీ తెప్పించి ఇచ్చారు. 


“సార్, నేను పది రోజులు సెలవులో వచ్చాను, ఒక అర్జెంట్ పని మీద మీ సహాయం కావాలి”, అనగానే “చెప్పండి శ్రీధర్ గారు, మీకు నేను ఎలా సహాయ పడగలను?” అనేసరికి


“ముందుగా మీ రిసెప్షన్లో కూర్చున్న ఆవిడ పేరు శిరీష కదా!” అని అడిగేసరికి ఆశ్చర్యపోతూ “అవును సార్. ఏం పిలిపించమంటారా”, అనగానే “నో నో. ముందు ఆవిడను రిజైన్ చేయమనండి. ఎందుకంటే మీకు నా గత చరిత్ర చెప్పవలెను” అంటూ గత ఎనిమిదేళ్ల కిందట జరిగిన ప్రతి విషయం, శిరీష శ్రీధర్ ల ప్రేమ, “ఇరువురి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో నేను ఉద్యోగ నిమిత్తం ముంబాయి వచ్చి ఈ కంపెనీ లో అంచలంచలుగా ఎదుగుతూ ఈరోజు చీఫ్ ఆడిటర్ పొజిషన్ కి వచ్చాను, 


కాలక్రమంలో నా శిరీష కోసం వెతకని ఊరు లేదు, అందుకే తల్లిదండ్రులు ఎంత చెప్పినా పెళ్లి చేసుకోకుండా ఆమె కోసం ఎదురుచూస్తున్నా.


అదృష్టవసాత్తు ఈ వైజాగ్ బ్రాంచ్ లో మన కంపెనీ లోనే రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ క్రిందటి వారం వచ్చినప్పుడు చూశాను, అంతే మళ్ళీ ముంబై వెళ్లి సెలవు మీద వచ్చి మిమ్మల్ని కలుసుకుంటున్నాను, ఇక శిరీషను ఒప్పించుకునే బాధ్యత నాది, మీరు మీ క్వాలిఫికేషన్ సరిపోలేదని, మరొక అమ్మాయిని అప్పాయింట్ చేస్తున్నట్టు, చెప్పి ఆవిడని రిజైన్ చేయమనండి. 


ఎన్నో కష్టాలు పడిన శిరీష కు ఇక ఉద్యోగ అవసరం లేదు, నేను ఆవిడని మనసారా క్షమాపణలు చెప్పుకుని, సకల సుఖాలు కలగజేస్తాను. అప్పటికే ఆవిడ గర్భవతి అని కూడా తెలుసు, కానీనా స్వార్థం వల్ల, పైకి ఎదగాలన్న తపనతో శిరీష కు చెప్పకుండా ముంబై వెళ్లి స్థిరపడ్డాను. ఈ నాటికి దేవుడు కనికరించాడు. మీరు ఏదో ఒకటి చేసి ఆవిడని రాజీనామ చేసి ప పంపించండి.” అని శ్రీధర్ గారి మాటలు వింటూ 


“సార్, మీది నిజంగా విచిత్రమైన ప్రేమ. ఇన్నాళ్ల తర్వాత కూడా ఆవిడ కోసం వేచి చూస్తూ మళ్లీ సంసారం నిలబెట్టాలని మీ ఉన్నత సంస్కారానికి అభినందనలు. అయినా నాలుగేళ్లుగా పనిచే స్తున్న శిరీషను వదులుకోవడం మాకు ఇష్టం లేదు, అయినా మీ ప్రేమ ముందు ఇది ఏమీ కాదు” అంటూ “సార్! మీకు తెలుసా శిరీషకు ఒక కొడుకు. పేరు వంశీ. అక్కడే ఒక చిన్న స్కూల్లో చదువుతున్నాడు, ఆవిడ రోజు ఆఫీసుకి లేటుగా రావడం భర్త లేకపోవడం వల్ల ఆవిడ పడే అగచాట్లు అన్నీ నాకు తెలుసు. అయినా శిరీష జీవిత పోరాటంలో అలిసిపోతూ రోజు ఆఫీసుకి లేటుగానే వస్తుంది, అయినా కొన్నిసార్లు తిట్టినా ఆవిడ మీద గౌరవ అభిప్రాయం ఎప్పుడూ ఉంటుంది. మీరు వెళ్లిన తర్వాత సాయంత్రం హెడ్ q నుంచి లెటర్ వచ్చిందని వేరే రిసెప్షనిస్ట్ అపాయింట్ చేశారని చెప్పి చూస్తాను” అంటూ మేనేజర్ గారు చెప్పేసరికి, 


“కృతజ్ఞతలు సార్. మీరు మా సంసారం నిలబెట్టిన వారవుతారు. ఆవిడ ఇంటి అడ్రస్ ఇవ్వండి” 


మేనేజర్ గారు రాసిచ్చిన అడ్రస్ తీసుకొని శిరీష కన్నా ముందే ఆ ఇంటి దగ్గర వచ్చి ఉన్నాడు శ్రీధర్. 

 

ఆ సాయంత్రం ఐదు గంటలకల్లా మేనేజర్ గారు రమ్మంటున్నారని శిరీష కు కబురు రాగానే, ఆయన రూమ్ లోకి వెళ్ళింది. 


మేనేజర్ గారు నిల్చుని ఉన్న శిరీషను కూర్చోమని చెప్పి, “అమ్మా శిరీష. నీకు ఒక బ్యాడ్ న్యూస్. ఏమిటంటే హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. ఎవరో ఒక కొత్త అమ్మాయి.. నీ కన్నా ఎక్కువ అనుభవం, విద్యార్హతలు ఉన్న ఆవిడ రేపు నీకు బదులుగా 'రిసెప్షనిస్టుగా' ఏర్పాటు చేశారు. నిన్ను ఇవాళ రాజీనామా ఇవ్వమని చెప్పారు” అని మేనేజర్ గారు అనగానే శిరీష కాళ్ళ కింద భూమి జరిగినట్టు అనిపించి,


“అదేంటి సార్! నాలుగేళ్ల నుంచి ఈ కంపెనీకి పని చేస్తున్నాను, మూడు నెలల కిందట నాకు సాలరీ కూడా పెంచారు, ఇప్పుడేమో సడన్గా తీసేస్తున్నారు, ఇది న్యాయమా సార్!” అంటూ ఎంతో ప్రాధేయపడిన శిరీషను చూస్తూ, 


“పోనీలే అమ్మా! కంపెనీ ఆర్డర్స్ ని మనం కాదనలేము, ఒక్క 15 రోజుల తర్వాత నీకు మరో కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను, ఈ విషయంలో మరి నేను ఏమీ చేయలేను. ఏమీ అనుకోకు, నీ రాజీనామా లెటర్ వెంటనే పంపించు!” అంటూ శిరీషను సాగనంపారు మేనేజర్ గారు. 


ఈ హఠాత్పరిణామంతో ఆఫీస్ స్టాఫ్ కూడా నివ్వెర పోయారు, ఏమైనా అందామను కొన్న రేపు మన పరిస్థితి కూడా అదేనేమో, అనుకుంటూ జాలిగా శిరీష కు వీడ్కోలు పలికారు. శిరీష మాత్రం ‘అయ్యో దేవుడా! ఏమిటి ఈ పరిస్థితి.. ప్రేమించిన మొగోడు పారిపోయాడు, పోనీ పరిస్థితులకు తల ఒగ్గి జీవితంలో పోరాడుతూ ఉండగా, కన్న కొడుకును కూడా పోషించుకోలేని పరిస్థితికి తీసుకొస్తావా, నేను ఏ పాపం చేసి పుట్టానో తెలియటం లేదు’, అని మనసులోనే బాధపడుతూ ఆగకుండా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ బాబు స్కూల్ కి వెళ్లి వంశీని తీసుకుని, స్కూల్ బ్యాగ్ ని కూడా తానే మోసుకుంటూ, ‘ఎగ్జామ్ ఫీజులు ఎలా కట్టాలి? వాడిని ఎలా పెంచాలి?’ అనుకుంటూ భారంగా ఇంటి వైపు నడుస్తుంది శిరీష. 


శిరీష ఇంటికి కొంచెం దూరంలో కూల్ డ్రింక్ తాగుతూ శ్రీధర్ వేచి చూస్తున్నాడు, దూరంగావస్తున్న శిరీష కొడుకును వెంటబెట్టుకుని రావడం.. 


ఎంతో నిరాశగా బాబు వంశీ చేయి పట్టుకుని “పద నాన్న.. ఇవాల్టి నుంచి నేను ఇంట్లోనే ఉంటాను” అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన ఇంటి తలుపు తాళం తీస్తూ లోనికి వెళ్లి తలుపు వేసేసింది. ఇదంతా గమనిస్తున్న శ్రీధర్ భారంగా ఒక సిగరెట్ కాల్చి, ఎంతో బెంగతో లేని ధైర్యాన్ని తెచ్చుకుని పది నిమిషములు తర్వాత ఆత్రంగా కాలింగ్ బెల్ నొక్కడు. 


వంట పనిలో నిమగ్నమై ఉన్న శిరీష ‘ఎవరు,,’ అంటూ గట్టిగా అరిచింది. సమాధానం రాకపోయేసరికి విసుగ్గా చేతిలో గరిటతో ముఖం మీద పడిన ముంగురులను చిరాగ్గా వెనక చూసుకుంటూ తలుపు తీసి ‘ఎవరండీ’ అంటూ ఎదురుగా ఆరడుగుల ఎత్తున మనిషిని చూసి అడిగింది. సమాధానం రాకపోయేసరికి మరొక్కసారి తదేకంగా చూసి ఆశ్చర్యపోతూ “శ్రీధర్ నువ్వా, ఏమిటి ఇలా దయ చేశారు”, అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. 


“శిరీష.. ఒక్కసారి నా మాట విను. పది నిమిషాల్లో వెళ్ళిపోతాను” అంటూ హాల్లోకి వచ్చి బాబు దగ్గర కూర్చుని తల నిమురుతు, “బాబు.. నీ పేరేంటి” అని అడగగానే వచ్చిన అతనిని ఆశ్చర్యంగా చూస్తూ “నా పేరు వంశీ, నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను”, అంటూ చెబుతున్న బాబు తల మీద ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు శ్రీధర్. 


ఇంతలో శిరీష కోపంగా లోపలి నుంచి వచ్చి “వంశ, నువ్వు వెళ్లి ఆడుకో!” అంటూ బయటికి పంపించేసింది, 


“శ్రీధర్.. నువ్వు చాలా మారిపోయావు. అయినా నేను చచ్చానో, బతికానో? అని చూడడానికి వచ్చావా, అయినా నీకు నా అడ్రస్ ఎవరు ఇచ్చారు?, మమ్మల్ని ఇలా కూడా బతకనీయవా వెళ్ళిపో!” అంటూ చేతిలో ఉన్నసెల్ ఫోన్ ని శ్రీధర్ పైకి విసిరేసింది కోపంగా శిరీష.

 

వెక్కి వేక్కి ఏడుస్తున్న శిరీష దగ్గరకు వచ్చి, 


“శిరీషా, నేను చేసింది సుతారము చాలా తప్పు. మన పెళ్ళికి నిరుద్యోగిని అయిన నన్ను మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, అప్పటికే గర్భవతి అయిన నిన్ను వదిలి ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదలతో ముంబై వచ్చి చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించాను. నేను రెండు సంవత్సరాలు రాత్రనకా పగలనకా పనిచేస్తూ, అదే కంపెనీలో పెద్ద హోదా పొందగలిగాను. నీకోసం వెతకని ఊరు లేదు, జాగా లేదు.


మీ ఊరు వస్తే నువ్వు ఎటు వెళ్లావు, ఎక్కడున్నావు కూడా తెలియదని నీ తల్లిదండ్రులు చెప్పారు. వారికి కూడా నాకు నిజం చెప్పాలనిపించలేదు. మళ్లీ అలాగే నిరాశగా ఇన్ని సంవత్సరాలు, నీ కోసమే వేచి చూస్తూ, మా అమ్మానాన్నలు తెచ్చిన అన్ని సంబంధాలను కాదని, నీకోసమే వెతుకుతూ ఇన్నాళ్లు పెళ్లి కూడా చేసుకోలేదు.


ఎందుకంటే నా మనసులో నీ మీద ఉన్న నిండైన నా ప్రేమ. అప్పటికే నువ్వు గర్భవతివై పరువు పోతుందన్న నెపంతో ఎక్కడికో వెళ్ళిపోయావు. అచ్చు నాలా ఉన్న బాబు వంశీని చూడగానే ఎంతో ఆనందంతో పొంగిపోయాను.


ఇ న్నాళ్లకు హెడ్ ఆడిటర్ గా అదే కంపెనీ బ్రాంచ్ వైజాగ్ లో ఉంటే దాని ఆడిటింగ్ కోసం వచ్చి నిన్ను రిసెప్షన్లో చూసేసరికి, ఆహా దేవుడు ఎంత కరుణామయుడు!, ఇన్ని సంవత్సరాలు బట్టి వెతుకుతున్న నాకు ఎడారిలో ఒయాసిస్సులా నువ్వు కనిపించేసరికి, నా ఆనందానికి అవధులు లేవు.


ఆరోజు నువ్వు కూడా సూట్ లో కళ్లద్దాలతో ఉన్న నన్ను పోల్చుకోలేకపోయావు. ఆ తర్వాత నీ ఆఫీసుకు వచ్చి, మేనేజర్ గారితో మాట్లాడి నేనే నీకు రాజీనామా చేయించమని చెప్పాను. ఎందుకంటే ఇన్నాళ్ళ తర్వాత, ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే, నిన్ను బాబుని ఇన్నాళ్లు నువ్వు పడ్డ కష్టాలను మరి జీవితంలో పడకుండా, కంటికి రెప్పలా చూసుకుంటూ ఉందామన్న ఆశతో ఇలా చేశాను”

 

అని అనర్గళంగా మాట్లాడుతూ, నేల మీద కూర్చొని క్షమించమని అడుగుతున్న నిలువెత్తు మనిషి, శ్రీధర్ను ఆశ్చర్యపోతూ కంటి నుండి కారుతున్న కన్నీళ్లను కూడా తుడుచుకోకుండా మౌనంగా ఉండిపోయింది శిరీష. 


 కొంతసేపటికి తేరుకొని తన రెండు చేతులతో శ్రీధర్ భుజాలు పట్టుకొని లేపి, “శ్రీధర్ నువ్వు ఇన్నాళ్లు నాకోసం వేచి ఉన్నావు చూడు, అదే నీ ప్రేమకు నిదర్శనం. నిజమే.. నేను గర్భవతిని.. అష్ట కష్టాలు పడుతూ, నా స్నేహితురాలి సహాయంతో బాబు ని కన్నాను,. ఆ తర్వాత తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అవమాన భారంతో ప్రతి క్షణం గడిపాను, నిన్ను తిట్టుకునే రోజు లేదు.


కానీ ఒక్క విషయం. నా మనసులో నీ మీద ఎంత ద్వేషం ఉన్నదో, అంతకు రెట్టింపు ప్రేమ అన్నది ఉన్నది. కనుకనే ఏ రోజుకైనా మనం మళ్లీ కలుస్తామన్న నమ్మకం ఆ దేవదేవుడు కల్పించాడు.


గడిచిపోయిన క్షణాలు తిరిగి రావు, నీ అంతట నువ్వే వచ్చి కలిసావు, నా ఉనికి కోసం తాపత్రియ పడ్డావు. ఈ మన 'విచిత్ర ప్రేమ ' కలకాలం ఫలించాలి. నా జీవితానికి ఒక సుగమ మార్గం చూపించిన నీకు కృతజ్ఞతలు. ఈరోజుతో నాకు మన బాబుకి బంగారు భవిష్యత్తు కల్పిస్తానన్న నీ మాటలు, నాకు ఎంతో గుండె నిబ్బరం కలిగించాయి.


పదండి! రేపే మనం మన బాబు తో కలిసి, మన ఆఫీస్ స్టాఫ్ అందరు సాక్షులుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం!! మన ఇద్దరి తల్లిదండ్రుల ఆవేదనను పోగొడుదాం!” అంటూ శ్రీధర్ను గాఢంగా కౌగిలించుకుని కొద్ది నిమిషాలు వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎదురుగా ఉన్న "శ్రీ వెంకటేశ్వర స్వామి" పటానికి మనస్పూర్తిగా నమస్కారం చేసింది శిరీష. 


*********************🌹


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

రచయిత పరిచయం : 

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  





Comments


bottom of page