విధి లిఖితం

Vidhi Likhitam written by Saraswathi Ponnada
రచన : సరస్వతి పొన్నాడ
హరిణి ఆఫీసు నుండి వస్తూ, డేకేర్ లో వున్న కూతురు సహస్ర ని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆరోజు ఆఫీసులో విపరీతంగా పని ...రోజూ కన్నా ఆలస్యంగా జేరింది ఇంటికి. భర్త సుందర్ హాలులో టీపాయి మీద కాళ్ళు జాపుకుని, టివి చూస్తూ, ఎంజాయ్ చేస్తున్నాడు. అసలే అలసటగా వుంది. అతన్ని చూడాలంటేనే ఈమధ్య మరీ కంపరంగా వుంటోంది.
ఈమధ్య ఎక్కడకి వెళుతున్నాడో, హరిణి వచ్చేసరికి ఇంట్లో వుండడం లేదు. నిజానికి అతను కనపడకపోతే మనసు ప్రశాంతంగా వుంటోంది. సహస్రకి పెట్టి, తను తిని, పడుకున్నాక వస్తున్నాడు ఇంటికి.
రానురాను ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. ఏదైనా మాట వస్తుందంటే అది పెద్ద గొడవే. హరిణి ఎంతో శాంతం గా వుండేది. అలాంటిది ఇంత అసహనంగా తయారవడానికి కారణం సుందర్ నే.
ఒకరోజు ఫోన్ లో తల్లికి సుందర్ గురించి చెపుతూ...మొదటిసారిగా గుండె పగిలేలా ఏడ్చింది. అతను స్థిరత్వం లేకుండా ఉద్యోగాలు మానేయడం, సోమరిగా నెలల తరబడి ఇంట్లో కూర్చోడం చూచాయగా తెలుసందరికి. ఫోన్ లో దుఃఖము ఆపుకోలేకపోయింది.
" అమ్మా నావల్ల కాదు" ఇంక నేనతనిని భరించలేకపోతున్నానని"అంది.
"ఇప్పుడు మీరిద్దరే కాదు మీకో పాప వుంది. మీరు విడిపోతే తండ్రి ప్రేమకు దూరం చేసినదానివవుతావు. కొంచెం ఓపిక పట్టు హరిణీ నేను వస్తాను. నీ కాపురం బాగుపడేలా చూస్తాను" అంది రాగిణి.
హరిణి బాధ చూడలేక వెంటనే రాగిణి వచ్చింది. అల్లుడులో మార్పు వస్తుందేమోనని చూసింది. చిక్కి శల్యమైన కూతురుని చూచి, మనసు కృంగిపోయింది. కూతురు కి నచ్చచెప్పాలనే వచ్చింది. నాలుగు రోజులలోనే అల్లుడు వ్యవహారం తెలిసిపోయింది.
హరిణి మంచిపిల్ల కాబట్టి ఇంకా ఓర్చుకుంటోందని అర్థం అయిపోయింది. కళ్ళారా చూసింది అల్లుడుని. ఇంత బాధ్యతా రహితంగా వుండే మగవాళ్ళు వుంటారా...దీని ఖర్మ కాకపోతే దీని జీవితం ఇలా అయిపోవాలా అనుకుంటూ కుమిలిపోయింది. ఇప్పుడు హరిణి మాటని కాదనలేని పరిస్థితికి వచ్చింది రాగిణి. నిర్ణయం కూతురికే వదిలేసింది.
హరిణి పెళ్ళి అవగానే కొడుకు హరీష్ దగ్గరకు వెళ్ళపోయింది రాగిణి. హరీష్ పెళ్ళి అయిన సంవత్సరం లోనే...సహస్ర పుట్టింది. పిల్లంటే ప్రాణం గా వుండే సుందర్ లో ఈ రెండేళ్ళలో చాలా మార్పు వచ్చింది. నాలుగేళ్ళ సహస్ర ముద్దు మాటలతో నాన్నా, అని దగ్గరకు జేరినా స్పందించడం మానేసాడు. హరిణి ఓర్పు నశించిపోయింది..
తల్లి వచ్చి వెళ్ళేక, సుందర్ ఇంకా మొండి కెత్తిపోయాడు. ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది." అమ్మా నావల్ల కాదు" అన్న హరిణే తన జీవితం తనే నిర్ణయించుకోవాలనుకుంది.
సుందర్ లో ఇంకేదో మార్పు కనపడుతోంది ఈమధ్య. ఎవరితో స్నేహమో తెలియదు గాని, నవ్వులు ప్రామిస్ లు, ఫోన్ రాగానే వెళ్ళిపోవడం. రాత్రి రాకపోవడం జరుగుతోంది.
వంట ఇంట్లో పని చేస్తున్న హరిణి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది.
హరిణి MBA చదువుతున్నప్పుడు తండ్రి రాజారావు మరణించేడు. బేంక్ లో పనిచేసేవాడు రాజారావు. హరిణి తమ్ముడు హరీష్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో వున్నాడు. రాజారావు భార్య రాగిణి చాలా సౌమ్యురాలు....అన్నీ భర్తే చూసుకోవడంతో అతని మరణం తీరని వ్యధని కలిగించిందామెకు.అతని బేంక్ లో ఉద్యోగం ఆవిడకి ఇస్తానన్నా చేయలేని పరిస్థితి. సొంత ఇల్లు వుండడం, భర్తకి వచ్చిన డబ్బుతో...పిల్లల చదువులకి ఇబ్బంది కలగలేదు. ఆ ఒక్క సంవత్సరం చదువూ పూర్తి అవగానే, హరీణి ఉద్యోగం లో జేరింది.
ఇంకో ఏడాది కి హరీష్ కి చదువు పూర్తి అయి పూనేలో ఉద్యోగం వచ్చి, వెళ్ళిపోయాడు. హరిణి కి వూరిలో ఉద్యోగమేమో...సొంత ఇంట్లో తల్లి కూతురు వుండేవారు.
అదే వూరిలో వున్న అమ్మమ్మ తాతయ్య ల సమక్షంలో హరిణి కి సంబంధాలు చూడడం మొదలు పెట్టేరు.
హరిణి ని చూడడానికి సుధీర్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆ శనివారం చూడడానికి వస్తున్నామని చెప్పేరు. ఫోటోలు చూసి, జాతకాలు కుదిరేక సుధీర్ తల్లిదండ్రులు వచ్చి హరిణి ని చూసి సుధీర్ కి తప్పక నచ్చుతుందని మళ్ళీ శనివారం చూడడానికి వస్తామన్నారు. సుధీర్ బెంగుళూరులో పనిచేయడంతో...ఇలా సంబంధం వుందనగానే శని ఆదివారాలు వచ్చి వెళ్ళేవాడు.
రేపు సుధీర్ వస్తాడనగా...అమ్మమ్మవారి బంధువుల వత్తిడి తో, అనుకోకుండా శుక్రవారం హరిణిని చూడడానికి ఇంకో అబ్బాయి సుందర్ వచ్చేడు. అతను అక్కడికక్కడే తనకి హరిణి నచ్చిందని చెప్పేసాడు.
రేపు వచ్చే సుధీర్ వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పలా మీమాంసలో పడ్డారు...సమయం ఒకరోజే వుంది... వాళ్ళు ఆల్రెడీ ప్లాను చేసుకున్నారు. పైగా పొరుగూరి నుండి అబ్బాయి వస్తున్నారు...అప్పుడు అమ్మమ్మే, చూద్దాం అతనినీ చూసి, దాన్నిబట్టి అప్పుడే నిర్ణయం తీసుకుందాం అంది.
రాత్రి మళ్ళీ సుందర్ ఫోన్ చేసి, మీరేవిషయమూ నాకు చెప్పలేదు...నచ్చలేదా నేను మీకు ...మీరు వద్దనుకుంటే ఇంక నాకు వేరే ఏ పిల్లను చూడలేని పరిస్థితి. అంత నచ్చేసేరు...ఏసంగతీ చెప్పండీ అని వత్తిడి తెచ్చేడు. సుధీర్ వాళ్ళు వచ్చి వెళ్ళేక ఇతన్ని చూడవలసింది, అనిపించింది ఎందుకో హరిణికి. నిజానికి సుందర్ బానేవున్నాడు. మంచి జాబ్ లోనే వున్నాడు..వేరే బాధ్యత బాదరబందీలు లేవు.
ఇలాంటి పరిస్థితి లో మర్నాడు..సుధీర్ కుటుంబం వచ్చి చూసి వెళ్ళేరు. మంచి ఫ్యామిలీ, చాలా ఆత్మీయంగా అనిపించేరు. ఇద్దరూ విడిగా మాట్లాడుకున్నారు. సుధీర్ నచ్చేడు హరిణికి. సందిగ్ధంలో పడిపోయింది.
ఇంటికి వెళ్ళగానే సుధీర్ తల్లి మాధవి అడిగింది కొడుకుని..."ఎలా వుంది!?...నీకు నచ్చిందాఅమ్మాయి" అని .."బానే వుందమ్మా" అనగానే..."మరి ఓకే చెప్పేద్దాం. నీవుండగానే" అన్నాడు సుధీర్ తండ్రి. దానికి సుధీర్ " ఆ అమ్మాయి వారం రోజులు టైం అడిగింది..నేను సరేనన్నాను" అన్నాడు. "అదేంటీ...ఆ అమ్మాయి టైం అడగడం ఏమిటి" అని తెల్లబోయారు తల్లిదండ్రులు.
మాధవికి ఇలా అమ్మాయి టైం అడగడం నచ్చలేదు. సుధీర్ ఒప్పుకోవడం అసలు నచ్చేలేదు. రెండు రోజులకి సుధీర్ ఫోన్ చేసేడు. ఆ అమ్మాయి ఓకే చేసిందేమో అనిపించింది మాధవికి. కాని సుధీర్ " అమ్మా ఇంక హరిణి గురించి మరచిపో" అని చెప్పేడు. "అదేమిటీ కారణం చెప్పకుండా" మాధవి చిరాకుగా అసహనంగా అంది.
హరిణి సుందర్ విషయం చెప్పి..."ఏం చేయాలో తెలియడం లేదు...ఒక ఫ్రెండ్ గా సలహా చెప్పమంది" అన్నాడు సుధీర్ " సుందర్ లా నేనేమీ అనుకోవడం లేదు. మీరే తెల్చుకోండి అనగానే. ఆ అమ్మాయి వారం టైం అడిగింది. ఇప్పుడు ...అతనితో పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పింది. సారాంశం చెప్పేడు సుధీర్.
సుధీర్ పెళ్ళి కూడా అయ్యేక ఇద్దరి కుటుంబాలు స్నేహంగా వుండేవారు. హరిణికి కూతురు పుట్టే వరకూ సుందర్ బాగానే వున్నాడు. తరువాత ఉద్యోగం లో నిలకడ లేకపోవడం. బాధ్యత గా ప్రవర్తించకపోవడం . తరచు ఉద్యోగం మానేయడమూ, ఆరునెలలు ఇంట్లో కూర్చోవడం. ఇద్దరి మధ్య గొడవలు అసహనంగా మారడం మొదలైంది.
సహస్ర ఏడుపుతో వర్తమానం లోకి వచ్చింది హరిణి.
సుందర్ ఇంట్లో పరిస్థితి తెలిసి, తన ప్రయత్నాలు తను చేసుకున్నాడు. ఒక అమెరికా అమ్మాయి తో స్నేహం చేసి...అమెరికా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు. చావు కబురు చల్లగా చెప్పేడు హరిణితో. ఊహించిందే కాబట్టి విడాకులకు సుందర్ తో వేరే పేచీ లేకుండా విడిపోయారు. ఇద్దరి మధ్య సహస్ర కూడా నలిగిపోయింది. ఏమైనా చివరికి నష్టపోయేది ఆడవారేనని ఇంకోసారి రుజువైంది. తల్లి రాగిణి అండగా హరిణి దగ్గరకు జేరింది.
శుభం
సరస్వతి పొన్నాడ, హైదరాబాద్.😊
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం : నాపేరు సరస్వతి పొన్నాడ...హైదరాబాద్
చిన్నప్పటి నుండి మనసుకి హత్తుకున్న సంఘటనలు కాగితం మీద పెట్టేద్దాన్ని. ...ప్రమదావనం(ఆంధ్రప్రభ) లో నా పోస్టులు, వంటలు వచ్చేవి. శ్రీశ్రీ, ఆరుద్ర పద ప్రహేళికలు పూరించిడమే కాకుండా బహుమతులు వచ్చేయి. ఒక గ్రూపు లో ప్రహేళిక (గడుల నుడికట్టు) సంవత్సరం పైనే నిర్వహించేను. నన్ను ప్రోత్సాహిస్తున్న మనతెలుగుకథలు ఎడ్మిన్స్ కి ధన్యవాదాలు🙏