top of page

విధి విలాసం


'Vidhi Vilasam' written by Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి

"గ్రీష్మ ఋతువు. అందులో ఆషాడ మాసం". విశాఖపట్నం లోని ఉక్క తో పాటు, ఎండ తోడై ప్రజలకు ఎక్కడలేని నరకాన్ని చూపిస్తుంది.

41 డిగ్రీల ఎండలో రాఘవయ్య గారు సైకిల్ తొక్కుతూ రిటైర్మెంట్ దగ్గరలో ఉండి కూడా, ఒక్క రోజు కూడా మానకుండా తన 'పోస్ట్ మాన్' ఉద్యోగం సక్రమంగా నిర్వహిస్తూ, అందరి ప్రశంసలూ పొందేవారు. 'హెడ్ పోస్ట్ ఆఫీస్' కి సరిగ్గా 9:30 కల్లా వచ్చి, తన ఏరియాలకు వచ్చిన ఉత్తరాలను విడదీసి, డోర్ నెంబర్ తో ఒక్కొక్కటి లెక్కప్రకారం సర్దుకుంటూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, తన పనే దైవం లా భావిస్తూ, 25 ఏళ్ల నుంచి విశాఖపట్నం వీధుల్లోనే ఎండైనా, వాన అయినా సమయానికి ఉత్తరాలు అందిస్తూ ఎవర్నైనా కొంచెం మంచినీళ్లు అడిగి తీసుకుని, తన డొక్కు 'బి ఎస్ ఏ' సైకిల్ తొక్కుకుంటూ, ఎంత దూరమైనా వెళ్లి డెలివరీ చేసి నమస్కారం పెట్టి, ‘బాగున్నారా అమ్మా!!’ అంటూ మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఎంతో పేరు సంపాదించాడు రాఘవయ్య.

అలా అలా ప్రొద్దున అంతా ఉత్తరాలు డెలివరీ చేసి రెండున్నర గంటల కల్లా మళ్లీ 'హెడ్ పోస్ట్ ఆఫీస్ 'కు వచ్చి భార్య కట్టిన క్యారేజీ విప్పి భోజనం చేసేవారు.

రాఘవయ్య గారి కి ఒక కొడుకు, కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వాళ్లు వేరే ఊర్లో స్థిరపడినా తను మాత్రం భార్యతో కలిసి ఏదో ఒక లాగా జీవితం నెట్టుకొస్తున్నారు, భార్య అనురాధ గారు చాలా కాలంగా ఏదో ఒక అనారోగ్యంతో, ఎంతో కొంత వంట చేసి పెట్టగలరు తప్ప, మరి ఏ విధమైన సాయం చేయలేని పరిస్థితి. ఒక్క రాఘవయ్య గారు ఇంటిపని, ఉద్యోగం అన్నీ తనే చేసుకుంటూ సంసారం సాగిస్తున్నారు, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ల చదువులు, పెళ్లిళ్లు అన్నీ కలిపి ప్రభుత్వ ఉద్యోగం తరఫున ఎన్ని వీలైతే అన్ని" లోన్లు " తీసుకొని తీరా నెల ఆఖరి అయ్యేసరికల్లా, ప్రభుత్వ జీతంలో 'ముప్పాతిక పర్సంట్ కట్ ' అయిపోయి, ఏదో తినడానికి తప్ప అసలు డబ్బులు ఉండేవి కావు, రాఘవయ్య గారి కి.

ఆరోజు సరిగ్గా 9:30 కల్లా తన ఖాకీ ప్యాంటు, కొంచెం వెలిసిన తెల్లషర్టు వేసుకొని, చివరి దశలో ఉన్న తన తోలు చెప్పులను, సరి చేసుకుని తన 'బెంజ్ కార్' లాంటి 'BSA సైకిల్ ' ను జాగ్రత్తగా తుడిచి హ్యాండిల్ బార్ కు ఒకసారి దండం పెట్టి, గట్టిగా పెడల్ తొక్కుతూ ఆఫీసుకు బయల్దేరారు రాఘవయ్య గారు. భార్య వండిన వంకాయ ముద్ద కూర, కొంచెం గోంగూర పచ్చడి, అల్లం చారు ఉన్న క్యారేజ్ ను సైకిల్ వెనకాల క్యారేజ్ కట్టి, జాగ్రత్తగా ట్రాఫిక్ దాటుకుంటూ, మధ్య మధ్యలో జారిపోతున్న కళ్ళజోడు సవరించుకుంటూ, వగరుస్తూ 9:30 కల్లా వచ్చే మొట్టమొదటి వ్యక్తి రాఘవయ్య గారే.

ఆరోజు యధావిధిగా తన ఉత్తరాల బాక్స్ తెరిచి వీధి అడ్రస్ లు ప్రకారం సర్దుతూ, అందులో ఇవాళ కనీసం అయిదారు 'రిజిస్టర్ లెటర్లు ' ఉండడంతో వాటిని వేరే పెట్టాడు. కాసేపు తోటి సహోద్యోగులతో నవ్వుకుంటూ కబుర్లు చెప్పి, టీ తాగి పదకొండు గంటలకల్లా, విశాఖపట్నంలో బిజీగా ఉన్న ‘అక్కయ్యపాలెం, మధురానగర్, లలితా నగర్’ రోడ్లు పట్టుకుని, అలా ఎండలో సైకిల్ తొక్కుకుంటూ, అక్కడ అక్కడ ఆగి ఒక చల్లని 'గోలి సోడా ' తాగి సేదదీరాక, మళ్లీ బయలుదేరి ఉత్తరాలు బట్వాడా చేస్తూ ఉన్నాడు. ఒక రిజిస్టర్ లెటర్ ఉండిపోగా, ఆ ఇంటికి వచ్చి తలుపు తట్టే సరికి లోపల్నుంచి ఒక అమ్మాయి 'ఉండండి, పది నిమిషాలు పడుతుంది వచ్చేస్తున్నాను!!’ అంది.

‘అసలే ఎండగా ఉందమ్మా! తొందరగా రండి!” అంటూ రాఘవయ్య అనే సరికి, “అలాగే! వెయిట్ చేయండి” అన్నదే తప్ప పదినిమిషాలు దాటినా రాలేదు. ఇంకా రాకపోయేసరికి విసిగిపోయి, “ఏంటమ్మా! నేను 'పోస్ట్ మాన్'ఎండలో ఉండిపోయాను, తొందరగా రండి!” అని మళ్ళీ అరిచాడు, మరి కొద్దిసేపటికి తలుపు తెరుచుకుని ఒక 20 ఏళ్ల అమ్మాయి తలుపు తీసింది.

'అంకుల్ సారీ! లేట్ అయిపోయింది, ఏమీ అనుకోకండి తొందరగా రాలేను, ఇదిగోండి మంచినీళ్లు తీసుకోండి, పాపం ఎండలో నిలబడిపోయారు” అంటూ గ్లాసు అందించింది. గ్లాసులో నీళ్ళు త్రాగిన తర్వాత 'అబ్బా! ఎంత అందమైన అమ్మాయి” అంటూ తేరిపార చూసేసరికి ఆశ్చర్యపోయాడు రాఘవయ్య. ఎందుకంటే ఆ అమ్మాయికి 'రెండు కాళ్ళు మోకాళ్ళవరకు' లేకపోవడం, రెండు 'చెక్క కర్రల ఆసరాతో' నిలబడి ఉండడం చూసి, ఎందుకో రాఘవయ్య గారి మనసు ద్రవించి పోయింది.

“అరే.. సారీ అమ్మ ! నేనే తొందరపడ్డాను. ఇంకా ఇంట్లో ఎవరూ లేరా? అంత కష్టపడి నువ్వు రావాలా తల్లి!” అని ఆప్యాయంగా అడిగేసరికి, “లేరు అంకుల్! నా పేరు అఖిల. కిందటి సంవత్సరం మా అమ్మగారు, నాన్నగారు 'కార్ యాక్సిడెంట్ ' లో చనిపోయారు, నేను అదే కారులో ఉండి 'కాళ్లు పోగొట్టుకున్నాను' అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నాను, మా అన్నయ్య వేరే ఊరిలో ఉద్యోగం చేస్తూ, నన్ను పోషిస్తూ చదివిస్తున్నాడు!” అని అనేసరికి 'అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా! ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ ఒక 'రిజిస్టర్ లెటర్' ఇచ్చి సంతకం పెట్టించుకొని, “అమ్మా! నీకు ఏ అవసరం వచ్చినా.. నేను 'హెడ్ పోస్ట్ ఆఫీస్' లో పనిచేస్తున్నాను. అక్కడికి ఈ నెంబర్ కి ఫోన్ చేసి నా పేరు చెప్పు, నేను వెంటనే వచ్చి నీకు కావలసింది ఏమైనా ఉంటే వెంటనే చేస్తాను, నువ్వు నా 'కన్న కూతురు లాంటి 'దానివి ఏ విషయమైనా మొహమాట పడొద్దు! అంటూ అఖిల తల నిమురుతూ 'సుఖీభవ' అంటూ ఆశీర్వదించి వెళ్లిపోయారు రాఘవయ్య గారు.

‘అయ్యో! విధి ఎంత విచిత్రమైనది, అఖిల చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని, తన రెండు కాళ్ళు పోగొట్టుకొని, ఒంటరిగా జీవిస్తూ అన్నగారి సహకారంతో, విధి వంచితులు అయినప్పటికీ, ఎంతో ధైర్యంగా, జీవితాన్ని నెట్టుకొస్తున్న ఆ అమ్మాయి, నిజంగా కొన్ని వేల మందిలో లేని ధైర్యం, సాహసం ఆ దేవుడు ఆమెకు ప్రసాదించాడు.’ అనుకుంటూ, అఖిల ని మెచ్చుకోని రోజంటూ లేక, భార్యకు కూడా చెప్పి ఏ అవసరం వచ్చినా సొంత తండ్రిలా సహాయం చేస్తూ, అమ్మాయికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉన్నాడు రాఘవయ్య.

అఖిల కూడా నోరారా, ఆప్యాయత కనబరుస్తూ 'బాబాయ్ గారు! దసరా, కోసమని మా అన్నయ్య మీ ద్వారా 'మనియార్డర్ ' పంపాడు. కొత్త బట్టలు కొనుక్కొని సరదాగా గడపమని రాశాడు. చూశారా! మా అన్నయ్య ఎంత మంచివాడో!’ అంటూ రాఘవయ్య గారు ఇచ్చిన డబ్బు తీసుకుని, కాసేపు కూర్చుండి, ‘నేను మంచి వేడి కాఫీ చేస్తాను, అసలే బయట వర్షం పడుతుంది, ఎల్లుండి 'దసరా'కూడా. మీరు తడిసి పోతే ఉద్యోగం చేయలేరు. రిటైర్డ్ అయిపోవచ్చు కదా! పిన్ని గారికి తోడుగా ఇంట్లో ఉండి, విశ్రాంతి పొందవచ్చు కదా!’ అంటూ కుంటుకుంటూనే కిచెన్ లోకి వెళ్లి మంచి కాఫీ తయారు చేసి రాఘవయ్య గారి చేతికి అందించింది అఖిల.

'అవునమ్మా! నేనూ అదే ఆలోచిస్తున్నాను, కానీ చేసిన అప్పులు తీరాలి కదా! రిటైర్మెంట్ అయినా, అన్ని అప్పులు కట్ అయిపోగా, మిగిలేది చాలా తక్కువ. ఏం చేస్తాం, పిల్లలిద్దర్నీ చదివించి, పెళ్లిళ్లు చేసి, వాళ్ళు ఆనందంగా ఉంటేనే కదా !మాకు కూడా తృప్తి!’ అంటూ ‘వస్తానమ్మా! ఇంకా రెండు ఉత్తరాలు ఉన్నాయి, అసలే వర్షం పడుతుంది’ అంటూ బాగా పాతబడిన గొడుగు విప్పి, ఒక చేతితో సైకిల్ హ్యాండిల్, మరో చేతితో గొడుగు పట్టుకొని వెళ్లిపోయారు రాఘవయ్య గారు.

ఆ మరుసటి రోజు ఎందుకో అఖిల ఆఫీస్ కి ఫోన్ చేసి, రాఘవయ్య గారితో మాట్లాడుతూ, “బాబాయ్ గారు! కొన్ని మందులు అయిపోయాయి, మీరు వస్తున్నప్పుడు తేగలరా?” అని అడిగేసరికి “తప్పకుండా అమ్మా!” అంటూ ఆ రోజు సాయంత్రం అఖిల ఇంటికి వచ్చి మందులు ఇచ్చి, “అమ్మా! రేపు దసరా పండగ. నువ్వు 'దుర్గమ్మ తల్లి' పూజ చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని, హాయిగా ఉండాలి! రేపు మీ పిన్ని గారు చేసిన వంటలు తెస్తాను, కలిసి తిందాం! అంటూ హుషారుగా నవ్వుతూ వెళ్ళిపోతున్న బాబాయ్ గారిని, ఆగమని చెప్పి, లోపలికి కుంటుకుంటూ వెళ్లి 'ఒక గిఫ్ట్ బాక్స్'ని తెచ్చి 'బాబాయ్ గారు! మీరు నాకు తండ్రి లాంటి వారు. ఈ బహుమతిని ఇంటికి వెళ్లి తెరవండి! అంటూ ఆ బాక్స్ చేతిలో పెట్టి, కాళ్లకు దండం పెట్టి లేచి నిలుచున్న అఖిల ను దగ్గరకు తీసుకొని తల రాస్తూ, ‘ఎందుకమ్మా! నీకు ఇవన్నీ’ అంటూ, ‘ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, మీ అన్నయ్యకి ఉత్తరం రాయి, మా బాబయ్య అన్ని విధాల తోడునీడగా ఉంటాడని, బెంగ పడొద్దు !అని రాయి తల్లి. వస్తాను’ అంటూ ఆ బాక్స్ ని సంచి లో పెట్టుకొని తన ఇంటికి బయలుదేరారు రాఘవయ్య.

ఆ మర్నాడు 'దసరా పండగ’ సెలవు కావడంతో పూజ చేసుకుని అఖిల ఇచ్చిన 'గిఫ్ట్ బాక్స్' పెన్ చేసి చూసేసరికి, సరిగ్గా తన సైజు ఉన్న" లెదర్ బెల్ట్ జోళ్ళు" తళతళ మెరుస్తూ కనబడేసరికి, ఆశ్చర్యపోతూ, ఆనందంతో 'ఏమోయ్, తొందరగా రా! అంటూ భార్యని పిలిచి 'చూడవే ఆ పిచ్చి పిల్ల ! నా కోసం కొత్త జోళ్లు కొని నాకు బహుమతి ఇచ్చింది’ అంటూ చూపించేసరికి, 'నిజమేనండి ! నిజంగా ఆ దేవుడు ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు. రెండు కాళ్ళు లేకపోయినా, మీ మీద ఆప్యాయతతో కరెక్ట్ గా మీ సైజు ఉన్న జోళ్ళు ఎలాగా ఇచ్చిందో తెలియటం లేదు. మీ కన్న కూతురు కూడా చేయలేని పని చేసింది. మీరు ఎంతో అదృష్టవంతులు. ఆ అమ్మాయిని అన్ని విధాల మీరు ఆదుకోవాలి! అంటూ భర్త కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లను, తన చీర కొంగుతో తుడుస్తూ అనేసరికి, లేచి 'కొంచెం అన్నీ బాక్స్లో పెట్టి ఇవ్వు. నేను వెళ్లి ఇచ్చి వస్తాను!’ అంటూ గబగబా బయల్దేరి అఖిల ఇంటికి వచ్చి ఆమెను దగ్గరకు తీసుకుని 'చూడమ్మా! నీ ఆప్యాయత, అనురాగం చెప్పలేనివి. 'రా, మీ పిన్ని గారు చేసిన పిండి వంటలు నేను నీకు తినిపిస్తాను!’ అంటూ కొసరి కొసరి తినిపించి, ‘దుర్గమ్మ నిన్ను చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నా!’ అంటూ ఎంతో హాయిగా ఇంటికి తిరిగి వచ్చారు రాఘవయ్య గారు.

ఆ మర్నాడు పోస్ట్ ఆఫీస్ లో ‘ఇంచార్జి’ గారితో మాట్లాడుతూ 'సార్ ! నేను ఇంకో అమ్మాయిని కూతురిలా పెంచుకుంటున్నాను. ఆ అమ్మాయి పేరు 'అఖిల '. పాపం కారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులను, పోగొట్టుకొని అలాగే అదే కారులో ఉన్న ఆ అమ్మాయి రెండు కాళ్ళు కూడా పోయి, అవిటి ది అయిపోయింది. ఆ అమ్మాయి అన్నయ్య మరో ఊర్లో ఉద్యోగం చేస్తూ, చెల్లిని చదివిస్తూ పోషిస్తూ ఉన్నాడు. వికలాంగురాలు అయినా అఖిల ఎంతో మంచి అమ్మాయి. ఎంతో శ్రద్ధతో 'డిగ్రీ ' పాసై ఏదైనా ఉద్యోగం దొరుకుతుతుందా.. అని ఎదురు చూస్తుంది, సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా కన్న కూతురు కన్నా ఎక్కువ అయిన ఈ అమ్మాయికి ఏదైనా 'వికలాంగుల పోస్ట్ ' పడితే తప్పకుండా, మీరు రికమెండ్ చేసి ఆ అమ్మాయిని ఆదుకుంటారని, మీ పై అధికారులకు కూడా మీరు తెలియజేసి, మాకు సాయం చేయగలరని కోరుతున్నాను’ అంటూ చెప్పేసరికి " ఓకే, రాఘవ్ గారు. ఎన్నో వికలాంగుల పోస్టులు పడుతున్నాయి. ఈ అమ్మాయి రిఫరెన్స్ కూడా మనమే ఇద్దాం! అంటూ చెప్పేసరికి 'సార్1 కావాలంటే నేను 'వాలంటరీ రిటైర్మెంట్ ' చేసైనా సరే, ఆమెకు ఉద్యోగం వస్తుంది అంటే నేను రిటైరయి పోతాను సార్!!!’ అని చెప్తున్న రాఘవయ్య చేతిని నొక్కుతూ, ‘నువ్వు అమ్మాయి ఫోటో, బయోడేటా రాయించి ఆమె సర్టిఫికెట్లు తో, సహా ‘జిల్లా కలెక్టర్’ కి, 'చీఫ్ మినిస్టర్ ఆఫీస్' కి పంపు. నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని, ఆమెకు సహాయం చేస్తాను. డోంట్ వర్రీ’ అంటూ చెప్పే సరికి ఎంతో ఆనంద పడిపోయారు రాఘవయ్య గారు.

అన్నీ ఆయన చెప్పినట్లే జిల్లా కలెక్టర్ కి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కి అఖిల వికలాంగురాలు అని ధ్రువీకరించిన పత్రాలతో, డిగ్రీ సర్టిఫికెట్ లతో పంపించారు ఇంచార్జ్ ఆఫీసర్.

. సరిగ్గా ఆరు నెలల అయ్యాక ముఖ్యమంత్రి గారి సిఫార్సు తో అఖిల కు ప్రత్యేక ప్రాతిపదిక మీద 'డెస్క్ క్లర్క్ 'గా ప్రభుత్వ ఆదేశాలతో తో 'అపాయింట్మెంట్ లెటర్ ' వచ్చింది. అంతే! అఖిల ఆనందానికి అవధులు లేవు. ముందుగా రాఘవయ్య గారికి, ఆయన భార్యకు పాదాభివందనం చేస్తూ, "ఇవాల్టి నుంచి మీరే నాకు అమ్మానాన్న! మీ బాధ్యత అంతా నాదే” అంటూ గర్వంగా మీసం తిప్పుతున్న రాఘవయ్య గారిని హత్తుకుని ఆనందంతో ఉప్పొంగిపోయింది అఖిల.

. . . అలాగే ప్రతి నెల వికలాంగుల సంక్షేమ సంఘానికి తనవంతుగా ధన సహాయం చేస్తూ అఖిల తన లాంటి వారిని ఆదుకుంటూ, క్రొత్త జీవితం ప్రారంభించింది.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


44 views0 comments
bottom of page