Vidudala Written By Poorna Kameswari vadapalli
రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి
"అమ్మా సౌమ్యా రెడీగా వున్నావా? నేను రెడీ, వెళదామా? టైమైపోతోందమ్మా! మళ్ళీ మీ బాస్ మెత్తని చెప్పుతో కొట్టినట్టు ఎదో ఒక సొడ్డు మాట అంటాడు. త్వరగా రావాలీ", పోర్టికో లోంచి కారు తీస్తూ అన్నాడు శేఖరం. "అబ్బా, ఒక్క క్షణం ఆగండీ, మీరిలా కంగారు పెట్టేస్తే ఈ టిఫిన్ క్యారియర్ పెట్టుకోవడం మరచిపోతుంది. మళ్ళీ అమ్మాయి ఆఫీసులో ఇబ్బంది పడుతుంది. ఓ నిముషం అటు-ఇటూ అవుతే మరేమీ కొంపలంటుకోవులెండీ". చిరాకు పడుతూ కారు దగ్గరకు వచ్చి ప్యాక్ చేసిన టప్పర్- వేర్ బాగ్ పెట్టింది పార్వతి. "బాగుందోయ్ నీ విసుగు! నువ్వు లేట్ చేస్తూ నా మీద విరుచుకుపడితే ఎలా? లేటవుతే మళ్ళీ అమ్మాయి అనవసరంగా మాటనిపించుకోవాల్సి వస్తుందనిగానీ. అదిగో సౌమ్య వచ్చేసింది, ఇంక బయలుదేరతాము మరి, అన్నీ పెట్టినట్టేగా?" ఎక్కమ్మా అంటూ కారు టర్న్ చేసాడు. "వెళ్ళొస్తానత్తయ్యా", అంటూ ఒక చేత్తో చీర కుచ్చిళ్ళు కాస్త పైకి పట్టుకుని, మరో చేత్తో భుజాన్ని తగిలించుకున్న పొడవాటి హ్యాండ్ బాగ్ సర్దుకొని, కార్ డోర్ వేస్తూ అంది సౌమ్య. కార్తీక్ సౌమ్యలది ఆడంబరాలు లేని రిజిస్టర్డ్ పెళ్ళి. ఆ దంపతుల కోరిక మేరకు రెండు కుటుంబాలూ కలిసి తీసుకున్న వినూత్నమైన నిర్ణయం. మొదట్లో సౌమ్యను ఆఫీసుకి రోజూ దింపి అటునుంచి అలా తనూ ఆఫీసుకు వెళ్లిపోయేవాడు కార్తీక్. కొంత కాలం తరువాత, రమారమీ ఓ సంవత్సరం క్రితం, అతనికి ప్రమోషను వచ్చింది. అతని కృషి వల్ల కంపెనీకి కలిగిన లాభాల దృష్ట్యా, యాజమాన్యం అతనికి వైసు ప్రెసిడెంట్ ప్రమోషన్ ఇచ్చింది. పిన్న వయసులో కంపెనీ వైస్ ప్రెసిడెంటు పదవిని చేపట్టిన కార్తీకుకు, ఒక్కోసారి పనుల వత్తిడి వల్ల, ఒక్కోసారి మీటింగుల్లో ఉండిపోయి త్వరగా రాలేక పోవడం వల్లా, మరి కొన్ని సార్లు బ్రాంచి ఆఫీసులకి టూర్లకు వెళ్లడం వల్ల సౌమ్యను దింపడం కుదిరేది కాదు. పోనీ తనే డ్రైవ్ చేసుకుని వెళదామంటే, ఆఫీసులో పార్కింగు సమస్య. చోటు దొరకకపోతే ప్రదక్షిణలు చేయడానికే ఒకటిరెండు గంటలు పట్టేస్తుంది మరి. 'ఇల్లు బస్సు స్టాండుకి కాస్త దగ్గరే అవ్వడం వలన బస్సులో వెళ్లడం సౌకర్యమే ఐనా, ఇంట్లో నాకేముందమ్మా పనీ, నేను దింపుతానులే నిన్ను. పొద్దున్నే ఆ కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లడం ఎందుకూ' అంటూ మావయ్యగారే దింపడం మొదలెట్టారు. అలా రోజూ ఆఫీసుకి వెళ్ళడం ఒక ప్రహసనంగా జరిగేది ఆ ఇంట్లో. ఇక సాయంకాలం విషయానికొస్తే ఉదయానికి ఏమాత్రమూ తీసిపోకుండానే వుంటుంది. ఆఫీసుకి వెళ్లి అలసిపోయి వస్తావు అంటూ పార్వతి సాయంకాలం ఇంట్లో ఒక్క పని కూడా ముట్టుకోనివ్వదు కోడలిని. పిల్లలకి వండి పెట్టుకోవడం కంటే ఆనందం నాకింకేముంటుందీ అంటుంది. అందుకే కాబోలు సౌమ్య తల్లి “మీ అత్తగారి గారాలతో నువ్వు బొత్తిగా పనులు నేర్చుకోవడం మానేసావు” మురిసిపోతూ గర్వాన్ని దాచేస్తూ అంటుంది. ***** "అసలు చోద్యం కాకపోతే, వాళ్ళ కోడలేదో పేద్ద గవర్నరు ఉద్యోగం చేస్తున్నట్టు, వేలూ, లక్షలూ సంపాదించి పోసి గుమ్మరిస్తున్నట్టు అత్తగారు క్యారియర్ అందిచడాలు, మావగారు కారులో దింపడాలు! ఆ గారాలు మురిపాలు యేవిఁటో?" ఒసేయ్, మంగమ్మా నీతోనే, "కోడలంటే కాస్త అదుపాజ్ఞల్లో ఉండద్దుటే? ఉద్యోగం చేస్తున్న కోడలైతే ఆరతులు పట్టాలా ఏంటీ? అది రేపు వీళ్లకేమి చేస్తుందంటావూ, ఇంత అలుసిస్తే? గారాలు చేసి నెత్తికెక్కించుకుంటే రేపు ఏకు మేకై కూర్చోదూ?" బారెడు పొద్దెక్కినా అప్పుడే వాకిట్లో ముగ్గు పెడుతున్న మంగమ్మతో మూతి అష్టవంకరలు తిప్పుతూ అంది వరలక్ష్మి. "అదేటమ్మ అలాగనేసేరు, ఆరు పెద్ద మడుసులే కాదు పెద్ద మనసున్న మడుసులు కూడాను. ఆ సిన్నమ్మగోరూ ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ సూస్తున్నానుగందా! ఆరు ఆత్తోరింట్లోఉన్నట్టే ఉండరు. పుట్టినింటో ఉన్నట్టే ఉంటారు", అంది మంగమ్మ చురక పెడుతూ. "ఆరిల్లు ఎంతో ముచ్చటగా ఉంటాదమ్మా. సూడడానికి ఎయ్యి కళ్ళూ సాలవంటే నమ్మండి. అరట్టాగే సల్లంగా ఉండాల. ఆ పెద్దమ్మగోరూ ఆరి అత్తగోరిని అట్టాగే సూసుకునేవారమ్మా. మీరప్పటికీ ఈ ఈదికి రాలేదుగానీ ఆ పార్వతమ్మగోరూ మంచం మీద అదే పడకగా పడున్న ముసలమ్మగోర్ని సంటిపిల్లకు మల్లే ఎట్టుకుని సూసుకునేవోరు", అంటూ అడగని వివరాలు కూడా ఇచ్చింది మంగమ్మ. "గుమ్మడికాయల దొంగా అంటే భుజాలు తడుముకున్నట్టు! చాల్లేవ్ నీ సోదీ. ఎక్కడి పనులక్కడే ఉండిపోయాయి, గబగబా తెవుఁలూ. అవతల అబ్బాయికి ఆఫీసుకు టైమవుతోంది"మాట మార్చేసింది వరలక్ష్మి. మంగమ్మకింకా వాగే అవకాశం ఇస్తే, మూడు వీధుల అవతల వృద్ధాశ్రమంలో పెట్టన తన అత్తగారి ప్రస్తావన తెస్తుందేమోనన్న భయంతో విసుగు నటిస్తూ. ***** నిమ్మపండు రంగు బెంగాలీ కాటన్ చీర, ఆకుపచ్చ రంగు అంచు, అందులో థ్రెడ్ వర్క్ చేసిన చిన్ని-చిన్ని నెమళ్ళు, గంజితో ఉందేమో, ఆ కుచ్చిళ్ళు గుడిమెట్లు అమర్చినట్టు గా వున్నాయి. కుడి చేతి నిండా డజన్ ఆకుపచ్చని మట్టి గాజులు వాటికీ మాచింగుగా ఆ చివర ఈ చివర నిమ్మపండు రంగు గాజులు వేసుకుని, వాటికి రెండు వైపులా సన్నని బంగారపు గాజులు, ఎడం చేతికి బుల్లి డైలున్న గోల్డెన్ రిస్ట్ వాచ్, చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళనిండా కాటుక, మేడలో ఒక సన్నని గొలుసు. ఒక్క క్షణం ఆమెపై అలా దృష్టి నిలిచిపోవడం అప్రయత్నంగానే జరిగిపోయింది అందరికీ.
చిరునవ్వు తొణకని ముఖ వర్చస్సు చక-చకా స్టేజీ మీదకు నడిచి వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరిస్తుండగా, కరతాళ ధ్వనులతో అభినందించారు సంస్థ వారు. ఆ సంస్థలో చేరిన మొదటి సంవత్సరంలోనే బెస్టు ఎంప్లాయి-అఫ్-ది-ఇయర్ గా ఎంపికైన లలితను చూసి మురిసిపోతూ మరింత గట్టిగ చప్పట్లు కొడుతూ సంబర పడ్డారు మొదటి వరుసలో కూర్చున్న స్నేహితురాళ్ళు సౌమ్య, మానసలు. ***** "అమ్మా లలిత, ఒక మంచి సంబంధం వచ్చింది. నువ్వు, అబ్బాయీ ఒకరినొకరు చూసుకుని నచ్చినట్టయితే ముహుర్తాలు పెట్తసుకోవడమే అన్నారు మగపెళ్లివారు. వాళ్ళకెలాంటి కోరికలు, పెద్ద పట్టింపులు ఉన్నట్టు లేవు. అబ్బాయి పేరు రవితేజ. మంచి అంతర్దేశీయ కంపెనీలో ప్రస్తుతం లండనులో ఆన్-సైటులో పనిచేస్తున్నాడుట. మన భూషణం మావయ్యకు బాగా తెలిసిన కుటుంబం. అబ్బాయి బుద్ధిమంతుడని అందరూ చెప్పారు. అబ్బాయి సెలవులో వచ్చాడుట. కనుక మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే బాగుంటుందనుకుంటున్నాము. నీ ఉద్దేశ్యం ఏమిటమ్మా? నీకే అభ్యంతరమూ లేదు కదా? అబ్బాయిని చూసాక నిర్ణయం నువ్వే తీసుకుందువుగాని". అంటూ పూసగుచ్చినట్టు సంగతంతా వివరించాడు మూర్తి. అక్కయ్య పెళ్ళై రెండేళ్లు కూడా అవ్వలేదు, మళ్ళీ వెంటనే అంటే కాస్త భారమే అవుతుందని మొన్ననే కదా నాన్నా ఇంకొన్నాళ్లాగుదాము అని అనుకున్నాము. ఇప్పుడే నా పెళ్ళికి తొందరేముంది? " "అలా మనమనుకున్న మాట నిజమేననుకో. మనని కోరి వచ్చిన మంచి సంబంధం. అదృష్టం వెతుక్కుంటూ వచ్చినప్పుడు జారవిడుచుకోకూడదంటారు. కాస్త డబ్బు సద్దుబాటు చెయ్యడం కష్టమని వదులుకోకూడదు కదమ్మా? నువ్వు వాటి అవన్నీ ఆలోచించకు. అబ్బాయి నీకు నచ్చితే మిగిలినవన్నీ నేను చూసుకుంటాను." అంటూ కూతురి తల నిమురుతూ అన్నాడు మూర్తి. "మంచి కుటుంబం, పైగా మొన్న భోషాణం మావయ్య వాళ్ళ బావమరిది కూతురి పెళ్ళిలో నిన్ను చూసారుట, వాళ్ళే ఆసక్తి చూపుతున్నారుట. కాస్త వ్యవధి కోసం, ఇలా మనని వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని జారవిడుచు కోటం ఎందుక"ని మావయ్య అంటే అదీ నిజమేననిపించింది. వెనకాడడానికి కారణాలేమీ కనిపించలేదు". అంటూ తన సుముఖానికి కారణం చెప్పాడు మూర్తి. ***** ఉరుకులూ-పరుగులు మీద ఆయాసపడుతూ బస్టాండుకు చేరుకుంది లలిత. "ఇంకా అమ్మాయిగారు మనతో మాట్లాడతారో లేదో, టైం ఉంటుందో లేదు. మన టైమంతా ఇప్పుడు రవిగారు కాజేస్తున్నారేమో? మరి నల్ల పూసైపోతోంది లలిత" అంది మానస.
"రొమాన్స్ మొదలయ్యి వారందాటింది, అది ఇందాకట్నుంచే ఫోను లో మాట్లాడుతూనే వస్తోంది" ఒక్క క్షణం ముందే అక్కడికి చేరిన సౌమ్య అంది. మావయ్యగారికి కాస్త నలతగా ఉందని ఆ వారమంతా బస్సులోనే వద్దామని నిశ్చయించుకుంది సౌమ్య. "ఎదురుకుండా కనిపిస్తున్న నాతో మాట్లాడకుండా, ఎక్కడో వున్న మనిషిని ఆడిపోసుకుంటారెందుకే ఇప్పుడు?, లేని కోపం తెచ్చుకుంటూ విసుగు నటించింది లలిత. "సరే కానీ నేటి తాజా కబుర్లు ఏమిటి హీరో గారివి? ఆఫీస్ అవ్వగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా పరుగెడుతున్నావు, ఫోనులో గంటలు గడుస్తున్నాయా? ఏమంటున్నారు? హనీమూన్ ప్లాన్లు వేస్తున్నారా? క్షణాలు గంటలుగా, రోజులు యుగాలుగా అనిపిస్తున్నాయని అంటున్నారా?" గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించేసింది మానస. "ఊరుకోవే మానసా. నీ అల్లరి మరి ఎక్కువవుతోంది. నిన్నా ఏ దో అన్నావు, మధ్యాన్నం దాకా మూతి ముడుచుకుని కూర్చుంది. వాళ్ళ కాబోయే శ్రీవారి గురించి ఏమి అనకూడదుట, ఇప్పటికి దీన్ని వదిలేసి, పెళ్లిలో అతగాడిని ఏడిపిద్దాములే" అంది సౌమ్య. ***** పెళ్లి కుదిరినప్పటి నుంచీ లలిత సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ప్రతి ఆడపిల్లా అపురూపంగా ఎదురు చూసే ఆ రోజు కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూడసాగింది. మానస సౌమ్యల్లాంటి స్నేహితురాళ్ళు, రవితేజ లాంటి భర్త, నేను ఎంత అదృష్టవంతురాలినో అనుకుంది. ఇంకా ఎన్ని రోజులు గడవాలో అనుకుంటూ రోజులు లెక్కపెడుతోంది. ***** "అప్పుడే ఆఫీసుకు వచ్చేసావే, మీ అయన వెళ్లనిచ్చాడా? హనీమూన్ కబుర్లు చెప్పవే? ఐనా రవిగారు మహా గట్టివాడే, అనుకున్న టైములో కంటే రెండునెలలు ముందే ప్రాజెక్టును పూర్తిచేసేసుకుని మళ్ళీ వెళ్ళక్కర్లేకుండా పెళ్ళికి ముందే పకడ్బందీగానే ఇండియాకి వచ్చేసారు. ఇల్లు సిద్ధం చేసేసి, వాళ్ళ అమ్మ నాన్నలను ఊరు నుంచి తీసుకువచ్చేసి, ఇంక లలితను వదిలి వెళ్ళక్కర్లేకుండా అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నారు" అల్లరిగా అంది మానస. "నోరు ముయ్యవే, వెనక సీటులో సుబ్బారావు మనల్నే చూస్తున్నాడు" అంటూ పళ్ళ నూరింది లలిత. పైకైతే విసుగు నటించింది కానీ, యథార్ధానికి, కలలకీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్న విషయం సన్నిహితురాలైన మానస సౌమ్యలతో కూడా అనలేకపోయింది. నవ్వుతూ తుళ్ళుతూ కనిపించాల్సిన లలిత, నిరాశగా కనిపించక పోయినా పెద్ద ఉత్సాహంగా మాత్రం లేకపోవడం గమనిస్తూనే వున్నారు స్నేహితురాళ్ళు. బుగ్గల్లో సిగ్గులు, ముసిముసి నవ్వులు, ఎవ్వరికీ దొరికి పోకుండా దాచుకోవలసిన ఊసులు ఇలా ఎన్నెన్నో అనుభూతుల్ని స్నేహితురాలి కళ్ళల్లో చూడాలని ఆరాటపడ్డ సౌమ్యా-మానసలకు కూడా నిరాశే ఎదురయ్యింది. లలిత మాత్రం ఎలాంటి భావనలూ కనబడనివ్వకుండా ముభావంగానే ఉంటోంది. ఏ విషయాన్నైనా ఎప్పుడూ పాసిటివ్ గా, సానుకూల వైఖరితో చూసే గుణం గల లలిత మరి కొన్నాళ్ళు జీవితాన్ని మరింత దగ్గరగా పరికించి చూడాలనుకుంది. అందుకే ఓర్పు వహించింది. "అత్తారింట్లో అణిగిమణిగి అణకువగా వుండాలమ్మ” బామ్మ మాటలు గుర్తొచ్చాయి. “ఒక వేళా నేనే రంగుల కలల్లో విహరిస్తూ ఉండిపోయానేమో! నిదానించి చూడాలి. అవతలి వ్యక్తిని అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించాలి” బోలెడు అనుభవం వున్నదానిలా తనకుతానే సద్ది చెప్పుకుంది. కలలకీ వాస్తవానికీ చాలా తేడా ఉంటుంది. వాస్తవం ఇలాగే ఉంటుందేమోనని తన మనసుకే సద్ది చెప్పుకుంది. రవి తేజను ఒక అనురాగ మూర్తిగా ఊహించుకుంది. ఊహించుకున్నట్టే చూడాలని ఆశ పడింది. చదువుకీ సంస్కారానికీ పొంతన వుండదన్నట్టు, గొప్ప చదువులు చదువుకున్న అతనితో గడిపిన అతి కొద్దీ రోజుల్లోనే అర్ధమైయ్యింది. ఆ అనుభవంలో సంస్కారవంతమైన సప్రవర్తనను చూడలేక పోయింది లలిత. తొలిరేయి తొలి మాటలోనే గుండెల్లో తూటాలు గుచ్చుకున్నట్టైంది. “చదువుకుని ఉద్యోగం చేస్తున్నదానివిగా, ఎన్నిసార్లు, ఎంత మందితో శరీర సుఖా న్ననుభవించావు? ఇదే అమెరికానో ఆస్ట్రేలియానో ఐతే, ఈ ప్రశ్న కూడా అడిగుండేవాణ్ణి కాదు. ఇక్కడేదో మహా మడి కట్టుకున్నట్టు బిహేవ్ చేస్తారుగా. నీ నోటెంటే విందామని అడిగాను. ఆఁ..ఆఁ... అసలలాంటివి నాకు తెలీదని మాత్రం చెప్పకు. హా హా హా...” వికటాట్టహాసం చేస్తూ, ప్రశ్న అడిగి అందుకు సమాధానం కూడా అతడే నిశ్చయించేసుకున్నాక మరో మాటకు తావు లేక, షాక్ లోంచి తేరుకోలేక, నిశ్చేష్ఠురాలిగా వుండిపోయింది. ****** అలా మొదలైనప్పటి నుండీ రోజులు గొడవగా రవి వైఖరి అంచెలంచెలుగా బహిర్గతమవ్వ సాగింది. స్త్రీల పట్ల అవహేళన, నీచమైన భావనలూ అతని మనసును కలుషితం చేసేసాయి. స్త్రీని కించపరచడంలోనే నలుగురిలో పెద్ద మగాణ్ణి అనిపించుకో గలననే చౌకబారు మనస్తత్వం రవిది. అలా అనుకోవడమే కాకుండా, దాన్ని బహిరంగంగా ప్రదర్శించుకోవడం గొప్పతనమనీ, అదేదో సంప్రదాయమనీ అనుకోవడం అలవాటుగా చేసుకోసాగాడు. అసలు స్త్రీలనే గౌరవించలేని అతనికి, భార్య మరీ లోకువయ్యింది. భార్య అంటే భర్త పాదాల కింద పడి ఉండాలనుకునే స్వభావం. పెళ్ళాం అంటే ఎప్పుడూ తన చెప్పుచేతల్లో ఉంటూ, ఆమెకంటూ ఎలాంటి అభిప్రాయాలూ లేకుండా మరబొమ్మలా ఉండి, తన ఇంటిని చక్కపెడుతూ, తన వాళ్ళను చూసుకుంటూ, తన కోరిక తీర్చే వస్తువుగానే పరిగణించే అతడు, లలితను అలాగే చూడ సాగాడు.
ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని సంస్కృతులు చూసినా, పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవన్నట్టు, నరాల్లో జీర్ణించుకు పోయిన బుద్ధి మారదు. ప్రతీ సారీ ప్రతీ మాటలోనూ లలితనుకించ పరిచి తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ, చులకనగా చూస్తూ అందులో పైశాచిక ఆనందాన్ని పొందసాగాడు రవి. అలా ఆమెను అణిచి పెట్టి ఉంచడమే మగతనంగా భావించే అతని మనస్తత్వాన్ని జీర్ణించుకులేక పోతోంది లలిత. అన్ని విధాలా అతనికి సమ ఉజ్జీయైనా, ఆమె శక్తి-సామర్ధ్యాలను గౌరవించే సంస్కారం లేకపోగా, వెంట్రుకపోచతో సమంగా తీసి పారేస్తూ అవమానకరంగా వ్యవహరించడం సహించలేకపోతోంది. ఒక్కోసారి తనకున్న లోటుపాట్లను కప్పిపుచ్చుకోవడానికి, లలితను ఊచకోత మాటలతో వేధించడం ద్వారా ఉన్మాద-ఆనందం పొందుతూ, అదే అనుకూలంగా ఉండడంతో దాన్నే అలవాటుగా చేసుకున్నాడు. ఆఫీసులో పై అధికారితో పేచీ పెట్టుకుని అహంకారంతో ఉద్యోగం కూడా మానేసాడు. అతని ప్రవర్తనావళిని నిత్యం చూస్తూ, అది సరైనది కాదని తెలిసినా, సగటు భార్యగా దాన్ని ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టింది లలితకు. ఆడదానికి తిరుగుబాటు తనముంటే తప్పు, ఎదిరించడమంటే అదో పెద్ద అపచారం, భర్తని ప్రశ్నించడమంటే అపరాధమని విని పెరిగింది. అటువంటివే బోధించిన సమాజంలో పెరిగిన లలితకు అలా చేయడం కష్టమే అయ్యింది. ఓపికతో మార్పు వస్తుందని ఎదురుచూసింది.
ఈ లోగా సమయం మించి పోయింది. తనకి ఏడోనెల వచ్చేసింది. తల్లిని కాబోతున్నానన్న ఆనందంతో ఆతని దుర్మార్గాన్ని పట్టించుకోకుండా కొన్ని నెలలు గడిచాయి. మాతృత్వపు మాధుర్యానికి చవి చూస్తానన్న ఆనందంలో చేదు వాస్తవాన్ని తాత్కాలికంగా మరచిపోయి మురిసిపోయింది. ***** సెలవు నుంచి తిరిగి వచ్చి, పరుగులతో సీటుకు చేరిన లలిత మొహమంతా వెయ్యి సూర్యుని కాంతులతో వెలిగిపోయింది. కారణం, ఎన్నాళ్ళకో మానసను చూసింది. చెమటతో ఊరి నలిగిపోయిన చీర, రేగిన జుట్టు, ఎగుడుదిగుడుగా పెట్టిన చీర కుచ్చిళ్ళు, పీక్కుపోయిన కళ్ళు, పాలిపోయిన మొహం, రొప్పుతూ వచ్చినా లలిత మొహంలో ఉత్సాహం మాత్రం ఎంతగానో కనిపించింది. ఇప్పటి ఈ జీవితంలో సంతోషాన్ని కలిగించేది ఆఫీసులో వాళ్ళిద్దరితో గడిపే ఆ క్షణాలే. “పతి పాదసేవ, అణకువ గల కోడలిగా రాకాసి అత్తగారి సేవలూ అన్ని అయ్యాయా? ఈనాటి తాజా వేధింపులు సాధింపులు ఏమిటో? పతిదేవుల వారు ఏమంటున్నారు? మాటలతో సరిపెట్టారు? లేక, మొన్నటికి మల్లే చేతులకు కూడా పని చెప్పారా?” అంది మానస. నేటి లలితను చూస్తూ ఒకప్పటి చలాకి లలితను గుర్తు చేసుకుని ఉక్రోషం ఆపుకోలేక పోయింది మానస. “అబ్బా, చాల్లేవే నీ ఆక్రోషపు మాటలు. సౌమ్య ఇంకా రాలేదా? నేనే లేటు అనుకుంటే అది ఇంకా లేటా? ఏమైయ్యిందో? బస్సుకే వస్తానందికాని ఒక వేళ వాళ్ళ మావయ్యగారే ఆఫీస్ వరకు దింపేస్తున్నారేమో ఈరోజు” అంటూ అయోమయంగా అంది లలిత, మాట మారుస్తూ. “నేను ఇవాళ ఫ్రెండ్సుతో బస్సులోనే వెళతాను మావయ్యగారూ అన్నాను. వింటేనా, ఐతే బస్సు స్టాండు వరకు దింపుతాను అంటూ బయలుదేరారు. టైర్ పంచరైయ్యింది. కాస్త దూరమే నేను నడిచి వెళతాను అంటే వినకుండా టైరు మార్చి దింపేసరికి ఇదిగో లేటయ్యింది” అంటూనే వచ్చింది సౌమ్య. మానసును చూసీ చూడకుండానే, ప్రతీ రోజు లాగానే ఆనాడు జరుగుతున్న తతంగ అర్థమైయ్యి, వెంటనే విషయం గ్రహించింది సౌమ్య. “దానికి చెప్పడానికి రోజూ ఎందుకే పొద్దున్నే సమయం వృధా చేసుకుంటావు. దాని బ్రతుకుని బుగ్గిపాలు చేసుకోవడానికే అది నిశ్చయించుకుంది. దాని జీవితాన్ని ఆ కసాయి వాళ్ళకి అంకితం చేసేసింది. ఎంత చెప్పినా ప్రయోజనం లేదు” అంది సౌమ్య నిష్టూరంగా. సమాజం కోసమో, తల్లితండ్రుల గౌరవం కోసమో దాని జీవితాన్ని ధారపోయడానికే నిర్ణయించుకుంది. మనం రోజూ వాబోవడమేతప్ప, దానిలో ఏమైనా చెలనం ఉందేమో చూడు? మా పాటికి మేము మాట్లాడుతుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా ఏమీ మాట్లాడవేంటే? ఇలా నువ్వు ఆరతి కర్పూరంలా కరిగిపోతుంటే మేము చూడలేకపోతున్నాము” అంది మళ్ళీ. ***** “నువ్వు ఈ కుటుంబానికి ఒక శాపంలా దాపురించావు, ఏ పనీ సరిగ్గా చెయ్యవేఁవిటే?” వరలక్ష్మి కేక చెవిన పడినా ఏమి వినిపించనట్టు ఉండ పోయింది లలిత. అలవాటైపోయిన దెప్పి-పొడుపు మాటలకు కన్నీరు రావడం మానేసి చాలా కాలమయ్యింది. దాంతో తన మాటలు విఫలమవుతున్నాయని మరింత ఆక్రోశపడింది వరలక్ష్మి. చిన్న మాటకే కళ్ళు ధారాపాతంలా కారే ఆ పెళ్ళైన తొలి ఆరు నెలల్లా కాకుండా వంటింట్లోకి నిర్లిప్తంగా వెళ్లిపోయింది. పాప ఊసులూ, ఏడుపూ తప్ప, ఆ ఇంట్లో ఎలాంటి మాటలూ ఆమెను చలించ ట్లేదు. “ఎందుకమ్మా చిన్నమ్మగోర్ని అట్టా ఏదోటి అంటూ యిరుసుకు పడతారు. ఆరసలే బుల్లమ్మగూరికి బాగోలేదని కట్టపడుతుంటేనూ” అంట్లు తోముతున్న మంగమ్మ అంది. “నువ్వు నోరుమూసుకుని నీ పని చూసుకో” వరలక్ష్మి విరుచుకు పడడంతో మంగమ్మ నోరు మూత పడింది. “జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్న పాపాయికి నేను తడిగుడ్డతో ఒళ్ళు తుడవడానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాను. అది ఏడిచిందన్నకోపంతో చేతిలో వున్నది వేడి నీళ్ల గిన్నె అని కూడా చూడకుండా కొట్టి ఒక్కతోపు తోసేసారు. కొంచంలో చిన్నారి మీది పడడం తప్పింది. ఉద్యోగం మానేసి కూర్చుని, నన్ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎంత ఓర్చుకున్నా రోజు రోజుకూ ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడేం చెయ్యాలో పాల్పోవడంలేదు. ఇలాంటి మనిషి దగ్గర పిల్లని వదిలి రావలసి వస్తోందనేదే నా బాదంతా. దాన్ని చూసుకునే బతుకుతున్నాను. దానికేమైనా అయితే...." భోరున ఏడ్చేసింది లలిత. బిడ్డకి ప్రమాదం తప్పిందన్న సాంత్వనలో తన చెయ్యి కాలిందనే సంగతి కూడా మరచిపోయింది. లలిత చెయ్యి చాపి చూసిన మానస కళ్ళ నీరు ఆగలేదు. ***** కొంచం సేపటికి తమాయించుకుని “నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో, ఏం చేస్తే ఈ పరిస్థితి మెరుగు పడుతుందో?” ఇంకా ఆశావాదిలా తనలోనే తప్పు వెతుక్కోవడానికి ప్రయత్నిసున్న లలిత మానసిక స్థితిని చూసిన మానస గుండె తరుక్కుపోయింది. కొంచం కోపం కూడా వచ్చింది. ఆడదానితో ఈ అలుసు చూసే మొగుడు అనే పట్టం కట్టిన మగవాడు మితిమీరి పోతున్నాడు అని మనసులోనే ఆక్రోశపడి, అది తగిన సమయం కాదని తన ఆవేశాన్ని అణుచుకుని, “నువ్వే తప్పు చేయలేదు లల్లి. నీ సంస్కారం నిన్ను అలా ఆలోచింపచేస్తోంది. నీలాంటి బంగారాన్ని పూజించలేని వాళ్లదే దౌర్భాగ్యం. కొందరికి పూర్వ జన్మ సుకృతం వల్ల అర్హత లేని అదృష్టం కలుగుతుంది. దాన్ని చేతులారా చేజార్చుకునే దురదృష్టాన్ని వాళ్ళే వెతుక్కుంటారు. అది వాళ్ళ ఖర్మ” అంది మానస విషయం ఇంతేనని తేల్చేస్తూ. “మీ అమ్మానాన్నలు నీకు తగిన జోడీ అని రవిని ఎంచారు. అందరి తల్లి తండ్రుల్లాగానే అంతా బాగుంటుందనుకున్నారు. కానీ అలా జరుగలేదుగా? ప్రేమాభిమానాలూ, ఆప్యాయతలూ లేకపోయినా కనీసం మానవత్వం ఉండాలిగా? ఉద్యోగం మానేసి నీ సంపాదన మీద ఆధార పడుతున్నది చాలక, నిన్ను వేధించడమే పనిగా పెట్టుకునేవాడు మొగుడెలా అవుతాడే? భరించేవాడే భర్త అన్నారు. భరించక పోయినా కనీసం వేధించకుండా ఉండాలిగా? చక్కగా ఉండే కాపురాన్ని నిర్లక్ష్యంతో పాడు చేసుకోమని ఎవ్వరమూ చెప్పము లల్లీ. కానీ ఇలా వేధిస్తుంటే ఆత్మాభిమానం లేకుండా పడుండడం ఎలా కుదురుతుంది? అలాంటి జీవితంలోంచి బయట పడడం తప్పేమీ కాదే. అలాంటి వాడితో జీవిచడం కంటే ఒంటరిగా బ్రతకడం ఎంతో నయం. లలితా, నువ్వు స్వావలంబన, ఆత్మవిశ్వాసం గల వ్యక్తివి. నీ ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ నిత్యం కించపరుస్తూ ఉంటే, చెయ్యని తప్పుకు నువ్వు ఎందుకలా శిక్ష అనుభవించాలి? ఇలాంటి మనుషుల మధ్య మగ్గిపోవాల్సిన అవసరమేముంది? ధైర్యం కూడగట్టుకుని, భగవంతుడు నీకు ఇచ్చిన ఆ చిన్నారిని ప్రశాంతమైన వాతావరణంలో పెంచచ్చుకదా? రానున్న రోజులకు నువ్వే బంగారు బాట వేసుకోవాలి. ఇలా జీవచ్చవంలా మారిపోనక్కర్లేదు. నిత్యం చస్తూ ఒక నిర్జీవమైన జీవితం ఎందుకు జీవించాలి?" ఆక్రోశం భరిత స్వరంతో గుండెల్లోని బాధంతా కక్కేసింది మానస. ***** బస్సు దిగి వంటరిగా నడుస్తూ మానస మరింత తీవ్రంగా ఆలోచించ సాగింది. శేఖరంగారి లాంటి ఉన్నతమైన వ్యక్తులున్న సమాజంలోనే రవి లాంటి వారూ వున్నారు. సూటీ-పోటీ మాట్లాలతో, అనుమానాలతో అవమానిస్తూ, చిత్రహింసలతో బాధ పెట్టడమేకాక లలిత సంపాదనలో తనకు తాను ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నాడు. అన్నీ భరిస్తూ రోజురోజుకూ కొవ్వొత్తిలా కరిగిపోతోంది. “ఆనాటి లలిత ఇప్పుడు ఏమైపోయింది? పసుపుతాడుతో మనోధైర్యం మూలన పడిందా? ఆ ధైర్య వంతురాలి ధైర్యం ఇప్పుడు ఏమైపోయింది? ఇంత నిస్సాహాయురాలిగా ఎందుకు మారింది? అసలు అన్యాయాన్నే సహించలేని తన గుణం ఏమైపోయింది? తనను తాను కూడా రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు వుంది? పరువు-మర్యాదల పేరిట సమాజం కోసమే బ్రతకడం స్త్రీకి అవసరమైతే మరిప్పుడు ఆ సమాజమేది? తప్పు చేసిన వారిని ప్రశ్నించదే?” మానస మనసు అనేక ప్రశ్నలతో రగిలిపోయింది. “ఈ ఊబి లోంచి లలితను బయట పడెయ్యాలి. ఆ పనికి పెద్దవారైనా శేఖరం గరే సరైనవారు”. రేపు దాని ప్రాణానికే ముప్పొచ్చాక, ఎవరమైనా ఏమిచేయగలం. ఉపేక్షించి లాభంలేదు. ఏదైనా చేయాలి అనుకుంది. అనేకానేక ఆలోచనలతో ఇంటికి చేరిన మానస ఒక దృఢ నిర్ణయానికొచ్చింది. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే వున్నప్పుడు వారి మేనకోడలు వనితని ఆ నరక కూపం లోంచి బయట పడేసారు శేఖరంగారు. “కాపురం లేకపోతె నువ్వు బతక లేక పోలేవు. ఇలాంటి వాడితో బతక వలసిన అవసరం లేదు. ఏం, మగాడు లేకుండా ఆడది, మొగుడు లేకుండా భార్యా బతకలేదా? మీకు మీ కూతురి జీవితం ముఖ్యమా లేకపోతె లోకుల మాటలు ముఖ్యమా. కొద్దిలో ఆత్మహత్య పాలయ్యేది వనిత లోకులు ఏమంటారోనని భయ పడుతున్న చెల్లెలిని బావగారినీ కూడా ప్రశ్నించారు.” ఇప్పుడు ఆయనే లలితకు కూడా చెప్పగల సమర్థులు. ఆయన చెపితే దాని పాపవీ దానివీ ప్రాణాలైనా దక్కుతాయి. ముందు తరం వారైనా, అభ్యుదయ భావాలతో, అన్యాయాన్ని సహించకూడదనీ, అక్రమాన్ని ఎదిరించాలనీ ఆమోదయోగ్యంగా చెప్పగలిగిన శేఖరాంగారి సహాయం ఇప్పుడు లలిత కి కావా లి. అనుకోవడం తడవే శేఖరంగారిని కలిసింది. సౌమ్య, మానసలు ఆయనకు అన్నీవివరంగా చెప్పారు. ***** కోర్టులో తీర్పు నిచ్చిన జడ్జిగారు ఆనందంతో అభినందిస్తున్నట్టుగా చప్పట్లు కొడుతున్న జనాన్ని చూసి ఆర్డర్ ఆర్డర్ అన్నారు. “విడిపోవడం తప్పులేదు. మరో జీవితం మొదలెట్టడమూ తప్పులేదు, ఒంటరి తనమూ తప్పులేదు. తప్పల్లా అన్యాయాన్ని ఎదిరించకపోవడమే. దుర్మార్గాన్ని సహించడమే. సంతోషం లేని చోట జీవించడమే. ఆత్మాభిమాన్ని చంపుకుని, ఆత్మగౌరవాన్ని వదులుకున్నాక, మనిషికి ఊపిరి వుటుందే కానీ ప్రాణం కాదు. మర్యాద లేని చోట మనుగడ సాగించడం చాల పెద్ద తప్పు” శేఖరం గారన్న ఆ మాటలు లలిత చెవుల్లో పదేపదే వినిపించ సాగాయి. ప్రశాంతత నిండిన మనసుతో, పంజరంలోంచి ఎగిరే పక్షిలా విడాకుల పేరుతో నరకకూపం లోంచి విడుదలైన స్వేచ్చాజీవిగా, తనకోసం వేచి వున్న శేఖరంగారు, మానస సౌమ్యల వద్దకు కోర్ట్ మెట్లు దిగుతూ చకచకా పరుగు తీసింది లలిత. ప్రేమగా తోడు నిలిచిన సౌమ్య-మనసులకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది. అయోమయంతో ఊగిసలాడుతూ నిర్ణయంతీసుకోలేని నిస్సహాయ స్థితిలో స్పష్టతను తెలిపి, దారి చూపించిన శేఖరంగారికి నమస్కరించింది. విడుదల మాత్రమే ఈ సమస్యకు సరైన పరిష్కారమనీ, ఆమె నిర్ణయాన్ని సమర్ధింస్తూ, దృఢ నిర్ణయం తీసుకున్నందుకు లలితను మనసారా అభినందించింది సౌమ్య. ఎప్పుడూ తాజా వార్తల కోసం ఎదురు చూసే మానస, ఆనాటి 'విడుదల' అనే తాజా వార్తకు మురిసిపోయింది. శేఖరంగారి పక్కనే నిలబడ్డ మూర్తి దంపతులు, చిరునవ్వుతో ఆహ్వానిస్తూ లలితను అక్కున చేర్చుకున్నారు. ***** గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి
రచయిత్రి పరిచయం
నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కధలకు, బహుమతులు పొందాను.
Comments