విద్యాధనం

Vidyadhanam Written By Subbarao Mandava
రచన : మండవ సుబ్బారావు
వరంగల్ నగర శివార్లలో గల విజయ ఉద్యానవనం సాయంత్రం ఆరుగంటలకే రంగురంగుల విద్యుత్ దీపాలతో కాంతులీనుతుంది. ద్వారం దగ్గర స్వాగత తోరణంతో పాటు ఆ నాటి కార్యక్రమాన్ని తెలియజేసే పెద్ద చిత్రపటం ఆ వెలుగుల్లో మరింత ఆకర్షణీయంగా చూపరులను ఆకట్టుకొంటుంది.
ప్రముఖ న్యాయవాది రామకృష్ణకు అనేక ప్రజాసంఘాల వారు, రైతునాయకులు చేస్తున్న సన్మాన సభ
మరి కొద్దిసేపటిలో ప్రారంభం కాబోతుంది. జాతీయ స్థాయి రైతు నాయకుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న వివరాలు ఆ చిత్రపటంలో వివిధ రంగుల అక్షరాలతో తీర్చిదిద్దబడ్డాయి. సరిగ్గా సమయానికి సభాప్రాంగణం ఆహ్వానితులచే, చుట్టుప్రక్కల గ్రామాలనుండి వచ్చిన వివిధ ప్రజాసంఘాల, రైతుసంఘాల నాయకులచే, స్థానిక అభిమానులచే కళకళలాడతుంది.
సభా నిర్వాహకుని ఆహ్వానంతో వేదికపై అధిరోహించిన ముఖ్య అతిథి, రాష్ట్ర రైతుసంఘ నాయకుడు,మరి కొందరు ముఖ్యులు, జిల్లా పాలాధికారులు, సన్మాన (గ్రహీత రామకృష్ణ తమతమ స్థానాలలో కూర్చున్నారు. కార్యక్రమ పరిచయాల తదనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ రైతునాయకుడు, న్యాయవాది రామకృష్ణ సాధించిన అపూర్వ విజయాన్ని గురించి వివరించారు.
" న్యాయవాది రామకృష్ణ రైతు పక్షంగా సర్వోన్నత న్యాయస్థానము వరకు వెళ్ళి రైతుకు విత్తనం అతి తక్కువ ధరకు ఇచ్చే ఏర్పాటు చేసేవరకు (ప్రభుత్వంతో పోరాడినాడు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా,బెదిరింపులు, ప్రలోభాలు లెక్క చేయక కిలో రెండు వేలు అమ్ముతున్న విత్తనాలను ప్రభుత్వం రైతుకు కిలో వంద రూపాయలకే ఇచ్చేటట్టు చేయటం మామూలు విషయం కాదు. మా రైతుసంఘ నాయకులకు అండగా నిలబడి ఒక్కపైసా ఖర్చులేకుండా ఈ విజయం సాధించటం మనందరికి గర్వకారణం. సన్మానాలు,అవార్డులు, రివార్డులు అవసరంలేదని తాను చెప్పినా, మన సంతోషం కోసం ఈ కార్యక్రమానికి ఒప్పుకొని వచ్చిన వారికి అభినందనలు. వారిని ఈరీతిగా గౌరవించే అవకాశం నాకు దొరకటం ఆనందంగావుంది.”
సభికులంతా ఒక్కసారిగా నిలబడి చేసిన కరతాళ ధ్వనులతో ఉద్యానవన ప్రాంగణం మారు మ్రోగింది.
రామకృష్ణ మదిలో ఆ నాటి చప్పట్లు సుడులు తిరిగాయి.
***** ***** *****
" ఈ సారి కూడా రామకృష్ణకే ఇరవైఐదుకు ఇరవైఐదు మార్కులు వచ్చాయి.ఏ మాస పరీక్షలోనైనా రామకృష్ణనే ప్రథముడు. అభినందనలు రామకృష్ణ ! తరగతి గదిలోని విద్యార్థులందరు లేచి నిలబడి రామకృష్ణకు అభినందనలుతెలియజేయండి.” అన్నాడు ఎనిమిదవ తరగతి గదిలో వున్న లెక్కల మాష్టరు వర్మ.
తరగతి గదంతా చప్పట్లతో మారుమోగింది. రామకృష్ణ కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
” సరే, కూర్చోండి. రామకృష్ణ మీ అందరికి ఆదర్శం. వచ్చే మాస పరీక్షలో అందరికీ ఇరవైపైనే మార్ములు రావాలి. సరేనా?”
” అలాగే సార్. తప్పకుండా తెచ్చుకుంటాం.” ముక్త కంఠంతో బదులిచ్చారు విద్యార్థులంతా. ఇంతలో గంటమోగింది.
“ రామకృష్ణ ! ఆటల గంటలో నాకు కనిపించు”, అని చెప్పి వర్మ మరో తరగతిలోకి వెళ్ళి పోయారు.
మధ్యాహ్నం మూడున్నరకు ఆటల గంట వుంటుంది. ఆ రోజు శనివారము కావటం వలన
అందరికీ మాస్ డ్రిల్ వుంటుంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులున్నారు. ఆటల సారొక్కడే తరగతి లీడర్ల సహాయంతో రోజూ ప్రార్థన జరిగే స్థలంలో మాస్ డ్రిల్ చేయిస్తాడు. మిగతా ఉపాధ్యాయులంతా వారి విశ్రాంతి గదిలో కూర్చొని హాజరు పట్టికలు కొందరు, గుణ పట్టికలు కొందరు రాసుకుంటూ వుంటారు.
రామకృష్ణ గొంతు విని ఉపాధ్యాయులందరూ, వారివారి పనుల్లోనుండే తలలెత్తి చూశారు ఎవరిని
అడిగాడాయని. లెక్కల మాఫ్టర్ లోపలకు రమ్మని సైగ చేశాడు. చెప్పులు బయట వదిలేసి, నిశ్శబ్దంగా వర్మ మాష్టర్ దగ్గరకు వచ్చాడు రామకృష్ణ.
” రామకృష్ణ ! నీకు మార్కులు బాగానే వస్తున్నాయి . సార్లంతా వారి వారి విషయాలలో నువ్వు ప్రథ
ముడివి అంటున్నారు. కానీ నీ హాజరు బాగా తక్కువగావుంది. ప్రతి వారంలో కనీసం రెండు రోజులు రావటం లేదు. ఎందుకు? ఏమిటి నీ సమస్య? ” అని ప్రశ్నించాడు తన పని తాను చేసుకుంటూ.
” సార్ ! మేము చాలా పేదవాళ్ళము. మా నాన్న ఒక సంతలో పశువులు కొని మరో సంతలో ఆ పశు
వుల్ని అమ్ముతుంటాడు. సంతకు సంతకు మధ్యలో ఆ పశువుల్ని నేను అడవికి తోల్కపోయి మేపుకు రావాలె. ఇంటికి నేనే పెద్దవాడ్ని. తమ్ముడు మా ఊళ్ళో ఐదో తరగతి చదువుతాండు. ముగ్గురు చెల్లెళ్ళు చిన్నోళ్ళు. అమ్మకు ఆరోగ్యం సరిగ వుండదు. వంట పని సరిపోద్ది. ” అని తన జీవిత చరిత్రను రెండు ముక్కల్లో చెప్పాడు.
” అలాగా ! మరి, నేను చెప్పినట్టు చేస్తావా? ” అడిగాడు వర్మ
” చెప్పండి సార్. చదువుకోసం ఏమైనా చేస్తా ” అన్నాడు ధీమాగా.
” నీకు నిజంగా బాగా చదువుకోవాలని వుంటే ఒక పని చెయ్. రేపు నీకున్న బట్టలు, పుస్తకాలు
దుప్పట్లు గనక ఏమైనావుంటే అవి తీసుకుని మా ఇంటకి వచ్చేయి. నీకే పనీ చెప్పను చదువు పని తప్ప.” అన్నాడు తనకున్న ఆలోచనను చెపుతూ వర్మ మాష్టర్.
” అలాగే సార్ “ అంటూ లేడి వేగంతో బయటకు పరుగెత్తుకు వెళ్ళాడు.
మరునాడు తెల్లవారక ముందే రామకృష్ణ తండ్రి మల్లయ్య పశువుల్ని తోలుకుని నవాబుపేట
సంతకు వెళ్ళాడు. రామకృష్ణ తన పుస్తకాలు, బట్టలు, పళ్లెం, గ్లాసు తీసుకొని అమ్మ దగ్గరకు వెళ్ళి, "అమ్మా! నేను బాగా చదువుకోవాలి. చదువుకొని కలెక్టరును అవుత. తమ్ముడిని, చెల్లెళ్ళను చదివిస్తా. నాన్నకు నీకు కష్టాలు లేకుండా చేస్త. మా సార్ చాలా మంచోడు. నన్ను బాగా చదివిస్తనన్నడు. మీకు కూడ అలకనైతది, ” అని సంతోషంగా వాడు చెపుతుంటే, అమ్మ రెండు కళ్ళు నిండుకుండలైనవి.
” నాయన ఊరుకోడు బిడ్డ !.నా ప్రాణం తీస్తడు. నిన్ను ఈ సాలు గడిచినంక పటేలు కాడ గొడ్లు
కాయటానికి పెడతనని చెప్పి అప్పుతెచ్చిండు. పటేలు ఊరుకోడు ” అని దిగులుగా చెప్పింది ఎక్కెక్కి ఏడుస్తూ.
“ లేదమ్మా ! నేను మంచిగ చదువుకుంట. మంచి ఉద్యోగం కొడ్త. అందరికి పస్తులుండుడు తప్పు
తది. ఒక్క పదేండ్లమ్మ. నాయనకు నువ్వు నచ్చజెప్పు”, అని ఇక తల్లి మాటకు కూడ ఎదురుచూడకుండ వెళ్ళిపోయాడు.
రామకృష్ణ ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో తను చదువుకునే ఉన్నత పాఠశాలవుంది. తన ఊరి
నుండి రోజూ నడిచి వెళ్ళి చదువుకునే వాళ్ళు చాలామందే వున్నారు. కొందరు ఆర్ధికంగా వున్నవారు సైకిల్‌పై వెళుతుంటారు.
ఉదయం ఎనిమిది గంటలకే రామకృష్ణ, వర్మ ఉపాధ్యాయుడి ఇంటికి వచ్చాడు. వర్మ ఆప్యాయంగా రామకృష్ణను ఇంట్లోకి తీసుకువెళ్ళి, భార్య లక్ష్మికి పరిచయం చేశాడు. లక్ష్మి కూడా ఎంతో ఆప్యాయంగాను ప్రేమతోను పలుకరించి, వాడి సామాన్లు పెట్టుకొని ఉండటానికి ఒక గది చూపించింది. ఆ గదిలో ఒక మంచము, ఒక బల్ల,స్నానాల గది ఉన్నాయి. రామకృష్ణకు ఆశ్చర్యముతో కూడిన ఆనందం కలిగింది.
నాలుగు రోజుల తరువాత సంతకు పోయి వచ్చిన మల్లయ్య ” రాముడేడి?” అని భార్యనడిగాడు.
” ముందుగాల చానా దినాలైంది సెయ్యి కడుక్కో, బువ్వదిను, అటెంక వాని ముచ్చట సెపుతా"
అన్నది.
” వానికో ముచ్చటవున్నదా? సరే గాని, రేపు ఆదివారము నర్సంపేట సంతకు పోవాలె" అంటూ
కాళ్ళు కడుక్కోని వచ్చి, పీట మీద కూర్చున్నాడు.
అన్నం పెట్టింది భార్య.
” సల్ల తెచ్చినవా?” అడిగాడు మల్లయ్య
” ముందు కూరతోని తిను. అటెంక సల్లపోస్త” అంది రామకృష్ణ విషయం ఎలా చెప్పాలా అని
ఆలోచిస్తూ.
“ ఇగ సాల్లే. సల్లబొయ్ ” అన్నాడు మల్లయ్య చిరాగ్గా.
' వామ్మో చిరుబురులాడతాండు! ఏమి చెపితే ఏమైతదో’ అనుకుంటూ మగని కంచంలో చల్ల
పోసి, మొత్తం చెప్పింది వాడు చెప్పినట్టు.
గమ్ముగ చల్ల అన్నం గొంతుజారుతుంటె ఏమీ పట్టనట్టు గడగడా తాగుతూ, నములుతూ అన్నం
తినటం ముగించాడు. చేయి కడుక్కోని, వెంటనే చెప్పులు తొడుక్కోని బయటకు వెళ్ళిపోయాడు. ‘తుఫాను ముందు ప్రశాంతత’లా అనిపించింది భార్యకు. "యాడికి పోతడో ఏమి చేత్తడో' యని దిగులుగా కూలబడిపోయింది.
చిన్న పిల్లలు బడినుండి వచ్చి అన్నం పెట్టమనే వరకు సోయిలో లేదు.
చక్కగా బడికి పోయాడు మల్లయ్య .రామకృష్ణ తరగతికి పోయి వాని జుట్టు పట్టుకొని బర
బరా బయటకు లాక్కొచ్చాడు.
” ఏందిరా ? నీకు సదువు కావాల్నా. సదువుకొని ఎవళ్ళను ఉద్దరిత్తవురా ? ఏడి ఆ
పంతులేడి? పిలువు ” అంటూ పిడిగుద్దులు కొడుతూ, తిడుతూ అరుస్తున్నాడు.
తరగతిలోని పిల్లలందరూ పొలోమంటూ బయటకు వచ్చి తమాష చూస్తున్నారు. ఈ
గొడవకు బయటకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ” ఏం జరుగుతుందిక్కడ ?అందరూ లోపలకు వెళ్ళండి” అని గట్టిగా అరవటంతో , పిల్లలంతా వచ్చినంత వేగంగా తిరిగి వారి వారి తరగతి గదుల్లోకి వెళ్ళి పోయారు.
రామకృష్ణను వదిలేసి, మల్లయ్య ప్రధానోపాధ్యాయుడి దగ్గరకు వచ్చి, ” అయ్యా పెద్దసారు ! పిల్లగాళ్ళు లేకుంటే, మీ పంతులుకు నా కొడుకు దొరికిండా సాదుకోటానికి. మీరు నాయం చెప్పండి ” అన్నాడు వంగి వంగి దండాలు పెదుతూ.
” రామకృష్ణ ! నువ్వు తరగతిలోకి వెళ్ళు . నేను మీ నాయనతో మాట్లాడుతా .” అని ప్రధానోపాధ్యాయుడు అనగానే రామకృష్ణ కళ్ళు తుడుచుకుంటూ తరగతి గదిలోకి వెళ్ళి పోయాడు.
” ఏమయ్యా ? ఇది బడనుకున్నావా ? బందెల దొడ్డి అనుకున్నావా ? ఏదైనా వుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. రా ! లోపల కూర్చొని మాట్లాడదాం” అని మల్లయ్య కోసం ఏదురు చూడకుండా తన కార్యాలయంలోకి వెళ్ళిపోయాడు ప్రధానోపాధ్యాయుడు.
మల్లయ్య మెల్లగా జారుకున్నాడు. ఎంత సేపటికి మల్లయ్య లోపలకు రాకపోయేసరికి గంట కొట్టి
అటెండర్ని, మల్లయ్యను లోపలకు తీసుకు రమ్మని పంపించాడు. మల్లయ్య అటెండర్ కి ఎక్కడా కనిపించలేదు. ఆ విషయమే చెప్పాడు న్రధానోపాధ్యాయుడితో అటెండర్.
సాయంత్రం నాలుగు గంటల సమయములో మల్లయ్య ఆ ఊరి సర్పంచ్, మరో నలుగురు బడి
సంఘం వాళ్ళను తీసుకొని వచ్చాడు. అందరూ 'ప్రధానోపాధ్యాయుడిని కలిసి చర్చించుకున్నాక వర్శగారిని పిలిచారు.
వర్మ మాష్టర్ అందరి అనుమతితో మల్లయ్యతో మాట్లాడాడు.
” చూడు మల్లయ్య ! నేను నీ కొడుకును నీ కుటుంబానికి దూరం చేయటానికి నా ఇంటికి తెచ్చుకోలేదు. రామకృష్ణ చాలా తెలివైన పిల్లవాడు. బడిలో పిల్లలందరికీ, ఉపాధ్యాయులందరికీ తెలుసు. పెద్దసారుకు కూడ తెలుసు. సరైన తిండి లేక , హాజరు లేక, పశువులు కాస్తూ కూడ ఆరువందల పిల్లల్లో నీ కొడుకు...నీ కొడుకు ఫస్టు.
ఇలాంటి కొడుకును కన్న నువ్వు చాలా అద్భష్టవంతుడివి. వీడి వలన నీ కుటుంబము మొత్తం బాగుపడుతుంది. నేను నీ కొడుక్కి అన్నం పెట్టి చక్కని వాతావరణం కలిగించి చదివిస్తాను . వాడు నీ కొడుకే. విద్య అనేది గొప్ప ధనం. దొంగలు దోచుకుపోరు. పంచుకుంటే పెరుగుతుంది. ఎన్నటికి తరగని నిధి. విద్యా ధనం సర్వధన ప్రధానం. అంటే అన్ని ధనాలకంటే చదువు అనే ధనము చాలా గొప్పది. నా మాట విను. ఒక్క పుష్మరకాలం కళ్ళు మూసుకో. వాడ్ని గొప్పవాణ్ణి చేసి నీకు అప్పగిస్తాను.” అని ఎంతో అనునయంగా మల్లయ్యకు మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా చెప్పాడు.
వచ్చిన పెద్ద మనుషులు వర్మగారి మాటలకు ముగ్గులై మల్లయ్యకు నచ్చజెప్పి పంపించారు.
పదవ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు రామకృష్ణ. వర్మగారు తన మిత్రుడి సహాయంతో వరంగల్ పంపించి కళాశాలలో చేర్పించాడు. డిగ్రీ పూర్తిచేసి, లా కోర్సులో చేరాడు రామకృష్ణ తను చదువుకుంటూనే సాయంత్రం, సెలవు దినాలలో పదవ తరగతి పిల్లలకు చదువు చెపుతూ కొంత సంపాదించడం ప్రారంభించాడు. తన ఖర్చులకు పోను, కొంత సొమ్ము ఇంటికి పంపిస్తున్నాడు. తమ్ముడ్ని , చెల్లెళ్ళనూ చదివిస్తున్నాడు.
కాల చక్రం గిర్రున తిరిగి పదిహేను సంవత్సరాలు ఇట్టే గడిచి పోయాయి. రామకృష్ణ ఇప్పుడు వరంగల్ నగరంలో ప్రముఖ న్యాయవాది. తమ్ముడు మోహన్ దాక్టర్. ముగ్గురు చెల్లెళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయినులుగ పని చేస్తున్నారు.
అందరి పెళ్ళిళ్ళు జరిగాయి. అన్నదమ్ములిద్దరూ హన్మకొండలో చక్కని భవనం కట్టించుకొని తల్లిదండ్రులను తమతోనే వుంచుకున్నారు. వర్మగారు తన ఉద్యోగ విరమణ తరువాత పుట్టిన ఊరు వెళ్ళి భార్యతో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రామకృష్ణ జీవితం ఆ ఊరి వారందరికీ ఆదర్శమైంది. ఎందరో పేద పిల్లలు చదువుపట్ల శ్రద్ధ కలిగిపనులు చేస్తూ చదువుకున్నారు, చదువుకుంటున్నారు. ఊరంతా విద్యా సుగంధం వ్యాపించింది.
***** ***** *****
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి