top of page

విలువ


Viluva Written By Padmavathi V

రచన : పద్మావతి విష్ణువజ్జుల


అబ్బాయీ... "అంటూ మెల్లిగా పిలిచింది శాంతమ్మ. " చెప్పమ్మా...ఏం కావాలి. మందులు అయిపోయాయా...ఇంట్లో ఏవైనా సరుకులు అయిపోయాయా ? "అడిగాడు కొడుకు సుందరం.

" కాదురా అబ్బీ...కొన్నాళ్ళు సుధ దగ్గరికి వెళ్లి వస్తాను. కోవిడ్ అంటూ ఎక్కడకూ వెళ్ళలేదు.పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు. కొత్త కాపురం,కోడలు కూడా ఉద్యోగం అని ఇన్నాళ్లూ ఉండిపోయా.మీకు కూడా ఏకాంతం ఉంటుంది. అదీ కాక అల్లుడు వాళ్ళ అమ్మను చూడడానికి వెళ్తాడుట...అందుకని సుధకు తోడుగా ఉండచ్చు.ఓ వారం పాటు వెళ్లి వస్తాను.నన్ను అక్కడ దింపు "అంది శాంతమ్మ. శాంతమ్మ కు ఒక కొడుకు ,ఒక కూతురు.కూతురు పెళ్లి చేసిన రెండేళ్లకు గుండెపోటుతో మరణించారు శాంతమ్మ గారి భర్త రంగనాధం గారు. అప్పటి నుండి ఇల్లు కదలలేదు శాంతమ్మ గారు.ఈలోపు ఏడాది గడిచిపోయింది. సంవత్సరీకాలు అయ్యాయి.సుందరం ఇష్టపడ్డ అమ్మాయి ఇందిరతో సింపుల్ గా పెళ్లి అయింది కోవిడ్ కారణంగా. కోడలు కాపురానికి రావడంతో ,కాస్త ఇంట్లో మూడో మనిషి అలికిడితో ,ఇల్లు కొద్దిగా కళకళ లాడింది.అయితే కోడలికి పనిపాటులు రావు.బంగాళదుంపలు వేపుడు,బెండకాయ, దొండకాయ వేపుడు తప్ప ఏవీ రావు. ఆ కాస్త చేసి అలసిపోయి పడుకుంటుంది ఇందిర. ఈ కాలం పిల్లలు పని చెప్తే విడాకులు అడుగుతున్నారని విన్న శాంతమ్మ గారు ఏ పనీ చెప్పేది కాదు. కానీ ఇందిరకు పనంతా తానే చేస్తున్నట్లు, అత్తగారు సుఖ పడి పోతున్నట్లు అనిపించింది. అది గ్రహించిన శాంతమ్మ కూతురు వంకతో కొన్నాళ్ళు దూరంగా ఉంటే కోడలికి కనువిప్పు కలుగుతుందని భావించి, కూతురు దగ్గరకు బయలుదేరింది.చిన్న బాగ్ లో బట్టలు సర్దుకొని రెడీ గా ఉంది. ఇందిరకు చాలా ఆనందంగా ఉంది. హాయిగా ఉండచ్చు,ఓ వారం అనుకుంది.

"అదేంటి అత్తయ్యా... వారం పాటు అక్కడే ఉంటే మాకు తోచదు...వీలున్నంత త్వరగా రండి" అని పైకి అన్నా, ఓ నెల అక్కడే ఉంటే సినిమాలో చూపించి నట్లు, తాను, తన భర్త సుందరం డ్యూయెట్ పాడుకుంటూ, నోట్లో ముద్దలు తినిపించుకుంటూ,ఒకరి ఒళ్ళో ఒకరు వాలిపోతూ... ఓహ్...ఎంత బావుంటుంది అనుకుంటోంది.

"ఏదో... నీ పిచ్చి ప్రేమ , అల్లుడు గారు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతాను "అని పైకి అన్నా....రెండ్రోజులకే కోడలికి ఒంట్లో బాగాలేదని పిలుపు వస్తుందని తెలుసు శాంతమ్మ కు.

"అమ్మా...జాగ్రత్తగా ఉండు.మందులు పెట్టుకున్నావా,డబ్బులు ఉన్నాయా...పిల్లలకు ఏవైనా చెయ్యలేకపోయావా..."అంటుంటే"అన్నీ ఉన్నాయిరా....ఇదిగో ఈ డబ్బాలో నీకు ఇష్టం అని సున్నుండలు చేసి పెట్టాను.కోడలికి స్వీట్ అంత ఇష్టం ఉండదు...అందుకే నాలుగు జంతికలు చేసాను...ఇక్కడే పెట్టాను చూసుకోండి...కోడలికి కొత్త కదా...కాస్త నువ్వు చెప్పు"అంటూ అప్పగింతలు పెట్టింది.ఇవన్నీ అత్తగారు ఎప్పుడు చేశారో తెలియదు ఇందిరకు .

వర్క్ ఫ్రం హోమ్ మరి....వర్క్ ఇన్ హోమ్ మర్చిపోయింది.పోన్లే...అత్తగారు అన్నీ చేసి పెట్టారు... హ్యాపీ అనుకోని మురిసిపోతూ"అయ్యో...ఇవన్నీ మీరు ఒక్కరూ ఎలా చేశారు... నన్ను పిలిస్తే ఓ చెయ్యి వేసేదాన్ని"అంది,పిలవనందుకు మనస్సులో ధన్యవాదాలు చెప్తూ. "నీకు నీ ఉద్యోగం సరిపోతుంది. ఇప్పుడు తప్పదు...ఈ వారం...కాఫీ డికాషన్ ఫ్రిజ్ లో ఉంది.రెండు రోజులు వస్తుంది ...చూసుకో"...అంటూ బయల్దేరారు శాంతమ్మ గారు. దింపడానికి వెళ్లిన భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసింది ఇందిర. ఊళ్ళోనే ఉంటున్న ఆడపడుచు సుధ కూడా ఎక్కువగా రాదు. అందునా ఇప్పుడు కరోనా. ఓ గంట పోయాక వచ్చాడు భర్త సుందరం. వస్తూనే ఇద్దరూ వర్క్ మొదలు పెట్టారు. "ఇందూ... అక్క పూరీ, కూర చేసింది నా కోసం ,నేను తినేసాను"అన్న భర్త మాట పూర్తి కాకుండానే..."నేను మీ కోసం కూర్చున్నాను...మీరు చెప్పిన తర్వాత, మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దామని...నాకు వద్దులెండి..."అంటూ ముఖం మాడ్చుకుంది. "ఇదిగోనోయ్...నీక్కూడా హాట్ ప్యాక్ లో పెట్టి ఇచ్చింది.అక్క పూరీ, కూరా బాగా చేస్తుంది"అంటూ సుధ ఇచ్చిన పూరీలు ఇందిరకు ఇచ్చాడు. అసలే ఆకలితో నకనక లాడుతోందేమో గబగబా తినేసింది. పూరీలు బాగా నచ్చాయి ఇందిరకు. రాత్రికి రైస్ కుక్కర్ లో అన్నం వండింది. అత్తగారు పొద్దున్నే చేసిన పదార్థాలు తినేసి పడుకున్నారు. పొద్దున్నే తలుపు తట్టిన శబ్దానికి బద్ధకంగా లేచింది. టైమ్ చూస్తే ఆరు అయింది.మళ్లీ పడుకుందామనుకుంది. కానీ తలుపు బాదుతున్న శబ్దానికి నిద్ర పట్టలేదు. లేచి తలుపు తీసింది. ఎదురుగా పనిమనిషి జ్యోతి.

"ఏంటి జ్యోతి ఇప్పుడు వచ్చావ్ "అంది.

" నేను రోజూ వచ్చే టైమ్ ఇదేనమ్మా "అంది.

రోజూ అత్తగారు తలుపు తీస్తుంటే తెలియలేదు.ఇందిరకు ఎనిమిది గంటలకు లేవడం అలవాటు.అత్తగారు వచ్చేవరకు తప్పదు. లేకపోతే అంట్లు తోముకోవాలి. ఇల్లు తుడుచుకోవాలి...బాబోయ్ అనుకుంది. జ్యోతికి కాఫీ ఇవ్వాలిట పొద్దున్నే. రెండు రోజులు బాగానే గడిచాయి. మూడో రోజు పొద్దున్నే కాఫీ తాగుదామని చూస్తే అందులో ఉన్న డికాషన్ జ్యోతికి సరిపోతుంది. తనకు,భర్త కు చాలదు. అత్తగారు చెప్పినట్లు రెండు రోజులకు సరిపోయింది. అప్పటికే ఏడున్నర అయింది.తల నొప్పి గా ఉంది ఇందిరకు. కాఫీ పొడి డబ్బా కోసం చూసింది. అది ఎక్కడుందో తెలియదు. ఇంత వరకూ తాను ఏనాడూ డికాషన్ వెయ్యలేదు.ఎప్పుడూ అత్తగారు పెట్టి ఇస్తుంటే కాఫీ వేడి లేదని,పంచదార లేదని గొణుక్కుంటూ తాగుతోంది. ఇవాళ్టి వరకు డికాషన్ వచ్చింది. ఇప్పుడు తెలిసింది అత్తగారి కాఫీ విలువ. చివరికి ఒక డబ్బాలో కాఫీ పొడి దొరికింది. అమ్మయ్యా అనుకోని టీ పొడి వేసినట్లు కాఫీ పొడి వేసి మరిగించింది. దానితో కాఫీ కలిపింది. నోరంతా కాఫీ పొడి. సుందరం మాట్లాడకుండా కాఫీ తాగి " చాలా బావుంది" అన్నాడు. తల్లిని అడిగి డికాషన్ వెయ్యడం నేర్చుకుంది ఇందిర. ఆ రోజు వరకు అత్తగారు ఫ్రిడ్జ్ లో పెట్టిన కూర ,పులుసు తిన్నారు. ఇంట్లో చూస్తే కూరలు లేవు . పోనీ చారు పెడదాం అని చూస్తే ఒక్క టమాట కూడా లేదు. ఏం వండాలో తెలియలేదు. అత్తగారు అన్నీ అమర్చి పెడుతుంటే తెలియలేదు అనుకుంది. పోనీ ముద్ద పప్పు పెడదాం అంటే కందిపప్పు డబ్బా కనపడలేదు. అన్ని డబ్బాలు చూసింది. కనపడలేదు. వెంటనే కొట్టుకు వెళ్లి పప్పు తెచ్చి వండింది. సాయంత్రం టిఫిన్ తింటాడు సుందరం. శాంతమ్మ చేసిన జంతికలు, సున్నుండలు అయిపోయాయి. "పకోడీలు వెయ్యవోయ్. "అన్నాడు సుందరం. పకోడీలు అనగానే నోరూరింది , తల్లి చేసిన పకోడీలు తలచుకొన్న ఇద్దరికీ. కానీ ఇందిరకు పకోడీలు చెయ్యడం రాదు. ఇందిర మొహం చూసిన సుందరానికి అనుమానం వచ్చింది. వెంటనే "ఇందూ... గొట్టం గాడిని అడుగు"అన్నాడు.

"గొట్టం గాడా...వాడెవడు"అంది అమాయకంగా.

"అదేనోయ్...యూ ట్యూబ్"అన్నాడు జోక్ వేసినట్లు నవ్వుతూ.

"ఓహ్ సూపర్ ఐడియా...అసలు వచ్చనుకోండి...ఏదైనా సులువు పద్దతి ఉందేమో.."అంటూ ఫోన్ తీసింది. యూ ట్యూబ్ తీసి పకోడీ అని తెరవగానే రకరకాల పకోడీల పేర్లు వచ్చాయి. కేబేజీ పకోడీ, సగ్గుబియ్యం పకోడీ, చికెన్ పకోడీ, మట్టన్ పకోడీ, పాలకూర పకోడీ, పల్లీ పకోడీ, జీడిపప్పు పకోడీ ఇలా లిస్ట్ చూసేసరికి కళ్ళు తిరిగాయి,ఇందిరకు. "ఏమండీ...ఇందులో పది రకాల పకోడీలు ఉన్నాయి.ఏది చేయమంటారు "అంది. "ఇంట్లో ఏం ఉన్నాయో చూడు.ఉన్నదాన్ని బట్టి చెయ్యి" తాపీగా అన్నాడు సుందరం. వంట గది లోకి వెళ్లి వెదకడం మొదలు పెట్టింది. కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు. అందుకని ఇంట్లో ఉల్లిపాయలు లేవు. ఇందిరకు కాస్త థైరాయిడ్ ప్రాబ్లం ఉందని క్యాబేజీ వండరు. పల్లీలు, జీడిపప్పులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. అత్తగారికి ఫోన్ చేసి అడిగితే అనుకుంది ఇందిర. మళ్లీ అహం అడ్డు వచ్చింది. సుందరానికి పరిస్థితి అర్థం అయింది.వెంటనే తల్లికి ఫోన్ చేసాడు. తల్లి వేయించిన పల్లీలు ఎక్కడ ఉన్నాయో చెప్పింది. ఆవిడ చెప్పినట్లుగా అక్కడే ఉన్నాయి. పకోడీలు మొదలు పెట్టింది. అంతా గొట్టం గాడు చెప్పినట్లు( ఇప్పుడు అందరివీ యూ ట్యూబ్ వంటలేగా ) చేసాక ,నూనె కనపడలేదు. మళ్లీ ఫోన్ చేసాడు సుందరం. శాంతమ్మ గారు నూనె పేకెట్ ఎక్కడ ఉందో చెప్పారు. నూనె కాగిందో లేదో అని చెయ్యి పెట్టింది. చెయ్యి కాలి బొబ్బ ఎక్కింది. కానీ లెక్క చేయకుండా పకోడీలు వేసింది. కొన్ని వేగలేదు.కొన్ని మాడాయి. అయినా నోరు మెదపకుండా తిన్నాడు సుందరం. ఇందిర తినలేక పోయింది. అత్తగారు నెల రోజులు అక్కడే ఉంటే బావుండును అనుకున్న ఇందిర అత్తగారి రాకకై ఎదురు చూడాల్సిందే అనుకుంది. మరో రెండు రోజులు గడిచాయి. ఇందిరకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడిచినట్లు ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. చూస్తే బిగ్ బాస్కెట్ లో సరుకులు వచ్చాయి. ఇద్దరూ బుక్ చెయ్యలేదు. అవి ఎవరివో అనుకున్నారు.

" శాంతమ్మ గారు ఎవరండీ"అంటూ అడిగాడు ఆ అబ్బాయ్.

"మా అత్తగారు'అంది ఇందిర.

సరుకులు అప్పజెప్పి వెళ్ళిపోయాడు అతను.సరుకులు తీసుకొని లోపల పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అనుకొంది. ఇప్పటికే అలసిపోతోంది. పొద్దున్నే లేవాలి. కాఫీ దగ్గర నుండి పెట్టుకోవడం, పనమ్మాయి కడిగి వెళ్తే సామానులు సర్దుకోవడం, స్టవ్ తుడుచుకోవడం, ఉతికిన బట్టలు మడత పెట్టి సర్దుకోవడం,కూరలు తెచ్చుకోవడం, వాటిని ఫ్రిడ్జ్ లో సర్దుకోవడం, అయిపోయిన సరుకులు చూసి తెచ్చుకోవడం, టిఫిన్ కోసం పప్పు పోసి రుబ్బుకోవడం, రోజూ డికాషన్ వేసుకోవడం తలచుకుంటే గుండెల్లో దడ పుట్టింది ఇందిరకు. ఇందులో ఒక్క పని కూడా తను చెయ్యలేదు. అన్నీ అత్తగారు చేస్తుంటే తెలియలేదు. ఇంట్లో ఇంత పని ఉందా... అత్తగారు ఇంట్లో లేకపోతే మొగుడి తో హాయిగా ఉండవచ్చు అనుకుంది. ఇప్పుడు అర్ధం అయింది. కనువిప్పు కలిగింది. అత్తగారి విలువ తెలిసింది. ఇంట్లో అమ్మ చేస్తుంటే తెలియలేదు. ఇప్పుడు అత్తగారు చేస్తుంటే తెలియలేదు. తాము కష్టపడి పోతున్నాం అనుకుంది ఇందిర. సాయంత్రం అత్తగారి దగ్గరకు బయలుదేరారు దంపతులు.( ఎందరో ఇందిరలకు అంకితం)


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి


రచయిత్రి పరిచయం

నా పేరు పద్మావతి విష్ణువజ్జుల. MA హిస్టీరి,MA తెలుగు.30 ఏళ్ళు టీచర్ గా పనిచేశాను.రేడియో లో స్త్రీల కార్యక్రమంలో పాల్గొన్నాను.కధలు రాయడం సరదా.FB లో సుమారు 100 కధలు రాసాను


127 views0 comments
bottom of page