కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Veeri Madhyana Episode 4' New Telugu Web Series
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' నాలుగవ భాగం
గత ఎపిసోడ్ లో…
తనను ప్రేమించమంటుంది జ్వాల.
సామ్రాట్ అందుకు అంగీకరించడు.
త్వరలో అతని ఎదుటికి వస్తానని చెబుతుంది జ్వాల.
ఇక వీరి మధ్యన.. నాలుగవ భాగం చదవండి...
సామ్రాట్ మెల్లిగా, "ఎందుకు." అన్నాడు.
"మన మధ్య ఇట్టి చిలిపితనం ఉంటే, భలే మజా కదూ." అంది సాహసి ముచ్చటగా.
"థాంక్స్. నువ్వు నా మాటలకి హర్ట్ అయ్యావనుకున్నాను." చెప్పాడు సామ్రాట్.
"అయ్యో మహానుభావా. నన్ను మరీ గయ్యాళి అనుకుంటున్నావా, ఏంటీ." అంది సాహసి.
"అబ్బెబ్బే. అలా అనుకోకు. జస్ట్ నెర్వ్స్ అయ్యా. అంతే." చెప్పాడు సామ్రాట్.
"చాల్లే. నువ్వు మరిన్నూ." అంది సాహసి మురిపెంగా.
"సాహసి." అన్నాడు సామ్రాట్.
"మరోలా పిలు." చెప్పింది సాహసి చిలిపిగా. సామ్రాట్ వెంటనే ఏమీ అనలేదు.
"మహానుభావా. నన్ను సాహసి కాక, మరోలా పిలు అంటున్నాను." చెప్పింది సాహసి.
"ఉ. ఊ. ఎలా. అ. సాహ." అన్నాడు సామ్రాట్.
"ఉహు. ఇంకా.. వేరేలా." అంది సాహసి.
"హసి." అనేశాడు సామ్రాట్.
"బాగుంది. బాగుంది కదూ. నువ్వు ఏమంటావు." అంది సాహసి హుషారుగా.
"నీకు నచ్చిందా." అడిగాడు సామ్రాట్.
"బాగా. ఇకపై నన్ను అలానే పిలుస్తుండు. ప్లీజ్." చెప్పింది సాహసి.
"తప్పక హసి." చెప్పాడు సామ్రాట్ ఉత్సాహంగా.
"థాంక్యూ వెరీ మచ్." అంది సాహసి నిండుగా.
"మరి నన్ను నువ్వేలా పిలుస్తావు." అప్పుడే అడిగేశాడు సామ్రాట్.
"చెప్పనా. ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను." చెప్పింది సాహసి.
"చెప్పవా." అడిగాడు సామ్రాట్ కుతూహలంగా.
"చెప్పేయనా." అంది సాహసి ఊరిస్తున్నట్టు.
"చెప్పవా." అన్నాడు సామ్రాట్ మెలికలు తిరిగి పోతూ.
"ఇప్పుడు కాదు." టక్కున అంది సాహసి.
"అబ్బా." అన్నాడు సామ్రాట్ నీరు కారిపోయేట్టు.
"చెప్తాలే." అంది సాహసి.
"ఎప్పుడు." అడిగాడు సామ్రాట్.
"ఉ. అట్టి సమయం రానీ." చెప్పింది సాహసి చిలిపిగా.
"ఛీటింగ్. నువ్వు నాతో చెప్పించుకున్నావు." అన్నాడు సామ్రాట్ ఉడికిపోతూ.
"నువ్వు నన్ను పేరుతో తొలుత పిలిచింది ఇప్పుడేగా. అందుకే నేను కోరి మార్పించుకోగలిగాను." చెప్పింది సాహసి.
ఫోన్ ని రెండో చెవి వైపుకు మార్చుకొని, "అబ్బా. నువ్వు మరిన్నూ." అనేశాడు సామ్రాట్.
అటు సాహసి గట్టిగా నవ్వుతుంది. అది సామ్రాట్ కి వినిపిస్తుంది.
"నవ్వు ఆపి, నన్ను ఏ పేరుతో పిలవాలనుకుంటున్నావో చెప్పేయవా. ప్లీజ్." అంటున్నాడు సామ్రాట్.
"ముందు కాల్ కట్ చేసేయవా. అమ్మ డిన్నర్ కి పిలుస్తుంది. ప్లీజ్." అంది సాహసి.
"అంతేనా." అన్నాడు సామ్రాట్ నీర్సంగా.
"అంతే. గుడ్నైట్." అనేసింది సాహసి.
"గుడ్నైట్." చెప్పేశాడు సామ్రాట్. వాళ్ల ఫోన్ సంభాషణ కట్ ఐంది.
***
సామ్రాట్ డిన్నర్ చేస్తున్నాడు, తల్లిదండ్రులతో.
"కర్రీ బాగుందమ్మా." అన్నాడు సామ్రాట్.
"మీ అమ్మ మరీ మరీ చెప్పింది. పైగా నీకు ఇష్టమాయే. అందుకే రైతు బజారు అంతా గాలించి మరీ తెచ్చా." చెప్పాడు గోపాలస్వామి.
"థాంక్స్ అమ్మా." అన్నాడు సామ్రాట్ తల్లిని చూస్తూ.
"చాల్లేరా. అమ్మకు థాంక్స్ ఏంట్రా." అంది మాలతి ముసిముసిగా నవ్వేస్తూ. ఆ వెంబడే, సామ్రాట్ ప్లేట్ లో ఆ కూరను మరింత వడ్డించింది.
తల్లీ కొడుకులను చూసి మురిసిపోయాడు గోపాలస్వామి.
"మీతో ఒకటి చెప్పాలి." అన్నాడు సామ్రాట్ సడన్ గా.
తల్లిదండ్రులిద్దరూ ఒకే మారు తలలెత్తి కొడుకును చూశారు.
సామ్రాట్ వెంటనే ఏమీ మాట్లాడ లేదు.
"చెప్పు." అంది మాలతి.
"అదేనమ్మా. సాహసి ట్రాన్స్ఫర్ గురించి." ఆగాడు సామ్రాట్.
"తన రిక్వెస్ట్ తో హైదరాబాద్ కు తనని తన సూపిరీయర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారుగా." అన్నాడు గోపాలస్వామి.
"ఏం. అది కాలేదా." అడిగింది మాలతి.
"తనని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారు. పెళ్లి తర్వాత తను ఇక్కడికి వచ్చి జాబ్ లో జాయినవుతుంది." చెప్పాడు సామ్రాట్.
"మరేం." అన్నాడు గోపాలస్వామి.
"అదే. మరి. తనకి సికింద్రాబాద్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందట." చెప్పాడు సామ్రాట్.
"అయ్యో. సికింద్రాబాదా. మనకి చాలా దూరం కదరా." అంది మాలతి.
"అదేనమ్మా. అందుకే ఇప్పుడు మీతో ఆ విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను." చెప్పాడు సామ్రాట్ మెల్లిగా.
అతని తల్లిదండ్రులు ఆలకిస్తున్నారు.
"ఇక్కడ నుండి రోజూ తను వెళ్లి రావడం కుదరదు." చెప్పాడు సామ్రాట్.
"నిజమే. దూరాభారం. ప్రయాసే." అన్నాడు గోపాలస్వామి.
"మరెలా." అంది మాలతి.
"అందుకే ఆమె బ్యాంక్ పరిసరాల్లో చిన్న పోర్షన్ ఒకటి అద్దెకు తీసుకోవాలి అనుకుంటున్నాను." చెప్పాడు సామ్రాట్.
"అదేంట్రా. సొంత ఇల్లు ఉంచుకొని." నసిగింది మాలతి.
"ఐనా నీకు నీ ఆఫీస్ అక్కడి నుండి దూరం కదా." అన్నాడు గోపాలస్వామి.
"ఇప్పుడు నాకు ఇక్కడికి టెన్ కెయం దూరం వస్తుంది. మహా ఐతే అటు నుండి ఐతే, మరో పదిహేను పెరగొచ్చు." చెప్పాడు సామ్రాట్.
అతని తల్లిదండ్రులు ఏమీ అనలేదు.
"నేనైతే తిరిగేయగలను. ఎలానూ బైక్ ఉందిగా." చెప్పాడు సామ్రాట్.
"తనకి స్కూటీ వచ్చుగా. తను తిరగ లేదా." అన్నాడు గోపాలస్వామి.
"ఎలా నాన్న. ఇక్కడి ట్రాఫిక్ సంగతులు నీకు తెలుసు. తను టు అండ్ ప్రో మోర్ దేన్ థర్టీ కెయం తిరుగుతుండాలి. పైగా రోజున్నూ." అన్నాడు సామ్రాట్.
"తనకి కష్టమేలేరా." అనేసింది మాలతి.
"ఐతే తప్పదంటావు." అడిగాడు గోపాలస్వామి.
సామ్రాట్ ఏమీ అనలేదు.
"ఐనా తను ఉద్యోగం చేయాలా. మానేస్తే పోలే." అనేశాడు గోపాలస్వామి.
తలెత్తి తండ్రినే చూస్తూ, "తనకి ఇష్టం నాన్నా. జాబ్ చేయాలని తను గట్టిగా కోరుకుంటుంది నాన్నా." చెప్పాడు సామ్రాట్.
మాలతి అప్పుడే, "ఈ రోజుల్లో వీడి సంపాదన ఒక్కటే చాలదు లెండి. పైగా ఆమె రాకతో వీడికి మరి కొంత మంది జతవుతారు." అంది మాలతి.
గోపాలస్వామి మాట్లాడలేదు.
"బాగా ఆలోచించానమ్మా. మరోటి నాకు ఏమీ తట్టలేదు." చెప్పాడు సామ్రాట్.
"నాకూ పాలుపోవడం లేదు. సర్లే. అక్కడ ఇల్లు చూడు." చెప్పింది మాలతి. ఆ వెంబడే, భర్తను చూస్తూ, "ఏమంటారు." అంది.
గోపాలస్వామి, "నిజమేలే." అనేశాడు. ఆ వెంబడే, "మరి ఈ ఇల్లు అద్దెకు ఇద్దామా." అన్నాడు.
"అరె. అలా ఐతే, ఇది సొంతిల్లు. చెదారం అవుతుంది. మనం ఇక్కడే ఉందాం. పిల్లలు తిరుగుతారు లెండి." అంది మాలతి.
గోపాలస్వామి ఏమీ అనలేదు. భార్యనే చూస్తూ ఉన్నాడు.
సామ్రాట్ కూడా ఏమీ అనలేదు.
వాళ్ల డిన్నర్ కొనసాగుతుంది.
***
జలజ ఆలోచిస్తుంది.
"ఏమిటి మాట్లాడవు." అంది జ్వాల.
తెమిలి తేరుకుంది జలజ. జ్వాల కో ఎంప్లాయి జలజ. ఇద్దరూ వరంగల్ లో, ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో, నర్స్ లుగా జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ జలజ రూం లో ఉన్నారు. ఇద్దరికీ నైట్ డ్యూటీ కావడంతో, పగలు ఖాళీ ఐంది. జ్వాల కోరి లంచ్ తర్వాత తన ఇంటి నుండి జలజ అద్దెకుంటున్న రూంకి వచ్చింది. తన చెప్పాలనుకున్నదంతా చెప్పేసింది. ఆ మాటలు విన్న జలజ ఆలోచనల్లో పడింది. తిరిగి 'ఏమిటి మాట్లాడవు.' అన్న జ్వాల మాటలతో తేరుకుంది.
"నీ ప్రపోజల్ బాగా లేదు. తప్పు అనిపిస్తుంది." చెప్పేసింది జలజ.
"అరె. నువ్వు కానీ, నేను కానీ ఏం తప్పు చేయడం లేదు. ఒక మనిషి 'ఇగో' ని అణచి, నిజం చూపి, తన 'భ్రమ' ను తొలిగించబోతున్నాం. పాజిటీవ్ గా ఆలోచించు." చెప్పింది జ్వాల.
తలెత్తి జ్వాలను చూస్తుంది జలజ.
"చెప్పాగా, ఒకప్పటి నా క్లాస్మేట్ ఐన, ఆ సాహసి చాలా బడాయి మనిషి. ప్రెండ్షిప్ కు వేల్యూ ఇవ్వదు. తను నమ్మే తత్వాన్ని ఎదుట వారి మీద రుద్దే మనిషి. పైగా బోయ్స్ తనకు పడదని, మమ్మల్ని అటు పోతే పోతారని వాగే మనిషి. మాకు బోయ్ ఫ్రెండ్స్ ఉంటే, మమ్మల్ని 'కాని వాళ్ల'గా జమ కట్టే కుళ్లుబోతు. అంతే కాదు, నేను క్లాస్మేట్స్ ఐన బోయ్స్ తో మాట్లాడినా, తిరిగినా, నా గురించి నా పేరంట్స్ కి చెప్పి, తిట్టించే చెత్తది. ఛ. దానికి బుద్ధి చెప్పి తీరాలి. అవకాశం వచ్చింది. సహకరించు." ఇంచుమించుగా జలజకు ముందు చెప్పే మాటలనే, క్లుప్తంగా మళ్లీ చెప్పింది జ్వాల.
"ఇప్పుడు నాకు బల్బు వెలిగింది. ఇంతకీ నన్ను చేయమన్న ఆ పనిని నువ్వే చేయవచ్చుగా. అదే, 'అతనికి ఫోన్ చేసింది' నువ్వు, అతనిని 'ప్రేమించమంది' నువ్వు, కలిస్తేనే 'నేను ఎవరో తెలుస్తుంది' అన్నది నువ్వు. అంతా నువ్వు చేసి, చివరికి 'ఆ ఫోన్ చేసింది నేను' అంటూ చెప్పమని, నన్ను అతని ముందుకు తోస్తుంది ఎందుకు." అడిగింది జలజ అప్పుడే గుర్తుకు వచ్చినట్టు.
"అదీ అలా అడిగావు బాగుంది. నేనైతే ఈ ఊర్లో లేదా దీనికి చుట్టు పక్కల ఉండి పోవలసిన దానిని. అంతకు మించి, ఆ సాహసి, నేను ఒకే వీథి వాళ్లం. దానికి మా పేరంట్స్ తో పరిచయం జాస్తీగా ఉంది. అందుకే, నువ్వు వారం రోజుల్లో కొత్త జాబ్ అవకాశం కుదరడంతో, చాలా దూర ప్రాంతానికి వెళ్లి పోబోతున్న దానివి. సో, ఏ గొడవలు ఉండవు. రావు. నువ్వు వెళ్తూ చేసిన ఈ సాయంతో, ఆ సాహసి తిమిరి కట్టించగలను. సో హేఫీ అవుతా. నువ్వు జాలీగా ఇక్కడ నుండి తుర్రుమనిపోవచ్చు. ప్లీజ్ ఒప్పుకో." అంది జ్వాల చకచకా.
జలజ మాట్లాడ లేదు. తను అయోమయంలో ఉంది.
"నీకు నేను ఎన్నెన్ని మార్లు హెల్ఫ్ చేయలేదు. దేనికీ నేను అడ్డు చెప్పానా. పైగా దేనికైనా ఏమైనా ఆశించానా. ఇప్పుడు నాకు అవసరమైంది కనుక, పైగా నువ్వు చక్కా ఈ వ్యవహారం నుండి చాలా దూరం పోయే అవకాశం ఉంది కనుక, నేను నిన్నే కోరుకుంటున్నాను." చెప్పింది జ్వాల.
తికమకలోనే, "నాకు ఏమీ కాదుగా. అలాగైతేనే నేను నీ మాట వినగలను." అనేసింది జలజ.
"అయ్యో. నిన్ను ఇరకాట పరుస్తానా. నీకు ఏమీ కాదు. నేను ఈ వస్తున్న ఆదివారం ఆ సామ్రాట్ ని రమ్మంటాను. అదీ మన ఊరు వెయ్యి స్తంభాల గుడి వద్దకు. వాడు వస్తాడు. నువ్వు వాడి నిజ రూపం బయట పెడతావు. నేను అప్పటికే ఆ సాహసిని తీసుకొని అక్కడికి వస్తాను. మేము మీకు కనిపించకుంటా దూరంగా ఉంటాం. అక్కడి నుండే ఆ సాహసికి ఆ సామ్రాట్ భాగోతం చూపుతాను. అంతే." చెప్పింది జ్వాల. జలజ ఏమీ అనలేదు.
"నువ్వు చేయవలసింది, నా ఫోన్ ఇస్తాను. అతడు వెయ్యి స్తంభాల గుడి వద్దకు రాగానే, నీకు ఫోన్ చేసేలా చేస్తాను. నువ్వు ఆ కాల్ రాగానే, ఫోన్ ఎత్తి, ఎక్కడ ఉన్నావో చెప్పు చాలు. అతడే నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నువ్వు అతడితో కాస్తా చొరవగా మాట్లాడు చాలు, ఆ సాహసి కింది మంట పట్టేయడానికి. లేకపోతే, తన ఉడ్బి పరమ పవిత్రుడట." అంది జ్వాల రోషంగా.
"ఫోన్ అంటున్నావ్. మరి ట్రేసింగ్ లో ఆ ఫోన్ నెంబర్ నీదని బయట పడే ఛాన్స్ ఉంటుందిగా." అడిగింది జలజ జంకుగా.
"చాల్లే. ఇంత చేస్తున్న దానిని, ఆ మాత్రం జాగ్రత్త పడనా. అందుకే ఆ సామ్రాట్ కి ఫోన్ చేసే ప్రతి మారు సిమ్ ని మారుస్తున్నానుగా. నీకు ఇచ్చేటప్పుడు కూడా నా ఫోన్ లో కొత్త సిమ్ వేసే ఇస్తాను. తర్వాత అన్నింటిలాగానే దానిని ముక్కలు చేసేస్తాను. దేనికీ నువ్వు భయపడకు. అనుమానం పెట్టుకోకు. నీకు ఏమీ కానివ్వనుగా. పైగా ఏమీ కాదు. ఈ పని చేసేసి నువ్వు చక్కా ఇక్కడ నుండి తప్పుకు పోవచ్చు. పైగా నువ్వు వెళ్ల బోయేది కూడా సోమవారం నాడేగా. సో నీకు నో ప్రొబ్లం." చెప్పింది జ్వాల చాలా పట్టుగా.
"మరో మాట. నీ పర్సనల్, అంటే, నీ వివరాలు, కనీసం నీ పేరు కూడా అతడి వద్ద బయట పెట్టకు. చాలు. అంతే." మరింత వత్తాసుగా చెప్పింది జ్వాల.
చివరాఖరికి జ్వాల తలూపేసింది. లేదు లేదు. అలా మల్చుకోగలిగింది జ్వాల.
***
సాహసి ఇంటి హాలులో - డైలీ పేపర్ చూస్తున్నాడు మోహనరావు.
సాహసి బాత్రూం నుండి వచ్చి, తండ్రి ఎదురుగా సోఫా కుర్చీలో కూర్చుంది.
శైలజ కాఫీ కప్పుల ట్రేతో అక్కడికి వచ్చింది.
భర్త, కూతురు, చెరో కాఫీ కప్పులు తీసుకున్నాక, టీపాయ్ మీద ట్రే పెట్టి, తన కాఫీ కప్పుతో వాళ్లకి దరిన మరో సోఫా కుర్చీలో కూర్చుంది శైలజ. ముగ్గురూ కాఫీ చప్పరిస్తూ ముచ్చటించుకుంటున్నారు.
"అన్నట్టు రాత్రి సామ్రాట్ ఫోన్ చేసి చెప్పాడు." అంది సాహసి అప్పుడే.
"ఏంటటా." అంది శైలజ.
"అదే. నాకు వీలుగా ఉంటుందని, తను మా ఇద్దరికై, నా బ్యాంక్ కి దగ్గరగా, ఓ డబుల్ రూం ప్లాట్ తీసుకున్నాడట." చెప్పింది సాహసి.
"అవునా. అబ్బాయ్ పొందికైన వాడే." అంది శైలజ చిన్నగా నవ్వుతూ.
"అబ్బాయ్ పొదుపైన వాడు కూడా కాదు." అన్నాడు మోహనరావు టక్కున.
"అదేమిటండీ." అంది శైలజ.
"మరి. వేరే ఇల్లంటే మాటలా. ఎన్నెన్ని ఖర్చులు." చెప్పాడు మోహనరావు.
"సుఖం ఇవ్వని పొదుపు ఏంటండీ." అనేసింది శైలజ.
"అక్కడ వాళ్లకి సొంతిల్లు ఉంది. దాంట్లో ఉండి తిరిగేస్తే సరేపోయే దానికి, వేరే ఇల్లు ఎందుకే." అన్నాడు మోహనరావు.
"మీరు మరిన్నూ. మన అమ్మాయి అంతంత దూరం రోజు ఏం తిరగ్గలదు." అంది శైలజ.
"మరి వాళ్ల అబ్బాయ్ తిరగాలిగా. అదీ ఆలోచించు." అన్నాడు మోహనరావు.
"మగాడు. తిరిగేయగలడు." అనేసింది శైలజ.
"నీదే తల్లి మనసు. అబ్బాయి తల్లిది కాదా. ఆ." అన్నాడు మోహనరావు.
"ఆ సొంతిల్లు ఎవరైనా ఎత్తుకు పోతారా. నిజానికి దానిని అద్దెకి ఇచ్చేసి, అంతా ఆ కొత్త ఇంటిన ఉండే అవకాశం ఉందిగా. అలా ఐతే, మీరన్న ఆ ఖర్చులు ఉండవుగా." అంది శైలజ.
"ఈ విషయం కూడా సామ్రాట్ చెప్పాడు. పెద్ద వాళ్లకి తమ ఇల్లు అద్దెకి ఇచ్చే ఇష్టం లేదట. పాడు అవుతుందేమోనని వాళ్లు అక్కడే ఉంటారట. మమ్మల్ని వేరేగా ఉండే దానికి వాళ్లకు సమ్మతమేనట. నేను రోజూ తిరగలేనంటూ, సామ్రాట్ నే శ్రమ తీసుకోమన్నారట." చెప్పింది సాహసి.
***
(కొనసాగుతుంది..)
***
వీరి మధ్యన... ఎపిసోడ్ 5 త్వరలో
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
Коментарі