top of page

వివాహ అభోజనంబు


'Vivaha Abhojanambu' New Telugu Story

వివాహ అభోజనంబు తెలుగు కథ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా నడచినట్లు, రోజూ ఆఫీస్ నుంచి రాగానే గుమ్మం పక్కనుండే, సాధారణంగా ఖాళీగా ఉండే లెటర్ బాక్స్ లో ఒకసారి చెయ్యి పెట్టడం అలవాటు.


ఇప్పుడంటే అన్నీ డిజిటల్ ఫార్మ్ లో వస్తున్నాయికానీ, ఒకప్పుడు అంతా ఉత్తరాలదే హవా. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు టెలిగ్రామ్ వస్తే ఇంటిల్లిపాదీ ఎలా భయపడేవారో ఇప్పుడు ఏదైనా ఉత్తరం వస్తే అదేదో లీగల్ నోటీసు అయివుంటుందని భయపడుతున్నారు. అయినా నా అలవాటు మాత్రం మానను.


యధాలాపంగా బాక్స్ లో చెయ్యి పెట్టిన నాకు, చేతికి ఏదో కవర్ తగలడం, మనసులో 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' పాట ప్లే అవడం ఒకేసారి జరిగింది. కవర్ బయటకు తీసిన చేతికి అంటిన పసుపు, 'అన్నీ మంచి శకునములే' పాట వినిపించింది. నిజంగానే మంచివార్త.., చుట్టరికంకన్నా ఎక్కువ స్నేహమున్న నా చిన్ననాటి స్నేహితుని కూతురి పెళ్లి అని శుభలేఖ తెచ్చింది. దానితోపాటు, అదే కవర్ లో పెట్టిన నా స్నేహితుని అభ్యర్ధనలాంటి ఆదేశంతో కూడిన ఉత్తరంకూడా వచ్చింది.


"ఒరే! ఇన్నాళ్లు అక్కడెక్కడో ఈశాన్య రాష్ట్రం, సరైన రవాణా సదుపాయాలు లేవు, పిల్లల చదువులు, అన్ని రోజులు సెలవులు దొరకవు లాంటి కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నావు. నువ్వు దయతలచి ఊరొచ్చినప్పుడే ఉగాది నుంచి శివరాత్రి వరకు అన్ని పండగలు ఒక్కసారే జరిపించుకున్నావు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. రకరకాల రవాణా సదుపాయాలు కూడా వచ్చాయి. కాబట్టి, కాకమ్మ కథలు చెప్పావంటే కూష్మాండం బద్దలైపోతుంది." అని దాని సారాంశం.


కుంటిసాకులు, కాకమ్మ కథలు కాకపోయినా పొట్టచేత్తో పట్టుకుని ప్రవాసాంధ్రులై ప్రయాసలు పడే వాళ్లకు నిజాలు, ఊర్లల్లో ఉండే వారి బంధువులకు, స్నేహితులకు అబద్ధాలు లాంటి విషయాలే అవి. వాటితోపాటు, వాడు రాసిన చివరి విషయాలు అంటే పిల్లలు పెద్దవాళ్లవడం, రవాణా సదుపాయాలు పెరగడం కూడా నిజాలే. అదీకాక, మేముండే ప్రాంతాలలో పెళ్లిళ్లు, ఫంక్షన్ లు ఏవి జరిగిన కూడా, వాళ్ళే టైం కి పిలిచినా, లంచ్ టైం లో వెళ్లి ఒక ఫోటో దిగి, ఇంత తిని రావడం రొటీనైపోయి, ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికింది, ఊర్లో ఏవైనా శుభకార్యాలు ఉంటే వెళ్లిరావచ్చని చకోరపక్షిలా ఎదురుచూస్తున్న నాకు చంద్రకిరణంలా కనిపించిందీ శుభలేఖ.


పిల్లలకు ఇబ్బందవుతుందన్న భార్యకు పిల్లలను, పిల్లలకు భార్యను తోడుగా ఉంచి, చేతికందిన బట్టలను బాగ్ లో ముంచి, 'నా జన్మభూమి ఎంత అందమైన దేశము' అని పాడుకుంటూ, ఊరిమీద పడ్డాను. మేఘాలను చీల్చుకుంటూ ముందుకెళ్తున్న విమానంలో కూర్చున్న నా ఆలోచనలు గతాన్ని చీల్చుకుంటూ వెనక్కి వెళ్లాయి.


మా చిన్నతనంలో వీధిలో ఏ ఒక్కరింట్లో శుభకార్యమైనా అందరి ఇంట్లోనూ అవుతున్నట్లే హడావుడి ఉండేది. పెళ్ళివాళ్ళకి విడిది ఫలానా ఇంట్లో, వంటలు వీళ్ళ పెరట్లో, భోజనాలు వాళ్ళ డాబామీద అలా ఎవరిని అడగకుండానే నిర్ణయించేసేవారు. ఆ ఇంటివాళ్ళు కూడా అదేదో తమ బాధ్యత అన్నట్టుగా జరిపించేవారు.


వీధిలో ఎవరింట్లో శుభకార్యమైనా వంటలు వండే తాత తనకు కబురెట్టకుండానే వచ్చేసి, సరుకులు, కూరగాయలు, సామాన్ల లిస్ట్ ఇచ్చేసేవాడు. తననే పిలుస్తారనే నమ్మకం అతనిది. నాకు తెలిసి అతనిని ఎవరూ పేరు పెట్టి పిలవడం నేను చూడలేదు. ఆ మాటకొస్తే, ఎవరు ఎవరినీ పేరు పెట్టి పిలిచేవారుకాదు. అంతా తాత, మామ, బాబాయి అంటూ వరుసలతో పిలవడమే కదా! మాలాంటి పిల్లలకైతే వాళ్ళు తాత, బాబాయి తాత, చందమామ తాత అలాగే పరిచయం.


ఎటువంటి కార్యక్రమం అయినా భోజనాల టైం అయిందనగానే అందరూ వెతికే వ్యక్తులు వంట తాత, బాబాయి తాత మరియు బాలు మామ. భోజనాల మానేజ్మెంట్ వీళ్ళకి తెలిసినట్టు ఆకాలంలో మావాళ్ళెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అవి కింద కూర్చుని చేసే పంక్తి భోజనాలైనా, టేబుల్ భోజనాలైనా వీళ్లు లేనిదే ఇంటివారికి కాలూచెయ్యి ఆడేవి కావు.

ఒక వరసకి ఎన్ని విస్తర్లు వెయ్యాలో అన్న దగ్గరనుండి, ఎవరెక్కడ కూర్చోవాలో బాలుమామ చెప్తే, శుభకార్యం చేస్తున్న గృహస్థులకన్నా ఆప్యాయంగా, 'వచ్చేవురా నాన్నా! అన్నీ పెట్టించుకుని మెల్లిగా తిను.' అని చెప్పి భోజనసంగ్రామానికి కావలసిన ధైర్యాన్ని నింపేవాడు బాబాయి తాత. ఈ రోజు బూరెలు బాగా వచ్చాయి. నెయ్యి పోసుకుని తినండి అని టిప్స్ చెబుతూనే, కొబ్బరి పచ్చడిలో ఒక ప్రయోగం చేశాను, ఏమిటో చెప్పుకోండి అని క్విజ్ పెట్టేవాడు వంట తాత.


వీళ్లతోపాటుగా 'ఏమే కోడలుపిల్లా! ఇంత తక్కువ తింటే మా ఇంట్లో పనులకి ఎలా సరిపోతుంది. గట్టిగా తినాలి. లేకపోతే, భవిష్యత్తులో ఇబ్బంది పడతావు.' అనే వరసైన అత్తలకి, ' మీ ఇంటికొచ్చినప్పుడు చూద్దాంలే' అని సమాధానం చెప్పే గడసరి కోడళ్ళు, 'బావగారూ ఏడిసారు' అని చారు వడ్డిస్తూ సరసాలాడే బావమరుదులు, 'పిల్లల్లారా! పప్పు అన్నంలో గొయ్యి చేసి, పులుసు పోసుకు తింటే బావుంటుంది అని తినే పధ్ధతి నేర్పించే పెద్దలు, మధ్యమధ్యలో 'భోజనకాలే హరినామస్మరణ' అని పద్యాలు పాడే గురువుగార్లు ఇలా వంటకాలకన్నా వడ్డించే పద్ధతితోనే కడుపునిండిపోయే భోజనాలు గుర్తొచ్చాయి.


పప్పు, పులుసు, చారు, వంకాయ బంగాళాదుంపల కూర, గుత్తివంకాయ, బెండకాయ వేపుడు, అప్పడాలు, రకరకాల వడియాలు, బూరెలు, బొబ్బట్లు, పాయసం, గారెలు ఇలా మెనూ అంతా మూసుకున్న కళ్ళముందు కదలాడుతూ ఉండగా, 'ఫ్లైట్ ఈస్ రెడీ ఫర్ లాండింగ్' అని వినబడి అలర్ట్ అయ్యాను.


ఎయిర్ బస్సు నుండి బయటపడి, ఎర్ర బస్సెక్కి 'పరుగులు తీయాలి టైర్లు ఉరకలు వెయ్యాలి, బిరబిర జరజర ఊరు చేరాలి' అనుకుంటూ దగ్గరలోనే ఉన్న ఊరు చేరాను. ఊర్లో ఉన్న తమ్ముడి ఇంటికి చేరి, రిలాక్స్ అయి, తమ్ముడు, మరదలు ప్రశ్నలకి సమాధానాలు చెపుతున్నా గానీ, మనసంతా వెళ్లబోయే పెళ్లిమీద, ముఖ్యంగా తినబోయే భోజనం మీద ఉంది. రాత్రంతా 'శ్రీ సూర్యనారాయణా మేలుకో' అని పాడుకుంటూ గడిపి, ఉదయాన్నే తయారయి పెళ్ళికి బయలుదేరాను.

గదిలోనుంచి బయటికొచ్చి చూసేసరికి, తమ్ముడు భోజనం చేస్తూ కనిపించాడు. "అదేంట్రా, పెళ్ళికి వెళ్తూ భోజనం చెయ్యడం?" అన్న ప్రశ్నకి, "సకుటుంబ సపరివార స'మేతం'గా రమ్మని పిలుస్తారు కదా అందుకే మేత ఇక్కడే కానిచ్చి, సకుటుంబ సపరివారంగా మాత్రమే వెళ్తాము." అని సమాధానం చెప్పాడు తమ్ముడు. అదేంట్రా మన పెళ్లిళ్లు అంటే.. అని మొదలుపెట్టి, నేను ప్రయాణంలో గుర్తుకుతెచ్చుకున్న విషయాలన్నీ చెప్పాను.


అవన్నీ వింటున్న మా మరదలు, 'ఆడ్ని అలా వదిలీకండ్రా! ఎవరికన్నా చూపించండ్రా!' అనే డైలాగ్ చెప్తున్నప్పటి రావు రమేష్ లా ముఖం పెట్టింది. వివాహభోజనంపు మత్తులో ఉన్న నేను అది పట్టించుకోలేదు. పెళ్లి వేదికకు ప్రయాణమై వెళ్ళాము. పాత మిత్రుల, బంధువుల మరుకలయిక, కొత్తవారి పరిచయంతో సమయం తెలియలేదు.


చూస్తుండగానే ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న భోజనాల సమయం ఆసన్నమైంది. 'భోజనం చేసి వెళ్ళండి' అన్న మా స్నేహితుడి మాటలకి అవును, కాదుల మధ్య అడ్డదిడ్డంగా తల ఊపారు మా తమ్ముడు, మరదలు. బయటికొచ్చిన తర్వాత ఎందుకలా ఊపారని అడిగిన నాకు, "మన చిన్నప్పుడు స్కూల్ మాస్టారు శ్రీ బలివాడ మాస్టారు అనే 'నువ్వు పెట్టినావు, నేను తినేసినాను' అనే గురువాక్యం ఇప్పటి పెళ్లిళ్లలో చాలా అవసరం. లేదంటే, చాలా ఇబ్బందులు పడవలసివస్తుంది. ఇంత చెప్పినా విననంటే, నువ్వు భోజనం చేసిరా! మేము ఇంటికి వెళ్తాము." అని చెప్పి బయలుదేరారు.


కోటి ఆశలతో పెళ్లిపందిరిలో అడుగుపెడుతున్న పెళ్లికూతురికంటే ఎక్కువ ఆశగా భోజనశాలలో అడుగుపెట్టాను. ఒక క్షణంపాటు నేను పెళ్ళిభోజనాలకొచ్చానో, ఏదైనా ఎగ్జిబిషన్ లోని ఫుడ్ కోర్ట్ లో అడుగుపెట్టానో అర్ధం కాలేదు. భోజన ప్రదర్శన లాగా ఉందా గది. గదిమధ్యలో రకరకాల పళ్ళు, కూరగాయలతో చేసిన కళాకృతులు ఉన్నాయి. వడ్డించడానికి సిద్ధంగాఉన్న విస్తర్లుగానీ, రండి కూర్చోండని ఆహ్వానిస్తున్న టేబుల్స్ గానీ కనపడలేదు.


దానికి బదులుగా, తిరణాలలో కొట్లు పెట్టినట్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్ నిలిపారు. 'దిస్ వే' అని 'దారిచూపే దేవతలు' ముగ్గురు, నలుగురు నించున్నారు. పెళ్లికొచ్చిన అతిథులందరూ చాలాకాలంనుండి అన్నంలేక గదిలో బంధించి అప్పుడే విడిచిపెట్టిన ఖైదీల్లాగా ఆ స్టాల్ లమీద పడుతున్నారు.


'వేగంగా ప్లేట్ లు తీసుకు లైన్ లో నిలబడకపోతే ఏ ఐటమ్స్ దొరకవు. మొన్న వెళ్లిన పెళ్లిలోకూడా అయిదు నిముషాలు లేట్ అయినందుకు పానీపూరి, చాట్ లు అయిపోయాయి. ఇంతా చదివింపులు చదివించి, అన్ని పదార్ధాలు తినకపోతే ఎంత తలవంపులు. గుర్తు పెట్టుకోండి.' ఒక యజమాని తన కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాడు.


మొదట అంతా పరిశీలిద్దామని చూడడం మొదలుపెట్టాను. పానీపూరి, చాట్, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్లు, వాటి తర్వాత దోసెలు, పూరీలు, రుమాలీ రోటీలు, మొదలైన వాటి కౌంటర్లు, వెజిటల్ సలాడ్లు, ఫ్రూట్ సలాడ్లు, వాటి తర్వాత నిజమైన భోజన కౌంటర్లు మొదలవుతున్నాయి. ఆ కౌంటర్లలో కూడా నేనాశించే పప్పు, పులుసు, చారుల బదులుగా ఫ్రైడ్ రైస్, రైతా, పలావ్, కుర్మా లాంటివి కనిపించాయి.


ఇంకా పరిశీలించేలోపల ఒకాయన వచ్చి, "మీరు ఇలా చూస్తూ ఉంటే, చూస్తూ ఉండడమే. తినడానికి ఏమీ దొరకవు. మొదలుపెట్టండి." అని ఉచితసలహా ఇచ్చాడు. అతని మాటలతో నేను కూడా ఒక ప్లేట్ తీసుకుని కొట్టు, కొట్టుకి తిరగడం మొదలుపెట్టాను. ఈలోగా మొత్తం హాలు నిండిపోయి కదలడానికి కూడా జాగా లేకుండా అయింది. ప్రతి కొట్టు దగ్గర ఇసుకవేస్తే రాలనంత జనం.


జనాలు 'మంచితరుణం మించిన దొరకదు' అన్నట్లు ప్రతీ స్టాల్ లోనుంచి పదార్ధాలు ప్లేట్ లో పెట్టించుకుని, పూర్ణ గర్భలైన పళ్ళాలను ఒంటిచేత్తో పట్టుకుని గర్భస్రావం కాకుండా జాగ్రత్తపడుతూ, పద్మవ్యూహంలోనుంచి బయటకొస్తున్న అభిమన్యుడిలా తమ పదార్ధాలు పడిపోకుండా, ఇతరుల పదార్ధాలు తమకు తగలకుండా, కుదురుగా నిల్చుని తినే సురక్షితస్థానం కోసం వెతుకులాడుతున్నారు.


నేను కూడా నాకు చేతనైనంత మేరకు పళ్లెం నింపుకుని, బయటపడదామని ప్రయత్నించాను. కానీ, అనుభవరాహిత్యం వల్ల సరిగా రాలేకపోయాను. సహభోక్తల తిట్లు, సణుగుళ్లు మధ్య గదిలో ఒక మూలకొచ్చి చూసుకునేసరికి నా పళ్లెం సగం ఖాళీ అయింది. నా ప్లేట్ లోనుంచి కిందపడిన పదార్ధాలు నా బట్టలమీద, జోళ్ళకింద కనపడసాగాయి. వాటితోపాటు తతిమ్మా వాళ్ళ పళ్లాలనుంచి బయటపడి, నాపై ప్రేమతో నామీద చేరుకున్న ఎంగిలి పదార్ధాలు జతకలిసాయి.


ఇంత గందరగోళం జరుగుతున్నా వీటిమధ్య జననిబిడమైన బస్సులో నేర్పుగా టిక్కెట్లు కొట్టే కండక్టర్లా, వీడియోగ్రాఫర్ తన పని తాను చేసుకుపోతున్నాడు. అతను క్లోజ్ షాట్ తీస్తున్నాడని తెలియగానే అప్పటివరకు ఆబగా తింటున్నవారు కూడా, హై-ఫై తిండి తినడం మొదలెడుతుండడం చూసిన నాకు ఈ జనాలను కంట్రోల్ చెయ్యాలంటే గదినిండా కెమెరాలు పెట్టాలనే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఈలోగా ఆ వీడియోగ్రాఫర్ నా అవస్థ మొత్తం తన కెమెరాలో బంధించాడు.


అప్పటివరకు జరిగిన భాగోతానికి శోషొచ్చిన నేను ప్లేటక్కడ పడేసి, నీళ్లు తాగుదామని చూస్తే, కనుచూపుమేరలో నీళ్లు కనబడలేదు. అటుగా పోతున్న ఒక దారి చూపే దేవతను, నీళ్లెక్కడున్నాయని అడిగాను. ఆమె గూగులమ్మ అమ్మలాగా, గొంతు సవరించుకుని, "అంకుల్ మీరు ఇప్పుడు భోజనశాల ముఖద్వారం నుంచి మూడడుగుల దూరంలో ఉన్నారు. ఇక్కడనుండి ఎడమవైపు నాలుగడుగులు వేస్తే చాట్ కౌంటర్ వస్తుంది. అక్కడినుండి కుడివైపు తిరిగి తిన్నగా వెళ్తే, రోటీ, నాన్ ల కౌంటర్ తగులుతుంది. అక్కడినుండి యూ-టర్న్ తీసుకుని ఎడమవైపు పదడుగులు వెయ్యగానే బిర్యానీ పాయింట్ ఉంటుంది. అక్కడినుండి కుడివైపు తిరిగి తిన్నగా వెళ్తే ఒక చిన్న పిల్లాడు సరదాగా సు సు పోస్తున్నట్లున్న నీళ్ల ఫౌంటెన్ వస్తుంది." ఆమె ప్రవాహాన్ని అపి, "ఆ నీళ్లు తాగాలా తల్లీ?" అని అడిగాను.


దానికామె కిసుక్కున నవ్వి, "మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంకుల్. దాని దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట." అంది. 'పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం' అన్నట్లు నా అవస్థ నీకు హ్యూమర్ లా కనిపించిందా అనుకుని, అంతదూరం వెళ్లి తాగే ఓపికలేని నేను పక్కన చూడగా ఐస్ క్రీం కొట్టు కనిపించింది.


కనీసం దానితోనైనా గొంతు తడుపుకుందాం అనుకుని అటు వెళ్ళాను. అక్కడ కౌంటర్లో ఒకబ్బాయి ఐస్ క్రీం ఇస్తుండగా ఇంకొక అబ్బాయి చేతి మీద చిన్న గద బొమ్మ గుద్దుతున్నాడు. "మా కాలంలో కార్యక్రమాల చివర 'పవమానసుతుడు పట్టు' అనే పాట పాడేవాళ్లు. అలాగే ఇప్పుడు ఇది చివరి ఐటెం అని గద గుద్దుతున్నావా?" అని అడిగిన నాతో," లేదండీ! ఒకసారి ఐస్ క్రీం తిన్నవాళ్ళు ఇంకోసారి రాకుండా గుర్తుకోసం గుద్దుతున్నాను." అని చెప్పిన సమాధానం విని బుర్ర తిరిగింది.


ఈలోగా ఒక చిన్నకుర్రవాడు తనకన్నా బరువైన పళ్లెం చేతిలో పెట్టుకుని మోయలేక, శ్రీహరికోట నుండి వదిలిన రాకెట్ లాగా పరిగెడుతూ ఐస్ క్రీం కోసం వచ్చి నన్ను గుద్దాడు. ఆ విస్ఫోటనానికి అతని పళ్లెంలో ఉన్న పదార్ధాలన్నీ నా శరీరమంతా వెదజల్లబడ్డాయి. ఇంతలో, "అమ్మా! ఈ గాడిద అంకుల్ నా ప్లేట్ ని నాశనం చేసాడు...." అంటూ ఆ కుర్రాడు ఏడవడం మొదలెట్టాడు. వెంటనే ప్రత్యక్షమైన వాళ్ళ తల్లితండ్రులు నా మీద తమ వాక్బాణాలను ప్రయోగించడం ప్రారంభించారు. ఆ బాధ భరించలేక ఆ భోజనాన్ని విడిచి అభోజనంగా బయటపడ్డాను.


ఇంట్లోకి ప్రవేశిస్తున్న నన్ను చూసి పళ్ళబిగువున నవ్వాపుకుంటూ, " వివాహభోజనంబు బాగా చేసినట్టున్నారు బావగారు" అన్న మరదలితో, "మరే! నవరంధ్రాలలోను తినేందుకు ఉపయోగించే రంధ్రం తప్ప మిగిలిన అష్టరంధ్రాలతో భా..హా...గా చేశాను. అర్జెంటుగా అభ్యంగన స్నానం చేసొస్తాను. ఆవకాయ అన్నం రెడీ చెయ్యి." అని చెప్పి బాత్ రూమ్ లోకి దూరాను.


సమాప్తం

నాగవరపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పాఠకుడిగా ముదిరి రచయితగా మారిన చిరు రచయితను నేను. స్వస్థలం శ్రీకాకుళం. ఉద్యోగరీత్యా 25 సంవత్సరాలుగా కర్ణాటక లోని మంగళూరు వాసం చేస్తున్న ప్రవాసాంధ్రుడిని. ఎప్పుడూ చదవడం, అప్పుడప్పుడు రాయడం అభిరుచులు.98 views0 comments

Comments


bottom of page