'Vruddhi' written by Srinivas Sufi
రచన : శ్రీనివాస్ సూఫీ
‘రోడ్లు వెడల్పు చేశాం, సైడ్ డ్రైన్లు కట్టాం, వీధిలైట్లు ఏర్పాటు చేశాం.. కూడళ్లను సుందరీకరించాం.. పట్టణాన్ని అభివృద్ధిచేశాం.. ‘ అంటూ తన కృషిని, ప్రభుత్వ ఘనతను చాటుతూ ఉద్వేగంగా ప్రసంగిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే విజయ్. మరో రెండునెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలకు సమాయత్తంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి బహిరంగసభ అది. మౌలిక సదుపాయాల కల్పన తన హయాంలోనే జరిగిందని, తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగానే ఈ సదుపాయాలు సాకారమయ్యాయని ప్రకటిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తననే ఎమ్మెల్యేగా గెలిపించాలని పదే పదే అభ్యర్థిస్థున్నాడు. తమ ప్రభుత్వానికి జైకొట్టిస్తూ , జిందాబాద్ అనిపిస్తూ, భారీ చప్పట్ల నడుమ తన ప్రసంగాన్ని పూర్తిచేశాడు.
పట్టణం నలుమూలల్లోని పలు వార్డులు, శివారు కాలనీలు, మురికివాడలనుంచి వేలాదిగా జనం ఆ సభకు హాజరయ్యారు. అంతా బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేదలే ఎనభై శాతం దాకా ఉన్నారు. వాళ్లంతా తలకు రెండొందలు చెల్లిస్తామన్న హామీతో తీసుకురాబడ్దారు. ఆ సభకు ఆ పార్టీకి చెందిన ఎన్నికల పరిశీలకుడు హాజరుకావటంతో ఆయన దృష్టిలో తనకు స్థానికంగా మంచి పట్టు ఉందని, పాపులారిటీ ఉందని అతన్ని నమ్మించటం ద్వారా అధిష్టానానికి మంచి నివేదిక ఇవ్వాలని ఆ విధంగా ఈసారి ఎన్నికల్లోనూ పార్టీ టిక్కెట్ సిట్టింగ్ అయిన తనకే కేటాయిస్తుందని ఆశిస్తున్నాడు.
సభ ముగిసిన అనంతరం జనం ఎమ్మెల్యే ఏర్పాటుచేసిన ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు తదితర వాహనాల ద్వారా ఆయా ప్రాంతాలకు తరలించబడుతున్నారు. అప్పటికే సాయంత్రం దాటి చీకటి పడటంతో, విస్తరించబడిన ప్రధాన రోడ్లపై సెంట్రల్ లైట్లు జిగేల్ మంటున్నాయి. రోడ్లపై డివైడర్లు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ అవరోధాలను తప్పిస్తున్నాయి. కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లు, పచ్చిక ఆహ్లాద పరుస్తున్నాయి.
బైపాస్ రోడ్ కు అరకిలోమీటర్ దూరాన పట్టణ నలువైపులా దాదాపు పాతిక శివారు ప్రాంతాలు, మురికివాడలు కునారిల్లుతున్నాయి. మీటింగ్ కు వెళ్లొచ్చిన జనం చేతికందిన రెండొందలతో వెచ్చాలు తెచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు వంటలకు ఉపక్రమించారు. కొందరు మద్యం బెల్టు దుకాణాలకు పయనమయ్యారు.
దిగువల్లోని పేద , నిరుపేద నివాసాలనుంచి చూస్తుంటే పట్టణ ప్రధానరోడ్లు విద్యుత్ సోయగాలతో తళుకులీనుతున్నాయి.పచారి కొట్లకు, బెల్టు షాపులకు వెళ్ళి ఇళ్లకు తిరిగొస్తున్న జనం వీధి లైట్లు లేని చీకటి దారుల్లో అరకొర సదుపాయం గల చోట్ల అవస్థలు పడుతున్నారు. అంతకు ముందురోజు భారీ వర్షం కురవటంతో మట్టిరోడ్లపై వరద నీరు నిలిచి బురదగుంటలుగా మారిన రోడ్లపై జాగ్రత్తగా అడుగులేస్తూ వస్తున్నారు. ఒక గంట వ్యవధిలో రాత్రి తొమ్మిదవుతోందనగా ఆ ప్రాంతాల ఇళ్లన్నీ పక్షులు చేరిన గూళ్ళయ్యాయి.
ఎవరింట్లో వాళ్ళు వండుకున్నదేదో తిన్నాక జనం అలవాటు చొప్పున అక్కడక్కడా కాలక్షేపానికిచేరుతున్నారు.చుట్టలు వెలిగించుకుంటూ, సిగరెట్లు ముట్టించుకుంటూ, పాన్ మసాలా పొట్లాలు చించుతూ లోకాభిరామాయణం మొదలెట్టారు.
‘లైట్లవల్ల మెయిన్ రోడ్లు ఎలిగిపోతన్నయ్.కానీ మనలాంటి గరీబోళ్ల బతుకుల్లో ఏదీ.. వృద్ధి ఏదీ?’ ఆ ఎలుగు పొగ విడుస్తూ ఒక చుట్ట నిర్వేదం పలికింది.
‘రోడ్లు, కాలవలు లైట్లే అభివృద్దా? బీదా బిక్కి జనం అభివృద్ధికి ఉద్యోగ, ఉపాధి చర్యలెవ్వి?’ నోట్లోని చుట్టనీళ్లు తుపుక్కున ఊస్తూ ఇంకొక గొంతు ధ్వనించింది.
‘ఒక కర్మాగారమా, ఒక పరిశ్రమ తెచ్చారా? ఎట్ల సాధ్యపడుతుంది అభివృద్ధి?’ఇంకో క్రీనీడ ప్రశ్నించింది.
‘ఇంటి జాగలిత్తామని, కట్టిచ్చినఇళ్ళే ఇత్తామని ఆశపెట్టి దరకాస్తులు తీసుకోటం, ఏళ్ళకేళ్ళు ఎల్లదీయటం తప్ప ఎవళ్లకొచ్చాయ్ ఇండ్లు, ఎవరికి దక్కింది వృద్ధి?’చిటికెన వేలితో నుసిరాలుస్తూ బీడీ నిరసన పలికింది
‘ వృద్ధి అంటే కాళ్లమీద నిలబడేలా చేయటం, ఉచిత పథకాలకు ఎగబడకుండా చేయటం, ఓటు అమ్ముకోకునే దౌర్భాగ్యం తప్పించటం, సభలకు సమావేశాలకు కూలీలుగా మారే అగత్యం అరికట్టటం, ఎవరికి వారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కల్పించటం..’
ట్రిగ్గర్ నొక్కుతూ ఎవరో తుపాకిగుండ్లు పేలుస్తున్నట్టు మాటలు దూసుకొస్తున్నాయి. ‘జిగేల్లున మెరిసేదంతా ఎలుతురు కాదు.అదంతా మేడిపళ్ల తీరుగానీ ఇగ లోపలికి రాండి, పొద్దున్నే పనులెతుక్కుంటూ అడ్దమీదికి బోవాల’ అనికొందరు ఆడోళ్లు విసుక్కుంటుండే సరికి జనం కదిలారు.
***సమాప్తం***
Comentarios