top of page

ఊ అంటావా!...ఊహూ అంటావా!!


'Vu Antava Vuhu Antava' New Telugu Story Written By D V D Prasad

'ఊ అంటావా ఊహూ అంటావా' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


నా అభిమాన నటుడు సోలర్ స్టార్ సూర్యకుమార్ కొత్త సినిమా 'రాజమండ్రి రాజయ్య' ఈ రోజు విడుదలైందండీ! ఇవాళ మొదటి ఆటకి వెళ్దామండీ! ఆఫీసునుండి త్వరగా ఇంటికి వచ్చేయండి. అట్నుంచి అటే హోటల్ ‘అన్నపూర్ణా’లో డిన్నర్ చేద్దామండీ!" అన్న కాంతం వైపు చూసాడు అవతారం.


అది అభ్యర్థనా లేక ఆర్డరా అని డిసైడ్ చెయ్యలేకపోయాడు. కాకపోతే, కాంతం ఎప్పుడూ తనని అభ్యర్థన చెయ్యదు కనుక, అది ఆజ్ఞే అని డిసైడైపోయాడు అవతారం. అసలే నెలాఖరు రోజులు, ఒకపక్క జేబులో బక్క చిక్కిన పర్సు బావురుమంటోంది, మరోపక్క భార్య ఆదేశం. ఏం చేయాలా అని ఓ క్షణం ఆలోచించాడు.


"ఇవాళే కదా సినిమా వచ్చింది. వచ్చేవారం వెళదాంలే, అప్పటికి జీతాలు అందుతాయి." అంటూ సినిమా కార్యక్రమాన్ని వాయిదా వెయ్యబోయిన అవతారంని మింగేసేట్లు చూసింది కాంతం.


"నేనెప్పుడు ఏది చెప్పినా అడ్డుపుల్ల వేస్తారు. నేను చెప్పింది ఎప్పుడు అవునన్నారు కనుకనా! మన ఇన్నేళ్ళ కాపురంలో ఒక్కసారైనా మీరు 'ఊఁ..' అని అన్నారా? నేనేమన్నా ఒకే ఒక్క మాట 'ఊహు...' అన్నమాటే ఎప్పుడూ అంటారు. భార్య ముచ్చటగా సినిమాకి తీసికెళ్ళమంటే లేదనే మొండివాణ్ణి మిమ్మల్నే చూసాను" అని మూతి విరిచి, ముక్కు చీదింది కాంతం.


ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేట్లు ఉందని వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు అందాయి అవతారంకి.


"అది కాదు కాంతం! నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, అయినా నెలాఖరు రోజులు కదా! ఏ అవసరమైనా వస్తే చేతిలో డబ్బులు ఉండొద్దూ? జీతాలందాక సినిమాకి తీసికెళ్తానన్నానుగా!" భార్యని అనునయిస్తూ చెప్పాడు అవతారం.


"వచ్చే వారం వరకూ ఆ సినిమా ఉండొద్దూ? అయినా చేతిలో డబ్బులుండే లేదని మీరు అంటూంటే భార్యమీద మీకెంత ప్రేమ ఉందో అర్థమవుతోందిలెండి. ప్రతీ విషయంలో నేనేం చెప్పినా అడ్డదిడ్డంగా వాదిస్తారు! ఒక్క విషయంలోనూ నేను చెప్పినట్లు వినరు! మన పక్కింటి పాపారావుని చూడండి. భార్య చెప్పిన మాట జవదాటడు. ఆమె చెప్పింది తుచా తప్పకుండా చేస్తాడు. ఆమె అడిగిందే తడువుగా సినిమాకైనా తీసుకెళ్తాడు, లేకపోతే సినిమాకెళ్ళడానికి డబ్బులైనా ఇస్తాడు. మీరూ ఉన్నారు ఎందుకు?" అంది కాంతం మెటికలు విరుస్తూ.


"ఇంతకీ నేనేం అన్నానని పాపారావుతో నన్ను పోలుస్తావు? ఆ పాపారావు పేరు తలచుకుంటేనే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి. ఎప్పుడూ పేకాటతోనే రోజులు గడుపుతూ ఉంటాడు ఆ పేకాట పాపారావు. రోజూ వందల కొద్దీ అబద్ధాలాడతాడు. అలాంటి పాపారావుతో నన్ను పోలుస్తావా?" అన్నాడు అవతారం కోపంగా.


"పోనీ పాపారావు కాకపోతే పక్కింటి పుల్లారావు, ఎదురింటి అప్పారావూ లేరూ. అందరూ భార్య మాట వింటారు తెలుసా? మీరూ ఉన్నారు, ఎప్పుడైనా నా మాటని ఔనన్నారా?" అంది పెడసరంగా.


కాంతం తనని వాళ్ళతో పోలిస్తే మరికాస్త కోపం వచ్చింది అవతారంకి. "పుల్లారావు సంగతి నీకు తెలీదు. ఎప్పుడైనా ఆఫీసు వదిలిన తర్వాత ఇంటికి తిన్నగా వచ్చాడా? ఉళ్ళో ఉన్న బార్లన్నీ పావనం చేసి గాని ఇల్లు చేరడు. ఎక్కడ పెళ్ళాం తిరగబడితే తన ఆటలు సాగవని ఆమె మాట వింటాడు. అలాగే అప్పారావు సంగతి మరి చెప్పకు. ఆ అప్పుల అప్పారావుకి కజిన్ బ్రదర్ వాడు. ఊళ్లో అందరి దగ్గరా వాడికి అప్పులే! అలా అప్పులు చేసి వాళ్ళావిడని సినిమాకి, షికార్లకి తీసుకెళతాడు. పైగా వాడికో సెకండ్ సెటప్ కూడా ఉంది తెలుసా, అందుకే తన గుట్టు బయట పడకుండా ఉండటానికి పెళ్ళాం ఏం చెప్పినా వింటాడు. అలాంటి వాళ్ళతో నన్నెందుకు పోలుస్తావు? అయినా ఇప్పుడు సినిమా చూడకపోతే కొంపలేమైనా అంటుకుపోతాయా?" అన్నాడు అవతారం రెచ్చిపోతూ.


అలా అనేసరికి కాంతంకి వళ్ళు మండింది. "అనండి, అనండి! ఏదో ముచ్చటపడి సినిమాకి వెళ్దాం, అందులోనూ నా అభిమాన హీరో సినిమా అని అంటే ఇంత రాధ్ధాంతం చేస్తారా?" అని వంటింట్లోకి విసురుగా వెళ్ళింది.


ఆ తర్వాత వంటింట్లో బోలెడన్ని సామాన్లకి స్థాన చలనం కలిగింది. తన ప్రతాపమంతా వంటిట్లో పాత్రలపై చూపించింది కాంతం. ఆ పాత్రలపై కాంతం ప్రతాపం చూపించినట్లే తనపై కూడా వంటింటి ఆయుధాలతో సర్జికల్ స్ట్రైక్ జరుపుతుందేమోనని భయపడి ఇంట్లోంచి పలాయనం చిత్తగించడానికి రెడీగానే ఉన్నాడు అవతారం.


ఆ శబ్దాలు భరించడం తనకి అలవాటే అయినా వంటింట్లోకి వెళ్ళకుండా బయటనుండే చెప్పాడు, "కాంతం! శాంతం! శాంతం!!" అని.


వెంటనే హాల్లోకి విసురుగా దూసుకొచ్చింది కాంతం. "ఏదీ శాంత!" అని పక్కింటి శాంత వచ్చిందేమోనని అనుకుని.


"శాంతం, శాంతం అన్నానే కాంతం, పక్కింటి శాంత వచ్చిందని అని కాదు." వివరణ ఇచ్చుకున్నాడు.


'శాంతం!' అన్నభర్త అభ్యర్థన మన్నించి మొత్తంమీద ఆమె శాంతం వహించింది కాకపోతే ఆ రోజు కాదు, రెండు రోజుల తర్వాత! ఈ లోపల పాపం అవతారం ఉప్పు ఎక్కువైన పప్పు, కారంతో కూడిన కూర, ఉడికీ ఉడకని అన్నం, నీళ్ళలాంటి చారూ తినవలసి వచ్చింది. రెండురోజుల తర్వాత అవతారమే ఆమెతో శాంతి చర్చలు జరిపి సినిమాకి తీసుకెళ్ళడంతో ఆ ప్రహసనం అంతటిలో ముగిసింది. ఆదివారంనాడు ఉదయం సోఫాలో తీరిగ్గా కూర్చొని కాఫీ అస్వాదిస్తూ వార్తా పత్రిక చదువుతున్న అవతారం మీద ఉన్నట్లుండు ఓ బాంబు పేల్చింది కాంతం.


"మా నాన్నగారు ఫోన్ చేసారండీ! పండుగకి మీకు సెలవు లేకపోవడంతో నేనొక్కర్తినీ వెళ్ళవలసి వచ్చింది కదా! ఉగాదికి మాత్రం మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారండీ! మీ బాస్కి చెప్పి ఓ వారం రోజులు సెలవు పెట్టండి." చెప్పింది కాంతం.


ఉగాదికి పిలిచారనగానే అవతారం గుండెల్లో రాయి పడింది. రష్యా ముప్పేట దాడిలో ఉక్కిరిబిక్కిరైన ఉక్రైన్లా తయారైంది అవతారం పరిస్థితి. పెళ్ళైన కొత్తలో ఓ సారి, అత్తగారు స్వయంగా తయారు చేసిన ఉగాదిపచ్చడి ఆ తల్లీకూతుళ్ళు ఇద్దరూ కలసి తనకి పట్టించడం గుర్తుకు వచ్చి కడుపులో తిప్పింది. ఆ రోజు తను పడిన అవస్థ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగి కాంతం మొహం మసక మసకగా కనిపించింది. అలాగే, తన మామగారు రాసిన ఉగాది కవితలు వినిపించడంతో తన అవస్థ వర్ణనాతీతం. ఉగాదినాడు కవిసమ్మేళనంలో పాపం శ్రోతలు ఎలా భరించారో అతన్ని పాపం అని వాళ్ళ మీద జాలి కలిగింది అవతారంకి.


అత్తవారిల్లూ, ఉగాది పచ్చడి తలచుకుంటేనే అవతారానికి మతి పోయింది.


అందుకే వెంటనే, "సారీ కాంతం, మా ఆఫీసులో అడిట్ రానుంది. బాస్ సెలవు ఇవ్వడు." అని నోటికొచ్చిన అబద్ధం చెప్పాడు.


వెంటనే కాంతం ముక్కు చేదేసి, కుళాయి తిప్పింది. "ఛీ...నా బ్రతుకొక ముద్దూ ముచ్చట కూడా లేదు. మీరు ఎప్పుడూ ఇంతే! నేను చెప్పిన ఏ ఒక్క మాటకీ 'ఊ' అన్న పాపాన పోరు." అని వెంటనే అలకపానుపు ఎక్కేసింది.


మళ్ళీ పాపం అవతారంకి ఫుడ్ ఇబ్బందులు తప్పలేదు. ఆ మరుసటి రోజు డైనింగ్ టేబులు మీద పెట్టి ఉన్న క్యారేజ్ ఆఫీసుకి తీసుకెళ్ళి క్యాంటిన్లో లంచ్ అవర్లో తెరిచి చూసి తెల్లబోయాడు. అందులో అన్నానికి బదులు బియ్యం, కూరకి బదులు పచ్చి కూరలు, పప్పుకు బదులు పప్పు బద్దలు ఉన్నాయి. వాటిని అలా చూసేసరికి ఏం చేయాలో పాలుపోలేదు పాపం అవతారంకి. అతని అవస్థ గమనిస్తూనే ఉన్నాడు కోలీగ్ ముకుందం.


అతని ముఖ కవళికలు అర్థం చేసుకున్న ముకుందం, "ఏమిటి బ్రదర్, వదినగారితో ఏమైనా గొడవపడ్డావా?" అని అడిగాడు.


తన గుట్టు అతనికి తెలిసిపోయిందని, ఇంక దాచి ప్రయోజనం లేదని తల నిలువుగా ఉపాడు నీరసంగా.


"అయ్యో పాపం!" అని అవతారం వైపు సానుభూతి చూపోసారి విసిరి తను తెచ్చుకున్న భోజనం షేర్ చేసాడు. "భార్యతో జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. లేకపోతే మనకి తిప్పలు తప్పవు." అన్నాడు హితోపదేశం చేస్తూ.


ఏమీ మాట్లాడక మౌనంగా ఆవురావురుమంటూ అవతారం తింటూంటే అతనిపై మరింత జాలి కలిగింది ముకుందంకి. "ఏం జరిగింది చెప్పవయ్యా! నేనేమైనా నీకు సహాయపడగలనేమో చూద్దాం!" అన్నాడు ముకుందం.


తన సమస్యలన్నీ వివరంగా చెప్పి భోరుమన్నాడు అవతారం. "నేను చాలా బిజీగా ఉన్నప్పుడో, లేక జేబులు ఖాళీగా ఉన్నప్పుడు షికారుకో, పార్కుకో, షాపింగ్కో వెళ్దామంటుంది. నేను కాదంటే రాద్ధాంతం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉగాదికి సెలవు పెట్టి వాళ్ళ ఊరు వెళ్దామంటోంది. నేను లేదనేసరికి వాదనకి దిగింది. ఉగాదికి అక్కడికెళ్తే ఉగాది పచ్చడి బెడదతో పాటు మా మావగారు కవిత్వానికి కూడా బలైపోతానేమోనని భయంగా ఉంది. అదీ సమస్య." అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు అవతారం.


అవతారం సమస్య సాంతం విన్న ముకుందం ఫెళ్ళున నవ్వాడు. "చూడు బ్రదర్! ఇలాంటి సమస్య పెళ్ళైన ప్రతీవారికీ వస్తుంది. నేర్పుతో ఆ సమస్యని ఎదురించాలేగాని పారిపోకూడదు. ఉదాహరణకి, నువ్వే ఓ చచ్చుపుచ్చు కవిత రాసి మీ మామగారికి వినిపించి అతనికి కవిత్వం పైనే కాదు, జీవితం పైన కూడా రోత పుట్టించొచ్చు. కావాలంటే మా బాబాయి పిచ్చేశ్వర్రావునడిగి ఓ నాలుగు కవితలు తెస్తాను, వాడుకో!


అలాగే, ఉగాదిపచ్చడి విషయానికొచ్చేసరికి, నువ్వే ఎదురెళ్ళి, 'ఏదీ అత్తయ్యగారూ...ఉగాది పచ్చడి తయారైందా!' అని అడుగు. నువ్వు లేదంటేనే నీ వెంటపడతారు. ఆ తర్వాత ఆ ఉగాది పచ్చడి అద్భుతంగా ఉందని పొగిడి ఏలాగోలా తినకుడా మేనేజ్ చేసేయ్! అంతే!


ఇంకా తెలుసుకో! నువ్వు 'ఊహూ...'అన్నకొద్దీ వాళ్ళు వాదనకి దిగుతారు, గొడవ పెట్టుకుంటారు. అలాగే నీ భార్యతో అనవసరంగా వాదన పెట్టుకోకు. భార్యతో వాదనలో ఏ మొగుడూ గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. ఆమె చెప్పిన ఏ విషయానికైనా నువ్వు ప్రతీదానికి సింపుల్గా 'ఊ...'కొట్టావనుకో, నీకిక ఏ సమస్యా రాదు. ఇలా చిన్నచిన్నవాటికి అన్నింటికీ 'ఊ' కొట్టి మంచి చేసుకోవాలి, అదే జీవితసత్యం." అంటూ హితబోధ చేసాడు ముకుందం.


ముకుందం మాటాలు బాగా నచ్చాయి అవతారంకి. బాస్ని ఎలాగో మంచి చేసుకొని ఓ సెలవు తీసుకొని, కాంతంతో అత్తవారింటికి వాళ్ళూరు వెళ్లాడు. ముకుందం ఇచ్చిన కవితలు చదివి మామగారిని బెదరగొట్టాడు. ఆయన తను రాసిన కవితలు వినిపించడం మాట దేవుడెరుగు, అల్లుడ్ని తప్పించుకు తిరిగాడు ఆ రోజంతా.


ముకుందం చెప్పిన ట్రిక్ అత్తగారి వద్ద కూడా పని చేసింది. ఉగాదిరోజు ఉదయం 'అత్తయ్యగారూ...ఉగాది పచ్చడి...' అంటూ వెంటపడ్డాడు. ఆమె అల్లుడివైపు విడ్డూరంగా చూసింది. ఆమె ముందు కూడా ఓ రెండు కవితలు చదివాడు. అంతే, చెట్టంత మనిషి ఆవిడ కూడా బెదిరిపోయింది. ఆవిడ అందించిన ఉగాదిపచ్చడి తిన్నట్లు నటించి పారబోసినా ఆమె కంటపడలేదు. ఆ విధంగా ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు అవతారం. మనసులోనే ముకుందానికి ధన్యవాదాలు తెలిపాడు. అత్తవారింట్లో దిగ్విజయంగా గడిపి విజయగర్వంతో ఇంటికి తిరిగివచ్చాడు అవతారం భార్యతో.


తన మాట విని తనతో వచ్చినందుకు కాంతం కూడా యమ హ్యాపీగా ఉంది. ఇక ఇంటికి తిరిగి వచ్చిన భర్త పూర్తిగా తన మాట వినడంతో కాంతం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆమె ఏమన్నా 'అలాగే' అని అంటున్నాడు కాని, లేదని ఒక్కసారి కూడా అనడం లేదు. తన భర్తలో మార్పు వచ్చినందుకు ఆమె మురిసి పోయింది. ఆమె చెప్పే ప్రతీ మాటకి 'ఊ..' కొట్టడం మొదలెట్టిన తర్వాత, వాళ్లిద్దరి మధ్య తగువులు లేవు, వాదనలు లేవు. గొడవలూ లేవు!


ఇంతకుపూర్వం చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రీగా రోజూ లభించే వినోదం మరి లభించకపోవడంతో దీర్ఘంగా నిట్టూర్చి డైలీ సీరియల్ చూడటంలో మునిగిపోయారు. ఓ నెల రోజుల తర్వాత.....ఓ ఆదివారం సాయంకాలం వేళ కాంతం అవతారంకి కాఫీ అందిస్తూ, "ఇవాళ బీచ్కి వెళ్దామండీ! చాలా రోజులైంది పానీపూరి తిని. అక్కడ పానీపూరీ చాలా బాగుంటుందండీ!" అందామె.


"ఊ..." అన్నాడు అవతారం ఆమె అందించిన వేడివేడి కాఫీ అందుకుంటూ.

"అలాగే తిరిగి వచ్చేటప్పుడు మల్లెపూలు ఓ మూరెడు కొనండి!"


"ఊ..." అన్నాడు అవతారం తన్మయత్వంతో కాఫీ ఆస్వాదిస్తూ.


"అలాగే అక్కడ 'గిరి మార్కెట్'లో ఫ్రూట్ జ్యూస్ చాలా బాగుంటుందండీ! మీకు తెలుసు కదా నాకు మౌసంబి జ్యూస్ అంటే చాలా ఇష్టమని. అక్కడ జ్యూస్ తాగుదామండి. మీకెలాగూ ఐస్క్రీం అంటే ఇష్టం. మీరు ఐస్క్రీం తిందురు గాని."


"ఊ..."అన్నాడు అవతారం కాంతంకి తనమీదున్న ప్రేమకి మురిసిపోతూ.


"ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న 'గాయత్రీ జ్యూయలర్స్ 'షోరూంకి వెళ్దామండి. అక్కడ తరుగు చాలా తక్కువట. నాకోసం ఓ డైమండ్ రింగ్ కొనరూ ప్లీజ్!... ప్లీజ్!!..." ముద్దుముద్దుగా గోముగా అడిగింది కాంతం.


అలవాటుగా 'ఊ...' అనబోయిన అవతారంకి ఒక్కసారి గొంతులో కాఫీ అడ్డుపడి పొలమారింది. ఇప్పుడు 'ఊ...' అనాలో 'ఉహూ..' అనాలో తెలియని విషమ పరిస్థితిలో పడిపోయాడు పాపం అవతారం. అయితే అనాలోచితంగా 'ఊ!' అనేసాడని తెలియలేదు అవతారంకి.


అవతారంవైపు చూడకుండా అతని చేతుల్లోని కాఫీ కప్పు లాగేసుకుంటూ, "మీరెంత మంచివారండీ! మీరు తప్పకుండా 'ఊ!' అంటారని నాకు బాగా తెలుసు." సంతోషంగా అంది కాంతం మరో మాటకు తావీయకుండా.


అవతారం నోటమాట రాలేదు. అవతారం మొహం తెల్లగా పాలిపోయింది. సరిగ్గా అదే సమయంలో టివిలో 'ఊ అంటావా మావా...ఊహూ అంటావా!' పాట డిటిఎస్ సౌండ్లో వస్తోంది.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


58 views0 comments

Comments


bottom of page