top of page

ఊరంతా సం'క్రాంతి'


'Vurantha Sankranthi' written by Meegada Veerabhadra Swamy

రచన : మీగడ వీరభద్ర స్వామి

ఆ ఊరు పేరు మినీ ఇండియా.ఆ ఊర్లో హిందూ,ముస్లిం,క్రిస్టియన్ మతస్తుల జనాభా ఇంచుమించు సరిసమానంగా వుంటుంది. ఒకప్పుడు మత సామరస్యానికి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆ గ్రామానికి గతంలో వుండే పేరును మార్చి ఆ ఊరుకి మినీ ఇండియా పేరును బ్రిటిష్ పాలకులు నిర్ణయించారన్న వాదన వినిపిస్తుంటుంది.

గ్రామ స్వపరిపాలనను మతతత్వాలకు అతీతంగా సమర్ధుల చేతిలో పెడుతూ తరతరాలుగా మతసామరస్యానికి ప్రతీకగా వున్న ఆ గ్రామాన్ని ప్రస్తుత స్వార్ధ రాజకీయాలు రచ్చ కీడ్చాయి.హిందూ దేశంలో మనమే పాలకులుగా ఉండాలని భూపతి రాయుడు తన మతస్తులను రెచ్చగొట్టి ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే, "రాయుడు మతాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి మనమేమీ తక్కువ కాకూడదు ఈ గ్రామ అధికారంలో మనదే పైచెయ్యు ఉండాలి"అని సయ్యద్ అమీరయ్య తన మతస్తులను రెచ్చగొడుతుండేవాడు."మీరు మీరు అధికారం కోసం మతం రాజకీయాలు చేస్తే మేము తక్కువ కాదు కదా"అని డేవిడ్ మరియాదాస్ కూడా ఆ ఊర్లో తన మతస్తులను కూడగట్టేవాడు.


ఇటీవల కొన్ని దశాబ్దాలుగా ఆ ఊర్లో మత సామరస్య ఛాయలు కనిపించలేదు."గతంలో సంక్రాంతి,క్రిస్టమస్,రంజాన్ పండగలను ఊరందరమూ కలిసి చేసుకునేవారం చాపకూడు భోజనాలు,సహపంక్తి భోజనాలు ఈ ఊర్లో తరుచూ ఉండేవి" అని ఊర్లో వృద్ధులు ముచ్చటించుకోడం ఆ ఊర్లో రాజన్న అనే విద్యార్థి విని,బడిలోని మిత్రులు సోహెల్,రాబర్ట్ లను కలిసి ఎలాగైనా మన ఊర్లో మతం గురుంచి విభేదాలు ఉండకూడదు,ఈ సంక్రాంతి నుండి మన ఊర్లో పూర్వం రోజులు వచ్చి మత సామరస్యం రావాలి"అని సమాలోచనలు జరిపాడు.


భోగీ రోజు బడి మాస్టర్స్ రామ్ రాబర్ట్ రహీంలు రూపొందించిన "సమ్మతమే మా మతం" అనే రూపకాన్ని ఊరు ప్రధాన కూడలిలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.పిల్లలే స్వయంగా ఇళ్ళకు వచ్చి ఆహ్వానించడంతో ఊర్లో పెద్దలు ఆ ప్రదర్శనకు వచ్చారు కానీ ప్రజలు వాళ్ల నాయకులు వెనుక మతాలవారిగా వేరు వేరుగా కూర్చున్నారు.


పిల్లలు నటిస్తున్న రూపకం మొదలయ్యింది, ముందు మాటగా "ఈ రూపకాన్ని గతంలో మన ఊర్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించాం దీని రూప కల్పనలో ఈ ఊరులోని వృద్ధులుకు వారి పూర్వీకులు అందించిన వివరాలను తెలుసుకొని వాటిని జోడించాం"అని రాం రాబర్ట్ రహీం మాస్టర్లు చెప్పారు.


నూరు సంవత్సరాలు క్రితం జిల్లా కలెక్టర్ ఈ ఊరు సంక్రాంతి సంబరాలకు అతిథిగా వచ్చాడు, అతను బ్రిటన్ దేశస్తుడు,తనని ఆ ఊరు గుడి పూజారి ఆచార్యలు తాను గుడి పూజలో బిజీగా ఉంటూ సరిగ్గా స్వాగతం పలకలేదని కోపగించుకొని పూజారి కొడుకు జీవిత కాలం తన ఇంట్లో బానిసగా ఉండాలని శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసాడు కలెక్టర్.ఊరు వారందరూ బాధపడ్డారు కానీ కలెక్టర్ కి ఎదురు చెప్పలేకపోయారు.ఆ రాత్రి కలెక్టర్ బస దగ్గరకు ఇద్దరు క్రిస్టమస్ సోదరులు వచ్చి"సార్ మీ ఆదేశాలను మా ఊరు పాటిస్తారు,మా ఊరు గుడి పూజారి ఆచార్యులువారికి ఒక్కగానొక్క కొడుకు, అతన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు,మేము మా కుటుంబ అనుమతితో వచ్చాము,మీరు అనుమతి ఇస్తే ఆ పూజారి కొడుకు బదులు మేము ఇద్దరు సోదరులం మీకు జీవిత కాల బానిసలుగా వస్తాం"అని అన్నారు."నేను రేపు ఉదయాన్నే నా నిర్ణయాన్ని చెబుతాను"అని ఆ క్రిస్టియన్ సోదరులను పంపివేశాడు కలెక్టర్. కాసేపటికి నలుగురు ముస్లిం యువకులు కలెక్టర్ బస వద్దకు వచ్చి"సాబ్ పూజారి ఆచార్యలు చాలా మర్యాదస్తుడు పేదవాడు,అతనికి ఒకే ఒక్క దిక్కు తన కొడుకు అతడు మీకు బానిస అయితే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది,మీరు ఒప్పుకుంటే పూజారి కొడుకు బదులు మేము నలుగురం మీకు జీవితకాల బానిసలం అవుతాం,మా కుటుంబాల అనుమతి మాకు ఉంది"అని అన్నారు.


కలెక్టర్ రెండోరోజు ఉదయాన్నే ఊర్లో సమావేశం పెట్టి పూజారి వద్దకు వెళ్లి తనని క్షమించమని కోరి గ్రామ యువకులు రాత్రి తనవద్దకు వచ్చి చెప్పిన మాటలను గ్రామస్తులకు చెప్పాడు…"మీ మత సామరస్యానికి మానవ సంబంధాలకు నేను ముచ్చటపడ్డాను"అని ఊరికి వరాలు ప్రకటించి అందరి మన్నన పొందాడు.అప్పుడు ఆ గ్రామస్తులు అప్పట్లో దేశ ఆత్మాభిమానంనకు ప్రతీకైన వందేమాతరం నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా పలికారు.ఆశ్చర్యకరంగా ఆ కలెక్టర్ కూడా వందేమాతరం నినాదాన్ని పలికి అందరి అభిమానాన్ని పొందాడు.రూపక ప్రదర్శన ముగిసింది.


ఈ రూపకాన్ని చూస్తున్న గ్రామస్తులు వాళ్ళ స్థానాలు,స్థాయిలు మర్చిపోయి అందరూ ఒక్కటై పిల్లల అద్భుత ప్రదర్శనకు అభినందనలు అందించారు,గ్రామస్తులు వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు మర్చిపోయి కిలిసి మెలసి భోగి సంబరం చేసుకుంటూ యాదృచ్చికంగానే వందేమాతరం నినాదాలు మారుమ్రోగించారు."ఈ

సంక్రాంతి కనుమ పండగలతో పాటు ఇకపై అన్ని మతాల పండగలు ఊరందరూ కలిసి చేసుకోవాలి"అని తీర్మానించుకున్నారు.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
82 views0 comments
bottom of page