top of page

వ్యాపకం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Vyapakam' Written By Madduri Bindumadhavi

రచన: మద్దూరి బిందుమాధవి


కార్ పూలింగ్ లో భాగంగా మిత్రుడు వసంత్ పిల్లలని తీసుకెళ్ళటానికి, వారి ఇంటికి వచ్చాడు వేణుమాధవ్.


కాలింగ్ బెల్ చప్పుడుకి బయటికొచ్చిన చలపతి గారిని చూసి, "హలో అంకుల్ ఎప్పుడొచ్చారు. ఆంటీ కూడా వచ్చారా? ఒంట్లో బాగుంటున్నదా" అన్నాడు వసంత్, మాసిన గడ్డం, పంచతో ఉన్న ఆయన్ని వింతగా, ఆశ్చర్యంగా చూస్తూ.


"నాకు తెలిసిన అంకులేనా ఈయన? అసలు పోలికే లేదు" అనుకున్నాడు మనసులో!


"ఆ:( బానే ఉన్నానోయ్! మీరంతా బాగున్నారా? మొన్న శనివారం వచ్చాను" అన్నారు చలపతి గారు.


వసంత్, వేణుమాధవ్ హైదరాబాద్ లో ఒకే చోట ఉండేవారు. చిన్నప్పటి నించి ఒకే చోట ఉండటంతో స్నేహం కూడా గాఢంగానే ఉన్నది. ఒకరి కుటుంబ సభ్యులు....వారి అలవాట్లు, నమ్మకాలు, అభిరుచులు మరొకరికి బాగా దగ్గరగా తెలుసు.


"ఏమిటి వసంత్? అంకుల్ లో చాలా మార్పు కనిపిస్తున్నది! ఆరోగ్యం బాగానే ఉన్నదా? అసలు నమ్మలేక పోతున్నాను. మన చిన్నప్పుడు ఎప్పుడూ ట్రిం గా, డాబుగా ఉండే వారు. క్షణం తీరిక లేకుండా బ్యాంకు పనుల్లో తలమునకలుగా ఉండే వారు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ లో ఎవో సలహాలిస్తూ బిజీగా ఉండేవారు" అన్నాడు సందేహంగా వేణుమాధవ్ సాయంత్రం ఇంటికొచ్చిన స్నేహితుడితో!


@@@@


వేణు మాధవ్ తండ్రిగారైన చలపతి గారు బ్యాంకులో సీనియర్ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. పని రాక్షసుడవటంతో తక్కువ కాలం లోనే పదోన్నతులు పొందుతూ పై స్థాయికి చేరిపోయారు.


తెల్లవారేసరికి శుభ్రంగా స్నానం చేసి ...కాసేపు భగవధ్యానం చేసుకుని, నీట్ గా తయారయి, టక్ చేసిన ఇస్త్రీ ప్యాంట్-షర్టు, పాలిష్డ్ షూస్.... ఆఫీసుకి ఒక అరగంట ముందే రెడీ గా ఉండే వారు.


ఆదివారాలు, సెలవు రోజులు కూడా ఏదో ఒక ఆఫీసు పనితో బిజీగా ఉండేవారు. ఆయన తన బ్యాంక్ అనుభవాల పాఠాలు మేనేజ్ మెంట్ స్కూల్స్ కి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ గా ఇస్తూ ఉండేవారు.


ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనే ఆయన్ని అలా ఎదిగేట్లు చేసింది అనుకుంటుంటారు..ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు.


మనిషి ఎంత సమర్ధుడైనా, పనిమంతుడైనా ఏదో ఒక నాడు వయసు రావటం, పదవీ విరమణ చెయ్యవలసి రావటం సహజం!


చలపతి గారు పదవీ విరమణ చేశాక కొత్త అసైన్మెంట్ ఏమీ తీసుకోకుండా కొంతకాలం విశ్రాంతిగా గడపాలనుకున్నారు. కానీ ఒక వారం ఇంట్లో ఉండేసరికే తోచక ఊపిరాడనట్లయి పిచ్చి పిచ్చిగా తయారయ్యారు.


ఇంతలో ఆయన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించుకోవటానికి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ నిర్వహించే కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల వాళ్ళూ ఆయనని కన్సల్టెంట్ గా నియమించుకుంటామంటూ మంచి ఆఫర్లతో వచ్చారు.


"అసలే తోచక పిచ్చెక్కుతోంది. రోజంతా ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాను? హమ్మయ్యా ఈ ఆఫర్ వచ్చి మంచిదయింది" అనుకున్నారు చలపతి గారు. ఇక మళ్ళీ పొద్దున్నే తయారవటం, టైం ప్రకారం డ్యూటీకి బయలుదేరటం లో మార్పు లేదు.


"అబ్బా మీకు కావాలనుకుంటే రిటర్మెంట్లూ ఉంటాయి. ఇష్టమైతే పెద్ద జీతాలతో ఉద్యోగాలూ ఉంటాయి. ఏ జీతం, బత్తెం లేని నా ఉద్యోగానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు" అన్నది ఆయన రిటైర్ అయ్యాక కాస్త ఊపిరి తీసుకుందామనుకున్న కమల... మళ్ళీ స్పీడ్ పెరిగిన తన దైనందిన జీవితాన్ని తల్చుకుని!


@@@@


వేసవి సెలవులకి అమ్మా నాన్నలతో గడుపుదాం అని పిల్లల్లతో వచ్చారు కొడుకు కూతురు కుటుంబాలతో. వారు చలపతి గారి అవిశ్రాంత దైనందిన జీవితం చూసి "నాన్నగారూ ఇప్పుడు కూడా ఇంత కష్టపడాలా? ఈ వయసులో విశ్రాంతి అవసరమనే కదా రిటైర్మెంట్ అనేది పెట్టింది? మేం వచ్చి రెండు రోజులయింది...ఇంతవరకూ మాతో కలిసి మీరు భోజనం చెయ్యలేదు. పిల్లలు కూడా తాతయ్యతో కలిసి ఆడుకోవాలి అని ఎదురు చూస్తున్నారు. అమ్మ షరా.... అది వరకు లాగే ఉరుకులు పరుగులతో కష్టపడుతున్నది. ఆలోచించండి" అన్నారు ముక్త కంఠంతో.


"మీరన్నది నిజమే కానీ...ఏ పని లేకపోతే బుర్ర 'డెవిల్స్ వర్క్ షాప్ ' లాగా తయారవుతుంది. నేను చెయ్యగలిగింది నాకు చేతైన పనే కదా! బుర్ర ఉపయోగించకపోతే మొద్దుబారిపోయి జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుందిట..ఈ మధ్యనే కలిసిన ఓ మిత్రుడు చెప్పాడు" అన్నారు.


"ఆ మాట నిజమే కానీ...ఎంత వరకు మీ వయసు, శరీరం, ఆరోగ్యం సహకరిస్తాయో అంతవరకే ఒప్పుకోవాలి కానీ..ఈ వయసులో మీకు, అమ్మకి విశ్రాంతి లేనంత కాదు" అన్నారు పిల్లలిద్దరూ ముక్త కంఠంతో.


"సరే ఈ సారి మీరొచ్చేసరికి బాగా తగ్గించేస్తాను. ఇక పిల్లలతో ఆడుకోవటమే పని" అంటూ "బంటీ 'రేపు, ఎల్లుండి సెలవు పెట్టేశాను. మనం పార్కుకెళ్ళి పొద్దుటి నించీ సాయంత్రం వరకూ అక్కడే గడుపుదాం. సరేనా" అన్నారు మనవడితో.


@@@@


"బయటికెళ్ళేటందుకు లేదు. ఈ కరోనా కాళ్ళూ చేతులు కట్టేసి మూలన పడేసింది. ఏమి తోచట్లేదు...కజ్జికాయలు చేస్తావా? కావాలంటే నేను సాయం చేస్తాను" అన్నారు చలపతి గారు.


భర్తలో ఈ కొత్త కోణం చూసి కమల ఆశ్చర్యపోయి, "ఇదెప్పటి నించి? మీరు నాకు వంట పనిలో సహయం చెయ్యటమా? ఇటు సూర్యుడు అటు గాని పొడవట్లేదు కదా! పైగా తిండి కోరికలు.. గుర్రాలెక్కుతున్నాయి. కజ్జికాయలంటే మాటలా..అదొక పత్తిపని" అన్నది ముక్కు మీద వేలేసుకుని.


"ఏం చెయ్యమంటావ్? చేతి నిండా పనుంటే ఆకలి దప్పులు తెలిసేవి కావు. రోజుకి 24 గంటలేనా అన్నట్టుండేది. అప్పుడేమో తిండి సరిగా తినట్లేదు అని నువ్వేగా ఎప్పుడూ దెప్పుతూ ఉండేదానివి! ఇప్పుడు తోచట్లేదు. ఆకలేస్తున్నది. ఏమైనా చేసిపెట్టమంటే ఇప్పుడు కూడా నా మీద కంప్లెయింటేనా" అన్నాడు.


అలా రోజూ ఏదో ఒకటి చేసి పెట్టమని... పక్కన కూర్చుని తనతో పేకాటో, చెస్సో ఆడమని చలపతి గారి నస ఎక్కువయింది.


"మీకు వంటలే చేసి పెట్టనా? మీ పక్కన కూర్చుని ఆటలాడనా? రాను రాను మరీ చిన్న పిల్లలైపోతున్నారు" అని కమల విసుక్కోవటం ఎక్కువయింది.


"ఉద్యోగం చేసినన్నాళ్ళూ ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదని ఊరికే నన్నాడిపోసుకున్నారు. రిటైర్ అయ్యాక నా అనుభవాన్ని పది మందికీ పంచటానికి ప్రయత్నిస్తుంటే పిల్లలూ, నువ్వూ కలిసి 'ఈ వయసులో ఇంత శ్రమ పడటం ఎందుకు? మానెయ్యి..మానెయ్యమని పోరుతున్నారు. మీ దిష్టి తగిలే..ఇదిగో ఈ కరోనా నన్ను బయటికెళ్ళనివ్వక ఇంట్లో కట్టి పడేసింది" అని విసుక్కుంటూ టీవీ ముందు కూర్చున్నాడు.


రోజంతా టీవీనో, టాబ్లెటో చూస్తూ వేళకి స్నానం చెయ్యరు..భోజనం వేళకి ఎంత పిలిచినా రారు...క్రమేణా అలా బద్ధకంగా సోఫాలో కూర్చోవటం..అక్కడే దిండేసుకుని పడుకోవటంతో రోజు గడిపేస్తున్నారు.


@@@@


"వేణు....నాన్న ఛాతీలో నొప్పి అని మధ్యాహ్నం అన్నం తిని పడుకున్న మనిషి లేవలేదు. ఇంట్లో ఉన్న పెయిన్ కిల్లర్ వేశాను. గ్యాసేమో అంటే కాదంటున్నారు. ఒక సారి వస్తావా? హాస్పిటల్ కి వెళ్ళొద్దాం" అని వసంత్ ఫోన్ చేశాడు.


కొడుకుని టెన్నిస్ కి తీసుకెళదామని ఆఫీస్ నించి త్వరగా వచ్చిన వేణు వసంత్ ఇంటికి పరుగెత్తాడు.


"నాన్నా కార్ లో కూర్చోగలరా? అంబులెన్స్ పిలిపించనా" అనడిగాడు వసంత్.


కంగారుగా వచ్చిన వసంత్ వాళ్ళని ఎమర్జెన్సీ లో ఎడ్మిట్ చేసుకుని ఈ సి జి, 2 డి ఎకో మరి కొన్ని టెస్ట్స్ చేసి "గ్యాస్ ప్రాబ్లెం అండి" అని టాబ్లెట్స్ రాసిచ్చి పంపించారు.


రెండు రోజులు పోయాక చెవి పోటు అని,మరో రెండు రోజులకి పంటినొప్పి అని కొడుకుని కంగారు పెట్టి పరుగులు పెట్టించారు చలపతి గారు.


"ఏమిటోరా...నాన్న ధోరణి వింతగా ఉంది. నా చిన్నప్పటి నించి ఆయన ఎప్పుడూ జ్వరం, జలుబు అని పడుకోవటం నేనెరగను. ఎప్పుడూ పరుగే! ఇప్పుడు తరుచూ సిక్ అవుతున్నారు. తోచట్లేదు. పిల్లల వ్యాక్సిన్స్, వారి స్కూల్ మీటింగ్స్ తో ఊపిరి సలపక చస్తుంటే తరచు నాన్నగారి ఆరోగ్య సమస్యలు" అని తలపట్టుక్కూర్చున్నాడు వసంత్!


"ఆరోగ్యం నిజంగా బాగాలేదా అంటే సమస్యేమీ లేదంటున్నారు డాక్టర్స్. ఒకసారి మోకాలు నొప్పి అనీ, భుజం తిప్పలేకపోతున్నాననీ, కడుపులో ఎసిడిటీ అని, అరగలేదు కాబట్టి అన్నం వద్దనీ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు.


"ఆయనకి ఉద్యోగపు పనులు ఉన్నన్నాళ్ళూ వేరే ఏమీ చెయ్యటానికి ఖాళీ ఉండేది కాదు...ఆ అవసరమూ తెలియలేదు. ఇప్పుడు బయటికెళ్ళే అవకాశం లేక, ఇతర వ్యాపకాలు...హాబీలు లేక మెలకువగా ఉన్నంత సేపూ టీవీచూస్తూ పొద్దు పుచ్చుతున్నారు. పొద్దస్తమానం మా అమ్మని ఇది వండు..తినటానికి అది పెట్టు అంటూ పోరుతుంటారు." అన్నాడు వసంత్.


"ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా! లేకపోతే వాళ్ళ వల్ల స్వయంగా వారికే కాకుండా...ఇంట్లో వాళ్ళకి కూడా సమస్యే! మా అమ్మ లెక్చరర్ గా చేసింది నీకు తెలుసు కదా! ఎప్పుడూ మమ్మల్ని విసుక్కోవటం కానీ, ఎవరినీ విమర్శించటం కానీ చేసేది కాదు. మా నాయనమ్మతో ఆవిడకి మంచి అనుబంధం ఉండేది."


"ఇప్పుడు రిటైర్ అయ్యాక సాయంత్రం తోచక టీవీ సీరియల్స్ చూస్తూ...అందులో ఉండే పాత్రలని తనకి అన్వయం చేసుకుని వ్యతిరేక భావాలు పెంచుకుంటున్నది. టీవీలో వచ్చే విలన్ అత్తగారిలాగా మా ఆవిడతో అడపా దడపా గొడవ పడుతూ ఉంటుంది" అన్నాడు.


"మా చిన్నప్పుడు మా నాయనమ్మ తరం ఆడ వారికి తోచకపోవటం అనేది ఉండేది కాదు. వాళ్ళు గారెల కోసం, దోశల కోసం పప్పు రోట్లో రుబ్బే వారు. పచ్చళ్ళు కూడా రుబ్బో, దంచో చేసేవారు. అప్పుడు మిక్సీలు, గ్రైండర్స్ లేవు కదా! ఆ రోజుల్లో అదొక పెద్ద పని అనుకో పాపం వారికి."


"చలికాలం వస్తే ఇంట్లో అప్పడాలు ఒత్తే కార్యక్రమం నడుస్తూండేది. వేసవి కాలం వస్తే వడియాలు పెట్టేవారు. ఊరగాయలు వేసేవారు. వానా కాలం నవారు మంచాలు అల్లే వారు. ఏటి పొడుగూతా పూజకి కావలసిన వత్తులు వాళ్ళే చేసుకునేవారు. పిల్లలకి కావలసిన చిరుతిళ్ళన్నీ ఇంట్లోనే వండేవారు."


"మా నాయనమ్మతో కలిసి అప్పుడప్పుడు మా అమ్మ జంతికలు చెయ్యటం... బొంతలు కుట్టటం లాంటి పనులు చేస్తూ ఉండేది. అప్పుడు అలాంటి పనులతో పాపం వాళ్ళు చాలా కష్టపడేవారనుకో! కానీ కాలక్షేపం లేదు అనే మాట ఉండేది కాదు. అసలు టైం సరిపోతే కదా!"


"ఇప్పుడు అవన్నీ బయట కొనుక్కుంటున్నారు. చేతి నిండా అలాంటి పనులు లేక ఇప్పుడు అందరూ టీవీ చూడటానికి అలవాటు పడ్డారు. ఉద్యోగం చేసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు రావటం వల్ల మా అమ్మ కూడా రిటైర్ అయ్యాక టీవీ ఎక్కువగా చూస్తున్నది. టీవీ కార్యక్రమాలంటే రెండు వైపులా పదునుండే కత్తిలాంటివి. వాటితో మంచి ఎంతో..చెడు అంత!"


"మా అమ్మలో వచ్చిన ఈ వ్యతిరేక మార్పు చూసి, విషయం అర్ధం చేసుకుని...మా అమ్మ చేత ఈ మధ్య content writing చెయ్యమని ప్రోత్సహించి నెమ్మదిగా ఆవిడకో వ్యాపకం కల్పించాను. పాఠాలు చెప్పటమే కానీ,ఎప్పుడూ కంప్యూటర్ మీద పని చెయ్యలేదు. దగ్గర కూర్చోపెట్టుకుని పది రోజులు నేర్పించాను. ఇప్పుడు అదివరకులాగా ఆవిడ టీవీ చూడకుండా, కొత్తగా పెట్టుకున్న కాలక్షేపానికి విషయ సేకరణ చేసుకుంటున్నది. దానితో ఇంటి వాతావరణం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది. పెద్ద వాళ్ళకి వ్యాపకం, కాలక్షేపం ఉండటం...ఆర్ధిక అవసరాల కోసం అనుకోవద్దు. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ప్రతి వారికి ఏదో ఒక వ్యాపకం అవసరం."


"నా మాట విని, అంకుల్ కి ఒక బ్లాగ్ తెరిచి... బ్యాంకింగ్ రంగంలో ఆయన అనుభవాలని వ్యాసాలుగా రాయమను. ఇప్పటి వరకు మాట్లాడటం, సలహాలివ్వటమే కానీ స్వయంగా టైప్ చెయ్యటం ఆయనకి అలవాటు లేక మొదట్లో ఇష్టపడరు. కానీ చిన్న పిల్లల్లాగా కబుర్లు చెబుతూ అలవాటు చెయ్యాలి. ఇతరుల నించి స్పందనలు రావటం మొదలయ్యాక ఆయనకి ఆసక్తి పెరుగుతుంది. ఈ తరం వారికి ఆయన అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయి. మనబోటి వాళ్ళం బ్యాంకింగ్ మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నామంటే...అది పుస్తక పరిజ్ఞానమే కానీ అందులో క్షేత్ర స్థాయి అనుభవం ఉండదు. అంకుల్ లాంటి వాళ్ళ వాస్తవ అనుభవం, మన సాంకేతిక పరిజ్ఞానం కలిస్తే ఎంతో ఉపయోగం" అన్నాడు వేణుమాధవ్.


"నిజమేరా నేనిన్నాళ్ళు ఆ కోణంలో ఆలోచించలేదు. పెద్దవాళ్ళని ఇంకా శ్రమ పెట్టటమెందుకు? వారికి విశ్రాంతి అవసరం అని మాత్రమే ఆలోచించాను. వారికి తాము చేసే పనిలోనే విశ్రాంతి ఉంటుందని తోచలేదు" అన్నాడు వసంత్.


@@@@


"అంకుల్ ట్ బ్యాంకింగ్ మీద నేనొక ప్రాజెక్ చేస్తున్నాను. కొన్ని విషయాల్లో మీ ప్రాక్టికల్ అనుభవాలు చెబితే అందుకు తగ్గట్టు ప్రోగ్రాం రాస్తాను" అన్నాడు దగ్గరున్న స్టూల్ లాక్కుని కూర్చుంటూ వేణుమాధవ్.


"ఆ:( మాది అంతా సంప్రదాయ బ్యాంకింగ్. outdated. నా అనుభవంతో ఇప్పుడు మీకేం లాభం! మా రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడులూ లేవు. ఇంత పెద్ద పెద్ద ప్రైవేట్ బిజినెస్సులూ లేవు. ఇన్నిరకాల వినిమయ వస్తువులూ లేవు. మార్కెట్ మారిపోయింది. ప్రజల అవసరాలూ, ప్రాధాన్యాలూ మారాయి" అన్నారు చలపతి గారు.


"ఎన్ని మారినా మనుషుల్లో స్వార్ధం స్థాయి పెరుగుతున్నదే కానీ తగ్గట్లేదు కదా అంకుల్. ఆ స్వార్ధబుద్ధి వల్ల ఇప్పుడు ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. డబ్బుకి సంబంధించినంత వరకు సంపాదన, పొదుపు-మదుపు, సేఫ్టీ, ఆస్తుల మీద పెట్టుబడి..వీటిలో మార్పు ఉండదు కదా!"


"కాబట్టి బ్యాంకింగ్ రంగంలో రెండు మూడు స్థాయిల్లో రక్షణ చెక్స్ ఎలా పెట్టాలి అనేవి తెలియాలంటే ఎలాంటి తప్పులు..ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉందో తెలియాలి కదా!"


"అలాగే మొండి బకాయిలు వసూలు చెయ్యటానికి మీరు ఎన్ని రకాల పద్ధతులు వాడేవారో...అసలు బకాయి మొండిది అవ్వకుండా ముందు నించే ఎలాంటి జాగ్రత్తలు పడాలో...ఒక ఋణ గ్రహీతని ఎలా అంచనా వెయ్యాలో....ఏ సూచికలని పరిమితులని దృష్టిలో పెట్టుకోవాలో తెలుసుకుంటే మాకు ప్రోగ్రాం రాయటం తేలిక అవుతుంది అంకుల్" అన్నాడు.


అలా మాటల్లో పెట్టి చలపతి గారి అనుభవాలని వ్యాసాలుగా రాయించారు వసంత్, వేణు.


ఉదయం కాఫీ తాగటం అవ్వగానే టాబ్లెట్ లో తన వ్యాసాలకి వచ్చిన స్పందనలని చదవటం, సమాధానాలివ్వటం అలవాటయింది చలపతిగారికి. మళ్ళీ ఆయనలో పాత హుషారు వచ్చింది. ఇప్పుడు తోచట్లేదని కమల తో నస పెట్టటం తగ్గింది.


చీటికి మాటికి ఇక్కడ నెప్పి, అక్కడ వాపు అనే కంప్లెయింట్స్ తగ్గాయి.


"నువ్వు గమనించి చెప్పి ఉండకపోతే, నేను నాన్నగారికి విశ్రాంతినిస్తూ..కొడుకుగా నా బాధ్యత చక్కగా నెరవేరుస్తున్నాననుకుంటూ భ్రమలో ఉండేవాడినిరా. మంచి మిత్రుడి పని చేశావు" అని వేణుని మనస్ఫూర్తిగా దగ్గరకి తీసుకున్నాడు వసంత్.








37 views1 comment
bottom of page