top of page

యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా…..


Ya Devi Sarva Bhuteshu Mathru Rupena Samsthitha

written by K. S. Mohan Das

రచన : K. S. మోహన్ దాస్

తెలవారుతుండగా పక్క మీద నుంచి లేచింది వసుధ. రాత్రంతా,గత రెండు, మూడు రోజులు లాగానే, ఏవో కాల్స్ వస్తూనే వున్నాయి. వాటిలో కొన్ని వేడుకోలువి, కొన్ని బుజ్జగింపులువి మరికొన్నిబెదిరింపులవీ వున్నాయి.

భర్త హితభోద చేస్తూనే వున్నాడు. కొద్దిగా చూసీ చూడనట్టుంటే 'భావి బంగారం' అంటాడు. అవకాశం వచ్చినప్పుడు వుపయోగించు కోవాలంటాడు. ఆరోజు అత్యాచార కేసులో ఫైనల్ జడ్జిమెంట్. శిక్షలు ఖరారవుతాయి.

జస్టీస్ వసుధ మనసు లో ఎన్నో ఆలోచనలు.సమాజం మారిపోతోంది. నేరాలు

చిన్న గీత,పెద్ద గీతా లాగా పెరిగి పోతూనే వున్నాయి.

తన వృత్తి కత్తి మీద సాము లాంటిది. ఒక్కొక్క సారి సరయిన ఋజువులు, సాక్ష్యాలు లేక

సరయిన న్యాయం కూడా జరగదు. “ఫైన్ ఎక్కువగా వుంటే అమ్మాయి తండ్రి కొంచం మెత్తబడతాడు లాగా వుందని వాళ్ళ లాయరు హింటు యిస్తున్నాడు, మరీ ఆలోచించి బుఱ్ఱ పాడు చేసుకోక,తేలిక పాటి శిక్ష తో కానిచ్చెయ్” భర్త సలహా తో ఆలోచనల నుంచి బయటపడింది. ఆయన బాధ ఆయనది.

నిందితుల్లో సంఘం లో పలుకుబడి వున్న పెద్దాయన గారి అబ్బాయి వినోద్ కూడా వున్నాడు.తేలికగా వదిలేయమని చాలా మంది చేత చెప్పించాడు. ఆయన కి అనుకూలం అయితే మరచి పోడట,ప్రతి ఫలం వుంటుందట, ఎప్పటి కైనా పనికి వస్తాడట.వ్యతిరేకం అయితే ట్రాన్స్ఫర్ బాధలు.”అమ్మ బదులు నువ్వు జడ్జి అయితే బాగుండేది నాన్నా” కొడుకు తండ్రిని మెచ్చుకుంటూ “ నాన్న చెప్పినట్టు చెయ్యమ్మా…బై..మేము కాలేజీ కెడుతున్నాం” అంటూ చెల్లెలి తో పాటు బైకు మీద వెళ్ళి పోయాడు.

కోర్టు క్రిక్కిరిసిపోయి వుంది. నిందితులు ధైర్యంగానే వున్నారు. ఏదో భరోసా.

“ఐ.పి.సి.376 క్రింద నిందితులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అయిదు లక్షల రూపాయలు జరిమానా విధించటమైనది” జడ్జిమెంట్ వచ్చింది.

నిందితుడు వినోద్ అసహనంగా, అసంతృప్తితో చూస్తున్నాడు. శిక్ష పడదనుకున్న సహ నిందితులు నమ్మలేక పోతున్నారు.

ఒక్క సారి గా అరుపులు, కేకలు “ జడ్జీ డౌన్ డౌన్” అంటూ . పోలీసుల రంగ ప్రవేశంతో సర్దుమణిగింది. అత్యాచారం చేయబడిన అమ్మాయి కళ్ళలో కొద్దిగా వెలుగు.రెండు చేతులూ పైకెత్తి నమస్కారం చేసింది.

“డబ్బులు తోనో మరో లంచం తోనో న్యాయాన్నిప్రక్కదారి మళ్ళిస్తే, రేపు మన అబ్బాయి చేసే తప్పులకి అంతు వుంటుందా? మన అమ్మాయి కే కష్టం వస్తే…” అప్పటిదాకా ముభావంగా కారు డ్రైవ్ చేస్తున్న భర్త వెంటనే స్పందించాడు

“మన అమ్మాయి మీద ఈగ వాలితే చంపి పోగులు పెట్టనూ?” అంటూ.

“ తల్లి హృదయం మీకు తెలీదు,పిల్ల ఎవరైనా స్పందన ఒకటే” మనసులో అనుకుంది వసుధ.”బహుశా నాకు వెంటనే మరో చోటికి బదిలీ రావచ్చు. కానీ నా ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాననే తృప్తి వుంటుంది” తనకి తాను చెప్పుకుంది.


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


443 views0 comments
bottom of page