top of page
Writer's pictureNarasimha Murthy Gannavarapu

ఏ వెలుగులకీ ప్రస్థానం

'Ye Velugulaki Prasthanam' written by Gannavarapu Narasimha Murthy

రచన : గన్నవరపు నరసింహ మూర్తి


ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే నా స్నేహితులందరూ అమెరికాకి ప్రయాణం కట్టారు. టోఫెల్‌ రాయడం, మంచి విశ్వవిద్యాలయాల్లో సీటుకి ప్రయత్నించడం ఇలా... కొందరు కేంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చిన ఉద్యోగాల్లో చేరిపోయారు...

నేను చదివింది మెకానికల్‌. కంప్యూటర్‌ ఉద్యోగాలు నాకిష్టం లేదు... ఏదైనా మన దేశంలోనే ఉద్యోగం చెయ్యాలన్న కోరిక...

గ్రూప్‌ వన్‌, సివిల్‌ సర్వీసెస్‌, ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌... గేట్‌ ఇలా చాలా పరీక్షలు వ్రాసాను...

కానీ వేటిలోనూ అర్హత సాధించలేక పోయాను... కాలేజీల్లో సరిగ్గా చెప్పకపోవడం ఒక కారణమైతే, నాలాంటి చాలామందికి లెక్కలు, సైన్స్‌ల్లో సరియైన జ్ఞానం లేకపోవడం...


ఎవరికైతే ఐక్యూ పది స్కేలు మీద ఏడు దాటుతుందో వాళ్ళకే ఇంజనీరింగ్‌, సైన్స్‌ బాగా పట్టుబడుతుంది అని మా ప్రొఫెసర్‌ ఒకరు చెప్పేవారు.అది నిజమేనని ఇప్పుడు తెలుస్తోంది.

ప్రైవేట్‌ ఇంజనిరీంగ్‌ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా రావడం, తల్లిదండ్రులు ప్రతీవారు తమ పిల్లల్ని ఇంజనీరింగ్‌ చదివిస్తే ఉద్యోగాలొస్తాయన్న భ్రమలో ఉండటంతో అందరూ ఇంజనీరింగ్‌పై మోజు చూపారు...


వాళ్ళకి ఐక్యూ ఉందా లేదా అని ఎవ్వరూ చూడలేదు. ప్రతీ ప్రైవేట్‌ కళాశాలలో ముప్పె శాతం యాజమాన్యపు కోటాకింద లక్షలు పోసి కావలసిన బ్రాంచ్‌లో చేరిపోవడం, ఆతరువాత హైదరాబాద్‌ వెళ్లి అమీర్‌పేట్‌లో ఏవో కొన్ని కోర్సుల్లో చేరడం... ఆ తరువాత అమెరికాకి వెళ్ళిపోవడం.

పదవతరగతి నుంచే అమెరికా వెళితే బోలెడు డబ్బులు సంపాదించవచ్చని తల్లిదండ్రులు చెప్పడం ఈ అమెరికా వలసలకి కారణం.

తొంభై శాతం ఐఐటీ విద్యార్థులు అమెరికాలోను, ఇతర దేశాల్లోనూ పనిచేస్తూ మన దేశానికి హాని చేస్తున్నారు అని నాకనిపించింది.


ఒక్కొక్క ఐఐటీ విద్యార్థి మీద ప్రభుత్వం ఏభైలక్షలు ఖర్చుపెడుతున్న విషయాన్ని వారు పట్టించుకోవటం లేదు.


అలా ఈ రాష్ట్ర యువతంతా అమెరికా బాట పట్టడంతో ఇక్కడ పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి.


వరద వచ్చినపుడు చెట్టూ, చేమతో సహా అన్నీ ప్రవాహంలో కొట్టుకుపోక తప్పదన్నట్లు నేను కూడా అమెరికా వచ్చి పడ్డాను...


రెండేళ్లు నానా బాధలు పడి ఎమ్మెస్‌ చదివాను... చాలామంది అనుకున్నట్లు ఇక్కడ విశ్వవిద్యాలయాలు అన్నీ గొప్పవి కావు... మన దేశంలో వాటి కన్నా హీనంగా ఉంటాయి.


కేవలం విదేశీ విద్యార్థుల డబ్బుమీదే ఆధారపడతాయి... అలా ఏదో చదువు ముగించి ఒక కంపెనీలో చేరాను.


చిన్నరూమ్‌లో నలుగురం ఉండేవాళ్ళం. సాయంకాలాల్లో చిన్నచిన్న పెట్రోల్‌ బంక్‌లో ఉద్యోగాలు, కొందరు కాలేజీ లైబరీల్లో, మరికొందరు రిసెప్షనిస్టులుగా ఇలా చేస్తూ చదువు పూర్తి అయిందనిపించాము...


ఇలాంటి బాధలతో చదువులు, ఉద్యోగాలు చెయ్యడానికి ఇంత దూరం ఎందుకు హాయిగా మనదేశంలో చేసుకోవచ్చు కదా అని నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని.


అమెరికా సమాజం ఎవ్వరి గురించీ పట్టించుకోదు. ప్రతీవాళ్ళు తమ వ్యక్తిగత ఎదుగుదల, డబ్బుసంపాదన, జీవితాన్ని అనుభవించడం మీదే కేంద్రీకరిస్తారు.


తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధాలు మన దేశంలో లాగ కాకుండా చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయి...


చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు పిల్లలు పెద్దయ్యేసరికి విడిపోయి ఇంకొకర్ని వివాహం చేసుకోవడంతో పిల్లలు ఇంటర్‌ తరువాత పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు.. పక్షుల్లాగన్నమాట...


మన దేశంలో విడాకులు తక్కువ కాబట్టి కుటుంబాల్లో అనుబంధాలు ఎక్కువ... ఈ విషయం అమెరికా వెళ్ళిన చాలా రోజులకి నాకు తెలిసింది.


మా అమ్మ ఒకసారి నాకు ఫోన్‌ చేసి నేను పనిచేస్తున్న కాలిఫోర్నియాలోనే మా మావ కూతురు సీత ఉన్నట్లు చెప్పడంతో ఒక ఆదివారం కష్టపడి ఆమెను కలిసాను...


అప్పటికే ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఇంకొక అమెరికన్‌తో సహవాసం చేస్తోంది. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదుట... అక్కడ మా

అత్తావాళ్ళు కూతురు అమెరికాలో హాయిగా ఉందనుకుంటూ అందరికీ చెబుతూ కలల్లో విహరిస్తున్నారు...


ఒక శనివారం నాడు నా స్నేహితుడు రవి అతని స్నేహితురాలితో పిక్‌నిక్‌ వెళ్ళాడు...


అది యాభై కిలోమీటర్ల దూరంలోని ఒక వాటర్‌ఫాల్‌ లొకేషన్‌... నన్ను రమ్మంటే పనుండటం వల్ల వెళ్ళలేదు.


ఆ అమ్మాయి విద్య కూడా మాతో చదువుకున్నదే... ఈ మధ్యనే ఆమెకుద్యోగం వచ్చింది... ఏదో హోటల్లో పనిచేస్తోంది...


తల్లిదండ్రులు ఆమెనిక్కడ చదివించడానికి చాలా డబ్బులు ఖర్చుపెట్టారని ఒక రోజు చెప్పింది...


అక్కడ మన రాష్ట్రంలో చదివితే తల్లిదండ్రుల ఆంక్షలుంటాయి. ఇక్కడ అవేమీ లేకపోవడం వల్ల వారాంతాల్లో బాయ్‌ఫ్రెండ్స్ తో ఎక్కడికో వెళుతుంటుంది. ఇక్కడ అడిగే వాళ్ళెవరూ లేరు.


సోమవారం నాడు శ్రీనాథ్‌ అని ఇంకో స్నేహితుడు ఫోన్‌ చేసి రవి ఈ రోజు ఆఫీసుకి రాలేదనీ, ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోందనీ, విద్య ఫోన్‌ కూడా పనిచెయ్యటంలేదనీ చెప్పడంతో నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళాను.


పోలీసుల సాయంతో రెండురోజుల తరువాత వాళ్ళ ఆచూకీ తెలిసింది. వాళ్ళ కారు ఒకలోయలో పడిపోయి అందులో ఇద్దరూ చనిపోయి కనిపించారు.


వారం రోజుల తరువాత వాళ్ళ డెడ్‌బాడీలను వాళ్ళ ఊళ్ళకు విమానాల్లో పంపించారు.


పిల్లలు అమెరికా వెళ్ళి తమను ఉద్దరిస్తారు అనుకున్నవాళ్ళ తల్లిదండ్రులకు ఇదొక పెద్ద శరాఘాతం వాళ్ళ నెవరు ఓదారుస్తారు...


వీటికి తోడు ప్రతీ ఆరునెలలకూ ఉద్యోగాలు మారవలసి వస్తోంది... ఉద్యోగాల్లో ఏవో సమస్యలు...


మా వాళ్ళు మాత్రం అందరికీ నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నానని చెబుతున్నారు. దూరపు కొండలు నునుపు.


బెంగుళూరుల్లోనూ, హైదరాబాద్‌లోనూ పనిచేస్తున్న మా స్నేహితుల పదివేల రూపాయల ఉద్యోగాలకీ మాకు ఏమిటి తేడా అని నేను రోజూ అనుకుంటూ ఉంటాను.


అలా అని అందరూ నాలాగే ఉంటారని కాదు. మంచి విశ్వవిద్యాలయాల్లో అంటే స్టాన్‌ఫోర్ట్‌, మెస్సచూసెట్‌, కాలిఫోర్నియా లాంటి వాట్లో చదివితే మంచి కంపెనీల్లో వస్తాయి... వాళ్ళ ఉద్యోగ జీవితాలు బాగుంటాయి…


కానీ వాళ్ళు ఓ ఇరవై శాతం మందే ఉంటారు. మిగతావారంతా నాలాంటివాళ్ళే... ఇక కార్లూ, విలాసవంతమైన జీవితం అమెరికన్‌ సమాజంలో మామూలే...


మనది పేదదేశం కాబట్టి పొదుపు చేస్తారు కానీ ఇక్కడ వాళ్ళు దీనికి వ్యతిరేకం... ఏవారం సంపాదన ఆవారాంతం ఖర్చు అయిపోవాల్సిందే...


సోమవారం నుంచీ క్రెడిట్‌ కార్డుల వాడకం మొదలవుతుంది...

కేరేపిన్‌ సమాజం... తల్లిదండ్రులు, పిల్లల ఆత్మీయ అనుంబంధాలు, భార్యాభర్తల ప్రేమలు... కుటుంబం వాటికిక్కడ ప్రాధాన్యత తక్కువ...


నేను అమెరికా వచ్చిన నాలుగు సంవత్సరాల తరువాత మా ఊరు వెళ్ళాను... అమ్మావాళ్ళు నన్నుచూసి ఎంతో గర్వపడ్దారు. అందరితోనూ మావాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడనీ, రెండు లక్షలు జీతం అనీ చెబుతుంటే నాకు చాలా సిగ్గనిపించింది.


నేను అక్కడ నెల రోజులంటానని చెప్పడంతో మా అమ్మ నాకు సంబంధాలు చూడటం మొదలు పెట్టింది. అమెరికా పెళ్ళికొడుకుని కాబట్టి చాలా సంబంధాలు రావడం మొదలైంది. ఆంధ్రాలో ఈ అమెరికా మోజెక్కువ.


ఆ సమయంలో మా మేనమావ, అత్త వచ్చారు. ...మావ ఒక పల్లెలో ఉపాధ్యాయుడు. మామకి ఒక్కర్తే కూతురు దీపాంజలి... బిఈడీ చేసి టీచరుగా పనిచేస్తోంది.

మావ ఆ రాత్రి మా నాన్నతో దీపాంజల్ని కోడలిగా చేసుకొమ్మని అడిగాడు... మా అమ్మకి ఎందుకో టీచర్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక ఆ సంబంధాన్ని వద్దంది.

మా మామ చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు. నాకైతే దీపని చేసుకోవాలనుంది. నాకు చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. కానీ అమ్మని ఎదిరించలేక పోవడం నా బలహీనత...


కానీ ఆ నెల్లాళ్ళలో ఒక్క సంబంధం కుదరలేదు... చాలా సంబంధాలు జాతకాల వల్ల తప్పిపోవడం నాకాశ్చర్యం కలిగింది.ఇంతగా చదువుకుంటున్న ఈ కాలంలో కూడా ప్రజలు జాతకాలను నమ్మడం నాకాశ్చర్యం కలిగించింది.


మళ్ళా అమెరికా వచ్చేసాను... ఆ సమయంలో కోవిడ్‌ మొదలైంది.


ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికాని కరోనా ఒక కుదుపు కుదిపింది...


అమెరికన్‌ సమాజం స్వేచ్చ, స్వాతంత్రాలకు విలువిస్తారు. దానివల్ల వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకున్నారు. అదీకాక లాక్‌డౌన్‌ ప్రకటిస్తే చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఎన్నో బాధలు పడవలసి వస్తుంది. అందుకని వాళ్ళు ప్రభుత్వపు మాటలు వినకపోవడం వల్ల ఆ వ్యాధి అమెరికా అంతటా వ్యాప్తిచెంది నాలుగు కోట్లమందికి సోకింది. పదిహేను లక్షలకు పైగా చనిపోయారు.


నాకైతే ఇండియాకి వెళ్ళిపోవాలనిపించింది కానీ చాలా రోజులు దాకా విమానాలు దొరకలేదు... రోజూ బయటకు వచ్చినప్పుడల్లా భయంవేస్తుండేది.కోవిడ్‌ వల్ల సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచాన్ని చిటికెన వేలితో శాసించే మానవుడు ఒక కంటికి కనిపించని అతి సూక్ష్మ వైరస్‌కి లొంగి పోక తప్పలేదు…కనిపించని శత్రువుతో యుద్ధంలో అలసిపోయి చాలా మూల్యం చెల్లించుకున్నాడు.

సంవత్సరం పాటు వర్క్‌ ఎట్‌ హోమ్‌... జీతాల్లో కోత విధించారు. ఈ ఉద్యోగం

ఎన్నాళ్ళుంటుందో తెలియదు. బయటకెళ్ళాలంటే భయం.

రోజూ రాత్రిపూట ఒంటరితనం ఆవహించేది. అప్పుడు అమ్మ నాన్న గుర్తుకు వచ్చేవారు... వెళ్ళాలంటే వేలమైళ్ళు...

నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను. దూరపుకొండలు... అమెరికా జీవితం ఎండమావి లాంటిది… మనిషిని ఆకర్షిస్తూ పరిగెత్తిస్తూ చివరకు మొండిచెయ్యి చూపిస్తుంది.

ఒక ఆదివారం మా దూరపు చుట్టాలింటికి న్యూయార్క్ వెళ్ళాను... అప్పటికి కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టింది.

వాళ్ళు ఇక్కడ కొచ్చి ఇరవై ఏళ్ళయిందని ఆంటీ చెప్పారు... ఆమె మానాన్నగారికి చెల్లెలు వరసవుతుంది.

వాళ్ళకిద్దరు పిల్లలు... ఇంటర్‌ చదువుతున్నారు. భోజనాలప్పుడు వాళ్ళని పరిచయం చేసింది ఆంటీ...అంకుల్‌ ఏదో కంపెనీలో పనట... అతని తెలుగు వింటే నాకాశ్చర్యం వేసింది. పూర్తిగా మరచిపోయాడట.పిల్లలకు మన తెలుగే రాదట. అంతా అమెరికన్‌ ఏక్సెంట్‌తో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు.

“అంటే! వాళ్ళకి తెలుగురాదు... ఇంక తరువాతి తరానికి అసలురాదు. కొన్నాళ్ళకు మన జాతి అంతరించి పోదా?” అని అడిగితే ఆమె నవ్వేసింది.

అలా ఎన్నో తెలుగు కుటుంబాలు మరుగున పడిపోతున్నాయి. ఈ అమెరికా ఉద్యోగాలు లక్షల మంది తెలుగువారిని మింగేయబోతున్నాయి... పెద్ద చేపకు చిన్న చేప బలి కావలసిందే అని ఎక్కడో చదివాను...

ఇలా రోజులు భారంగా గడుస్తున్న సమయంలో నా కొలీగ్‌ హెన్రీ తండ్రి చనిపోయినట్లు కబురొచ్చింది.

అతనిది కెన్యా... బ్లాక్‌... చాలా పేదరికంలో పుట్టాడు. రేసిజంని భరిస్తూ ఎన్నో కష్టాలు పడి ఉద్యోగం చేస్తుండేవాడు. తండ్రి వడ్రంగి పనిచేస్తుంటాడని అతను చెప్పాడు.

ఎంతో పురోభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే అమెరికాలో రేసిజం ఒక మాయని మచ్చ.

వాళ్లు మన దేశంలో అంటరానితనం ఉందని ఎత్తి చూపుతారు. కానీ అంతకన్నా మోరమైన రేసిజం వాళ్ళ దేశంలో ఉందన్న నిజాన్ని వాళ్ళు ఒప్పుకోరు.

ఎంత అభివృద్ది చెందినా మనిషి తన సహజ సిద్ధమైన లక్షణాలను వదులుకోడు... అసూయ, స్వార్థం, అహంకారం ఈ గుణాలు అన్ని దేశాల్లో ఉన్నాయి... చాలామంది వీటికి ముసుగు తొడుగుతారు.

హెన్రీతో నేను కూడా కెన్యా వెళ్ళాను. అది తూర్పు ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశం. హిందు మహాసముద్రం ఒడ్డున ఉంది. నైరోవీలో దిగి అక్కడి నుంచి ఐదు గంటలు కారులో ప్రయాణించి ఆ పల్లె చేరుకున్నాము.

ఆరు లక్షల చదరపు కిలోమీటర్ల అతి చిన్న దేశం. ఐదు కోట్ల జనాభా... అక్కడ చాలామంది ఎయిడ్స్‌తో చనిపోతారని విని నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడి ఆ ప్రదేశాలను, ఆ ఊరి ప్రజల్ని చూసిన తరువాత మన దేశం చాలా గొప్పదనిపించింది...

ఆఫ్రికాలో ఒక చిన్న రేకుల ఇల్లు హెన్రీది... ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు... తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబానికిప్పుడు హెన్రీయే ఆధారం...

నేనక్కడ వారం రోజులున్నాను... వాళ్ళ సంప్రదాయంలో తండ్రికి అంత్యక్రియలు చేసాడు హెన్రీ. బయలుదేరే సమయంలో తను ఇంక అమెరికా రానని చెప్పాడు హెన్రీ. అతని మాటలు నాకు

ఆశ్చర్యం కలిగించాయి.

“రామ్‌! నా కుటుంబాన్ని వదలి నేనెక్కడికీ రాను... ఇన్నాళ్ళూ మా నాన్నగారుండేవారు. ఇప్పుడు నేను అమెరికా వస్తే వీళ్ళని చూసేవారుండరు.

అమ్మకి ఒంట్లో బాగుండదు... నేను కూడా లేకపోతే మా తమ్ముళ్ళు, చెల్లెలు అనాథలవుతారు. నా స్వార్థం కోసం వాళ్ళని బలిపెట్టలేను... ఇక్కడే ఏదో చేసుకొని వీళ్ళని పోషిస్తాను.

అసలు నేను ఈ జన్మభూమిని వదలి అనవసరంగా అమెరికా

వచ్చాననిపిస్తోంది. నాన్నచనిపోయిన తరువాత కానీ తల్లితండ్రుల విలువ తెలీలేదు” అన్నాడు ఏడుస్తూ... అతన్ని ఓదార్చటం కష్టం

అయింది. ఆమర్నాడే అమెరికా వచ్చేసాను..

కెన్యానుంచి వచ్చానే కానీ హెన్రీ మాటలు నన్ను వెంటాడుతున్నాయి. ఆ రాత్రి శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను. అందులో ఒక వాక్యం నన్ను వెంటాడసాగింది.

ఏ వెలుగులకీ ప్రస్థానం? అవును... తానెందుకు అమెరికా వచ్చాడు? ఏ వెలుగుల కోసం... తనలాగే వచ్చిన హెన్రీ తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు... తన మూలాలను తెలుసుకున్నాడు. తన వేళ్ళు అక్కడే ఉన్నాయని గ్రహించాడు... వారంరోజుల సంఘర్షణ తరువాత నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు.

అసలు తాను ఎందుకొచ్చాడు? ఏం సాధిద్దామని... కేవలం డబ్బు కోసమే... అది ఎంత కష్టమో ఈ నాలుగేళ్ళలో తెలిసింది. ఈ పాటి కష్టపడితే, అక్కడ ఇంత కన్నా ఎక్కువే సంపాదించేవాణ్ణి...

ఇక్కడైతే ఎవ్వరికీ తెలియదని ఏ పనికైనా సిద్ధపడే మనవాళ్ళు అక్కడ సామాజిక హోదా అడ్డు వచ్చి ఆ పనులు చెయ్యరు.


ఏదైనా ఈ నాలుగు సంవత్సరాల అమెరికా జీవితం నాకు చాలా నేర్పింది. ఎలా బతకాలో చెప్పింది... జీవితం చాలా చిన్నదనీ, క్షణభంగురమనీ ఒక చిన్న వైరస్‌ కరోనా రూపంలో మనకి పాఠం నేర్పింది...డబ్బుకన్నా ప్రాణం, మానవ సంబంధాలు గొప్పవన్న చేదు నిజాన్ని అంతర్లీనంగా గుర్తుచేసింది. నెలరోజుల తరువాత నేను మన దేశం బయలుదేరాను. చెప్పాపెట్టకుండా రావడంతో అమ్మ నాన్న లిద్దరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అందరితోను వాళ్ళు పెళ్ళి కోసం నెలరోజుల సెలవు మీద వచ్చానని చెప్పబోతుంటే నేను వారించాను...


“అమ్మా! నేనింక అమెరికా వెళ్ళను. ఎవ్వరికీ నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పకండి. ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చేసాను కాబట్టి నాకు పిల్లనిస్తానని బహుశా ఎవ్వరూ రాకపోవచ్చు. ఇక్కడే నేనేదో

ఉద్యోగం చూసుకుంటాను. ఇకనుంచి మనందరం నేలమీద నడుద్దాం. వాస్తవాలను మాట్లాడదాం” అని చెప్పాను...


అమ్మ నాన్నలిద్దరూ నా మాటలు విని అవాక్కయ్యారు. పరీక్ష వ్రాయడానికి వెళ్ళినపుడు మామ కూతురు దీపాంజలి కలిసింది... ఆమె కూడా ఆ పరీక్ష కోసం వచ్చింది...జరిగిన విషయాలు ఆమెకు చెప్పాను...

రెండు నెలల తరువాత ఫలితాలొచ్చాయి. ఆమె సెలెక్ట్ అయింది. నేను కాలేదు...

ఆమెకు కంగ్రాట్స్‌ చెప్పి ఇంటికి వచ్చేసాను.

మళ్ళీ ఉద్యోగప్రయత్నాలు...

నాలుగునెలల తరువాతనుకుంటాను ఒకరోజు దీప నుంచి ఫోన్‌ వచ్చింది. అర్జెంటుగా తనని కలవమని, ఎక్కడ కలవాలో చెప్పింది...

అదొక చిన్న రైల్వేస్టేషన్‌... పాసింజర్లో దిగింది. కొద్ది సేపు మౌనం తరువాత

“నేను ముస్సోరి ట్రైనింగ్‌ కోసం పది రోజుల్లో బయలుదేరుతున్నాను.

సంవత్సరన్నర తరువాత పోస్టింగిస్తారు...” అని చెప్పింది.

నేను మౌనం దాల్చేను. ఈ విషయం చెప్పడానికా తనని పిల్చింది... అన్న అనుమానం కలిగింది...

“నీ భవిష్యత్తు ప్లానేమిటి?”

మళ్ళీ ఆమె అడిగింది. “ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు దీపా... గ్రూప్‌ వన్‌కు ప్రిపేర్‌ అవుదామనుకుంటున్నాను”.

“ఇంటి దగ్గర చదవడం కష్టం. ఏ ఢిల్లీకో వెళితే మంచిది”

“ఇప్పుడు ఢిల్లీకేం వెళతానులే... ఇంకో రెండుసార్లు ప్రయత్నించి ఆతరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను” అని చెప్పాను...

ఇంతలో పల్లీలవాడు వస్తే రెండు కొని ఆమెకొకటిచ్చాను.

“పోనీ నాతో ముస్సోరి వస్తావా? అక్కడ బాగా ప్రిపేర్‌ కావచ్చు” అంది...

ఆ మాటలు నాకాశ్చర్యం కలిగించి ఆమె వైపు అనుమానంగా చూసాను...

ఆమె ముఖం సీరియస్‌గానే ఉంది.

“నేనా! ముస్సోరినా! జోక్‌ చేస్తున్నావా? అక్కడికి ఇతరులను రానిస్తారా?” అన్నాను కోపంగా...

“తప్పకుండా రానిస్తారు... నన్ను పెళ్ళి చేసుకుంటే అంది నవ్వుతూ...

మొదట ఆమె మాటలు నాకర్థం కాలేదు.. ఆ తరువాత అర్థం అయి ఆశ్చర్యంగా చూసాను...

నా ముఖంలో భావాలు అర్ధం చేసుకొని “నీకిష్టమైతే చెప్పు... పెళ్లిచేసుకొని కలసి వెళ్ళిపోదాం” అంది...

“వద్దు దీపా! ఆరోజు మీ నాన్న వచ్చి అడిగినప్పుడు ఇష్టం ఉన్నా పిరికివాడినై ఆ విషయం ధైర్యంగా చెప్పలేకపోయాను...

ఇప్పుడు ఒప్పుకుంటే అంతకన్నా ఆత్మవంచన ఉండదు. నీ ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరు. నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.

సమాజానికి సేవ చేసే అవకాశం సివిల్‌ సర్వీసెస్‌లో ఎక్కువ. దాన్ని ఉపయోగించుకో... ఇక నా జీవితం అంటావా! నాది గమ్యంలేని పయనం... దారి తప్పిన బాటసారి ప్రస్థానం... ఈ ప్రస్థానం ఎక్కడికో తెలియదు... చూద్దాం ఏం జరుగుతుందో... ఏదైనా ముందుకెళ్ళక తప్పదు” అని చెప్పాను...

ఆ తరువాత మా ఇద్దరి మధ్యా మౌనం... మాటలు కరువయ్యాయి...

ఇంతలో పాసింజర్‌ వస్తున్నట్లు ప్రకటన వచ్చింది.

పాసింజర్‌ వచ్చి ఆగింది...

దీపకు భారంగా వీడ్కోలు చెప్పాను... ఆమె కళ్ళలో చెమ్మగిల్లిన నీరు...

మెల్లగా రైలు కదిలింది...

రాను రాను దీప దూరం కాసాగింది...

చాలా సేపటి వరకు ఆమె చేయి ఊపుతూ కనిపించింది.

అలా కొద్ది క్షణాల తరువాత కనుమరుగైంది.

చాలాసేపటికి నేను మామూలు మనిషినయ్యాను...

“జీవితం అంటే కాసింత నవ్వు, మరికొంత ఏడుపు, పిడికెడు ఆనందం, వీసెడంత దుఃఖం...

ఎడతెగని ప్రయాణం” ఎక్కడో నేను చదివిన వాక్యం గుర్తుకొచ్చి బాధ కలిగింది.


***సమాప్తం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి >

65 views0 comments

Comentarios


bottom of page