కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
youtube link: https://youtu.be/3bZtiMzf8O8
'Rendoo Interview' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
ఒక ప్రైవేట్ కంపెనీ లో ఇంటర్వ్యూ కోసం వెడుతుంది సంచిక.
ఆమెకది ఆరో ఇంటర్వ్యూ.
అదే ఇంటర్వ్యూ కి అటెండయిన కృతిక్ కి అది తొలి ఇంటర్వ్యూ.
ఇంటర్వ్యూ కు ముందే ఇద్దరి మనస్తత్వాలూ పరిశీలించిన బాస్ ఎవరిని ఎంపిక చేస్తాడనేది కథ చివర్లో తెలుస్తుంది.
ఈ కథను ప్రముఖ రచయిత BVD ప్రసాదరావు గారు రచించారు.
పాతిక ప్రాంతాల్లో బ్రాంచీలు కలిగిన ఒక ప్రైవేట్ ప్రోడక్షన్ అండ్ సేల్స్ కంపెనీ ఆఫీస్..
రెండు వందల ఇరవై మంది ఎంప్లాయిస్ పని చేస్తూ ఉన్నా.. ఆ ఆఫీస్ ఆవరణ అంతా చాలా కామ్ గా ఉంటుంది.. పరిశుభ్రంగా ఉంటుంది.. ఆహ్లాదకరంగా తోస్తోంది..
కారణం.. దాని హెడ్.. రాజారావు. తాను హైరానా అవ్వక.. తన కింద ఎంప్లాయిస్ ని కించపర్చక.. సంబంధిత పనులను చక్కగా చక్కపెట్టేసుకొనే నేర్పరి.
అతని కింద పని చేయడానికి ప్రస్తుత ఎంప్లాయిసే కాదు.. కాబోయ్ ఎంప్లాయిసూ ఉవ్విళులూరుతుంటారు.
వెయిటింగ్ హాలు..
కృతిక్, సంచిక.. ఒకే సోఫాలో.. ఆ చివర, ఈ చివర కూర్చుని ఉన్నారు.
ఆ ఇద్దరూ ఇంటర్వ్యూకై వేచి ఉన్నారు. ఉన్నది ఒకే ఒక పోస్టు. దానికై ఈ
ఇద్దరూ పోటీ పడబోతున్నారు.
ఇద్దరూ పీజీ సర్టిఫికేట్స్ పొందినవారే. నూట ఆరవై మంది.. రిటన్ టెస్ట్ కై హాజరైతే.. ఓరల్ కి ఈ ఇద్దరే సెలక్టయ్యారు.
రాజారావు పిలుపుకై వేచి ఉన్నారు.
ఇద్దరిలోనూ తపన బింకంగానే ఉంది.
సంచికలో అలజడి కూడా జాస్తీగా ఉంది.
అయినా నెమ్మదిగా.. దీర్ఘంగా గాలి పీల్చుకొని.. కొద్ది క్షణాల సేపు కృతిక్ ని
చూసి.. చూపు తిప్పేసుకుంది.
కృతిక్ కూడా తర్జనభర్జన అవుతున్నాడు. కానీ పొక్కనీయడం లేదు.
వీళ్లిద్దర్నీ తన ముందున్న మోనిటర్ లోంచి గమనిస్తూనే ఉన్నాడు రాజారావు -
ఆ వెయిటింగ్ హాలు లోని హై రేంజ్ టెక్నాల్జీ పరికరాల సాయంతో.
కాలం గడుస్తున్న కొద్దీ సంచిక మరింత హైరానా అవుతోంది.
మళ్లీ కృతిక్ వైపు తల తిప్పింది. ఈ మారు అతన్ని మరి కొన్ని ఎక్కువ క్షణాల సేపు చూసింది.
కృతిక్ తల దించుకొని ఉన్నాడు.
సంచిక ఇక సంభాళించుకోలేక.. కృతిక్ తో సంభాషించుటకు సాహసించింది.
'హలో.. నేను.. సంచిక..' అంది మెల్లిగా.
సంచిక వైపు తల తిప్పాడు కృతిక్.
'య..య.. ఐ నో..' అన్నాడు.
'నేను తెలుసా' అడిగింది సంచిక.
'య. కాల్ లెటర్ లో నాతో పాటు మీ పేరూ ఇచ్చారు. మనమిద్దరమే ఓరల్ కి సెలక్టర్స్ మని అందులో మెన్షన్ చేశారు. సేమ్ కాపీయే మీకూ పంపి ఉంటారుగా' చెప్పాడు కృతిక్.
'అవునవును' తడబడింది సంచిక.
అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ ఇద్దరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేశాడు.
'ఇంటర్వ్యూకి మరి కొంత సమయం పడుతుందని బాస్ చెప్పమన్నారు'
చెప్పాడు.
కృతిక్, 'థాంక్స్.' తెలియచేశాడు.
చిన్నగా తలాడించి, 'సరే.' అంది సంచిక.
ఆ వచ్చిన వ్యక్తి అక్కడ టీపాయ్ మీద.. తన చేతిలోని ఖాళీ ట్రేని పెట్టి..
వెళ్లిపోయాడు.
ఇదంతా రాజారావుకు తెలుస్తోంది.
'మౌనంగా ఉంటే టెన్షన్ గా ఉంది. మాట్లాడుకుందామా' అడిగింది సంచిక.
స్ట్రాతో డ్రింక్ తాగుతున్న కృతిక్.. ఆ పనిని ఆపి సంచిక వైపు చూశాడు.
ఆమె అతన్నే చూస్తోంది.
'నాకూ అలానే అనిపిస్తోంది. బట్.. కానీ మొగమాటమయ్యాను.'
సమాయత్తమవుతున్నాడు కృతిక్.
'నాకు ఇది ఆరో ఇంటర్వ్యూ. డిగ్రీ తర్వాత నుండే జాబ్ ట్రయిల్స్ చేస్తూనే పీజీ చేశాను. ప్చ్. ఎందులోనూ సెలక్ట్ కాలేకపోయాను.' సంచిక చెప్పుతోంది.
కృతిక్, 'ఫస్ట్ ఆ డ్రింక్ తాగండి' అన్నాడు. తను డ్రింక్ తాగడం మొదలు పెట్టాడు.
సంచిక కొద్దిగా డ్రింక్ తాగి గ్లాస్ ని టీపాయ్ మీద పెట్టేసింది.
కృతిక్ పూర్తిగా డ్రింక్ తాగేసి తన గ్లాస్ ని టీపాయ్ మీది ట్రేలో పెట్టాడు. ఆ వెంటనే సంచిక గ్లాస్ ని తీసి ట్రేలో పెట్టాడు.
సంచిక నొచ్చుకుంటోంది.
'నో రిగ్రెట్స్ ప్లీజ్' అంటూనే చిన్నగా నవ్వేడు కృతిక్.
ఇదంతా రాజారావు చూశాడు.
'నాది.. నాకిదే ఫస్ట్ ఇంటర్వ్యూ. టెన్షన్ కంటే తొలి ఎక్స్పీరియన్స్ ఎలా
ఉండబోతుందో.. అనుకుంటున్నాను' చెప్పాడు కృతిక్.
'అవునా! బట్.. నాది మాత్రం టోటలీ టెన్షనే' బిడియమవుతోంది సంచిక.
'ప్లీజ్.. కూల్' అన్నాడు కృతిక్ మామూలుగానే.
'నాన్నది చాలా చిన్న ఉద్యోగం. అమ్మతో పాటు మేము ఐదుగురం. నాకు ఇద్దరు సిస్టర్స్. నాన్న సంపాదన మూలంగా.. నన్నొకత్తెనే చదివించగలిగారు. ప్రస్తుతం మా ముగ్గురు సిస్టర్సుము పెళ్లీడు దాటి ఉన్నాం'
వింటున్నాడు కృతిక్.
'నాకు.. నిజంగా నాకు ఈ సమయంలో జాబ్ చాలా అవసరం. భయమేస్తోంది'
చెప్పడం ఆపింది సంచిక.
కృతిక్ నవ్వుతున్నాడు.
'ఎందుకు నవ్వుతున్నారు' అడిగేసింది సంచిక.
నవ్వు ఆపాడు కృతిక్. 'మరే. నేను తప్పక జాబ్ కొట్టేయగలవాడిలా
అనిపిస్తున్నానా.. డోన్ట్ వర్రీ. ఏమో.. మీరే ఈ జాబ్ కొట్టేయగలరేమో' అన్నాడు.
'చెప్పలేం కదండీ. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో. నేను ఎలా ఫేస్ చేయగలనో.. ఈ మారైనా నెగ్గగలనో.. లేదో' అలజడి అవుతోంది సంచిక.
'నోనో.. కూలవ్వండి. నాకు సబ్జెక్ట్ పర్వాలేదనిపిస్తోంది. జికే మాత్రం కొద్ది మేరకే తెలుసు. ఐనా నా పరిధిలోనే ఇంటర్వ్యూ సాగుతోందా ఏం.' అన్నాడు కృతిక్.
సంచిక మాట్లాడలేదు.
'ముందు మీరు నిశ్చలంగా ఫేస్ చేయండి. నన్ను మీరు మరీ పెద్దగా అంచనా వేసేసుకోవద్దు.' నవ్వగలిగాడు కృతిక్.
సంచిక మాత్రం నింపాది కాలేక పోతోంది.
అది గుర్తించిన కృతిక్, 'నాకు విపరీతమైనా బర్డన్స్ ఏమీ లేవు. ఐనా.. కనీస వ్యక్తిగత ఆసరాని సమకూర్చుకోవాలిగా. అందుకు అవకాశాన్ని తప్పనిసరిగా వెతుక్కోవాలిగా.' చెప్పాడు.
సంచిక తల దించుకొని.. తన నేల చూపులను తచ్చాడిస్తోంది.
'నాకు సరిపడ్డ ఆసరా దొరికితే చాలు.. దానికి మించింది కోరుకోను.'
చెప్పుతున్నాడు కృతిక్.
సంచిక వింటుంది.
'సో.. ఈ అవకాశాన్ని విడిచి పెట్టుకోలేను.. సారీ.. ఎట్ ప్రజెంట్.. మీకు నేను సాయపడలేను.. తప్పుకోలేను'
'వాట్' ఆశ్చర్యమయ్యింది సంచిక.
'య. మీరు తెల్పిన మీ స్థితికి నేను చలించలేను.. కరిగిపోయేది లేదు కూడా.'
'ఏం మాట్లాడుతున్నారు' గడబిడవుతోంది సంచిక.
కృతిక్ మాట్లాడబోయాడు.
'చాలు.. నేను.. నాకు ఈ జాబ్ రావడం అవసరం.. అన్న సెన్స్ తోనే నా గురించి సాధారణంగా ప్రస్తావించానే తప్పా.. మిమ్మల్ని ఈ అవకాశం నుండి తప్పుకోమని కాదు.. అర్థించుకోవడం అంతకన్నా కాదు' రుసరుసలాడుతోంది సంచిక.
కృతిక్ జంకాడు.. తగ్గాడు.
మూడు నిముషాల పాటు.. వాళ్ల మధ్య మౌనం చోటుచేసుకుంది.
ఈ లోగా రాజారావు సర్దుకున్నాడు. కృతిక్, సంచికలని పిలిపించుకున్నాడు.
రెండు నిముషాల తర్వాత..
తన ఎదురుగా.. కుర్చీల్లో కూర్చున్న కృతిక్, సంచికలని చూస్తూ..
'వెల్. మీ ఇద్దరికీ రిటన్ టెస్ట్ లో ఒకేలా మంచి మార్కులు వచ్చాయి. సో. ఓరల్ టెస్ట్ ని కూడా మీ ఇద్దరికీ ఒకే మారు నిర్వహించతలిచాను.' చెప్పాడు రాజారావు.
కృతిక్, సంచిక విన్నారు.
'సబ్జెక్ట్ పరంగా ఇద్దరూ బాగనిపించారు. సో, ఓరల్ లో వాటి ప్రస్తావన తేను.. మీ ఆటిట్యూడ్ లెవెల్స్ తెలుసుకోతలిచాను.. బట్.. నా ప్రమేయం లేకుండానే మీరే బయట పడ్డారు.. సో.. మీ ఆటిట్యూడ్ లెవెల్స్ తెలుసుకోగలిగాను కూడా..'
కృతిక్, సంచిక టక్కున తలలు తిప్పి.. మొహాలు చూసుకున్నారు. పిమ్మట రాజారావుని చూస్తున్నారు.
'య. సంచిక.. తనకు ఒక అవసరంగా ఈ జాబ్ ని భావిస్తుంది.. కృతిక్.. తనకు ఒక అవకాశంగా ఈ జాబ్ ని భావిస్తున్నాడు.. యామై కరక్ట్..' చెప్పడం ఆపాడు రాజారావు.
కృతిక్, సంచిక తొట్రుబాటవుతున్నారు.
'మీరు ఔనన్నా కాదన్నా.. నా స్టేట్ మెంట్ మాత్రం కరక్టు. కారణం.. వెయింటింగ్ హాలులో ఉండగా.. మిమ్మల్ని.. మీ మాటల్ని.. నేను సమకూర్చుకున్న టెక్నాల్జీ పరంగా.. చూడగలిగాను.. వినగలిగాను' చెప్పాడు రాజారావు.
'సార్.. నేను.. నాకు వచ్చిన అవకాశంకై ప్రయత్నిస్తుంటే.. సంచిక.. తన
అవసరంకై ఈ జాబ్ కి పోటీ ఉండకూడదని తలుస్తోంది.' తొలుత కృతిక్ మాట్లాడేడు.
'సారీ కృతిక్.. అది మీ ధోరణి మాత్రమే. సంచిక.. తన అవసరాన్ని తను
అందుకోలేనోమో అన్న సందిగ్ధ అవస్థలో ఉన్నా.. తను మాత్రం సామాన్యంగానే మాట్లాడింది. తుదికి మీ ఉద్దేశ్యంని ఖండించింది కూడా.'
కృతిక్ ఏమీ అనలేదు.
'అవును సార్.. నాలో ఆ తలంపే లేదు.. రాదు కూడా' చెప్పింది సంచిక.
'సబ్జెక్ట్ లెవెల్స్ లో మిమ్మల్ని ఆక్షేపించలేను.. బట్.. నాతో కలిసి ఇక్కడ జాబ్ చేసేవారికి.. అంచనా, సంయమనం ఉండాలి.. కావాలి కూడా. ఆ లెక్కన.. నా ఎంపిక ఏమిటో.. మీరే గ్రహించండి.. గుర్తించండి.. చెప్పండి.' చెప్పడం ఆపేడు రాజారావు.
తర్వాత..
'యస్సార్.. మీక్కావలసిన రిక్వేర్మెంట్ కి నేను సరితూగను.. సంచిక చక్కగా సరిపోతోంది..' చెప్పాడు కృతిక్.
'గుడ్.. బ్రేవ్ కృతిక్.. నెక్స్ట్ టైం బెటర్ లక్.. నీ రెండో ఇంటర్వ్యూ.. నీ సక్సెస్ గా మిగిలిపోవాలని విష్ చేస్తున్నాను.' అంటూ లేచి.. తన కుడి చేతిని ముందుకు చాచాడు రాజారావు.
కృతిక్ కూడా లేచి.. ఆ చేతిని అందిపుచ్చుకొని.. షేక్ హేండ్ ఇచ్చాడు,
మృదువుగా.
***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.