top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

మూడు తరాల ప్రేమ


'Mudu Tharala Prema' New Telugu Story


1960

అతడు : ప్రియా....

ఆమె : ప్రియతమా....

అతడు : మా ఇంట్లో మన ప్రేమ గురించి చెప్పాను . ఒప్పుకున్నారు..

ఆమె : నిజంగా?ఎంత శుభవార్త చెప్పావు ఈరోజు. ఎలా ఒప్పించావు వాళ్ళను ?

అతడు : నిన్న ఏమైందో తెలుసా...రాత్రి భోజనాల సమయంలో నాన్నగారితో మన విషయం చెప్పాలనుకున్నాను ..

'నాన్నగారూ ! మీతో ఓ విషయం చెప్పాలి .' అంటూ ప్రారంభించాను .

నాన్న : చెప్పరా ! ఏమిటి విషయం ?

నేను : ........

నాన్న : భయపడకురా . ఈ మధ్య ప్రక్కయింటి రామనాధంగారి అమ్మాయి సావిత్రి తో కాస్త ఎక్కువ మాట్లాడటం నా కంట పడింది . ఆ రామనాథంతో మనకు ప్రహరీ గోడ తగాదాలు ఉన్నాయి . కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది . అయినా వాళ్ళు వచ్చి సంబంధం అడిగితే కాదని చెప్పను.

అతడు : ఇదీ జరిగిన విషయం . ఇక నువ్వు మీ ఇంట్లో విషయాన్ని చెప్పు.

సావిత్రి : ధైర్యం చాలడం లేదు . కానీ ప్రయత్నిస్తాను.. రేపు కలిసినప్పుడు ఏంజరిగిందీ చెబుతాను..

అతడు : సరే . శుభవార్తకోసం ఎదురు చూస్తుంటాను..


మరుసటి రోజు


అతడు : ప్రియా!

సావిత్రి : ప్రియతమా!

అతడు : నీ ముఖం కళ తప్పింది . ఏంజరిగింది ? "

సావిత్రి : నిన్న మా ఇంట్లో జరిగిన విషయం చెబుతాను . రాత్రి భోజనాలయ్యాక నాన్న గారు వరండాలో పచార్లు చేస్తున్న సమయంలో నెమ్మదిగా అయన వద్దకు వెళ్ళాను .

నేను : నాన్నగారూ !

నాన్నగారు : చెప్పు తల్లీ !

నేను : మీరు కోప్పడనంటే ఓ విషయం చెబుతాను .

నాన్నగారు : విషయం వింటేగాని కోప్పడతానో లేదో చెప్పలేను . అయినా చెప్పు .

నేను : ఈ మధ్య మన ప్రక్క ఇంటి జగన్నాధం గారి అబ్బాయి సత్యమూర్తి తో కాస్త పరిచయం అయింది .పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాము. . వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారట . మీరు వెళ్లి మాట్లాడితే సంబంధం ఖాయం చేస్తారట .

నాన్నగారు : ప్రహరీ గోడ అర అంగుళం వాళ్ళ భాగంలోకి వెళ్లిందని కోర్టుకెక్కాడు ఆ జగన్నాధం . వాళ్లతో వియ్యం కుదరదు .నేను ఒప్పుకోనని తెలిసే నన్ను వచ్చి అడగమన్నాడు. . ప్రాణం పోయినా వాళ్ళను బ్రతిమలాడను. ఇక నువ్వు ఈ విషయం వదిలెయ్యి..

నేను : మరొక్కసారి ఆలోచించండి నాన్నగారూ .

నాన్నగారు : ఆ జగన్నాధం వచ్చి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలితే , అప్పుడు ఆలోచిస్తాను .

సావిత్రి : ఇదీ జరిగిన విషయం .

సత్యమూర్తి : అయితే మనం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందాం .

సావిత్రి : ఆమ్మో ! అలా చేస్తే ఇంకేమైనా ఉందా? నాన్నగారి పరువు పోదూ?

సత్యమూర్తి : ఇది 1960 వ సంవత్సరం . ఇంకా పెద్దల కోసం పిల్లల ప్రేమ బలైపోవలసిందేనా ? అయినా మా నాన్నగారికి ఉన్న అవగాహన మీ నాన్నగారికి లేదు .

సావిత్రి : అదేంకాదు.. మా నాన్నగారు ఒప్పుకోరని తెలిసే మీ నాన్నగారు ఆలా చెప్పారట .

సత్యమూర్తి : పెద్దల సంగతి కొంతసేపు పక్కన పెడదాం . నేనంటే నీకు , నువ్వంటే నాకు ఇష్టం . ఇద్దరం పెళ్లి చేసుకుందాం .

సావిత్రి : మీకేం. ఎన్నైనా చెబుతారు . కానీ మా నాన్న గారు ఏమైనా చేసుకుంటే నేను జీవితాంతం బాధ పడాలి . అది నేను భరించ లేను . దయ చేసి నన్ను మరిచి పోండి.

**************************************************

1990

అతడు : ప్రియా!

ఆమె : ప్రియతమా!

అతడు : మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేద్దాం . అవసరమైతే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందాం . ఏమంటావు ?

ఆమె : నిజానికి నిన్న రాత్రే అమ్మతో ఈ విషయం మాట్లాడాను .

అతడు : అవునా ! ఏమన్నారు ఆవిడ ? వివరంగా చెప్పు .

ఆమె : రాత్రి భోజనాలయ్యాక అమ్మే నన్ను పలకరించింది .'ఈ మధ్య బాగా పరధ్యానంగా ఉంటున్నావు . చూపులు ఎక్కడో ఉంటున్నాయి . ఎదో వంకతో పక్కింటి సత్యమూర్తి గారి అబ్బాయి శ్రీధరం తో మాట్లాడుతున్నావు . కాస్త జాగ్రత్తగా వుండు .'అంది .

నేను : నిజమే అమ్మా! నేనే నీతో మాట్లాడుదామనుకుంటున్నాను . ఇంతలో నువ్వే అడిగేశావు. .నాకు శ్రీధరం అంటే ఇష్టం. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు . పెద్దల అనుమతితో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. . చిన్నప్పుడే నాన్నను పోగొట్టుకున్న నన్ను అన్నీ నువ్వే అయి పెంచావు . నీ అనుమతి లేకుండా ఈ పెళ్లి చేసుకోను .

ఆమ్మ :నాకు తెలుసమ్మా ! నువ్వు నా మాట జవదాటవు . అలాగే నేనూ నీ ఇష్టాన్ని కాదనను . వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే నాకేమి అభ్యంతరం లేదు . అయినా ఒకమాట మీ తాతగారిని కూడా అడుగుదాం .

రామనాధం : నాదేముందమ్మా ! అయినా ప్రేమించిన వాళ్ళను విడదీస్తే ఆ పాపం ఊరికే వదలదు . అవసరం అయితే వాళ్ళ కాళ్ళు పట్టుకునయినా ఈ సంబంధం కుదుర్చుకుందాం. .

ఆమె: ఇదీ జరిగిన విషయం .ఇ క మీ ఇంట్లో ఒప్పించడమే తరువాయి. .

శ్రీధరం : ఆలా అయితే ఇంకేం .ఈ రోజు రాత్రికే ఇంట్లో ఈ విషయం మాట్లాడతాను.

ఆమె:శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాను.

******************************************

మరుసటి రోజు

శ్రీధరం :ప్రియా!

ఆమె : ప్రియతమా! ఈరోజు అదోలా వున్నావు. నిన్న ఏంజరిగింది? నాకు చాలా ఆతృతగా వుంది. తొందరగా చెప్పు.

శ్రీధరం :నిన్న రాత్రి నాన్నగారిని అడిగాను . జరిగింది చెబుతాను, విను.

నేను : నాన్నగారూ! ఒక విషయం మాట్లాడాలి.

సత్యమూర్తి : జరుగుతున్న విషయాలు చూచాయిగా తెలుస్తున్నాయి. నువ్వు పక్కింటి రామనాధంగారి మనవరాలు శ్రీలక్ష్మి అంటే ఇష్టపడుతున్నావు. . కానీ వాళ్లకూ, మనకు సరిహద్దు తగాదాలు వున్నాయి . ఆ రామనాధం మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు . కావాలంటే మీ తాతగారిని అడుగు .

జగన్నాధం : అవున్రా శ్రీధరం . లోగడ మనం తగ్గివచ్చినా అయన పైచూపులు చూసాడు . ఉత్త గొడవల మనిషి . మీ నాన్నను చాలా ఇబ్బంది పెట్టాడు . వాళ్లతో వియ్యం వద్దు.

శ్రీధరం : ఇదీ జరిగింది . ఏంచేద్దామంటావు ?

శ్రీలక్ష్మి : వాళ్ళు చెప్పింది చెప్పావు సరే . నువ్వేమన్నావు ? అది చెప్పు .

శ్రీధరం : మన పెద్దల మధ్య ఇంత కోపాలు ఉన్నట్లు నాకు తెలీదు . వాళ్ళను ఎదిరించి బాధపెట్టడం మంచిది కాదనిపిస్తుంది. .

శ్రీలక్ష్మి : మరొకసారి ఆలోచించు శ్రీధరం . మనం స్వతంత్రంగా బ్రతకలేమా ?

శ్రీధరం :ఒక్కసారి ఆలోచించు శ్రీలక్ష్మీ . ఒకవేళ మీ ఇంట్లో మీ అమ్మగారు ఒప్పుకోకుంటే నువ్వేమనేదానివి ?

శ్రీలక్ష్మి :నిజమే శ్రీధరం. అప్పుడు నేనూ నీలాగే ఆలోచించేదాన్ని.ఇక ఉంటాను.

************************************************

2020

అతడు: ప్రియా !

ఆమె : ప్రియతమా !

అతడు: సంవత్సరంగా 'ప్రియా ప్రియతమా' ల తోనే సరిపెట్టుకుంటున్నాం .మన ఈడు వాళ్ళందరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు.

ఆమె : అప్పటికి మీరేమో చొరవ తీసుకుంటుంటే నేను వెనకడుగు వేస్తున్నట్లు బడాయి .చెప్పండి . ఎక్కడికి వెడదాం? ఏంచేద్దాం ?

అతడు : నిజమే.నీకు నేనంటే చాలా నమ్మకం , ప్రేమ . నిన్ను పెళ్లి చేసుకోకుంటే నా జీవితానికి అర్థం లేదు . అందుకే నిన్న రాత్రే ఇంట్లో ఈ విషయం మాట్లాడాను .మన పెళ్ళికి ఒప్పుకున్నారు .

ఆమె : నిజంగా! చాలా సంతోషంగా వుంది . కాస్త వివరంగా చెప్పు.

అతడు: రాత్రి నాన్నగారి దగ్గరకు వెళ్లి, 'నాన్నగారూ! మీతో ఓ విషయం మాట్లాడాలి 'అన్నాను .

నాన్నగారు : చెప్పు అభినయ్ . నవ్యను ప్రేమించే విషయమేనా?

నేను :అవును నాన్నగారూ . మీరు అనుమతిస్తే నవ్యను పెళ్లి చేసుకుంటాను

నాన్నగారు : శ్రీలక్ష్మి గారి అమ్మాయి నవ్య తో నువ్వు కలిసి తిరగడం నా కంట్లో పడింది . అప్పుడే మీ పెళ్లి చేయాలని అనుకున్నాను . నువ్వు ఈ విషయం తేకపోయి ఉంటే నేనే అడిగేవాడిని . నవ్య చక్కగా ఉంటుంది .నీకు తగిన అమ్మాయి .

అభినయ్ : ఇదీ జరిగిన విషయం . ఇక మీ ఇంట్లో మాట్లాడటమే తరువాయి . నీవల్ల అవుతుందా ? లేక నన్నే వచ్చి మాట్లాడమంటావా ?

నవ్య : అంత అవసరం లేదులే . నాక్కూడా కాస్తో కూస్తో ధైర్యం వుంది .రేపు శుభవార్తతో వస్తాను చూడు .

అభినయ్ :ఎదురు చూస్తుంటాను .

*********************************

మరుసటి రోజు

అభినయ్ : ప్రియా!

నవ్య : ప్రియతమా!

అభినయ్ : శుభవార్తతో వస్తానన్నావు.కానీ నీ ముఖంలో ఎప్పుడూ ఉండే చిరునవ్వు కూడా లేదు . ఏమైంది?

నవ్య : రాత్రి అమ్మతో ఈ విషయం మాట్లాడాను .'ఆ ఇంటి వాళ్లతో సంబంధం వద్దు. ఆ శ్రీధరం గానీ, వాళ్ళ నాన్న సత్యమూర్తి గానీ పూర్తిగా స్వార్ధపరులు . గతంలో మనల్ని చాలా కష్టపెట్టారు.' అంది .

అభినయ్ : మరి నువ్వేమన్నావ్ ?

నవ్య : ఏమీ చెప్పలేదు . కానీ అమ్మను బాధ పెట్టే పని ఏదీ చెయ్యను .

అభినయ్ : పెద్దవాళ్ళ పంతాలకోసం మనం ఎందుకు విడిపోవాలి ? మనమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం . వాళ్ళ గొడవలతో మనకు పని లేదు . వాళ్ళను ఎదిరిద్దాం .

నవ్య : ఎదిరించాల్సిన అవసరం లేదు .మీ నాన్నగారు క్షమార్పణ చెబితే అన్ని సమస్యలూ సర్దుకుంటాయి. .

అభినయ్ :ఏం మాట్లాడుతున్నావ్ నవ్యా నువ్వు ? పాత విషయాలు మనసులో పెట్టుకుని మనల్ని విడదీయాలని చూసినందుకు మీ అమ్మగారు ముందుగా క్షమార్పణ చెప్పాలి.

నవ్వ : అంటే తప్పు చేసిన వాళ్ళు దర్జాగా ఉండాలి కానీ బాధ పడ్డవాళ్ళు సారీ చెప్పాలి . ఇదెక్కడి న్యాయం?

అభినయ్ : ఎంత పంతం ? విడిపోవడానికైనా సిద్ధం కానీ ఒక మెట్టు కూడా తగ్గని వంశం మీది . అలాంటప్పుడు విడిపోవడమే మంచిది . బై .

*******************************

పార్క్ లో కూర్చుని వున్నారు నవ్వ , అభినయ్ .

వాళ్ళ ఎదురుగా జగన్నాధం , రామనాధం వున్నారు .

ముందుగా రామనాథం ప్రారంభించాడు .

"సమస్యలన్నిటికీ మూల కారణం నేను . జగన్నాధం పెళ్ళికి ఒప్పుకున్నా అహంకారంతో అడ్డుకున్నాను . మా అమ్మాయి సావిత్రికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశాను . మనవరాలు శ్రీలక్ష్మి పుట్టిన కొన్ని రోజులకే అల్లుడు మరణించాడు . నేనే ఎంతో కస్టపడి కూతురినీ , మనవరాలినీ పోషించాను . శ్రీ లక్ష్మి శ్రీధరాన్ని ఇష్టపడడం తెలుసుకొని నేనూ , సావిత్రి సంతోషంతో ఒప్పుకున్నాము . జరిగిన తప్పును ఈ విధంగానైనా సరిదిద్దుకుందామనుకున్నాను. కానీ దురదృష్టం కొద్దీ ఈసారి అటువైపు నుండి అ భ్యంతరం వచ్చింది " అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు .

తరువాత జగన్నాధం ప్రారంభించాడు.

"రామనాధం తో సరిహద్దు వివాదాలు వున్నా 1960 లోనే పిల్లల ప్రేమ వివాహానికి ఒప్పుకున్నవాడిని నేను . కానీ అదే నేనూ , నా కొడుకు సత్యమూర్తి 1990 లో శ్రీలక్ష్మి , శ్రీధరాల పెళ్ళికి ఒప్పుకోలేదు.. కారణం కేవలం పంతం.

ఇప్పుడు ఈ 2020 సంవత్సరంలో శ్రీ లక్ష్మి పంతం మిమ్మల్ని విడదీస్తోంది.

ఈ తరంలోనైనా పంతం మీద ప్రేమ గెలవాలి .

అందుకే తొంభై ఏళ్ళు దాటిన మేమిద్దరం ఒక నిశ్చయానికి వచ్చాము .

నేను రామనాధం ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడి క్షమార్పణ అడుగుతాను .

అలాగే రామనాధం మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి కాళ్ళమీద పడి క్షమార్పణ అడుగుతాడు .

ఇందులో మేము సిగ్గు పడాల్సిందేమీ లేదు .మేము చేసిన తప్పుకు కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుంది . బహుశా మేము ఇంతకాలం బ్రతికి వున్నది మిమ్మల్ని కలపడానికేననిపిస్తోంది." అంటూ తన నిర్ణయం చెప్పాడు జగన్నాధం .

అంగీకారంగా తల ఊపాడు రామనాధం .

సంతోషంతో వాళ్ళ పాదాలకు నమస్కరించారు నవ్వ , అభినయ్ లు.

**************** శుభం ****************



177 views0 comments

コメント


bottom of page