top of page

ఎ టిపికల్ లవ్ ఛాలెంజ్


A Typical Love Challenge Written By Pratapa Venkata Subbarayudu

రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు


పారే నదిలో ముంచి తీసిన ఎర్ర గులాబి ఎలా ఉంటుందో అలా ఉంటుంది రమణి. పైపెచ్చు కింది పెదవికి కొద్దిగా కిందివైపు కుడివైపున ఉన్న కంది గింజంత పుట్టుమచ్చ ఆమె అందానికి దిష్టి చుక్కలా నిలిచి ఆ అందాన్ని ద్విగుణీకృతం చేస్తూంది. మగపుట్టుక పుట్టిన వాడెవడైనా ఒక్కసారి రమణిని చూస్తే అలా చూస్తూ ఉండిపోతాడు. తప్పనిసరిగా అక్కడి నుంచి కదలాల్సివస్తే సెల్ ఫోన్లో ఒక్క క్లిక్ తీసుకుని కనీసం క్షణ క్షణానికీ చూసుకోవచ్చన్న చిటికెడు సంతోషంతో భారంగా అడుగులేసుకుంటూ వెళతాడు. రమణి చేయి పట్టుకోడానికి ఎంతమంది తహ తహలాడినా, ఇద్దరు అందగాళ్లు, ఆమెకి ఈడు జోడూ తగినవాళ్ళయిన రమేష్, రాకేష్ అనే కోడె కుర్రాళ్లు మాత్రం తమ నిష్కల్మష ప్రేమతో, ఆమెపట్ల ఉన్న అంతులేని అభిమానంతో ఆమె కను సన్నల్లోకి రాగలిగారు. ఓ మాఘ పున్నమి రోజు రాత్రి రమణి వాళ్లిద్దరినీ హుస్సేన్ సాగర్ రెయిలింగ్ కు దగ్గరగా ఉన్న బెంచిమీద సమావేశ పరచి- "మీ ఇద్దరూ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. అందంగా ఉన్న నా వెంట ఇప్పటిదాకా ఎంతోమంది పడ్డారు. వాళ్లందరిలో నాకు మీరిద్దరిదే నిఖార్సయిన ప్రేమ అనిపించింది. అయితే ఇద్దరినీ చేసుకోడానికి నేనేం పురాణ పతివ్రతను కాదు. మామూలు ఆడదాన్ని. మనిషి బతకడానికి తిండి, బట్ట, ఇల్లులాంటి వాటితోబాటు ఎన్నో అవసరాలని తీర్చే కరెన్సీ అంటే నాకు ఇష్టం..కాదు కాదు ప్రాణం. మానాన్నో పచ్చి తాగుబోతు. చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా వచ్చేదంతా తాగుడుకు తగలేసి మా బతుకుల్ని దిన దిన గండం చేశాడు. తిండి లేకుండా నేనూ మా అమ్మా ఎన్ని రోజులు కృష్ణ నీళ్లు తాగి పడుకున్నామో మా ఇంటిగోడలు, రూఫ్ నిశ్శబ్దంగా చూస్తూనే ఉండేవి. ఒక్కోసారి మా ఇద్దరికీ చచ్చేంత విరక్తి కలిగేది. ఒకసారి భూమ్మీదకొచ్చింతర్వాత చావడానికీ దమ్ముండాలి. అది మా ఇద్దరికి లేదు. ఉన్నదల్లా భవిష్యత్తు అందంగా ఉంటుందని మనసుకు మత్తుమందిస్తూ మొండిగా బతికేవాళ్లం. శారీరకంగా ఎదుగుతున్నప్పుడు వయసు నన్ను ఒంపు సొంపులు, వయ్యారాలతో తీర్చి దిద్దుతుంటే, అందర్నీ ఆకర్షిస్తూండే నా అందమే అందమైన భవిష్యత్తుకు పునాది అనిపించింది. ప్రేమలు తత్సంబంధమైన కథలు, కవితలు, కాకరకాయలు అన్నీ ట్రాష్. నిజ జీవితంలో మనకు లైలామజ్నూ, సలీం అనార్కలి, దేవదాసు పార్వతులు హై గ్లో లైట్ వేసుకు వెతికినా కనిపించరు. అయినా ప్రేమ అన్నం పెట్టదు. కథలు కాగితాల్లోని సుఖ, సౌకర్యవంతమైన నిజ జీవితాన్నివ్వవు. ఆకర్షణతో ఒకటయ్యే వాళ్లు తర్వాత తిట్టుకుని, కొట్టుకునీ విడిపోతుంటారు. ఎన్ని ప్రేమ విషాద కథలు పేపర్లలో పరచుకోలేదు? మనం ఎలా, ఎందుకు భూమ్మీదకు వచ్చామో తెలీదు. వచ్చినందుకు తృప్తిగా అనుభవించాలి. ప్రేమని అందంగా అనుభూతించడానికైనా డబ్బు కావాలన్నది వాస్తవం. అంచేత మీ ఇద్దరికీ నేను ఐదేళ్ల టైమ్ ఇస్తున్నాను. ఐదేళ్లలో పేరుతోపాటు డబ్బు సంపాదించుకోడంలో ఎవరు ముందుంటారో వాళ్లదే ఈ రమణి. నా అందంతో మిమ్మల్ని ఛాలేంజ్ చేస్తున్నాను. ఒకవేళ ఒకరికి నేను దక్కి మరొకరికి దక్కకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే మీరప్పటికే ఒక స్థాయిలో ఉంటారు కాబట్టి. అందుచేత ఇది సేఫ్టీ ఛాలేంజే! మీ ఇద్దరికీ అడ్వాన్స్ గా, నా ఆబ్సెన్స్ లో మిమ్మల్ని ప్రొవోక్ చేస్తూ ఉండేందుకు ఈ వెన్నెల్లో టాంక్ బండ్ తథాగథుడి సాక్షిగా ఓ వెచ్చటి ముద్దును అడ్వాన్స్ గా ఇస్తున్నాను"అని వాళ్ల దగ్గరగా వెళ్లి నుదుటిపై తియ్యని వెచ్చని ముద్దును ముద్రించింది. "అన్నట్టు మీరొచ్చేలోపల ‘నాకు పెళ్లయిపోతుందేమో, మిమ్మల్ని మోసం చేస్తానేమో’ అన్న బెంగొద్దు. ఎందుకంటే తాగుబోతైన మా నాన్నకి కట్న కానుకలిచ్చి నా పెళ్లి చేసేంత సీన్ లేదు. ఈ అందమైన శరీరాన్ని ఆబగా చూస్తారు తప్ప, అప్పనంగా పెళ్లి చేసుకోడానికి ఏ మగాడూ ముందుకు రాడు. నాదీ గ్యారంటి. ఇన్నేళ్లు అడవిలో పారిజాతంలా గడిపిందాన్ని ఇంకో అయిదేళ్లు నా సుఖం కోసం అలాగే గడపలేనూ, గడుపుతాను. ఐ విష్యూ ఆల్ ది బెస్ట్" అని రెయిలింగుకి సమాంతరంగా నడచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయిందేగాని ఆమె పెట్టిన ఘాఢమైన ముద్దు వాళ్లని చాలాసేపు కదలనివ్వలేదు. చంద్రుడు ఆకాశపు నడి మధ్యకి చేరుకున్నప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎవరింటికి వారు భారంగా అడుగులేశారు.

***

ఐదేళ్లు పూర్తయ్యాయి. మాఘ పున్నమి. వెన్నెల చీకట్లను తరుముతోంది. రమేష్ రమణిని కలవడానికి వెళ్తున్నాడు. అతని మనసంతా అలజడి. తనలానే రాకేష్ కూడా రమణి దగ్గరకి వస్తూంటాడా? ఒకవేళ అతను తనకన్నా ముందుంటే ఆమె తనకోసం ఎదురుచూద్దామంటుందా? లేక తనే ముందెళితే తన ఆతృత చూసి ఐదేళ్ల తర్వాత తనమీద అంత ప్రేమతో వచ్చిన తననే వరిస్తుందా? ఆలోచనలు మెదడును విశ్రాంతి తీసుకోనివ్వకుండా గింగిరాలు తిరుగుతున్నాయి. నిండుపున్నమి చంద్రుడికీ వాళ్లిద్దరిలో రమణి ఎవరికి సొంతమవుతుందన్న ఆత్రుత ఉన్నట్టుంది, మబ్బుల్ని తననుంచి దూరంగా తరిమేసి మరీ చూస్తున్నాడు. తన చుట్టూ ఎన్నో ప్రేమకథలు ఊపిరిపోసుకున్నాయి. ఈ ప్రేమకథ ముగింపు ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తితో ఉంది హుస్సేన్ సాగర్. ఐదేళ్ల క్రితం తాము కలిసిన ప్రదేశానికి చేరుకున్నాడు రమేష్. అక్కడికి కాస్త దూరంలో ఓ పెద్ద తెల్లకారు ఆగి ఉండి, దానికి ఆనుకుని ఉన్న డ్రైవర్ కనిపించగానే కోపంతో రమేష్ పళ్లు పట పటలాడాయి. దూరంగా ఒకరినొకరు గాలికూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకుని కనిపించారు రమణీ రాకేష్ లు. రమేష్ తన చేతిలో ఉన్న పేపర్ ను ముద్దగా చుట్ట చుట్టి సాగర్లోకి విసిరేసాడు, అయినా కసి తీరక దాన్ని మళ్లీ చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చింపి టాంక్ బండ్ లోకి విసిరేశాడు. చిన్న స్టార్టప్ కంపెనీగా ఐదేళ్ల క్రితం ప్రారంభమైన రమణీ సాఫ్ట్ సొల్యూషన్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ అయిదేళ్లలో అనూహ్య స్థాయికి చేరుకున్న కథనంతో పాటు రాకేష్ ఇంటర్వ్యూ ఉన్న లార్జెస్ట్ సర్క్యూలేటేడ్ డైలీ అది..అనూహ్యంగా అందులోనే రమేష్ ఫోటోతో, అతను రాసిన ఓ కథ! ప్రేమ ఫలించిన ప్రేమికుల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా వెన్నెల్లో చిరు నవ్వులు చిందిస్తున్నాడు బుద్ధభగవానుడు. ***


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.



54 views1 comment
bottom of page