top of page

ఆ ఇల్లు ఈ ఇల్లు


'Aa Illu Ee Illu' New Telugu Story


Written By Ch. C. S. Sarma



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పోర్టికోలో కారును నిలిపి ధర్మరాజు వరండాలో ప్రవేశించాడు. ముఖద్వారం దగ్గర వారి సతీమణి సిరి ఓరకంట వారిని చూస్తూ నిలబడి వుంది.


ద్వారాన్ని సమీపించి ధర్మరాజు సిరి ముఖంలోకి చూచాడు. వ్యంగ్యంగా నవ్వుతూ సిరి.. ‘‘అయ్యగారి రాక ఎక్కడనుండి?..’’ అడిగింది.


‘‘మా అమ్మగారి ఇంటి దగ్గరనుంచి..’’

‘‘పొద్దున ఏడుగంటలకు వెళ్లారు.. ఇపుడు టైమ్‌ సాయంత్రం నాలుగు..’’


‘‘తెలుసు!..’’

‘‘ఇంతసేపు అక్కడ వెలగబెట్టిన రాచకార్యం ఏమిటో!..’’ హేళనగా అడిగింది సిరి.


‘‘అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లవలసి వచ్చింది!..’’ సహనంతో జవాబిచ్చాడు ధర్మరాజు.


‘‘అమ్మ.. అమ్మ.. అమ్మ.. ఎందుకో అంత అమ్మ పిచ్చి.. తమ్ముడొకడున్నాడుగా.. ఆరడుగులు పైకెదిగి.. వారు ఏంచేస్తున్నట్టో..’’ వ్యంగ్యంగా అడిగింది సిరి.


‘‘రాఘవ వూర్లో లేడు..” ధర్మరాజులో సహనం సతమతమవుతోంది. కళ్లు ఎర్రబడ్డాయి. క్షణం సేపు భార్య ముఖంలోకి నిరసనగా చూచి తన గదిలోనికి వెళ్లిపోయాడు..


పొరుగింటి శశమ్మ.. వరుసకు సిరికి పిన్ని.. రెండు ప్లాట్సుకు నడుమన ఐదు అడుగుల ఎత్తులోవున్న కాంపౌండు గోడను సమీపించింది.


‘‘ఏందే సిరీ!.. ఆయాసపడుతున్నావు?..’’ ఓ దీర్ఘం తీసింది.

భర్త తనను నిర్లక్ష్యం చేసి లోనికి పోవడం సిరిమ్మగారి అవమానం..


‘‘ఏంవుందిలే పిన్నీ!.. ఎపుడూ వుండేదే..’’ విరక్తిగా అంది సిరి.


‘‘చాలా డల్‌గా వున్నావు ఏమయిందే?..’’ ప్రశ్న..

యధార్థానికి ఆ భార్యా భర్తల సంభాషణను శశమ్మ గోడకింద చేరి అంతావిన్నది.


ఆమెకు.. ధర్మరాజు తల్లి అన్నపూర్ణమ్మగారికి వైరం.. ఆ కారణంగా పూర్ణమ్మ సిరిని రెచ్చగొట్టి.. ఆ సిరి.. తను అత్తగారిని గురించి నాలుగు అవకతవక వాక్యాలు పలికితే.. సిరిని మెచ్చుకొంటూ.. అన్నపూర్ణమ్మను గురించి పాడుకొంటూ.. ఆనందించే గొప్పరకం శశమ్మగారు.


ఇక.. సిరి పెద్ద అందగత్తేం కాదు. సిరి తండ్రి రాధాకృష్ణయ్య ధర్మరాజు తండ్రి వెంకటరాజు మంచి స్నేహితులు బావమరదుల వరుసైనవారు. ఒకే వయస్సువారు. వెంకటరాజుగారిని మాయదారి కరోనా కాటువేసింది సంవత్సరం క్రిందట..


హాస్పిటల్లో చివరి క్షణాల్లో వున్న వెంకటరాజును రాధాకృష్ణయ్య.. తన కూతురు సిరి ధర్మరాజుకు వివాహానికి అంగీకరించాల్సిందిగా రాధాకృష్ణ.. వెంకటరాజును కోరాడు. బంధుత్వం స్నేహాభిమానంతో వున్న వెంకటరాజు సిరిని వివాహం చేసుకోవాలని.. తన కుమారుడు ధర్మరాజుచేత తన చేతిలో ప్రమాణం చేయించుకొని వారు గతించారు.


రాధాకృష్ణయ్యగారి ఆశ నెరవేరింది. ధర్మరాజుకు సిరికి వెంకటరాజు గతించిన మూడవ నెలలోనే వివాహం జరిపించారు. ఆ వివాహం అయేవరకు రాధాకృష్ణయ్య వారి అర్ధాంగి శైలజ ఎంతగానో భయపడ్డారు. కారణం..


బంగారు ఛాయ.. చక్కని ఆరు అడుగుల అందగాడు ధర్మరాజు.. సిరి యావరేజ్‌.. చామనఛాయ.. బీదముఖం.. తలనిండా జుట్టు.. బియస్సీ పాసైంది.


తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం.. ఎవరినీ ఏమీ అనకుండా సహనంతో ఎంతో మర్యాదగా ధర్మరాజు సిరి మెడలో తాళి కట్టాడు. యదార్థంగా.. ఆ వివాహం ధర్మరాజు తల్లి అన్నపూర్ణమ్మకు.. తమ్ముడు రాఘవరాజుకు ఇష్టంలేదు..

****

బిడ్డలు పుట్టిన నాటినుంచి ప్రతి తల్లిదండ్రులు తమకు ఉన్నంతలో తమ బిడ్డలను అల్లారుముద్దుగా సాకి పెద్దచేస్తారు. వారి అభివృద్ధికి రుణాలు చేస్తారు. వున్న భూమి తోటలు చదువులకు అమ్ముతారు. బిడ్డలను వారి ఇష్టానుసారంగా చదివిస్తారు. అప్పులపాలవుతారు. ఇది పేదలు మధ్యతరగతివారి స్థితి. గూటిలోని పక్షిపిల్లలకు రెక్కలొచ్చి.. గూడు విడిచి వెళ్లిపోయే రీతిగా కొందరు నేటి విద్యావంతులు.. తమ గ్రామాన్ని, తమ తల్లిదండ్రులను.. విడిచి ఉద్యోగరీత్యా నగరాలకు బయలుదేరి వెళ్లిపోతున్నారు. మరికొందరు సముద్రాలనే దాటి వారి ఆనందంకోసం వెళ్లిపోయారు.. పోతున్నారు.


కొందరు తల్లిదండ్రుల ఇష్టానుసారంగా ధర్మరాజులా.. వివాహం చేసుకొంటారు మరికొందరు‘‘లవ్‌’’ ‘‘వర్ణాంతరం’’ ప్రేమ వివాహాల బారిన పడతారు. వారికి ఆ స్థితిలో ఎవరిమాటలు రుచించవు.


జోష్‌ అనే ఆ మంచు.. రేయింబవళ్లు శీతోష్ణ స్థితిగతులకు కరగి.. కన్న ఒకనాటి కలలు మిథ్యలై.. ఒకరిపట్ల ఒకరికి అసహ్యం ఏర్పడి.. వాదోపవాదాలు.. ఇంకా మరో స్టేజ్‌పైకి చేరి.. అసహ్యంతో అలసిపోయి.. పరస్పర ఆటవిక ద్వేషాలతో విడాకులు తీసుకొంటున్నారు.


ధర్మరాజుకు వివాహం జరిగింది తన ఇరవై ఆరవ సంవత్సరంలో అది జరిగిన ఆరు నెలలే..


నెలరోజుల లోపలే సిరి ధాటికి పెద్దామె.. అతన్ని కన్నతల్లి అన్నపూర్ణమ్మ నెగ్గలేక.. జీవితాన్ని రాజీతో సాగించాలని.. నిర్ణయించుకొంది.

‘‘నాన్నా!.. ధర్మా!..’’

‘‘ఏమ్మా!..’’

‘‘ఏం.. ఉద్యోగాన్ని మానేశావట?..’’


‘‘అమ్మా!.. మనకు అంతో ఇంతో భూమి వుంది. మా నాన్న వ్యవసాయదారుడే కదమ్మా!.. వారి చేతుల కష్టం.. నీ పెంపకంతోనేగా నేను ఇంజనీర్‌ అయినాను. తమ్ముడు డాక్టర్‌ చదువుతున్నాడు. నేను నాన్నలా వ్యవసాయం చేస్తానమ్మా!.. తమ్ముడు ఉద్యోగం చేస్తాడు. అమ్మా.. మరోమాట.. నాకు తోచింది.. పట్నాల్లోనివారంతా హాయిగా ఆనందంగా వుండాలంటే.. ఇక్కడ ఈ పల్లెలో నాలాంటి కొంతమంది వూరికి ఇద్దరు ముగ్గురుగా.. వూళ్లలో వుండి గ్రామాలను బాగుచేయాలమ్మా.. నిరక్షరాస్యతను పూర్తిగా మార్చేయాలి. చదువురానివారికి చదువు నేర్పాలి. అన్ని విధాల అందరం ఏకంగా మన గ్రామాభివృద్ధికి పాటుపడాలి..


దానికి నిర్దిష్టమయిన నాయకత్వం అవసరం.. ఆస్థానం నాది కావాలను కుంటున్నానమ్మా.. నేడు మన దేశానికి.. రాష్ట్రాల అభివృద్ధికి కావలసినది నిస్వార్థ సఖ్యత. అది ప్రారంభం కావాల్సింది గ్రామాల్లోనే. ఆ సఖ్యత పట్టణాలనుండి క్రిందకి.. గ్రామాలకు రాదమ్మా.. పట్టణవాసుల్లో చాలామంది పేదవారు.. వారి పొట్టకూటికి పాటు పడటంతో సరిపోతుంది. వారు వేరే దేన్నిగురించీ ఆలోచించలేరు.


మధ్యతరగతివారు అటు ఉట్టికి ఇటు స్వర్గానికి రెండిరటిని ఎక్కలేక జీవన పోరాటంతో సతమతమై.. ఒకటవ తేదీకి వారం ముందునుంచి కాలినకలో ఆఫీసుకు పోయేది వారి పరిస్థితి. సాయంత్రం వచ్చేటపుడు ఎవరో మంచి మిత్రుని దగ్గర పదిరూపాయలు అప్పు తీసుకొని, మరుదినం ఖర్చులకు వాడుకొనవలసిన పరిస్థితి వారిది. జీతంరాగానే అప్పులు తీర్చి సగం నెలకు సరిపడే డబ్బుతో మనుగడ సాగించడం వారి విధి..


ఇక కార్లలో తిరిగేవారు.. వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలని అనుకుంటారు గాని.. అమ్మా!.. వారికీ మనందరికీ తెలియని సమస్యలుంటాయమ్మా!.. కూతురు ఎవరినో ప్రేమించటం.. బాగా చదివి ప్రయోజకుడైన కొడుకు ఎవరినో లవ్‌ మ్యారేజి చేసుకోవడం.. బయట పల్లకీల మోత.. ఇంట్లో ఈగల మోత అన్నట్లు ఏడవలేక నవ్వుతూ వుంటారమ్మా కొందరు ఉన్నవారు..


కనుక నాకు పట్నం ఉద్యోగం వద్దు. నావూరు.. నావారు.. నా ఇల్లు.. నా తల్లి.. నాకుంటే చాలమ్మా!..’’ ఆనందంగా తల్లి భుజాలు పట్టుకొని నొసటన ముద్దు పెట్టుకొంటాడు ధర్మరాజు..

ఉత్తరం వైపున ఉన్న పశువులశాల వైపువెళ్లాడు ధర్మరాజు.


ఆ దృశ్యం చూచిన సిరి.. ధర్మరాజు ఇంటినుండి దొడ్డివైపుకు వెళ్లగానే అత్తగారితో..

‘‘అబ్బా.. అబ్బా.. ఏం లవ్వు!.. ఏం లవ్వు!.. తల్లీ కొడుకుల లవ్వు..అబ్బా.. అబ్బా..’’


పరుగున కాంపౌండ్‌వాల్‌ దగ్గరకు వచ్చి.. ‘‘పిన్నీ!..పిన్నీ!.. ఇపుడు ఇక్కడ జరిగిన కొడుకు తల్లీ ప్రేమకలాపాన్ని చూచావా!.. చూచుంటే నీ జన్మ ధన్యం అయిపోయుండేది!.. అబ్బా! అబ్బా!.. ఏమి లవ్వు.. ఏమి లవ్వు!..’’ సిరి పగలబడి నవ్వింది.


యాభై అడుగుల దూరంలో వున్న ధర్మరాజు.. కాంపౌండుగోడ ప్రక్కన నాట్య భంగిమలో చేతులు కాళ్లు వూపుతూ సిరి చేసే ప్రదర్శనను చూచాడు. మాటలుస్పష్టంగా వినబడలేదు. గొడ్లచావిడి బాగు చేస్తున్న పనిమనిషి మాలకొండడికి చెప్పవలసిన మాటలు చెప్పి ఇంటి ముందువైపు భాగమునకు నడిచాడు.


అతని రాకను గమనించిన సిరి నారదపిన్ని శశమ్మకు బైచెప్పి ఇంట్లోకి వెళ్లిపోయింది.


ఐదు నిముషాల్లో ధర్మరాజు అక్కడకు వచ్చాడు. విచారంగా వరండాలో కుర్చీలో కూర్చొనివున్న తల్లిని సమీపించి ఎదురుగా కూర్చున్నాడు.


‘‘ఏమ్మా!.. అదోలా వున్నావు?..’’ మెల్లగా అడిగాడు ధర్మరాజు

మూడు మాసాలుగా ధర్మరాజు.. రాఘవరాజు ఇంట్లో లేని సమయంలో సిరి ఆమెను ఎదిరించడం.. చెప్పిన మాట వినిపించుకోకపోవడం.. మాట్లాడితే సెల్‌లో తల్లితో గంటల తరబడి పురాణం..ఈ ఇంట్లో ఎవరైనా రెండుసార్లు తుమ్మితే ఆ విషయాన్ని వారి మాత గారికి తెలియచేయడం.. కరోనా కరోనా అని పిచ్చిగా అరవడం.. ఆ విషయాలను పనిమనిషి మల్లిక మూలంగా ధర్మరాజు తెలుసుకొన్నాడు.


ఆతనికి ఆడవారంటే ఎవరైనా సరే.. ఎంతగానో గౌర వించే తత్వం. అది వారి తండ్రినుండి సంక్రమించిన గొప్ప గుణం.


‘‘నాయనా!.. ధర్మా!.. నిజం చెబుతున్నాను.. కోడలి తత్వం నాకు సరిపడటంలేదురా!.. ఇమిడిపోలేక పోతున్నాను. మనకు అదే మా అమ్మగారి ఇల్లుసిరి వాళ్ల ఇంటిముందే వుంది కదా!..నేను అక్కడికి వెళ్లిపోతాను. ఇక్కడ నీవు.. నీ ఇల్లాలు హాయిగా ఉండండి. చిన్నవాడు నా దగ్గరవుంటాడు.. ఎంతో బాధతో చెప్పి నిన్ను నొప్పిస్తానేమో అని.. ఎంతో మధనతో చెబుతున్నానయ్యా!.. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు. ఎంతో జీవితం మీకు ముందు వుంది. నాదేముంది?.. అంతా అయిపోయింది. బ్రతకబోయే నాలుగురోజులు ప్రశాంతంగా బ్రతకాలని అక్కడికి పోవాలని నిర్ణయించుకొన్నాను. చూడు మీరు చిన్న పిల్లలు.. హాయిగా చిలకా గోరింకల్లా కలసి మెలసి వుండవలసిన వయస్సు. మీ మధ్యన నేను ఎందుకయ్యా!.. నేను ఆ యింటికి వెళతాను..’’ ఎంతో అనునయంగా చెప్పింది అన్నపూర్ణమ్మ.


ధర్మరాజు ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా.. చూచాడు. ఆమె కళ్లు ఎర్రబడి వున్నాయి. అంటే ఆమె హృదయంలో అంతర్యుద్ధం జరుగుతూవుంది.

ఆ విషయాన్ని ధర్మరాజు గ్రహించాడు. అతను అందరిలా.. కావాలనుకుంటే సిరిని వారి అమ్మగారి ఇంటికి పంపడమో లేక.. ఆమెను బెదిరించడమో.. సిరిని కొట్టడమో చేయగలడు.. కానీ అతని తత్వం.. అదికాదు.. పూర్తిగా వ్యతిరేకం..


సిరి తన భార్య. అర్ధాంగి. ఆ ఇంట తాను ఒకే ఆడపిల్ల. ఒక తమ్ముడు. తండ్రికి ఆమె అంటే ప్రాణం. గారాబంగా పెంచాడు. పెంకితనం పెరిగింది. విచక్షణ సన్నగిల్లింది. అహంకారం ఆకాశం అంచులు తాకింది. తనలోని ఆ రాక్షసగుణాలన్ని మారడం అంత సులభం కాదు. ఆ సెగల పొగలలో డెబ్బైయ్యోపడిలో వున్న తన తల్లి కష్టపడటం.. కన్నీరు కార్చడం ధర్మరాజుకు ఇష్టంలేదు. అతనికి తన తల్లి అంటే పిచ్చిప్రేమ.


వారు వున్నది మూడు వందల ఇళ్లు వున్న చిన్న గ్రామం. చుట్టూ పంటపొలాలు.. తోటలు దొడ్లు.. ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడికైనా పనివుండి వెళ్లితే.. కాలేజీలో చదువుకొనే రోజులలో తప్ప.. మిగతా రోజుల్లో దినచర్యను నాగైదు గంటలకు ముగించుకొని ఇంటికి వచ్చి.. తల్లిచేతి బోజనం చేసి.. ఆ చక్కటి వాతావరణంలో నిద్రించడం ధర్మరాజుకు అలవాటు. తండ్రి గతించినప్పటినుండి తల్లిని ఎంతో ప్రీతిగా బయటినుండి వచ్చేటపుడు.. ఆమెకు ఇష్టమైన పదార్థాలను పండ్లను తెచ్చి పక్కన కూర్చొని తినిపిస్తాడు..


వివాహం అయిన తర్వాతకూడా తల్లి విషయంలో ధర్మరాజు ప్రవర్తనలో మార్పులేదు. అలా అని అర్ధాంగికి ఏమీ తెచ్చేవాడు కాదని అర్ధం కాదు. సిరికి వెళ్లేటపుడే తనకు ఏంకావాలో అడిగి తెలుసుకొని.. తిరిగి వచ్చేటపుడు వాటినే తెచ్చి ఆమెకు ఇచ్చేవాడు..


సిరి దృష్టిలో.. దర్మరాజు తనపట్ల చూపించే ప్రేమ.. నటన అని.. తన తల్లి విషయంలో.. అతని ప్రవర్తన ఎంతో గొప్పదనే అనుమాన పూరిత అసహ్యభావన.


ఆ ఇరువురి తత్వాలు దర్మరాజుకు బాగా తెలుసు. తాను ఎవరినీ నొప్పించలేడు. ఇరువురూ తమకు కావాల్సినవారే. లోకం తీరు అలాగే..(కొన్ని సంసారాల్లో). ఇక్కడ అత్తా కోడళ్ల ఘర్షణ. అందులో కోడలిది పైచేయి. సౌమ్యురాలైన అన్నపూర్ణమ్మ బాధను హృదయంలో దాచుకొని, తనగత వైభవాన్ని తలచుకొంటూ విచారపడేది. క్రిందిచేయి..

ఇరువురి తత్వం.. ధోరణి ఎరిగిన దర్మరాజు.. తల్లి ఎదుటినుంచి లేచి సింహద్వారాన్ని సమీపించాడు.


‘‘సిరీ!’’ కాస్త బిగ్గరగా పిలిచాడు. రెండు నిముషాల్లో మౌనంగా తల విరియబోసుకొని సిరి వారి ముందుకు పడకగది నుండి వచ్చింది.


‘‘తల ముడేసుకొని వరండాలోకి రా!..’’

ధర్మరాజు వెనుతిరిగివచ్చి.. తల్లికి ఎదురుగా పూర్వస్థానంలోనే కూర్చున్నాడు.


‘‘ఇపుడు సిరిని ఎందుకు పిలిచావు దర్మా!..’’


ధర్మరాజు చిరునవ్వు నవ్వాడు.. ‘‘అమ్మా!.. మీ ఇరువురికి సంతోషం కలిగించడం నా ధర్మం. మీరిరువురూ ఎప్పుడూ ఆనందంగా వుండాలి..” రెండు క్షణాలు ఆగి.. పార్వతమ్మ ముఖంలోకి సూటిగా చూస్తూ.. ‘‘అమ్మా!.. నేను ఒక నిర్ణయం తీసుకొన్నాను. దాన్ని మీ ఇరువురికీ చెబుతాను. నాకు మనస్సులో నావారైన మన వూరిజనానికి ఎంతో మంచి చేయాలని వుంది. అది ఒకరోజుతో ముగిసే పనికాదు. రెండు మూడేళ్లు కావాలి. అందరూ చదవకలిగే స్థితికి రావాలి. నేను నా మిత్రులం కొందరం కలసి ‘బి.యస్‌.యస్‌.’ అనే ఒక సంస్థను ప్రారంభిస్తున్నాము. దాని ముఖ్య వుద్దేశ్యాలు రెండు.. ఒకటి అందరూ చదువురావాలి. రెండు గ్రామస్థులంతా ఒక్కమాటమీద నడవాలి.’’


సిరి వరండాలోకి వచ్చి నిలబడిరది.

‘‘రా.. సిరీ.. కూర్చో..’’ ఎడంచేత్తో కుర్చీని చూపించాడు దర్మరాజు.


సీరియస్‌గా.. తను ఏమి వినబోతూవున్నదనే సందేహంతో సిరి ధర్మరాజు ముఖంలోకి చూచింది. ఎన్నో అనుమానాలు!!..


‘‘సిరి.. అమ్మా!..నేను మన ఆ యింటిని బాగుచేయిస్తున్నాను. రెండుమూడు రోజుల్లో రెడీ అవుతుంది. పెయింట్స్‌ వేస్తున్నాను. సిరి.. మనం ఆ యింటికి వెళ్లిపోదాం. ఆ ఇల్లు మీ అమ్మగారి ఇంటికి దగ్గరేగా!.. మా అమ్మా తమ్ముడూ ఇక్కడే వుంటారు.. ఎపుడు రావాలనుకుంటే.. అపుడు రెండు వైపులకు వస్తుంటాం.. పోతుంటాం!.. ఇదే నా నిర్ణయం. నా తమ్ముడికీ చెప్పాను. సిరీ.. మీ నాన్నా అమ్మ తమ్ముడికీ చెప్పాను. ఇక్కడ మా అమ్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఎన్నో వున్నాయి. ఆ కారణంగా ఆమె ఇక్కడే వుంటుంది. మీ నాన్న అమ్మా తమ్ముడు చాలా ఆనందించారు. నాకు.. నా ఆనందంకంటే.. మీ అందరి ఆనందం ఎంతో ముఖ్యం. రెండు ఇళ్లు నావేగా!.. ‘ఆ ఇల్లు..ఇల్లు..’’ అందంగా నవ్వుతూ లేచి లోనికి వెళ్లిపోయాడు ధర్మరాజు.


అత్తా.. కోడళ్లు నోరు తెరచికొని ఒకరి ముఖాలొకరు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.


ధర్మరాజు లక్ష్యవాది.. సౌమ్యుడు.. తన ఆశయాలను వూరిలోని మిత్రులకు కొందరు పెద్దలకు బి.యస్‌.యస్‌. ఆశయాలను వివరించాడు. జాతి మత పట్టింపులు.. వాదప్రతివాదాలు.. విమర్శలు.. తగవులు.. కొట్లాటలకు అతీతమైన బి.యస్‌.యస్‌. ఉత్తమ ఆశయాలు అందరినీ ఆకర్షించాయి.


‘‘మనమంతా ఒకటిగా మాట చేతలలో మారి.. మనవూరు బాగుపంచుకొని పోటీలేని ఎన్నికలకు నిలయంగా చేసి.. రాష్ట్రంలో మన గ్రామం ఉత్తమమైనదనే పేరును సంపాదించుకోవాలి. ఆ ఆశయసిద్దికి అందరం ఏకాభిప్రాయంతో ఒకటిగా నిలిచి పనిచేయలి. లక్ష్యాన్ని సాధించాలి..’’


ధర్మరాజు పీర్లచావిడి అరుగుమీద నిలబడి చెప్పిన ఆ మాటలు అందరినీ ఆకర్షించాయి. సిరి తండ్రి రాధాకృష్ణయ్య ఆ సమాజానికి రెండు లక్షలరూపాయులు విరాళం ఇచ్చాడు. అల్లుడి సమాజ ఐక్యతాతత్వం వారికి ఎంతగానో నచ్చింది. ఆనందించాడు..


జనమంతా ధర్మరాజుకు జేజేలు పలికారు. అరుపులు తల్లి పార్వతమ్మగారి.. ఇల్లాలు సిరిగారి చెవులకు సోకాయి..


సిరిని ఇల్లు మార్చాడు ధర్మరాజు.. పాపం ఆడనారదులు శశమ్మగారు పలుకుతోడు లేక.. ఏకాకైపోయారు.

******

//సంపూర్ణం.//


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



56 views0 comments
bottom of page