( పరీక్షలకు కొత్త విధానం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో రాసిన ఈ కథ కల్పితం. ఎవరినీ ఉద్దేశించింది కాదు. ) - సుస్మితా రమణ మూర్తి
'Aduthu Paduthu' - New Telugu Story Written By Susmitha Ramana Murthy
Published In manatelugukathalu.com On 28/04/2024
'ఆడుతూ పాడుతూ' తెలుగు కథ
రచన : సుస్మితా రమణ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆదిత్య కాలనీ ప్రవేశ ద్వారం ముందు కారు ఆగింది. ఖరీదైన సూటువాలా దిగారు. కాలనీలోకి చూస్తూ-- ‘చాలా పెద్ద కోలనీయే!.. శ్రీవాణి ఉండే ‘ఏ’ బ్లాకు ఎటువేపు ఉందో?.. ’ స్వగతంలా అనుకుంటూ ఇటూ అటూ చూడసాగారు.
“ ఎవరండీ మీరు?.. ఎవరు కావాలి?” ఓ కాలనీ వాసి ప్రశ్నకు విషయం చెప్పారు.
“అదిగో ఆ మునగ చెట్టున్న ఇల్లే లెక్చరర్ సత్యమూర్తి గారిది. వారి అమ్మాయే శ్రీవాణి” చెప్పాడతను.
ఆ ఇంటి ముందుకి వెళ్ళి నిల్చున్నారు వారు. పేపరు చూస్తున్న సత్యమూర్తి వారిని లోపలికి రమ్మన్నారు.
“నమస్కారం సార్! నేను శిఖరాగ్రం కోచింగు సెంటరు డైరెక్టర్ ని!” కుర్చీలో కూర్చుంటూ చెప్పారు.
“మీ అమ్మాయి శ్రీవాణికి అభినందన సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నామండీ! “
“అభినందన సభ మీరెందుకు ఏర్పాటు చేయడం!?.. ” ఆశ్చర్యంగా అడిగారు సత్యమూర్తి.
“శ్రీవాణి మా కోచింగ్ వల్లే ది బెస్ట్ స్టూడెంటుగా తీర్చిదిద్ద బడింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంటరు పాసైన విద్యార్థినీ, విద్యార్థులకు మెరిట్ పోటీ పరీక్ష నిర్వహించింది కదా?.. అందులో అత్యుత్తమ ప్రతిభ గల మొదటి వంద మంది విజేతలకు పైచదువుల పూర్తి ఖర్చు, తదనంతరం ఉద్యోగ కల్పన ప్రభుత్వానిదే కావడం వలన, కేవలం వంద సీట్లకు లక్షకు పైగా పోటీ పడ్డారండీ!”
“అలాగా!” “అవునండీ! మీ అమ్మాయికి ఆ పరీక్షలో యాభై లోపు రేంకు రావడం చాలా గొప్ప విషయం కదండీ?.. అందుకని మా కోచింగు సెంటరు తరపున మీకు, మీ అమ్మాయికి అభినందనలండీ!”
వారివేపు సత్యమూర్తి ఆశ్చర్యంగా చూసారు.
“ మీ అమ్మాయి ఘన విజయం గురించి మాట్లాడరేం సార్!?” డైరెక్టరు అడిగారు.
“మా వాణి మీ సెంటర్లో చేరిన మూడు నెలల్లోనే మానేసిన విషయం గుర్తు లేదా మీకు?.. అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మా స్టూడెంటని తెగ పొగిడేస్తున్నారు!?.. ”
“పూర్తి శిక్షణ తీసుకోక పోయినా మీ అమ్మాయి మా స్టూడెంటే! పునాది మేమే వేసాం. అప్లికేషన్ మేమే మీ పిల్లతో నింపించాం. హాల్ టికెట్ మాద్వారానే మీకు వచ్చింది. అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్!”
సత్యమూర్తి గారికి వారి తీరు నచ్చలేదు.
“ఈ శుభ సందర్భంలో మా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. మీ అమ్మాయిని నగరంలోని పెద్దల సమక్షంలో అభినందించాలన్నది మా సెంటరు నిర్ణయం సార్!“
సత్యమూర్తి గారికి వారి ధోరణి చికాకు కలిగించింది.
“ఈ ఆదివారం సభ ఏర్పాటు చేస్తామండీ!”
సత్యమూర్తి గారు నోరు విప్పలేదు.
మరల వారు అదే విషయం ప్రస్తావించేసరికి--
“మా అమ్మాయి రేంకు విషయంలో నా అభిప్రాయం వేరు. మొలక ప్రాయం నుంచి మొక్క మానయ్యే దాకా, మంచి వాతావరణంలో పెంచిన వారికే దాని ఫలసాయం కదండీ!” అన్నారు సత్యమూర్తి.
వారి మాటలకు డైరక్టర్ గారి నోట మాట రాలేదు.
“మీ సెంటరుకి ఎన్ని వంద లోపు రేంకులు వచ్చాయండీ?” విషయం దాటవేస్తూ అడిగారు సత్యమూర్తి.
“ఆశించిన ఫలితాలు రాలేదండీ! “
“కారణం ఏమైవుంటుందో తెలుసుకున్నారా”
“ఈ విషయమై మా కమిటీ రిపోర్టు ఇంకా రాలేదండీ!“
“అభ్యంతరం లేకుంటే మీ బోధనా పద్ధతి గురించి కాస్త చెబ్తారా?”
వారు ఇబ్బందిగా చూసారు సత్యమూర్తి వేపు.
“అనుభవజ్ఞులైన లెక్చరర్ల పర్యవేక్షణలో అవసరమైన వారిని ఎక్కువ గంటలు చదివించినా, మా పిల్లలకు వేలలోనే రేంకులు వచ్చాయండీ! “
కొన్ని నిముషాలు వారి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది.
“మీ అమ్మాయికి ఇంకెక్కడైనా కోచింగు ఇప్పించారా?.. వారు రోజుకి ఎన్ని గంటలు చదివించారు?”
డైరెక్టర్ ప్రశ్నకు సత్యమూర్తి గారి అమ్మాయి వచ్చి సమాధానం చెప్పింది.
“నాన్నగారు, వారి మిత్రులు నడుపుతున్న ‘‘ఆడుతూ పాడుతూ’ సెంటరులో చేరానండీ! వారి శిక్షణలో ఇన్నేసి గంటలు చదవాలన్న నియమం లేదండీ! సిలబస్ ప్రకారం మేమే స్వంతంగా చదువుకున్నాం. ఎప్పటికప్పుడు మా నాన్న గారు, మిగతా లెక్చరర్లు మా సందేహాలు తీర్చేవారండీ!”
అమ్మాయి మాటలకు వారు ఆశ్చర్యపోయారు.
“ఇంటర్ ఏ కాలేజీలో చదివావమ్మా?” అడిగారు.
“మా కాలనీకి దగ్గరలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనండీ!”
“ఆఁ!!!.. ప్రభుత్వ కాలేజీలోనా!!.. మా దగ్గర పూర్తి శిక్షణ తీసుకోకుండానే ఇంత మంచి రేంకా!?.. ”
“అంతలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండీ! ఆత్మ విశ్వాసం, నిబద్ధత గల ప్రణాళికతో చదివితే ఎవరికైనా మంచి ఫలితం సాధ్యమే!”
సత్యమూర్తి గారి మాటలు వారికి మింగుడు పడలేదు.
“మానసిక ఒత్తిడి లేకుంటేనే, పిల్లల చదువు బాగా సాగుతుంది కదండీ?”
“మీరన్నది నిజమే! పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎక్కువ సేపు చదివించడం తప్పంటారా?”
“కష్టపడి లెక్చరర్లు విద్యార్థులను చదివించడం మంచిదే!.. అయితే పిల్లలు తల్లి దండ్రుల బలవంతం వల్లనా లేక తమ ఇష్టంతోనే చదువుతున్నారా?.. అన్న విషయం గమనించడం చాలా ముఖ్యం”
“అవును. ముఖ్యమే సార్!”
“పిల్లలకు మానసిక ఒత్తిడి లేకుండా, ఆడుతూ పాడుతూ చదువుకునే విధానం ఉండాలన్నదే మా సెంటరు ఆశయమండీ!“
“మీ బోధనా పద్ధతులు క్లుప్తంగా చెబితే, మేమూ వాటిని అమలు చేస్తామండీ!“
“మీరు విద్యావేత్తలు! వాస్తవ పరిస్థితి మీకు తెలియనిది కాదు. చెబుతున్నది పిల్లలకు అర్థం అవుతోందా?.. లేక భయంతో తలలు ఊపుతున్నారా?—అన్నది గమనించాలి”
సత్యమూర్తి గారి మాటలు వారిని తీవ్రంగా ఆలోచింప చేస్తున్నాయి.
“మా పిల్లలు తెల్లవారు జామున నాలుగు, నాలుగున్నరకే లేస్తారు..”
సత్యమూర్తి గారు చెప్పడం పూర్తి కాలేదు.
“అది బ్రాహ్మీ ముహూర్తం కదండీ!.. అప్పుడు దేవతలు సంచరిస్తుంటారట! ఆ సమయంలో చదివితే వెంటనే అర్థం అయిపోతుందట!” డైరెక్టర్ చెప్పారు.
“అది మీ నమ్మకం. మా ఆలోచన వేరు. తెల్లవారకుండానే లేవడం మంచి అలవాటు. అప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జన సంచారం అంతగా ఉండదు. వాతావరణ కాలుష్యం అతి తక్కువగా ఉంటుంది. అప్పుడు అవగాహన శక్తి ఉత్తమంగా ఉంటుంది. వాతావరణంలో ప్రాణ వాయువు అంటే ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది..”
“మీరు చెప్పింది నిజమే సార్!”
సత్యమూర్తి గారు మందహాసం చేసారు.
“అప్పుడు మా పిల్లలు గదుల్లో కాకుండా, ప్రకృతి మాత ఒడిలో కూర్చుని శ్రద్ధగా చదువుకుంటారు. సందేహాలు తీర్చడానికి, వారికి లెక్చరర్లు అందుబాటులో ఉంటారు “
ఆసక్తిగా వింటున్నారు వారు.
“ఆ సమయంలో చదువు ఒక్కటే కాదు. పిల్లలు ఆరోగ్యం కోసం యోగా, ప్రాణాయామం లాంటివి కూడా చేస్తారు. ఇన్ని గంటలు చదవాలన్న నియమం లేదు. చదవాలనుకుంటే ఇష్టంతో చదువుకుంటారు. రిలేక్సేషన్ కోసం ఆడుతారు. పాడుతారు. సినిమాలు కూడా చూస్తారు”
సత్యమూర్తి గారి మాటలకు డైరెక్టర్ ఆశ్చర్య పోతున్నారు.
“మీ ‘ఆడుతూ పాడుతూ’ సెంటరు ఎక్కడ ఉందండీ?.. దానిలోని మిగతా వారిని పరిచయం చేయండి. వారి అభిప్రాయాలు కూడా వినాలని ఉంది”
“దగ్గరలోనే ఉంది. నాతో బాటు మరో ముగ్గురు ఉన్నారు. అక్కడికి వెళ్దాం పదండి”
*****
“అదిగో అదే మా సెంటరు”
సత్యమూర్తి గారు చూపించిన వేపు ఆశ్చర్యంగా చూసారు వారు. ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్లే గ్రౌండు చివరలో ఓమూల రెండు రేకుల షెడ్డులు, అందులో పొడవాటి బెంచీలు, నల్ల బోర్డులు కనిపించాయి. ఆటువేపు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు సత్యమూర్తి గారికి నమస్కారం చేసారు. వారికి డైరెక్టర్ ఎందుకు వచ్చారో చెప్పారు సత్యమూర్తి.
“వీరు శర్మ గారు. వీరు మూర్తి గారు. వీరు సుందరం గారు. మేము ఈ కాలేజీలోనే రిటైర్ అయిన లెక్చరర్లం. ఈ సెంటరు రూపకర్తలం!“
సత్యమూర్తి గారి పరిచయ వాక్యాలు విన్న డైరెక్టర్ గారికి అంతా వింతగా ఉంది. ఆశ్చర్యంగా సత్యమూర్తి గారిని ఆ లెక్చరర్లను చూడసాగారు.
“మా అమ్మాయి మీ సెంటరులో, శర్మ గారి అబ్బాయి వేరే సెంటరులో పూర్తి కోచింగు తీసుకోక పోవడానికి కారణం-- వారిది అతి సున్నితమైన మనస్తత్వం కావడమే! ఆడుతూ పాడుతూ చదువుకునే పిల్లలు అవడమే! సున్నితమైన మనస్తత్వం కల పిల్లల ధోరణి అర్థం చేసుకోకుంటే, తీవ్రమైన ఒత్తిడికి గురవుతారని, ఆరోగ్యం పాడవుతుందని, తద్వారా మానసిక రుగ్మతలకు లోనవుతారన్న విషయం పేపర్లలో చదివి కలవర పడ్డాం. మా పిల్లల గురించే కాదు. అందరి పిల్లల గురించి కూడా ఆలోచించాం. మదనపడ్డాం. ఒత్తిడి లేని ఓ కొత్త విధానం ఉంటే బాగుంటుందని అభిప్రాయం పడ్డాం. ఈ విషయమై విద్యా రంగంలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ విద్యావేత్తల అభిప్రాయాలు సేకరించాం. అప్పుడు మా అంతరంగ మథనంలోంచి ఆవిర్భవించినదే ఈ ఆడుతూ పాడుతూ సెంటరు”
సత్యమూర్తి గారి భావాలు అర్థం చేసుకోవడానికి డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారు.
“మా విధానం, అభిప్రాయాలు పిల్లల బంగారు భవిష్యత్తుకే గాని, ఎవరినీ ఆక్షేఫించడానికి గాని, వేలెత్తి చూపడానికి గాని కాదు. మా ఆలోచనా సరళిని దయచేసి అర్ధం చేసుకోండి సార్!”
సత్యమూర్తి గారి ఆంతర్యం డైరెక్టరు గారికి అర్థం కాసాగింది. “ ఈ ఏడాది మేము ఇక్కడ ప్రారంభించిన ఈ సెంటరులో పిల్లలు ఆడుతూ, పాడుతూ చదువుకున్నారు. వారి సందేహాలన్నీ తీర్చాం. పిల్లలు కృషితో కొన్ని మంచి రేంకులు సాధించారు”
వారి ఆశయం డైరెక్టరుకి అర్థం అయింది. లెక్చరర్ల కృషిని, పిల్లల ప్రతిభను లోలోన మెచ్చుకున్నారు.
‘ వీరి నూతన విధానం దగ్గరుండి తమ లెక్చరర్లతో అమలు చేయించాలి. వచ్చే ఏడాది వంద లోపు రేంకులు కొన్నైనా తప్పకుండా తమ పిల్లలకు వచ్చేట్లు కృషి చేయాలి. ఈ నలుగురు లెక్చరర్లను, నగరంలో మంచి రేంకులు తెచ్చుకున్న మిగతా సెంటర్లలోని పిల్లలను కూడా, పెద్దల సమక్షంలో ఒకే వేదికపై శ్రీవాణితో బాటు అభినందించాలి. అలా చేస్తే తమ సెంటరుకి మంచి గుర్తింపు వస్తుంది. గౌరవం పెరుగుతుంది ‘ మనసులో అనుకున్నారు వారు. వచ్చే ఏడాది మంచి ఫలితాల కోసం ప్రణాళిక వారి మస్తిష్కంలో రూపు దిద్దుకుంటోంది.
/ సమాప్తం /
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి
కలం పేరు : సుస్మితా రమణ మూర్తి
పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.
విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.
కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.
బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో
మీ సుస్మితా రమణ మూర్తి.
నేను ఈ రోజునే సుష్మిత రమణ మూర్తి గారు వ్రాసిన "ఆడుతూ పాడుతూ" అనే కథ చదివాను.
బాగుంది. మంచి సందేశాత్మక కథ. మొక్కుబడి చదువుకి మనసు పెట్టీ చదివిన చదువుకి వ్యత్యాసం రమణమూర్తి గారు తన కథ ద్వారా చక్కగా చెప్పారు.
మరిన్ని సందేశాత్మక కథలు రచయిత కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ.
.... దిలీప్ కుమార్
చాలా మంచి కథ ఇప్పటి తరం పిల్లలకి ఇలా ఆడుతూ పాడుతూ చదివించడం చాలా అవసరం - - swathi