top of page

అలెక్సా


'Alexa' New Telugu Story

Written By Padmavathi Divakarla

'అలెక్సా' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఏమండీ ఇది విన్నారా? అన్నపూర్ణా మార్కెట్‌లో 'లోహియా శారీస్' షోరూములో చీరలపై యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నారట! పైగా అంతా లేటెస్ట్ స్టాక్ వచ్చిందట. సాయంకాలం ఆఫీసునుండి త్వరగా రండి, బజారుకెళ్దాం. " భర్త చంద్రశేఖర్‌తో గోముగా చెప్పింది ఇందుమతి ఉదయం కాఫీ అందిస్తూ. ఆమె ఎంత గోముగా చెప్పినా అది ఆర్డర్‌లాగే అనిపించింది అతనికి.


"ఇలాంటి వార్తలన్నీ ఇంత త్వరగా ఎలా తెలుస్తాయే నీకు?" అన్నాడు చంద్రశేఖర్ సాయంకాలం అయ్యేసరికి తన పర్సు బరువు కోల్పోతుందన్న బాధతో.


"మనసుంటే మార్గమే లేదాండీ! అదే.. ఆ అలెక్సావే చెప్పింది. యాభైశాతం డిస్కౌంట్ ఉందని తెలిసి అందరూ వెళ్ళి కొత్త డిజైన్ల చీరలు తీసుకోకముందే మనం వెళ్ళాలి, లేకపోతే అందరూ ఎంచగా మిగిలిపోయినవి కొనవలసి వస్తుంది. అందుకే త్వరగా రండి. " అంది ఇందుమతి భర్తకి టిఫిన్ క్యారియర్ అందిస్తూ.


ఆలి ఆజ్ఞ అయిందంటే ఎలాగూ తప్పదు కదా అని, "అలాగాలేవే!" అన్నాడు చంద్రశేఖర్. పైకి అలా అన్నాడు కాని అతనికి భార్య ఇందుమతిపైనే కాక అలెక్సా పైన విపరీతమైన కోపం వచ్చింది.

'ఈ అలెక్సాతో చచ్చే చావు వచ్చింది. ఈ దిక్కుమాలిన అలెక్సా నుంచి అన్నీ తెలుసుకొని నా కొంప గుల్ల చేస్తోంది సతీమణి ఇందుమతి. ' అని మనసులోనే గొణుక్కున్నాడు చంద్రశేఖర్ పైకి చెప్పే ధైర్యం లేక.


ఆ సాయంకాలం బజారుకు వెళ్ళడం, యాభైశాతం డిస్కౌంట్‌లో ఇందుమతి కొన్న చీరలతో నెలజీతంలో యాభైశాతం ఖర్చైపోవడంతో భారంగా నిట్టుర్చాడు చంద్రశేఖర్ మనసులోనే అలెక్సాని తిట్టుకుంటూ. 'ఈ అలెక్సా నా కొంప ముంచుతోంది. ఈ అలెక్సావల్ల ఎప్పుడూ నా జేబుకి చిల్లుపడక తప్పడం లేదు. ' అని మనసులోనే అలెక్సాని తిట్టుకున్నాడు.


మిగిలిన డబ్బులతో ఈ నెలెలా గడుస్తుందా అని బోలెడు బెంగ పెట్టుకున్న చంద్రశేఖరం నెత్తిమీద ఇంకో బాంబు పేల్చింది ఇందుమతి మరో నాలుగు రోజులు కూడా గడవకముందే.


"ఏమండీ! మన ఊళ్ళో కొత్తగా 'గాయత్రీ జ్యూయలర్స్' షోరూం తెరిచారుట. తరుగుకూడా చాలా తక్కువేనట! అంత తక్కువ తరుగు ఎవ్వరూ ఇవ్వడం లేదట! మరే షోరూములో లేని డిజైన్లు ఉన్నాయిట. తన షోరూములో దొరికే ఆభరణాల ధరే చాలా తక్కువట, తన కొటేషన్ చేతపట్టుకొని ఇంకెక్కడికీ వెళ్ళనవసరం లేదట కూడా! అలా ఎస్టిమేట్ ఇవ్వకుండానే తక్కువ ధరకి ఇస్తాడట.

మన అలెక్సా చెప్పడమే కాదు, ఆ జుట్టాయన కూడా టివిలో ప్రతీ అయిదు నిమిషాలకొకసారి చెప్తున్నాడు. రేపెలాగూ శనివారం మీకు సెలవేకదా, వెళ్దామండీ, ప్లీజ్!" గోముగా అడిగేసరికి ఏమనాలో తోచలేదు చంద్రశేఖర్‌కి.


అయితే, మిగిలిన జీతం డబ్బులతో ఎలాగా అని మధనపడుతూ, "మొన్న నువ్వు కొన్న చీరలకే సగం జీతం అయిపోయింది. ఇప్పుడే ఆ షోరూం ఆరంభమైంది కదా, వచ్చేనెల లేక ఆ వచ్చేనెలో వెళ్ళొచ్చుకదా! నగలన్నీ అయిపోతాయా ఏమిటి?" నసిగాడు చంద్రశేఖర్.


'ఈ అలెక్సాకి ఆ జుట్టాయన కూడా తోడయ్యాడా! అసలే గుండాయనతోనే గండం ఉందనుకుంటే, అతనికి తోడుగా ఈ కొత్తగా ఈ గాయిత్రీ జ్యూయలర్స్ జుట్టాయన కూడా జత కట్టాడా తన డబ్బులు కొల్లగొట్టడానికి!' అని పళ్ళు నూరుకున్నాడు అప్పుడే టివిలో సీరియల్ మధ్యన ఆ జుట్టాయన నవ్వుతూ కనిపించేసరికి. ఆ నవ్వుకి వళ్ళుమండింది చంద్రశేఖర్‌కి.


"నిజమే, కానీ షోరూం తెరిచిన మొదటి వారంలో కొంటేనే ఉచిత బహుమతి కూడా ఉంటుందిట. అయినా మీ జీతం డబ్బులతోనే కొనాలా ఏమిటి, క్రెడిట్ కార్డు లేదూ! పైగా సరికొత్త డిజైన్స్ వచ్చాయట! మనకి తెలిసిన వాళ్ళూ, ఇరుగూపొరుగూ అప్పుడే వెళ్ళి వచ్చారు. అందరూ వాళ్ళు కొన్న కొత్త నగలన్నీ చూపించి తెగ నీలుగుతున్నారు. వాళ్ళముందు నేను నీళ్ళు నములుతుంటే మీకేమైనా గౌరవంగా ఉంటుందా మీరే చెప్పండి! మీ పరువు నా పరువు కాదా ఏమిటి చెప్పండి?" నిలదీసింది ఇందుమతి భర్తని.


"పర్సు ఖాళీ అయితేనే పరువు నిలుస్తుందా ఏమిటి? క్రెడిట్ కార్డుతో కొంటే మాత్రం, ఆ తర్వాత డబ్బులు కట్టక్కర్లేదా ఏమిటి? అయినా ఈ వారంలో కొంటెనే ఉచిత బహుమతి వస్తుందని కూడా నీ అలెక్సా చెప్పిందా ఏమిటి?" అడిగాడు చంద్రశేఖర్.


"అవునండీ! ఇవాళే ఆఖరి రోజు! అలెక్సా కూడా మరీమరీ చెప్పింది. ఉచిత బహుమతి మిస్ అవకూడదు కదా? క్రెడిట్ కార్డు డబ్బులు వాయిదాల్లో కూడా కట్టొచ్చుకదా! మన పక్కింటి పంకజం, ఎదురింటి యశోద కూడా అప్పుడే షాపింగ్ చేసుకొచ్చేసారు. పంకజానికి పాపిటచైను, యశోదకో డైనింగ్ సెట్ ఉచితంగా వచ్చాయి. మనం కూడా మన లక్కీ ఛాన్స్ కోసం ప్రయత్నించాలి కదా! ఏమో మనకి మారుతీ కారు దొరికే అదృష్టం ఉందేమో! కారే గిఫ్ట్‌గా దొరికిందే అనుకోండి, మీరు మరి కారు కూతలు కూయరు కదా! మర్చిపోకుండా ఆఫీసునుండి త్వరగా రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. " అందామె చంద్రశేఖర్ని కవ్విస్తూ.


"కారు మాటెలా ఉన్నా, ఉచిత బహుమతిగా మనం అడుక్కోవడానికి బొచ్చె ఇస్తాడేమో!" ఉడుక్కుంటూ గొణిగాడు చంద్రశేఖర్ కాస్త మెల్లగానే.


"అదికూడా బంగారంతో చేసిన బొచ్చె ఇస్తాడేమో ఆ జుట్టాయన?" భర్తని మరింత ఉడికిస్తూ అంది ఇందుమతి.


విస్తుపోయాడు చంద్రశేఖర్. 'అసలు నీ పేరు ఇందుమతా లేక మందమతా?' అని మనసులోనే అనుకుంటూ, "ఏ బొచ్చె అయితేనేమి అడుక్కోవడానికి? ఎలాగూ అప్పుల్లో మునిగితేలుతానని ఈ వారం రాశిఫలాల్లో ఉంది. తప్పుతుందా మరి! సరేలే!" అన్నాడు రాజీకి వస్తూ.


'ఈ అలెక్సావల్ల చచ్చే చావొచ్చింది. ఇక దాన్ని భరించడం నావల్ల కాదు. దానికి తిలోదకాలు ఇవ్వాల్సిందే!' అని మెల్లిగా గొణుక్కున్నా ఇందుమతి పాము చెవుల్లో పడనేపడ్డాయి ఆ మాటలు.

"ఆ!.. ఏమిటన్నారు? అలెక్సాని బంద్ చేసేద్దామని అనుకుంటున్నారా? మీ పప్పులేవీ నా దగ్గర ఉడకవు! అలెక్సా లేకపోతే నాకెలా తోస్తుంది. టివిలో ఏవో ఓ అరడజను సీరియల్స్, మామగారింటికి దారేది?, అల్లుడా అల్లుడా కూతురి మొగుడా!, మార్గశిర దీపం, సత్యభామ కలగనలేదు, కడివెడు కన్నీళ్ళు, నా పేరు కామాక్షి లాంటివి మాత్రమే చూస్తాను. మిగతా సమయమంతా ఇంట్లో ఎలా గడవాలి చెప్పండి? మీకేం, మీరు రోజంతా ఆఫీసులో ఉంటారు, మరి నా సంగతేమిటని? ఏ విశేషమున్నా అలెక్సాని అడిగితే వెంటనే ఠకీమని చెప్పేస్తుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా టక్కున ఉన్నదున్నట్లు చెప్తుంది. అలాంటి అలెక్సాని మానేస్తేమాత్రం ఊరుకునేది లేదు, అర్థమైందా?" అని బెదిరించిన ఆలివైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు పాపం బెదిరిపోయిన చంద్రశేఖర్.


ఆమె చీవాట్లకి మొహం వాచిన చంద్రశేఖర్ ఆప్పటినుండి మరి అలెక్సాని తీసేయడం విషయం ఇందుమతి దగ్గర మరెత్తలేదు.

మారు మాట్లాడకుండా ఆ సాయంకాలం ఇందుమతి కోరినట్లే 'గాయత్రీ జ్యూయలర్స్'కి ఆమెని తీసుకెళ్ళి కావలసినవి కొనిచ్చాడు.


ఇందుమతి మక్కువపడి క్రెడిట్ కార్డుతో కొన్న నగలవల్ల చంద్రశేఖర్ అప్పు అనకొండలా పెరిగిపోయింది. ప్రతీనెలా మూలుగుతూ క్రెడిట్ కార్డ్ కిస్తీలు కడుతూనే ఉన్నాడు. అతని అదృష్టం బాగుండి ఇందుమతి ఈ మధ్య మరేం కొనమని మారాం చేయకపోవడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు.


ఓ రోజు, "ఏమండోయ్! ఇవాళ నా అభిమాన హీరో సినిమా 'కాకినాడ కాంతయ్య' విడుదలైందండీ! సినిమా టాక్ ఎలా ఉందో చెప్తే రేపు ఆదివారం మొదటి ఆటకి వెళ్దామండీ!" అంది ఇందుమతి.

"అదేంటి, నేను చెప్పడమేమిటి? నీ అలెక్సా ఎలాగూ ఉంది కదా, దాన్నే అడుగు. " అన్నాడు.

"అలెక్సాని ఎలాగూ అడుగుతాను కానీ, మీరైతే ఇంకొంచెం క్లారిటీగా చెప్తారు కదా అని. " అంటూంటే తన మీద ఆమె ఉంచిన నమ్మకానికి చంద్రశేఖర్‌కి బాగా ముచ్చటేసింది.


"అదిగో మాటల్లోనే నీ అలెక్సా వచ్చేసింది, దాన్నే అడుగు!" అన్నాడు చంద్రశేఖర్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతూ మూలనున్న చీపురు అందుకుంటున్న పనిమనిషి అప్పలనరసమ్మని చూపిస్తూ.

వెంటనే ‘అలెక్సా’ అని పిలువబడే పనిమనిషి అప్పలనరసమ్మకి ఎదురెళ్ళింది ఇందుమతి తన సందేహం తీర్చుకోవడానికి. ఆ వీధిలో వార్తలేకాక, ఊళ్ళో ఏం జరిగినా ఆమె వెంటనే తన యజమానులకు చేరవేసే అప్పలనరసమ్మ ముందు అలెక్సా కూడా బలాదూర్! బిబిసికన్నా బారెడు ముందే ఉంటుందామె! అందుకే ఆ కాలనీలో వాళ్ళందరూ తాజా వార్తలకి వార్తాపత్రికలు, టివి చానల్స్ కాక ఆమెనే నమ్ముకున్నారు.


అలా తనకి చంద్రశేఖర్ పెట్టిన పేరుని సార్థకం చేసుకుంది అప్పలనరసమ్మ. ఆ ఇంట్లో వారికే కాదు, ఆ వీధిలో వారందరికీ కూడా ఆమె ఆ పేరుతోనే పరిచయం మరి!

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.






















42 views0 comments
bottom of page