top of page

అమ్మ


'Amma' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి

"కమలా! ఈ రోజు మా ఇంటికి వస్తావటే? మాష్టారు చెప్పిన లెక్కలు అస్సలు బుర్రకెక్కట్లేదు. కాస్త ఆ లెక్కలు చెప్పి పుణ్యం కట్టుకోవే" రచన అభ్యర్ధనగా అడుగుతుంటే కమల సరే అంది.

"మరి మీ అమ్మ పెట్టిన మాగాయ పచ్చడి ఇస్తావా?" ఆశగా మొహమాటపడుతూ అడిగింది.

"ఓ దాందేముంది..నీకెంత కావాలంటే అంత పట్టుకెళ్లే..కానీ ఆ లెక్కలు మాత్రం బుర్ర కెక్కేలా చూడు. అసలే ఏడో తరగతి పరీక్షలు. లెక్కల్లో ఫెయిల్ అయితే మా నాన్న నాకు పెళ్ళి చేసేస్తానని అన్నాడు." బాధ పడుతూ చెప్పుకొచ్చింది.

"ఏం కాదు. నేనున్నానుగా..నీకీసారి లెక్కల్లో మంచి మార్కులు తెచ్చే పూచీ నాది..సరేనా?!" కమల నవ్వుతూ చెప్పేసరికి రచన ఆనందపడుతూ ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది.

కమల , రచన ఏడో తరగతి విద్యార్థినులు. వారుండే పల్లెటూరిలో ఉన్న ఒకే ఒక్క దుంపలబడిలో ఎక్కీ ఎక్కని చదువు చదువుతూ లాక్కొస్తున్నారు. ఈ తరగతి గట్టెక్కితే పై చదువులకి పట్నం పోవచ్చని రచన ఆశ. అలాంటి ఆశలు ఆలోచనలు లేని ఒక మోస్తరు పల్లెటూరి పిల్ల కమల.

"అమ్మా! ఎవరోచ్చారు చూడు" పుత్తడి బొమ్మలా ఉన్న కమలను తన అమ్మకు పరిచయం చేసింది రచన.

"నేనెప్పుడూ చెపుతూ ఉంటానే ‘లెక్కల మాస్టారికే లెక్కలు చెప్పే అమ్మాయి’ అని - ఈమెనే. నాకు లెక్కలు చెప్పడానికి వచ్చిందమ్మా. బదులుగా నువ్వు పెట్టిన మాగాయ కావాలట. ఎప్పుడో ఒకసారి రుచి చూపించా. అప్పటినుండి అడుగుతోంది. కొంచెం పెట్టివ్వమ్మా." వాళ్ళ అమ్మని వెనక నుండి కౌగలించుకొని అడిగింది.

"అయ్యో దాందేముందిరా ఒక జాడీ నిండా పెట్టిస్తా సరేనా" రచనను దగ్గరికి లాక్కుంటూ బుగ్గనొక్కింది ముద్దుగా.

కమల ఆమెనే రెప్పార్పకుండా చూస్తోంది. అమ్మ ప్రేమ అంటే ఇలా ఉంటుందా. తనని దగ్గరకు తీసుకొని అమ్మ ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు. కనీసం తన పేరు కూడా అమ్మకు తెలియదు. కమలకు అసంకల్పితంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఎవరూ చూడకుండా మొహం తిప్పుకుంది.

" ఎవరి అమ్మాయివమ్మా నువ్వు. ఎవరి తాలూకా?" అప్పుడే అక్కడికి వచ్చిన రచన నానమ్మ ఆరా తీసింది.

"మా నాన్న గారు ప్రకాశం గారండి. ఈ ఊరి చివర ఉన్న సైకిల్ షాపు మాదే" కమల గొప్పగా చెప్పింది. ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క సైకిల్ షాపు అది. అందరూ అక్కడే రిపేర్లు అవి చేయించుకుంటారు. అందుకే ప్రకాశం అందరి నోళ్లలో నానుతూ ఉంటాడు. ఇట్టే గుర్తు పట్టెయ్యగలరు ఎవ్వరైనా.

"ఓహో ప్రకాశం ఎందుకు తెలియదు. మీ అమ్మ పిచ్చమ్మ కదూ..నువ్వు పిచ్చిదాని కూతురేనా?" ఆమె అడిగిన ప్రశ్నలకి కమల కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.

"కాదు మా అమ్మ పేరు పిచ్చమ్మ కాదు. ఆమె పేరు సుగుణ. నేను ప్రకాశం కూతుర్ని" రోషంగా గట్టిగా అరుస్తూ అక్కడనుండి ఇంటికి ఉరికింది.

ఆ పిల్లకి ఏడుపు ఆగట్లేదు. 'ఎందుకు అందరూ తనని పిచ్చిదాని కూతురు.. పిచ్చమ్మ కూతురు.. అంటారు? మా అమ్మకు పేరు ఉంది కదా! ఆమె పిచ్చిదైతే నన్నెందుకు దూరం పెడతారు?నేనేం పాపం చేశాను?' ఆ పసిదానికి ఏడుపు ఆగట్లేదు. ఎక్కడకు వెళ్ళినా ఇవే మాటలు ఆమెను వెంబడిస్తోంటే ఆమెకు తెలియకుండానే ఆ పసి హృదయంలో తన తల్లి పట్ల ఏహ్య భావం పెరిగిపోతోంది.

"ఛీ ! ఈ బ్రతుకు బ్రతికే కన్నా చావడం మేలు." నిండా పన్నెండేళ్ళు కూడా లేని ఆ చిన్న ప్రాణం జీవితం మీదే విరక్తి చెంది ఏడుస్తూ కూర్చుంది.

"అక్కా! ఎందుకేడుస్తున్నావ్? " అప్పుడే ఆడుకొని వచ్చిన పక్కింటి చిట్టి తమ్ముడు ఆమె మోకాల్లో తలపెట్టుకుని ఉండటం చూసి అడిగాడు. వాడి పిలుపు విని కళ్ళు తుడుచుకుంటూ "ఏం లేదు రా చిన్నా. కళ్ళల్లో ఏదో పడ్తేనూ... తుడుచుకుంటూ ఉన్నా " లేని నవ్వు తెచ్చుకుని సర్ది చెప్పింది.

తల్లి సుగుణమ్మ మానసిక స్థితి సరిగ్గా లేక పోవడంతో తనకు తానే తల్లిగా మారిపోయింది కమల. ఇంకా యవ్వనంలోకి కూడా అడుగుపెట్టలేదు ఆ చిట్టితల్లి. అప్పుడే ఇంటి పని, వంట పని చేస్తూ ఆ కుటుంబాన్ని మోసుకొస్తోంది. తమ కోసం తన సుఖాల్ని కూడా త్యాగం చేసి పగలు రాత్రి కష్టపడుతున్న తన తండ్రి కష్టం చూసి, అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ పెద్ద దిక్కైంది. పన్నెండేళ్లకే పెద్దరికం తెచ్చుకున్న తన చిట్టి తల్లికి బాల్యం దూరం చేస్తున్నా అనే బాధ గుండెల్ని పిండేస్తున్నా ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మౌన యోగిలా ఉండి పోయాడు ప్రకాశం.

.

సుగుణ మానసిక ఆరోగ్యం మెరుగు పరచాలని తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దైవం లేదు. ఆమె పిచ్చి చేష్టలేమీ చెయ్యదు. ఏం పెట్టినా తిని ఒక మూలకు కూర్చుని పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. ఒక్క మాటా మాట్లాడదు కానీ చిన్న పిల్లలు కనిపిస్తే వారిని తన కొంగులో దాచేసుకుని, గట్టిగా అదిమి పెడుతుంది.

.ఊపిరి సలపక పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని కన్నవాళ్లు వచ్చి తిట్టి పోతారు. ఆమె ప్రవర్తనకి చుట్టూ పక్కల వాళ్ళెవ్వరూ పిల్లలని ఆమె దరి దాపుల్లోకి రానివ్వరు. ఆమె వచ్చినా ప్రకాశం దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటారు. అది చూసి చూసి విసిగి పోయిన ప్రకాశం ఆమెను గది బయటకు రానియ్యకుండా ఏర్పాటు చేశాడు.

ఆడపిల్లకు తల్లి అవసరం అయ్యే రోజు రానే వచ్చింది. కమల రజస్వల అయ్యింది. తండ్రికి తన బాధ చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఆ పిల్లకు. పక్కింటి సుజాత దగ్గరకు వెళ్ళి తన గోడు వెళ్లబోసుకుంది. వీళ్ళతో అంటీ ముట్టనట్టు ఉండే సుజాతకు కూడా జాలి వేసి, ఆ పిల్లకు కావాల్సినవి తెచ్చిపెట్టింది. ఇంకో నలుగురైదుగురు స్త్రీలను వెంట తీసుకు వచ్చి జరగవలసిన కార్యం జరిపించి, కమలకు తగినన్ని జాగ్రత్తలు చెప్పి తంతు ముగించారు.

కమల మనస్సంతా బాధతో నిండి పోయింది. "అమ్మా! నువ్వెందుకమ్మా నాతో మాట్లాడవు? నేనేం తప్పు చేశానని అమ్మా నాకీ శిక్ష! తల్లిగా నువ్వు చెయ్యవల్సినవి, అనాధగా ఊరి జనంతో జరిపించుకున్నా కదమ్మా. నువ్వెందుకు అమ్మా ఇలా ఉన్నావు? " సుగుణని పట్టుకుని ఏడుస్తున్న కమలను చూస్తూ మౌనంగా రోదించాడు ప్రకాశం. ఎప్పట్లానే సుగుణ దిక్కులు చూస్తూ కూర్చుంది ఇవేమీ తనకు పట్టనట్టు.

కాలం ఇట్టే కదిలిపోతూ ఉంది. చూస్తూ చూస్తూనే కమల పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యింది. పై చదువులు చదవాలని ఉన్నా ఇంట్లో ఉన్న తల్లిని చూసుకోవాలని, తమ కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తండ్రికి భారం కాకూడదని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి, ఇంటి పట్టునే ఉంటూ కుట్లు అల్లికలు నేర్చుకుని, వేన్నీళ్లకు చన్నీళ్లలా కాస్తో కూస్తో సంపాదిస్తోంది.

ఓ సాయంత్రం వాళ్ళ అమ్మ బట్టలు తీసుకురమ్మని చెప్పింది అంటూ ఓ కుర్రాడు ఇంటికి వచ్చాడు. అతడి వివరాలు అవీ కనుక్కొని

"అయ్యో మీ అమ్మ గారి జాకెట్టు కుట్టాను కానీ హుక్కులు ఇంకా కుట్టలేదు. కాస్త కూర్చుంటారా. ఇప్పుడే కుట్టి ఇస్తాను" అంటూ అతన్ని కూర్చోబెట్టింది. ఆ కుర్రాడిదీ సుమారు కమల వయస్సు ఉంటుంది. నూనూగు మీసాలతో అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన అతడు ఆకర్షణీయంగా ఉన్నాడు.

"నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూడలేదే?" హుక్కులు గుచ్చుతూ అడిగింది కమల.

"ఓహ్ అదా. నేను టౌన్ లో ఉండి చదువుకుంటున్నాను. నేను మాత్రం నిన్ను చాలా సార్లు చూశాను "అని చెప్పాడా కుర్రాడు.

టౌన్ లో చదువుకుంటాడు అని తెలిసే సరికి కమల కళ్ళు విప్పార్చి చూసింది.

" అవునా. అక్కడ చాలా పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయా? లెక్కలూ అవీ చెపుతారా? " ఆరా తీసింది.

" అవును చాలా పెద్ద భవనాలు ఉంటాయి. లెక్కలు కూడా చాలా బాగా చెప్తారు. " అతడు చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు. ఇలా చిన్నగా మొదలైన వారి పరిచయం మంచి స్నేహంగా మారింది.

అతడు ప్రతి రోజూ వస్తూ పోతూ ఉండేవాడు. ఊరిలో ఏ విషయం కూడ అట్టే దాగదు. వీరి విషయం కూడా ఆనోటా ఈనోటా పాకుతూ ప్రకాశం చెవిన పడింది. కమల అంతకు ముందు ఒకసారి చూచాయగా ఆ అబ్బాయి గురించి చెప్పింది. పట్నంలో చదువుకునే కుర్రాడు తనకు లెక్కలవీ నేర్పిస్తున్నాడు అని. లెక్కలంటే దానికి ఇష్టం అని ప్రకాశం వీరి స్నేహాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరువు పోతే పిల్లకి పెళ్లెట్ల? అసలే దాని తల్లి గురించి ఊరంతా చెప్పుకుంటారు. తనలాంటి పేదోడి ఇంటి పిల్లకు పరువే ఆస్తి. అదే లేకపోతే దీన్ని ఎవడు చేసుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు.

నిజానికి కమలకు ఆ అబ్బాయికి మధ్య పవిత్రమైన స్నేహ భావమే తప్ప ఇంకే తప్పుడు విషయాలు లేవు. అతనికే అంతుపట్టని లెక్కలను ఆమె సులువుగా పరిష్కరిస్తే ఆమె తెలివికి ముగ్ధుడై ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తమ హద్దుల్లో ఉంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

ఆ సాయంత్రం సుగుణమ్మని చల్ల గాలి కోసం అని బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి , కమల మిషను పనికై కూర్చుంది. అప్పుడే వచ్చిన ఆ అబ్బాయి "కమలా! దూరవిద్య ద్వారా డిగ్రీ చేస్తా అన్నావ్ గా .. అప్లికేషన్ తీసుకు వచ్చాను. నువ్వు పూరిస్తే పంపేద్దాం" హుషారుగా చెప్పాడు. కమల లాంటి తెలివైన అమ్మాయి ఇలా కుట్టు పనులు చేసుకుంటూ ఉండటం చూడలేక దూర విద్య కై ప్రోత్సహించాడు.

"అవునా! ఏది ఇటివ్వు" అని ఆత్రుతగా లేవబోతుంటే తూలి అతనిపై పడింది. అప్పుడే వచ్చిన ప్రకాశం వీరిద్దరినీ చూసి హతాశుడయ్యాడు.

"కమలా!!"ఇల్లు దద్దరిల్లేలా అరిచేసరికి, ఇద్దరూ లేచి నుంచున్నారు. ఆ అబ్బాయికి ఏం చెప్పాలో తెలియక అక్కడ నుండి నిష్క్రమించాడు.

" ఇదా ఇంట్లో ఉండి నువ్వు చేసే భాగోతం?" తలుపు దగ్గరగా వేస్తూ ఆమెపై విరుచుకు పడ్డాడు.

"నాన్నా! "

"ఛీ. నన్నలా పిలవకు పాపిష్టిదానా! నా కడుపున చెడబుట్టావ్ కదే.." చిరాకు పడ్డాడు.

ఇప్పటి వరకూ కమల చేసిన త్యాగాలు మర్చిపోయాడు. కోపం ఆలోచనల్ని భ్రష్టు పట్టించింది

"నాన్నా! నన్నే అనుమానిస్తున్నారా"

"నా కళ్ళతో నేను చూశాక కూడా నిన్ను నమ్మాలా?" అతను మొహం తిప్పుకున్నాడు.

కమల సుగుణమ్మను చూసింది. "అమ్మా! నువ్వైనా చెప్పమ్మా నా తప్పు లేదని. నీ ముందేగా మేము మాట్లాడుకునేది. నీ ముందేగా మేము కలుసుకునేది. నువ్వే చెప్పమ్మా నాన్నకు నేను తప్పు చేయలేదని. మాట్లాడమ్మా.." కమలకు తన తల్లి తో ఎలా మాట్లాడించాలో తెలియట్లేదు. ఆ పిచ్చి తల్లి అలాగే దిక్కులు చూస్తూ కూర్చుంది.

"ఇక లాభం లేదు. నీకు తొందరగా పెళ్లి చేసెయ్యాలి"ప్రకాశం తన నిర్ణయాన్ని చెప్పాడు. కమల ఏడుస్తూ కూర్చుంది

అనుకున్నదే తడవుగా కొద్ది నెలల్లోనే ఒక మోస్తరు సంబంధం చూసి పెళ్లి చేసేశారు. చదువు కోవాలనే కమల ఆశలు ఇంకిపోయాయి. అత్తవారింట్లో కమలను ఒక పనిమనిషిగానే తప్ప ఇంటి కోడలిగా వారెప్పుడూ భావించలేదు. ఒక తెలివైన అమ్మాయి పరిస్థితులకు లోబడి ఇలా ఎందుకూ పనికిరాని దద్దమ్మలా మిగిలిపోయింది.

'ఛీ! నా జీవితం ఇలా అవ్వడానికి కారణం అమ్మేగా ..ఆమె లేకపోతే నాకీ అవస్థలు ఉండేవి కావు. నేనూ అందరిలా చదువుకుని ఉద్యోగం చేసుకునేదాన్ని. నా దగ్గర చదువుకున్న రచన ఇప్పుడు లెక్కల టీచర్ గా వేలకు వేలు సంపాదిస్తోంది. నేను మాత్రం అంట్లు తోముకుంటూ, గొడ్లు గోదాములు చూసుకుంటూ బతుకుతున్నా. నేనేం పాపం చేశాను దేవుడా! నాకెందుకు మంచి అమ్మని ఇవ్వలేదు?’ ఇలా బాధ పడుతూ కాలం వెళ్ళదీసింది.

తన పరిస్థితి ఈవిధంగా అవ్వడానికి సుగుణమ్మ కారణం అని ఆమె మనసులో బలంగా నాటుకునిపోయింది.

కాలం గిర్రున తిరిగింది. కాలంతోపాటే ప్రకాశం కూడా కాలంలో కలిసి పోయాడు. ఒంటరిగా ఉన్న సుగుణమ్మను తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆమె అత్తయ్య ఒప్పుకోలేదు. ఆమెను ఇంట్లో ఉంచుకుంటే లేని పోని సమస్యలు వస్తాయని వారించింది. కమల భర్త కూడ తల్లినే సమర్ధించేసరికి, కనీసం పశువుల కొట్టంలో అయినా ఉంచనిమ్మని ప్రాధేయపడింది. ఆమె అంతలా అడుగుతుంటే చేసేది లేక సుగుణమ్మను పశువుల కొట్టంలో ఉంచారు. ఒక నులుగు మంచం వేసి పశువులకు కొద్దిగా దూరంలో ఆమెకు స్థానం కల్పించారు. ఆ పిచ్చితల్లికి తను ఎక్కడ ఉందో కూడా తెలియదు. పశువుల రోత, వ్యర్థాల కంపులోనే బ్రతుకు వెళ్లదీస్తూ ఉంది. కమలకు తల్లిని అలా చూడడం బాధగానే ఉన్నా, ఏనాడూ తనకు తల్లి ప్రేమ పంచని తల్లికై అతిగా ఆలోచించి సంసారం కూల్చుకోలేక మిన్నకుండిపోయింది.

వాళ్ళు పెట్టే ఇంత ముద్ద తినడం, తనకు ఎక్కువ అయ్యింది అక్కడ ఉన్న ఆవులకు, కుక్కలకు కొద్దిగా పెట్టడం తప్ప ఇంకేమీ ఎరుగదు సుగుణమ్మ. నోరెత్తి ఒక్క ముక్క అడగదు. ఆకలేసినా దాహం వేసినా, మండే ఎండల్లో పశువుల మధ్యలో గడిపేస్తూ, వర్షాలకు వాటితోపాటు తడుస్తూ , చిక్కటి చలికాలంలో ముడుచుకు పడుకోడమే తప్ప దుప్పటి కావాలని కూడా అడుగలేని మూగ జీవి సుగుణమ్మ.

కమల ఆమెను చూస్తూనే ఉంది కానీ గుండెను రాయి చేసుకుని పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుంది.

ఒక రోజు రాత్రి కమల కూతురు వెన్నెల కనిపించకుండా పోయింది. ఎక్కడెక్కడో వెతికారు . ఎక్కడా దొరకలేదు. వెన్నెల అంటే కమల భర్తకు ప్రాణం. మూడేళ్లు కూడా దాటని తన చిట్టి తల్లి పొద్దున్నుంచి కనిపించక పోయేసరికి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

పశువుల కొట్టం నుండి సుగుణమ్మ ఏదో అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఎందుకో అనుమానం వచ్చి అటువైపుగా వెళ్ళినవారు అక్కడ దృశ్యం చూసి నోరెళ్ళ బెట్టారు. సుగుణమ్మ తన చీర కొంగు లో వెన్నెలను దాచి ఉంచి, ఆమెపై బోర్లా పడుకొని ‘కాపాడండి’ అని అరుస్తోంది.

పొద్దున్నుంచి ఊరంతా వెదికారు కానీ కొట్టంలో వెదకలేదు. వెన్నెల సుగుణమ్మ దగ్గరే ఉంది. కానీ పొద్దున్నుంచి సుగుణమ్మ తన చీరలో బంధించడంతో సొమ్మ సిల్లి పడి ఉంది.

కమల, ఆమె భర్త వెంటనే పాపను సుగుణమ్మ నుండి బలవంతంగా లాక్కుని సృహ తెప్పించే ప్రయత్నం చేశారు. కమల అత్తగారు తిట్ల పురాణం అందుకుంది. "నేను ముందే చెప్పాను ‘మాయదారి మందను ఇళ్ళల్లో పెట్టుకోరు’ అంటే నా మాట వింటేనా ! ఇంకొద్ది సేపు ఆగుంటే పిల్ల మనకు దక్కేదా? పిచ్చాసుపత్రిలో ఉంచాల్సిందాన్ని ఇంట్లో ఉంచుకుంటారు..."ఆమె నోటికి అదుపులేకుందా పోయింది.

సృహలోకి వచ్చిన వెన్నెలను గుండెలకి పొదివి పట్టుకున్న కమల నుంచి లాక్కున్నాడు ఆమె భర్త.

"ఏమైందండీ" అని ఆమె ప్రశ్నించే లోపు ఆమె చెంప చెళ్లుమనిపించాడు. ఆ దెబ్బకు అత్తగారుకూడా అదిరి పడ్డారు. వెన్నెల ఏడుపు లంకించుకుంది.

"రేపటి కల్లా మీ అమ్మను నువ్వు ఇక్కడినుండి పంపించకపోతే నాలో మృగాన్ని చూస్తావు" అతడు బెదిరించి పాపను తీసుకుని వెళ్లిపోయే సరికి ఏడుస్తూ నేలమీద కూలబడింది.

సుగుణమ్మ ఎందుకో నవ్వుతోంది. ఆమె నవ్వు చూసి కమలకు ఒళ్ళు మండింది. "ఎందుకమ్మా నవ్వుతున్నావ్...చిన్నప్పటి నుండి నన్ను హింసిస్తూ ఉన్నావ్ కదా. అసలు నన్నెందుకు కన్నావ్? నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెంచావ్...నా చదువును దూరం చేశావ్..నా స్నేహితులని దూరం చేశావ్..బంధువులను దూరం చేశావ్. ఇప్పుడిప్పడే దక్కిన నా అత్తవారి ప్రేమ కూడా నాకు దూరం చేస్తున్నావ్...నీకో దండం అమ్మా! నన్ను కన్న పాపానికి జీవితాంతం నిన్ను భరించాలంటే నావల్లకాదు తల్లి...నీకో దండం! ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా!"అంటూ ఏడుస్తూ కూర్చుంది కమల. సుగుణమ్మ శూన్యం లోకి చూస్తూ నవ్వుతూనే ఉంది.

కమల అత్త వచ్చి కమలను లోపలకి తీసుకువెళ్ళి ఓదార్చింది. ‘వాడేదో కోపంలో చెయ్యి చేసుకున్నాడు. అదేమీ మనసులో పెట్టుకోకు’ అని సర్దిచెప్పింది.

బయట జోరున వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది. పశువుల పాకలో సుగుణమ్మ ఆ వర్షానికి, చలికి ఒణికిపోతూనే నవ్వుతూ కూర్చుంది .

ఆమెను లోపలికి తీసుకువద్దామని అనుకున్న కమల, భర్త తీక్షణమైన చూపులకి తలోగ్గి మిన్నకుండిపోయింది.

తెల తెలవారుతోండగా కారు మబ్బులన్ని తొలగి, నిర్మలంగా ఉన్న వాతావరణంలో పశువుల పాకలో అరుపులకి ఇంటిల్లిపాదికీ మెలుకువ వచ్చింది. కుక్కలు బీభత్సంగా అరుస్తున్నాయి. వాటికి జతగా ఆవులు కూడా. "మళ్లీ మీ అమ్మ ఏం చేసిందో" అన్నట్టు ఉన్న భర్త చూపుల్ని తట్టుకుంటూ కొట్టంలోకి వచ్చింది కమల.

సుగుణమ్మ చుట్టూ కుక్కలు చేరి అరుస్తున్నాయి. అనుమానం వచ్చి వాటిని బెదరగొట్టి సుగుణమ్మను తాకి చూసాడు కమల భర్త. చలనం లేకుండా నిర్జీవమైన ఆ పిచ్చితల్లి దేహాన్ని తాకి చూడబోతే చల్లగా ఉంది.

"మీ అమ్మ చనిపోయింది కమలా! " మెల్లగా చెప్పాడతను .

"అమ్మ చనిపోయిందా!" కమలకు బాధ కలుగుతున్నా ఏదో బరువు తీరినట్లు ఉంది.

సుగుణమ్మ చనిపోయిన విషయం ఊరు ఊరంతా పాకింది. ‘అయ్యో పిచ్చమ్మ చనిపోయింద’ని అందరూ వచ్చి పోతున్నారు. ‘పిచ్చమ్మ కాదు సుగుణమ్మ’ అని వాళ్ళకి అరిచి చెప్పాలని ఉంది కమలకు. కానీ చెప్పలేక మిన్నకుండి పోయింది.

‘ఆవిడెప్పుడూ నీకు తల్లి ప్రేమ అందించక పోయినా తల్లిలా ఆమె అలనా పాలనా చూశావ్’ ‘తల్లి ఉండి కూడా తల్లి లేని పిల్లలా పెరిగావు’

‘ నీతోటి పిల్లలు ఆడుకుంటుంటే నువ్వు మాత్రం ఇంటి పనులు చేసుకున్నావ్’.

‘ఆఖరికి అత్తగారింట్లో అగచాట్లు పడుతూ కూడా ఆమెను తెచ్చి పెట్టుకున్నావు’

‘ నీలాంటి కూతురు అందరికీ ఉండాలమ్మా..నీలాంటి కూతురుని కన్న సుగుణమ్మ అదృష్టవంతురాలు’

ఒక్కొక్కరు ఒక్కోలా చెపుతూ పోతూ ఊరట కలిగిస్తున్నారు.

"కాదు సుగుణ లాంటి అమ్మ దొరకడం కమల అదృష్టం." కంచు కంఠంతో ఎవరో అంటుంటే అందరూ అటువైపే చూసారు. ప్రసాదు మావయ్య..ఇన్నాళ్ళకి వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కమల అతన్ని. ప్రకాశంతో ఏదో గొడవ పెట్టుకుని విడిపోయారు. సుగుణమ్మ చనిపోయిన విషయం తెలిసి వచ్చాడు.

" అసలు సుగుణ లేక పోతే కమల బతికుండేదే కాదు. " అతను ఏం చెపుతున్నడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

"అసలు మీ అమ్మ పిచ్చిది ఎలా అయ్యిందో తెలుసా కమలా?! " అతను ప్రశ్నిస్తుంటే మిన్నకుండి ఆయన్నే చూస్తూ ఉంది.

" నువ్వు అప్పుడు చంటిపిల్లవి. మీ నాన్న షాపుకి కావల్సిన వస్తువులు కొనడానికి పొరుగూరు వెళ్ళాడు. ఆ రోజు భయంకరమైన తుఫాను. ఇళ్లకు ఇల్లే ఎగిరిపోతుంటే..బయటకు వెళ్ళలేక, గుడిసెలో ఉండలేక నాన అవస్థలు పడింది మీ అమ్మ. వర్షం ధాటికి తాళలేక మీ పూరి గుడిసె కూలిపోయింది. నీపై ఆశలు వదులుకున్న మీ నాన్న మరునాడు వచ్చి చూస్తే మీ అమ్మ తలపై దూలం పడి రక్తపు మడుగులో ఉంది. ఆమె చీరకొంగులో నిన్ను కప్పి, నీపై బోర్లా పడి నీకు తన ప్రాణం అడ్డువేసి కాపాడింది. అది తల్లి ప్రేమ..ఇప్పుడు చెప్పమ్మా! అటువంటి తల్లిని పొందిన నీవు అదృష్టవంతురాలవా కాదా?" గద్గద స్వరంతో ఆయన ప్రశ్నించారు.

మౌనంగా తన తల్లిని తల్చుకుంటూ ఆమెలాగే దిక్కులు చూస్తూ కుప్పకూలింది కమల.

***సమాప్తం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి > కీటో డైట్


రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 30 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసిన నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియో లో ప్రసారం అయ్యింది.






1,309 views2 comments

2件のコメント


Korikani Anand
Korikani Anand
2021年2月28日

MEE RACHANAA THEERUKU JOHAARLU. KADHA CHAALAA CHAALAA BAAGUNDI.HRUDAYAANNI PINDESAARU.

いいね!

Trinadhrao Nanda
Trinadhrao Nanda
2021年2月10日

కథని రమ్యంగా వ్రాసారు. ఆర్ద్రత ఒలికించారు. ఊహించని మలుపుతో ముగించారు. అభినందనలు.

いいね!
bottom of page