top of page

కీటో డైట్


'Keto Diet' written by Kiran Vibhavari

రచన : కిరణ్ విభావరి


"ముందు కంగారుకు మళ్లే వేలాడే ఆ పొట్ట తగ్గించు. ఆ తర్వాత ఆలోచిద్దాం" సమీర మాటలు చెవులలో మారుమ్రోగుతుంటే విద్యాపతికి ఎక్కడా లేని కోపం వచ్చింది ఆమె మీద కాదు అతని బామ్మపై. 26 ఏళ్ల విద్యాపతి ఓ మంచి సాఫ్టువేరు కంపెనీలో లక్షల్లో సంపాదిస్తున్నా ఏంటో ఆ దిక్కు మాలిన పొట్టవల్ల పెళ్ళికాకుండా మిగిలిపోయాడు. చూడగా చూడగా పక్కింటి సమీర తెగ నచ్చేస్తుంది ఈ మధ్య. అదే విషయం ఆమెతో చెబితే ఇదిగో ఇలా వెక్కిరించింది.

"బామ్మా!!" ఇంటికి వస్తూనే ఇల్లు దద్దరిల్లేలా అరుస్తూ పిలిచాడు. బామ్మ ఆ చేత్తో గరిటె, ఈ చేతితో గిన్నె పట్టుకుని అచ్చం అన్నపూర్ణాదేవిలా బయటకు వచ్చింది.పైకి చాదస్తపు మనిషిలా కనిపించినా అబ్బో మంచి గడుసుపిండం, గొప్ప మాటకారి కూడానూ.

"ఏమైందిరా.. ఆ గావు కేక ఏంటి? గోంగూర పచ్చడి అనుకుని అక్కడ పెట్టిన గోరింటాకు ముద్ద కానీ తిన్నావా ఏంటి? ఆషాడం అని పక్కింటి సుజాత ఇచ్చింది. చేతులు ఖాళీ లేవే పిల్లా అంటే డైనింగు టేబుల్ మీద పెట్టి పోయింది. అదేమన్నా లాగించేసేవా?" క్షణం కూడా గుక్క తిప్పుకోకుండా వాగేసి తనదారిన తను వంటగది లోకి వెళ్లిపోయింది పాలు పొంగిపోతున్నాయని. "ఏంటే బామ్మా నేను బాధతో అరిస్తే నీకు గావు కేకలా అనిపించిందా?!" ఆమె వెనకే వెళ్తూ ఉక్రోషంతో ఊగిపోయాడు విద్యాపతి. ఈరోజు ఈ ముసలిదాంతో తాడో పేడో తేల్చుకునేందుకు నిశ్చయించుకున్నాడు.

"ఏమయిందిరా పతీ, ఎందుకావేశం? ఇంద, ఈ చల్లటి జున్ను తిను నీకోసమే చేశా"అంటూ నోట్లో పెట్టబోయింది.

"చాల్లే తీయ్'" విసిరికొట్టాడు. బామ్మకు కోపం వచ్చింది. ఎప్పట్లాగే తన రాగం అందుకుంది. "అవునురా తల్లిదండ్రులు లేని పిల్లవాడివని కంటికిరెప్పలా కాళ్ళు కందకుండా పెంచితే ఇదేరా నువ్విచ్చే ప్రతిఫలం. నాకు తగిన శాస్తే అయ్యింది. మీ పిన్ని వాళ్ళు నిన్ను తీసుకువెళతాము అన్నా ‘లేదు. వాడు నా బిడ్డ, నేను పెంచుకుంటా’ అని ఆ పసిగుడ్డును ఇంత వాణ్ని చేశా చూడు. నీతో మాటలు పడడానికా? మా ఆయనైనా ఎప్పుడూ నన్ను విసుక్కోలేదు." ముక్కు చీదుకుంది. విద్యాపతి ఎప్పుడు ఆమె మనసు బాధ పెట్టినా, ఆ దండకం చదవడం ఆమెకు అలవాటు. అవునుమరి... చిన్నప్పుడే ఏక్సిడెంట్ లో అతని తల్లిదండ్రులిద్దరూ చనిపోతే చేరదీసి పెంచుకుంది.

"అబ్బా.. వారానికోసారి ఈ దండకం చదవకపోతే ఉండవుగా" అంటూనే ఏడుస్తున్న బామ్మ దగ్గరకు చేరాడు." నాకు మాత్రం ఎవరున్నారే నువ్వేగా.. కోపం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అవన్నీ నీతోనేగా పంచుకునేది .బామ్మా ఐ లవ్ యూ నే" బామ్మను క్షణాల్లో ఐసు చేసేశాడు.

"చాల్లే బోడి సంబడం. మీ తాత కూడా ఇంతే. ఇలాంటి మాటలతోనే ముంచేసేవాడు."అని బుగ్గగిల్లింది.

"ఇదిగో. నన్ను ఆ ముసలాడితో పోల్చకని ఎన్ని సార్లు చెప్పాలి. ఆయన పేరు పెట్టి సగం పరువు తీసావ్" మొహం తిప్పుకున్నాడు.

"ఏమైందిరా ఆ పేరుకు! విద్యాపతి అంటే విద్యకు అధిపతి. మీ తాత కు చదువు లేకపోయినా ఆ పేరు బట్టే అందరూ గౌరవం ఇచ్చేవారు తెలుసా" మురిపెంగా చెప్పుకుంది.

"ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందటే అటువంటి పేరు? ఒక్కడిని.. ఒక్కడిని చూపించు" విసుక్కున్నాడు విద్యాపతి.

"గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అలానే ఉంటాయి గాని ఇంతకీ ఈ రోజు సంగతి చెప్పు. ఎందుకీ రుస రుసా?" అడిగింది బామ్మ.

చెప్పటానికి కొంచెం తటపటాయించాడు. " బామ్మా! నేను ఒకర్ని ప్రేమిస్తున్నాను" సిగ్గు పడుతూ బామ్మ ఒళ్ళో తలపెట్టిపడుకుని చెప్పాడు.

"ఎవర్నిరా?" గోముగా అడిగింది.

"మరే ..పక్కింటి సుజాత గారు లేరూ.." బామ్మ చీర నలుపుతూ మెలికలు తిరుగుతూ చెప్పాడు.

"ఛీ ఛీ భడవ! ఆమె నీకు ఆంటీ అవుద్దిరా"

చివాల్న లేచాడు.

"ఇదిగో చెప్పేది సరిగ్గా వినవు కదా! ఎప్పుడూ తొందరే" విసుక్కున్నాడు.

"ఆ చెప్పు. కొంపదీసి దాని కూతుర్ని కాదుగా?" బామ్మ అడుగుతుంటే సిగ్గు పడుతూ అవునన్నట్టు తల ఊపాడు.

"ఓరి నీ సిగ్గు చిలకలెట్టుకెళ్ళ! భలే పిల్లను పట్టావ్ రా..అది చాలా గడుసుపిండం. నీకెలా పడింది?" అడిగింది బుగ్గలు నొక్కుకుంటూ.

" ఆమె నన్ను ప్రేమించలేదు..నాది వన్ సైడ్ లవ్ "బాధ పడుతూ చెప్పాడు.

"అయ్యో దానికేం మాయరోగం. చక్కగా దానిమ్మ పండులా ఉన్నావ్. ఆస్తి, చదువు ఉన్నాయి. ప్రేమించి చావొచ్చుగా. అది అందంగా ఉందని కొవ్వు." తిట్ల పురాణం మొదలు పెట్టింది. బామ్మకు కూడా సమీర అంటే ఇష్టమే ఐనా తన మనుమడుని వెక్కిరిస్తూ ఉంటే కోపం తన్నుకు వచ్చింది.

"నేను చక్కగా ఉన్నానా? ఒకసారి నన్ను చూడు. ‘కంగారుకి ఉన్నట్టు ముందు పెద్ద సంచి ఉంది తగ్గించుకో’ అని చెప్పిందే" బాధ వెళ్లగక్కాడు విద్యాపతి. నిజం నిష్టూరంగా ఉన్నా ఒక్కోసారి బాధ వేస్తోంది.

"అయ్యో అంతమాట అందీ.. ఉండు దాని తాట తీస్తా" అంటూ లేవ బోయిన బామ్మను బలవంతాన కూర్చోబెట్టి "తప్పంతా నీది పెట్టుకుని ఆ పిల్లని ఎందుకు అంటావ్?నువ్వు రకరకాలుగా వండి ఆ వంటా ఈ వంటా అని ముప్పొద్దులా మేపి ఇలా తయారు చేశావ్. ఈ పిల్లే కాదు ఏ పిల్లైనా ఇలాగే అంటాది" అని నేరం బామ్మ మీద వేసాడు.

"ఓర్ని! మధ్యలో నేనేం చేశారా నన్నంటావ్? అంతేలే తల్లిదండ్రి లేని పిల్లవాడివని…." మళ్లీ రాగం అందుకోబోయింది.

"చాల్లే ఇక ఆపు. వీటికేం తక్కువ లేదు." అని అతను గదమాయించేసరికి నోటికి చేతిని అడ్డం పెట్టుకు కూర్చుంది.

"ఇక నుండి నేను డైట్ చేస్తా. మొన్ననే యూట్యూబ్ లో చూసా 'కీటో డైట్'. ఈ రోజు నన్ను అన్ని మాటలు అన్నాక నాలో పౌరుషం వచ్చింది. నన్నెవరూ ఆపలేరు.కేవలం రెండు నెలల్లో పొట్ట తగ్గించి చూపిస్తా" ఛాలెంజ్ చేసి బయటకు వెళ్ళిపోయాడు డైట్ కి కావలసిన పదార్ధాలు తెచ్చుకునేందుకు.

"చాల్లే సంబడం. యెన్ని సార్లు చూళ్ళేదు. ఓ రెండు రోజులు చేసి మళ్లీ మామూలే " అనుకుంటూ పనిలో పడింది బామ్మ.

** *** **

కీటో డైట్ యూట్యూబ్ లో సెన్సేషన్ ఇప్పుడు. లక్షలాదిమంది ఆ డైట్ నమ్మి ఆచరిస్తూ వారి అనుభవాలు చెప్తుంటే విద్యాపతి ఊహల్లోకి వెళ్ళిపోయాడు. తను బరువు తగ్గిపోయి ఎంచక్కా సమీరను పెళ్లి చేసుకుని బామ్మా , తను, సుజాత ఆంటి, అంకుల్, అందరం ఇరుగుపొరుగునే ఉంటూ' ఆహా ఎంత అందంగా ఉంది జీవితం అంటూ # ఊహల పల్లకిలో# ఊరేగిపోయాడు.


ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ డైట్ అంతా పేపర్ లో రాసుకుని అన్నీ కొనుక్కుతెచ్చి బామ్మకు ఇచ్చాడు

"ఛీ ఛీ ..మట్టి వెధవ... మంగళవారం నాడు నీచు కూర ఏంట్రా..అవతల పారేయ్" అసహ్యిన్చుకుంది మనవడు తెచ్చిన పదార్థాలు చూసి.

"బామ్మా ఇకనుండి నో మంగళవారం నో శనివారం. వారానికి ఏడు రోజులు మూడు పూటలు మాంసమే తింటా. అదే కీటో డైట్ . అన్నం చపాతి అస్సలు వండకు. ఓన్లీ చిరు ధాన్యాలే తింటా అర్ధం అయ్యిందా " ఆర్డర్ వేసాడు.

"ఏరా నువ్వేమైనా ఆదిమానవుడివా లేక క్రూర మృగానివా ..ఉత్తి మాంసం తిని బతకడానికి. అంతలేసి మాంసం తింటే అరగక చస్తావ్. ఇంకా మూడేసి పూటలు తిని ఆ కంగారు పొట్టని ఏనుగు పొట్ట చేసుకోకు" చివాట్లు పెట్టిందా పెద్దావిడ.

"ఏనుగు పొట్టే అవుతుందో ఎలుక పొట్టే అవుతుందో చూద్దువు" అని మిగతా వస్తువులు బయట పెట్టాడు.

"ఒరేయ్ వెర్రి నాగన్న అంత కొబ్బరి నూనె ఎందుకురా నీ బొచ్చు దట్టంగానే ఉందిగా" ఆశ్చర్యపోతూ అడిగింది.

"కొబ్బరి నూనె వంటకి . నా జుట్టుకి కాదు" బదులిచ్చాడు విసుక్కుంటూ.

"ఏంటీ కొబ్బరి నూనెతో వంటా!!మనమేమైన మలయాళం వాళ్లమా..వాళ్ళకంటే అక్కడ కొబ్బరి విరివిగా దొరుకుతుంది కాబట్టి తక్కువ ధరకి వస్తుంది. ఆ నూనె వాడుతారు. అదే ఆరోగ్యం అని నమ్మి మనం తెచ్చుకోవడం ఏంట్రా సన్నాసి? పోయి ఆ షాప్ వాడికి తిరిగి ఇచ్చి రా పో"అన్న బామ్మ మాటలకి ఆమెకు తెలివిలేదని ఫిక్స్ అయిపోయి కొబ్బరి నూనె విశిష్టత చెప్పబోయాడు. "అసలు కొబ్బరి నూనె విలువ తెలుసా? కేరళా వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉంటారనుకున్నవ్ ఈ కొబ్బరి నూనె వల్లే" అబ్బాస్ హార్పిక్ ప్రకటనలో చెప్పినట్టు విద్యాపతి కొబ్బరి నూనె చేతిలో పట్టుకుని చెప్పాడు.

"ఏడ్చినట్టుంది . ఏంటి కొబ్బరినూనెకే రోగాలు పోతే మరి డాక్టర్స్ ఎందుకు? ఆసుపత్రులు ఎందుకు? కొబ్బరి నూనె తాగి బతికెయ్యొచ్చుగా..ఆ కొబ్బరి నూనెనే జాతీయ నూనెగా చేస్తే పోలా. ఇన్ని నూనె గింజలు పండిన్చడం ఎందుకు, విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం ఎందుకు? ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందిగా. వైద్య ఖర్చు కూడ తగ్గుతుంది. ఏమంటావ్?"చదువులేని బామ్మ చదువుకున్న మనుమడిని అడుగుతోంది. అతడికి ఏం చెప్పాలో తెలియక మూగ బోయి నీళ్ళు నమిలాడు.

"ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో దొరికేవి ఎక్కువగా తినాలిరా..వాళ్ళని వీళ్ళను చూసి కాదు. చైనా వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని వారిలా కీటకాలు పాములు తింటావా" మళ్లీ ప్రశ్నిoచింది.

"ఏమో బామ్మ. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుద్ది" తిరిగి ప్రశ్నించాడు.

"ఏం అవదురా ఆ కొబ్బరి వాసనతో నోట్లో ఒక్క ముద్ద పోదు. అలవాటు లేని ప్రాణం నీరసం వచ్చి కళ్లు తిరిగి పడతావు. నా మాట వినరా" నచ్చజెప్ప బోయింది.

"ప్లీజ్ బామ్మా! ఈ ఒక్కసారి నా మాట విను ప్లీజ్" మంకు పట్టు పట్టి కూర్చున్న మనమడితో ఏం చెప్పాలో తెలియక, "సరే తగలడు, నీ ఇష్టం .కానీ మంగళ శుక్ర శని వారాల్లో నేను మాంసం ముట్టను తెలుసుగా. నీకిష్టం అయితే వండుకో లేదా పస్తుండు" చీర కొంగు ఝాడిస్తు వెళ్లిపోయింది.

*********

రెండు వారాలు గడిచాయి. అన్నం ముద్ద ముట్టనేలేదు విద్యాపతి. నోరు వాచిపోయింది మాంసం తిని తినీ. మొదట్లో ముచ్చటేసింది మాంసం ఎంత రుచిగా ఉందో. కొబ్బరి నూనె కొంచెం వాసన కొట్టినా అలవాటు అవుతుందిలే అని లాగించాడు. ఇప్పుడు పోను పోను ప్రాణం లాగేస్తోంది.నెల జీతం అప్పుడే అయిపోయింది. ఉత్తి మాంసం కొనడానికి బామ్మను పెన్షన్ అడగాల్సిన పరిస్థితి. పొట్ట మాత్రం వేలాడుతూ అట్టే ఉంది అతని ప్రయత్నాన్ని వెక్కిరిస్తూ.

బామ్మ చేతి గోంగూర పచ్చడి, సాంబారు, గుత్తొంకాయ, ఉల్లిపాయ పకోడీ పులుసు, దొండకాయ ఫ్రై, టొమాటో పప్పు గుర్తుకు వస్తుంటే వాటిని ఊహించుకుంటూ మాంసం తింటున్నాడు. ఆహ నా పెళ్ళంటలో కోటా శ్రీనివాస్ లా. బామ్మ మాత్రం వీడ్ని ఊరించుకుంటూ రోజుకో వంట లాగిస్తోంది. ఆమె తింటూ పక్కింటి సుజాత, పొరుగింటి రమ్యకు ఇస్తుంటే వాళ్ళు ఇంటికి వచ్చిమరీ వంటల్ని పొగుడుతుంటే కాలు కాలిన పిల్లిలా అయ్యాడు. మింగాలేడు బయటకు కక్కాలేడు తన బాధను.

ఆషాడం వెళ్లి శ్రావణం వచ్చింది. బామ్మ వ్రతాలు పూజలు అంటూ ఘుమ ఘుమ లాడే ప్రసాదాలు చేస్తూ వాయనాలు ఇస్తోంది. నేతి గారెలు, బూరెలు, దద్దోజనం, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు. అవన్నీ ఊరిస్తుంటే జుట్టు పీక్కున్నాడు విద్యాపతి.

బామ్మ పులిహోరకు వేసిన తాలింపనుకుంటా ఇల్లంతా వ్యాపిస్తే ఆ సువాసనకు ఉండలేక పండ్లు తింటూ పళ్ళు కొరికాడు. వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్టుంది బామ్మ. ఇరుగుపొరుగు అందరూ ఉన్నారు ఇంటి నిండా. విద్యాపతికి మాత్రం ఆకలి దంచేస్తోంది. అతని ఆత్రం అర్థమైన బామ్మ ప్రసాదం అని చెప్పి అప్పటికప్పుడు పులిహోర సమీర చేతికిచ్చి పంపింది. పులిహోర తినాలి అని ఉన్నా సమీరకు చేసిన ఛాలెంజ్ గుర్తుకు వచ్చి ఏం తినకుండా వెళ్ళిపోయాడు.


అతడు ఆఫీసుకు వెళ్ళిన కొద్ది గంటల్లోనే ఆఫీస్ నుండి బామ్మకు ఫోన్ వచ్చింది. 'మీ మనమడ్ని ఆసుపత్రిలో వేసాం. తొందరగా రండి' అని దాని సారం.

బామ్మ పై ప్రాణాలు పైనే పోయాయి. ఉన్న ఒక్కగానొక్క నలుసు ఏమయ్యడో అని ఖంగారు పడింది. ఆమె అవస్థ చూసిన సుజాత, సమీర, వాళ్ళ నాన్న ప్రసాదు అందరూ ఆసుపత్రికి వెళ్లారు.

"పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోబీపీ. కళ్లు తిరిగి పడిపోయాడు. డైటింగ్ చేస్తున్నట్టు ఉన్నాడు నీరసం వచ్చి గ్లూకోస్ తగ్గిపోయింది. మంచిగా తినిపించండి మీ మనుమడికి" అని చెప్పి ఇంత మందుల చీటీ చేతిలో పెట్టాడు ఓ కుర్ర డాక్టర్. బామ్మకు కోపం నషాళానికి ఎక్కింది. విద్యాపతిని కడిగి పారేసింది. "కీటో డైట్, మీటో డైట్ వద్దురా అంటే విన్నవుట్రా. ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పటివరకు ఆసుపత్రి గడప తొక్కని వాడివిలా ఆసుపత్రిలో వచ్చి పడ్డావ్. ఒక్క రోగం కూడ రాకుండా మంచి ఆరోగ్యకరమైన భోజనంతో సుష్టుగా పెంచా నిన్ను. నన్ను చూడు గుండ్రాయిలా ఎలా ఉన్నానో. నాకు 76 యేళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా. ఎన్నిసార్లు ఈ అబ్బాయి మీ కొడుకా అని నన్ను నీగురించి ఎంతమంది అడుగలేదు? అంతెందుకు మా అమ్మ అదే మీ జేజెమ్మ 109 యేళ్లు బతికింది. బాత్రూమ్ లో జారి పడి చనిపోయింది కానీ ఇంకా ఎక్కువే బతికేదేమో.

నేనేమైనా పిచ్చిదాన్నట్రా రోజూ మీగడ కాసిన నేయిపోసి పప్పన్నం, రెండు రకాల కూరలు, ఆకుకూరలు, పచ్చళ్ళు చేసి నీకు పెట్టడానికి.

మూడు నెలలు వచ్చే జీతం ఒక్క రెండువారాలకే ఆ మాంసం ముక్కలకు తగలెట్టావ్. అయినా ఆ మాంసం కల్తీ కాదని చెప్పగలవా? ఆ కోళ్లకి ఇంజెక్షన్ లు ఇస్తారని ఎన్నిసార్లు చదవలేదు పేపర్లో. అయినా ఎవడో ఏదో చెప్తే తెలివిమానినతనంతో అన్నీ పాటిస్తావు. మొన్నెవడో అన్నీ పచ్చి కూరలు ఉప్పు కారం మాని తినమంటే అలాగే తిని అవస్థలు పడ్డావు. మీ మామయ్య పెళ్ళికి కూడా పెరుగన్నం క్యారేజీ పట్టుకెళ్ళి పరువు తీశావ్. పచ్చి కూరలు అంటూ పిచ్చి కూతలు కూస్తుంటే నీకేమైనా జబ్బు చేసిందా అని అడిగారు అందరూ. వాళ్ళకి సర్ది చెప్పలేకపోయా. అన్ని కూరలు పచ్చివి తినరనే ఇంగితం లేకపోయింది నీకు. ఇంకొకడు గోధుమ గడ్డి జ్యూసు పచ్చి కూరల జ్యూసూ తాగివుండమంటే అలానే ఉండి చచ్చావ్." అంటూ క్లాసు పీకింది బామ్మ.

"బామ్మా!!" ఆవేదనగా పిలిచాడు విద్యాపతి.

"నోర్ముయ్ బామ్మ అంట బామ్మ. నన్ను చెప్పనీ. రేపొకడు వచ్చి మీ బామ్మను వండుకు తిను అంటే అదికూడా చేస్తావేమో" రుసరుస లాడింది.

"అలా ఎందుకు చేస్తానే. నేను లావు తగ్గాలనేగా పాటుపడింది. " మెల్లిగా గొణుక్కుంటూ చెప్పాడు.

"ఆ లావు తగ్గాలి. నన్ను చూడు. నీతో పాటుగా తింటున్నాగా.లావుగా ఉన్నానా. తినేటప్పుడు ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దురా ,తిన్నవెంటే పడుకోకు నీళ్ళు ఎక్కువగా తాగు , నమిలినమిలి తిను , శారీరక శ్రమ చెయ్యి అంటే విన్నావా. ఇవన్నీ చేస్తే ఎందుకీ పాట్లు" అని మళ్ళీ కొనసాగించింది.

"ఇక నీ ప్రేమ గురించి అంటావా? ఆ పిల్ల నిన్ను 'బాన పొట్ట', 'కంగారు పొట్ట' అని వెక్కిరించినపుడు, ఆ పిల్లకు పొట్టకన్నా నీపై ప్రేమ గొప్పదే అని వివరించలేక పోయావ్. నేను వాళ్ళ అమ్మానాన్నకు, ఆ సమీరకు నీ ప్రేమ గురించి చెప్పి నువ్వెంత మంచివాడివో, ఏ దురలవాట్లు లేని అమాయకుడివో చెపితే వెంటనే నిన్ను తమ అల్లుడిగా ఒప్పేసుకున్నారు. ఆ విషయం చెప్పమని సమీరతో పులిహోర పంపించా. నువ్వూ పులిహోర కలుపుతావు అనుకుంటే పులిలా బయటకి పోయావ్" ఉన్న విషయం చల్లగా చెప్పింది బామ్మ.

బామ్మ మాటలకి అలసట అంతా మటుమాయమై "నిజమా బామ్మా! సమీర పెళ్ళికి ఒప్పుకుందా!!" వెయ్యి కాంతుల బల్బు అయ్యింది అతని మోము.

"అవ్నురా బడుద్దాయ్. బయటే ఉంది పంపిస్తా ఆగు"

"ఐ లవ్ యూ బామ్మ"హత్తుకున్నాడు చిన్నపిల్లాడిలా.

"ఆ దీనికేం తక్కువ లేదు" మురిసిపోయింది బామ్మ.

***సమాప్తం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి > అమ్మ


ఈ కథలో వెలిబుచ్చినవి రచయిత్రి స్వంత అభిప్రాయాలు. మీరు మాత్రం...సారీ....మనం మాత్రం మన డైట్ లు కొనసాగిద్దాం .😂😂😂రచయిత్రి పరిచయం : కిరణ్ విభావరి

నేను ఇప్పటి వరకూ 30 కథలూ, 4 కవితలూ రాశాను. నేను రాసిన నాలుగు కవితలే అయినా అన్నిటికీ విశిష్టమైన బహుమతులు అందుకున్నాను. NATA, NATS, జాషువా కవితా పురస్కారాన్ని అందుకున్నాను. కథల పోటీలలో కూడా తెలుగు తల్లి కెనడా అవార్డ్, స్వేరో టైమ్స్ పత్రిక వారి పోటీలో ప్రథమ బహుమతి, mom'spresso వెబ్సైట్ లో అత్యుత్తమ బ్లాగర్ గా, ఇంకా మరెన్నో పోటీల్లో బహుమతులు పొందుకున్నాను. నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితం అయ్యి, ఎందరో పాఠకుల మన్ననలు పొందాయి. ముఖ్యంగా నేను రాసిన కాఫీ పెట్టవు కథ social media లో వైరల్ అయ్యి, ప్రముఖ FM radio లో, అల్ ఇండియా రేడియో లో ప్రసారం అయ్యింది.202 views2 comments

2 Comments


Super 👌

Like

Bindu Madhavi
Bindu Madhavi
Feb 04, 2021

కీటో డైట్ మీద మంచి కధ అందించిన రచయిత్రికి అభినందనలు

Like
bottom of page