అమ్మ తీర్పు

'Amma Tirpu' New Telugu Story
Written By Pudipeddi Ugadi Vasantha
'అమ్మ తీర్పు' తెలుగు కథ
రచన : పూడిపెద్ది ఉగాది వసంత
తారంగం.. తారంగం
తాండవ కృష్ణా తారంగం..
"నా బుజ్జి కొండలే! లేత గులాబీ రేకుల్లాంటి చిన్ని చిన్ని చేతుల్ని ఎంత బాగా తిప్పుతున్నావే!" మనవరాలిని తెగ ముద్దులాడేస్తూ, దిష్టి తీస్తూ మెటికలు విరిచింది భవాని.
అంతటితో ఆవిడ ఆనందం తీరలేదు, "ఏవండీ ! ఈ బుజ్జి తల్లి చూసారా ! నేను పాడుతుంటే, ఎంత బాగా చెయ్యి తిప్పుతూ నవ్వుతోందో ?"
"ఒరేయ్ ! సాగరం, ఓమారిలా వచ్చి నీ కూతురు చేష్టలు చూడరా!"
అందరూ కోరస్ గా ఆనందిస్తున్న సమయంలో, సౌమ్య కూడా హాల్ లోకొచ్చింది చప్పట్లు కొడుతూ "వెరీ గుడ్, ఈ కంప్యూటర్ యుగం లో కూడా, ఆవిడగారు పాతచింతకాయ పచ్చడి ఆటలు ఆడిస్తూ మురిసిపోవడం, మీరు దానికి తందాన తానా అనడం " సౌమ్య మొహం ఎర్రగా కందగడ్డలా ఉంది.
ఒక్కసారిగా అక్కడి ఆనందం అంతా ఆవిరైపోయింది.
తల్లి చప్పట్లు కొట్టడం చూసి తనూ నవ్వుతూ చప్పట్లు కొట్టింది అన్నెం పున్నెం ఎరుగని ఆరునెలల విరిజ.
భవాని, శంకర్ రావు లకి పెళ్ళైన పదేళ్లకు ఒక్కగానొక్క కొడుకు సాగర్ పుట్టాడు. విశాఖపట్నం బీచ్ మీద మమకారంతో ఆ పేరు పెట్టారు కొడుక్కి. శంకర్ రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ అయ్యాక పెన్షన్ అందుకుంటున్నాడు. పదవిలో ఉండగానే, లోన్ పెట్టి మూడు పోర్షన్ ల ఇల్లు కట్టాడు. రెండు పోర్షన్ లు అద్దెకిచ్చి, ఒక పోర్షన్ లో వీళ్ళుంటున్నారు.
******
అసలే సౌమ్య చేత ఏ పని చేయనివ్వని భవాని, సౌమ్య నెల తప్పాకా, ఇటున్న పూచిక పుల్ల అటు కదపకుండా, సౌమ్య ఇష్టాలన్నింటిని అడిగి మరీ తెల్సుకుని, అమ్మలాగే అన్ని చేసి పెట్టింది.
సౌమ్య పురిటికి పుట్టింటికి వెళ్తుంటే, పసిపాపలా ఏడ్చేసింది భవాని, అంతగా మమకారం పెంచేసుకుంది.
సౌమ్యకి పండంటి పాప పుట్టింది. పాప పుట్టిన మూడో నెలలో సౌమ్య అత్తారింటికి వచ్చింది. పాప ఆలనా పాలనా అంతా భవానీయే చూసుకునేది.
*******
ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకి, ఆఫీస్ నించి వస్తూ, ఓ నలభై సంవత్సరాలున్న ఒకావిడని తనతో పాటు తీసుకొచ్చింది సౌమ్య. పాప పనులన్నీ చేయడానికి ఈ ఆయమ్మని తీసుకొచ్చానని ఇంట్లో అందరికి చెప్పింది..
"అయ్యో తల్లి నేనున్నాను కదా, మనవరాలి ఆలనా పాలనా చూసుకోడానికి, అంతకన్నా మహత్ భాగ్యం ఏముంటుంది తల్లి ఈ వయసులో మాకు" అంది బాధని అణచుకుంటూ భవాని.
"మీకు అరవై ఏళ్ళు దాటాయి కదత్తయ్యా! మీ పనులు చేసుకోడమే మీకు కష్టం, ఇంక పసిపాప పనులు చేయడం ఏమి చేతవుతాయి మీకు" నిర్దన్ద్వముగా చెప్పింది సౌమ్య.
"ఆఁ ఇంకో విషయం, మీరు సనాతన పద్ధతుల్లో చేసే వంటలు మా డైట్ కి సూట్ అవడం లేదు, పైగా మీకు ఇంక రెస్ట్ ఇవ్వాలని, ఓ వంటావిడని మాట్లాడేను. మీకు కావాల్సినవి ఆవిడకి చెప్పి చేయించుకోండి. మా ముగ్గురికి నేను చెప్పి చేయించుకుంటాను. " ఈ మాటలు చెప్తున్నప్పడు సౌమ్య గొంతులో సౌమ్యత లోపించింది.
****
మనవరాలు విరిజ కి ఐదో సంవత్సరం వచ్చేసరికి, గుండె పోటు వచ్చి, శంకర్ రావు కాలం చేసారు. పోయే ముందు తనపేరున ఉన్న ఇల్లు, భవాని పేరున రాస్తూ, ఆమె తదనంతరం, అది తమ ఒక్కగానొక్క కొడుకైన సాగర్ కి చెందుతుందని వీలునామా లో రాసారు.
కోడలి ప్రవర్తనలో మార్పు, మనవరాలిని తన దగ్గరికి రానివ్వకపోవడం, భర్త పోవడం ఇత్యాదుల వలన, మానసికంగా కృంగిపోయింది భవాని. పరిస్థితులు ఆవిడని స్తబ్దుగా మార్చేశాయి.
తను కోడలిని కన్న కూతురిలా చూసుకున్నా కూడా, కోడలు తనపట్ల ఎందుకలా విముఖత పెంచుకుందో కారణం బోధపడ్డం లేదు భవాని కి.
విరిజకి పదేళ్ళోచ్చాయి, ఐదో క్లాస్ చదువుతోంది. ఓ రోజు స్కూల్ నించి నాలుగు గంటలకి వచ్చేసరికి, రోజూ వచ్చే ట్యూషన్ టీచర్ ఆరోజు రాలేదు. నాన్నమ్మ దగ్గర కూర్చుని ఆవిడ పాటలు పాడుతుంటే, తనూ వంతపాడుతోంది.
కాకి ఒకటి నీళ్లకు, కావు కావు మనుచును..
ఎచట దొరకనందున ఎగిరి ఎగిరి పోయెను..
ఆయమ్మ ఫోన్ చేసి చెప్పినట్టుంది సౌమ్యకి ట్యూషన్ టీచర్ రాలేదని, సౌమ్య రోజుకన్నా ముందుగానే ఇంటికొచ్చింది. వచ్చి రాగానే, ఈ దృశ్యం చూసి, గబగబా లోపలికొచ్చి, విరిజని రెక్క పట్టుకుని, బరబరా ఈడ్చుకుంటూ తన బెడ్ రూమ్ లోకి తీసికెళ్ళి, గట్టిగా కేకలు వేసింది. "నీకెన్ని సార్లు చెప్పెను? నీకు లక్షలు లక్షలు ఫీజులు కట్టి పెద్ద స్కూల్ లో వేసింది, కాకమ్మ కధలు వింటూ, అమ్మలక్కల కబుర్లు చెప్పడానికి కాదు. ఇదే చెప్పడం, ఇంకో సారి, ఆ పల్లెటూరు పాటలు, మాటలు నేర్చుకున్నావంటే, నేనేమి చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త "
ఇవన్నీ చెవిన పడ్డాక, తన పట్ల కోడలి ప్రవర్తనకి కారణం బోధపడింది భవాని కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఏమి చేయాలో పాలుపోడం లేదు.
******
పిల్లలు మనం వద్దన్న పని చేయడానికే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. విరిజ కూడా సౌమ్య వద్దన్నకొద్దీ, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.
ఇక ఆగలేక, ఓ ఆదివారం కుండ బద్దలు కొట్టేసింది సౌమ్య.
"సాగర్, నేను మన విరిజ మంచి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ఎంతో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, అత్తయ్యగారు పల్లెటూరి మనిషి, పైగా అస్సలు ఏమి చదువుకోలేదు, పైగా విరిజ ఎదుగుతున్నకొద్దీ, ఆవిడదగ్గర ఎక్కువగా ఉండడానికే మొగ్గు చూపిస్తోంది. ఆవిడలాగే పెద్ద ఆరిందాలా మాట్లాడ్డం నేర్చుకుంటోంది. అంచేత, ఆవిడని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే మంచిది. పైగా ఆవిడకి ఏ పని పాటా లేక, రోజంతా బోర్ గా గడుస్తోంది. ఆశ్రమంలో అయితే తన చుట్టూ తన వయసు వారు ఉండడం వలన, కాలక్షేపం అవుతుంది పాపం. మనం వారానికి ఓ సారి వెళ్లి చూసి వద్దాము, పండగలకి, పబ్బాలకి తీసుకొద్దాం. ఏమంటావ్ సాగర్ ?"
అక్కడున్న ముగ్గురూ షాక్ అయ్యారు ఈ మాటలు విని.
"మీ నిర్ణయం చెప్పేరు, నాకు ఆలోచించుకోడానికి, కొంత సమయం కావాలి” అనేసి, తన గదిలోకెళ్ళిపోయింది భవాని.
అక్కడే సోఫాలో కూర్చుని ఆడుకుంటున్న విరిజ, ఇదంతా చూసి "డాడ్, మామ్, మీరు నాన్నమ్మని హాస్టల్ లో జేర్పించాలనుకుంటే, నన్నుకూడా అక్కడే జాయిన్ చేయండి. నేను నాన్నమ్మని వదిలి ఉండలేను, మీ ఇద్దరు మీ ఆఫీస్ పనుల్లో బిజీ గా ఉంటారు. నాన్నమ్మ దగ్గరే నాకు ప్రేమ దొరుకుతుంది! దాన్నుంచి నన్ను దూరం చేయకండి ప్లీజ్ " రెండు చేతులూ జోడించి కన్నీరు మున్నీరైంది, వృద్ధాశ్రమాల్లో పిల్లలు ఉండొచ్చా లేదా అనే పరిజ్యానం లేని పసిపిల్ల, పదేళ్ల విరిజ.
గదిలోకెళ్ళి భర్త ఫోటో పట్టుకుని వలవల ఏడ్చి, తెప్పరిల్లి, తేరుకుని, తన ఒక్కగానొక్క అక్క కామేశ్వరి కి ఫోన్ చేసి విషయం చెప్పి బావురుమంది భవాని. చెల్లిని ఓదార్చి, బాగా ఆలోచించి ఓ మంచి సలహా ఇచ్చింది అక్క కామేశ్వరి.
కామేశ్వరితో మాట్లాడాక, ఓ నిర్ణయానికొచ్చినట్టు తలపంకించి నిశ్చింతగా నిద్రపోయింది భవాని.
*******
మర్నాడు ఆగష్టు 15 అవడంతో, అందరూ ఇంటిదగ్గరే ఉన్నారు.
పొద్దున్నే, సాగర్ హడావిడి చేసాడు "అమ్మా, సౌమ్యా! అందరూ హాల్లోకి రండి, ఇవాళ స్వతంత్ర దినోత్సవం కదా, మీకు ఫ్రీడమ్ ఇస్తూ, నేనే స్వయంగా కాఫీ కలిపి తెచ్చాను, త్వరగా రండి"
కొడుకు తెచ్చిన కాఫీ కప్పు అందుకుని, కొడుకు కోడలి వైపు తిరిగి నిశ్చలమైన కంఠం తో, తన ఖచ్చితమైన నిర్ణయం చెప్పింది భవాని.
"మీకు ఇక్కడ ఉండడం కష్టంగా ఉంటే, మీ కూతురి భవిష్యత్తు కి నా ఉనికి ఆటంకం అనుకుంటే, మీరు నిరభ్యంతరంగా వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోవచ్చు. నేను మాత్రం ఈ ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్ళను, ఇది నాన్నగారు నిర్మించిన దేవాలయం. "
ఇంతలో తన రూమ్ లోంచి ఓ జెండా పట్టుకుని పరిగెత్తుకుని వచ్చి, "హే !! హ్యాపీ ఇండిపెడెన్సు డే " అని ఆనందంగా చెప్పింది విరిజ.
ఆనందంతో, గర్వంతో కళ్ళు మెరుస్తుండగా, ప్రేమగా విరిజని గుండెలకి హత్తుకున్నాడు సాగర్.
కళ్ళలోంచి నిప్పులు కురుస్తుండగా, కూతురువైపు ఎర్రగా చూసి, లోపలి కెళ్ళిపోయింది సౌమ్య.
నిశ్శబ్దం, భాషలేని భావాలకి సాక్షీభూతమైంది.
పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత
https://www.manatelugukathalu.com/profile/ugadi/profile
నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .
నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.
కృతజ్యతలతో
ఉగాది వసంత