top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

అమ్మ వెళ్ళిపోయింది


Amma Vellipoindi Written By Ayyala Somayajula

Subramanyam

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


చీకట్లు విడిపోతూ తెలతెలవారుతోన్న వేళ ...."లక్ఛీ...లక్ఛీ......'లేని ఓపికని కూడేసుకుని సాధ్యమైనంత వాయి పెంచి పిలుస్తోంది బాలమ్మ. ...పూర్వాశ్రమంలో బాలత్రిపురసుందరి.

విసుక్కుంటూ లేచి వచ్చింది లక్ష్మి నిద్ర మంచం మీద నుంచి ' ఏం కొంప మునిగింది...అర్ధరాత్రి గొంతుచించుకుంటున్నారు ? '

'తెల్లవారొస్తున్నట్టుందే లక్ఛీ, కాకులరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమయితే సమయానికి పని తెమలలేదని... హడావుడి పడతావనీ.....' అంది పెద్దావిడ.

అప్పుడు చూసింది గడియారంవంక .అయిదు దాటిపోయింది. నీళ్ళు చల్లినట్లు కోపమైతే ఉపశమించింది గాని మాటల్లో విసురు తగ్గలా.

"ఊఊ , అన్నీ మీకే కావాలి..మీరు చెప్తే గాని తెలియదా నాకు...." కుచ్చిళ్ళు దోపుకుంటూ వచ్చేసిందివతలకు.

వెళ్తూ అనుకుంది లోలోపల- నెమ్మదిగా 'వెదవది బాగానిద్ర పట్టేసింది.ఈవిడ గానీ లేపుండకపోతే చచ్చుండే దాన్ని అని.

ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది లక్ష్మి. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వసతులు అమరితే నేమి....ఇల్లాలి శ్రమ తగ్గినదా? పని రెట్టింపవుతూనే ఉంది. ఏ పనిముట్టూ చేయలేని పనులుఎన్నుంటాయని? గీజర్‌ ఆన్‌చేయాలి. డికాషన్‌ వేయాలి , పాలు కాచాలి.భర్తగారికి కాఫీ తో పాటు పేపర్‌ అందించాలి .ఆయన గారు రిటైరై పోయినా ఈ సేవలు తప్పవు .బాత్‌రూమ్‌ తలుపుమీద టవల్‌ వేసి స్నానానికి వెళ్ళమని తోయాలి .ఈ లోగా పనిమనిషికి అంట్లు పడేసి ఆవిడ గారికి స్క్రాబ్‌ , బెట్లూ, విమ్‌బార్లూ అందించాలి .వంటకి సిద్దం చేసుకోవాలి....ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది ?

ఈ కామా లేని పనుల మధ్యన ' లక్ఛీ , బాబూ' అంటూ అత్తగారి పిలుపొకటి. విసుగొచ్చిందంటే రాదు మరీ. ....కానీ పాపం ఆయనే వెళతారు. వాళ్ళమ్మ పనులన్నీ ఆయనే చేస్తుంటారు.

" నోరు చిరాగ్గా ఉందిరా ! " నిస్సహాయంగా అంది .కాలకృత్యాలకోసం ఆవిణ్ణి బాత్‌రూమ్‌ దాకా చెయ్యి సాయమిచ్చి నడిపించాలి .గంట వరకూ అక్కడే కార్యక్రమం. వీది తలుపు గడియపెట్టి ఉస్సూరుమంటూ వెనక్కి తిరిగింది .ఇందాక తాగుతూ , తాగుతూ వదిలేసింది సగం కాఫీ - డైనింగ్‌

టేఋల్‌ మీద కప్పు లో కాఫీ, గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోబోయి , గతుక్కుమంది.

' అయ్యో , నా మతిమరుపు పాడు గానూ , సొమ్మసిల్లిపోయిందేమో' కంగారుగా గిన్నెలో పాలు గ్లాసు లో పోసి పరుగెత్తుతున్నట్టే వెళ్ళింది అత్తగారి గదిలోకి లక్ష్మి.

నిజంగానే , నీరసానిగ్గాను ....ముడుచుకుపడుకుంది ముసలావిడ. జాలి లాంటిది

రాబోయింది లక్ష్మికి . దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది .

' ఏం , ఉత్త పుణ్యానికే బాబూ, బాబూ అని ఎప్పుడూ గీ పెడుతూ ఉంటారుగా ,

పాలిమ్మని ఒక్క మాటడగడానికి గొంతు పోయిందా? ' మండిపడింది లక్ష్మి.

అది కాదే, పనుల మధ్యలో పిలిచి విసిగించడమెందుకనీ......' గొణిగింది అమ్మ .

కింద పోర్షన్‌ లో నే నుంటే పై పోర్షన్‌ లో డాబాలో అన్నయ్యుంటాడు .

"ఉద్దరించారు .ఏ శోషో వచ్చి పడిపోతే మళ్ళీ మేమేగా నెత్తిమొత్తుకుంటూ సేవలు చేసేది. కింద నుంచి వాళ్ళను కూడా పిలవాలి ."ఆవిడ కూర్చోడానికి సాయం చేసి

గ్లాసు చేతి కందిస్తూ అంది లక్ఛ్మి నేరమారోపిస్తున్నట్టుగా .

అమ్మ వేడి తాగదు. మెల్లా తాగుతుంది.

గ్లాసులో పాలు ఒక్క గుటక వేసింది అమ్మ. " నువ్వు కాఫీ అన్నా పూర్తి గా తాగావా? అంది కోడలి మొహం లోని అలసట గుర్తించినట్టు .ఆ మాట లోని వాత్సల్యం ఒక్క

క్షణం గుండె ని కదిలించినా ,గుర్తించనట్టుగా....మొహం పక్కకు పెట్టి ' తాగాను, అయినా ప్రతీదీ ఆరా తీయొద్దనీ మీకు ఎన్ని సార్లు చెప్పాను ? ఊ , ఊ తాగండి.నా కవతల బోలెడు పనులున్నాయి "అంది లక్ష్మి

గబగబా తాగే శక్తి అమ్మ కు లేదు .నాలుగేసి చుక్కలు చప్పరించినట్లుగా మింగుతుంది. కాస్త పోనీలే పాపం అని నేను కానీ , అన్నయ్య కానీ వదిలేసి అలానే నించుంటాం .

"ఫలహారమేమిటి చేశావ్‌?" కోడలిని మళ్ళీ అడగకుండా ఉండలేదు.ఎక్కువ సమయం ఆ మంచం మీదనే ఏమో-- మనిషి అలికిడి అయితే చాలు ఒక్కొక్కసారి తిరిగిచూస్తుంది .

మళ్ళీ నొచ్చుకున్నట్లు , కించ పడుతున్నట్టూ ' వద్దులేవే...మళ్ళీ ఏమి అవస్థ పడు

తావ్‌ , ఉన్నదేదో పెట్టేయి. తినేస్తాను.' '

' అవును పాపం ...ఏది పడితే అది ఎందుకు పెడతాము. ఆ తరువాత నమల్లేక దవడలు , చెంపలు, లాగేస్తున్నాయని గోలపెడతారు.వద్దు...వద్దు....మీకా నొప్పి వద్దు.... మాకా నిందా వద్దు" అని వెళ్ళి పోయింది లక్ష్మి.

గోదుమరవ్వ వేయించి గుౙన గూడులా వండి, పళ్ళెం లో పెట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్ళింది. టీవీ దగ్గర కూర్చోపెట్టాము అమ్మని. భక్తి టీవీ ప్రోగ్రాములు వస్తోంటే. కాస్త ఆవిడకి కూడా కాలక్షేపం .

చినజీయరు స్వామివారు ప్రతీయేడు చేస్తునట్టే ఈ ఏడాది కూడా మహాలక్ష్మీ యాగం చేస్తున్నారు.అమ్మ ఎంత ఆనందంగా ‌చూస్తోందో! విపరీతమైన జనం. అందరి కళ్ళ లోనూ నిమీలితమైన భక్తిభావం, తన్మయత్వం . పవిత్రమైన వస్తువులతో మరింత పవిత్రంగా అగుపడుతున్న యజ్ఞవేదికా, పండితుల వేదఘోష , పురోహితుల మంత్రోఛ్ఛాటనా వెల్లివిరిసే అధ్యాత్మిక శోభ!

అవన్నీ వింటూ పరవశంగా చూస్తూ ఉంటే...ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్లు అనుభూతి .

ఆ రోజు రవీంద్రభారతి లో మంచి ప్రోగ్రాము ఉందంటే నేను బయలు దేరబోయాను .మందులూ గట్రా అన్నీ మేమే అన్నదమ్ములం ఇస్తూ వుంటాము కూడా .ఆ రోజు

అన్నయ్య కూడా లేడు .ఏదో పని మీద బయటకు వెళ్ళాడు .రెండు ,మూడు గంటల్లో వెళ్ళి వచ్చేయచ్ఛు గదాని డ్రెస్‌ వేసుకుని బయలుదేరబోయాను .

కానీ నాకు మనస్కరించలేదు.రెండేళ్ళ కిందటి వరకూ. తన పనులన్నీ తనే చేసుకునేది. మరీ ఈ ఆరు నెలల నుంచీ మరీ దారుణంగా అయ్యింది పరిస్థితి.

అన్నీ మంచం మీదనే .ఏమయినా ఈ మధ్యలో జరిగితే పరిస్థతి ఏమిటీ?

పాపం ఆవిడకు 88 ఏళ్ళు. ఈ వయసు లో అన్నీ దగ్గరుండీ చూసుకోవాలి కదా! ప్రతి పనికీ నిస్సహాయంగా చూస్తూ అడిగితే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేవి.

ఎలా వున్న మనిషి ఎలా అయిపోయిందో ! ఒక్క సారి గత స్మృతులు , ఆవిడ

చెప్పిన సంగతులు జ్ఞప్తికి వచ్చాయి .

పదహారేళ్లకే పెళ్ళయి మాయింటికి వచ్చింది అమ్మ. అంటే పెళ్ళయి 72 ఏళ్ళు

అయ్యాయి. అమ్మే పెద్ద కోడలు .

రాయబారిగా ఇంట్లో కుడికాలు మోపింది మొదలు ఇంటికి తనను తాను ఒక

వారసత్వపు రాయబారి గానే భావించాలి . తన మాటలతో , చేతలతో ఇంటి పరువును అగ్రభాగాన నిలిపింది .ఆ ప్రయత్నంలో ఎన్నో సవాళ్ళు, ప్రతికూలతలు,

అంతిమంగా అమ్మ లక్షణం కుటుంబవిజయం! పరోపకారం, బంధుమిత్రుల ఆదరణ , అధ్యాత్మిక భావనలు , నైతిక విలువలు ఓ కుటుంబ సంస్కృతి పాదుకొల్పింది ' అమ్మ' .ఆ సద్గుణాలే మా తరాలకు వచ్చాయి .

ప్రతి భాద్యత ప్రత్యేకమే అమ్మకి .అమ్మ కేవలం అమ్మ కాదు. ఒకరికి భార్య , ఒకరికి కోడలు , , ఒకరికి అత్త , ఒకరికి వదిన ..... అన్ని పాత్రలూ అమ్మ సంపూర్ణంగా నిర్వహించింది. మరుదులు , ఆడ పడుచులను కూడా ఎత్తుకుని పెంచింది .విద్యాబుద్ధులు నేర్పింది . మాతో బాటు వాళ్ళు కూడా సమానంగా పెరిగారు.

అమ్మ చక్కగా పాడేది .రామదాసు కీర్తనలు ,ఎంతో చక్కగా పాడేది .శాంత గోదారిలా మంద్రస్థాయిలో పాడుతూ వుంటే తుషారబిందువులు చల్లనిగాలి వీస్తున్నట్లుగా ఉండేదా కమ్మని గాత్రం.

మనవళ్ళు ,మనవరాళ్ళు కూడా ఆవిడ చేతిలో పెరిగారు.నిరాడంబరత్వం నర

నరాన జీర్ణించు కున్న తాత్విక ధోరణే ఆమె విజయ వారసత్వం కావచ్చు.

నేర్చుకునే మనసుంటే అమ్మే ఓ విశ్వవిద్యాలయము. ఆమె నవ్వు , నడత ,సహనం , సౌశీలనం , సత్యమార్గం --ప్రతీదీ ఓ పాఠమే .అమ్మ పెంపకం లో బాధ్యత. ఉంది.ఇందులో అంతర్లీనం గా సామ్యవాద సిద్దాంతం ఉంది .

" నట్టింట నడయాడే దేవత అమ్మ " .

గదిలోంచి వచ్చేస్తూ గుమ్మం దాటేముందర వెనక్కి తిరిగి చూశాను మరో సారి . .మాగన్ను గా కళ్ళు మూసుకుని పడుకుంది అమ్మ. మనసెందు కో కలక్కుమంది నాకు . ఎవరైనా చిన్న సాయం చేస్తే గానీ చిన్న పని కూడా చేసుకోలేదు ఏదయినా అవసరమయితే- తను లేనప్పుడు.

దారికడ్డంగా ఉన్న నిస్సహాయ జీవిని కాలితో పక్కకి తోసి ముందు కెళుతున్నట్టు

' తప్పు చేస్తున్నావు ' అని చూపుడు వేలుతో ఎవరో తనని ( నన్ను) మందలిస్తున్నట్టు అపరాధభావన.

ఒక్క క్షణం అలాగే నిలబడి వెనక్కి వచ్చేసి డ్రస్‌ విప్పేసాను .నలుపును చెదరగొడుతూ తెలవారుతోన్న మరో ఉదయం .

తట్టి లేపినట్టు కళ్ళు తెరిచింది అమ్మ .పరిచయం లేని వారెవరో తనని రారమ్మని తొందరపెడుతూ లాక్కు వెళుతున్నట్టనిపించింది .

అప్పటికి రెండు రోజుల నుంచి పరిస్థితి సరిగా లేదు. అమ్మకి .ఒక సారి పిలవగా

, పిలవగా డాక్టర్‌ చెక్‌ చేసి వెళ్ళారు .అప్పటికే " కరోనా" మహమ్మారి విళయతాండవం చేస్తోంది.

ఆరోజు కూడా స్నానం అవీ లేవు అమ్మకి. చెయ్యనని మొండి కేసింది .పోనీలే అని

వదిలేశాము .ఆ రోజు ఏదో విధంగా అన్నీ నెట్టుకొచ్చాము .అంతకు ముందు వారం

రోజులనుంచి ఇమ్యూనైజేషన్‌ ఇస్తున్నాము, ఊపిరి బాగా వదలటానికి .అట్లానే

ఆ రోజు దాదాపు పావు తక్కువ ఏడింటికి నేను , ఇంకొకరు అమ్మ పక్కన ఉండి

, అమ్మకిరువైపులా వున్నాము .మెల్లగా ఇవ్వడం మొదలు పెట్టాము. అసలు ఆ రేజు మాట కూడా సరిగా లేదు. అమ్మ మాట చాలా స్పష్ఠం గా ఉంటుంది .చిన్నగా మాట్లాడినా .

ఇస్తూనే ఉన్నాము. ఒక్కసారిగా నాభుజం మీదికి ఒరిగి పోతున్నట్టనిపించింది.

అంతే ఒక్కసారి అమ్మని గట్టిగా పట్టుకుని " అమ్మా! , అమ్మా! " అని పిలిచాను. గుండెల మీద చాలా సార్లు మెల్లగా మోదాను .కానీ లాభం లేకపోయింది .అంతే .

బాధా -- విచారము - లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన

సుఖానుభూతా? ఏమో --

ఏదో చెప్పలేని భావం చుట్టేసింది ఆ క్షణం నాకు .


అంతే " అమ్మా " అంటూ కెవ్వున కేక వేసి కూలబడ్డాను .

పండుటాకు రాలిపోయింది .అమ్మ వెళ్ళి పోయింది . ముసలి వగ్గు అయినా

సరే " మరణించింది" అనగానే ఎవరికైనా బాధ కలుగడం సర్వ సహజం.

అయితే ఆ విచారం లో ' మిగులమగ్గిన పండు తొడిమ నుంచి రాలకుండా ఉండదు కదా' అనే వైరాగ్యం కించిత్‌ కలుగుతుంది .

అమ్మ పోయిన వార్త తెలిసి ఇంటికి వచ్చిన బంధువులు అందరిదీ అదే

ధోరణి. మిత్రులూ , పరిచయస్తులూ అందరిదీ అదే ధోరణి ..పరామర్శ లోని స్పర్శ

కూడా అదే .

మాకందరికీ మాత్రం కళ్ళు తడిబారుతున్నాయి .

యధావిధిగా కర్మకాండ జరిగింది .పుణ్యవచనం ,ఆశీర్వచనం తో తతంగం

సమాప్తమయింది .

దీపాలు పెట్టే వేళ కు ఇంట్లో నలుగురు మాత్రమే మిగిలాము. పైన ఇద్దరు .కింద ఇద్దరూ .

అందరినీ బయటకు పంపేశాక అమ్మ గదిలోకి వచ్చాను .అమ్మ మంచం ఉండేదక్కడ. దాన్నిప్పుడు ఎత్తి గోడకు పెట్టేశారు .కిటికీ తలుపులు ఆవిడకు చలి వేస్తుందని, ఎప్పుడూ వేసి ఉంచేవాళ్ళము. భారమైన మనసుతో ఆ తలుపులని తీశాను. ఓ గాలితెర మెల్లగా లోపలికురికింది. మృదువుగా చెంపల్ని, మెడని తాకింది .తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి "నువ్వు అన్నం తినిరా". అన్నట్టుంది .

చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసలిన అమ్మ దూరమైపోతూ మిగిల్చిన

వెలితి అది .

అప్పటి వరకూ కడుపులో దాక్కున్న గుబులు కరిగి తెరలు తెరలు గా పై కుబికి

రాగా కింద కూలబడిపోయి చేతుల్లో ముఖం దాచుకుని బావురుమన్నాను .


గమనిక : రచయిత కోరిక మేరకు ఈ కథను కథల పోటీకి పరిశీలించడం లేదు

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


473 views0 comments

Comments


bottom of page