top of page

అణువణువున జ్వలించిన ఓ హృదయాన-1


'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 1'

New Telugu Web Series

Written By Pandranki Subramani

'అణువణువున జ్వలించిన ఓ హృదయాన' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


కొత్తగా పదోన్నతి పొందిన డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్ జీపులో ఇంటిముందు దిగి, రేపటి డ్యూటీ టైమింగ్సు విషయమై డ్రైవింగు ఆర్డర్లీకి సూచనలిచ్చి యింట్లోకి నడిచాడు. అతడిల్లు మరెక్కడో కాదు, జైలు ఆవరణకు ఆవల దక్షిణానికి కడపటి వేపే స్టాప్ క్వార్టర్సు. అతణ్ణి చూసి సెంట్రీలిద్దరూ ఫుల్ ఫోర్సుతో సెల్యూట్ చేసి ప్రక్కలకు తప్పుకున్నారు. హాలు గడపవద్దాగిన అశ్వథ్ తనొచ్చిన అలికిడి చేరలేదేమోననుకుని బూట్లు విప్పి లోపలకు నడిచాడు; సతీమణి సుందర రూప దర్శనార్థం-- తల్లి భరతమ్మ జాడ దరిదాపున కనిపించలేదు. యూనిఫాం పై షర్టు గుండీలు వదులు చేసి గదిలోపలకు ప్రవేశించాడు. ఏదో కారణం లేకుండా తన భార్య- ఆ మాటకొస్తే రసవాహిని- మందగమని అయిన ఏ స్త్రీ అయినా- బెట్టు చూపించదని ప్రేమ మందిరానికి మరొక రూపమైన తన రసిక హృదయానికి తెలుసు. హాలు నలువైపులా సుమధుర సుమదళ కుసుమాల సువాసనలు-- “ఇది మల్లియలు విరిసే కాలం, మగువలు విరబూసి నవ్వే తరుణం! “ మరి మంగళకు-- అందాలు ఆరబోసే మృదువైన సాయం సమయం! విల్లులాంటి నడుముని వయ్యారంగా వంచి, సుకుమార విగ్రహాన్ని విపంచిలా విప్పార్చి నిలువుటద్దం ముందు నిల్చుని తలంటుపోసుకున్న ఇరుల కురులను వదులుగా జారవిడిచి- చిక్కు ముడుల్ని బ్రష్ తో సుతారంగా విడదీసుకుంటూ కనిపించింది. మొగుడి రాకే తెలియని భామామణిలా కాసేపాగి, నుదుట బొట్టు దిద్దుకుని తీరిగ్గా నవ్వే చిలిపి కళ్ళతో తలతిప్పి చూసింది. భార్య అందానికి డంగైపోయిన అశ్వథ్- “వావ్! ”అనబోయి ఆపుకున్నాడు. కొందరి అందచందాలు అటువంటివి మరి. తినగ తినగ వేము తీయగనున్నట్టు చూడగా చూడగా సొగసులు ఊరిస్తుంటాయి. ఇనుమడిస్తుంటాయి. “అదేమిటి పెళ్ళాన్ని కొత్తగా చూస్తున్నట్టు అలా ఒలిచి ఒలిచి చూస్తున్నారు? అంతటి వేడి చూపులు భరించలేను బాబూ! కొవ్వొత్తినై కరిగిపోతాను. నిలువెత్తు మైనపు బొమ్మనై ఒరిగిపోతాను“ అతడికి తెలుసు- అది తనను సుతారంగా రెచ్చగొడ్డటానికి విసిరిన మొదటి వలపు హొయల బ్యూమ్ రాంగ్- అని. ఆ తరవాత యెగుర వేస్తుంది విరహ దాహపు నిస్సవ్వడి నిట్టూర్పుల విహంగాన్ని. కనురెప్పల్ని అల్లార్చకుండా మంగళను తేరిచూసాడు అశ్వథ్. తాకీ తాకని వెస్ట్రెన్ మేకోవర్ డ్రెస్సులో కళ్ళను జిగేలు మనిపిస్తూంది, ప్రవరాఖ్యుడి మనసుని గజిబిజి చేసిన గాంధర్వకన్య వరూధినిలా-- తాజాగా అరవిచ్చిన సంపెంగి పూవులా వికసించి మగడి మగటిమిని ఇముడ్చుకోవడానికి తహతహ లాడుతూంది మంగళ. అదంతా తనకోసమే! అటువంటి ట్రిమ్ అండ్ టైట్- ఏ- షేపు ఫ్లోయింగ్ వలువంటే అతడికి మిక్కిలి వ్యామోహం. మరీ మోడ్రన్ గా కాకుండా- మరీ సంప్రదాయపు దమయంతమ్మ పధ్దతిన కూడా కాకుండా నిండుదనం చెడని అందాల్ని ఆరబోయడం అందరికీ సా ధ్యం కాదు. అదొక రసాత్మ కళ- నిగూఢ వినూత్న కళ. అయితే- ఆమె ఎప్పుడూ అలా ఉండదు. ఎల్లెడలా తనను సమ్మోహపరిచేలా వెస్ట్రన్ ఫ్యూజియన్ వేర్ లో గోచరించదు. మనసు కలిగినప్పుడే మన్మధుణ్ణి బులిపించడానికి ఆటపాటలతో అల్లనల్లన వయ్యారాలు ఒలకబోసే ఋతు కన్యలా రతీదేవిలా తనను ఆనందపర్చడం వరకే ఆ అంగరంగ వైభవాలు. ఆ తరవాత భరతమ్మతో కోడలిగా- కాదు- కూతురుగా చేరిపోతుంది. చేరువైపోతుంది. అడుగడుగునా అత్తయ్యను అనుసరిస్తూ-- ఆనుపానులెరిగి మెసలుతూ తన సహజ స్త్రీత్వ హుందా తన్నాన్ని నిలనాటుకుంటుంది. అందుకే తన తల్లికి కోడలు పిల్లంటే వల్లమాలిన వాత్సల్యం. ఇక తన విషయానికి వస్తే- ఎంతైనా అందీ అందని అందాలేగా మగణ్ణి తీరని దాహంతోఊరించి అలరించేవి! ఐతే ఇక్కడ మరొకటి కూడా ఉంది. ఆడదానిని- తన ఇంటి ఆడదానని చూసీ చూడటంతోనే థ్రిల్ ఇచ్చే ఫీల్ కలగకపో తే మగాడు మోహతరంగాలలో ఎలా తేలి మునకలేయగలడు! ఒక్కొక్క ఋతురాగానికి ఒక్కొక్క రంగుని నిండుపాల పొంగునీ జోడించి ఉల్లాస విలాసాల ఊయలలో మత్తుగా మెత్తగా మరో బంగారు లోకానికి తీసుకళ్తుంది తన సతీమణి. “కరణే షు మంత్రీ శయనేషు రంభా! ” అని ఊరకేనా అన్నారు! అతడిక ఓర్వలేక పోయాడు. తాపాన్ని తట్టుకోలేక పోయాడు. మంగళాదేవి వద్దకు ఊపుతో వెళ్ళి ఆమె పెదవుల్ని ఆత్రం గా ముద్దు పెట్టుకుని చేతుల్లోకి తీసుకుని ఆలింగనం చేసుకోబోతున్న వాడల్లా చటుక్కున ఆగిపోయాడు. ”సారీ! స్నానం చేయలే దన్నది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నీది అమలిన యవ్వన పొంగు- చెదరని నిండు అందం. నిన్నుమలినం చేయడం దారుణం“- అంటూ స్నానాల గదివేపు నడిచాడు. సమయానికి పరిస్థితుల పరిధిలో చిక్కుకోకుండా తనకు తానుగా కొనితెచ్చుకోగల ఆ నిగ్రహశక్తి ఒక పోలీసు ఆఫీసరులో కర్ణకవచంలా నిభిడీకృతమై ఉండాల్సిన ఉన్నత లక్షణం! అలా వెళ్ళిపోతూన్న భర్తను చూస్తూ అనుకుంది మంగళ- “ఐ లైక్ దిస్ మ్యాన్" స్నానం ముగించి దేవుడి గదిలో కైమోడ్పులర్పించి మంగళ అందిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి ముఖ్యమైన ఆఫీసు పేపర్లు కోర్టు కేసులూ చూసుకుని డైనింగ్ టేబల్ ముందు కూర్చున్నాడు అశ్వథ్. అప్పటికి ఆంజనేయాలయంలో సుందరకాండ వినడానికి వెళ్లిన భరతమ్మ ఇంకా రాలేదు. ఆరోజు మంగళ కొత్తరకంగా చేసిపెట్టిన రొయ్యల బిరియాణీ కడుపార తిని మనసార భార్యను మెచ్చుకుని మల్లెల మధురాను భూతుల మధ్య జీవన సహచరి అందాలను తనివిదీర గ్రోలి ఆనాటి పున్నమి రాత్రిని రసమయ శృంగార కావ్యంగా మలిచాడు అశ్వథ్. చెమట చుక్కలు ప్రోగయిన ముఖాన్ని టర్కీ టవల్ తో తుడుచుకుంటూ చెదరిన బొట్టుని సరిచేసుకుంటూ మంగళ లోపలకు వెళ్ళి ఫ్రిజ్ నుండి రెండు గ్లాసుల నిండా యాపిల్ జ్యూస్ నింపుకొచ్చి, భర్తకు ఒకటిస్తూ గోముగా అంది- “మొన్న డ్యూరెక్ట్ సెక్సువల్ వెల్ బీయింగ్ టీము వాళ్ళు విశ్వవ్యాపితంగా ఒక సర్వే జరిపారు. సర్వే చేసిన తరవాత వాళ్ళేమన్నారో తెలుసా?” అని. ఏమన్నారన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడు అశ్వథ్. చిలిపితనంతో మెరుస్తూన్న ముఖంతో ఆమె బదులిచ్చింది- “లైంగిక సంతృప్తి పొందడంలో- దానిని పంచి ఇవ్వడంలో భారతీయులే టాప్- అని కితాబిచ్చారు. వాళ్లలో మీరొకరన్నమాట”. అతడేమీ అనలేదు. గ్లాసులో ఉన్న యాపిల్ జ్యూసుని సగం ఖాలీ చేసి తనవేపు మత్తువీడని చూపులు సారిస్తూన్న మంగళ కళ్లలోకి చూస్తూ- “ఏమిటోయ్ మొగుణ్ణి అలా మురిపించేస్తున్నావు! సంగతేమైనా ఉందా?” అని అడిగాడు. “అదేనండీ! మీకింతటి ఆనందాన్ని మీ భాగస్వామినిగా నా హృదయపు వెండి పళ్ళెంలో గోవుపాలలా ఉంచి అందిచ్చాను కదా! మరి మీరు కూడా మీ భార్యామణకి కాస్తంత యెక్కువ సంతోషాన్ని పంచలేరా- అని అడుగుతున్నాను. సంతోషాన్ని ఇవ్వలేక పోయినా పరవాలేదు. కాస్తంత తెరపిని కూడా ఇవ్వలేరా- అని నిలదీస్తున్నాను” తను కూడా జ్యూస్ చప్పరిస్తూ భర్త ప్రక్కన చేరుతూ అడిగింది. భార్యమణి లా చదువుకుంది కదా- పొడివేయడంలో దిట్ట- అనుకున్నాడు అశ్వథ్. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నానికి పూనుకోవాలను కుంటుందేమో! తన విషయం అలా ఉంచితే-- తల్లికి కోడలు పిల్ల బయటి ప్రపంచంలోకి వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. దానికున్న కారణం మంగళకు తెలుసు. ఇది తెలిసుండి కూడా మంగళ ఉద్యోగ ప్రస్తావన మళ్ళీ ఎందుకు తెస్తుందో! అతడదే అడిగాడు భార్యను- మళ్ళీ ఉద్యోగం సంగతి లేవదీస్తున్నావా- అని. “నా ఉద్యో గం మాట తరవాత చూద్దామండీ! ఈ విషయంలో అత్తయ్య ఆలోచన కూడా కావాలి కదా! ” “సరే- నీకు సంతోషం కలిగించేదేమైనా ఉంటే- చేయకుండా విడిచి పెట్టి ఉంటే- అడుగు. నన్ను దోచుకున్న చిన్న దానివి కదా! చేస్తాను”. మంగళ గలగల నవ్వుతూ బదులిచ్చింది-- . “నాకు పారిజాత పుష్పమూ వద్దు- శమంతకమణీ వద్దు. చిన్నపాటి సహాయం చేసి పుణ్యం కట్టుకుందురూ! ” తలూపాడతను; అలసిన మంగళ ముఖంలోకి- ముఖవర్ఛస్సుని ఇనుమడింపజేస్తూన్న బొట్టువేపూ ముచ్చటగా చూస్తూ. బొట్టులేని ముఖమూ మెడన మంగళసూత్రం లేని బోడితనమూ చూస్తే తన తల్లికి మహా చిరాకు. అంచేత అత్తయ్యగారి ఆలోచనల్ని తు చ పాటి స్తుంటుంది. ఇటువంటి మోహపూరిత సమయాలలో కూడా బొట్టు చెదరితే వెంటనే వెళ్లి దిద్దుకుంటుంది; ఎక్కడ మరచిపోతుందేమోనని స్నానాల సమయంలోకూడా మెడనుండి తాళి బొట్టుని తీసి ప్రక్కన పెట్టదు. హైలీ సెన్సిటివ్! రసాత్మక కుటుంబ జీవితం దెబ్బతినకుండా ఉండాలంటే యిటువంటి స్త్రీలతో మోతాదుకి మించని రీతిలో మెసలు కోవాలి. భర్త చూపుల్లోని సూటిదనాన్ని గమనించిన మంగళ యెట్టకేలకు విషయానికి వచ్చింది. “రేపు నన్ను మీ జైలు గోడల మధ్యకు తీసుకెళ్ళకండి బాబూ! ప్లీజ్! ” అశ్వథ్ కళ్లు మిటకరించి చూసాడు- “అదే- ఎందుకంట?” అని అడుగుతూ మనసున అబ్బుర పడ్డాడతను- దీనికేనా ఇంతటి ఋతురాగాల ఆలాపనలూ నవవిధ విన్యాసాలూనూ! ఆమె కొనసాగించింది. “అక్కడికెళ్ళొస్తే నాకదోలా ఉంటుందండీ! పోయినేడాది యేదో ఫంక్షన్ కని నన్ను తీసుకెళ్ళారా- ఆరోజు పూటంతా మూడ్ అవుటయిపోయిందిండి”. అతడు భార్య వేపు తేరిపార చూస్తూ అదుపు తప్పకుండా తనను తాను నిదానపర్చుకుంటూ అడిగాడు- “దీనికింతటి ఎక్స్ ప్లనేషనా! ఎవరికీ లేనిది నీకు మాత్రమే మూడ్ ఎందుకు అవుటవుతుందో విడమర్చి చెప్పమంటున్నాను”. మంగళాదేవి కాసేపాగి మిగిలిన పండ్ల రసాన్నిచివరి చుక్క వరకూ తాగి మంద్రస్వరాన బదులిచ్చింది- “మొన్న ఊళ్ళో ఉన్నపాటున ఎండలకు ఉష్ణోగ్రత పెచ్చరిల్లిపో యింది కదండీ! అప్పుడు మా జంతుప్రేమికుల సమితి వాళ్లమందరమూ చేరి జ్యూలో ఎండతాపానికి జంతువులు ఎలా విలవిల్లాడిపో తున్నా యో - వాటికి జ్యూ సిబ్బంది ఎటువంటి యేర్పాటు చేస్తున్నారో చూడటానికి వెళ్ళాం. అక్కడ యేదోలా గట్టి పోరాటమే చేసి, అక్కడి జంతువులకు తుంపరపడేలా ఫాగర్సు యేర్వాటు చేసి వచ్చామనుకోండి. అప్పుడు, అడవి కుక్కలు- కొమ్ములున్న పందులూ- తోడేళ్ళు- తెల్ల పులులు- నల్ల చిరుతలు- ఎలుగులూ వాటి కోసం కట్టిన ఎన్ క్లోజర్లలో స్వేఛ్ఛలేని స్థితిలో అక్కడే అసహనంగా వింత వింత గొంతులతో గిరగిరా తచ్చాడటం చూసి- నాకెందుకో ఆనాడు మీ జైలు గోడల మధ్య చూసిన ఖైదీల ముఖాలే కళ్ళముందు మెదిలాయండి. కడుపులో త్రిప్పుడు వంటిదేదో బయల్దేరు తున్నట్లనిపించింది. మనసంతటా హెవీనెస్ చోటు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ బ్యారెక్సులోని ప్రిజినర్సుని చూస్తే-- “ “ఇక్కడ కాస్తంత ఆగు మంగళా! నీ మానసిక పరిస్థితి అర్థమైంది. ఖైదీలను చూస్తే నీకు భారీ పంజరాల్లోని పక్షులూ- ఎన్ క్లోజర్ల లో బంధించబడ్డ అడవి జంతువులూ జ్ఞప్తికి వస్తాయి. నిన్ను కలవరపరుస్తాయి. అదేగా నీ గోడు! ఇక విషయానికి వస్తే- నీది కొంచెం సున్నితమైన మనసు. అందులో పుస్తకాలు ప్రాచీన కావ్యాలూ యెడా పెడా చదువుతుంటావేమో- మనస్తత్వం మరింత పలచనగా తయారయినట్లుంది. లా గ్రాడ్వేట్ వి- జైలు డిప్యూటీ సూపరింటెండెంటు భార్యవి- ఇంత ఫెళుసుగా తయారవుతావని నేను ఊహించలేదు. ఇక్కడ నువ్వు ముఖ్యంగా గమనించ వలసింది ఒకటుంది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ చేసి నలుగురు అమాయ కుల బుర్రలు బ్రద్దులు గొట్టి- కుత్తుకలు కోసి- తరవాత తాపీగా అమాయక స్త్రీలనూ వితంతువుల్నిఅత్యాచారానికి లోనుచేసి ఇప్పుడు నాలుగు గోడల మధ్య రిమాండ్ ఖైదీలుగా సెంటెన్సుడ్ ఖైదీలుగా కాలం గడుపుతూన్న మానవ మృగాలను నోరూ వాయీ లేని జంతువులతో పోల్చుతూ “ ఈసారి మంగళాదేవి భర్తకు అడ్డువచ్చి ఆపింది- “ఇప్పుడు మీరు కొంచెం ఆగాలి. నేను ఖైదీల పరిస్థితికి మాత్రమే కదలి హృదయావేశాన్ని చూపించడం లేదు. ఇక్కడున్న వాళ్ళను నమ్ముకుని వాళ్ళ సతీమణులు- ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళ అమ్మాయిల్ని చదువు పూర్తికాని పిల్లల్ని తలచుకుని కూడా బాధకు లోనవుతున్నాను. ఇది తెలుసుకోకుండా నన్ను మరీ బేలను చేసేయ్యకండి! ” “ఓకే! ఓకే! యువర్ యెమోషనల్ పాయింట్ నోటెడ్. ఇక దీనికి బదులియ్యి. నా జీవన సహచరిగా నువ్వే చెప్పు. నన్నిప్పుడేమి చేయమంటావు? జైలు సూపరిండెంటేమో- కోల్డ్ అండ్ ఫీవర్ అంటూ రెండు రోజులు సి ఎల్ తీసుకుని ఇంట్లో ఉన్నారు. నాకు సీనియర్ అయిన మరొక డిప్యూటీ సూపరిండెంటేమో ఎల్ టీ సీ పైన భార్యా బిడ్డలతో సిమ్లా వెళ్ళారు. ఇక పోతే రెండు మూడు రోజులకని పై అ ధికారులు ఇన్ చార్జీని వేయరు. ఇప్పటికి ఇక్కడున్న వాళ్ళలో సీనియర్ని నేనే! జెండా ఎగురవేసి ఫంక్షన్ నడిపించబోయేది నేనే! అందరూ- జైలు సిబ్బందినీ వాళ్ళ వాళ్ల భార్యాబిడ్డల్ని తోడు తీసుకు రమ్మనమని పురమాయించి నేనిప్పుడేమో గుమ్మటంలా ఉన్నభార్యను తీసుకెళ్ళకుండా చేతులూపుతూ వెళ్తే చూసేవారేమనుకుంటారు? అయినా నిన్నిప్పుడేమైనా గ్యాంగస్టర్ ముజుబ్ ఖాన్ ఉన్న సింగిల్ సెల్ వైపా తీసుకెళ్తున్నాను?లేక సీరియల్ కిల్లర్ బాబూ మిశ్రాగాడి డార్కు సెల్ కా తీసుకెళ్ళ బోతున్నాను? అందరూ కలివిడిగా తిరిగే పచ్చటి ఓపెన్ ఎయిర్ జైలు వేపేగా తీసుకెళ్తున్నాను. రేపు ఒక్కరోజు హ్యూమన్ రైట్స్ డే. కొందరు సీనియర్ సిటీజన్సుతో బాటు ఎన్ జీ వో వాళ్లు రంద్రాన్వేషన్ చేయడానికి వస్తారు. వాళ్ళకేదీ దొరక్కుండా చూసుకోవాలి. ఖైదీలు వేసే ఒకటి రెండు నాటికలు చూసి వాళ్లు పాడే పాటలు విని వాళ్లకు స్వీట్లూ గిఫ్టులూ అందిస్తారు. ఆ తరవాత ఆధ్యాత్మిక చైతన్యం కోసం అన్ని మతాలకూ చెందిన కొందరు మత గురువులు ప్రసంగాలు చేసి మంగళం పాడతారు. ఇక ఆ తరవాత కథ కంచికి- మనం ఇంటికీను. ఇక నీ విషయానికి వస్తాను. ఫంక్షన్ లో పాలు పంచుకోవడమంటే- ముఖం ఎత్తి పెట్టుకుని ఓ మూల ఒదిగి కూర్చోవడం కాదు. హోస్టుగా నవ్వుల్ని చిందిస్తూ చుట్టూ కలివిడిగా తిరగడం. అందర్నీ కలపుకోవడం. పనున్నా లేకపోయినా పరిచయం ఉన్నా లేకపోయినా చుట్టూరా ఉన్నవారిని హాసరేఖలతో పలకరించి రావడం. మొత్తానికిది హెల్తీ ట్రెడిషన్ అని ఒప్పుకోవాలి. నౌ- లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్- నువ్వు- లా- కోర్సుని గ్రేడింగుతో చదివి పాసయిన దానివి. పెళ్ళయి ఓ యింటిదానివి కాకముందు- జూనియర్ గా కొన్నాళ్ళ పాటు ట్రైనింగు తీసుకుని మీ సీనియర్సు ద్వారా బార్ కౌన్సిల్ మెంబరు షిప్పుకి అర్హత సంపాదించిన దానివి. ఇటువంటి నువ్వే ఇలా నీరుగారి ఒదిగిపోతే- మామూలు మనుషుల గతేమికాను? నువ్వుగాని పెళ్ళయిన తరవాత కూడా మీ అత్తయ్యగారి అనుమతి తో ప్రొఫెషనల్ క్రిమినల్ లాయరుగా కొనసాగి ఉన్నావంటే- నువ్వు ఎంతోమంది నేరస్థులను- కరడు గట్టిని ఖైదీలను ముఖా ముఖి కలుసుకుని- ఘోరమైన నేరాలు చేసిన అండర్ ట్రయల్సు ముఖాలలో ముఖం పెట్టి- వాళ్లనే చూస్తూ కేసు కోసం కావలసిన భోగట్టా సేకరిస్తూ వాళ్ళ మధ్యే సంచరిస్తూ ఉండవలసొస్తుండేది. ఇప్పుడు నీ మనస్తత్వ చిత్రీకరణ దగ్గరికొస్తాను. ఎస్! ఒప్పుకుంటాను- ఖైదీల పట్ల నువ్వు చూపించే మృదుభావంలో న్యాయం ఉందని. చట్టపు కోరల్లో చిక్కుకుని లోపలకు తోయబడ్డ వాళ్ళందరూ నిజంగానే దుర్మార్గులు కాకపోవచ్చు. డబ్బున్నవాడిదే రాజ్యం కాబట్టి- వాళ్లలో దస్కం లేక అంగబలం లేక కొందరు శుత్రువల వల్ల ఇరికించబడి కూడా ఉండవచ్చు. ఆ మాటకు వస్తే బైట కాలర్లు ఎగరేసుకుని తిరిగే వాళ్ళందరూ పెద్దమనుషులూ కాకపోవచ్చు. పట్టుబడేంత వరకూ ఇంటా బైటా అందరూ పెద్ద మనుషులే మరి-- కాని చట్టం చక్రభ్రమణం వంటిది. అది ఎటు తిరుగుతుందో అటు మనం తిరుగుతూ పోవలసిందే. అందుకే- వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం ఉంది. లా- షల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. ఈ దృక్పధం అలవర్చుకోకపోతే మాబోటి వాళ్ళం పోలీసు శాఖలో మనుగడ సాగించలేం. ఇక నీలో చెలరేగే మానసిక ఘర్షణను దారి మళ్ళించే మార్గం ఒకటుంది. చెప్పేదా?” భర్త నోట ఆమాట విని మంగళాదేవి నవ్వింది. నవ్వుతూనే అతడి చేతుల్నీతనలోకి తీసుకుంటూ అంది- “నాకు తెలుసు మీరేమి చెప్పబోతున్నారో! మా అత్తగారిని ఒప్పించి మా నాన్నగారికి కూడా ఓ మాట చెప్పి యాక్టివ్ లీగల్ సర్వీసులోకి వెళ్ళమంటారు. అవును కదూ?”


=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.



88 views0 comments
bottom of page