top of page

అపాయంలో ఉపాయం


'Apayamlo Upayam' - New Telugu Story Written By Padmavathi Divakarla

'అపాయంలో ఉపాయం' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"తలుపేసుకో స్వప్నా! వస్తా!" అని ఆఫీసుకు బయలుదేరిన సాగర్ స్వప్న వంక తిరిగి చిలిపిగా ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బైక్ ఎక్కాడు. సాగర్ వీధి మలుపు తిరిగే దాకా గుమ్మం వద్దే నిలబడిన స్వప్న తలుపు వెయ్యబోతూ యథాలాపంగా ఎదురింటి వైపు చూసింది. మూడు రోజుల క్రితమే ఎదురింట్లో ఎవరో కొత్తగా అద్దెకి దిగారని తెలుసు గాని, ఇంతవరకూ పరిచయం చేసుకోలేదు ఆమె.


యధాలాపంగా అటు చూసిన స్వప్నకి ఎదురింట్లో వరండాలో నిలబడి ఉన్న వ్యక్తి తన వైపే తదేకంగా చూడటంతో ఒక్కసారి ఉలిక్కిపడింది. స్వప్న చూపులు ఆమెపై ప్రసరించగానే, ఆ వ్యక్తి ఆమెని చూసి ఎంతో పరిచయం ఉన్నవాడిలా చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుతో ఆమె వంటిపై తేళ్ళూ జెర్రిలూ పాకుతున్న ఫీలింగ్ కలిగింది. అతన్ని గుర్తుపట్టిన మరుక్షణం ఆమె శరీరం చిగురుటాకులా వణికింది. అతని నవ్వులో కాలకూట విషం ఉన్నట్లు తోచింది. కొద్దిసేపట్లోనే అతన్ని గుర్తుపట్టిందామె.


మదన్ మళ్ళీ ఇక్కడ తన ప్రాణానికి తయారయ్యాడా అని ఆమె మనసు ఉసూరుమంది. ఇంట్లోకి వచ్చి తలుపు వేసుకొని సోఫాలో కూలబడిందామె పరధ్యానంగా. ఆమె మనసులో ఆలోచనల అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఏదో తెలియని నిశ్శత్తువ నరనరాన వ్యాపించిన భావన కలిగింది ఆమెకి మదన్ గుర్తుకు రాగానే. టివి కట్టేసి, సరాసరి బెడ్రూములోకి వెళ్ళి మంచంపై అడ్డంగా వాలిందామె. ఆమె మనసు గతంలోకి వెళ్ళింది.


* * * * * * * * *


అవి స్వప్న కాలేజీలో చదువుతున్న రోజులు. జీవితమంతా రంగులమయం అనుకొని భవిష్యత్తు కోసం తీయని కలలు కనే రోజులు. కొంతమంది విద్యార్థులు సీరియస్గా చదువు సాగిస్తూ ఉంటే, మరి కొంతమంది కాలేజీకి కేవలం కాలక్షేపం కోసమే వచ్చేవారు. స్వప్న చదువులో ఎప్పుడూ ముందుండేది. చదువంటే ఆమెకి ప్రాణం.


అలాంటి స్వప్నకి కేవలం కాలక్షేపానికి మాత్రమే కాలేజీకి వచ్చే దివ్యతో ఎలాగో స్నేహం కుదిరింది. దివ్య ఉండేది స్వప్న ఉండే వీధిలోనే. ఇద్దరూ కలసి కాలేజీకి వెళ్ళి రావడంతో ఆ స్నేహం మరికొంత బలపడి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళేదాకా పెరిగింది.


"ఏమిటే, ఎప్పుడూ పుస్తకం పట్టుకొని పుస్తకాల పురుగులా కూర్చుంటావు. కళ్ళు తెరువు, లోకం చూడు, జీవితం ఎంత అందమైనదో తెలుస్తుంది! జీవితం అనుభవించడానికే ఉంది." అనేది దివ్య.


స్వప్న కేవలం నవ్వేసి ఊరుకునేది. తిరిగి పుస్తకంలో తల దూర్చేది. క్లాసులు లేని సమయాల్లో ఆమె లైబ్రెరీలో గడిపితే, దివ్య తన స్నేహితులతో ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్స్తో తిరిగేది. అప్పుడప్పుడు క్లాసులకి డుమ్మా కొట్టేసి సినిమాలు, షికార్లు అంటూ తిరిగేది. ఆ బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చే కానుకలను స్వప్నకి చూపించి మురిసిపోయేది.


"నువ్వూ ఉన్నావు ఎందుకూ, నీకు ఓ సరదా లేదు, పాడూ లేదు. ఎప్పుడూ పుస్తకంతోనే సావాసం వేస్తావు. బాయ్ ఫ్రెండ్స్తో తిరిగితే ఎంత మజాగా, థ్రిల్లిగ్గా ఉంటుందో నీకేం తెలుసు?" అని స్వప్నతో అనేది.


"ఎవరైనా మోసం చేసి నీ జీవితంతో ఆడుకుంటే ప్రమాదం కాదా?" అంది స్వప్న. "అంతదాకా ఊరుకుంటానా? వెంటనే బాయ్ ఫ్రెండ్ని మార్చేయనూ." అంది నవ్వుతూ.


"అది మరింత ప్రమాదమేమోనే!" అంది స్వప్న ఆమె వైపు వింతగా చూస్తూ.


"ప్రమాదం ఏం కాదు, అంతా ప్రమోదమేనే! నీదంతా పాతకాలం భావాలు. బాయ్ ఫ్రెండ్ల చేత వీలైనంత ఖర్చు పెట్టించి షాపింగ్, షికార్లు చేయడం నేటి పద్ధతి. అయినా నీకేం అర్ధం కాదులే ఇలాంటి విషయాలు." అని, స్వప్నతో అని అప్పుడు అక్కడికి వచ్చిన వినోద్ని చూసి, "హాయ్ వినోద్! ఇవ్వాళ ఖాళీయేనా, అలా బీచికి వెళ్దామా!" అని వినోద్ బైక్ వెనకాల ఎక్కి కూర్చుంది.


వెంటనే ఆ బైక్ రివ్వు మంటూ ముందుకి ఉరికింది. వాళ్ళిద్దరూ వెళ్ళినవైపే అలా చూస్తూ ఉండిపోయింది స్వప్న. వాళ్ళిద్దర్నీ అలా జంటగా చూస్తూ ఉంటే ఆమెకెలాగో ఉంది. తన మదిలో చెలరేగుతున్న భావాలను అదుపు చేసుకుంటూ లైబ్రరీలోకి అడుగుపెట్టింది ఆమె. తనకి కావలసిన పుస్తకం తీసుకొని చదవడం మొదలెట్టింది కానీ, ఆమె మనసు అందులో లగ్నం కాలేదు. ఆమె ఆలోచనలన్నీ దివ్య, వినోద్ చుట్టూ పరిభ్రమస్తూ ఉన్నాయి. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత, ఇంక మరి చదవలేక ఆమె లేచి అక్కడనుంచి బయటపడింది.


ఒక రోజు తను దివ్యకి ఇచ్చిన నోట్స్ తీసుకోవడానికి వాళ్ళింటికి వెళ్ళిన స్వప్నకి అక్కడ కనిపించాడు ఆమె అన్నయ్య మదన్. అదే స్వప్న మొదటిసారి అతన్ని చూడటం.


"దివ్య ఇంట్లో ఉందా?" అని అడిగిన స్వప్న తనవైపు అతను వెకిలిగా చూడటం ముందు గమనించలేదు.


"ఉంది!" అని చెప్పాడతను ఆమె అందాన్ని తాగేస్తున్నట్లు చూస్తూ.


అప్పటిగాని అతని చూపులకు భావం అర్ధం కాలేదు స్వప్నకి. తన చూపు మరల్చుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత రెండుమూడు సార్లు ఆమెని అదే ధ్యాసతో మదన్ చూడటంతో దివ్య ఇంటికి వెళ్ళడం మానుకొంది ఆమె. అయినా మదన్ ఆగడాలు ఆగలేదు. ఏదో పరిచయం ఉన్నవాడిలా రెండుమూడు సార్లు తన ఇంటికి వస్తే ఆమె తప్పించుకు తిరిగింది. కొన్నాళ్ళు అలా వెంటాడి వేధించిన తర్వాత, ఒక రోజు ఆమెకి ఓ నీలం రంగు కవరులో ఓ ఉత్తరం వస్తే ఎక్కణ్ణుంచి వచ్చిందో అని అనుకుంటూ తెరిచి చూసింది.


మదన్ రాసిన ప్రేమలేఖ అది. వచ్చీరాని భాషతో రాసిన ఆ ప్రేమలేఖ చూస్తే ముందు నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ తర్వాత మదన్పై కోపం వచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు. తన తల్లీ తండ్రికి చెప్పొచ్చు, కాని అదో పెద్ద సమస్యకి దారి తియొచ్చు. తనని చదువు మానిపించినా మానిపించొచ్చు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనం వహించినందుకు, మళ్ళీ మళ్ళీ ప్రేమలేఖలు రాసాడు మదన్ తన పట్టు విడవకుండా. అంతేకాక, కనపడినప్పుడల్లా వెకిలిగా నవ్వడం, కావాలని మాట్లాడటానికి, పలకరించడానికి ప్రయత్నించడంతో స్వప్నకి దిక్కు తోచలేదు.


డిగ్రీ రెండు సార్లు తప్పి చదువు మానేసి బలాదూరుగా తిరుగుతున్న మదన్ తనని వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తోచిందామెకి. రోజూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించడం మొదలు పెట్టడంతో ఇక లాభం లేదని తన గోడు ముందు దివ్యకి చెప్పుకుంది.


ఆమె మాటలు విన్న దివ్య ఫక్కున నవ్వి, "చూసావా, నీకూ బాయ్ ఫ్రెండ్ దొరికాడన్నమాట! ఇంకెందుకాలస్యం? నాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ సినిమాలు షికార్లు తిరుగు!" అందామె.


ఆమె మాటలు విన్న స్వప్న విస్తుబోయింది. ఆమె కేసి కోపంగా చూసింది. "నువ్వేదో మీ అన్నతో చెప్పి దారిలో పెడతావనుకుంటే నువ్వే ఇలా మాట్లాడుతావా? నాకు ఇప్పుడు చదువు ముఖ్యం కానీ, ప్రేమా దోమా కాదు!" అంది తీవ్రంగా.


ఆమె కోపం చూసి మళ్ళీ నవ్వుతూ, "కూల్ బేబీ, కూల్! ఇవాళా రేపు ప్రేమించడం, యువతీ యువకులు కలిసి తిరిగడం ఫ్యాషన్!" అంది దివ్య ఆమె సమాధాన పరచడానికి.


ఆమె మాటలు విన్న స్వప్నకి ఒళ్ళంతా తేళ్ళు జెర్రిలు పాకురుతున్నట్లు అనిపించాయి. ఆమె వైపు తీవ్రంగా చూసి ఇంటి దారి పట్టింది. మదన్ వేధింపులు అప్పటికే శృతి మించడంతో తల్లితండ్రులకి మదన్ సంగతి చెప్పడం మినహా మరో దారి తోచలేదు స్వప్నకి. ఆ తర్వాత పరిణామాలన్నీ చకచక సాగిపోయాయి.


స్వప్న తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, వాళ్ళు మదన్ని స్టేషన్కి పిలిపించి కౌన్సెల్లింగ్ చేయడంతో మదన్ కక్ష పెంచుకుంటాడేమోనని భయపడి స్వప్నని మరో కాలేజీలో చేర్చి ఇల్లు కూడా మారారు ఆమె తల్లితండ్రులు. జరిగిన సంఘటనలన్నీ ఒకొక్కటిగా గుర్తుకు రావడంతో ఆమె మనసు అల్లకల్లోలం అయ్యింది. తనకి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలియలేదు తలుపు తట్టిన చప్పుడు అయ్యేదాకా.


ఆ శబ్దానికి ఆమె ఉలిక్కిపడింది ఒక్కసారి. భయంతో బిగుసుకు పోయింది. సాగర్ ఇంట్లో లేని సంగతి తెలిసి మదన్ తలపు కొడుతున్నాడా అన్న భావనకే ఆమె చిగురుటాకులా వణికిపోయింది. ఏది ఏమైనా తలుపు తీయకూడదని నిశ్చయించుకొంది. ఈ సారి తలుపు తట్టడంతో పాటు కాలింగ్ బెల్ కూడా మోగడంతో ఇంకొంచెం బెంబేలెత్తిపోయింది. అమె నోరు తాడారిపోయింది. మదన్ తన అంతు చూడటానికే వచ్చినట్లుంది అని ఆమె భయంతో వణికిపోయి, సాగర్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసేసరికి దానంతంట అదే మోగిందా ఫోన్.


ఏదో తెలియని నంబర్ నుండి ఆ ఫోన్ వచ్చేసరికి భయపడుతూనే ఎత్తిందామె. తన ఫోన్ నంబర్ ఎలాగో తెలుసుకొని మదన్ కాల్ చెయ్యడం లేదు కదా అని ఓ పక్క మనసు పీకుతూనే ఉంది. "హల్లో..." అంటూ అవతల వైపు నుండి పక్కింటి కమల గొంతు వినిపించేసరికి కాస్త రిలీఫ్ ఫీలైంది.


ఎలాగో గొంతు పెగల్చుకొని, "హల్లో..." అంది.


"ఏంటి స్వప్నా! ఎంత తలుపు తట్టినా తలుపు తీయడం లేదు, అందుకే కంగారుపడి ఫోన్ చేసాను." అంది కమల.


"కొద్దిగా తలనొప్పిగా ఉండి పక్క మీద వాలేసరికి నిద్ర పట్టేసింది." అప్రయత్నంగా ఆమె నోటి వెంట వెలిబడ్డాయా మాటలు.


"అలాగా...ఇప్పుడెలా ఉంది?" ఆదుర్దాగా ఆమె అన్న మాటలకి, "ఇప్పుడు బాగానే ఉంది, ఇంతకీ ఎందుకు పిలిచావు?" అని అడిగింది అప్పటికి కాస్త తేరుకున్న స్వప్న.


"ఏమీ లేదు, రేపు సాయంకాలం మా పిన్ని కూతురి పెళ్ళి చూపులు మా ఇంట్లో ఉన్నాయి, ఆ విషయమే మాట్లాడదామని. తలుపు తియ్యి, నేను వస్తున్నాను. వివరంగా మాట్లాడుకుందాం." అని ఫోన్ పెట్టేసింది.


తలుపు తీసిన స్వప్నకి ఎదురుగా నవ్వుతూ పలకరించింది కమల. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకొన్నాక ఆమె ఇంటికి తిరిగి వెళ్ళిపోగా తలుపు మూయడానికి వెళ్ళిన స్వప్న చూపులు మళ్ళీ అప్రయత్నంగా ఎదురింటి వైపు మళ్ళాయి. ఎదురుగా వరండాలో నిలబడి తమ ఇంటి వైపే చూస్తున్న మదన్ మళ్ళీ కనిపించేసరికి ఆమె గుండెల్లో రాయి పడింది. మదన్ ఇప్పుడు కూడా బలాదూర్గా తిరుగుతున్నట్లు ఉన్నాడు, పెళ్ళైనా ఇంకా బుద్ధి మారినట్లు లేదు అని మనసులో అనుకొందామె.


ఏదో రోజు తనని మళ్ళీ వేధిస్తాడనే భయం ఆమెని వెంటాడసాగింది. ఆమె భయపడట్లుగానే సాయంకాలం తలుపు తట్టడానికి గుమ్మం వరకూ మదన్ రావడం చూసిందామె. భయంతో బిగుసుకు పోయింది. సరిగ్గా అదే సమయంలో సాగర్ ఆఫీసు నుండి రావడం చూసి మళ్ళీ హడావుడిగా మదన్ వెనక్కి తిరగడం కిటికీలో నుండి గమనించిన స్వప్న రిలీఫ్గా ఫీలైంది. ఆ రోజంతా అన్యమనస్కంగా గడిపింది స్వప్న. ఆమె మూడ్ గ్రహించి రెండుమూడు సార్లు అడిగాడు సాగర్ కూడా.


ఏదో చెప్పి తప్పించుకుందామె గాని, ఆ రాత్రంతా ఆమె కలత నిద్రతోనే గడిపింది. నిద్రపట్టినప్పుడు పీడకలలే ఆమెని బాధించాయి. తెల్లారకుండానే నిద్రాభంగమైన స్వప్నకి ఆలోచనలు తెగడంలేదు. ఆలోచించగా, ఆలోచించగా తన సమస్యని తనే ధైర్యంగా పరిష్కరించుకోవాలని తోచింది. భయపడుతున్నంత కాలం మనని భయపెడతారు. మనమే గనుక ధైరంగా ఎదురొడ్డి నిలబడితే ఎంతటి వాడైనా తోక ముడవవలసిందే, కావలసిందంతా ధైరమూ, తెగింపు మాత్రమే అన్న సత్యం ఆమెకి పూర్తిగా అవగతమైంది.


అంతే! ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా ఆమె ధైర్యంగా మంచంపై నుండి లేచింది. అప్పుడే ఆమెలో ఓ ఆలోచన పూర్తిగా రూపు దిద్దుకుంది. ఆ రోజు సాయంకాలం అందరూ ఉండగా తన ప్లాన్ అమలుపర్చడానికి ఆమె నిశ్చయించుకుంది. సాయంకాలం ఆరుగంటలు దాటిన తర్వాత తలుపు తెరిచింది స్వప్న. ఎదురింటి వరండాలో కూర్చీల్లో కూర్చున్నారు మదన్, సునీత టీ తాగుతూ. స్వప్నని చూడగానే మదన్ పెదవులపై మెరిసింది ఓ నవ్వు.


వీధి వరండాలో కమలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కమల ఎదో మాట్లాడబోతూండగా వినిపించుకోకుండా విసురుగా, వేగంగా ఎదురింటివైపు దారి తీసాయి ఆమె కాళ్ళు. ఎర్రగా కందిపోయి ఉంది ఆమె మొహం. తిన్నగా మదన్ వద్దకు వెళ్ళి అతని మొహంమీద తన చేతిలో ఉన్న కవరు విసిరికొట్టి, అందరూ చూస్తూ ఉండగా మదన్ చెంప ఛెళ్ళుమనిపించిందామె.


అంతవరకూ వెకిలిగా నవ్వుతూ ఆమె అందం కళ్ళతో జుర్రేస్తూ చూస్తున్న మదన్ ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రమకి గురైయ్యాడు. అతని బుగ్గ ఎర్రగా కందిపోయింది, మొహమేమో నల్లగా మాడిపోయింది.


"ఏరా రాస్కెల్! పెళ్ళైన దాన్నని కూడా చూడకుండా ప్రేమలేఖ రాస్తావా? పెళ్ళై పక్కన భార్య ఉండగా కూడా నీకివేం పాడు బుద్ధులు? సంస్కారం లేని నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి పట్టిన చీడపురుగులు. నేను చెంప దెబ్బతో సరిపెట్టాను నీకు బుద్ధి రావాలని, మరి ఇంకెవరైనా ఉంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి పంపించికాని శాంతించరు." అందామె మదన్ వైపు తీవ్రంగా చూస్తూ.


మదన్ నోటివెంట ఒక్క మాట వస్తే వట్టు! అందరిముందు, ముఖ్యంగా భార్య ముందు అవమానం పాలైన మదన్ తన మొహం చూపించలేక లేచి నిలబడి గిరుక్కున ఇంట్లోకి జొరబడ్డాడు. అప్పటి వరకూ ఏం జరుగుతుందో అర్ధం కాని సునీతకి కూడా విషయం బోధపడి తల కొట్టేసినట్లైంది ఆ సంఘటనతో.


వీధిలో అందరి ముందు దోషిగా నిలబడిన తన భర్తపై విపరీతమైన కోపం ముంచుకు వచ్చి అతనినే అనుసరించిందామె. ఎంత విసురుగా స్వప్న వీధిలోకి వచ్చిందో అంత విసూరుగానే మళ్ళీ ఇంట్లో జొరబడింది. ఇంట్లోకి వెళ్ళి మంచంపై కూలబడిన తర్వాతగానీ ఆమె ఆగ్రహం చల్లారలేదు. ఆ మరుసటి రోజు ఉదయమే తలుపు తీసినప్పుడు ఆమెకి ఎదురింటి ఇల్లు ఖాళీగా కనిపించింది.


అంటే రాత్రికి రాత్రే మదన్ ఇల్లు మార్చేడన్నమాట నలుగురి ఎదుట జరిగిన అవమానానికి తట్టుకోలేక! తన ఉపాయం ఫలించి, తనకి మదన్ పీడ విరగడైనందుకు సంతోషించింది స్వప్న. మదన్ ఇంతకు పూర్వం రాసిన ప్రేమలేఖలన్నీ ఎప్పటికప్పుడు చించేసినా, ఎలాగో ఒకటి మాత్రం ఆమెకి తన బ్యాగ్లో దొరికింది. అదే ఆమె తన ఆయుధంగా మార్చుకొని తన సమస్యని పరిష్కరించుకుంది. అపాయంలో పడబోయిన తనకి ఈ ఉపాయం ఎంతగానో సహకరించింది. భార్యనుండి కూడా మదన్కి తిరస్కారం ఎదురై ఉంటుంది. ఇక దెబ్బతో మదన్ తన జోలికి రాడని నిశ్చింతగా ఫీలైందామె.


జరిగినది తెలుసుకున్న సాగర్ కూడా ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. అసలు సంగతేమిటంటే, ఎందుకైనా మంచిదని పెళ్ళైన కొత్తలోనే మదన్ గురించి, కాలేజీలో తను చదువుతున్నప్పుడు జరిగిన సంఘటనల గురించి స్వప్న సాగర్కి పూర్తిగా చెప్పేసింది. అదే ఆమె ధైర్యానికి కారణం.

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.





228 views0 comments
bottom of page