top of page
Writer's pictureYasoda Pulugurtha

ఆరని దీపం

'Arani Deepam' - New Telugu Story Written By Yasoda Pulugurtha

Published In manatelugukathalu.com On 03/11/2023

'ఆరని దీపం' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“రాఘవరావుగారు అంటే మీరేనా?” అంటూ వచ్చింది ఒక పాతికేళ్ల అమ్మాయి.


ఆ అమ్మాయి ముఖం చూస్తుంటే చాలా అలసటగా కనపడుతోంది. పచ్చని ఆమె మేనిఛాయ ఎండలో వచ్చిందేమో వడలిపోయి ఉంది. రాఘవరావు ఆ అమ్మాయిని నిశితంగా చూస్తూ ‘నేనేనమ్మా ఆ రాఘవరావు’నంటూ లోపలకు పిలిచాడు.


అక్కడ ఉన్న ఒకే ఒక కుర్చీలో ఆమెను కూర్చోమని చెప్పాడు. తను ఆమె ఎదురుగుండా ఉన్న ఒక పాత చెక్క బల్లమీద కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్న మాధవి ఆ రెండుగదుల ఇంటిని పరికించి చూసింది. పాత ఇల్లు, గదిలో ఏ సామానూ లేదు. గోడలు మాసిపోయి ఉన్నాయి. తలుపులు కూడా పాతబడిపోయి ఉన్నాయి. అది చత్తీస్ ఘడ్ లోని ఒక మారుమూల గ్రామం. అక్కడ ప్రజలందరూ ద్రవిడ జాతికి చెందిన వారు. వారి భాష "కురుఖు".


ఆ గ్రామానికి తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ అమ్మాయి ఎవరా అని తలబోస్తూ, "నీ పేరు ఏమిటమ్మా, ఎందుకు వచ్చా”వంటూ ప్రశ్నించాడు'.


ఇంతలో అలికిడి అయింది. తలుపుచాటున నిలబడిన ఒక స్త్రీ మాధవి వైపు విచిత్రంగా చూస్తోంది. ఆమె వేసుకున్న దుస్తుల తీరు చూస్తుంటే ఆమె ఏ రాష్ట్రం నుండి వచ్చిందోనన్న అనుమానం కలుగుతుంది. ఇంతలో రాఘవరావు ‘మణీయమ్మా’ అని పిలుస్తూ కురుఖూ భాషలో ఆమె తో ఏదో చెప్పాడు.


"ఆ చెప్పమ్మా, ఇంత మారుమూల గ్రామానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఎందు”కంటూ ప్రశ్నించాడు.


“నా పేరు మాధవి, నేను హైద్రాబాద్ నుండి వచ్చాను. మీకు హన్మకొండ తెలుసాండీ?”


ఆ ఊరి పేరు వినగానే అతని ముఖం లో సడన్ గా ఏదో గుర్తు వచ్చినట్లుగా కనిపిస్తున్న భావన. ఇంతలో మణీయమ్మ టీ తీసుకు వచ్చి మాధవికి అందించి అక్కడనుండి వెళ్లిపోయింది. రాఘవరావు మౌనంగా తలతిప్పుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.


ఈలోగా మాధవి గొంతుక ఆ నిశ్శబ్ద నీరవంలో ఖంగుమంటూ “మీకు హన్మకొండ అనే ఊరు, కుసుమ అనే ఒక ఆవిడ గుర్తు ఉన్నారా నాన్నా” అనగానే తృళ్లిపడుతూ మాధవి వైపు తెల్లబోతూ చూసాడు.


“నేను కుసుమ కూతురిని నాన్నగారూ, అంటే మీ ఇరువురి రక్తాన్ని పంచుకుని పుట్టిన మీ కూతురిని”.


ఆమె మాటలకు అప్రభితుడైనాడు, నమ్మలేనట్లుగా అద్భుతంగా తనవైపే చూస్తున్న రాఘవరావు వైపు నవ్వుతూ చూసింది.


‘నాన్న, ఎంత తియ్యటి పిలుపు?’


ఇది నిజమా.. తనకంటూ ఎవరూ లేని ఒంటరి తను. ఎడారిలాంటి తన జీవితంలో నాన్నా అని తీయగా పిలిచిన ఒక బంగారు తల్లి తన ఎదురుగా కూర్చుంది. నా కూతురినని చెపుతోంది. ఆ భావన మలయ మారుతంలా చల్లగా తన మనసుని తాకి పులకింప చేస్తోంది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ మణీయమ్మా అని పిలిచి ఎదురుగానున్న అమ్మాయి తన కూతురని చేతులూపుతూ ఏదో చెప్పేస్తున్నాడు. పాతిక సంవత్సరాల నాటి గతం అతని కళ్లముందు సినిమారీళ్లల్లా కదలాడింది.

***


తను విజయవాడ రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తూండగా కాజీపేట్ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న బుకింగ్ క్లర్క్ హఠాత్తుగా లాంగ్ లీవ్ పెట్టడం మూలాన తనని కొంతకాలం పాటు కాజీపేట్ రైల్వే స్టేషన్ కి బదిలీ చేసారు. అప్పటికే తనకు పెళ్లి అయి మూడు సంవత్సరాలు అయింది. మూడవ నెల గర్భవతి అయిన తన భార్య సీతాలక్ష్మిని పుట్టింట్లో వదిలి తను కాజీపేట్ కి వచ్చేసాడు. హన్మకొండ లో ఒక గది అద్దెకు తీసుకుని ఉండేవాడు.


కుసుమ తో పరిచయం విచిత్రంగా జరిగింది. ఒకరోజు తను బుకింగ్ కౌంటర్ లో ఉండగా ఒక యువతి హడావుడిగా పరుగెత్తుకుంటూ కౌంటర్ ముందుకు వచ్చి హైద్రాబాద్ కి టికెట్ కావాలని ప్రాధేయపడింది. ట్రైన్ కదలడానికి రెడీగా ఉంది. కళ్లు ఏడ్చినట్లు ఉబ్బిపోయి ఉన్నాయి. ఆమెను చూసిన తాను కంగారు పడద్దని, వెంటనే టికెట్ ఇచ్చి రండంటూ ఆమెను ట్రైన్ దగ్గరకు తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించడం వెంటనే ట్రైన్ కదలడం జరిగింది.


ఆమె కళ్ల నుండి ధారగా కన్నీరు కురుస్తూనే ఉంది. తను వెను తిరిగాడు. పాపం ఏమంత అవసరం పడిందో, ఒక సెకన్ ఆలస్యం అయినా ఆమె వెళ్లలేక పోయేది కదా అనుకున్నాడు. మరో పదిరోజుల తరువాత ఆమె ను హన్మకొండలో కూరల మార్కెట్ లో చూసాడు. అదే సమయంలో తనని చూసిన ఆమె నవ్వుతూ తన దగ్గరకు వచ్చి, ఆరోజు మీరు చేసిన సహాయం జన్మలో మరచిపోలేనని ధాంక్స్ చెప్పింది.


తను సకాలంలో వెళ్లిన మూలాన తన స్నేహితురాలికి సహాయపడగలిగానని చెప్పింది. అలా రెండు మూడు సార్లు కలవడంతో ఇద్దరూ ఒకరిగురించి మరొకరు తెలుసుకున్నారు. ఆమె గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నానని చెప్పింది. తన తల్లితండ్రులు చిన్న తనంలోనే పోతే ఎవరో దూరపు బంధువులు చేరదీసారని చెప్పింది. కుసుమ తనని ఆకర్షించింది. కాని తాను వివాహితుడు. మరో ఏడునెలల తరువాత ఒక బిడ్డకు తండ్రి అవుతాడు. అందుకే ఆమెకు దూరంగా ఉండేవాడు. కనిపించినా తల మరోవైపుకి తిప్పుకుంటూ వెళ్లిపోయేవాడు.


ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు కుసుమ తన గది కి వచ్చి నన్ను ఎందుకు తప్పించుకుంటూ వెళ్లిపోతున్నారని నిలదీసింది. కారణం ఏమీ లేదన్నాడు. ఒక పెళ్లి కాని అమ్మాయితో చనువుగా తిరగడం సభ్యత కాదన్నాడు. తను అన్న మాటలకు కుసుమ ఏడ్చింది. తనని ఇష్టపడుతున్నట్లుగా చెప్పింది. తాను వివాహితుడునని చెప్పినా వినలేదు. మిమ్మలని విడిచి ఉండలేనంటూ తనను పట్టుకుని ఏడ్చేసింది.


ఆ సమయంలో కుసుమ తనపై చూపించే ప్రేమకు కరగిపోయాడు. కుసుమే తనను ఎక్కువ కోరుకుంది. ఫలితం శారీరకంగా ఒకటైనారు. సీతకు తాను అన్యాయం చేస్తున్నానని తెలిసినా కుసుమే కదా తనను కోరుకుంటోంది, ఇందులో కన తప్పు లేదని సరిపెట్టుకునేవాడు. ఒక ఆరునెలలు గడచిపోయాయి. సీతాలక్ష్మి కి పురుటి నొప్పులు వస్తున్నాయని హాస్పటల్ లో జాయిన్ చేసామని వెంటనే రమ్మనమంటూ సీతాలక్ష్మి తండ్రి ఫోన్ చేయడంతో తను స్టేషన్ నుండే విజయవాడ వెళ్లిపోయాడు హడావుడిగా.


సీతాలక్ష్మి కి పురుడు కష్టమైంది. మృతశిశువు జన్మించింది. అంతేకాదు సీతాలక్ష్మి ప్రాణాలను కూడా డాక్టర్లు నిలపలేకపోయారు. భార్య మరణం అతన్ని కృంగతీసింది. తప్పని తెలిసినా , ఏదో మనోచాపల్యంతో కుసుమను కోరుకున్నా సీతాలక్ష్మి తన అర్ధాంగి. మనసా వాచా కర్మణా పదిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాల మధ్య ఆమెను వివాహమాడాడు. తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా ఊపిరిపోసుకుంటున్న పాపాయిపై ఎన్నో కలలు కన్నారు. కనీసం తన సీత అయినా తనకు దక్కలేదు. దుఖంతో పిచ్చివాడైనాడు.


కొంతకాలం లీవ్ పెట్టేసాడు. తరువాత అతన్ని చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని అంబికాపూర్ రైల్వే స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ చేయడంతో వెళ్లిపోయాడు. జీవితం మీద ఏదో తెలియని విరక్తి కలిగింది. తన సీత మాటి మాటికీ గుర్తొచ్చేది. కుసుమ గుర్తొచ్చినా అది క్షణం సేపే. ఆ బంధానికి విలువ లేదనుకున్నాడు. ఆఫీసు పని, భగవధ్యానం తప్పించితే మరో వ్యాపకం ఉండేది కాదు. ఎందరో గురువులను ఆశ్రయించాడు, పుణ్యక్షేత్రాలను దర్శించాడు మనశ్శాంతి కోసం. ఎందరో అనాధలకు సహాయపడ్తూ ఉండేవాడు.


అటువంటి సమయంలోనే దిక్కూ మొక్కూలేక రైలు పట్టాలమీద అడుక్కుంటూ అక్కడే పడుకుంటున్న మణీయమ్మను చూసాడు. తన ఇంట్లో తన పనులకు సహాయపడడానికి పెట్టుకుని ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. మణీయమ్మది దయార్ధ్ర హృదయం. ఆ గ్రామంలో ఎవరికేమి అవసరం వచ్చినా వెంటనే ఈమెను తీసుకుపోతారు. తను రిటైర్ అయిపోయి సంవత్సరం అయింది. ఏదైనా ఆశ్రమంలో కొంత కాలం ఉండి రావాలని అనుకుంటున్నాడు.


“అమ్మ ఎలా ఉందో అడగరా నాన్నా” అన్న ప్రశ్నకు ఉలిక్కిపడుతూ తలెత్తి మాధవి వైపు చూసాడు.


“కుసుమ ఎలా ఉంది తల్లీ?”


“అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఈ మధ్య ఎక్కువగా మిమ్మలనే తలచుకుంటోంది. మీ గురించి నాకు అంతా చెప్పింది. అమ్మ మనో వ్యాధితో బాధపడుతూ కృంగి కృశించి పోయింది. ఏ మందులూ పనిచేయవని డాక్టర్లు చెప్పేసారు. బ్రతికిన కొద్ది కాలం ఆమెను సంతోషంగా ఉంచమన్నారు డాక్టర్లు. మీరు ఎక్కడ ఉన్నారో ఎలాగైనా తెలుసుకుని మిమ్మలని అమ్మకు చూపించాలని నిర్ణయించుకున్నాను. అమ్మను సంతోషపెట్టాలనుకున్నాను.


అప్పట్లో మీరు హన్మకొండలో ఉండేటప్పుడు మీ ఇంటివారబ్బాయి మిమ్మలని అంబికాపూర్ రైల్వే స్టేషన్లో చూసానని ఆ మధ్య చెప్పాడు. అతను కూడా కాకతాళీయంగా అమ్మను హైద్రాబాద్ లో ఒక హాస్పటల్ లో చూసి గుర్తుపట్టి ‘మీరు కుసుమగారు కదూ’ అని అడగడం అమ్మ అవుననడం జరిగింది. అమ్మను మిమ్మలని అప్పట్లో తరచుగా కలసి తిరుగుతుండగా చూసేవారుట. అమ్మ అప్పుడప్పుడు మీరు ఉన్న ఇంటికి రావడం చూసేవాడుట.


మాటల సంధర్భంలో మిమ్మలని అంబికాపూర్ రైల్వే స్టేషన్ లో చూసానని మీతో మాట్లాడానని కూడా చెప్పారు. నేను మీరు పనిచేసిన రైల్వేస్టేషన్ కి వెళ్లి మీగురించి వాకబు చేస్తే మీరీ గ్రామంలో ఉంటున్నారని తెలిసింది. ఇప్పుడు చెప్పండి నాన్నగారూ, అతను చెప్పిన విషయాలన్నీ నిజమే కదూ?”


“ అవును నిజమే, ఆ మధ్య నేను రైల్వే ఆఫీస్ కి ఏదో పనిమీద వెడితే ‘మీరు రాఘవరావు అంకుల్ కదూ’ అంటూ పలకరించాడు అతడు. నేను గుర్తుపట్టలేకపోయినా అతనే నన్ను గుర్తుపట్టి పలకరించడంతో ఆశ్చర్యపోయాను. కానీ మరే విషయమూ టాపిక్ రాలేదు. కుసుమ ఎక్కడో ఆనందంగా ఉంటుందనే అనుకున్నాను మాధవీ”.


“ఆనందమా..” అంటూ పేలవంగా నవ్వింది.


“అమ్మను సంతోషపెట్టక పోతే నా ఈ జన్మకే అర్ధంలేదు నాన్నగారూ. అమ్మ మిమ్మలని ఎంత ఆరాధించిందోగానీ మిమ్మలనే ఇప్పటికీ దైవంగా భావిస్తూ తను పోయేలోపల ఒకసారైనా మిమ్మలని చూడాలని ఆరాట పడుతోంది”.


రాఘవరావు ముఖంలో బాధావీచికలు ద్యోత్యమయ్యాయి. ఆరోజుల్లో కుసుమ తనని ఆకర్షించిన మాట వాస్తవం. సౌమ్యంగా ఉంటూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో తన మీద అత్యంత ప్రేమను కురిపించే కుసుమ గుర్తొచ్చి మనసు బాధతో తల్లడిల్లి పోయింది.


“ఇప్పుడు నీవు ఇలా నన్ను వెతుక్కుంటూ రావడం నీకు అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అర్ధమౌతోంది తల్లీ. నీలాంటి కూతురుని కన్న కుసుమ పుణ్యాత్మురాలు”.

“మీరు కాదా నాన్నగారూ? మీరు వచ్చేయండి నాతో. అమ్మ, మీరూ, నేను. కొత్త జీవితాన్ని చవిచూద్దాం”.


‘విధి ఎంత విచిత్రం! కుసుమతో పరిచయం, క్షణికావేశంలో జరిగిన ఒక సంఘటన మసకబారిపోయిందని తను అనుకున్నాడు. కానీ ఆ సంఘటన తిరిగి కొత్తవెలుగులను సృష్టించి ఒక అందమైన రూపంతో తన దగ్గరకు వస్తుందని తను ఎప్పుడైనాతలచాడా? తమ కలయిక ఇలా ఊపిరిపోసుకుని నాన్నా అంటూ వచ్చి తన ముందు నిలుస్తుందని ఊహమాత్రమైనా అనుకున్నాడా?’


“నాన్నా! మీరు నాతో రావాలి, ఆరిపోతున్న దీపానికి ప్రాణం పోయాలి, వస్తారు కదూ?” తన ముందు మోకరిల్లి ప్రాధేయపడుతూ జాలిగా అడుగుతున్న మాధవి వైపు చూసాడు. అప్పట్లో తను హన్మకొండ ను విడిచి వెళ్లేటప్పుడు కుసుమను కలవకుండా వెళ్లిపోయాడు. తనని తిరిగి కలవనందుకు కుసుమ తనను తప్పు పట్టి ఉండచ్చు. తననొక మోసగాడిగా భావించవచ్చు. ఇప్పుడు కుసుమ ముఖాన్ని తాను చూడగలడా? కానీ కుసుమను కలవడం తన ధర్మం. ఈ పరిస్తితిలో కుసుమను తాను కాపాడుకోవాలి. ఆనాడు చేసిన తప్పులో తనకూ భాగమూ ఉంది.


క్షణంలో ఒక దృఢ నిర్ణయానికి వస్తూ “పద మాధవీ, కుసుమ ను తొందరగా కలవా”లంటూ బయలదేరతీసాడు.

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








44 views0 comments

Comments


bottom of page