top of page

అర్థాంగి


'Arthangi' New Telugu Story

Written By Padmavathi Divakarla

'అర్థాంగి' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

పండుక్కి తన అక్క ఇంటికి వెళ్ళిన వెళ్ళిన విష్ణుమూర్తి పల్లెటూరి అమ్మాయైన మహాలక్ష్మి మీద మనసు పారేసుకున్నాడు. ముందునుండీ విష్ణుమూర్తికి పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలనే ఉంది. పట్నం అమ్మాయిలైతే తనతో ఓ ఆట ఆడుకుంటారని, వంటపని, ఇంటిపని ఏమాత్రం తెలియదని, వంటపనంతా తనపైనే పడుతుందని విష్ణుమూర్తికో బలమైన అభిప్రాయం ఉంది. అందుకే అందమైన, అమాయకమైన మహాలక్షి నవ్వుకి పడిపోయిన విష్ణుమూర్తి ఆమెని చూడగానే మనసు పారేసుకున్నాడు. అక్క సుబ్బలక్ష్మినడిగి ఆమె గురించి అంతా వివరంగా తెలుసుకున్నాడు. తమ్ముడి గురించి పూర్తిగా తెలిసిన సుబ్బలక్ష్మి రెండువైపులా నరుక్కొచ్చి ఆ పెళ్ళి సంబంధం కుదిర్చింది. అమాయకమైన అమ్మాయి భార్యగా లభించబోతున్నందుకు విష్ణుమూర్తి చాలా సంతోషించాడు.


బాజాభజంత్రీలు మోగగా ఆమె మెళ్ళో తాళికట్టేసి బెంగుళూరులో కాపురం పెట్టాడు. అమాయకమైన మహాలక్ష్మి అంటే విష్ణుమూర్తికి ప్రాణం. ఆమె అమాయకత్వం వల్ల తనెన్ని ఇబ్బందుల పాలైనా ఆమెంటే వల్లమాలిన అభిమానం. మహాలక్ష్మికి బెంగుళూరులో అన్నీ వింతవింతగా కనిపించాయి. పెద్దపెద్ద ఫ్లాట్లు, మాల్స్ ఆమె మతి పోగొట్టాయి.


“ఏమండీ! ఇవాళ బజారుకి వెళ్దామండీ, నేను కొన్ని చీరలు కొనుక్కోవాలండీ. నా వద్ద అన్నీ డెస్స్లే ఉన్నాయి, కానీ సరైన చీరలు లేవు." అని మహాలక్ష్మి అడిగేసరికి సరేనన్నాడు.


"డ్రెస్లు ఈ ఊళ్ళో సౌకర్యంగా ఉంటాయి. పైగా నువ్వీ ఆకుపచ్చ డ్రెస్స్లో చాలా అందంగా ఉన్నావు. అయినా నువ్వు కోరుతున్నావు కనుక మంచి చీరలు కొందాం సరేనా!" అన్నాడు విష్ణుమూర్తి ఆమె వైపు మెచ్చుకోలుగా చూస్తూ. ఆ చూపులకి సిగ్గుపడింది మహాలక్షి.


"మరి, డ్రెస్లకి కొంగు ఉండదు కదండీ!" అంది మహాలక్ష్మి.

"కొంగేంటీ?" అడిగాడు ఏమీ అర్థం కానట్లు.


"మా అమ్మమ్మ చెప్పిందండీ, పెళ్ళైన తర్వాత భర్తని కొంగున కట్టుకోని తిప్పుకోవాలిట. లేకపోతే భర్తని అదుపులో ఉంచుకోవడం కష్టమట." అంది మహాలక్షి అమాయకంగా భర్త వైపు చూస్తూ.


ఆమె అమాయకత్వానికి అబ్బుర పడ్డాడు విష్ణుమూర్తి. ఆమె అమాయకత్వం గురించి విష్ణుమూర్తికి ఏమైనా అనుమానముంటే ఈ దెబ్బతో అన్నీ పటాపంచలు అయిపోయాయి.


ఆదివారం మహలక్ష్మిని సినిమాకి మల్టీప్లెక్స్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎస్కలేటర్ని చూసి భయపడిందామె. విష్ణుమూర్తి చిన్నగా నవ్వుకొని ఆమెని లిఫ్ట్ వద్దకు తీసుకెళ్ళాడు. అందులోకి వెళ్ళిన మహాలక్ష్మి ఆశ్చర్యంగా, "ఇదేమిటండీ ఇదో చిన్న గదిలా ఉంది." అంది.


"దీన్ని లిఫ్ట్ అని అంటారు. సినిమా హాలు నాలుగవ అంతస్థులో ఉంది. మెట్లెక్కకుండా మనం ఇలా వెళ్ళిపోవచ్చు." అని ఆమెకి వివరించి మీట నొక్కాడు. లిఫ్ట్ అలా మీదకి వెళ్ళడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.


ఆ హాల్లో విష్ణుమూర్తి అభిమాన హీరో సినిమా 'రాజమండ్రి రాజయ్య' సినిమా అడుతోంది. హాల్లోకి వెళ్ళబోతూ పాప్కార్న్, రెండు కోకాకోలాలు తీసుకొని వెయ్యి రూపాయిలు ఇచ్చాడు. వెయ్యి రూపాయలు పుచ్చుకొని ఆ షాప్వాడు ఓ యాభై రూపాయలు చేతిలో పెట్టడం చూసి ఆశ్చర్యపోయింది మహాలక్ష్మి.


"ఏమిటండీ! ఇంత డబ్బులు తీసుకున్నాడా ఈ జొన్నగింజల కోసం. మా ఊళ్ళో ఇరవై రూపాయలు ఇస్తే ఇంతకు రెండు రెట్లు వస్తుంది కదండీ!" అందామె విస్మయంగా.

ఆమె అమాయకత్వానికి నవ్వాడు విష్ణుమూర్తి.


"ఇది బెంగుళూరు మహాలక్ష్మీ, ప్రతి విషయానికీ బెంగ పెట్టుకోకూడదు. సినిమా హాల్లో ధరలు ఇలాగే ఉంటాయి." అన్నాడు హాల్లోకి వెళ్తూ.


సినిమాలో హీరో తెర మీద కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు వేసే ఈలలు, చేసే గొల్లు చూసి ఆమె విస్తుపోయింది. ఇక్కడ సినిమా హాల్లో కూడా మన పల్లెటూళ్ళోలాగే ప్రవర్తించడం ఆమెకి చాలా వింతనిపించి భర్తతో ఆ విషయమే చెప్పింది.


"మన తెలుగు సినిమా అభిమానులు ఎక్కడున్నా ఒకటే మహలక్ష్మీ, అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా కూడా!" చెప్పాడు విష్ణుమూర్తి నవ్వుతూ. అతనికీ హీరో ఫైట్సు చేసినప్పుడల్లా ఈల వెయ్యాలని ఉన్నా సంస్కారం అడ్డువచ్చింది.


సినిమా చూసిన తర్వాత విష్ణుమూర్తి ఆమెని డొమినోస్కి తీసుకెళ్ళి పిజ్జా ఆర్డరిచ్చాడు. ఓ అరగంట తర్వాత తన ముందు ఉన్న పదార్థం చూసి మహాలక్ష్మి ఆశ్చర్యానికి అంతులేదు.

"ఇదేమిటండీ! ఇక్కడ హోటల్లో కూడా దిబ్బరొట్టెలు దొరుకుతాయా?" అని అడిగింది.


ఆమె అమాయకత్వానికి నవ్వు వచ్చింది విష్ణుమూర్తికి. తను నవ్వితే భార్య నొచ్చుకుంటుందని బలవంతాన నవ్వు ఆపుకొని, "ఇది దిబ్బరొట్టెకాదు మహాలక్షీ! దీన్ని పిజ్జా అంటారు." అన్నాడు.

సంకోచిస్తూ, ఆమె ఓ ముక్కు తీసి నోట్లో పెట్టుకొని మొహం అదోలా పెట్టి, "దీనికన్నా, మా అమ్మ చేసే దిబ్బరొట్టే ఎంతో బాగుంటుందండీ." అంది.


రోజూ ఆఫీసుకెళ్ళేముందు ఆమెకెన్నో జాగ్రత్తలు చెప్పిమరీ కదిలేవాడు కాదు. "ఇది ‘నమ్మ’ బెంగుళూరైనా అందర్నీ నమ్మలేం, జగ్రత్తగా ఉండు!" అని చెప్పి ఆఫీసుకి వెళ్ళాడు.


ఆ రోజు సాయంకాలం ఇంటికివచ్చిన విష్ణుమూర్తికి పకోడీలు, వేడివేడి కాఫీ అందిస్తూ, "ఇవాళో ఫోన్ వచ్చిందండీ!" అన్నాడు.


"మీ నాన్నగారు చేసారా?" యధాలాపంగా అడిగాడు విష్ణుమూర్తి.


"లేదండీ, ఎవరో బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసాడండీ! నా సెల్కి వచ్చిన ఓటిపి చెప్పమన్నాడు, లేకపోతే మన ఇద్దరిపేరున ఉన్న ఖాతా పనిచెయ్యదన్నాడండీ!" అందామె తనూ ఓ కాఫీ కప్పు చేతులోకి తీసుకొని. ఆ మాటలు వింటూనే కాఫీ తాగుతున్న విష్ణుమూర్తికి ఒక్కసారి పొలమారింది.

"కొంపతీసి చెప్పేసావేమిటి? అలా ఓటిపీ ఎవ్వరికీ చెప్పకూడదే! మన ఖాతాలో డబ్బులు మొత్తం కొట్టేస్తారు!" ఆదుర్దాగా అంటున్న విష్ణుమూర్తికి వైపు అమాయకంగా, వింతగా చూసింది మహాలక్ష్మి.


"అదేమిటండీ! మొన్న ఆదివారం మనం 'గోలా' క్యాబ్లో వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్కి ఓటీపి చెప్పారే!" అంది. విష్ణుమూర్తి తలపట్టుకున్నాడు.


"అయ్యో! అది గోలా కాదే! ఓలా! క్యాబ్లో వెళ్ళాలంటీ ఓటీపీ చెప్పల్సిందే!" అన్నాడు విష్ణుమూర్తి.

"అదేమింటండీ! గోలా, సారీ...ఓలావాళ్ళకి చెప్పొచ్చుకానీ, బ్యాంక్ వాళ్ళకి చెప్పకూడదా!" అంది మహాలక్ష్మి అమాయకంగా మొహంపెట్టి.


"అదంతే! నీకు ఆ ఫోన్ చేసింది బ్యాంక్ వాళ్ళు కాదు, ఎవరో మోసగాళ్ళు. ఇలా రకరకాలగా ఫోన్ చేసి, మభ్యపెట్టి మననుంచి ఓటిపి రాబెట్టి మన డబ్బులు దర్జాగా దోచేస్తారన్నమాట! అందుకే జాగ్రత్తగా ఉండాలి. తెలిసిందా!" చెప్పాడు.


"మరి నిన్న అమ్మాజాన్ నుంచి కొత్త ఫోన్ వస్తే ఓటిపి చెప్పాను నేను. వాడేం మన డబ్బులు దోచుకోలేదు కదా కొంపతీసి!" ఆదుర్దాగా భర్తవైపు చూసింది మహాలక్ష్మి.


ఫక్కున నవ్వాడు విష్ణుమూర్తి." అమ్మాజాన్, నాన్నజాన్ కాదే, అమాజాన్! దానికోసం చెప్పాల్సిందే! బ్యాంక్ అక్కౌంట్కి మాత్రం చెప్పకూడదు, తెలిసిందా!" ఆమెకి బోధపర్చి తన ఖాతాలో ఉన్న డబ్బులు చెక్ చేసుకున్నాడు. ఐయితే అందులో డబ్బులేమీ మాయం కాకపోవడంతో ఆశ్చర్యపోయి గుండెలమీద చెయ్య వేసుకున్నాడు. "అమ్మయ్య! నువ్వు ఓటీపీ చెప్పినా డబ్బులేమీ పోలేదు, తప్పుగా చెప్పావేమో!" రిలాక్స్డ్ గా చెప్పాడు.


"లేదండీ, సరిగ్గానే చెప్పాను. మనది జాయిట్ అక్కౌంట్ కదండీ! నేనేమో మీ అర్ధాంగిని, అంటే సగభాగాన్ని. అందుకే ఓటీపిలో సగం మాత్రమే చెప్పానండీ!" అమాయకంగా అంటూన్న మహాలక్ష్మిని బిత్తరపోతూ చూసాడు విష్ణుమూర్తి. ఆమె అమాయకత్వానికి విష్ణుమూర్తికి నవ్వొచ్చింది.

"పోనీ గండం గడిచింది! ఇకముందు ఎప్పుడూ నన్నడగకుండా అలా చెప్పకు." అన్నాడు. ఆమె సరేనని తల ఊపింది.


'నవ్వుకోనీ, నవ్వుకోనీ!...నన్ను పల్లెటూరి బైతనుకుంటున్నాడు. నేను కూడా ఎంబిఏ చేసానని తెలిస్తే ఏమైపోతాడో పాపం! అంతేకాక, వర్క్ ఫ్రం హోం చేస్తూ ఉద్యోగం చేస్తోందని తెలిస్తే ఇంకెంత ఆశ్చర్యపడతాడో! పల్లెటూరి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలన్న అతని నిర్ణయం తెలిసి, కావాలనే అతని అక్క సుబ్బలక్షి తన చేత అలా నటింపచేసి, ఇద్దరికీ ముడి వేసిందని పాపం అతనికి తెలియదు.' చాటుగా అటు తిరిగి నవ్వుకుంది మహాలక్ష్మి.

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


99 views0 comments

Comments


bottom of page