top of page

అసహాయ యోగ్యుడు'Asahaya Yogyudu' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 08/12/2023

'అసహాయ యోగ్యుడు' తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్పెళ్ళైన వారం రోజులకు అత్తగారింటికి కాపురానికి వచ్చింది శేష సాయి. పెళ్ళికి ముందు నుంచీ అడుగుతూ ఉండటం వల్ల శేఖర్ పనిచేస్తున్న హైదరాబాద్ కే సాయినీ బదిలీ చేశారు. అత్తగారు కొత్త కోడలికి ఎక్కువ పని చెప్పకుండా తనే పని చేసుకుంటూ ఉంది. సాయి అప్పుడప్పుడూ అత్తగారికి పనిలో సహాయం చేస్తూ ఉంది. శేఖర్ ఉదయాన్నే కు వెళ్ళి వచ్చి కార్యాలయానికి ( ఆఫీస్) తయారవుతాడు.


సాయి ఇంట్లో అత్తగారికి సహాయంగా ఉంటూ అత్తగారి బట్టలు సర్దడం, మామగారికి పుస్తకాలు సర్దడం, శేఖర్ బండి తుడవడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది. శేఖర్ సాయంత్రం ఆలస్యంగా వస్తాడు. వచ్చిన తరువాత ఎక్కువగా చరవాణి చూసుకుంటూ ఉంటాడు. సాయి సాయంత్రం వచ్చిన తరువాత వాళ్ళ కాంపౌండ్ లో ఉండే చెట్లకు, మొక్కలకు నీళ్ళు పట్టేది.


అలా సాయి చక చకా తిరుగుతూ పనిచేసుకుంటూ ఉంటే, అత్తమామలు సంతోషించే వాళ్ళు. కానీ శేఖర్ 'చేసుకుంటే చేసుకొనీ' అన్నట్లు నిర్లిప్తంగా ఉండేవాడు. ఏపనీ చెయ్యమని తను ఎవరికీ చెప్పడు, తను చెయ్యడు. వాళ్ళమ్మా, నాన్న శేఖర్ కు కావలసినవి ముందుగానే చేసి పెట్టేవాళ్ళు. పోరపాటున ఎప్పుడైనా "శేఖర్ కొంచెం ఈ పని చేస్తావా?" అని సాయి అనగానే…. అత్తగారో, మామగారో "నేను చేస్తాలేమ్మా" అనేవారు. ఒక్కోసారి "వాడెందుకు లేమ్మా" అనేవారు. సాయికి విచిత్రంగా వుండేది. 'శేఖర్ కు రాదా? లేక చెయ్యడం ఇష్టం లేదా?' అనుకునేది.


కొద్దిరోజులకు సాయి గర్భవతి అయ్యింది. సాయి అమ్మా, నాన్నలు వచ్చి చూసి పొయ్యారు. నెలలు గడిచే కొద్దీ సాయి గబగబా తిరగలేక నెమ్మదిగా తిరుగుతూ వుండేది. అత్తగారు శివ రంజని అన్ని పనులూ చేస్తుండేది. అప్పుడు కూడా శేఖర్ లో మార్పేమీ లేదు. ఎవరికీ ఎటువంటి పనిలో సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడైనా మంచినీళ్ళు, మాత్రలు ఏదైనా ఇవ్వమని సాయి అడిగితే ఇచ్చేవాడు.


ఒకసారి సాయి అడిగింది "ఇంట్లో ఏ చిన్నపనీ చేయకుంటే ఎలా జరుగుంతుందీ?" అని.


"నాకు సమయం లేదు" అన్నాడు. ఉన్న సమయం లో కూడా పనిచేసే ఉద్దేశ్యమే లేనట్లు ఉండేవాడు. దారిలో ఉన్న వస్తువు కూడా తియ్యడు.


సాయి కి నెలలు నిండినప్పటి నుండి సాయి వాళ్ళ అమ్మా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆఫీస్ కు ఒక పూట మాత్రం సెలవు పెట్టీ శేఖర్ ఆసుపత్రికి వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. ఎక్కువ సెలవులు కూడా పెట్టేవాడు కాదు.


సాయికి పండంటి మగబిడ్డ పుట్టాడు. చంటి బిడ్డ పనులు, బాలింత పనులు ఎక్కువయ్యాయి. పాచి పని చేసే అలివేలుకు ఎక్కువ జీతమిచ్చి కొంచెం ఎక్కువ పనులు కూడా చేయించుకుంటూ ఉన్నారు. ఇంట్లో వంటావిడను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ కలిసి చంటిబిడ్డ పని చూసుకునే వాళ్ళు. బిడ్డ స్నానాలు, తుడవడాలు, రెండు సార్లు బట్టలు ఆరేసుకోవడాలు ఈ పనులతో వాళ్ళకు తీరిక వుండేది కాదు. వాళ్ళిద్దరూ ఒకరి తరువాత ఒకరు విశ్రాంతి తీసుకునేవారు. పెద్దవాళ్ళయిన మగ వాళ్ళిద్దరూ కాసేపు బిడ్డను వళ్ళో కూర్చోబెట్టుకుని సహాయం చేసేవారు.


సాయి సెలవు పెట్టింది. శేఖర్ కు ఒక వారం సెలవు ఇచ్చారు. ఆ వారం రోజులు శేఖర్ తన ప్రకారమే లేచాడు. తన భోజనం తనే వడ్డించుకొని తిన్నాడు. ఎక్కువగా చరవాణి చూస్తూ వుండేవాడు. ఆసువత్రికి రెండు సార్లు తోడు వెళ్ళాడు. రెండు రోజులు భోజనం తీసుకొని వెళ్ళాడు. అంతే. శేఖర్ అమ్మా, నాన్న శేఖర్ కు ఏ పనీ చెప్పలేదు. సెలవు అయిపోయింది. మళ్ళీ మామూలుగానే లేవడం ఆఫీస్…. రాత్రి రాగానే స్నానం, భోజనం, నిద్ర అంతే. ఏమీ మార్పు లేదు. ఉదయం ఒకసారి పిల్లవాడిని ఉయ్యాలలో చూసేవాడు. రాత్రి ఒకసారి చూసేవాడు. అంతే తప్ప ఇంట్లో చిన్నపిల్లవాడి రాకతో పని పెరిగింది. గబగబా ఏదో ఒక పనిలో సహాయం చేద్దామని అనుకోలేడు.


రెండు నెలలు నిండి మూడవ నెలవచ్చింది పిల్లవాడికి. ఇక సాయి అమ్మా, నాన్న వాళ్ళ ఊరికి వెళ్తామన్నారు. వాళ్ళు వెళితే ఎలాగా అని సాయి నెల నుంచీ భయపడ్తూనే ఉంది. శేఖర్ ఏమాత్రం పనిలో సహకరించడు. అత్తమామలు పెద్దవారు. తనకు ఒంగి, లేచి అన్నీ పనులూ చేయడం ఇబ్బందిగా ఉంటోంది. ఎంత పని వాళ్ళు చేస్తున్నా ఇంట్లో వాళ్ళు చేసుకునే పనులు ఉంటున్నాయి. పాల సీసాలు కడగడం, పిల్లవాడి పక్కబట్టలు మార్చడం లాంటివి. పనివాళ్ళకు ఆపనులు చెప్పలేరు. ఆమాటే శేఖర్ తో అంటే 'నేను ఆఫీస్ కు ఆలస్యంగా గా వెళ్ళడం వీలవదు. సాయంత్రం ఏడు గంటల వరకు అక్కడ పని వుంటుంది' అంటాడే కానీ ఒక గంట ముందుగా లేచి, లేదా రాత్రి ఒక గంట ఎక్కువ మేల్కొని ఇంట్లో కనీసం పిల్లవాడి పనిలో సహాయం చేద్దామని అనుకోడు. పైగా 'నీ చుట్టూ నలుగురు పెద్దవాళ్ళనూ, ఇద్దరు పనివాళ్ళనూ వుంచాను. ఇంకా నేను చెయ్యాలని అంటావేమిటి?' అంటాడు. 'గర్భం దాల్చినప్పటి నుండీ చంటి పిల్లల పెంపకం వరకు భార్య, భర్తా ఇద్దరికీ అవగాహన, శిక్షణ తరగతులు ఉంటాయట. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను పంపించాలక్కడికి' కొంచెం కోపంగా అనుకుంది సాయి.


అందుకే సాయి ఆలోచించి అమ్మా వాళ్ళను ఇంకో రెండు నెలలు ఉండమని అడిగింది. అత్తమామలు కూడా అదే మంచిది అన్నారు. శేఖర్ ' అమ్మయ్యా ' అనుకున్నాడు.


వాడికి ఐదవ నెల వచ్చేసరికి పిల్లవాడు ఇంతకు ముందు లాగా పాలు తాగి పడుకోవడం లేదు. కొద్దిసేపు మేల్కొని కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. బోర్లా పడుతున్నాడు. ఎవరూ దగ్గర లేకుంటే ఏడుస్తున్నాడు. మంచం మీద నుండి కింద పడిపోగలడు కూడా. అందువల్ల దగ్గర ఎవరో ఒకరు ఉండవలసి వస్తోంది. రాత్రిళ్ళు కూడా ఎక్కువ మెల్కొంటూ ఉన్నాడు. సాయి కి కొంచెం వీపు నొప్పి, నడుం నొప్పి కూడా వస్తున్నాయి. అందువల్ల సాయి కి నిద్ర ఉండటం లేదు.


పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట ఇప్పుడు గుర్తుకు వచ్చింది. 'చంటి పిల్లలు ఇంట్లోకి వచ్చినప్పుడు డబ్బులు తగ్గుతాయి, నిద్ర తగ్గుతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, కానీ అంతకు మించిన సంతోషం పెరుగుతుంది' అని.అది సంతోషమే అయినా అమ్మా వాళ్ళు ఊరు వెళితే ఇక ముందు ముందు పిల్లవాడి సంరక్షణ ఎలా అని మధన పడుతూ, నిద్రపోతున్న పిల్లవాడి పక్కన మంచం మీద కూర్చున్న సాయి …. తలుపు కొట్టిన శబ్దానికి ఈ లోకం లో కొచ్చింది. వాడు కింద పడకుండా దిండ్లు అడ్డం పెట్టి వెళ్ళి తలుపు తీసింది."బాగున్నావా సాయీ?" అంటూ మృదుల… అంటే సాయి పెదమామ గారి కోడలు శృతి పలుకరించింది. ఆమె వెనుకే శృతి భర్త సాకేత్ వారి తొమ్మిది నెలల పిల్లవాడిని ఎత్తుకొని నిలబడి ఉన్నాడు. వారి వెనుక సాకేత్ వాళ్ళమ్మ కూడా ఉంది. l


ఆశ్చర్యంతో చూస్తున్న సాయి… మృదుల మాటలకు తేరుకొని "రండక్కా, రండి బావగారు, రండి అత్తయ్యా" అంది.


ఈ లోపల సాయి వాళ్ళ అత్తయ్య, మామయ్యగారు వచ్చి పలుకరించారు. సాకేత్ వాళ్ళు కూడా ఆ వూర్లోనే ఉన్నారు.


"ఈ రోజు మీ పక్కింటి లలిత వాళ్ళ అమ్మాయి పుట్టిన రోజూ పండుగ కదా! చీటీ పాట స్నేహితులను అందరినీ పిలిచారట. నిన్ను చూసి నేను చీటీ కట్టాను కదా! అందువల్ల నన్ను కూడా పిలిచారు" అంటూ సాయి ఇచ్చిన మంచి నీళ్ళు అందుకుంది నవ్వుతూ మృదుల.


"మిమ్ములను చూసినట్టు ఉంటుందని వాళ్ళిద్దరితో పాటు నేను కూడా వచ్చేశా" అంది సాకేత్ వాళ్ళమ్మ సుభాషిణి తోడికోడలు శివరంజనితో. సాయి వాళ్ళమ్మ సౌజన్య, నాన్న వాళ్ళు కూడా వచ్చి పలరించారు.


"మీరు ఇక్కడే ఉండి పిల్లవాడి పనులు చెయ్యడం చాలా వెసులుబాటుగా ఉంటుంది అందరికీ" అంది నవ్వుతూ సుభాషిణి, సౌజన్య తో.


"అవును. వదినగారు ఉండటం నాకెంతో సహాయంగా వుంది" అంది శివరంజని సంతోషంగా సౌజన్యను చూస్తూ.


"మన పిల్లలకే గదండీ చేసుకుంటున్నాము. ఇందులో నేను ప్రత్యేకంగా చేసిందేముందిలెండి" మొహమాటంగా అంది సౌజన్య.


" 'మేము పిల్లవాడికి మూడవ నెల వచ్చేదాకా చేస్తాము, తరువాత వెళతా' మని అనలేదుగా మీరు. అది మీ మంచి మనసు" అన్నాడు శేఖర్ వాళ్ళ నాన్న.


ఈ లోపు సాకేత్ చేతిలో ఉన్న స్వరూప్ ఏడుపు వినిపించి మృదుల అటు వెళ్ళింది. సాకేత్ స్వరూప్ కు తడిసిన బట్టలు మార్చేశాడు. "వర్షాకాలం కదా! అందుకే త్వరగా మార్చాల్సి వస్తోంది" అన్నాడు సాకేత్. మృదుల వెళ్ళి వాడిని ఎత్తుకుంది.

సాకేత్ బట్టలు మార్చడం శేఖర్ కుటుంబం, సాయి కుటుంబం వింతగా చూశారు. అప్పుడే కాదు తరువాత కూడా వాడి పనులన్నీ సాకేత్ చూస్తున్నాడు, ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఆకలికి అమ్మ అవసరమైనప్పుడు మాత్రం మృదుల తీసుకుంటూ ఉంది.


సాయంత్రం శేఖర్ వచ్చిన తరువాత పుట్టినరోజు కార్యక్రమానికి కొద్దిసేపు వెళ్ళి వచ్చారు…మృదుల, సాయి. సాకేత్ పిల్లవాడి అవసరాలను అలా చూసుకుంటూ వుంటే శేఖర్ కు ఆశ్చర్యం గానూ, కొంత అయిష్టంగా నూ కూడా వుంది. తను చెయ్యని పని అన్నయ్య చెయ్యడం శేఖర్ కు కష్టంగా అనిపిస్తూ ఉంది. సాకేత్ చేస్తున్నాడు కాబట్టి తనను చెయ్యమని చెప్తారేమో అని శేఖర్ భయపడ్తున్నాడు. సాకేత్ పిల్లవాడికి చేసేవన్నీ చూస్తే సాయి కుటుంబం వాళ్ళు, శేఖర్ కుటుంబం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.


రాత్రి అందరూ భోజనం చేసే లోపల సాకేత్ స్వరూప్ ను నిద్రపుచ్చాడు. భోజనాల మధ్యలో సాయి వాళ్ళ నాన్న "చినపిల్లవాడిని మీరు చక్కగా చూసుకుంటూ ఉన్నారు. మీకు ఇబ్బందేమీ అనిపించలేదా?" అన్నాడు సాకేత్ ను చూస్తూ.


"ఏమీ లేదు మామయ్య గారూ! అంతకుముందు నాకేమీ తెలియదు. అమ్మను చూసి, చేస్తూ వస్తున్నానంతే. మృదులకు సహాయంగా ఉండా లనుకున్నాను. తనకు విశ్రాంతి లేకుండా పూర్తిగా అనారోగ్యం పాలైతే అప్పుడు అందరికీ ఇబ్బందే కదా?

అందుకే ఇప్పుడు తను, పిల్లవాడు అందరూ ఆరోగ్యంగా వున్నారు. నేను ఉద్యోగం చేస్తున్నా కూడా కొంచెం వెసులుబాటు చేసుకుంటూ ఉన్నాను" అన్నాడు సాకేత్.


"మంచి మాట చెప్పారు. ఇంట్లో నలుగురూ కలిసి పనిచేసుకుంటే ఆ సంతోషమే వేరు" అంది సౌజన్య.


"అవును వదినగారూ…మొదట్లో నేను కూడా వీడేంటి, ఆడవాళ్ళు చేసినట్లు పిల్లవాడి పనులులన్నీ చేస్తున్నాడని కొంచెం కొప్పడ్డాను. అందరూ చులకన చేస్తారని జంకాను కూడా. కానీ 'మన పని మనం చేసుకుంటే తప్పేముందమ్మా?' అన్నాడు. ఆ తరువాత నాకూ, మృదులకూ ఎంతో సహాయంగా వుండటం చూసి, సాకేత్ ఎంతో ముందు చూపుతో ఇంటిని, ఇల్లాలిని చక్కగా చూసుకుంటూ ఉన్నాడని అనిపించింది" అన్నది సుభాషిణి సౌజన్యతో.


"కానీ కొన్ని పనులు అలవాటు లేకుంటే చెయ్యలేరుగా అక్కయ్యా!" అంది శివరంజని శేఖర్ పనిచెయ్యడం లేదని అనుకుంటారేమోనని.


"చెప్తే తప్పుగా అనుకుంటారేమోనని కూడా మేము తనకేమీ చెప్పడం లేదు" శేఖర్ కు కోపమొస్తోందేమో అని సాయి కూడా అత్తగారు చెప్పినట్లే చెప్పింది.


"చెప్తేనే చేసేవాళ్ళు కొంతమంది. చెప్పినా…చెయ్యని వాళ్ళు కొంతమంది. అయినా చెయ్యాలని లేకుంటే చెప్పినా చెయ్యరు. చెయ్యాలనే ఉద్దేశ్యం మనసులో నుంచి రావాలి. అయినా ఈ కాలంలో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకూ సమయం లేదు. అందువల్ల ఆడ పనీ, మగ పనీ అనే తేడా లేకుండా అందరూ అన్ని పనులూ చేస్తున్నారు" అంది సుభాషిణి.


"అందులోనూ తల్లితండ్రులు పెద్దవయసు వాళ్ళు. వాళ్ళకు ముదిమి వయసులో ఆరోగ్యం సహకరించదు. మా పిల్లల బాధ్యత మేము చూసుకోవడం చాలా మంచిపని అనుకున్నాను. ఇంత చదువుకొని యోగ్యుడైన నేను… ఇంట్లో ఎటువంటి సహాయం చెయ్యకుండా 'అసహాయ యోగ్యుడు' గా ఉండలేను. నా బాధ్యత నేను నెరవేరుస్తూన్నాను. అయినా పిల్లవాడి ఆలనా, పాలనా చూడటం లో నాకూ సంతోషముంది కదండీ" అన్నాడు నవ్వుతూ సాకేత్.


శేఖర్ నెమ్మదిగా భోజనం పూర్తి చేశాడు. అన్నీ వింటున్న శేఖర్ లో కూడా అహంకారపు పొర తోలగుతూ ఉన్నట్లుంది. అప్పుడే ఉయ్యాలలో నిద్రపోతున్న తన కొడుకు కదులుతూ చిన్నగా ఏడ్వడంతో వాడిని నెమ్మదిగా ఎత్తుకోవడమే అందుకు నిదర్శనం. శేఖర్ లో వచ్చిన మార్పు చూసిన ఇంట్లో వాళ్ళందరి మొహాల్లో చిరునవ్వుతో కూడిన సంతోషం కనిపించింది.

***

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


సమాప్తం

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.31 views0 comments

Comments


bottom of page