top of page

ఆశల రెక్కలు


'Asala rekkalu' New Telugu Story


Written By Lakshmi Sarma Thrigulla


(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


కథాపఠనం: కే. లక్ష్మి శైలజ

"ఏయ్ సింధు.. నిన్న రాలేదేంటి కాలేజికి? పెళ్ళిచూపుల ఏర్పాటు ఏమైనా జరిగిందేమిటి? అయినా మాకెందుకు చెబుతావులే, పెళ్ళికార్డు తెచ్చి చేతిలోపెడుతుందేమో.. అంతే కదా పద్మ," అంది సుధ.

"అబ్బా.. ఏంటే నీ గోలా, దాన్నీ కాలేజిలో అడుగుపెట్టనిస్తావా లేదా? పాపం అది మాత్రం ఏం చేస్తుంది చెప్పవే? దీని పెళ్ళి అయిందనిపిస్తే దీని తరువాత ముగ్గురు ఆడపిల్లలున్నారు. వాళ్ళందరికి పెద్ద చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే మామూలు విషయం కాదే తల్లి" అంది పద్మ.

"అలా చెప్పవే దానికి, పుట్టినప్పటినుండి డబ్బులోనే పుట్టిపెరిగింది. సుధకు సుఖాలు తెలుసు కానీ మధ్యతరగతి కుటుంబాల కష్టాలు తెలియవు కదా! మా నాన్న ఒక్కడి

సంపాదనమీదనే ఇంతమందిని పోషించాలి. పైగా మా అందరిని పెద్ద చదువులు చెప్పించాలి అంటే డబ్బులు కావాలి. పోనీ అంటే అందరం ఆడపిల్లలమే.

ఉన్నదంతా మాకే దోచిపెడితే, రేపు వాళ్ళ భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలి కదా!


అడిగినంత కట్నాలు పోసి పెళ్ళికొడుకును తెచ్చుకునే స్థోమత మాకులేదు. అందుకని మా సంబంధం నచ్చి మాకు అనుకూలమైనదివచ్చినప్పుడే మా పెళ్ళిళ్ళు చెయ్యాలని మా నాన్న కోరిక," అంది బాధపడుతూ.

"ఏయ్ సింధు.. దాని మాటలు పట్టించుకుంటావా? సరదాగా నిన్ను ఆట పట్టించాలనుకుంటే నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటున్నావా? చూడవే.. మనందరం ఏదో ఒకరోజు పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళవలసిన వాళ్ళమే. అవునా కాదా," అడిగింది పద్మ సింధును. అవునన్నట్టుగా తలవూపింది సింధు.

"సారీ సింధు.. నిన్ను బాధపెట్టాలని అలా అనలేదు, సరదాగా అన్నాను. ఏమి అనుకోకే," అంది బ్రతిమాలుతూ.

“ఎవరి పెళ్ళి గురించి మాట్లడుతున్నారు? అప్పుడే పెళ్ళేంటే.. మన చదువులు పూర్తవకుండానే.. మీరందరూ చేసుకున్నా నేను మాత్రం ఇప్పట్లో పెళ్ళిమాటే ఎత్తను," అంటూ వచ్చింది ప్రసన్న.

"సరేలే వచ్చావు.. ఇంకా మా మధ్యకు.. పానకంలో పుడకలా రాలేదా అని ఎదురు చూస్తున్నాము," అంది సుధ.

"నేను లేకపోతే మీ మధ్య సరదాలే ఉండవు, ఎప్పుడూ దేని గురించో బాధపడుతుంటారు. అవునాకాదా చెప్పు.. "అంటూ సుధ చెవిని మెలేసింది.

"అబ్బా.. దాన్నీ వదలవే.. నువ్వు లేకుండా మా మధ్య రహస్యలేమి లేవుగాని, పదండి క్లాసు టైం అయింది," తొందర చేసింది సింధు.


"అబ్బా.. ఊరికే వదిలిపెడతానా ఏంటీ? క్లాసు పోయినా పరవాలేదు, ఇందాకా ఏదో పెళ్ళి గురించి మాట్లాడారు.. నాకు చెప్పాల్సిందే," పట్టుదలగా అంది ప్రసన్న.

“అమ్మా.. మహాతల్లి, ఎవరికి పెళ్ళి కుదరలేదు. ఏదో తమాషాకు అనుకున్నాము. అవును.. ఏంటి పెళ్ళి అనగానే బలే సరదాపడుతున్నావు.. చేసుకుందా మనుకుంటున్నావా. " నవ్వుతూ అడిగింది సుధ.

"ఛ ఛ.. నాకు తొందరేమిటి, నేను చదువు పూర్తి చెయ్యాలి, అమెరికా వెళ్ళాలి. అక్కడే నాకు నచ్చినవాడిని పెళ్ళి చేసుకోవాలి. ఇదే నా ధ్యేయం.. ఇదే నా శపథం"అంటూ

సినిమా ఫక్కిలో తొడకొడుతూ అంది.

"కొయ్ కొయ్ కోతలు బాగానే కోస్తున్నావు. మన తల్లితండ్రులకు ఈ మాత్రం చదివించడమే మాహా గొప్ప, అలాంటిది అమెరికాకు పంపించే స్థోమతలు మనకు లేవని తెలుసుకొని, ఆకాశంలో నుండి భూమిమీదకు రావమ్మ మహాతల్లి," అంది పద్మ.

"ఏం ఎందుకలా నిరుత్సాహ పరుస్తారు, నేను కచ్చితంగా అనుకున్నది సాధిస్తా. చూస్తూ ఉండండి, ఈ ప్రసన్న అంటే ఏమిటో అప్పుడు చూపిస్తాను ఆహ ఆహ," అంది నవ్వుతూ.

"సరేలేవే నువ్వు.. నీ సినిమాల పిచ్చి," అంటూండగానే క్లాసు మొదలైంది.


సాయంకాలం ఇంటికి వెళ్ళేముందు సింధు అడిగింది ప్రసన్నను.

"అవును నువ్వు అమెరికా వెళ్ళలనుకుంటున్నావు కదా! మరి అంతడబ్బు ఎవరిస్తారు? సుధలాంటి వాళ్ళకు కుదురుతుందేమో, ఇంచుమించు మీది మాది ఒకటే పరిస్థితి, అలాంటప్పుడు నువ్వు శక్తికిమించి ఆలోచిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు," అంది.

"చూడు సింధు.. మనసుంటే మార్గాలు అవే దొరుకుతాయి, సుధకు డబ్బుంది మనకులేదని ఎందుకు బాధపడాలి, ఈ రోజుల్లో ఆడపిల్లలకే మంచి డిమాండ్ ఉంది, అమెరికాలో ఉండేవాళ్ళకు పిల్లనివ్వడానికి చాలామంది భయపడుతున్నారు, ఇంకో సంవత్సరం అయితే నా ఇంజనీరింగ్ అయిపోతుంది, ఈ లోపల అక్కడెవడన్న గ్రీన్ కార్డ్ వాళ్ళు పెళ్ళికాని వాళ్ళుంటే కనుక్కోవాలి, అతను బాగుంటే సరి.. లేదంటే పెళ్ళిచేసుకుని గ్రీన్ కార్డ్ నాకివ్వగానే, అతన్ని వదిలేసి నా ఇష్షంవచ్చినవాడిని పెళ్ళి చేసుకుని విలాసవంతమైన జీవితం గడపాలని ఉంది. చెప్పు.. ఎలా ఉంది నా ఫ్లాన్" అంది గర్వంగా. అలానే నోరు వెళ్ళబెట్టి చూస్తుంది సింధు.

గట్టిగా చప్పట్లు కొట్టి. "ఏమిటే సింధు, ప్రసన్న అప్పుడే అమెరికాకు వెళ్ళిపోయినట్టు కలలు కంటున్నావా? అదంతా ఆషామాషి వ్యవహారం కాదులేగానీ, ఒసేయ్ ప్రసన్నా..

ఎందుకే ఆశలపల్లకిలో ఊరేగుతున్నావు, లేనిపోని ఆశలుపెట్టుకోకు. విసిరేసిన బంతిలా నేలమీద పడిపోతావు జాగ్రత్తా," అంది పద్మ గలగలా నవ్వుతూ. సింధు

సుధకూడా శృతికలిపారు.

ప్రసన్న ముఖం ఎరుపెక్కింది చిన్నతనంగా భావించింది. "మీకు నా మాటలు నవ్వులాటగా ఉన్నాయికదా! మీరు చూస్తుండండి నేనన్నది ఎలా సాధిస్తానో," అంటూ విసవిసా కోపంగా అక్కడనుండి వెళ్ళపోయింది. మిగిలిన ముగ్గురు నవ్వుకున్నారు ప్రసన్న వెళ్ళిపోవడం చూసి.


ఇక అప్పటినుండి ఎవరుకూడా ప్రసన్న ముందు పెళ్ళి విషయం తీసుకురాలేదు. చూస్తుండగానే ఇంజనీరింగ్ పూర్తిచేసుకాగానే సింధు, పద్మల పెళ్ళిళ్ళు అయిపోయాయి. సుధ (ఎమ్ టెక్) లో జాయిన్ అయింది. ప్రసన్న తను అనుకున్నవిధంగా పట్టువదలని

విక్రమార్కురాలిలాగా గట్టి ప్రయత్నం చేసి. అనుకున్నట్టుగానే అమెరికా సంబంధం

దొరికింది.


పెళ్ళికార్డ్ తీసుకొచ్చి స్నేహితురాళ్ళను ముగ్గురిని ఇందిరాపార్కు కు రమ్మని అక్కడే ఇచ్చింది.

"ఇప్పుడేమంటారు నేను అన్నది సాధించానా లేదా? పట్టుదలతో ఏపనైనా సాధించుకోవచ్చు, మీరు దగ్గరుండి నా పెళ్ళి జరిపించండి, మళ్ళి ఎప్పుడు కలుస్తామో ఏంటో," అంది గర్వంగా.

"ప్రసన్నా.. నాదొక చిన్న విజ్ఞప్తి," సింధు అంటుంటే చివ్వున తలెత్తి చూసింది ఏమిటన్నట్టు.

"నీవనుకున్నది సాధించావు చాలా సంతోషంగా ఉంది మాకు, కాకపోతే.. నువ్వన్నట్టుగా పెళ్ళిచేసుకుని అతనితో హాయిగా కాపురం చేసుకో, అంతేగానీ అతను నచ్చలేదని అతన్ని వదిలేసి మరొకతన్ని చేసుకున్నా, అతను కొన్నాళ్ళకు నచ్చకపోవచ్చు, అప్పుడు మళ్ళి ఇంకొకతను.. ఇలా మన మనసు పోయినట్టల్లా మనం పరుగులు పెట్టకుండా ఉండేలా చూసుకో.


నువ్వక్కడున్నా నీ ఆనందమే మాకు కావాలి, ఎక్కడున్నా మన సాంప్రదాయం ప్రకారం భర్తా పిల్లలు, పదిమంది హర్షించి గర్వపడేలా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకో," అంటూ

ప్రసన్న రెండుచేతులు పట్టుకుని చెప్పింది.

"మొదలుపెట్టావా నీ సోది పురాణం, చూడు సింధు.. నేనెప్పుడు గలగలపారే సెలయేరు లాంటిదాన్ని. ఇప్పటివరకు పేదరికంలో మగ్గిపోయాను. అయినా నేనెప్పుడు బాధపడుతూ కూర్చోలేదు, నాకు కావలసింది నేను సాధించుకుంటూనే ఉన్నాను, ఇప్పుడిక నన్నాపే వాళ్ళేలేరు. ఎంత ఆనందం అనుభవించాలో అంత అనుభవిస్తాను. నాకు కావలసిన పద్ధతిలో నేనుంటాను. నేను దేనికి రాజీపడే సమస్యేలేదు. మీకులాగా ఉన్నదానిలో తృప్తిపడే రకంకాదు నేను. అదిసరే గాని మీరందరు తప్పకుండా రావాలి నాపెళ్ళికి," అంటూ కొద్దిసేపు ఏవేవో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుని ఎవరిదారిన

వాళ్ళు వెళ్ళిపోయారు.


అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే ప్రసన్న రవితేజల పెళ్ళి ఘనంగానే జరిగింది. పెళ్ళి ఖర్చులన్ని రవితేజనే పెట్టుకున్నాడు. రవితేజ అమెరికానుండి వస్తూనే దుబాయిలో కాబోయే భార్యకోసం అవసరమైన నగలు తీసుకున్నాడు. రవితేజ చూడడానికి పెద్ద అందగాడేం కాదు. నలుపు అయినా ముఖంలో వర్చస్సు కనపడుతుంది. పెళ్లికి వచ్చినవాళ్ళందరి నోళ్ళల్లో ఇదేమాట.


'కాకిముక్కుకు దొండపండులా"ఉంది. అమెరికా సంబంధం అని మురిసి పోయినట్టున్నారు. పిల్లకు పిల్లవాడికి అసలు కుదరలేదు' అనుకున్నారు కొంతమంది.


ఏదైతేనేం.. తన మనసులో ఉన్నది నెరవేరినందుకు సంతోషంగా ఉంది ప్రసన్న. అందమైన భార్య దొరికినందుకు పొంగిపోతున్నాడు రవితేజ. మొదటిరాత్రి ఎంతో సంతోషంగా గడపాలనుకున్నాడు. భార్యతో మనసువిప్పి మాట్లాడాలి ఎలాంటి అరమరికలు రాకుండా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ తను అనుకున్నది ఒకటైతే దైవమొకటి తలిచినట్టు, తమ మొదటిరాత్రిని మాములు రాత్రిలాగా చేసింది ప్రసన్న. అందరి ఆడపిల్లలలాగా పాలగ్లాసుతో రాలేదు. తెల్లటిచీర మల్లెపువ్వులతో వస్తుందనుకుంటే, నైటితో వచ్చి రవితేజను చప్పన చల్లారేలా చేసింది.

"ప్రసన్నా.. ఏమిటి ఇలా వచ్చావు, ఈ రోజు మన మొదటి రాత్రి కదా! నువ్వు చక్కగా తయారయ్యి వస్తావనుకున్నాను, ఏమైంది ఒంట్లో బాగాలేదా ఎవరేమైనా అన్నారా," ఆప్యాయంగా అడుగుతూ ప్రసన్న భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు.

"అయ్యో వద్దండి.. దూరంగా ఉండండి. నన్ను మైలంటుకుంది. మీరు మొక్కులన్ని తీర్చుకోవాలట కదా! అందుకని ఈ నాలుగురోజులు నన్ను తాకకుండా ఉండండి.

ఏమండి.. నాదొక చిన్నమాట. వింటారా? నాకు మన మొదటిరాత్రి ఇక్కడ చేసుకోవాలని లేదు, మనం అమెరికా వెళ్ళాక అయితే అక్కడ ప్రతి రాత్రి మనకు మొదటిరాత్రే అవుతుంది. ఎంతా.. ఇంకా పదిహేను రోజులు ఓపికపట్టారంటే సరిపోతుంది. ఏమంటారు," వగలు ఒలకబోస్తూ అడిగింది.

"అయ్యో! నాకు తెలియక నిన్ను బాధపెట్టానా ప్రసన్నా.. నీకు ఎలా ఇష్టమైతే అలానే ఉందాం. ఇకనుండి ఒకరికొకరం అన్నట్టుగా ఉందాం. నువ్వెలా చెబితే నేనలా

నడుచుకుంటాను. సరేనా," అన్నాడు రవితేజ.

"ఎంతమంచివారండి మీరు,"అంది.

ప్రసన్నకు వీసాకోసం ప్రయత్నం చేస్తే రాలేదు. రవితేజ ఒక్కడే వెళ్ళవలసి వచ్చింది. ప్రసన్నను వదిలి వెళ్ళాలంటే చాలా బాధనిపించింది రవితేజకు.

"ప్రసన్నా.. నేను వెళుతూనే నీకు వీసా పేపర్లు పంపిస్తాను, ఈసారి ఎక్కడ పొరబాటు కాకుండా చూసుకుందాం," అంటూ ప్రసన్ను కౌగిలిలోకి తీసుకున్నాడు.

'అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉన్నా'రంటూ తప్పించుకుని బయటకు వచ్చింది.

'ఏమిటో ఈ పిల్ల అర్థంకావడంలేదు. ఒంటిమీద చెయ్యి వెయ్యనివ్వదు. ఏమన్నంటే అన్ని అక్కడకు వచ్చాకే అంటుంది. అసలు ఈ పెళ్ళి ప్రసన్న ఇష్టంగా చేసుకుందా

లేకా ఎవరి బలవంతంగానైనా ఒప్పుకుందా? రవితేజలో అప్పుడప్పుడు ఈ ప్రశ్న మనసును తొలుస్తుంది. తను వెళ్లి పోతున్నాను అన్న బాధకూడా కనిపించడంలేదు

తనలో. ఏమోలే అనవసరంగా తనను అనుమానిస్తున్నానేమో. అక్కడకొచ్చాక అన్ని

సర్ధుకుంటాయి. తొందరగా ప్రసన్న అక్కడికి వచ్చేలా చూసుకోవాలి' అనుకున్నాడు ఏయిర్ పోర్టు లో బాయ్ చెబుతూ.

"హలో ప్రసన్నా.. ఏమైంది నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడంలేదు కోపమా నా మీద, నిన్ను విడిచిపెట్టి వచ్చానని, ఏం చెయ్యనుచెప్పు? నేను మంచిగానే వచ్చాను,

నువ్వు మా అమ్మానాన్నలతో ఉండు. త్వరలోనే వీసాపేపర్లు పంపిస్తాను," మెసేజ్ పెట్టాడు, అమెరికా చేరాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి. ఆమెనుండి

వారంరోజులైనా సమాధానం రాలేదు.

"హలో అమ్మా.. ప్రసన్న ఎక్కడుంది ఫోన్ తీయడంలేదు?" అడిగాడు రవితేజ తల్లికి ఫోన్ చేసి.

"ఏమో బాబు.. నువ్వు వెళ్ళగానే తను వాళ్ళమ్మ వాళ్ళతోనే వెళ్ళిపోయింది. మీ నాన్న ఒకసారి వెళ్ళివచ్చారు ఇంటికి తాళం ఉందట, ఏదైనా ఊరు వెళ్లారో ఏమో,"అంది.

"అయితే సరేలే అమ్మా.. వాళ్ళు వచ్చాక ఫోన్ చేస్తారేమో నాన్నను అడిగానని చెప్పు. ఉంటానమ్మా," ఫోన్ పెట్టేసాడు.

"హయ్.. బాగున్నారా? నేను మీ ఫోన్ చూసుకోలేదు, నేను మా ఫ్రేండ్స్ తో కలిసి టూర్ వెళ్ళాను. ఇదిగో ఈ రోజు వచ్చాను. వస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాను," చెప్పింది ప్రసన్న.

"హయ్ ప్రసన్నా.. నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా? అబ్బా.. నిన్నుచూసి ఎన్ని రోజులైందో లెక్కపెట్టి చెప్పనా! నిన్ను ఎప్పుడెప్పుడూ చూస్తానా అని ఉంది. తొందరలోనే వీసా పేపర్లు పంపిస్తాను నీ మెయిల్ కు. వీసా అపాయింట్ మెంట్ కూడా తీసుకుంటాను, అది క్లియర్ అయిందంటే టికెట్ బుక్ చేస్తాను. సరేనా మై డియర్," అడిగాడు రవితేజ.

"ఓకే.. నేను ఎదురుచూస్తుంటాను, నాకూ ఉంది ఎప్పుడెప్పుడు అమెరికా వద్దామా అని. ఇదిగో చూడండి.. మీ నాన్నగారు వచ్చి మా ఇంటి ఎదురువాళ్ళను అడిగాడట, నేను ఎక్కడకు వెళ్లాను.. ఏమి చేస్తున్నాను.. అని నా మీద ఎంక్వరీలు చెయ్యొద్దని చెప్పండి. నేను మీ దగ్గరకు వచ్చేవరకు మీ వాళ్ళతో ఉండడం జరగని పని అనికూడా చెప్పండి. ఉంటాను," టక్కున ఫోన్ కట్ చేసింది ప్రసన్న.

ఇప్పుడే మంచిగా మాట్లాడింది. అప్పుడే కోపానికి వస్తుంది. నేను ప్రసన్నతో సజావుగా కాపురం చెయ్యగలనా లేదా! నాకు ఏమి తోచడం లేదు. సీటిలో పుట్టిపెరిగిన పిల్ల కదా ! మా పల్లెటూరిలో ఉండాలంటే కష్టమేలే. అందులో నేనుంటేనేమో తను ఉండేది. నేను లేకుండా తనను అక్కడ ఉండమనడం కూడా భావ్యంకాదు. సాధ్యమైనంత తొందరగా వీసా పేపర్లు పంపాలి. ప్రసన్న ఇక్కడకు వచ్చిందంటే ఇద్దరం చక్కగా కలిసి హాయిగా ఉండొచ్చు అనుకుంటూ కలలు కంటూ ఉన్నాడు.

"ఏయ్ ప్రసన్న.. ఎలా ఉన్నావే? ఏంటి నువ్వింకా అమెరికా వెళ్లలేదట ఏమైందే," ఫోన్ చేసింది పద్మ ఒకరోజు.

"హలో పద్మ.. నేను బాగానే ఉన్నానే, నువ్వు నలుగురు పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నావని, మీ అత్తగారితో కూడా కష్టాలున్నాయని మీ అమ్మ చెబుతూ బాధపడింది, చూసావా పద్దూ.. నేను చెప్పానా? పెళ్ళి చేసుకుంటే ఈ బరువు బాధ్యతలు కష్టాల్లో కూరుకుపోవాలని, అందుకే పెళ్ళి పిల్లలు నాకిష్టంలేదు, లైఫ్ ను ఎంజాయ్ చెయ్యడమే నాక్కావలసింది. వింటున్నావా?" అడిగింది ప్రసన్న విలాసంగా నవ్వుతూ.

"ఏమో ప్రసన్న.. నువ్వనుకున్నట్టు అందరు నీలానే లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనుకుంటే, బంధాలు బంధుత్వాలతో పనేంటి, అమ్మా అన్న పిలుపుకు నోచుకోని జన్మెందుకు చెప్పు? నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా బ్రతికినప్పుడే ఆడదానికి విలువ, ఏమో నువ్వనుకున్న నీ జీవితం నీ ఇష్టం, కాకపోతే ఒకమాట చెపుతాను, నీ మెడలో కట్టిన తాళిని ఎగతాళి చెయ్యకు, నీకు అవసరంలేదేమో కానీ! కన్నవాళ్ళకు నిన్ను కట్టుకున్నవాడికి పరువు మర్యాదలుంటాయి కదా!


అతనికి ముందేచెప్పు నీ గురించి. ఎందుకంటే అతను నీతో రాజీ పడతాడా? లేకా నీ కర్మకు నిన్ను వదిలేసి అతని జీవితం అతను చూసుకుంటాడా అనేది నువ్వు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. సరే.. ఇంకెప్పుడు నువ్వు నాతోగాని నేను నీతోగాని మాట్లాడడం కుదరదు. ఉంటా," ఫోన్ పెట్టేసింది పద్మ.

'పిచ్చి పద్మ.. నువ్వే కాదుకదా! ఆ దేవుడే దిగివచ్చినా నన్ను మార్చలేడు. చూస్తుండు కొన్నాళ్ళలో నేను అమెరికాకు వెళుతున్నాను. నాకు ఇష్టమైన జీవితం గడపబోతున్నాను' అనుకుంటూ పకపకానవ్వుతూ ఊహల్లో తేలిపోయింది.

"హలో ప్రసన్న.. నీకు వీసా పేపర్లు పంపించాను నీ మెయిల్ కు. వీసా ఆపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాను. కనీసం పేపర్లు వచ్చాయని కానీ వీసాకు వెళ్ళి వచ్చానని కానీ, నాకు చెప్పాలి కదా? అసలేంటి.. ఏమనుకుంటున్నావు? వీసా వచ్చింది అన్న సంగతి కూడా నాకు చెప్పేది లేదా?


నీకు ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా, చదువుకున్నదానివి ఆ మాత్రం తెలియదా? నీకు టికెట్ బుక్ చెయ్యాలా వద్దా? నీకు ఇక్కడకు రావడం ఇష్టంలేనట్టుంది. అందుకే నాతో చెప్పడంలేదు వీసా వచ్చినట్టు. అవునా?" కోపంతో చెడామడా అనేసాడు రవితేజ.

"హలో.. ఏంటి.. నీ ఇష్టమొచ్చినట్టు అనేస్తున్నావు? నేను మాటంటే పడేరకంకాదు తెలిసిందా? అవును.. వీసా వచ్చింది. నాకు ఇక్కడ పనులుంటాయి. అవన్ని పూర్తిచేసుకున్నాక నీకు చెబుదామనుకున్నాను, టికెట్ గురించి.. వీసా రాగానే పరుగెత్తుతుంటూ రావడం కుదరదని తెలియదా?


నేను ఉద్యోగానికి రిజైన్ చెయ్యాలి వాళ్ళు టైం ఇస్తారు, ఆ మాత్రం తెలియదా.. చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు.. నేను వచ్చే నెలవరకు రాలేను. అప్పుడు తీసుకో టికెట్. అర్థమైందనుకుంటాను. మాటిమాటికి ఫోన్ చేసి విసిగించొద్దు," అంటూ ఫోన్ కట్ చేసింది.

ఒక్కసారిగా తల గిర్రున తిరిగినట్టయింది రవితేజకు. వామ్మో ప్రసన్న ఇదేందిరా బాబు ఇలా మాట్లడుతుంది. ఎరక్కపోయి చేసుకున్నానా ఈ అమ్మయిని. ఇక్కడకు రాకముందే ఇలా వాయించేస్తుంది వచ్చాక ఎలా ఉంటుందో ఏమో భయమేస్తుంది.

"ఏరా రవి.. చాలా రోజులకు కనిపించావు మీ ఆవిడ వచ్చిందేంటి? మరీ నల్లపూసవయిపోయినావు? ఒక్కడివే వచ్చావు మీ ఆవిడను తీసుకరాకపోయావా," అడిగాడు మాధవ్ తలుపుతీస్తూ.

"తనింకా రాలేదు మొన్ననే వీసా వచ్చింది ఇంకా టికెట్ బుక్ చెయ్యాలి," చెప్పాడు ముఖం చిన్నబుచ్చుకొని.

"రవి.. నువ్వు ఏదో బాధపడుతున్నట్టున్నావు ఏమైంది ఏమైనా ప్రాబ్లమా? డబ్బులు ఏమైనా కావాలా? లేక ఎవరికైనా ఏమైనా ఇబ్బందిగా ఉందా," అడిగాడు మాధవ్.

"మాధవ్.. నేను నీతో కొంచెం మాట్లాడాలి అలా బయటకు వెళుతూ మాట్లాడుకుందాం. వస్తావా," అడిగాడు రవితేజ.

"తప్పకుండా.. ముందు కాస్తా కాఫీ తాగివెళదాం రారా, ఏయ్ కావ్యా.. ఎవరొచ్చారో చూడు.. కాస్త కాఫీ ఇస్తావా," కేకేసాడు మాధవ్.

"ఆ ఆ వస్తున్నానండి.. ," కాఫీ తీసుకొని వచ్చింది కావ్య.


“ఎవరూ.. ఓ రవీ.. అదేంటి నువ్వొక్కడివే వచ్చావు? కొత్తపెళ్ళికూతురు ఏది? ఇదన్యాయం. పెళ్ళైయ్యక కూడా జంటగా రాకుండా ఒంటరిగా వస్తే ఊరుకునేదిలేదు. ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి మా మరదలిని తీసుకొని రావాలి. ఇంద ఈ కాఫీ తాగు," అంది నవ్వుతూ.


మాధవ్, కావ్యా నవ్వుతూ పెళ్ళి విషయాలు అడుగుతుంటే చెబుతున్నాడు రవి. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు కానీ లోపల ఏదో భయం మొదలైంది.

"ఆ రవి.. మీ ఆవిడ వచ్చేవరకు ఇక్కడే ఉండరాదు.. ఎలాగు వర్క ఫ్రం హోమ్ కదా! ఇక్కడనుండే చేసుకో. తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమంటావు," రవి వెళుతుంటే అడిగింది.

“అబ్బే.. పర్వాలేదులే.. నేను చేసుకోగలుతున్నాను. ఇన్ని రోజులనుండి మీ దగ్గరే తిన్నాను కదా! పెళ్ళిచేసుకున్న తరువాత కూడా ఇక్కడే తింటే బాగోదు. అప్పుడప్పుడు వస్తుంటాలే," అన్నాడు రవి.

"కావ్యా.. నీకు బొత్తిగా లోకజ్ఞానం లేదు, వాడికి వాళ్ళావిడ వచ్చేవరకు వంటలన్నీ నేర్చుకుని, ఆమెకు చేసి పెట్టాలని వాడి కోరిక. నువ్వేమో అర్ధం చేసుకోవు అంతేకదరా," నవ్వుతూ రవి భుజంమీద చెయ్యివేస్తూ అడిగాడు మాధవ్.

"రవి.. ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు, ఇందాకటినుంచి గమనిస్తున్నాను.. నీ మూడ్ సరిగా ఉన్నట్టనిపించలేదు, ఎనీ ప్రాబ్లం చెప్పు," పార్క్ లో కూర్చుంటూ అన్నాడు మాధవ్.

"మాధవ్.. నేనెలా చెప్పాలో ఏంటో అర్ధం కావడంలేదు, నాకు తన గురించే భయంగా ఉంది. అసలు తనకు ఈ పెళ్ళి ఇష్టపడి చేసుకుందా లేదా అనేది నాకు సంశయంగా ఉంది," అంటూ తనకు పెళ్ళి జరిగినప్పటినుండి వీసా వచ్చేంతవరకు జరిగిన విషయమంతా చెప్పాడు.

"రవి.. నువ్వంత తొందరగా అపార్థం చేసుకోకు, ఆ అమ్మాయి మాటతీరే అంతకావచ్చు, కొంతమంది పైకి అలా మాట్లాడినా చాలా ప్రేమకలవారిగానే ఉంటారు. అందులో మీ ఇద్దరు ఒకరితో ఒకరు మనసు విప్పి మీ హృదయాలను పంచుకునే సమయంరాలేదు కదా! మీకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదంటివి,. అందుకే ఇద్దరికి సామరస్యం కుదరలేదు. ఎలాగు వచ్చేనెల వస్తుంది.. అప్పుడు మీ ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండరు కనుక, మీలో ఉన్న కోపావేశాలన్ని తగ్గిపోతాయిలే. నువ్వనవసరంగా గాబరపడకు," చెప్పాడు సముదాయిస్తూ.

"ఏమోరా ఆ పిల్ల ఇక్కడకు వచ్చాక ఎలా ఉంటుందో! ఎన్ని గొడవలు సృష్టిస్తుందోనని కంగారుగా ఉంది. మొన్నటికి మొన్న మా ఇంటికి వెళ్ళి మా నాన్నను ఇష్టం వచ్చినట్టు అని వచ్చిందట. మా అమ్మకైతే ఒకటే భయం, ఏమిటో నాకేం అర్ధంకావట్లేదు. నువ్వేమయినా సలహా ఇస్తావేమోనని నీ దగ్గరకు వచ్చా," చెప్పాడు రవి.

"రవి.. పోని ఒకపని చేద్దామా, ఒకసారి నేనుగానీ కావ్యగాని తనతో మాట్లాడమా, చిన్నతనం కదా! ఏదో సర్ది చెబుతాము. మాట్లాడమంటావా?,"

"నిజంగా నాకీవిషయం తట్టలేదు సుమా! అవును మీరొకసారి తనతో మాట్లాడితే మంచిదే.

ఇదిగో ఇప్పుడే ఫోన్ కలుపుతాను. నువ్వు మాట్లాడు," అంటూ ఫోన్ కలిపాడు. అవతల ఫోన్ రింగవుతుంది కానీ ఎత్తడంలేదు. చాలా సార్లు చేసిచేసి విసిగిపోయాడు.


"ఇదిగో ఇదే వరస.. ఎప్పుడు ఫోన్ చేసినా ఇంతే, తనతో తృప్తిగా మాట్లాడుదామని ఉన్నా ఫోన్ తియ్యదు, ఒకవేళ తీసినా గయ్యిమని లేస్తుందే తప్ప మంచిగా మాట్లాడదు," చెప్పడం ఆపాడు బాధతో.

"పోనిలే రవి.. తను ఏదైనా పనిలో బిజీగా ఉందో లేక ఫోన్ చూసుకోలేదేమో, మనం ఒకపని చేద్దాం. ఈ రోజు నువ్వు మా ఇంట్లోనే ఉండిపో. తనతో రాత్రికి కావ్యతో మాట్లాడిద్దాము ఏమంటావ్? కావ్య చాలా బాగా మాట్లాడుతుంది. అన్ని విషయాలు సర్ది చెబుతుంది. నువ్వేం బాధపడకు. సరేనా? పద ఇంటికి వెళ్దాం," అన్నాడు మాధవ.. ఇంటికి వచ్చాక భార్యతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు మాధవ. చాలా బాధపడింది కావ్య.


రాత్రి భోజనాలు అయ్యాక అడిగాడు మాధవ" మీ ఆవిడకు ఫోన్ కలుపు. కావ్య మాట్లాడుతుంది" అని. సరేనంటూ ఫోన్ కలిపాడు. అదృష్టం బాగుండి ఫోన్

ఎత్తింది అవతల ప్రసన్న.

"హలో ప్రసన్నా.. బాగున్నావా ? చాలాసార్లు ఫోన్ చేసాను. నువ్వు తీయడంలేదు,"

"హలో.. నేనేం ఊరికే తినితిరగడంలేదు. నాకు వర్క్ ఉంది. చాలా బిజీగా ఉండి ఫోన్ చూసుకోలేదు. "

"అదికాదు.. నేను మాధవన్ అని నా స్నేహితుని ఇంటికి వచ్చాను. వాడి భార్య కావ్య నీతో మాట్లాడుతుందట ఒకసారి," అంటూ ఫోన్ కావ్యకు ఇచ్చాడు రవితేజ.

"హలో.. నాకు ఎవరితో మాట్లాడవలసిన పనిలేదు," అంటుంది అవతలనుండి ప్రసన్న.

"హలో.. హలో.. ప్రసన్న.. బాగున్నావా? నేను మీ పెళ్లికి రాలేకపోయాను. నువ్వు వచ్చాక తీసుకరమ్మని రవికి చెప్పాను. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నీ కోసం రవి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు, తొందరలోనే వచ్చే ప్రయత్నం చెయ్యి," అంది కావ్య.

"ఓహో.. నీకు చాలా క్లోజ్ ఎంటి ? నీతో అన్ని పంచుకుంటాడా మీ రవి? ఆహా.. ఊరికే

అంటున్నానులే. వచ్చేనెల వద్దామనుకుంటున్నాను. రవికి చెప్పాను టికెట్ తియ్యమని. మీకు చెప్పలేదా?," అంది ప్రసన్న.

కావ్యకు ఒక్కసారి షాక్ కొట్టినట్టయింది ప్రసన్న మాటలకు. ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది.. రవి అన్నట్టు కొంచెం పొగరెక్కువే ఉంది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటూ, "అలాకాదు ప్రసన్నా.. రవి చాలా మంచివాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నిన్ను చక్కగా చూసుకుంటాడు. నీకేం భయంలేదు. నువ్వు అమెరికా రావడానికి దూరం అని ఏమైనా భయపడుతున్నావా? లేక అమ్మానాన్నలను విడిచిపెట్టి రావాలంటే మనసు బాధపడుతోందా? నీకేం భయంలేదు. మేమందరం ఉంటాం. తొందరగా వచ్చేందుకు ప్రయత్నం చెయ్యి. సరేనా," అనునయంగా చెప్పింది కావ్య.

"అలాంటిదేం లేదండి. మా ఆఫీసులో చెప్పాను.. వచ్చే నెల రిలీవ్ అవుతున్నాను. ఏమండి.. మనలో మాట రవికి ఎవరైన గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ? అదేనండీ.. అమెరికాలో ఇదంతా కామన్ అట గదా,"అడిగింది.

ఛీ.. ఛీ ఏం మనిషిరా బాబు ఈ పిల్లా. సర్లే నాకెందుకొచ్చిన గొడవ వీళ్ళతో ఏమన్న చేసుకోని..

"అబ్బే అలాంటివేమీ లేవు రవికి. నీకు ఎవరు చెప్పారో కానీ, అమెరికాలో ఉన్నవాళ్ళందరు అలాంటివాళ్ళే ఉండరు. ఎవరో ఒకరు అలా చేస్తే అందరిని అలా అనడం పద్ధతికాదు ప్రసన్న.. సరే మరి ఉంటా," టక్కున ఫోన్ పెట్టేసింది కావ్య.

"ఏమైందిరా కావ్యా.. ఏమన్నది ఆ అమ్మాయి," ఆత్రుతగా అడిగాడు మాధవ్.

"ఏమంటుంది? అన్నీ ఎడ్డెమంటే తెడ్డెమనే మనిషిలాగా ఉంది. ఏమో బాబు.. రవి ఎలా నెగ్గుకొస్తాడో ఏంటో ఆ అమ్మాయితోటి! అన్నీ అనుమానాలే.. కష్టం బాబు ఆమెతో మాట్లాడలేము," తనతో ప్రసన్న మాట్లాడిన మాటలన్ని చెప్పింది. రవికి సిగ్గుతో చితికిపోయినట్టయింది.


అనవసరంగా తనవలన మాటలుపడింది. అన్న బాధెక్కువయింది.

"సారీ కావ్యా.. నావల్ల మీరు మాటలు పడ్డారు, విన్నారుగా ఆమె మాటలు.. నాకెందుకో తను ఇక్కడకు వచ్చాక ఎన్ని గొడవలు చేస్తుందో ఏమిటో నాకర్ధం కావడంలేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నా. ఆమెకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను," అన్నాడు.

"ఏమిట్రా ఇది.. తను తొందరపడిందని నువ్వు తొందరపడితే ఎలా? తను ఇక్కడకు రాని ముందు.. వచ్చాక మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటుంటే అన్ని అవే సర్ధుకుపోతాయి. దూరంగా ఉన్న కొద్ది మాటమాట పెరిగిపోయి మనసులు దూరం అవుతాయే తప్పా పలితం ఉండదు. ఏ కాపురంలో అయినా అంతే గొడవలు ఉంటూనే ఉంటాయి, గొడవలు లేని కాపురాలు లేవు.

అందుకని నామాట విని తొందరగా నువ్వు టికెట్ బుక్ చేసెయ్. నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి," చెప్పాడు మాధవ్. మాధవ్ చెప్పాడు కానీ రవికి మాత్రం నమ్మకంలేదు. సరే కానీ ! అదీ చూద్దాం అనుకున్నాడు.

"ఓరేయ్ రవి ఏమిట్రా మీ ఇద్దరి మధ్యలో ఏవో గొడవలు జరుగుతున్నాయట.. నువ్వు కోడలిని తీసుక వెళ్ళటం కుదరదు అన్నావని, మీ మామగారు వచ్చి చాలా గొడవచేసారు. నీకు అక్కడ వేరే అమ్మాయిలతో పరిచయాలున్నాయట. అందుకని తనను నిర్లక్ష్యం చేస్తున్నావని ఒకటే గొడవ.


మమ్మల్ని నోరెత్తనివ్వలేదు. పైగా పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించిపోయాడు. అసలు ఏం జరుగుతుందిరా మాకు తెలియకుండా ? మాకు చాలా భయంగా ఉందిరా," ఫోన్ చేసి చెప్పాడు రవితేజ తండ్రి.

"నాన్నా.. ఇంత గొడవ చేసారా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు మన గురించి," తనకు ప్రసన్నకు మధ్య జరిగినందంతా చెబుతూ బాధపడసాగాడు.

"మంచి సంబంధం.. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందని చేసుకున్నాము. పిల్లను చూస్తే బుద్ధిమంతురాలిగానే అనిపించింది. ఎందుకు అలా కోడలు వేరే ఊహించుకుంటుందో ఏమిటో.. నేను, మీ అమ్మ ఒకసారి కోడలితో మాట్లాడి చూడమా," అడిగాడు బాధపడుతూ రవితేజ తండ్రి.

“నేను చెబుతూనే ఉన్నాను.. వినిపించుకున్నారా? నాకు ఇక్కడమ్మాయి అయితే నాకు కరక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడే కలిసిమెలిసి ఉంటాము. ఒకరినొకరు అర్ధం చేసుకుంటాము. అందుకనే నాకు నచ్చినమ్మాయిని చేసుకుంటానంటే వినలేదు మీరు. ఇప్పుడు చూడండి.. తెలియని అమ్మాయిని చేసుకుంటే ఎలా ఉంటుందో," అన్నాడు రవి కోపంగా.

"అదికాదురా.. మంచిచెడు తెలిసిన వాళ్ళైయితే నిన్ను బాగా చూసుకుంటుంది అనుకున్నాము. మీ దగ్గర అమ్మాయిలంతా విచ్చలవిడిగా తిరుగుతుంటారని విన్నాను. మనది సాంప్రదాయ కుటుంబం. రేపెవరైనా మీ కోడలు ఇట్లనటకదా ! అంటే బాగుండదు కదా అని ఈ పిల్లను ఏరికోరి చేసుకున్నాము. ఇప్పుడేం చెయ్యాలో మాకేం తోచడం లేదు," చెప్పాడు.

"మీరేం కంగారుపడకండి. నేను చూసుకుంటాలే," అంటూ ఫోన్ పెట్టేసాడు. ఎట్టి పరిస్థితిలో తనను ఇక్కడకు తీసుకొచ్చే ప్రసక్తేలేదు, ఏదైతే అదికానీ. తనతో నేను కలిసి ఉండలేను. అదేమాట తనతో చెప్పాలి అనుకున్నాడు.

"హలో ప్రసన్నా.. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నేను చెప్పేది జాగ్రత్తగా విను," అంటూ చెప్పడం ఆపాడు.

"ఆ.. ఏంటో నువ్వు చెప్పేది తొందరగా చెప్పు. నేను పడుకునే టైం అయింది," కసురుతున్నట్టుగా అంది.

గుండె పగిలినంత బాగయింది రవితేజకు. "నీకు నాకు సరిపడేలా లేదు అందుకని, మనిద్దరం విడిపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను, ఇక నువ్వు అమెరికాకు రానక్కరలేదు. నీ ఇష్టం నువ్వు హాయిగా ఉండొచ్చు," చెప్పాడు రవి.

కిలకలా నవ్వింది నవ్వుతూనే "నేనేం నీ కోసం ముఖం వాచిలేను. నీమీద ప్రేమతో నీ దగ్గరకు రావాలనుకోలేదు. నువ్వు రావద్దన్న నేను ఖచ్చితంగా వస్తాను. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు” అంది పౌరుషంగా.

"నీకు వీసా పంపించి పొరబాటు చేసాను. అయినా నువ్విక్కడకు వచ్చి ఏం చేస్తావు? నీకు ఇష్టం లేదు కదా ! ఇక్కడకు రావడం," అడిగాడు.

"నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వెలాగు విడిపోదాం అన్నావు కదా! సరే మరి.. విడాకులకు సిద్ధంగా ఉండు," అంటూ ఫోన్ పెట్టేసింది.

భయంవేసింది రవికి. వెంటనే మాధవ్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. "ఇదేమిటి.. నేను వద్దన్నా ఖచ్చితంగా ఇక్కడకు వస్తానంటుంది. ఒకవేళ నిజంగానే ఇక్కడకు వస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలియడంలేదు. ఖచ్చితంగా తను నా అడ్రస్‌ కే వస్తుంది. వీసా మీద అడ్రస్‌ ఉంది. ఏమో వచ్చాక పోలీసులు గొడవలు.. ఇవన్నీ తలుచుకుంటే నాకు ఊపిరాడడంలేదురా, ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు చెప్పరా," బ్రతిమాలుతూ అడిగాడు.

"రవి.. నాకు కూడా ఏమి తోచడంలేదు. ఆ అమ్మాయి ఎంతకైనా తెగించేలా ఉంది. ఒకపని చేద్దాం. ఎందుకైనా మంచిది నాకు తెలిసిన నరేశ్ అని నా ఫ్రెండ్ లాయరున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి అతన్ని అడుగుదాం. ఆయనేం చెపితే అది చేద్దాం సరేనా," చెప్పాడు మాధవ్.

"చూడు మాధవ్.. మీరు చెప్పిందంతా వింటుంటే ఆ అమ్మాయికి ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనట్టుందని నాకనిపిస్తుంది. తనకు వేరే ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడేమో అనిపిస్తుంది. తల్లితండ్రుల మాట కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నట్టుంది. ఎలాగు వీసా వచ్చింది కాబట్టి, అమెరికాకు వచ్చి తన లైప్ తను చూసుకోవా లనుకుంటున్నట్టనిపిస్తుంది నాకు," చెప్పాడు లాయరు నరేశ్.

"అలాంటప్పుడు ముందే నాతో చెపితే నేనే వద్దనేవాడిని కదా! మధ్యలో నా జీవితంతో ఆడుకోవడం ఏంటో నాకు తెలియదు," బాధపడుతూ చెప్పాడు రవి.

"అదేనయ్యా బాబు.. ఈ మధ్యలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ఒకమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. పెళ్లికి ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదోనని, విదేశాలకు పయనం మొదలుపెట్టారు. ముందుగా ఇద్దరిలో ఎవరో ఒకరో ఏదో విధంగా రావడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చాక అప్పుడు వీసా పంపి ఇక్కడికి పిలుచుకుంటారు.


ఇష్టమైతే కొంతకాలం కలిసుంటారు. లేదంటే ఎవరిదారి వాళ్ళది. పాపం తల్లితండ్రులకు ఈ విషయం తెలియక సంబంధాలు వెతుకుతూనే ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళితే కదా.. పెళ్ళిచేసుకునేది! ఇక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నారు. నేను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడుతాను. నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు," అడిగాడతను. సరేనంటూ ఫోన్ నెంబర్ ఇచ్చాడు రవి.

"రవి.. ఒకసారి నీ భార్య ఫోటో చూపెట్టగలవా?"అడిగాడు లాయరు నరేశ్.


ముఖమంతా చీదరంగా పెట్టుకుని ‘నాదొక పెళ్ళి.. తను నా భార్య.. ఛీ ఛీ.. తలుచుకుంటేనే జుగుప్స కలుగుతుంది’ తనలో తను గొణుగుతూ తమ పెళ్ళి ఫోటో చూపించాడు రవి.

ఫోటో వంక పరీక్షగా చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టుగా రవి వైపు చూసాడు లాయరు నరేశ్.


"ఏమైంది నరేశ్.. ఎందుకలా ఫోటో చూడగానే ఏదో షాక్ కొట్టినట్టు చూస్తున్నారు," అడిగాడు మాధవ్ నరేశ్ ను.

"ఏం లేదు మాధవ్.. రవి ఈ కేసులోనుండి చాలా ఈజీగా బయటపడతాడు ఎలాగంటావా?"

"చెప్పండి లాయర్ తొందరగా," అతను చెప్పడం పూర్తికాకముందే ఆదుర్దాగా అడిగాడు రవి.

"నన్ను పూర్తిగా చెప్పనివ్వు రవి. ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. మా చెల్లెలు సుధ, తను క్లాసుమెట్స్. మా చెల్లెలు ఎప్పుడు చెబుతుండేది, ఈ అమ్మాయి రూటంతా సపరేటు అని.

డబ్బు పిచ్చి తనకు. లేనింట్లో పుట్టానని కసి.. పెళ్ళిచేసుకుని కష్టాలు పడడం ఇష్టంలేదంటుదట.

జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడమే తన లక్ష్యం అని అంటుండేదట. అంతేకాదు.. వీళ్ళందరితో బెట్టు కూడా కట్టిందట తెలుసా? అమెరికాకు వెళ్ళి గ్రీన్ కార్డున్నవాణ్ణి పెళ్ళిచేసుకుని లైప్ ఎంజాయ్ చేస్తానని చాలెంజ్ చేసిందట. ఇది ఈవిడగారి కథ!


ఇందులో నువ్వు చిక్కుకున్నావు. పరవాలేదు. ఆ అమ్మాయికి వీసా వచ్చింది కాబట్టి నిన్ను సింపుల్ గానే వదిలేస్తుంది," తాపీగా చెప్పాడు తనకు తెలిసిన ప్రసన్న కథ.

"వావ్ సూపర్," అంటూ అరిచాడు మాధవ్. రవితేజకు మనసు కుతకుత ఉడుకుతుంది.


నన్నింతమోసం చేస్తుందా? పైగా తనేదో బుద్ధిమంతురాలని మా నాన్నవాళ్ళను తిట్టిపిస్తుందా? తనను ఊరికే వదిలెయ్యకూడదు. మూడు చెరువుల నీళ్ళు తాగించి ప్రతీకారం తీర్చుకోకపోతే చూడు.. రగిలిపోతుంది రవి మనసు.

"ఏంటి రవి, నువ్వేం మాట్లాడడంలేదు? ఏం ఆలోచిస్తున్నావు? మీ వాళ్ళకు ఫోన్ చేసి కొన్నాళ్ళు ఎవరింటికైనా వెళ్ళమని చెప్పు. ఎందుకంటే వాళ్ళమ్మాయి గురించి వాళ్ళకు తెలియదు కాబట్టి ఏవైనా గొడవలు జరుగొచ్చు. ఎందుకైనా మంచిది.. ముందు జాగ్రత్త తీసుకోవడంలో తప్పలేదు," చెప్పాడు లాయర్ నరేశ్.

“అలాగే," అంటూ తలూపాడు రవి. అతనికింకా అయోమయంగానే ఉంది.

"అదికాదు నరేశ్.. మరి విడాకుల సంగతి ఏం చేద్దాం," అడిగాడు మాధవ్.

"చూడండి.. మీరింకేం ఆలోచించకండి. నేను చూసుకుంటాను కదా అవన్ని.. రవితేజకు ఆ

అమ్మాయితో విడాకులిప్పించడం ఖాయం. మోసాన్ని మోసంతోటే జయించాలంటారు.. నేను అదే పద్ధతిలో నీకు విడాకులిప్పిస్తాను. సరేనా? మీరింక వెళ్ళి హాయిగా ఉండండి. నేను తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను," చేతులు కలుపుతూ చెప్పాడు లాయర్ నరేశ్.

"చాలా సంతోషంగా ఉంది నరేశ్ గారు. మీరు నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోను. థాంక్యు.. థాంక్యు సర్," అతని రెండుచేతులు పట్టుకుని ఆనందంతో చెప్పాడు రవితేజ.

నెలరోజులు గడుస్తున్నాయి కానీ ప్రసన్నగానీ, రవితేజగానీ ఒకరికొకరు ఫోన్ మాట్లాడిందే లేదు. ఏం జరిగిందో కానీ రవితేజ మాత్రం ఫోన్ చెయ్యననుకున్నాడు.. చెయ్యలేదు. మరి ప్రసన్నకూడా ఎందుకు చెయ్యలేదు.. అర్ధం కాలేదు రవితేజకు. ఏమిటో లాయర్ నరేశ్ తనకు ఫోన్ చెయ్యొద్దన్నాడు. విషయం ఎంతవరకు వచ్చిందో తెలియడంలేదు. కనీసం మాధవ్ అయినా చెప్పడంలేదు.


ఎందుకైనా మంచిది నేనే ఒకసారి లాయర్ నరేశ్ దగ్గరకు వెళ్ళివస్తా సరిపోతుంది.. అనుకుని తన ఇంటికి తాళం వేసి బయటకు రాబోతున్నాడు. అప్పుడే కారులోనుండి మాధవ్, లాయర్ నరేశ్ దిగారు. ఆశ్చర్యంతో చూడసాగాడు రవితేజ.

"హల్లో రవితేజ.. కంగ్రాచ్చులేషన్స్.. నువ్వే గెలిచావయ్యా, తిమ్మిని బమ్మి చేసి నిన్ను గెలిపించాను. ఇక జన్మలో నీ జోలికిరాదు. నువ్వు హ్యాపీగా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకో,"నవ్వుతూ చెప్పాడు లాయర్ నరేశ్.

"నిజమా! మీరు చెబుతున్నది? నేను నమ్మలేక పోతున్నాను. ఇంత ఈజీగా ఒప్పుకుందా? ఏమో.. నాకు ఇంకా నమ్మకం కలగడంలేదు. ఓరేయ్ మాధవ్! నువ్వు చెప్పురా.. ఇది నిజమా?" ఆశ్చర్యంతో అడిగాడు రవితేజ.

"రవి.. నరేశ్ చెబుతుంది నిజంరా," నమ్మకంగా చెప్పాడు మాధవ్.

"నా ఫ్రెండ్ ఉన్నాడు.. వాడు అక్కడ లాయరు. అతనికి నీ పెళ్ళి ఎలా జరిగింది.. మా చెల్లెలు సుధకు ఆ అమ్మాయికి జరిగిన సంభాషణ కూడా మొత్తం చెప్పాను, ఎలాగైనా సరే ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అసలు నిజం ఏంటో కనుక్కుని విడాకులకు ఒప్పించమని చెప్పాను. పెద్దగా కష్టపడే పనిలేకుండానే తనే చెప్పిందట. తనకు ఈ పెళ్ళిచేసుకోవడం ఇష్టంలేదు. మా అమ్మానాన్నలకోసం చేసుకున్నాను, అమెరికాకు వెళ్ళేంతవరకు విషయం దాచి అక్కడకు వెళ్ళాక, అసలు విషయం వాళ్ళమ్మా వాళ్ళకు, తరువాత నీకు చెప్పి విడాకులు తీసుకుందామనుకుందట. నీతో కావాలనే కయ్యానికి కాలుదువ్వినట్టు గొడవపడేదట.


నీకు విసుగు తెప్పించాలనే ఉద్దేశ్యంతో, నువ్వు తట్టుకోలేక నువ్వే విడాకులు తీసుకుందామనుకున్నవట. తనకు చాలా ఆనందంగా ఉందట. అలా అయితే మరి పేపర్లమీద రాసిస్తావా అని మావాడు అడిగాడట.


సంతోషంతో ఈ పెళ్ళి నాకు ఇష్టంలేదు.. నాకు నేనుగా విడిపోదామనుకుంటున్నాను.. అని రాసి సంతకంపెట్టి ఇచ్చిందట. అంతేకాదు రవి..

మాచెల్లెలు సుధా, వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు మొత్తం రికార్డ్ చేసిందట. నీకు పంపిస్తాను విను. ఇప్పుడు సంతోషమేనా" అడిగాడు వీపుమీద దెబ్బవేస్తూ.

"బలేవారే.. ఒట్టి సంతోషమా ఇది.. పెద్ద అవార్డు గెలిచినంత సంబరంగా ఉంటేను. పదండి పదండి.. మనం పుల్ ఎంజాయ్ చేద్దాం ఈ రోజు," చిన్నపిల్లాడిలా నవ్వుతూ ఈలవేస్తూ అన్నాడు రవితేజ.

"ఓకే పద.. నీ సంతోషాన్ని మేము కాదనలేము,"అంటూ వంత పాడారు మాధవ్, నరేశ్.


॥॥ శుభం॥॥

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్


42 views2 comments
bottom of page