top of page

ఆత్మ విశ్వాసము

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

https://youtu.be/Bd_OjZzPqs8

'Athma Viswasamu' New Telugu Story By Dr. Shahanaz Bathul

రచన : డా: షహనాజ్ బతుల్


"కాంతీ! నిన్ను సులోచన మేడం రమ్మన్నారు" అన్నది పూజిత వచ్చి.​

"ఎందుకు?" అడిగింది, కాంతి.​

"ఏమో తెలియదు." అని చెప్పి, వెళ్ళిపోయింది.​

కాంతి హాస్టల్ ఆఫీస్ కి వెళ్ళింది.​

"కూర్చో కాంతి" అన్నారు సులోచన మేడం.​

"ఫర్వాలేదు మేడం. నన్ను పిలిచారట.."​ అడిగింది​

"నీ కూతుర్ని తెచ్చుకున్నావట. ఇది వర్కింగ్ విమెన్స్ హాస్టల్. దీనిలోకి చిన్న పిల్లల్ని తెచ్చుకో కూడదు. మీ అమ్మాయిని పంపించినా సరే. లేక నువ్వు పాపతో వెళ్ళిపోయినా సరే."​

కాంతి కి గొంతుక లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. అబద్ధం చెప్పలేదు.​

"అలాగే మేడం రేపు గానీ, ఎల్లుండి గానీ వెళ్ళిపోతాను. ఉన్నఫళంగా వెళ్ళటం కష్టం", అన్నది.​


"సరే రేపు నేను నువ్వు ఎంత కట్టాలో కాలిక్యులేట్ చేసి, చెప్తాను. కట్టేసి, వెళ్ళు."​


"మేడం! నాకు జీతం మొదటి తారీకున అందుతుంది. ఇప్పుడు నా దగ్గర లేవు మేడం."​


"హాస్టల్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఇవ్వు. మొదటి తారీకున వాళ్ళ అకౌంట్ లో వేసేయ్యి."​


"వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా మేడం. సరే.. నేను ప్రయత్నం చేస్తాను."​

అని చెప్పి, రూం కి తిరిగి వచ్చింది.​


రూమ్మేట్స్ ఎవ్వరూ లేరు. తలుపు వేసుకొని, మంచం మీద ఏడుస్తూ కూర్చుంది.​

తన కూతురు వాణీ నీ, తన రూమ్మేట్ వసంత బయటికి తీసుకెళ్ళింది.​

తను ఎక్కడికి వెళ్ళగలదు?​

తన కూతుర్ని తీసుకొని, ఎలా ఉండగలదు.. ఒక్కర్తే?​


దేవుడు ఎందుకు తనని ఏడిపిస్తున్నాడు? తానేమీ పాపం చేసింది?​

అయినా నా కూతుర్ని రూం లో పెట్టుకున్నట్లు మేడం కి ఎవరు చెప్పారు?​

చెప్పితే వాళ్ళకేమి వస్తుంది. ఒకళ్ళు ఏడుస్తుంటే ఆనందిస్తారా?​

తన మనస్సు గతం లోకి వెళ్ళింది.​

***​

కాంతి దిగువ మధ్యతరగతి లో పుట్టింది. తండ్రి, రామారావు వ్యవసాయము చేసేవారు. తల్లి సరస్వతమ్మ ఇల్లాలు. కష్టపడి పని చేస్తుంది.​

తను పెద్దకూతురు. తనకి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.​

పదవ తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల అనంతరం వేసవి లో పెళ్లి చేసేసారు.​

అప్పుడు తన వయస్సు పదిహేను సంవత్సరాలు.​

పెళ్లి కొడుకు వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు. టి.ఎస్.ఆర్.టి.సి లో. బస్సు కండక్టర్.​


పెళ్లి అయ్యాక తను అతనితో మాట్లాడాలంటే, మొహమాటంగా ఉండేది. కారణం తను పల్లెటూర్లో పుట్టి పెరిగింది. తన ఊరు దాటి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు.​

భర్త, కృష్ణ చాలా మంచివాడు అని అర్థం చేసుకుంది.​


అతను ఉద్యోగము చేసేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కి అత్తవారింటికి పంపించారు.​


తనకు చాలా విషయాలు చెప్పేవాడు. టీవీ లో సీరియల్స్, సినిమాలు చూస్తుంటే, క్రొత్త ప్రదేశాలు అవి కనిపిస్తే, చక్కగా అర్థమయ్యే టట్లు చెప్పేవాడు.​


ఒకసారి చార్మినార్, ఒకసారి సాలార్ జంగ్ మ్యూజియం కి, ఒకసారి బిర్లా టెంపుల్, ఒకసారి లుంబినీ పార్క్ తీసుకొని వెళ్ళాడు.​

అమ్మ నాన్నలు కూడా గుర్తుకు వచ్చేవారు కాదు. తను గర్భవతి అయితే చాలా అపురూపంగా చూసుకున్నాడు.​

కానీ, అత్త, ఆడబడుచూ సూటి పోటి మాటలతో చాలా మనస్సుని గాయ పరిచేవారు. ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. భర్త తనని బాగా చూసుకుంటున్నాడు. ఇంకేమి కావాలి అనుకున్నది.​


పెళ్లికి ముందు కూపస్త మండూకము లాగుండినది.​ ఇప్పుడు ఎంతో జ్ఞానము సంపాదించింది, భర్త మూలంగా.​

పెళ్లి అయిన సంవత్సరానికి వాణి పుట్టింది.​


కృష్ణ, తను వాణీ ముగ్గురిిదీ ఒక లోకం లాగుండింది. చాలా సంతోషముగా ఉండింది. పాపకు తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత ముగ్గురూ స్కూటీ మీద షికార్లు తిరుగుతూ ఉండేవారు. స్వర్గం అంటే, ఇలాగే ఉంటుందేమో అనిపించేది.​


సంతోషముగా ఉన్న తన జీవితములో అపశృతి. తను సంతోషముగా ఉండటం దేవునికి ఇష్టం లేదేమో.​

అప్పుడు వాణీ వయస్సు పద్దెనిమిది నెలలు.​


ఒక రోజు కృష్ణ డ్యూటీ లో ఉన్నప్పుడు, తను ఉన్న బస్సు ప్రమాదానికి గురైంది.​

కండక్టర్ కి అంటే కృష్ణ కి బాగా గాయాలు తగిలాయి. డ్రైవర్ కి కొద్దిగా తగిలాయి. కొంత మంది అక్కడే మరణించారు. కొంతమందికి బాగా గాయాలు తగిలాయి. కొంతమందికి స్వల్పం గా గాయాలు తగిలాయి.​


కృష్ణ ఆసుపత్రికి తీసుకొని, వెళ్ళేటప్పుడు, చనిపోయాడు.​

అది మనస్సు కి చాలా పెద్ద గాయమైంది. తను స్పృహ కోల్పోయింది.​


పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో వైధవ్యం సంభవించింది.​

అత్త ఆస్తి ఇవ్వనని, ఇంటినుండి గెంటేసింది.​


పుట్టింటికి పాపను తీసుకొని, వచ్చేసింది. కొన్ని నెలల దాకా ట్రాన్స్ లో ఉన్నట్లు నడిచేది. లోకమంతా​ శూన్యముగా కనిపించింది.​

మొదట్లో తను బేలగా ఉండేది. కానీ భర్త తనలో ధైర్యాన్ని నూరిపోశారు. అదే ధైర్యము తో ఇంటర్ చదివింది.​


భర్త చనిపోతే భార్యకి ఉద్యోగం ఇస్తారు కదా. టి.ఎస్.ఆర్.టి.సి లో ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చారు. ముందు టెంపరరీ గా ఇచ్చారు. ఉద్యోగం హైదరాబాద్ లో. కూతుర్ని తల్లి దగ్గర వదిలి, హైదరాబాద్ వచ్చి, చేరింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది.​


తన కథ రూమ్మేట్స్ తో చెప్పితే, వాణీ నీ తీసుకు వస్తె అందరం చూసుకుంటాము అన్నారు. తన రూమ్మేట్స్ వసంత, రాగిణి. వసంత సాఫ్ట్వేర్ కంపెనీ లో చిన్న ఉద్యోగం చేస్తుంది.​ రాగిణి ప్రైవేట్ పాఠశాల లో టీచర్. ఇద్దరి జీతాలు తక్కువే. అందరి పరిస్థితి ఒకే లాగా ఉంది.​


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ లో చేరింది. ఒక సంవత్సరం పూర్తయ్యింది.​

ఇప్పుడు రెండో సంవత్సరం, ఉద్యోగము చేస్తూ చదువు తున్నది.​

మేడం కి తెలియ కుండా వాణి నీ తీసుకొచ్చింది.​


వసంత, రాగిణి, వాణీ నీ బాగా చూసుకుంటున్నారు. తను పనిలో ఉన్నా, హాస్టల్లో లేక పోయినా, భోజనం తినిపించడం, స్నానం చేయించడం చేస్తున్నారు.​

వాణీ నీ హాస్టల్ కి దగ్గరలో ఉన్న పాఠశాల లో చేర్చింది.​ వాణీ వయస్సు ఆరు సంవత్సరాలు.​


వాణీ నీ హాస్టల్ కి తీసుకొని వచ్చి, ఎనిమిది నెలలు. ఇప్పటి వరకు ఎవ్వరూ మేడం తో చెప్పలేదు. నేనంటే గిట్టని, వేరే రూం వాళ్ళు చెప్పి ఉంటారు.​ అయినా తనేమీ ఎవ్వరితోనూ శత్రుత్వం పెట్టుకునే మనిషికాదు.​


"అమ్మా తలుపు తీయి." వాణీ గొంతుక వినిలేచి కళ్ళు తుడుచుకొని, వచ్చి, తలుపుతీసింది.​


"అమ్మా నేను వసంతక్క బాగా ఆడు కున్నాము" అన్నది వాణీ సంతోషముతో.​

"బకెట్లో నీళ్ళున్నాయి స్నానము చేసిరా" అన్నది కాంతి.​

వాణీ స్నానము చెయ్యడానికి వెళ్ళింది.​

కాంతి వసంత నీ కౌగిలించుకొని, ఏడ్చింది.​


"కాంతీ! ఏమి జరిగింది? నీకు ధైర్యం చాలా ఎక్కువ అని మేమనుకుంటున్నాము. నువ్వు ఇలా ఏడుస్తున్నావు.. ఏమి జరిగింది?"


మేడం చెప్పిన సంగతి చెప్పి, "నాకిప్పుడు అర్జెంట్ గా 2000/ రూపాయలు కావాలి.​

మేడం కి డబ్బులు ఇవ్వాలి. నేను ఊరు వెళ్ళటానికి డబ్బు కావాలి" అన్నది కాంతి.​


"నేను 500 ఇవ్వగలను. అలాగే అందరినీ అడుగుదాం" అన్నది వసంత.​

అప్పుడే రాగిణి వచ్చింది.​

తనకు విషయము చెప్పారు.​

రాగిణి "నా వద్ద లేవు" అని పర్సు తెరచి చూపించింది. "ఈ వంద రూపాయలు నేను ఫస్ట్ వరకు సర్డు కోవాలి" అన్నది.​


వసంత, రాగిణి కలిసి, అన్నీ రూమ్స్ కి వెళ్లి ఒక కాగితం మీద ఎవరెంత ఇచ్చారో వ్రాసి, 'మేమిద్దరం తీరుస్తాము' అని చెప్పి, తెచ్చారు.​

3000 రూపాయలు వచ్చాయి.​


"ఇప్పుడు నువ్వేమి చెయ్య దలచు కున్నావు"? అడిగారు.​

"ఫోన్ చేసి, బాస్ కి నాలుగు రోజులు శలవు కావాలని అడుగుతాను.ఇప్పుడు ఇంటికి వెళతాను."​


వెంఠనే ఫోన్ చేసింది. శలవు చీటీ మెయిల్ చేస్తానన్నది.​

శలవు ఇస్తానన్నారు.​

"ఇప్పుడే బయలు దేరుతాను" అన్నది.​


"నువ్వు చేరుకునే సరికి రాత్రి అవుతుంది. రేపు ప్రొద్దున వెళ్ళు"అన్నారు.​

వాణీ స్నానం చేసి, వచ్చింది.​

వసంత బట్టలు తొడిగింది. జడ వేసింది.​

హాస్టల్ ఆఫీస్ కి వెళ్లి,​

"ఎంత కట్టాలో చెప్పండి మేడం. ఇప్పుడే కట్టిస్తాను. రేపు ఉదయం బస్సు కి వెళతాను". అన్నది.

చూసి, చెప్పారు. కట్టేసింది.​

"హాస్టల్ కి దగ్గరలో నీ కోసం ఒక రూం,​ కిచెన్ ఉన్న ఇల్లు చూసి, పెడతాము. హాస్టల్ కి దగ్గరలో ఉంటే, మేము ఎప్పుడైనా వాణీని వచ్చి పలక రిస్తూ ఉంటాము" అన్నది రాగిణి.​


"నేను వాణీని అమ్మ దగ్గర వదిలేసి, వస్తాను. అక్కడ పాఠశాల లోచేరుస్తాను.​

అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు చూసుకుంటారు."​


"అలా అయితే మళ్లీ ఇదే హాస్టల్ కి రా. తొందర పడి డబ్బులు కట్టేసావేమో".​


"పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పలేను. నేను మీ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తాను."​


మరుసటి రోజు ఉదయం కాంతి కూతురిని తీసుకొని, వెళ్ళిపోయింది.​

రెండు వారాల తర్వాత కాంతి వచ్చి, హాస్టల్లో చేరింది.​

సరస్వతమ్మ మనవరాలిని చూసుకుంటా నన్నది.​


డిగ్రీ పూర్తయ్యేవరకు కూతురు అమ్మమ్మ దగ్గరే ఉండటం మంచిది.అనుకున్నది.​

రెండు సంవత్సరాలు గడిచి పోయాయి. కాంతి. బి.ఏ డిగ్రీ పూర్తి చేసింది. తనకు ఉద్యోగము లో ప్రమోషన్ వచ్చింది. పర్మనెంట్ చేశారు.​


తన ఆఫీస్ లో పని చేస్తున్న ప్రమోద్, కాంతి మంచి మనస్సుని చూసి, ఒక కూతురు ఉన్నా, ఇష్ట పడి పెళ్లి చేసుకోవడానికి వస్తే పెళ్లి చేసుకుంది.​

శుభం​

&&&&&&&&&&&&&

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.

చెరపకురా చెడేవురచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


షహనాజ్ బతుల్
138 views6 comments
bottom of page