top of page

ఆవకాయ అదిరిందోచ్


'Avakaya Adirindoch' New Telugu Story

Written By Lakshmi Sarma Thrigulla

'ఆవకాయ అదిరిందోచ్' తెలుగు కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)అబ్బా.. ఎండలు మండుతున్నాయి. వైశాఖమాసమంటే భరించుకోలేని ఎండలు. బయటకు వెళ్ళాలంటే మాడి మసిబొగ్గు అవుతామేమోనని భయం. పోనీ ఇంట్లోనే ఉంటే సుఖముందా అంటే అదీలేదు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాము. పంకా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి వేడిగాలి వస్తుంది. పాపం అది మాత్రం ఏం చేస్తుంది.. ఎండలు అంతగా ఉన్నాయి. కానీ.. దేనికదే చెప్పుకోవాలి. ఎండకాలం వచ్చిందంటే గుమగుమలాడే కొత్త మామిడికాయ ఆవకాయ, అబ్బా.. దాని వాసన వస్తుంటే నోరూరుతుందంటే నమ్మండి. అంతే కాదండోయ్! కొత్తావకాయతో పాటుగా బంగినపల్లి మామిడిపళ్ళుగాని, రసాలు గాని అన్నంతోపాటు తింటుంటే ఆ ఆనందమే వేరు. అవును, ఈసారి మా ఇంట్లో పచ్చడి పెట్టిన జాడే కనిపించడం లేదు.. అనుకుంటూ నోరు కొత్త పచ్చడికోసం ఆరాటపడుతుండడంతో ఇంటికి వస్తూనే అడగాలనుకున్నాడు. “ఏమోయ్ సుజా .. మామిడిపళ్ళు పుష్కలంగా వచ్చాయి, నువ్వేంటి ఇంకా కొత్త ఆవకాయ పెట్టలేదు? నాకు ఎప్పుడెప్పుడు తినాలాని ఉంది. చెప్పు ఎప్పుడు పెడుతున్నావు? రేపు ఆదివారం కదా! సంతకెళ్ళి మామిడికాయలు తెస్తాను ఈ లోపల నువ్వు దానికి కావలసిన సరంజామంతా తయారు చేసుకో. ఈసారి పచ్చడి అదిరిపోవాలి తెలిసిందా” అడిగాడు ఇంటికి వస్తూనే ప్రసాద్. “ఇంకా నయం! మీరేదో గొప్ప విషయం చెబుతున్నా రనుకున్నాను,మీ హడావుడి చూస్తుంటే.. ఏమండి.. ఉండేది మనిద్దరం. మనకెంత పచ్చడి కావాలి చెప్పండి, ” అంది. “అదేమిటి సుజాత అలా అంటున్నావు? అమ్మాయికి అబ్బాయి వాళ్ళకు పంపొద్దూ, సంవత్సరమంతా వచ్చే ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఎలా? అదేం కుదరదు కచ్చితంగా మనం పెట్టుకోవలసిందే, ” అన్నాడు పట్టుదలగా. “మహానుభావ.. మీకంతా తొందరనే.. నేను చెప్పేది పూర్తిగా విననే వినరు. ఆవకాయ పెట్టాలంటే ఆషామషి కాదు. ఎన్ని సవరించుకుంటే పచ్చడి జాడిలోకి వచ్చి పడుతుందనుకున్నారు.. ఊరకే అవుతుందనుకున్నారా.. ఊరగాయలంటే ఊరించుకుంటూ తిన్నట్టుకాదు, ” అంది మూతి మూడు వంకరలు తిప్పుతూ. “ఆ.. ఆ.. నాకు తెలుసులేవోయ్ .. మా అమ్మ చేతితో పెట్టిన ఆవకాయంటే నాకు ప్రాణం, మా ఇంట్లో ఆవకాయ సీజన్ వచ్చిందంటే అందరికంటే ముందే మా అమ్మ పెట్టేది తెలుసా? చుట్టుపక్కల వాళ్ళందరు మా ఇంట్లోనుండి గుమగుమ వాసన వస్తుంటే, ‘మాకు పెట్టివ్వవూ.. మాకు నీలాగ పెట్టరాదు’ అని అడిగి మరీ పిలుచుకునేవారు. మా అమ్మకు నేను దగ్గరుండి అన్ని అందించేవాడిని. మంచి మడి కట్టుకుని పెట్టేది కదా! ఎవ్వరిని ముట్టనిచ్చేది కాదు, దూరంనుండి తనకు కావలసినవన్నిఇచ్చేవాడిని” తల్లి గొప్పతనం గురించి చెప్పాడు. “అప్పట్లో అన్ని పనివాళ్ళు చేసేవాళ్ళు కనుక వీళ్ళు తీరికగా కూర్చొని చేసుకునే వాళ్ళు. ఇప్పుడలా కాదు కదా! అయినా నాకలవాటు లేదు పచ్చళ్ళు పెట్టడం. మీ అమ్మ ఉన్నన్నీరోజులు ఆమె పెట్టింది. ఆమె పోయిన తరువాత మా అమ్మ ఉన్నంత కాలం ఆమె పెట్టి ఇచ్చింది. అయినా ఇప్పుడంతా కాలం మారిపోయింది. ఎవ్వరు అంతగా ఆవకాయన్నం తినడమే లేదు. అంతగా కావాలనుకుంటే ప్రియా పచ్చళ్ళు ఎప్పుడంటే అప్పుడు మార్కెట్ లో దొరుకుతూనే ఉన్నాయి, ” అంది సుజాత. “ఛీ ఛీ.. మార్కెట్ లో దొరికే పచ్చళ్ళు బాగుంటాయని చెబుతున్న మనిషిని నిన్నే చూస్తున్నా, అది బద్దకస్తులు, నీలాంటి రుచిపచి తెలియని వాళ్ళు తినాల్సిందే. ఇందాకేమన్నావు.. అప్పుడు పని వాళ్ళున్నారు అన్నావు కదా! ఓసి పిచ్చి మొహమా! పనివాళ్ళు చేస్తే పనికిరావని మా అమ్మే స్వయంగా రోలు రోకలిపెట్టుకొని, ఎంత కష్టపడే వాళ్ళను కున్నావు? ఎండు మిరపకాయలు దంచుకుంటుంటే ఇంటిల్లిపాదులం తుమ్మి తుమ్మి అవస్థపడేవాళ్ళం. అవాలపొడి, మెంతిపొడి, జిలకర పొడి అన్నీ కష్టపడి దంచుతుంటే పాపం.. మా అమ్మ చేతికి పొక్కులు వచ్చేవి తెలుసా? మా నాన్న మామిడికాయ ముక్కల్ని కొడుతుంటే మేమందరం పక్కన కూర్చొని జీడి ఏరేవాళ్ళం. మా అమ్మ రెండుమూడు రోజులు కష్టపడితే కానీ నోరూరించే ఆవకాయ పచ్చళ్ళు జాడీలో పడేవి. నాకేమో ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ మామిడిపండుతో తినాలని ఉండేది. మూడురోజుల వరకు తియ్యకుండా జాడిలకు బట్టలుకట్టి తొక్కులుపెట్టుకునే గదిలో పెట్టేది. మూడోరోజు మళ్ళీ పెద్ద హంగామా.. అవన్నీ బయటకు తెచ్చి పెద్ద గిన్నెలో వేసి చేతితో కలిపి జాడిలకు ఎత్తిపెట్టి, పెట్టిన మాగాయా, ఆవకాయ, నువ్వావకాయ, మామిడికాయ తొక్కు అన్నీ చిన్న గిన్నెల్లో వేసి దేవుడికి నైవేద్యం పెట్టాక గానీ మా వరకు వచ్చేది కాదు. అబ్బా.. అప్పుడు చూడు, మాకు అమృతం తిన్నంత ఆనందంగా ఒక్కొక్కరం రెండుమూడు మామిడిపళ్ళతో ఆవకాయ అన్నం తినేవాళ్ళం, ” తన్మయత్వంతో చెప్పాడు ప్రసాద్. “ఇప్పుడే తింటున్నంత మురిసిపోతున్నారు, కొద్దిరోజులు ఆగండి.. మా అక్కవాళ్ళు, మా వదినవాళ్ళు, మీ చెల్లెలు వాళ్ళందరు ఆవకాయలు పెట్టుకున్నాక తలొక సీసాలో మనకు పెట్టివ్వమంటాను, మీకు రకరకాల ఆవకాయలు వస్తాయి. నాకు కష్టం తప్పుతుంది. ఎలా ఉంది నా ఆలోచన, ” కళ్ళెగరేస్తూ భర్తను అడిగింది సుజాత. “అబ్బా.. నీ బుద్ది పోనిచ్చుకున్నావు కాదు. మనకేం తక్కువైందని అలా అందరిళ్ళల్లలో అడుక్కోవడానికి? చక్కగా మనింట్లో మనం చేసుకోవాలిగానీ, వాళ్ళేమనుకుంటారు.. ముందర ఏమనేరేమోగానీ చాటుగా మాత్రం అనుకుంటారు. సంపాదనకేం తక్కువలేదుగానీ లేకి బుద్దులు అనుకుంటారు. నీకేమో గానీ నాకు తల కొట్టేసినట్టుగా ఉంటుంది. నీకు చేతనైతే ఆవకాయ పెట్టు. లేదంటే మానేయ్. అంతేకానీ మంది దగ్గర మాత్రం తీసుకరాకు, ” ఖచ్చితంగా చెప్పాడు ప్రసాద్. “అబ్బా మీరూరుకోండి.. నేను చూసుకుంటాను కదా! ఎవ్వరు మన గురించి అలా అనుకోరు, పైగా మా పెద్దక్క ముందే చెప్పింది, మాకు పట్టేన్ని మామిడికాయలు వస్తాయి అని, మీరిద్దరే కదా ఉండేది తొక్కువక్కలు గట్రా ఏం పెట్టమాకు, నేనెలాగు పెడతాను, కాకపోతే నువ్వు కాస్త సహాయం చెయ్యి చాలు.. అందండి, మనకే ఖర్చులు కలిసి వస్తాయికదా, ” అంది సంతోషపడిపోతూ. “ఓసి పిచ్చిదానా.. నీ అమాయకత్వంతో చచ్చిపోతున్నాను, నువ్వు తేరగా ఉన్నావని నీతో ఆవకాయలు పెట్టించడానికి మీ అక్క నిన్ను ఉపయోగించుకుంటుందని నీకు అర్థంకావడం లేదు, ఆ కష్టమేదో మనింట్లో పడితే మనకు నచ్చిన ఆవకాయల్ని పెట్టుకోవచ్చు కదా! ఇక్కడ తప్పించుకుందామనుకున్నావు. సరే కానీ, ”అన్నాడు ఇక చెప్పినా లాభంలేదు అనుకుని. ****** ******* ***** ****** ****** “ఏమండి నేను ఒక్కదాన్నే వెళ్ళాలా.. మీరు కూడా రావచ్చు కదా! రెండురోజులుండి మీకిష్టమైన కొత్తావకాయ, మామిడిపళ్ళు తిని సరదాగా గడిపివద్దాము రండి, ” భర్త దగ్గర గారాలుపోతూ అడిగింది తను వెళ్లడానికి తయారవుతూ. “చూడు సుజాత.. నాకు ఆఫీసులో చాలా పని ఉంది. నేను రాలేను. నువ్వు వెళ్ళిరా, పద.. నిన్ను స్టేషన్ లో దించి వస్తాను, ” అంటూ బ్యాగు చేతిలోకి తీసుకున్నాడు. ‘మొండిఘటం.. ఆయననుకున్నదే చేస్తాడు. చెప్పినా వినే రకంకాదు. ఏదో కష్టపడకుండా ఊరికే వచ్చేదాన్నీ అనుభవించే రకంకాదు ఈ మనిషి’ మనసులో గొణుగుతూ బయలుదేరింది. రెండురోజులకు వస్తా అన్న మనిషి వారంరోజులకు వచ్చింది. “అయ్యో అదేమిటి సుజాత.. నువ్వు వస్తున్నావని తెలిస్తే నేను స్టేషన్‌కు వచ్చేవాడిని కదా! నేను నీతో రాలేదని నామీద కోపంగా ఉన్నావా, ” భార్య చుబుకం పట్టుకుని అడిగాడు. “లేదండి మా అక్కవాళ్ళ వియ్యపురాలు ఇలా వెళుతూ నన్ను దింపి వెళ్ళింది, ఏమండి.. మీరు చెప్పిందే నిజమండి. పిచ్చిదాన్ని, ఏదో ఊరకే వస్తుందని అక్క అంత ప్రేమగా పిలిచిందని వెళ్ళాను, ఇంకానయం. మీరు వచ్చింటే నన్ను అప్పుడే వెంట తీసుకవచ్చేవారు. అబ్బా.. వాళ్ళ వియ్యపురాలుంది చూడు.. వట్టి మొద్దు విగ్రహం, అక్కకేమో చేతనవదు. అన్నీ నాతోనే చేయించింది. మీరు చెప్పినట్టు వింటే మనకు నచ్చినట్టు మనం చేసుకునేవాళ్ళం. అన్ని ఆమె చెప్పినట్టే చెయ్యాలి. పోనీ అంటే ఇదిగో చూడండి.. అన్ని రకాల ఆవకాయలు పెడితే మనకేం పెట్టిందో చూడండి, ” అంటూ బ్యాగులోనుండి రెండు చిన్న చిన్న ఊరగాయ డబ్బాలు తీసి చూపింది. “పిచ్చి సుజా.. నేను అప్పుడే చెప్పానా.. అవి కూడా ఆవిడకే ఇచ్చి రావలసింది. సరేలే.. నువ్వు త్వరగా బట్టలు మార్చుకొని రా. వేడి వేడి అన్నం తిందాం, ” అన్నాడు ప్రసాద్. “ఏమోనండీ.. మీకు కనీసం కొత్తావకాయ లేకుండా చేసాను అన్న బాధకోసం తెచ్చాను, లేకపోయింటే ఆవిడ ముఖం మీద కొట్టిరావలనిపించింది, ” అన్నం తినడానికి కూర్చుంటూ అంది. “సుజాత.. నువ్వు కాసేపు కళ్ళుమూసుకుని కూర్చో. నేను పళ్ళెంలో అన్ని వడ్డించాక కళ్ళు తెరువు. సరేనా, ” నవ్వుతూ చెప్పాడు ప్రసాద్. “ఏమిటో.. నాకోసం ఏం స్పెషల్ చేసారేంటి, ” అడిగింది కళ్ళు మూసుకుంటూ. “ఆ ఇప్పుడు చూడు, ” అన్నాడు. కళ్ళు తెరిచిచూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. పళ్ళెంలో నాలుగురకాల ఊరగాయలు గుమగుమలాడుతూ కనిపించాయి. “సుజాత .. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? ఇవి ఎక్కడివి అనుకుంటున్నావా? నేనే నా చేతులతో స్వయంగా పెట్టిన ఆవకాయలు తెలుసా? ఇదిగో ఇది మాగాయ, ఇది చూడు గుమగుమలాడే అల్లంవెల్లుల్లి ఆవకాయ, ఇంకా చూడు నీకిష్టమైన మామిడితొక్కు, మన మనవలకోసం పెట్టాను ఉప్పావకాయ, ఇప్పుడు వేడి వేడి అన్నంలో పోపునూనే వేసుకుని ఈ మామిడిపళ్ళతో తిని చూడు, అబ్బా నాలుగురోజులనుండి నేను ఇవే తింటున్నాను, ” ఊరిస్తూ చెప్పాడు. “ఏమండి ..చాలా బాగున్నాయండి, ఇవన్ని ఎక్కడివి ఎవరిచ్చారు? నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా.. లేకపోతే కొన్నారా?, ” తింటూ అడిగింది. “అరే.. నేనే పెట్టానంటే నువ్వు నమ్మడంలేదేంటి, నువ్వు వెళ్ళిపోయాక ఏం చెయ్యాలో తోచలేదు. నా నోరేమో బయట మామిడిపళ్ళను చూస్తుంటే ఆవకాయకోసం ఆరాటపడుతుంది. నువ్వు తెచ్చేదెప్పుడు నేను తినేదెప్పుడు అనుకుని ఆవకాయలు పెట్టడం ఎలాగా అని యూట్యూబ్ చూసాను. చాలా ఈజీ అనిపించింది. అన్ని మార్కెట్‌లో మామిడిముక్కలతో సహా దొరికాయి. ఫోన్ దగ్గరపెట్టుకుని అందులో చూస్తూ పెట్టాను. ఎలా ఉంది మన టాలెంట్, ” మీసం దువ్వుతూ అడిగాడు. నోటిలో ముద్ద పెట్టుకోవడం ఆపి భర్తవైపే చూస్తుండిపోయింది సుజాత. “ఏమండి .. మీరు చెప్పినట్టు వింటే ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళం, ఇటు మిమ్మల్ని ఇబ్బందిపెట్టాను.. అక్కడ నేను ఇబ్బంది పడ్డాను, ” అంది బాధపడుతూ. “పోనిలేరా నీకు ఇప్పటికైనా తెలిసొచ్చింది కదా! ఏదైనా మన ఇంట్లో మన చేతులతో చేసుకుని తింటే ఆ తృప్తేవేరు, వాళ్ళెవరో ఇచ్చింది మనకు నాలుగురోజులు సరిపోదు, ఇప్పుడు చూడు మన పిల్లలకు పంపొచ్చు. మనము సంవత్సరం పొడువునా తినొచ్చు.అవునాకాదా, ” ఆప్యాయంగా భార్యవైపు చూస్తూ అడిగాడు. “అవునండి. ఇంకెప్పుడు మీ మాట కాదనను. మీరు చెప్పింది అక్షరాల నిజం, అబ్బా మాగాయ అద్భుతంగా ఉందండి. ‘ఆవకాయ అదిరిపోయిందోచ్’ అంటే నమ్మండి. నేను పెట్టినా కూడా ఇంత కమ్మగా ఉండేది కాదేమో, మా మంచి శ్రీవారు పెట్టారు కాబట్టి ఇంత రుచి వచ్చిందేమో, ” అంటూ ఆనందంగా భర్త కళ్ళల్లోకి చూసింది సుజాత. ********* ********** ******** ******* *******

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


64 views6 comments
bottom of page