top of page

బతుకు భయం



'Bathuku Bhayam' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

Published In manatelugukathalu.com On 25/03/2024

'బతుకు భయం' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏఁవండీ!...వచ్చే వారం మావయ్య గారు మీ చెల్లెలి దగ్గరకు వెళ్తున్నారా?”


“వెళ్తున్నారు. రిజర్వేషన్ చేయించాను”


“నాలుగైదు నెలలు అక్కడే ఉంటారుగా?... ఆ పోర్షన్ అద్దెకు ఇస్తే, నెల తిరిగే సరికి ఓ పది వేలు వస్తాయిగా?...పిల్లకు చిన్న వస్తువు కొనుక్కోవచ్చు” 


“వారు తిరిగి వచ్చినప్పుడు అధ్దెకున్నవారు వెంటనే ఖాలీ చేయక పోతేనో?...”


“ఆ విషయం అప్పుడు చూసుకోవచ్చు. తెలిసిన వారికి చెప్పండి. అద్దెకు ఇచ్చేద్దాం!” 


భార్య మాటలు ఇష్టం లేకున్నా ఆనంద్ కాదనలేదు.

 ***** 

గోపాల్రావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. రెండు పోర్షన్ల ఇల్లు కట్టుకున్నాడు. భార్య కాలం చేయడంతో తనుంటున్న పోర్షన్ లో ఒంటరి వాడైపోయాడు. రెండో పోర్షన్లో కొడుకు ఆనంద్, కోడలు, మనవడు, మనవరాలు ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో ఉంటున్న కూతుర్ని చూడ్డానికి వెళ్తుంటాడు. కొడుకు అతికష్టం మీద డిగ్రీ పూర్తి చేసాడు. ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగం చేస్తున్నాడు. తను మంచి వాడే కాని, భార్యా విధేయుడు. స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేడు.

 ***** 

అయిదు నెలల తర్వాత తిరిగి వచ్చిన గోపాల్రావు తన పోర్షన్ లో ఎవరో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తండ్రికి విషయం చెప్పటానికి ధైర్యం చాలలేదు కొడుకుకి. 

 “ఎవరు వాళ్ళు?” గద్దించి అడిగాడు. 


“వారు మీ అబ్బాయి ఆఫీసులోని వారే మావయ్య గారూ! అద్దెకు ఇల్లు దొరక్క బాధ పడుతుంటే, మీరు వచ్చేదాకా ఉండమన్నాం” కోడలు ధైర్యంగా చెప్పింది. 


“అంటే అద్దెకు ఇచ్చారన్న మాట!?...”


గోపాల్రావు కోపంగా అడిగేసరికి కొడుకు తల దించుకున్నాడు. 

“నెలకు పదివేలు వస్తాయని ఇచ్చాం. మీరు ఒంటరిగా ఉండటం దేనికి?... మాతో కలసి ఉండొచ్చు. మీ సామాన్లు హాలులో జాహగ్రత్తగా ఉంచాం “ కోడలు తడబడుతూ చెప్పింది. విషయం అర్థం అయింది గోపాల్రావుకి. తనింట్లోనే వారితో కలసి ఉండొచ్చన్న కోడలు మాటలకు విస్తుపోయాడు. బాధపడుతూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళాడు. హాలులో ఓమూల చిందరవందరగా పడివున్న తన సామాను వేపు చూసాడు. కొడుకు, కోడలు వేపు కోపంగా చూస్తూ, మిత్రుడు రాజారావుకి ఫోన్లో విషయం టూకిగా చెప్పాడు. అరగంటలో రాజారావు మినీ వేన్తో వచ్చి, గోపాల్రావు సామాన్లు తీసుకు పోయాడు. 


“ వాళ్ళు ఖాలీ చేసేదాకా మా రాజారావు ఇంట్లో అద్దెకు ఉంటాను“ కొడుకు, కోడలుకి చెప్పి స్కూటరు తీసుకుని తను వెళ్ళిపోయాడు. 

 *****

“డాడీ ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలను స్కూలుకి తీసుకు వెళ్ళేవారు. తీసుకు వచ్చేవారు. ఇప్పుడు ఆటోవాలాకి నెలకు అయిదు వేలు ఖర్చు. పాఠాలు చెప్పేవారు. ట్యూషను ఖర్చు మరో అయిదు వేలు. నెలాఖర్లో కావాల్సిన సరుకులు చెప్పకుండానే తెచ్చేవారు. కరెంటు బిల్లు వారే కట్టేవారు. ఈ నెలలోనే ఇంటి పన్ను కట్టాలి. ఏ అవసరం వచ్చినా ఆదుకునే వారు. అద్దె డబ్బులకు ఆశపడి చాలా పెద్ద పొరపాటు చేసాం కదా?...”


భర్త మాటలకు భార్య బదులు చెప్పలెక పోయింది. మావయ్య గారు బాధ పడినట్లు ఆమె గ్రహించింది.

 **** 

“నా పేరు. రాజారావు. మీ డాడీ మా ఇంట్లోనే ఉంటున్నారు. త్వరలో ఈ ఇల్లు అమ్మేయాలని అనుకుంటున్నారు” రాజారావు మాటలకు ఆనంద్ నిర్ఘాంత పోయాడు. 


“ఈ ఇంటికి వారసుడు మావారు. వీరికి చెప్పకుండా, వీరి సంతకం లేకుండా మా మావయ్య గారు ఇల్లు ఎలా అమ్మేస్తారు!?... ఎవరైనా ఎలా కొనగలరు?” ఆనంద్ భార్య కోపంతో రెచ్చిపోతూ అడిగింది. 

“నిజమే! వారసుడు మీవారే!...ఈ ఇల్లు మీ మావయ్య గారి స్వార్జితం కనుక, ఏమైనా చేసుకునే హక్కు, అధికారం వారికి ఉన్నాయి “


“ఏఁవిటి!?...పెద్ద లాయర్లా, లా పాయింట్లు తీస్తున్నారు!?...”


“అవును! నేను లాయర్ నే!” 


ఆమె మరోమాట అనలేక పోయింది. తండ్రి తనతో చెప్పకుండా ఇల్లు అమ్మేస్తున్నందుకు ఆనంద్ బాధ పడ్డాడు. 


“నాకు ఈ ఇల్లు కొనే ఆలోచన ఉంది. అప్పుడు మీరు అద్దె పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంటుంది”

రాజారావు మాటలకు రావు గారి కొడుకు, కోడలు నివ్వెరపోయారు. 


‘తన పాతిక వేల జీతం ఇంటి అద్దెకు, పిల్లల ట్యూషనుకి, ఆటోకి సరిపోతుంది. ఇక నలుగురం బతకడం ఎలా?...డాడీ ఇక్కడ ఉన్నప్పుడు వారి విలువ మంచితనం తెలుసుకోలేక పోయాం’ స్వగతంలా అనుకుంటూ బాధ పడ్డాడు ఆనంద్. మొదటి సారిగా భార్యాభర్తలకు బతుకంటే భయం వేసింది. 


 ‘అద్దె డబ్బులకు ఆశించి, మావయ్య గారిని బాధపెట్టాను. తప్పు చేసాను!....’ 


భార్య బాధ పడటం చూసి-- “పద!...డాడీని క్షమించమని అడుగుదాం” ఆనంద్ అన్నాడు.


 “మీ తప్పేమీ లేదండీ! మావయ్య గారికి నావల్లే ఇల్లు అమ్మేసే ఆలోచన వచ్చింది “ 


“ఇకమీదటనుంచైనా మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నడచుకోవడం మంచిది “ 

భర్త మాటలకు ఆమె తలూపింది. 

 **** 

ఆనంద్ భార్యతో కలసి తండ్రికి క్షమాపణ చెప్పడానికి రాజారావు ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో గోపాల్రావు పూజ గదిలో ఉన్నాడు. 


“మా గోపాల్ ఇల్లు అమ్మే ఆలోచన ప్రస్తుతానికి విరమించు కున్నాడు. మీరు గాభరా పడకండి. తన పోర్షన్ ఖాలీ అయింది కాబట్టి, మీ దగ్గరకు వచ్చేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు”


రాజారావు మాటలకు భార్యాభర్తల ముఖాల్లో ఆనందం చోటు చేసుకుంది. పూజ ముగించి బయటకు వచ్చిన గోపాల్రావు కోడలు, కొడుకుని చూసి ఆశ్చర్య పోయాడు. 

“నన్ను క్షమించండి డాడీ!”- అంటూ కొడుకు, “నా తప్పు మన్నించండి మావయ్యా! మీ ఇంటికి వచ్చేయండి!” అంటూ కోడలు చేతులు జోడించి అన్నారు.


 “నేను అక్కడ లేకపోవడంతో పిల్లలు ఎంత బాధ పడుతున్నారో చూడరా రాజూ!” అన్న రావు గారి మాటలకు రాజారావు మందహాసం చేసాడు. 


“గోపాల్! నీవు చెప్పినట్లుగా అబ్బాయి ఉంటున్న పోర్షను తన పేరు మీద, నీవు ఉంటున్న పోర్షను నీ తదనంతరం అమ్మాయి పేరు మీద వీలునామా తయారు చేసాను.చదివి సంతకం చేయి” అంటూ ఒక ఫైలు రావు గారికి ఇచ్చాడు రాజారావు. 


రాజారావు మాటలు విన్న కొడుకు, కోడలు రావు గారి కాళ్ళపై పడి మరోసారి - మన్నించమని వేడుకున్నారు. తను ఆనందంతో పొంగిపోయాడు.


ఇల్లు అమ్మేయబోతున్నారంటూ రాజారావు, గోపాల్రావు కొడుకుకి, కోడలుకి అబద్ధం చెప్పాడని, వారి సహాయం లేకుండా బతకడంలోని సాధక బాధకాలు, వాస్తవ పరిస్థితులు ఆలోచించేలా చేసాడని గోపాల్రావుకి తెలియని విషయం. 


 / సమాప్తం /


సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

      మీ సుస్మితా రమణ మూర్తి.





















90 views0 comments
bottom of page