'Chamatkaram' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah Published In manatelugukathalu.com On 09/12/2023
'చమత్కారం' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఒక ఊరిలో గంగరాజు అను ఒక గృహస్థు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు. కొడుక్కు పెళ్లీడు వచ్చింది. అయినా తండ్రి పెళ్లి చేయలేదు. కొడుక్కు తాను పెళ్లి చేసుకోవాలని ఎంత ఉబలాటగా ఉన్నా తండ్రిని పెళ్లి చేయమని అడగలేక పోయాడు. అయితే ఎంతకూ తన పెళ్లి విషయం తండ్రి ఎత్తక పోయేసరికి ఇక ఉండబట్టలేక తానే ఒక రోజు తన తండ్రితో తనకు పెళ్లి చేయమని అడిగాడు.
అందుకు ఆయన కొడుకును దగ్గరగా పిలిచి "ఒరేయ్ లింగరాజు! పెళ్ళంటే మాటలనుకున్నావా! అంత సునాయాసమేమి కాదు! ఎన్ని సాధకబాధకాలు ఉన్నంటాయో తెలుసా? ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కోవాలనుకున్నావూ? అదో బ్రహ్మాండమైన కార్యక్రమం. పెళ్లాం వేసే ఎత్తుగడలను, ఆమె వేసే ఉపాయాలను దీటుగా ఎదుర్కోవాలి. అందుకు ఎంతో గొప్ప తెలివితేటలు కావాలి. చాల ఓర్పు నేర్పు ఉండాలి. అవి నీకున్నాయా?" అని అడిగాడు కొడుకుని.
"అట్లైతే నేను ఏమి చేయాలి? " కొడుకు తండ్రిని అమాయకంగా అడిగాడు.
"దేశ సంచారం చేయాలి. విజ్ఞానం సంపాదించాలి. ముఖ్యంగా ' కప్ప లగువు (కప్పకు ఉన్న లంఘించే శక్తి), సీమ బిగువు(చీమకు ఉన్న బరువులు మోయగల శక్తి), ఆడదాని చమత్కారం(స్త్రీలకు ఉన్న సమయస్పూర్తి)' - ఈమూడు తెలుసు కోవాలి.' అప్పుడు పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అవుతావు" వివరించి చెప్పాడు తం0డ్రి గంగరాజు.
"సరే నేను తెలుసుకొని వస్తాను. పెళ్లి చేస్తావా?" లింగరాజు మాటీయమన్నట్లు అడిగాడు.
"తప్పకుండా చేస్తాను" అని తండ్రి గంగరాజు మాటిచ్చాడు.
సరేనని మరుసటి రోజు లింగరాజు సద్దికూడు కట్టుకొని తూర్పు ముఖంగా దేశాటనకు బయలుదేరాడు. పోగాపోగా ఒక విడిది ప్రదేశం కనిపించింది లింగరాజుకు. అక్కడ కొంత మంది కూలీలు అన్నం తింటూ కనిపించారు. తాను కూడా సద్దికూడు తిందామని ఒక ఎత్తైన బండపైన కూర్చున్నాడు. అతనికి సమీపంలోనే ఒక పెద్ద మాంసపు ముక్కను దానిలో నూరోవంతు కూడ లేని ఒక సీమ లాక్కుని పోతుండటం చూసి ఆశ్చర్యంతో ముక్కు మీద వేలు వేసుకున్నాడు. "అంత పెద్ద మాంసపు ముక్కను ఇంత చిన్న సీమ ఎలా లాక్కుని పోతుంది" అబ్బురంతో ఆవళించాడు లింగరాజు.
"నాన్న చెప్పినట్లు సీమ బిగువు అంటే ఇదేనేమో" అనుకున్నాడు.
‘తండ్రి చెప్పిన మూడింటిలో మొదటిది చూసి సీమ బిగువంటే ఏమిటో తెలుసుకున్నాను’ అనుకొని సద్దిబువ్వ తిని ముందుకు ప్రయాణం సాగించాడు.
నడవగా నడవగా లింగరాజుకు ఓ పెద్ద పదడుగుల వెడల్పు ఉన్న కాలువ అదాటు పడింది. కాలువను దాటడానికి కాలువలో దిగబోయాడు. ఇతలి గట్టున ఉన్న ఒక కప్ప ఇతన్ని చూసి భయపడి అంత పెద్ద కాలువను ఒకే లగువులో అవతలి వైపుకు ఎగిరింది. అది చూసి విభ్రాంతితో నోరెళ్ళబెట్టాడు లింగరాజు.
‘ఇంత చిన్న కప్ప అంత పెద్ద కాలువను ఎలా ఎగిరిందబ్బా! అనుకుంటూ కప్ప లగువు అంటే ఇదే కాబోలు’ అనుకున్నాడు సంబ్రమాశ్చర్యాలతో.
తండ్రి చెప్పిన మూడింటిలో రెండవది కూడ చూసి కప్ప లగువును తెలుసు కున్నాడు. ‘ఇక మూడవదైన ఆడదాని చమత్కారం తెలుసుకోవాలి’ అనుకుంటూ ఉషారుగా ముందుకు కదిలాడు లింగరాజు.
పయనించగా పయనించగా ఉదయానికల్లా లింగరాజు ఓ పల్లెటూరు చేరుకున్నాడు. లింగరాజు ఆ ఊరిలోకి పోయి, ఊరి కంతటికి మంచి నీళ్ళ బాయి ఊరి మధ్యలో ఉండడాన్ని చూసి, ఆడవాళ్ళంతా నీళ్ళకు ఇక్కడికే వస్తారని తెలుసుకొని, అక్కడే చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాడు లింగరాజు.
ఉదయం నుంచి ఆడవాళ్ళు బాయికి వస్తున్నారు, నీళ్ళు చేదుకొని పోతున్నారు. ఏ ఒక్కరూ లింగరాజును గమనించలేదు. ఊరికి తూర్పు దిక్కు నుంచి ఓ ఇరవై ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి బాయికి నీళ్ళకు వచ్చింది. నీళ్ళు చేదుకుంటూ లింగరాజును చూసింది.
‘ఎవరో పరస్థలమోడిలా ఉన్నాడే’ అనుకుంది. రెండవసారి నీళ్ళుకు వచ్చి మళ్లీ లింగరాజును చూసింది ’ఏదో పని మీద వచ్చినట్లున్నాడు పరదేశి. అనుకుంది ఆయువతి. మూడవ దఫా నీళ్ళకొచ్చి లింగరాజు ఇంకా అక్కడే ఉండడాన్ని చూసి ‘ఎవరండీ మీరు. ఊరికి కొత్తలా ఉన్నారే, ఏపని మీద వచ్చారు?’ అని పలకరించింది.
మాది పరమటి దేశమండీ. మా నాన్నకు నాకు ఒక సమస్య వచ్చి, మీ తూర్పునాటోళ్ళు తెలివైన వాళ్లని, మా సమస్యకు పరిష్కారం మీవల్లే తెలుస్తుందని వచ్చాను" లింగరాజు చెప్పాడు.
"సమస్యేమిటి" అడిగింది ఆ యువతి.
"నేను మా నాన్నతో పెళ్లి చేయమని అడిగాను. ఆయన 'సీమ బిగువు, కప్ప లగువు, ఆడదాని చమత్కారం' తెలుసుకొని వస్తే పెళ్లి చేస్తాను అన్నాడు. అందులో భాగంగానే మీ ఊరు వచ్చాను" చెప్పాడు లింగరాజు ఆయువతితో.
" ఔనా! అట్లైతే నా వెంట రా! బొమ్మ చూపిస్తా" అని లింగరాజును తన వెంట పిల్చుకొని పోయింది.
కొత్త వ్యక్తితో వచ్చిన పెళ్ళాన్ని చూసి "ఎవరు ఈయనా!" అని ఆశ్చర్యంగా అడిగాడు మొగుడు. లింగరాజును ఆసక్తిగా చూశారు అత్త, మామ, మరిది, ఆడపడుచు.
అందరితోనూ "ఈయన నాకు బావ అవుతాడు. నా పెళ్లికి దేశాంతరాలు పోయి వుండినాడు. అందువల్ల పెళ్లికి రాలేక పోయాడు" అని చెప్పింది. లింగరాజు యెర్రోడిలా చూస్తుండిపోయాడు.
"అలాగా! అయితే మధ్యాహ్న భోజనంలోకి కోడిని కొయ్యాల్సిందే" అని కోడికూర తిరువాతాన్నం చేశారు. లింగరాజుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ఇంటిల్లిపాది దర్జాగా చూసుకోసాగారు.
మధ్యాహ్నం అందరూ భోజనాలు కానిచ్చి ఇంటి బయట చెట్టు కింద కూర్చుని ముచ్చట్లల్లో పడ్డారు కుటింబికులందరూ. కోడలు భోజనం నీళ్ళు తీసుకొని లింగరాజు ఉన్న గదిలోకి పోయింది.
లింగరాజు భోజనం చేసి నీళ్ళు తాగిన తరువాత ఉన్నట్టు ఉండి అగస్మాత్తుగా "పట్టుకుండె! పట్టుకుండె!" అని గట్టిగా అరిచింది. ఆమె అరుస్తుంటే కంగారు పడి పోయాడు లింగరాజు.
అరుపులు విన్న ఇంటి సభ్యులు "వీడెవడో మన అమ్మాయిని బలవంతం చేస్తున్నాడు" అనుకొని కర్రలు బడెలు తీసుకొని గదిలోకి చొరబడ్డారు. వాళ్ళను చూసిన లింగరాజుకు పైప్రాణాలు పైనే పోయాయి.నోట మాట రాక అవాక్కయి చూస్తుండి పోయాడు లింగరాజు. ఇంటివారు గదిలోకి వచ్చి చూసే సరికి కోడలు లింగరాజు గొంతును సరుముతూ సాదుతూ కనిపించింది.
"ఏమ్మా! ఏం జరిగింది?" అనడిగితే " బావకు గొంతు పట్టుకుంది" అని చెప్పింది.
"ఓస్! అంతేనా" అనుకుంటూ అందరూ బయటికి నడిచారు. లింగరాజు భయంతో వణికిపోతూ కనిపించాడు.
"చూశావా! ఆడదాని చమత్కారం! క్షణాల్లో చంపించనూ గలదు. మరు క్షణం బతికించనూ గలదు. తెలిసింది కదా చమత్కారం ! ఇక పోయిరా" చెప్పింది నవ్వుతూ.
“బాగా తెలిసింది తల్లి! చావు అంచుల దాకా పోయి వచ్చాను. మీ ఆడవాళ్లకు ఒక దండం. మీ చమత్కారానికి ఒక దండం. పోయొస్తా!" అని చచ్చిబతికి ఇంటికి బయల్దేరాడు లింగరాజు.
విషయం తెలియని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా సాగనంపారు.
***
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Podcast Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
Comments