top of page

చెదరని స్వప్నం




'Chedarani Swapnam' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 09/12/2023

'చెదరని స్వప్నం' తెలుగు కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“ఏయ్ మౌనికా… అబ్బా ఎన్నాళ్ళైందే నిన్ను చూసి, ఒక్కదానివే బాబును తీసుకుని వచ్చావు మీ ఆయన రాలేదేమిటి ? ఓ నాకర్ధమైందిలే మనిద్దరం కలిసి గడపాలని వచ్చావు కదా! సరే రా మంచిపని చేసావు, ” అంటూ మౌనికను చూసిన సంతోషంలో గడగడా మాట్లాడేసింది అవంతిక. 


అవంతిక మౌనిక చిన్నప్పటినుండి ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ మధ్యలో ఇద్దరు కలుసుకోలేదు. మౌనిక పెళ్ళిచేసుకుని ఒక బాబుకు తల్లి అయింది. అవంతికకు తన మనసుకు సరిపడిన మనిషి తనకు దొరకనందుకు పెళ్ళి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. 


“ అవంతిక… నాకో సహాయం చేస్తావా? కొన్నాళ్ళు నేను నీ దగ్గరే ఉందామనుకుంటున్నాను నీకేం ఇబ్బంది లేదు కదా, ” అడిగింది మౌనిక. 


“ మౌనికా… ఏమిటి నువ్వంటున్నది నువ్వు నా దగ్గరుండడమేమిటి, ఏమయిందే నీ ముఖంలో ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది, ఎప్పుడు చలాకీగా ఉంటావు స్కూల్‌లో అందరు నిన్ను నవ్వులరాణి అని పిలిచేవారు, ఏమైంది నీ నవ్వులేవి ఎందుకంత బాధగా ఉన్నావు చెప్పు మౌనిక, నువ్వు నా దగ్గరుంటానని అడగడమేమిటి ఇది నీ ఇల్లనుకో, ” అంది మౌనిక భుజం మీద చెయ్యివేస్తూ. 


“అవంతిక… ఏం చెప్పమంటావు నా జీవితం తలకిందులైన నావలా అయింది, ఒడ్డుకు చేరే దారి తెన్ను లేకా నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఏదైనా ఉపాయం చెబుతావేమోనని, ” అంది భారంగా. 


“మౌనికా… సాకేత్ నువ్వు కలిసి ఉండడం లేదా? సాకేత్ బాగానే ఉన్నాడు కదా! ఏం జరిగిందో చెప్పవే నాకు భయంగా ఉంది నిన్ను చూస్తుంటే, ” కంగారుపడుతూ అడిగింది. 


“ఆయనకేం ఆయన బాగానే ఉంటాడు. నమ్మిన నన్ను మోసంచేసాడు, ప్రాణానికి ప్రాణంగా

చూసుకుంటున్నాడనుకున్నాను కానీ నా వెనక పెద్ద కుట్రజరుగుతుందని తెలుసుకేలేపోయాను.


బయటపడనంతవరకు అందరు పెద్దమనుషులే. బయటపడినప్పుడే కదా వాళ్ళెలాంటివారు తెలిసేది.. తీరా తెలిసాక అందులోనుండి బయటపడడం తప్పా ఇంకేం చెయ్యలేకపోతున్నాను అవంతిక,”అంటూ అవంతికను గట్టిగా వాటేసుకొని తన తనివితీరా ఏడివసాగింది మౌనిక. 


“ఛ ఛా… ఏమిటిది మౌనిక ఏమైందసలు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావో చెప్పు. ఇలారా కూర్చో, ” కాసేపు ఓదార్చింది. 


“చెబుతానే నీకు కాకపోతే నాకున్న ఆత్మీయులు ఎవరు? నా భర్తనే నన్ను మోసంచేసాడు అవంతిక, పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా ! ఎలాంటి మోసం ఉండదనుకున్నాను. పెళ్ళైన ఇన్నేళ్ళలో తన గతమంతా దాచి నాతో కాపురం చేసాడు ఏ మాత్రం అనుమానం రాకుండా. 

మా ఇద్దరి మధ్యలో దాపరికాలు లేవు అనుకున్నాను. కానీ నా వెనుక ఆయన చాలా కథ నడుపుతున్నాడని ఈ మధ్యలోనే తెలిసింది. మా పెళ్ళికకాముందే ఆయనకొక కొడుకున్నాడని..


 హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నడట, ప్రతి నెల డబ్బులు పంపడమే కాకుండా తను వెళ్ళి చూసి వస్తాడట. ఇంత గుట్టు చప్పుడు కాకుండా తన పని తాను చేసుకపోతున్నాడు నాకు తెలియనివ్వకుండా అవంతిక..


 ఇది పచ్చి మోసమా కాదా చెప్పు? ఏ ఆడదయినా ఇలాంటివి సహిస్తుందా చెప్పు, అందుకే నేను అతని నుండి విడాకులు కోరుతూ పిటిషన్ పంపించాను. అందుకే ఈ కేసు విషయం తేలే వరకు నీ దగ్గరుంటానని వచ్చాను, ” అంది. 


“మౌనిక … నువ్వు తొందరపడుతున్నావేమోనని అనుకుంటున్నాను. నాకు తెలిసి సాకేత్ అలాంటివాడు కాదు అంటాను. ఎందుకంటే సాకేత్ నేను రెండుసంవత్సరాలు ఇంటర్ కలిసే చేసాము. అసలు ఆడపిల్లలవైపు కన్నెత్తి చూసేవాడు కాదు తెలుసా? అలాంటి వాడు ఇలా చేసాడంటే నేను నమ్మను, నువ్వు ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకున్నావనిపిస్తుంది. సాకేత్ ను నిలదీసి అడగలేకపోయావా ఆ బాబేవరు అని, ” అనునయంగా అడిగింది అవంతిక. 


“పిచ్చి అవంతికా… ఎవరైన తప్పు చేసి తప్పును ఒప్పుకుంటారా? అదీ అయింది, నిలదీసి అడిగాను. ఇప్పుడు నేనేం చెప్పలేను అని దాటేస్తున్నాడు, తనకు పుట్టిన కొడుకుకాకపోతే దాచవలసిన అవసరం ఏముంది, హాస్టల్ లో తన కొడుకుగానే పేరు రాసాడు, నెలనెలా

డబ్బులు పంపించేది కూడా తనే అని ఋజువైంది. ఇంకా ఏం కావాలి చెప్పు ఇంతకంటే నిదర్శనం..


 పెళ్లికి ముందే ఒక బాబున్నాడు అంటే ? ఆమె కూడా ఎక్కడో ఉండే ఉంటుంది కదా! నాకు తెలియనివ్వకుండా బాబు దగ్గరకు వెళుతున్నట్టే ఆమె దగ్గరకు కూడా వెళుతున్నాడేమో ఎవరికి తెలుసు, అవంతిక.. నా వల్ల కాదు ఇలాంటి మోసగాడితో కాపురంచెయ్యడం. నాకు ఖచ్చితంగా విడాకులు కావలసిందే, ” మొండిగా వాదిస్తూ అంది. 


“మౌనిక.. నువ్వు ఆవేశం తగ్గించుకో. నువ్వున్నట్టుగానే రేపు కోర్టులో విడాకులు వస్తాయనుకో, అప్పుడు నువ్వు ఒంటరిగా బతుకగలవా? ఈ ప్రపంచంలో తోడు నీడలేని ఆడదాని బతుకు ఎలా ఉంటుందో తెలుసా, ”


“అవంతిక … నువ్వు ఒంటరిగానే బతుకుతున్నావన్న విషయం మరిచిపోతున్నావు. ఏం.. నువ్వు బతుకడంలేదా.. నేను నీలాగే బతుకుతాను. అంటే నీ ఉద్ధేశం మగాడు ఎన్ని తప్పులుచేసినా చూసి చూడనట్టు అతనితో కాపురం చెయ్యాలంటావు, ” అవంతిక మాటలకు అడ్డువస్తూ అడిగింది. 


“అదికాదు మౌనిక … నేను నీ మంచికోసం చెబుతున్నాను, నా జీవితానికి ఎలాగు దారితెన్ను లేదు. కనీసం నీ జీవితం అయినా బాగుండాలని కోరుకుంటున్నాను. మగాడు అన్నాక ఏదో తప్పు చెయ్యకుండా ఉంటాడా? ఏదో చూసి చూడనట్లుగా సర్దుకుపోవడం మంచిది మౌనిక, రేపు నీ కొడుకు పెద్దయ్యాక మా నాన్న ఎవరు అంటే ఏం చెబుతావు? జీవితమంతా ఒంటరిగా గడుపుతావా? లేకపోతే మళ్ళి పెళ్ళి చేసుకుంటావా” అడిగింది అవంతిక. 


“అబ్బా … ఏం మాటలు నేర్చావు అవంతిక, ఒకప్పుడు చాలా గొప్పగా మాట్లాడేదానివి కదా! ఈ మగాళ్ళ గురించి? అందుకే కదా నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదని చెప్పావు.. 

నమ్మించి గొంతులు కోస్తారని ఒకరిని ప్రేమించి ఇంకొకరితో కాపురం చేస్తారని, ఈ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదని మనం డిగ్రీ చదువుతున్నప్పుడు లెక్చర్లు ఇచ్చావే.. నువ్వు మరిచిపోయావేమో నేను మరిచిపోలేదు.


 చూడు అవంతిక.. నీకు ఇష్టంలేదంటే నీ దగ్గర ఉండను. ఎక్కడోచోట ఆశ్రయం దొరక్కపోదు. కానీ ఒక్కమాట! ఆడది దేన్నైనా భరిస్తుంది కానీ, తన కాపురంలో మరో ఆడదానికి చోటుందంటే ఏ ఆడది సహించదు. తన భర్త తనకే స్వంతం కావాలనుకుంటుందే తప్పా పొరపాటున కూడా సవతిని కోరుకోదు. నన్ను మోసం చేసి ఒక బిడ్డకు తండ్రి అయ్యాడంటే, అది నేను ఎలా భరించుకోవాలో చెప్పు అవంతిక, ” అంటూ అవంతికను పట్టుకుని బోరు బోరుమని విలపించింది మౌనిక. 


మౌనికను చూసి అవంతిక తట్టుకోలేకపోయింది. గట్టిగా గుండెలకదుముకుని ఊరడించింది. ఇప్పుడేం చెప్పినా తనను బాధపెట్టినదానను అవుతానే కానీ ! తను వినే పరిస్థితిలో లేదు. కొంచెం కుదుటపడ్డాక సర్ది చెప్పాలి. ఎలాగైనా సాకేత్ మౌనికలను విడిపోకుండా చూడాలి అనుకుంది. 


“హయ్ సాకేత్ బాగున్నావా? ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నేనండి బాబు అవంతికను, మనం ఇంటర్ లో ఒకే కాలేజిలో చదువుకున్నాము గుర్తుకు వచ్చిందా? పోని ఒకటి చెప్పనా.. ‘ఏయ్ సాకేత్! ఎంతందంగా ఉన్నావో తెలుసా.. నేను నిన్ను ప్రేమిస్తున్నానోచ్’ అంటూ గట్టిగా కాలేజి గదిలో చెప్పాను అందరిముందు. నువ్వు బిత్తరపోయి నన్ను కొట్టడానికి చెయ్యిలేపావు. నీకు దొరకకుండా గదంతా తిప్పించాను. 


చివరకు మన స్నేహితులంతా నీ దగ్గరకు వచ్చి, ‘పాపం నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది కదా! నువ్వు 

ఓకే చెప్పాలి. లేదంటే మేమందరం బాయికాట్ చేస్తాము’ అని నిన్ను బెదిరించారు. అప్పుడు నువ్వు ఏం చెయ్యాలో అర్ధంకాక నాకు ఓకే చెప్పావు. ఎప్రిల్ పూల్ అంటూ నిన్ను అందరం ఆటపట్టించాము గుర్తుకొచ్చిందా, ” అంటూ సాకేత్ చెవి మెలిపెట్టింది అవంతిక. 


“ఏయ్ నువ్వా… ఏంటి మాహాతల్లి ఇన్నాళ్ళు ఎక్కడ మాయమైపోయావు, ఏంటి మళ్ళి నా కొంపమీదకు ఏమైనా ఉపద్రవం తెచ్చావా, ” తన చెవిని వదిలించుకుంటూ దూరం జరిగి అడిగాడు సాకేత్. 


“ఆహా అదే పని మాకు … నువ్వు కూరుకపోయిన ఉపద్రవం కంటే నేను చేసింది పెద్దదా చెప్పు? ఏంటి సంగతులు సాకేత్ నేను విన్నది నిజమేనా? నువ్వు నీ భార్య అదే నా స్నేహితురాలు మౌనిక విడిపోతున్నారని విన్నాను, అసలేం జరిగింది? ఆ బాబేవరు? మౌనికకు తెలియకుండా నువ్వు ఇలా చెయ్యడం ఏం బాగాలేదు సాకేత్. అసలు నువ్వేంటి ఆడపిల్లలవైపు కన్నెత్తి చూసేవాడివి కాదు, అలాంటి నువ్వు బంగారంలాంటి భార్య ఉండగా ఇంకొకరితో జీవితం పంచుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను, ” ఆశ్చర్యంతో అడిగింది అవంతిక పాత స్నేహితుడన్న చనువుతో. 


“ఓహో నీకంతా తెలిసిపోయిందన్నమాట… అంటే మౌనిక నీ దగ్గరకు వచ్చిందా, వాళ్ళ అమ్మానాన్నల వద్దకు పోయిందనుకున్నాను.


 అవంతిక… ఇంతవరకు వచ్చాక నేను నిజం దాచి ప్రయోజనంలేదు. మౌనికకు నిజం చెపితే వినే పరిస్థితుల్లో లేదు. నా మీద చాలా కోపంగా ఉంది. నేను చెప్పేది నువ్వన్నా జాగ్రత్తగా విని మౌనిక మనసుకు తగిలిన 

గాయాన్ని మానేలా చెయ్యి. మా జీవితం పూలనావలా సాగిపోతుందనుకున్న సమయంలో తుపాను చెలరేగింది, ” అంటూ శూన్యంలోకి చూస్తూ అన్నాడు సాకేత్. 


“సాకేత్ … అంటే నువ్వు తప్పుచేసానని ఒప్పుకుంటున్నావా? మౌనిక గురించి ఆలోచించలేదా నువ్వు, మౌనక నీకేం తక్కువచేసిందని ఇలాంటి పని చేసావు? నువ్వేదో

అపర శ్రీరామచంద్రుడిలా నేను ఎంతగా ప్రయత్నం చేసినా నన్ను ఆమడ దూరంలో పెట్టావు. మరీ ఇప్పుడేమో ఉన్న భార్య సరిపోదన్నట్టు చాటుమాటుగా వ్యవహారం నడిపించి దొరికిపోయావు, ” అంది దెప్పిపొడుపుగా. 


“అబ్బా అవంతిక, కాసేపు నీ సోది ఆపుతావా… “తమ్మళి తన చప్పుడే తప్పా ఎదిటివాళ్ళది వినడు” అన్నట్టు నేను జరిగింది చెబుతాను అంటున్నాను కదా! నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కథలు అల్లుకోవడమేనా, ” అవంతికను గట్టిగా పిలుస్తూ అన్నాడు. 

గప్ చుప్ అయింది అవంతిక. 


“చూడు అవంతిక … మీరందరు అనుకున్నట్టుగా నేను మౌనికకు అన్యాయం చెయ్యలేదు. హాస్టల్ లో పెరుగుతున్న బాబు నా స్నేహితుడి కొడుకు. వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. వాళ్ళ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. పైగా వాళ్ళ కులమునుండి వాళ్ళను బహిష్కరించారు. చేసేది లేక ఆర్య సమాజంలో స్నేహితుల సమక్షంలో పెళ్ళిచేసుకున్నారు. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ! సంవత్సరంలోపే పండంటి బాబుకు జన్మనిచ్చింది ఆమె. ఎవ్వరు దగ్గరకు తీయకపోయినా బాబుతోటిదే లోకం అనుకున్నారు. 


బాబుకు రెండోయేడు వెళ్ళి మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్నాడు. ఈసారి పుట్టినరోజు ఘనంగా చెయ్యాలని అది కూడా ‘శాంతి అనాథ శరణాలయం’లో.


మమ్మల్నందరిని కూడా పిలిచాడు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళుతుండగా ఘోరంగా కారును లారి గుద్దేసింది. వెనుకనే మా కారు ఉంది. వెంటనే కారు దిగి వాడిని రక్షించాలనుకున్నాము. కానీ వాడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, పసివాడు భయంకరంగా రోదిస్తున్నాడు. దెబ్బలు 

గట్టిగా తగిలినట్టున్నాయి. అమాంతంగా బాబును ఎత్తుకున్నాను. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె నన్ను దగ్గరకు రమ్మని సైగచేసింది.

బాబుతో పాటుగా వెళ్ళాను.


 “ఏమండి.. నా కొడుకును మీ కొడుకుగా చూసుకొండి. వాడిని ఎవ్వరికి ఇవ్వనని నాకు మాటివ్వండి. వాడిని అనాథను చేసి పోతున్నాము. ఇక నుండి వాడికి తల్లి తండ్రి అన్నీ మీరే. లోకానికి వాడు మీ కొడుకుగానే తెలియచేయండి, ” అంటూ ఆమె కన్నుమూసింది. ” చెప్పడం ఆపి కళ్ళు తుడుచుకున్నాడు సాకేత్. 


“సాకేత్ … నువ్వు చెబుతుంటే నాకే కన్నీళ్లు ఆగడంలేదు, ప్రత్యక్షంగా చూసిన నీకు ఎంత బాధగా ఉంటుందో నేనర్థంచేసుకోగలను, ” అంది అతనిని ఓదారుస్తూ. 


“అవంతిక… నిజంగా ఆ సమయంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియడంలేదు. అప్పటికే నాకు మౌనికకు పెళ్ళై ఆరునెలలు కావస్తుంది. వాళ్ళవాళ్ళకు తెలియచేద్దామంటే ఎవ్వరి దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు లేవు. ఇక మేమంతా కలిసి వాళ్ళకు అన్ని కార్యక్రమాలు జరిపించాము. మా స్నేహితులంతా బాబును నన్ను వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 


అప్పుడు నాకు ‘ఆ బాబును ఏం చెయ్యాలి.. ఇంటికి తీసుకవెళదామంటే మౌనిక కడుపుతో ఉన్న మనిషి, ఎలా అర్థం చేసుకుంటుందో ఏమో’.. 


తనను ఇబ్బంది పెట్టడడం ఇష్టంలేక, నా స్నేహితుడు ఏ శరణాలయం కోసం వచ్చాడో అందులోనే ఆ బాబును ఉంచి, తనకవసరమైన డబ్బులు వాడి బాగోగులు తండ్రిగా నా బాధ్యతని వాళ్ళకు చెప్పి వచ్చాను, అదిగో అప్పటినుండి మౌనికకు తెలియనివ్వకుండా చూసుకున్నాను. ఎలా తెలిసిందో ఏమిటోగానీ నేనంత చెప్పినా తను నా మాట

వినిపించుకునేలా లేదు. ముందే తొందరెక్కువ తనకు. ఆ కోపంతో నన్ను నానా మాటలని బాబును తీసుకుని వెళ్ళిపోయింది. పోనిలే కొంచెం కోపం తగ్గాకా నేనే వెళ్ళి తీసుకుని వద్దామనుకున్నాను, ” తన మనసులో పడుతున్న ఆవేదనంతా చెప్పాడు. 


“నాకు తెలుసు సాకేత్ … నువ్వెటువంటివాడివో, మౌనికకు అదే చెప్పాను నువ్వు అలాంటి వాడివి కాదని. నాపైన కూడా గట్టిగా అరిచింది. ఇక తనతో మాటలనవసరం అనిపించి నీ దగ్గరకు వస్తే కానీ నిజమేమిటో తెలుసుకుందామని వచ్చాను. సాకేత్, నువ్వేం దిగులుపడకు. నేను మౌనికను తీసుకుని వస్తాను, ” అంటూ వెళ్ళిపోయింది. 

***


“అవంతిక … ఎక్కడకు వెళ్ళావు? నా మీద కోపం వచ్చిందా ఉదయం నీ మీద గట్టిగా అరిచానని? ఏం చెయ్యను చెప్పు ? మా అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా… ప్రాణస్నేహితురాలవని నీ దగ్గరకు వచ్చాను, ఆపదలో నన్ను ఆదుకుంటావని వస్తే నువ్వు నాదే తప్పన్నట్టుగా మాట్లాడేసరికి కోపం వచ్చింది, ” అంది మౌనిక. 


“మౌనిక… నిన్ను చూస్తుంటే ఒకపక్క జాలివేస్తుంది, మరోపక్క ఈర్ష్య గా ఉంది తెలుసా, ” అడిగింది అవంతిక. 


“ఊహు … నా జీవితం ఇలా అయినందుకు జాలిపడుతున్నావు సరే, మరీ నామీద ఈర్ష్య ఎందుకో అర్థంకాలేదు అవంతిక, ” ఆశ్చర్యపోతూ అంది. 


“ఎందుకంటే ప్రతీది భూతద్దంలో చూసే అలవాటు నీకు చిన్నప్పటినుండి ఉంది, అసలు విషయం తెలుసుకోకుండా తొందరపడి జీవితాన్ని ముక్కలు చేసుకుంటే నష్టపోయేది నువ్వే, ఆవేశం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో ఇప్పుడు తెలియదు.

 

జీవితం చేజారిపోయిన తరువాత ఎంత బాధపడినా తిరిగి దొరకదు. నువ్వు కొంచెం ఓపికగా సాకేత్ చెప్పేది విని ఉంటే ఇలా నా దగ్గరకు వచ్చేదానివి కాదు, ” అంటూ సాకేత్

చెప్పినదంతా చెప్పింది అవంతిక. అంతా విన్న మౌనికకు దుఃఖం ఆగడంలేదు. 


‘ఎంత పొరబాటు చేసాను సాకేత్ మనసు గాయపరిచాను. నేను ఒక్క క్షణం తను చెప్పేది వినకపోవడం నా తొందరపాటు. సాకేత్ నా కోసం రాక ముందే నేను వెళ్ళి నన్ను క్షమించమని అడగాలి’ అనుకుంది మనసులో. 


“అవంతిక … నేను తప్పుచేసాను. ఇప్పుడే వెళ్ళి సాకేత్ ను తప్పయిందని చెబుతాను. నువ్వు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వే గనుక సాకేత్ తో మాట్లడకపోయినట్టయితే, మా మధ్యలో చాలా అగాధం ఏర్పడేది. నేను నీ దగ్గరకు రావడం మంచిదైంది, ” అంటూ అవంతిక రెండు చేతులు పట్టుకుని ఆనందంతో కళ్ళకద్దుకుంది మౌనిక. 


“సరే నువ్వన్నట్టుగానే మీ ఆయన దగ్గరకు వెళుదువుగాని, కాకపోతే రేపు మనం ఒక దగ్గరకు వెళ్ళి అటునుండి అటే వెళ్ళపోదువుగానీ. ఈ ఒక్కపూటకు మీ ఆయనేం కరిగిపోడులే. రేపు జాగ్రత్తగా మీ ఆయనకు అప్పచెబుతాను, ఈ రాత్రంతా మీ ఆయన గురించి కమ్మటి కలలు కంటూ ప్రశాంతంగా నిద్రపో, ” అంది పరిహాసమాడుతూ. 


“కానీ … పాపం ఆయన ఎంత బాధపడుతున్నారో నా గురించి,” అంది పరధ్యానంగా. 


“అబ్బో … ఇప్పుడు మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావు, మరి ఇంతకు ముందు వరకు మీ ఆయన గుర్తుకు రాలేదా? నేను చెప్పానా మీ ఆయన చాలా బుద్ధిమంతుడని, ఎంత మంది ఆడవాళ్ళు వల విసిరినా చెదరని మనసు మీ ఆయనది.


 నీకు తెలుసా మౌనిక.. మీ ఆయనకోసం నేను పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయానని? నా మొదటి ప్రేమికుడు మీ ఆయనే. కాకపోతే నాది ఒకవైపు నుండే ప్రేమ. అతనిని ఎంత ప్రయత్నం చేసినా అతన్ని గెలుచుకోలేకపోయానంటే నువ్వు నమ్ముతావా? అందుకే ఇప్పటివరకు నాకు సాకేత్ వంటి మనిషి దొరకలేదు. నేను నా మనసు ఎప్పుడో అతనికి అంకితమైంది. ఇప్పుడు నాకు ఇంకేది అవసరంలేదు మౌనిక..” చెబుతూ నిద్రలోకి జారిపోయింది అవంతిక. 


మౌనిక వింటుదనుకుని మొత్తం చెప్పాననుకున్నది కానీ, మౌనికకు అలసిన మనసు తొందరగానే నిద్రపోయింది అవంతిక చెప్పేది వినకుండానే. 


“అవంతిక … ఇదేంటి ఇక్కడకు తీసుకవచ్చావు, ఇది ఆ బాబు ఉన్న అనాథశరణాలయం కదా! ఇక్కడికెందుకు వచ్చాము, ” ఆశ్చర్యంతో అడిగింది. 


“కాస్త ఓపికపట్టు తల్లి అటువైపు చూడు, ” అంది వేలు చూపెడుతూ. 


 ఆశ్చర్యంతో పాటు ఆనందమేసింది గబగబా పరుగెత్తింది అటుగా వస్తున్న సాకేత్ ను చూసి. 


తండ్రిని చూడగానే మౌనిక చేతిలో ఉన్న బాబు నవ్వుతూ “నాన్న “ అంటూ ముద్దుగా పిలిచాడు. 


“ఏమండీ…” 


“మౌనిక…, ” 


అంటూ ఇద్దరూ ఒకేసారి పిలుచుకున్నారు. బాబును చేతిలోకి తీసుకున్నాడు సాకేత్. మౌనికను దగ్గరకు తీసుకుంటూ “మౌనిక … నా మీద కోపం పోయినట్టేనా, ” నవ్వుతూ అడిగాడు. 


అదేంటి నేనింకా తనకు చెప్పనేలేదు ఎలా తెలిసింది అనుకుంటూ అవంతిక వైపు చూసింది. కళ్ళతోనే సైగ చేసింది నేను చెప్పాను అని. 


లత లాగా అతన్ని అల్లుకుపోయింది మౌనిక. “ మౌనిక … ఇది మీ ఇల్లు కాదు కాస్త వదిలిపెట్టు మీ ఆయనను” అంది,  నవ్వుతూ అవంతిక. సిగ్గపడుతూ దూరంజరిగింది మౌనిక. 


“అవంతికా … ఇదిగో ఈ బాబుకు ఇక నుండి తల్లి తండ్రి అన్ని నువ్వే. నీ కొడుకుగా వాడికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నీది. అంతేకాదు ఈ బాబు విషయంలో 

మన మధ్య ఎలాంటి రాకపోకలు ఉండకూడదు, ఎందుకంటే మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో మౌనికను చూసాక అర్థమైంది. నువ్వు అడిగావు కాబట్టి ఈ బాబు సంరక్షణ నీకు అప్పచెబుతున్నాను. ఇప్పటికి ఈ బాబు అదృష్టవంతుడని అనుకుంటున్నాను, ” అంటూ బాబుకు సంబంధించిన సర్టిఫికెట్లన్ని అవంతికకు అప్పచెప్పాడు. 


సంతోషంతో బాబును దగ్గరకు తీసుకుని ముద్దాడింది అవంతిక. విషయం అర్ధం చేసుకున్న మౌనిక తృప్తిగా అవంతిక వైపు చూసింది. తన జీవితాన్ని చెదిరిన స్వప్నంలా మారకుండా చేసిన అవంతికకు మనసులో వేయి మార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది. జీవితంలో సాకేత్ ప్రేమను పొందలేకపోయినా సాకేత్ కొడుకుగా పేరున్న బాబును తన కొడుకుగా తీసుకుని అందులోనే తృప్తిపడాలి అని అనుకున్నది అవంతిక. 


“అవంతిక.. నీవు నన్ను ప్రేమించానని చాలా సార్లు చెప్పావు కానీ నేను నీ ప్రేమను అంగీకరించలేకపోయాను, అయినా నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా నా జీవితం బాగుండాలని నువ్వు చేసిన సహాయం మరిచిపోలేను. నీకు చాలా కృతజ్ఞతలు అవంతిక”


కళ్ళతోనే చెబుతూ అవంతిక వైపు చూసాడు. నీళ్ళు నిండిన కళ్ళతో ఆప్యాయంగా చూసింది సాకేత్ వైపు. ఇదేమి గమనించని మౌనిక భర్త చేతిని పట్టుకుని బాబును ఎత్తుకుని అక్కడనుండి వెళ్ళిపోయింది. 



*********** ********* ******** ********

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 
















 










 


55 views0 comments
bottom of page