top of page

దెబ్బకు దెబ్బ'Debbaku Debba ' New Telugu Story

Written By Lakshmi Nageswara Rao Velpuri

'దెబ్బకు దెబ్బ' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


'పురుషోత్తం గారు ఒక పెద్ద లాయర్. ఆరోజు ఆదివారం కావడంతో ఇంటి కోసం, చికెన్ కూర తెద్దామని, 'వైజాగ్ లో పూర్ణ మార్కెట్' దగ్గరలో ఉన్న ఒక చికెన్ షాప్ కి వెళ్లారు. ఆ రోజు లైన్ లో చాలామంది ఉన్నారు. తను కూడా లైన్ లో నిలబడే సరికి, అతన్ని తెలిసిన కొందరు సార్! మీరు లైన్ లో ఉన్నారా ? ముందుకు రండి. మీకు లైన్ అక్కర్లేదు” అంటూ ముందుకు పంపారు. అప్పటికే ఆ షాపు దగ్గర ఏదో గొడవ అవుతోంది. ఆ చికెన్ షాప్ ఓనర్ ఒక పేద మూటలు మోసే కూలీతో గొడవ పడుతున్నాడు. “ఒరేయ్! నువ్వు మూటలు వేస్తూ బతుకుతున్నావు. కళ్ళు కనబడలేదా? నువ్వు మోస్తున్న మూట కింద పడి, అక్కడే ఉన్న రెండు 'చిన్న కోడి పిల్లలు ' నలిగి చచ్చిపోయాయి. వాటికి డబ్బు కట్టి వెళ్ళు! లేదంటే నిన్ను వదలను” అంటూ పెద్ద గొడవ పెట్టాడు. ఆ కూలి వాడు కూడా “బాబు! ఈ ఎండలో నీరసంగా ఉన్న మూటలెత్తి డబ్బు సంపాదించుకుంటున్నాను. తల మీద నుంచి కింద జారి పడిపోయిన మూట ఇంత పని చేస్తుందని అనుకోలేదు. దాని కింద రెండు చిన్న కోడి పిల్లలు చనిపోయినందుకు బాధపడుతున్నాను. నేనేమీ ఇచ్చుకోలేను సార్. నన్ను క్షమించండి ! అంటూ వలవల ఏడవడం చూసిన అందరి కళ్ళు చమర్చాయి. అక్కడే ఉన్న జనం కూడా, “పోనీలే, ఆ కూలివాడు ఏమి ఇవ్వగలడు? వాడిని వదిలేయండి. చనిపోయిన చిన్న కోడి పిల్లలే కదా ??” అన్నా వినకుండా, ఆ కూలి వాడి షర్టు పట్టుకొని “రేయ్, నువ్వు నాకు 500 ఇచ్చి కదులు, ఎందుకంటే రెండేళ్ల తర్వాత, అవి పెరిగి పెద్దదైనాక వాటిని అమ్ముకుంటే నాకు 500 రూపాయలు వస్తాయి, నాకు ఆ డబ్బులు ఇచ్చి కదులు” అంటూ గట్టిగా ఆరవ సాగాడు చికెన్ షాప్ యజమాని. అప్పుడే అక్కడికి వచ్చిన లాయర్ పురుషోత్తం గారు, “అయ్యో.. ఎందుకయ్యా.. అతన్ని వదిలేయ్! కూలి వాడు ఏమి ఇవ్వగలడు? అయినా చనిపోయినవి చిన్న కోడి పిల్లలే కదా!” అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. తన అధికారం చెలాయిస్తూ, “లేదండి.. మీకు తెలియదు. ఈ వెధవలు రోజంతా తాగుతూ, ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా వీడ్ని వదలను. 500 రూపాయలు ఇవ్వాల్సిందే!” అంటూ భీష్ముంచు కూర్చున్నాడు షాపు యజమాని. లాయర్ పురుషోత్తం గారు ఆ కూలివాని పిలిచి “ఒరేయ్! షాపు యజమాని అడుగుతున్నది కరెక్టే కదరా! ఈ రెండు కోడి పిల్లలు రెండు సంవత్సరాల పాటు పెరిగి పెద్దయ్యాక ,అవి అమ్ముకుంటే 500 రూపాయలు వస్తాయి కదా! ఆ డబ్బులు అడిగాడు తప్ప, ఏమీ లేదు. ఇచ్చేయ్ !” అని అనగానే అంత పెద్దమనిషి ఆ మాట అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఒక పేరు మోసిన న్యాయవాది చెప్పవలసిన మాటలేనా ఇవి.. దేశంలో న్యాయం ఎక్కడికో పోతుంది' అనుకుంటూ చూస్తున్నారు. ఆ కూలివాడు లబోదిబోమంటూ ఆరోజు సంపాదించిన 500 ఆ షాపు యజమానికి ఇచ్చి, “అయ్యా !ఆ రెండు చిన్న కోడి పిల్లలు చనిపోయినందున వల్ల, ఇవాళ మా ఇంట్లో అందరూ కూడు లేక మలమల మాడాల్సిందే” అంటూ ఏడ్చుకుంటూ, తన దగ్గర ఉన్న 500 రూపాయలు రోజంతా శ్రమించి మూటలు మూసి సంపాదించినది, చికెన్ షాపు యజమాని చేతిలో పెట్టి అలాగే నేల మీద కూర్చుండిపోయాడు. చికెన్ షాప్ యజమాని గర్వంతో 500 నోటుని ముద్దు పెట్టుకుని, జేబులో పెట్టుకున్నాడు. ప్రపంచ కప్పు గెలిచినంత సంబరపడ్డాడు. 'లాయర్ పురుషోత్తం ' గారు ఆ నేల మీద కూర్చుండిపోయిన ఆ కూలి వాడిని లేవదీస్తూ “ఒరేయ్.. నువ్వు బాధపడకు! నీకు న్యాయం జరుగుతుంది” అని అంటూ ఆ చికెన్ షాప్ యజమానిని మళ్లీ పిలిచి “ఏవండి ! మీ రెండు కోడి పిల్లలు చనిపోయినందుకు ఆ కూలివాడు మీకు 500 రూపాయలు అందరి ముందు చెల్లించాడు.. నిజమే కదా!” అని అనగానే “అవును సార్! ఎవరికోసం ఇస్తాడు, తప్పు చేశాడు, ఫలితం అనుభవిస్తాడు!” అంటూ తన మీసాన్ని రువ్వుకుంటూ బదులు చెప్పాడు. అందరూ వినండి, రెండు చిన్న కోడి పిల్లలు కూలివాడు మోసే మూట కింద పడి చనిపోయాయి అవి రెండేళ్ల వరకు పెరిగితే వాటిమీద ఆదాయం 500 రూపాయలు వస్తుంది. ఇది సత్యం. కానీ ఆ చికెన్ షాప్ యజమాని ఒకవేళ ఆ కోడి పిల్లలు చనిపోకుండా, బ్రతికి ఉంటే వాటిని పెంచడానికి రెండేళ్లకు ఎంత గ్రాసం పడుతుంది? అన్నది ఆలోచించి చెప్పండి?” అంటూ ఆ చికెన్ షాప్ యజమానిని అడిగారు పురుషోత్తం గారు, ఆ చికెన్ షాప్ యజమాని ఏమాత్రం తడబడకుండా “రెండు సంవత్సరాలు వాటిని పెంచడానికి 'రెండు బస్తాల గ్రాసం ' ఖర్చు అవుతుంది అని బదులు చెప్పేసరికి, లాయర్ పురుషోత్తం గారు నవ్వుతూ “అయితే మీరు ఆ గ్రాసానికి ఖర్చు అయ్యే రెండు బస్తాల ఖరీదు ఆ కూలివానికి ఇచ్చేయండి” అని అందరి ముందు అనేసరికి, ఆ చికెన్ షాప్ యజమానికి కాలి కింద భూమి కదిలినట్లై తనలో తనే లెక్కలు వేసుకుని , ఆ రెండు సంవత్సరాలు కోడి పిల్లల్ని పెంచడానికి రెండు బస్తాల గ్రాసం, కూలివాడి ఇచ్చిన 500 కన్నా ఎక్కువ అవుతుందని భావించి, ఒక్కసారి 'అయ్యా !నా గర్వం అణిగింది, నా తప్పు క్షమించండి. మీరు చెప్పిన న్యాయం వల్ల నేను సిగ్గుతో కుంటున్నాను” అంటూ ఆ కూలివాని చేతిలో అతను ఇచ్చిన 500 రూపాయలు , మరో 100 రూపాయలు కూడా పెట్టి, చేతులు జోడిస్తూ “నా అత్యాశకు ఇదే పరిహారం” అంటూ కూలివాణ్ణి సాగనంపాడు ఆ చికెన్ షాపు యజమాని. ఆ సంఘటన అక్కడున్న ప్రతివారికి నవ్వు తెప్పించింది. న్యాయవాది పురుషోత్తం గారి సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటూ, ఆనందంగా "ఆహా! ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తున్నట్టే," అంటూ మనసులోనే లాయర్ పురుషోత్తం గారిని అభినందించారు.

సమాప్తం


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


66 views0 comments

コメント


bottom of page