top of page

దేశ ద్రోహులు


'Desa Drohulu' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 15/11/2023

'దేశ ద్రోహులు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"హల్లో!.. " అంటూ తనకు వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కేదారనాథ్ ముఖం తెల్లగా పాలిపోయింది అవతల వ్యక్తి చెప్పిన మాటలు విన్న తర్వాత. ఏం మాట్లాడటానికి నోరు పెగలటం లేదు. డిసెంబర్ నెల చలిలో కూడా ముఖమంతా చెమటలు పట్టాయి. ఆ తర్వాత వాట్స్ప్లో తన ఫోన్కి వచ్చిన సందేశాలు చూసి దిగ్బ్రమకి గురైయ్యాడు. అతని బుర్ర పనిచేయ్యడం మానేసింది.


"మే ఐ కమిన్. ' అంటూ అప్పుడే తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు రమణ. త్వరలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న 'వజ్రాయుధం' క్షిపణికి రూపకర్త అతను. వజ్రాయుధం క్షిపణి శత్రుదేశాల సాంకేతికకు అందకుండా వందలమైళ్ళు వరకూ ప్రయాణించి తన లక్ష్యాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యం కలది. రెండేళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి తన సహాయకులతో కలిసి సిద్ధం చేసాడు రమణ. త్వరలో తలబెట్టబోయే పరీక్ష సఫలమైతే దేశంలో రక్షణ వ్యవస్థ అమ్ములపోదిలో ఒక అతి శక్తివంతమైన ఆయుధం చేరినట్లే.


మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఉన్న కేదారనాథ్ అన్యమనస్కంగా 'కమిన్!' అని అన్నాడేకాని అతని మనసులో ఫోన్లో తనకు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన విషయమే మనసులో సుడులు తిరుగుతోంది.

"ఏమిటి సార్! ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు!" అడిగాడు రమణ అతని ముఖ కవళికలు చూసి. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు కేదారనాథ్.


"అబ్బే! ఏం లేదయ్యా! ఏవో చిన్నచిన్న టెన్షన్లు. " అని సర్దుకున్నాడతను.


"అవును సార్! రెండేళ్ళనుండి నేను కూడా అనుభవించాను అంతులేని టెన్షన్. ఇప్పుడు క్షిపణి పరీక్ష సఫలమైతే నా శ్రమకి తగిన ఫలితం దొరికినట్లే!" అన్నాడు రమణ అతని ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంటూ.


"అవునవును!.. ఈ క్షిపణి ప్రయోగం సఫలమైతే మన దేశ రక్షణ వ్యవస్తకు తిరుగుండదు, కానీ.. "


"కానీ ఏమిటి సార్! తప్పకుండా సఫలమవుతుంది సార్! అందులో ఎలాంటి సందేహమూ లేదు సార్!" అన్నాడు రమణ నమ్మకంగా.


ఆ రాత్రంతా నిద్రపోలేదు కేదారనాథ్. ఉదయం అజ్ఞాతవ్యక్తి వద్దనుండి వచ్చిన ఫోన్ వల్ల తను చిక్కుల్లో పడబోతున్నాడు. తను తెలియక చేసిన చిన్న తప్పిదానికి పెద్ద మూల్యం చెల్లించబోతున్నాడు. అంతేకాదు, మాతృదేశానికే ద్రోహం తలపెట్టే పరిస్థితి ఏర్పడుతోంది.


ఓ బలహీన క్షణాల్లో ‘ఆమె’తో ఛాటింగ్ చేయడం, ఆ తర్వాత ఆమె తనతో చనువు పెంచుకోవడం తనకు శాపంగా మారింది. తను ఎంత తెలివి తక్కువగా హనీ ట్రాప్లో పడిపోయాడు? బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న తను అలా చెయ్యకపోవలసింది! ఇప్పుడు అనుకొని ఏం లాభం? ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? బ్లాక్ మెయిలింగ్లో ఇరుక్కున్న తను ఎలా బయటపడగలడు? తనను ఈ ఆపద నుండి ఎవరు బయటపడేయగలరు?


ఇలా పలువిధాల ఆలోచనతోనే అతనికి ఆ రాత్రంతా గడిచింది. తెల్లవారుతుండగా ఏమైతే అదే అవుతుందని ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాకగానీ అతని మనసు స్థిమితపడలేదు.


"చెప్పండి! మీకే విధంగా సహాయపడగలను?" అని అడిగాడు సాంబశివరావు.


"నా పేరు కేదారనాథ్. నేను క్షిపణి పరీక్షా కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. " అని తనని తాను పరిచయం చేసుకున్నాడు.


"ఓహోఁ.. అలాగా! మీ గురించి విన్నాను. మీ అనిరత కృషివల్ల మనదేశ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టమైన స్థితిలో ఉంది. గ్లాడ్ టు మీట్ యూ!" అంటూ కరచాలనం చేసాడు సాంబశివరావు.


"ధన్యవాదాలు! అయితే మేము విజయం సాధించడంలో మా టీం మొత్తం పాత్ర ఎంతైనా ఉంది, అందులో ముఖ్యంగా మా సైంటిస్ట్ రమణ. అతను రేయింబవళ్ళు శ్రమిస్తాడు. నేను నిమిత్తమాత్రుడ్ని. " అన్నాడు కేదారనాథ్ నిరాడంబరంగా.

"గొప్పవారు అలాగే అంటారు, తమ ఔన్నత్యం బయటికి చాటుకోరు. ఇంతకీ మీరు వచ్చిన పని గురించి చెప్పేరుకాదు?" అని అడిగాడు.


ఓ క్షణం భారంగా నిట్టుర్చాడు కేదారనాథ్. "నావల్ల ఓ తప్పు జరిగిపోయింది. " అంటూ జరిగినదంతా చెప్పి, “నేను ఆమెతో చేసిన ఛాటింగ్లు, ఫోటోలు అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎవరో అపరిచిత వ్యక్తి. ఆమె కూడా ఆ ముఠాలో వ్యక్తే అయి ఉంటుంది. ఇప్పుడు మరామె ఫోన్లో కూడా స్పందించడం లేదు. నన్ను ఎలాగైనా ఈ ఆపద నుండి బయట పడేయాలి, లేకపోతే నా జీవితం నాశనం కావడమే కాకుండా, మన దేశానికి పొరుగు దేశాలవల్ల తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. ఏమైనా జరగరానిది సంభవిస్తే నన్ను నేను క్షమించుకోలేను. " అని చెప్పి సాంబశివరావు స్పందనకోసం అతని వైపు చూసాడు.


కేదారనాథ్ చెప్పినదంతా శ్రద్ధగా విన్న సాంబశివరావు తలూపి, "అలాగే! తప్పకుండా, అయితే ఈ విషయమై మీరు సైబర్ క్రైం డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే బాగుండునేమో?" అన్నాడు.


"నిజమేకానీ, దానివలన నా మీదేకాదు, మా సంస్థపై కూడా మచ్చ పడే అవకాశం ఉంది. ఈ విషయం మీడియాకి లీకైతే చానెల్వాళ్ళందరూ రోజుల తరబడి చర్చావేదిక పెట్టేసి గోరంతలు కొండంతలు చేసి పరువు రచ్చకెక్కిస్తారు. మీ గురించి నేను విన్నాను. ఇలాంటి సెన్సిటివ్ కేసులు జాగ్రత్తగా డీల్ చేస్తారని తెలుసు. అందుకే మీ శరణు జొచ్చాను. మీరే నాకు దిక్కు. మీరు సరేనంటేనే గాని నాకు మరో దిక్కు లేదు. " చేతులు జోడించాడు కేదారనాథ్.


"అలాగే, మీకేమాత్రం మాట రాకుండా చూసుకుంటాను. మళ్ళీ మీకు ఫోన్ వస్తే వెంటనే మాకు తెలియపర్చండి. " అని హామీ ఇచ్చాడు సాంబశివరావు.


కేదారనాథ్ వద్ద నుండి వచ్చిన ఫోన్ నంబర్ వివరాలు తీసుకున్నాడు. ఆ నంబరు మహారాష్ట్ర నంబరు. ఫేక్ పేరు మీద తీసుకున్నట్లుంది, ట్రేస్ చెయ్యడం కుదరలేదు. ఆ తర్వాత మరో ఫోన్ నుంచి కేదారనాథ్కి బెదిరింపు కాల్ వచ్చింది. ముందు చెప్పినట్లుగా ఎక్కువసేపు మాట్లాడటానికి ప్రయత్నించాడు అతను. అతనికి వచ్చే ఫోన్లమీద నిఘా ఉంచడంతో ఆ అడ్రస్ తెలుసుకొని హుటాహుటిన అక్కడికి వెళ్ళాడు సాంబశివరావు తన బలగంతో.


లోకేషన్ ఆధారంగా బలరాం దొరికిపోయాడు. బలరాం ఓ చిన్న బజారు రౌడీ. అతన్ని సకల మర్యాదలతో విచారించగా ఆ విధంగా ఫోన్ చెయ్యమని తనకి ఆదేశం అందిందని, బెదిరింపు కాల్ చేసినందుకుగాను తనకు డబ్బులు ముడతాయని, అంతకు మించి తనకేమీ తెలియదని మొరపెట్టుకున్నాడు. తనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో, ఎవరు ఆదేశాలు అందిస్తున్నారో ఎంత మాత్రం తెలియదన్నాడు.


సాంబశివరావు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత, కేదారనాథ్కి మరి ఫోన్ కాల్స్ ఏమీ రాలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంస్థలో పని చేస్తున్న ముఖ్యమైన అధికార్లకు వచ్చే ఫోన్పై నిఘా పెట్టడం జరిగింది. రెండురోజుల తర్వాత ఇంకో సంఘటన జరిగింది.


‘వజ్రాయుధం’ క్షిపణి రూపకర్త అయిన రమణ కొడుకు పదేళ్ళ సంపత్ని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సంస్థయొక్క డైరెక్టర్ అభ్యర్థన మేరకు ముఖ్యమైన ఉద్యోగుల ఇంటివద్ద మఫ్టీలో పోలీసుల కాపలా పెట్టడం జరిగింది. అలా సంపత్ని కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించిన మనిషి కూడా దొరికాడు. కాకపోతే, వాడు కూడా ఓ కిరాయిరౌడీయే. డబ్బులకి ఆశపడి ఫోన్లో తనకి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కిడ్నాప్ చేసాడు. అంతే! వాడివల్ల కూడా అసలు వ్యక్తులు దొరకలేదు. చిన్న చేపలు దొరుకుతున్నాయిగానీ, అసలు వ్యక్తులు మాత్రం దొరకడంలేదు.


x x x x x


రెండురోజుల తర్వాత సాంబశివరావుకి క్షిపణి సంస్థ డైరెక్టర్ ఆలోక్నాథ్వద్ద నుండి ఫోన్ కాల్ వచ్చింది.


"సాంబశివరావుగారూ, వినండి! ముఖ్యమైన విషయం. మీరు చెప్పిన విధంగా ఎంత జాగ్రత్తగా ఉన్నామా సంస్థ రహస్యాలు ఎలా లీకయ్యాయో ఏమో తెలియదుకానీ శత్రు దేశాల గూఢచారుల చేతుల్లోకి వెళ్ళాయని నమ్మకంగా తెలిసింది. అవి శత్రుదేశాలకు చేరకముందే వాళ్ళని పట్టుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. " అన్నాడు.


"ఇదిచాలా గంభీరమైన సమస్య. చాలా రహస్యంగా దర్యాప్తు చెయ్యాలి. " అన్నాడు సాంబశివరావు.


వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. డైరెక్టర్ రూములో ఉన్న సిసిటివి ఫుటేజ్ చూసాడు. గత నెలరోజుల ఫుటేజ్ చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. సైంటిస్ట్ రమణ, అతని సహోద్యోగులేకాక, అక్కడ పని చేస్తున్న అందరి కదలికలని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. అనుమానస్పద సంఘటనలేవీ కనిపించలేదు.


బయట ఉన్న సిసిటివిల ఫుటేజ్ కూడా పరిశీలించినా ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు.


స్టేషనుకి తిరిగివచ్చిన తర్వాత పచార్లు చేస్తూ ఆలోచిస్తున్నాడు సాంబశివరావు. జరిగిన సంఘటనలన్నీ ఒకొక్కటిగా గుర్తుకు తెచ్చుకున్నాడు. క్షిపణి పరీక్షా కేంద్రంలో రహస్య సమాచారాలు ఎలాగో విదేశాలకి, ముఖ్యంగా భారతదేశంపై ముందునుండీ కక్షకట్టిన పొరుగు దేశానికి చేరుతున్నాయి. ఎలా చేరుతున్నాయి? డైరెక్టర్ కేదారనాథ్గానీ, సైంటిస్ట్ రమణగానివిదేశీ గూఢచారులకి సహకరించడం లేదు.


ఆ కేంద్రంలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది బయోడాటాలు, వారి జీవన శైలి పరిశీలించాడు. అవినీతికి పాల్పడిన వ్యక్తి అయితే వారి జీవన శైలి, కూడబెట్టిన ఆస్థులు, సంపదలూ ఆ విషయాన్ని తెలుపకనే తెలుపుతాయి. రహస్యంగా అన్నీ విచారించినా పెద్ద ఫలితం కనిపించలేదు. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు.


ఎందుకైనా మంచిది మరోసారి అక్కడికివెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించుకొని జీప్ తీసుకొని బయలుదేరాడు సాంబశివరావు, కానిస్టేబుల్ కనకారావుతో. అతని జీపుని చూస్తేనే, అక్కడ డ్యూటిలో ఉన్న సెంట్రీలు కోదండం, పరాంకుశం అటెన్షన్లో నిలబడి సెల్యూట్చేసి గేట్ తెరిచారు.


X X X X X


"సార్! లోపల నా సెల్ మర్చిపోయానండీ!.. " అంటూ సెక్యురిటీ జవాన్గా అక్కడ విధి నిర్వహణలో ఉన్న కోదండాన్ని గేట్ తియ్యమని కోరాడు కైలాసం.


"నువ్వు ‘భలేభలే మగాడి‘లా ఉన్నావోయ్ కైలాసం! ఇలా వచ్చిన ప్రతీసారీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటావు నువ్వు!" అన్నాడు కోదండం వాడివైపు ఎగాదిగా చూస్తూ.


"అవును సార్! ఏం చెయ్యను, నాకు మతిమరుపు ఎక్కువ. లోపలికి వెళ్ళి నా సెల్ తీసుకోనివ్వండి. ఇంతకీ అక్కడే ఉన్నాదో, లేక ఎవరైనా కొట్టేసారో?" బుర్ర గోక్కుంటూ తల వంచుకొని చెప్పాడు కైలాసం.

"సరే లేవోయ్! ఎప్పుడూ ఉన్నదేగా, వెళ్ళి చూడు!" అంటూ గేట్ తెరిచాడు కోదండం.


కైలాసం లోపలికి వెళ్ళి పదినిమిషాల్లో తిరిగివచ్చి, "థ్యాక్సండీ!.. ఫోన్ దొరికింది!" చెప్పాడు.


"అలాగేలే! వెళ్ళిరా!" అంటూ కైలాసం వెళ్ళినతర్వాత గేట్ మూసేసి స్టూల్పై కూర్చొని సిగరెట్ ముట్టించాడు కోదండం.


"నిజంగానే ఈ కైలాసం చాలా మతిమరుపుగలవాడు. మొన్నటికి మొన్న నన్ను చూసి 'కోదండంగారూ.. బాగున్నారా' అంటూ పలకరి0చాడు పిచ్చోడు. " భళ్ళున నవ్వుతూ అన్నాడు అక్కడే ఉన్న మరో జవాను పరాంకుశం.

"అవును, వచ్చిన ప్రతీసారీ ఏదో ఒకటి మరిచిపోవడం, ఆనక మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకోవడం పరిపాటి అయింది. వీడికన్నా ఆ సత్తిగాడు నయం. వాడికీ మతిమరుపున్నా మరీ వీడంత లేదు. " సిగరెట్ పొగ వదులుతూ చెప్పాడు కోదండం.


కోదండం, పరాంకుశం ఇద్దరూ అక్కడ సెంట్రీలుగా విధినిర్వహణలో ఉన్నారు. అదో చాలా హై సెక్యురిటీ ప్రాంతం. దేశంలో తూర్పు తీర ప్రాంతంలో కేంద్రప్రభుత్వ ఆధీనంలో రక్షణశాఖలో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రం అది. దేశరక్షణలో ప్రముఖ భూమిక నిర్వహిస్తున్న కేంద్రం అది. సెక్యురిటీ చాలా టైట్గా ఉండే ప్రాంతం. కైలాసం అక్కడ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాడు.

అలాగే సత్తిగాడు అనబడే సత్యనారాయణ ఆ లోపల ఉన్న క్యాంటిన్కి గ్యాస్ సిలండర్ తెచ్చి ఇస్తాడు. ఇద్దరూ మతిమరుపుల్లో ఒకళ్ళకి మించినవాళ్ళకొరు. ఏదో ఒకవస్తువు సెల్ఫోనో, లేక క్యారేజో ఇలా ఏదో ఒకటి మర్చిపోయి మళ్ళీ వెనక్కిరావడంతో ఆ సెంట్రీలు వాళ్ళమీద చిరాకుపడినా మళ్ళీ లోపలికి పంపడం తప్పటం లేదు.


X X X X X


గేట్దాటి ముందుకు ఓ పదడుగులు పోతూండగా ఎదురుగా వస్తున్న వ్యక్తిమీద ఎందుకో సందేహం కలిగింది సాంబశివరావుకి. ఆ వ్యక్తి అతనికి అనుమానస్పదంగా కనిపించాడు. అతనిచేతిలో సెల్ఫోన్ ఉంది.


అతను తిన్నగా గేట్ దగ్గరకి వెళ్ళి, "థాంక్యూ బాబాయ్! నా సెల్ అక్కడే ఉంది. దొరికింది. " అంటూ ముందుకి పోబోయేడు కైలాసం.


"ఆగు!" అని అతనివైపు చూసి అరిచాడు సాంబశివరావు.


యూనిఫాంలో ఉన్న సాంబశివరావుని చూస్తూనే కంగారుగా సెల్ఫోన్ జేబులో కుక్కున్నాడు. ఒక్కసారి సాంబశివరావుని చూసి బెదిరిపోయి వెనక్కి తిరిగి పరిగెట్టాడు.


"వాడ్ని పట్టుకోండి! వెళ్ళనివ్వకండి. !" అని ఆ సెంట్రీలతో అన్నాడు. ముకుందం, పరాంకుశం ఒకరిముఖాలోకరు అయోమయంగా చూసుకున్నారు. ఈ లోపు కనకారావు వెంటనే జీపు దిగి పరుగెట్టి కైలాసాన్ని గట్టిగా పట్టుకొని సాంబశివరావు ముందు ముందు నిలబెట్టాడు.


"ఏమోయ్!.. ఏంటి నీ చేతిలో ఉంది?" అడిగాడు బెదురు చూపులు చూస్తున్న కైలాసాన్ని.


కైలాసం ఇంకా ఏమీ బదులివ్వకుండానే, "వాడో ఒట్టి మతిమరుపు మహానుభావుడండీ! భలేభలే మగాడండీ! ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి లోపల మరిచిపోతాడు. వెళ్ళేటప్పుడు సడన్గా గుర్తుకువచ్చి మమ్మల్నడిగి మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాడు. ఇవాళ, ఇదిగో సెల్ ఫోన్ మర్చిపోయానని మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చాడు. " చెప్పాడు పరాంకుశం.


"ఏదీ ఓసారి నీ సెల్ నన్ను చూడనివ్వు!" అని అడిగాడు సాంబశివరావు.


కైలాసం తటపాటాయిస్తూంటే, కనకారావు చొరవగా వాడి జేబులో చెయ్యపెట్టి సెల్ఫోన్ దొరకబుచ్చుకొని సాంబశివరావుకి అందించాడు. సెల్ఫోన్ తీసి కైలాసంచేత లాక్ ఓపెన్ చేసి చూసిన సాంబశివరావు భృకుటిముడిపడింది. అలా కొద్దిసేపు చూసిన తర్వాత హఠాత్తుగా సీరియసై కనకారావుని పిలిచి కైలాసాన్ని జీపులో వెయ్యమన్నాడు.


తప్పించుకోబోయిన కైలాశం ఓ రెండు లాఠీదెబ్బలకి లొంగిపోయి జీపెక్కాడు. అనంతరం జీపు పోలీస్ స్టేషనువైపు కదిలింది.


తమదైన శైలిలో ప్రత్యేక మర్యాదలు స్వీకరించిన కైలాసం తన తప్పు ఒప్పుకున్నాడు. కైలాసంలాగే సత్తిగాడు కూడా పట్టుబడ్డాడు. వాళ్ళిద్దరూ కూడా ఎరకు గురైన చిన్నచేపలే. వాళ్ళిచ్చిన సమాచారంతో పోలీసులు అందుకు ముఖ్య కారకులైన దేశద్రోహుల్ని పట్టుకున్నారు.


ఆ మర్నాడు పోలీస్ కమీషనర్ ఆఫీసులో ఏర్పాటైన సమవేశంలో సాంబశివరావుని కమీషనర్తో సహా అందరూ అభినందించారు. రక్షణశాఖ డైరెక్టర్, క్షిపణి పరిక్షాకేంద్రం డైరెక్టర్ ఆలోక్నాథ్ తమ కృతజ్ఞతలు తెలియజేసారు.


"క్షిపణిపరీక్షా కేంద్రం నుండి రహస్యాలు, ముఖ్యంగా త్వరలో ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 'వజ్రాయుధం' క్షిపణి గురించిన సమాచారం శత్రు దేశం గూఢచారులకు అందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలనుండి వచ్చిన వర్తమానం కలకలం రేపింది. రక్షణశాఖ మంత్రి జయదేవ్కర్ పోలీస్ కమిషనర్ని కలిసి దర్యాప్తు చేయమని కోరగా నన్ను ఈ పనికి నియోగించారు. అంతేకాక, సంస్థ డైరెక్టర్ ఆలోక్నాథ్ కూడా నా సహాయం కోరారు.


అలా దేశద్రోహుల్ని పట్టుకొనే అవకాశం నాకు లభించింది. ముందు మా అనుమానం అసిస్టెంట్ డైరెక్టరైన కేదారనాథ్పైన పడింది. ఎంతో నిజయితీపరుడిగా పేరుగాంచిన కేదారనాథ్ అనుకోకుండా హానీట్రాప్లో చిక్కాడు. అయినా మా సూచన మేరకు అతను ఆ ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సీనియర్ సైంటిస్ట్ రమణ కొడుకుని కిడ్నాప్ చేసి రహస్యాలు సాధించాలనుకున్నారు. అదికూడా బెడిసికొట్టింది.


మన రక్షణవ్యవస్థ రహస్యాలు, క్షిపణి గురించిన సమాచారం తెలుసుకొని తమ దేశానికి చేరవేయడానికి శతృదేశ గూఢచారులు ఇలా చాలా ఎత్తులు వేసారు. అయితే అంతకు ముందే వాళ్ళ ప్లాన్ ప్రకారం చిన్న చిన్న ఉద్యోగులు, ముఖ్యంగా కంట్రాక్ట్ ఉద్యోగులను ఎరవేసి పట్టుకున్నారు. కాంట్రాక్ట్ లేబరైన కైలాసం, సత్తిబాబులాంటివారికి ఎరవేసి తమ పనులకు నియోగించుకున్నారు. తమ సెల్ఫోన్లు అక్కడ ముఖ్యమైన స్థలాల్లో వదిలి మళ్ళీ లోపలకి వచ్చి తీసుకెళ్ళేవారు. ఆ సమయంలో సెల్లో రికార్డైన సమాచారం ఆ గ్యాంగ్కి ఇచ్చేవారు.


వాళ్ళేమో నిజంగా మతిమరుపు ఉన్నట్లు రోజు ఏదో వస్తువు, టిఫిన్ క్యారేజో, సెల్ ఫోనో ఇలా ఏదో ఒకటి లోపల మర్చిపోయినట్లు నాటకం ఆడి మన రహస్య సమాచారం వాళ్ళకి అందిస్తూ వచ్చారు. వాళ్ళని మతిమరుపుగల 'భలే భలే మగాళ్ళని ' అనుకున్నారు కానీ వాళ్ళు భలే భలే మోసగాళ్ళని మాత్రం తెలుసుకోలేకపోయారు సెంట్రీలు. మొత్తానికి ఆ గ్యాంగ్లోని అందరూ చిక్కారు. ముఖ్యంగా మన పొరుగు దేశం గూఢచారులు సలిమా, అన్వర్ కూడా పట్టుబడ్డారు. దేశద్రోహం నేరం కింద పట్టుబడ్డ కైలాసంలాంటి వారికి న్యాయస్థానమే తగిన శిక్ష విధించాలి. " అని చెప్పి ముగించాడు సాంబశివరావు.


అందరూ అతనివైపు ప్రశంసాపూర్వకంగా చూసారు.


------------------

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.

94 views0 comments
bottom of page